వందేళ్ల పార్టీ... వాడి‘పోయింది’...

      ఎవరైనా చనిపోతే నూరేళ్లూ నిండాయంటూంటాం. కాంగ్రెస్‌పార్టీ కూడా ఇప్పుడు అదే పరిస్థితికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆవిర్భావదినోత్సవం జరుపుకుంటున్న ఆ పార్టీ నిజానికి జరుపుకోవాల్సింది ముగింపోత్సవాలే. వందేళ్ల చరిత్ర తమకుందంటూ గప్పాలు కొట్టుకునే ఆ పార్టీ... ప్రస్తుతం ఉన్నంత ఘోరమైన పరిస్థితిలో ఎప్పుడూ లేదనేది నిస్సందేహం. విచ్చలవిడిగా కార్పొరేట్‌, రాజకీయ అవినీతికి బాటలు పరిచి, అధికారవ్యవస్థను వ్యాపారుల చేతిలో కీలుబొమ్మగా మార్చి ప్రజలను కేవలం ఓటుబ్యాంకులుగా, ఒక కుటుంబాన్ని అధికారంలో ఉంచడానికి ఉపయోగపడే పావులుగా వాడుకుంటూ... వారసత్వరాజకీయాలే దేశానికి శరణ్యంగా మార్చింది. తద్వారా పరోక్ష రాజరికాన్ని దేశప్రజలపై రుద్దింది.     సరిగా గమనిస్తే ఈ మధ్యే కాదు... గత కొన్నేళ్లుగా ఆ పార్టీ ప్రాభవం నామమాత్రమైపోయిన వాస్తవం స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావ్యతిరేక పాలన పుణ్యమాని పుట్టుకొచ్చిన చిన్నా చితకా పార్టీలు ప్రజలకు మిగిలిన దిక్కుగా మారిన పరిస్థితికి కారణం వెదకాల్సిన కాంగ్రెస్‌... ఆయా ప్రాంతాల వారీగా పుట్టుకొచ్చిన పార్టీలతో అవసరార్థ పొత్తులు ఏర్పరచుకుంటూ ఏదో రకంగా అధికారంలో కొనసాగడానికి తపించింది. ఫలితంగా ఆ పార్టీ మరింతగా శుష్కించుకుపోయి ఇప్పుడు పూర్తిగా జీవఛ్చవమైంది. దేశంలోని సకల అవలక్షణాలకూ కారణమైన ఆ పార్టీ అధికారమే పరమావధిగా ఆడిన ప్రాంతీయ ఆటలు, వేసిన వెకిలి పన్నాగాలు ఇప్పుడు అదే పార్టీకి పెను శాపంగా మారి దాన్ని అంపశయ్య మీదకు చేర్చాయి. అయినా ఇప్పటికీ ఆ పార్టీ  బుద్ధి తెచ్చుకోలేదని ఆంధ్రప్రదేశ్‌లో అది మొదలుపెట్టిన నీచ రాజకీయపు ఎత్తుగడలు స్పష్టం చేస్తున్నాయి. దశాబ్థాలుగా నానుతున్న సమస్యను తీర్చేస్తున్నట్టుగా నాటకమాడుతూ ప్రశాంతంగా జీవిస్తున్న తెలుగు ప్రజల మధ్య చిచ్చుకు కారణమైంది. ఒకో  ప్రాంతంలో ఒకో పార్టీని వెనుకనుండి రెచ్చగొడుతూ, తామనుకున్న నాయకుడిని దేశ ప్రధానిగా చేసేందుకు తహతహలాడుతోంది. ఇంత చేసినా ఆ పార్టీకి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ గౌరవం పెరగకపోవడం ప్రజల్లో దాని కుట్రల పట్ల పెల్లుబికుతున్న ఏహ్యభావానికి నిదర్శనం. అనుకున్నది సాధించడానికి తాను కూర్చున్న కొమ్మని సైతం నరుక్కోవడానికి వెనుకాడని ఆ పార్టీ నైజం ప్రజల చేత ఛీకొట్టేలా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ అధికారం ఎండమావేననేది కాంగ్రెస్‌కు తెలుస్తోందో లేదో కానీ... దేశాన్ని ఎన్నో రకాలుగా వెనుకంజ వేయించిన ఆ పార్టీని ఇక కోలుకోనివ్వబొమని జనం అంటున్నారు. హ్యాపీ బర్త్‌ డే టూ యూ కాంగ్రెస్‌.

ఆదర్శ యువరాజు మళ్ళీ నాన్సెన్స్ అన్నారహో

  ఒరే బాబు.. నువ్వా మీడియా సమావేశాలకి వెళ్ళకురా నాయినా.. నీ పుణ్యం ఉంటుంది. నా బీపీ ఒకటే ఇదిగా పెరిగిపోతోందిరా అవి చూస్తుంటే..   అదేంటి మమ్మీ.. అవినీతిని పారద్రోలాలని మన పార్టీ ఎప్పటి నుండో పాడుతున్నపాచి పాటనే కదా నేను పాడింది. నేనేం తప్పు మాట్లాడేనని వద్దంటున్నావు?   బావుందిరా నాయినా.. అదివరకు మన ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ ని నువ్వు ‘నాన్సెన్స్’అని తీసిపారేసినప్పుడు మన పరువు కాపాడుకోవడానికి ఎన్నితిప్పలుపడ్డామో చూసిన తరువాతయినా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటావనుకొన్నాను. కానీ..మళ్ళీ..   అదేమిటి మమ్మీ... నువ్వు కూడా అపోజిషన్ పార్టీలాగ నన్నేఆడిపోసుకొంటావు? మనమిద్దరం కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగినా నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయామా? అందుకే మన పార్టీని వచ్చేఎన్నికలలో ఎలాగయినా గెలిపించాలనే తాపత్రయంతో మనల్ని చీపురు కట్టతో ఊడ్చేసిన ఆ అమాద్మీవాళ్ళలాగే నేను కూడాఅవినీతికి వ్యతిరేఖంగా పోరాడుదామన్నాను.... అందుకు నువ్వు సంతోషించకపోగా నన్నే తిడతావేమిటి?   ఆ.. తిట్టక మరేమీ చేస్తాను? అయినా నీకు మరేదీ దొరకనట్లు పోయిపోయి మన ఆదర్శ కుంభకోణం గురించే మాట్లాడి మన కొంపముంచాలా నాయినా...? అందులో నలుగురు మన మాజీ ముఖ్యమంత్రులు, మన కొమ్ముకాసే అనేకమంది అధికారులు ఉన్నారు. వారు పాపం ఏదో ముచ్చటపడి ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం చేసుకొంటే, దానిని కప్పెట్టేందుకు మేము నానా తిప్పలుపడుతూ ఆ కమీషన్ రిపోర్టుని త్రొక్కిపెడుతుంటే , నువ్వు తగుదునమ్మా అంటూ టాట్..మన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్టును తిరస్కరించడం చాలా తప్పు..మళ్ళీ పునః పరిశీలించవలసిందేనని.. మీడియా ముందే అలా అనేస్తే మేము తలలు ఎక్కడ పెట్టుకోవాలిరా బాబు?   అయినా ఆ రిపోర్టు గురించి నీకేమి తెలుసనీ అలా మాట్లాడేసావు. అందులో మన సుషీల్ కుమార్ షిండే అంకుల్ పేరు కూడా ఉంది తెలుసా? నీ అవినీతి పోరాటంతో పార్టీ గెలవడం మాట దేవుడెరుగు అదే మన కొంప ముంచేలా ఉందిరా అబ్బాయ్...ఇప్పటికే నాలుగు రాష్ట్రాలో తుడిచిపెట్టుకు పోయాము. ఇప్పుడు నీ మాటలతో మహారాష్ట్రాలో కూడా క్లీన్ అయిపోతామేమో..అయినా నీకు పుణ్యం ఉంటుంది గానీ నువ్వా మీడియా సమావేశాలు మానుకోరా అబ్బాయ్! అసలే ఎన్నికల వేళ..నువ్విలా మాటిమాటికి నోరు జారుతుంటే ఇక మనల్ని ఆ నరేంద్ర మోడీయే దింపనవసరం లేదు. మనమే దిగిపోయి మోడీకి ఆ కుర్చీఅప్పగించవలసి వస్తుంది జాగ్రత్త!   ఓహ్! మన వెనుక ఇంత డర్టీ స్టోరీ ఉందన్నమాట! సారీ మమ్మీ..నాకు ఈ స్టోరీ అంతా తెలీక రొటీన్ గా అవినీతి మీద లెక్చర్ దంచుతుంటే ఏదో ఫ్లోలో అలా అనేసాను. ఇంకెప్పుడు అవినీతిపై పోరాటం గురించి మాట్లాడను. ఓకేనా!   ప్రామిస్!   యస్ మమ్మీ! మదర్ ప్రామిస్!   దట్ ఈజ్ గుడ్ బేటా..కీప్ ఇట్ అప్!   ఆ..మమ్మీ! మొన్న కిరణ్ అంకుల్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ కి వచ్చినప్పుడు రాష్ట్ర విభజన గురించి నన్ను ఒకే ఒక్కసారి ‘నాన్సెన్స్’ అనమని చాలా రిక్వెస్ట్ చేసారు..మమ్మీ. పాపం! ఆయన అంతగా అడుగుతున్నారు కదా...పోనీ.. ఓసారి ‘నాన్సెన్స్’ అనమంటావా...భలే థ్రిల్లింగా ఉంటుంది....   అయ్య బాబోయ్...ఇదిగో సెక్రెటరీ నిన్నే.. త్వరగా ఆ బీపీ మాత్రలు అందుకో..ఆ క్విక్...

కాంగ్రెస్ ఓటమిని ఖరారు చేసిన బొత్స

  పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ నిన్నగాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఏ ఏ జిల్లాల నుండి ఎంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడనున్నారో నావద్ద లిస్టు ఉంది. అధికారం లేనిదే బ్రతకలేమని భావించేవారే పార్టీని వీడుతున్నారు. కానీ ప్రజాసేవకు పదవులతో నిమ్మితం లేదని భావించేవారు మాత్రం ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీని వీడబోరు. దాదాపు 25మంది శాసనసభ్యులు ఇద్దరు మంత్రులు పార్టీని వీడుతారని మావద్ద స్పష్టమయిన సమాచారం ఉంది."   "ఒకేసారి ఇంతమంది పార్టీని వీడటం కొంచెం కష్టమనిపించినప్పటికీ, అటువంటి స్వార్ధపరులు బయటకి వెళ్ళిపోవడమే పార్టీకి మేలని నేను భావిస్తున్నాను. కానీ, ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజు పార్టీని వీడి బయటకి వెళ్ళిపోతున్నవారిలో ఏ ఒక్కరూ కూడా మళ్ళీ ఎన్నికయ్యి శాసనసభ లో అడుగుపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా అటువంటి వారికి తగిన గుణపాటం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు,” అని అన్నారు.   అధికారం లేనిదే బ్రతకలేమని భావిస్తునవారే తమ పార్టీని వీడుతున్నారని చెప్పడంతోనే ఆయన తమ పార్టీ పరిస్థితి ఏమిటో చెప్పకనే చెప్పారు. నీళ్లున్నచోటకే కప్పలు, బెల్లం మీదనే ఈగలు ఎలాగా వాలుతాయో, అధికారం ఉన్న చోటికే రాజకీయ నాయకులు కూడా తరలి వెళ్ళిపోతారు. అదే మాటను బొత్స ఇప్పుడు చెప్పారు.తమ పార్టీ గెలుస్తుందని బొత్స చెప్పుకొంటున్నపటికీ, తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదనే గట్టి నమ్మకంతోనే తమ నేతలు పార్టీని వీడుతున్నట్లు అంగీకరించారు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావిస్తే వారు వేరే పార్టీలోకి మారేవారు కాదు కదా? అని బొత్స చెప్పకనే చెప్పారు.   అయితే పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న బొత్స పనిగట్టుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈవిషయం టాంటాం చేసుకొని స్వయంగా పార్టీ పరువు ఎందుకు తీస్తున్నారో ఆయనకే తెలియాలి. కానీ బయటకి పోయేవారి సంఖ్యను సగానికి కుదించి కొంతలో కొంత పార్టీకి ఊరటనిచ్చారు. అయితే ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారందరూ నిజాయితీపరులు, పదవీ కాంక్ష లేనివారని చెప్పుకోవడం ఈ ఏటి గొప్ప జోక్ అని ఒప్పుకోక తప్పదు. అలాగే బయటకి పోయినవారు దుష్టులు, దుర్మార్గులు, స్వార్ధ రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చేవారని ఆయన సర్టిఫై చేయడాన్నిఎవరూ తప్పు పట్టకపోవచ్చును. గానీ, రేపు ఎన్నికల తరువాత మళ్ళీ వారందరూ తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతునప్పుడు ఆయన ఇప్పుడు జారీ చేసిన సర్టిఫికెట్స్ అలాగే ఉంటాయా లేక రద్దయిపోతాయో కూడా కొంచెం స్పష్టం చేస్తే బాగుంటుందేమో. ఏమయినప్పటికీ మీడియా సమావేశం పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీ ఓటమిని పీసీసీ అధ్యక్షుడే ఖరారు చేయడం కాంగ్రెస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిందే.

రాష్ట్ర విభజనపై ఎవరిది అనుమానాస్పద వైఖరి

  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనపై నేటికీ ఒక స్పష్టమయిన వైఖరి అవలంబించకుండా ఇరు ప్రాంత ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్, వైకాపా, తెరాసలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ మూడు పార్టీలకు లేని సమస్య ఒక్క తెదేపాకు మాత్రమే ఉన్నందునే ఆవిధంగా వ్యవహరించవలసి వస్తోందని ఆ పార్టీలకు కూడా తెలుసు. కేవలం తెలంగాణాకే పరిమితమయిన తెరాస, సీమాంధ్రకే పరిమితమయిన వైకాపాలకు రెండో ప్రాంతంలో పోటీ చేసే ఆలోచన, అవసరం కూడా లేదు గనుక ఆ రెండు పార్టీలు విభజనపై తమకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా స్పష్టమయిన వైఖరి అవలంబించగలుగుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నకాంగ్రెస్ పార్టీ, అందుకోసం తన పార్టీని తెరాస, వైకాపాలకు తాక్కట్టుపెట్టుకోవడానికి మానసికంగా సిద్దపడింది గనుక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలందరూ అభ్యంతరాలను, అభ్యర్ధనలను కాదని విభజనపై గట్టిగా మాట్లాడగలుగుతోంది.   ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా వైకాపాలాగే తెలంగాణాను వదులుకొని ఉంటే నేడు వైకాపా పరిస్థితి ఏటికి ఎదురీదుతున్నట్లు ఉండేది. కానీ దాని అదృష్టవశాత్తు తెదేపా ఆవిధంగా చేయకపోవడంతో వైకాపాకు అది ఆయాచిత వరంగా మారింది. అదేవిధంగా ఒకవేళ వైకాపా కూడా నేటికీ రెండు ప్రాంతాలలో పోటీ చేయాలని భావించి ఉండి ఉంటే, ఆ పార్టీ నోట కూడా సమైక్యమనే మాట వినపడేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.   తెదేపా రెండు ప్రాంతాలలో ఎలాగయినా పార్టీని బ్రతికించుకోవాలనే తపనతోనే నేటికీ స్పష్టమయిన వైఖరి చెప్పలేకపోతోంది. కానీ, రాష్ట్ర విభజనకు ఇచ్చిన లేఖపై నేటికీ తెదేపా కట్టుబడే ఉంది. కానీ సీమాంధ్రలో పార్టీ ప్రయోజనాలు దెబ్బ తింటాయనే భయంతోనే ఆమాటను గట్టిగా చెప్పుకోలేకపోతోంది. అందువల్ల ఆపార్టీ తెలంగాణాలో తీవ్రంగా నష్టపోతోందని తెలిసి ఉన్నప్పటికీ, మౌనం వహించక తప్పడం లేదు.   కానీ సమైక్యవాదం చేస్తున్న వైకాపా కేవలం సీమాంధ్ర పైనే తన దృష్టి పెట్టడం గమనిస్తే అది మనస్పూర్తిగా రాష్ట్ర విభజనను కోరుకొంటున్నసంగతి స్పష్టమవుతోంది. తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీని బ్రతికించుకోవాలనే తపనతో పార్టీలోని ఇరు ప్రాంతాల నేతలను తమ తమ ప్రాంతాల ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడేందుకు అంగీకరించవలసి వస్తే, సీమాంధ్రపై పూర్తి పట్టు సాధించాలనే తాపత్రయంతో వైకాపా భూటకపు సమైక్యవాదం చేస్తోంది.   నిజం చెప్పాలంటే తెదేపా వ్యవహరిస్తున్నతీరుని, అందుకు గల కారణాలను సామాన్య ప్రజలు కూడా స్పష్టంగా అర్ధం చేసుకోగలుగుతున్నారు. కానీ సీమాంధ్రపై పట్టుకోసం సమైక్యవాదం చేస్తున్న వైకాపా వైఖరే చాలా అనుమానాస్పదంగా ఉందని చెప్పక తప్పదు.

ఉద్యోగుల ఐక్యతను తొలచివేసిన రాజకీయ చీడ పురుగులు

  దాదాపు ఐదారు లక్షల మంది వివిధ శాఖలకి చెందిన ప్రభుత్వోద్యోగులు అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి రెండున్నర నెలలుపైగా అనేక కష్టనష్టాలకు ఓర్చి రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు పోరాడారు. అంత సుదీర్గ కాలంపాటు వారిని ఆవిధంగా సంఘటిత పరచిన వ్యక్తి వారి నాయకుడు అశోక్ బాబేనని అంగీకరించక తప్పదు. మొదట్లో ఉద్యోగులందరూ కూడా తమకు ఏ రాజకీయ పార్టీపట్ల అభిమానం ఉన్నపటికీ, ఉద్యమం పార్టీలకతీతంగా సాగినందున పూర్తి ఐఖ్యత ప్రదర్శించగలిగారు. అదీగాక ఆ సమయంలో అందరిలో రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే తపన తప్ప మరి దేనికీ అంత ప్రాధాన్యం ఉండేది కాదు. ఇక కేంద్రమంత్రులు, యంపీలు ఆడిన రాజీనామా డ్రామాలు, రాష్ట్ర విభజనపై కేంద్రం చేసిన హడావుడి వగైరాలు వారినందరినీ ఏక త్రాటిపై నిలిపి ఉంచాయి. సమ్మెజరుగుతునంత కాలం ఎంతో ఐక్యతగా మెలుగుతూ అత్యంత క్లిష్ట పరిస్థితులను అధిగమించిన ఉద్యోగులు, సమ్మెవిరమించిన తరువాత క్రమంగా ఒకరితో మరొకరు విభేదించడం దురదృష్టకరం. సమ్మె ముగింపు విషయంలో మొదలయిన విబేధాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకొన్నట్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నవారి నేతలే మాటలే స్పష్టం చేస్తున్నాయి. అయితే తమలో ఎటువంటి విభేదాలు లేవని పదేపదే వారు చెప్పవలసి రావడమే విభేదాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. బహుశః ఉద్యోగులలోకి కొన్నిరాజకీయ పార్టీలు ప్రవేశించినందునే నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండవచ్చును. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి వికృత రాజకీయ క్రీడలు ఆడుతున్న రాజకీయ పార్టీలు, నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో విఫలమయినా, ఉద్యోగుల ఐఖ్యతను దెబ్బతీయడంలో సఫలమయ్యాఋ. ఉద్యోగులు అనేక కష్టనష్టాలకు ఓర్చిరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమం చేస్తే వారికి బేషరతుగా అండగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం వారిలో చీలికలు సృష్టించడం చాలా దురదృష్టకరం. విజ్ఞులయిన ఉద్యోగులు తమ మధ్యకి ప్రవేశించి తమ ఐక్యతను తొలచివేస్తున్న ఆ రాజకీయ చీడ పురుగులను ఏరి పడేయకపోతే అవి వారిని పూర్తిగా తొలచి గుల్ల చేసేయడం ఖాయం. 

చర్చా ... రచ్చా ...

      నూతన సంవత్సరారంభంలోనే సంక్లిష్టమైన సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎదుర్కోబోతోంది. తెలంగాణా ముసాతిడా బిల్లు రూపంలో రానున్న ఆ కీలక సందర్భానికి మా శాసనసభ్యులు సిద్ధమయ్యారా? మా తరపున పదునైన అస్త్రశస్త్రాలు సంధించనున్నారా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం, పాలకవర్గాలు నిన్నం ఒన్నటి దాకా సీమాంధ్ర, తెలంగాణాల పేరిట సమాంతరంగా చీలిపోయి ఉన్నట్టు కనపడడంతో ఎవరి ధోరణి ఎలా వుంటుందనేది కనిసం ఊహకు అందేది, అయితే ఇప్పుడున్న పరిస్థితి వేరు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం రెండు ముక్కలు కాకముందే ప్రజాప్రతినిథులు ఇరవై ముక్కలు ఇంకా ఎక్కువగానే అయిపోయినట్టు అనిపిస్తోంది.   ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిథుల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీలో బిల్లు చర్చకు వచ్చాక జరిగేది ఏమిటనేది సరైన విధంగా అంచనా వేయడం రాజకీయ విశ్లేషకుల వల్ల కావడం లేదు. వ్యూహాత్మకంగా సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి చర్చలో కీలకం కానుంది. ఇప్పటికే సి.ఎం. వైఖరి పట్ల తెలంగాణ మంత్రుల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా, సీమాంధ్ర మంత్రుల్లోనూ కొందరి నుండి అదే స్థాయి వ్యతిరేకత తప్పడం లేదు. నిన్నా మొన్నటిదాకా సిఎంకు అత్యంత అనుకూలంగా వ్యవహరించే కొండ్రు మురళి వంటి మంత్రులు సైతం విభజనకు పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతుండడం చూస్తుంటే ఎవరిది డ్రామానో, ఎవరిది నిజమో అర్థంకాని పరిస్థితి. మరోవైపు చర్చలో పాల్గొన్నప్పుడు బిల్లులోని విభిన్న అంశాలపై ఆయా రంగాలకు చెందినా మంత్రులు మాట్లాడాల్సి ఉంటుంది. విద్యుత్, నదీజలాలు, శాంతిభద్రతలు, రాజధాని ... ఇలా ఒక్కో అంశంపై సంబంధిత శాఖ మంత్రి మాట్లాడాలి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటిదాకా సీమాంధ్ర మంత్రులెవరూ ఆయా అంశాలపై సమగ్ర సమాచారం సిద్ధం చేసుకుంటున్న దాఖలాలు లేవు, అన్నింటికీ ఆయాదే భారం అన్నట్టు ముఖ్యమంత్రిపై నెపం నెట్టేస్తున్నారు. గెలిచినా, ఓడినా .. సమైక్యాంద్ర కోసం పోరాడిన ఏకైన వీరుడి క్రెడిట్ కోసం నానా తంటాలు పడుతున్న ముఖ్యమంత్రికి ఇది కూడా ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా తెలంగాణ మంత్రులు పక్కాగా రెడీ అవుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ... మూడున అసెంబ్లీకి రానున్న తెలంగాణ బిల్లుపై చర్చ ... ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.

జేసీ కోసం తెదేపా పరిటాలను వదులుకోగలదా?

  అనంతపురంలో కాంగ్రెస్ పార్టీకి జేసీ.దివాకర్ రెడ్డి కుటుంబము, తెదేపాకు పరిటాల కుటుంబము పాతకాపుల వంటివి. వారివల్లనే అక్కడ ఆ రెండు పార్టీలు నువ్వా నేనా? అన్నట్లు కొనసాగుతున్నాయి. సీమాంధ్రలో రాష్ట్ర విభజన రగిల్చిన చిచ్చుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేకమంది కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. వారిలో జేసీ.దివాకర్ రెడ్డి కూడా ఒకరు.   ఈ విభజన చిచ్చుకు తోడు రెండు నెలల క్రితం పాలెం బస్సు దుర్ఘటన తరువాత దివాకర్ ట్రావెల్స్ సంస్థకు చెందిన అనేక బస్సులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆదేశాలతో రవాణాశాఖా అధికారులు కేసులు నమోదు చేసి కదలనీయకుండా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకే ఈ సాకుతో బొత్ససత్యనారాయణ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భావిస్తున్న, దివాకర్ రెడ్డి నేరుగా సోనియా గాంధీ, బొత్ససత్యనారాయణలపై విమర్శలు ఆరంబించారు. ఈ కధ ఇప్పుడు షో-కాజ్ నోటీసుల క్లైమాక్స్ సీనుకి చేరుకోవడంతో, జేసీ బ్రదర్స్ వేరే పార్టీలోకి మారక తప్పని పరిస్థితి ఏర్పడింది.   అనంతపురంలో ఇంతవరకు పరిటాల కుటుంబంపైనే ఆధారపడి ఉన్నతెదేపా, ఇదే అదునుగా జేసీ కుటుంబాన్నికూడా పార్టీలోకి రప్పించగలిగితే, ఇక జిల్లాలో తమ పార్టీకి తిరుగే ఉండదని భావించి ఆ దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే తమ రాజకీయ ప్రత్యర్దులయిన జేసీ బ్రదర్స్ కుటుంబాన్ని తెదేపాలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను పరిటాల కుటుంబం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఒకవేళ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే తాము పార్టీని వీడక తప్పదనే బలమయిన సంకేతాలు కూడా ఇచ్చారు.   అయితే ఎలాగయినా పరిటాల సునీతను ఒప్పించి, కనీసం దివాకర్ కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని తెదేపా ప్రయత్నిస్తోంది. పవన్ కుమార్ రెడ్డి తెదేపాలో చేరిక దాదాపు ఖాయమయినట్లు తాజా సమాచారం. జేసీ బ్రదర్స్ తెదేపాలో చేరకపోయినా, పవన్ కుమార్ రెడ్డికి తెదేపా టికెట్ కూడా ఇచ్చేందుకు సంసిద్దత చూపుతుండటంతో షాక్ తిన్నజిల్లా తెదేపా ఇన్-చార్జ్ పేరం నాగిరెడ్డి కుటుంబంతో సహా తేదేపాకు గుడ్ బై చెప్పి వైకాపాలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన కోడలు సరోజినీ దేవికి టికెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు తాజా సమాచారం.   ఇంతకాలం జిల్లాలో తెదేపాకు వెన్నుదన్నుగా నిలచిన పరిటాలను జేసీ కుమారుడి కోసం తెదేపా వదులుకోగలదా? లేక పరిటాల కుటుంబం తాము తీవ్రంగా వ్యతిరేఖించే జేసీ కుటుంబం వచ్చి పార్టీలో జేరితే వారితో ఇమడగలదా? పరిటాల సునీత ఏవిధంగా స్పందిస్తారో త్వరలోనే తెలియవచ్చును.

భారత్-అమెరికాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన

  భారత దౌత్యాధికారి దేవయాని కొబ్రాగడే అరెస్ట్ వ్యవహారంలో మొదట భారత్ కొంత వెనక్కి తగ్గినట్లు కనబడటంతో, దేవయాని స్వయంగా కోర్టుకి హాజరవనవసరం లేకుండా అమెరికా మినహాయింపు ఇవ్వడంతో క్రమంగా అంతా సర్దుకొంటోందని అందరూ భావిస్తున్నతరుణంలో, అమెరికా దౌత్య కార్యాలయాలలో పనిచేస్తున్నఉద్యోగుల గుర్తింపు కార్డులను, వారికి భారత్ కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను అన్నిటినీ భారత్ రద్దు చేసి, వారికి కూడా భారత్ దౌత్యకార్యాలయాలో పనిచేసే ఉద్యోగులకు అమెరికా ఎటువంటి కార్డులు, సౌకర్యాలు ఇస్తుందో అటువంటివే ఈ రోజు జారీ చేయడంతో కధ మళ్ళీ మొదటికి వచ్చింది.   దేవయానిపై అమెరికా పోలీసులు మోపిన కేసుని రద్దు చేసి, ఆమెపట్ల అవమానకరంగా వ్యవహరించినందుకు అమెరికా క్షమాపణ చెప్పాలని భారత్ కోరుతోంది. అయితే అందుకు అంగీకరించబోమని అమెరికా తెగేసి చెప్పడంతో, దేవయానికి అమెరికా చట్టాల నుండి రక్షణ కల్పించేందుకు ఆమెను ఐక్యరాజ్య సమితికి భారత ప్రతినిధిగా శాశ్విత ప్రాతిపాదికన నియమిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానివలన ఆమెపై అంతకు ముందు మోపబడిన కేసుల నుండి విముక్తి కలిగించలేవని అమెరికా చెప్పడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, అమెరికా దౌత్య ఉద్యోగులకు భారత్ కల్పిస్తున్న విశేష సౌకర్యాలను అన్నిటిని రద్దు చేసి, భారత్ దౌత్య ఉద్యోగులతో అమెరికా ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తుందో భారత్ కూడా అమెరికా ఉద్యోగులతో అదేవిధంగా వ్యవహరించాలని నిశ్చయించుకొని తదనుగుణంగా చర్యలు చెప్పట్టింది.   ఈగొడవకంతటికీ కారణమయిన దేవయాని ఇంట్లో పనిచేసే పనిమనిషి భర్తను, భారత ప్రభుత్వానికి తెలియజేయకుండా భారత్ నుండి అమెరికా తన స్వంత ఖర్చులతో రహస్యంగా అమెరికాకు తరలించడంతో అమెరికా కూడా భారత్ కోర్టుల దృష్టిలో నేరం చేసినట్లయింది. దేవయాని అరెస్ట్ తరువాత నుండి రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నపటికీ, అమెరికా ఇసుమంత కూడా వెనక్కి తగ్గేందుకు సముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.   ఈ వ్యవహారం చివరికి ఏ విధంగా ముగుస్తుందో, ఏ పరిణామాలకు దారి తీస్తుందో కాలమే చెప్పాలి. మారుతున్న కాలంతో బాటు అమెరికా కూడా తన పెద్దన్న ధోరణిని వదులుకొని అందరితో సమానంగా మెలగడం నేర్చుకోవాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ కుర్షీద్ అన్నారు.

తెరాస విలీనం..డౌటే

      ఎన్నికల్లోగా తెలంగాణ రావడం అనుమానస్పందంగా మారినట్టే .. కాంగ్రెస్ లో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కూడా సందేహాస్పదంగా మారింది. గత రెండ్రోజులుగా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. సోమవారం విలేఖరులతో మాట్లాడిన కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ ... తెరాస విలీనంపై అడిగిన ప్రశ్నలకు మండిపడ్డారు.   అసలు విలీనానికి తెలంగాణా అంశానికి సంబంధం ఏముందంటూ రంకెలేశారు. తెలంగాణా ఏర్పటనేది రాజ్యాంగపరమైన ప్రక్రియ అనీ, విలీనం పార్టీల మధ్య విషయం అనీ గుర్తు చేశారు. అదే తరహాలో మంగళవారం ఏఐసిసి నేత దిగ్విజయ్ సింగ్ కూడా స్పందించారు. తాము మాత ఇచ్చాం కాబట్టి తెలంగాణా ఇస్తున్నామన్న దిగ్విజయ్ .. దీనికి విలీనానికి సంబంధం లేదన్నారు. మరి ఇప్పుడిలా మాట్లాడుతున్నా ఇదే నేతలు తెలంగాణ ఇస్తామన్న ప్రకటన వెంటనే తెరాస విలీనం గురించి ఎందుకు మాట్లాడారంటూ రాజకీయ వార్తాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ కుట్రలో భాగంగానే విలీనంపై రెండు పార్టీలు వెనక్కి తగ్గాయనే వాదన వినిపిస్తోంది.

పద్మశ్రీ .. ప్రమోషన్ కి మార్గమా?

      ఇద్దరు లబ్దిప్రతిష్టులైన, తెలుగు సినీ పరిశ్రమలో ఉద్దండులనదగ్గ ప్రముఖుల విషయంలో సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు అటు సినిమా రంగాన్నే కాకుండా యావత్ రాష్ట్రానికి ఓ షాక్ ఇచ్చింది. నిజానికి పద్మశ్రీ పురస్కారాలను ప్రచారానికి వినియోగించుకోవడం అనేది ఒక్క సినిమారంగానికి మాత్రమే పరిమితం కాదు ... మిగిలిన రంగాలలో కూడా ఉంది. సంస్థ బ్రోచర్ల మీద కూడా పద్మశ్రీలు ముద్రించుకుంటున్నవారున్నారు. తమ పేరుకు ముందు ఈ తరహా పురస్కారాలను రాయకపోతే మీడియా ఆఫీసులకు ఫోన్ లు చేసి మరీ తిట్టే ప్రముఖులూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తేర్పుఇ ఇలాంటి వారిలో మార్పుకు దోహదపడుతుందేమో చూడాలి. పురస్కారం పొందిన వ్యక్తి తనకు దక్కిన గౌరవాన్ని పెంపొందించుకునేలా ప్రవర్తించాలే తప్ప దాన్ని మార్కెట్ చేసుకోవాలనుకోవడం తగదనే విషయాన్ని పురస్కారగ్రహీతలు గుర్తుంచుకోవాలి. అలాంటి జ్ఞానోదయం కలిగితే ... ఏటేటా  సదరు పురస్కారాల కోసం ఎగబడే ప్రముఖుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది.

ఇదో నవశకమా...'అదే' నాసిరకమా ...

      ఏదైతేనేం ఆమాద్మీ అనే సరికొత్త పార్టీ తొలిసారి భారతరాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డుల్ని స్వంతం చేసుకుని సగర్వంగా అధికారాన్ని అలంకరించనుంది. సామాన్యుడి పక్షం అనే ఆకర్షణీయమైన నినాదంతో అవినీతిని ఊడ్చేస్తాననే అద్భుతమైన ఆశాదీపం వెలుగుల్లో దూసుకొచ్చిన ఈ పార్టీని జనం ఆదరించిన తీరు ... సంప్రదాయ పార్టీల పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర నిరాశా నిస్పృహలకు నిలువుటద్దంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారానికి అవసరమైనన్ని సీట్లు రాకపోయినా ప్రజాభిప్రాయం మేరకు పాలనా పగ్గాలు చేపడుతున్నట్టు ప్రకటించిన ఆమాద్మీ ఇకపై ఎలా పనిచేస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. విఐపి సంస్కృతికి చరమగీతం పాడడం, ఢిల్లీకి స్వయంప్రతిపత్తి కలిగించడం, కాలనీల క్రమబద్ధీకరణ, పక్కా ఇళ్ళ నిర్మాణం ... వంటి ఎన్నో జనాకర్షక, విప్లవాత్మకమైన ప్రణాళికలను ప్రకటించిన ఆమాద్మీ ఆచరణలో అదీ మైనారిటీ ప్రభుత్వంతో ఎలా అమలు చేస్తుందనేది ప్రతిఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తించేదే. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడానికి అంగీకరించడం ఆమాద్మీకి తొలి మైనస్ పాయింట్. సరే ... ఇప్పుడు తప్పనిసరై తీసుకున్నామనో, ప్రజలు చెప్పారు కాబట్టి అంగీకరించామనో సమర్థించుకోవచ్చు. అయితే అధికారం కోసం భవిష్యతులో కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తడం అనేది చేయకుండా, అవసరమైతే పదవుల్ని తృణప్రాయంగా వదులుకోగాలగాలి. అప్పుడే ఆమాద్మీ నిఖార్సయిన సామాన్యుడి పార్టీగా మనగలుగుతుంది. విప్లవాత్మకమైన ఆలోచనలతో ముందుకొచ్చిన పార్టీలు ఎక్కువకాలం కొనసాగడం, పాలనా పరంగానూ విజయవంతం కావడం తమ రాజకీయ భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదనే వాస్తవం తెలుసు కాబట్టి ... మిగిలిన పార్టీలు, వాటికి అండగా ఉండే కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు, మాఫియాలు ... ఆమాద్మీ తరహా రాజకీయం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందనే భయంతో ఉన్న బలమైన నేతలు... కేజ్రీవాల్ కు అడుగడుగునా అడ్డంకులు సృస్టిస్తారనే విషయంలో సందేహం లేదు. వీటన్నింటినీ తట్టుకుని, అధికారం అనే ఆకర్షక వలయంలో చిక్కుకోకుండా ఐదేళ్ళ పాటు ఆమాద్మీ స్వచ్చమైన పాలనను, జవాబుదారీ వ్యవస్థను అందించగలిగితే ... అది నిజంగా అద్భుతమే. అలా జరగాలని ఆశిద్దాం. ఆ అద్భుతం భారతదేశ రాజకీయాల్ని మలుపు తిప్పాలని కోరుకుందాం.

మంత్రి గల్లా అరుణకుమారి కొడుకుకి తెదేపా టికెట్

  సాదారణంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ పుత్రరత్నాలకు తమ పార్టీ టికెట్స్ ఇప్పించుకొని వారు రాజకీయాలలో స్థిరపడిన తరువాత రిటర్మెంట్ తీసుకోవాలని ఆశిస్తారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలులు వీస్తుండటంతో వారే కాదు, వారి పుత్రరత్నాలకు కూడా తెదేపా, వైకాపాలలో టికెట్స్ కోసం మాట్లాడుకొంటున్నారు.   కాంగ్రెస్ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు మరియు సినీ నటుడు కృష్ణకి అల్లుడు అయిన గల్లా జయదేవ్ తెదేపా తీర్ధం పుచ్చుకోనేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనది చిత్తూరు జిల్లా అయినప్పటికీ, అత్తవారిది గుంటూరు కావడంతో అక్కడి నుండే లోక్ సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. చంద్రబాబు ఆయనకు టికెట్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి కొడుకు పచ్చ కండువా కప్పుకొంటే, మంత్రిగారు కాంగ్రెస్ కండువా కప్పుకొని కొడుకు పార్టీని తిట్టడం కష్టం గనుక మరి ఆమె కూడా తెదేపాలోకి జంపయిపోతారేమో చూడాలి. ఇక బావగారి కోసం మహేష్ బాబు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది గనుక, జయదేవ్ కి టికెట్ ఖాయం చేయడం వల్ల తేదేపాకు లాభమే తప్ప నష్టమేమి ఉండకపోవచ్చును.   జయదేవ్ తో బాటు సినీ నటుడు కృష్ణ సోదరుడు మరియు సినీ నిర్మాత అయిన జీ.ఆదిశేషగిరి రావు తెనాలి నుండి తెదేపా టికెట్ పై శాసనసభకు పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రస్తుతం తెనాలికి ప్రాతినిద్యం వహిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గుంటూరు (పశ్చిమం) నుండి పోటీ చేయవలసిందిగా చంద్రబాబు కోరినప్పటికీ, ఆయన తన నియోజక వర్గం వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.   ఇక కాంగ్రెస్ యంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు నుండి లోక్ సభకు టికెట్ ఇచ్చినట్లయితే తెదేపా సైకిల్ ఎక్కేందుకు సిద్దంగా ఉన్నారు.  

కాంగ్రెస్ నేతలు ప్రజలతో టచ్చులోనే ఉన్నారు గురూ

  మన మెగామంత్రి చిరంజీవి మహోదయులు మీడియా ముందుకు వచ్చి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయవలసిన అవసరం గురించి తడబడుతూనే అనర్గళంగా ఒక ఉపన్యాసం ఇచ్చేసి మాయమయిపోతే, ఆ తరువాత ఆ స్థానంలోకి ఏ సబ్బంహరో లేక కిల్లి రాణీగారో ముందుకు వచ్చి మైకు పట్టుకొని సీమాంధ్ర ప్రజలపై తమ కృపా కటాక్షాలు కురిపించి మళ్ళీ కొన్ని రోజులు కనబడకుండా మాయమయిపోతారు. మధ్య మధ్యలో మన లగడపాటి రాజగోపాల్ గారు ప్రత్యక్షమవుతూ గంటలకొద్దీ అనర్గళంగా ఏవేవో మాట్లాడేసి ప్రజలను కన్ ఫ్యుస్ చేసేస్తుంటారు.   వారి మధ్యలోకి టామ్ అండ్ జెర్రీలాగ మన బొత్ససత్యనారాయణ, జేసీ దివాకర్ రెడ్డి ఎంటరయి కాసేపు హడావుడి చేసి అందరికి కితకితలు పెట్టి మాయమయిపోతుంటారు. ఇక రాష్ట్ర విభజన గురించి గుర్తొచ్చినప్పుడల్లా పాపం! మన ఆనం బ్రదర్స్ వచ్చి తమకు తోచినదేదో మాట్లాడుతూనే ఉన్నారు. గనుక, వారిని తప్పుపట్టడానికి కూడా లేదు. ఈ విధంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఒకరి తరువాత మరొకరు వంతులు వేసుకొని జనాలతో పూర్తి టచ్చులో ఉంటూనే మళ్ళీ అదే జనాలకి ఎక్కడా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప టెక్నిక్కేనని జనాలు సైతం ఒప్పుకొంటున్నారు కూడా.   పాపం! ఈ టెక్నిక్ ఆకళింపుజేసుకోలేని పెద్దాయన కావూరి సాంభశివరావు వంటి అమాయక మంత్రులు మాత్రం పంచె ఎగేసుకొని జనం మధ్యకి వెళ్లి కోడిగుడ్లతో సన్మానం చేయించుకొని ఆగ్రహంతో “ఒరే! సన్నాసుల్లారా! అర్ధ రూపాయికి కూడా కక్కుర్తి పడే వెదవాల్లారా...ఆ...లంచాలు పెట్టందే ఏ పని చేయని వెదవల్లారా...ఆ...నా మీదే కోడిగుడ్లు విసురుతారా? దమ్ముంటే దగ్గరకి రండి..మీ పని చెపుతాను..”అంటూ పోలీసుల చాటున నిలబడి మైకు పట్టుకొని రంకెలు వేస్తుంటే జనాలు ఆయన తిట్లు విని కోపం తెచ్చుకోకుండా “పాపం! మంత్రిగారు” అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటూంటే, ఆయన మాత్రం ఫీలవరూ పాపం!   అయితే కాంగ్రెస్ పార్టీలో అందరూ ఆయనంత అమాయకులేమీ ఉండరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొన్న కిల్లి రాణీవారు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుని, ఆయన అనుచరులకి “మీ లిమిట్స్ గుర్తుంచుకోండి” అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చేసిన తరువాత, తను సమైక్యవాదిననే మరో మారు కన్ఫర్మ్ చేసేసి మాయమయిపోయారు. "రాక రాక వచ్చిన కేంద్రమంత్రి పదవిని చస్తే వదులుకోనని" బల్లగుద్ది చెప్పిన మన జేడీ శీలంగారు ఇక తనను రాజీనామా చేయమని ఎవరూ డిమాండ్ చేయరని రూడీ చేసుకోన్నాక, ఈ మధ్యనే మీడియా ముందుకు వచ్చి సమైక్యం కోసం "నేను రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని" డిక్లరేషణ్ ఇచ్చేసి మాయమయిపోయారు.   ఇప్పుడు ఆయన స్థానంలోకి వచ్చిన వైజాగ్ కాంగ్రెస్ యంపీ పురందేశ్వరిగారు, “ఉమ్మడి రాజధాని కాన్సెప్ట్ మన రాజ్యాంగంలోనే లేదు. నేను అన్ని సమస్యలను వివరిస్తూ మా సోనియమ్మకు, మన్మొహనుల వారికి రెండు ఉత్తరం ముక్కలు కూడా వ్రాసిపడేశాను. వాళ్ళు పంపిన టీ-బిల్లులో  ప్రింట్ కూడా సరిగ్గా లేదని వాటిలోనే నాలుగక్షరాలు గీకి పడేసాను. అందువల్ల మీరిక నిశ్చింతగా ఉండండి. ఇదివరకు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితేనే వినని మావాళ్ళు ఇప్పుడు నేను వ్రాసి పడేసిన ఈ ఉత్తరం ముక్కలను మాత్రం పట్టించుకొంటారా? వాటిని చింపి చెత్త బుట్టలో పడేయారా? అని వెర్రిమొర్రి ప్రశ్నలు వేసి నన్ను తికమక పెట్టకండి. ఒకవేళ వారు నాఉత్తరం ముక్కలని పట్టించుకోకపోతే, నేను కూడా తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఓటేయకుండా వచ్చేస్తాను. మదర్ ప్రామిస్! అని సీమాంధ్ర ప్రజలకు ప్రామిస్ చేసేసిన తరువాత, ఆమె  కూడా మళ్ళీ జనాల మధ్య నుండి మిస్ అయిపోయారు. జనాలు.. జనాలు...తరువాత ఎవరు మాట్లాడుతారో మీకేమయినా తెలిస్తే చెప్పి పుణ్యంకట్టుకోరా... ప్లీజ్!

యువరాజవారి ప్రవచనాలు

  యువరాజవారు “నాన్సెన్’ అని అన్నంత మాత్రానే ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు సైతం చిరిగి చెత్త బుట్టలోకి తరలిపోతాయి. ఆయన కనుసైగ లోక్ పాల్ బిల్లు ఎగురుకొంటూ పార్లమెంటు ఆమోదం పొందేస్తుంది. ఆయన తీక్షణంగా చూస్తే చాలు...కొమ్ములు తిరిగిన కేంద్ర మంత్రులు కూడా తత్తరపడుతూ తమ పదవులకు రాజీనామాలు చేసేసి, పార్టీ సేవకి బిరబిరా పరుగులు తీస్తారు. మరి ఇంత పవర్ఫుల్ యువరాజవారు మనదేశంలో అనేక వ్యవస్థలు కొంత మంది వ్యక్తుల చెప్పుచేతలలో నడవడం చాలా అన్యాయమని వాపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల సమాఖ్య (ఎఫ్‌ఐసిసిఐ -ఫిక్కీ) సమావేశంలో యువరాజవారు దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలను పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణం, వ్యవస్థలో అవినీతి పీల్చిపిప్పి చేసేస్తున్నాయని పాపం! చాలా బాధపడిపోయారు.   ఇంత బాధపడుతున్నమన మోస్ట్ పవర్ఫుల్ యువరాజవారు ఉల్లిపాయలు మొదలు బియ్యం, పప్పులు, నూనెల వరకు ప్రతీ వస్తువుల ధరలు రెక్కలు కట్టుకొని ఆకాశానికి ఎగిరిపోతూ సామాన్యుడి బ్రతుకుభారం చేస్తుంటే మరి దానిని అరికట్టడానికి ఆయన ఏమి చేసారు? ఆయన ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తున్నశరత్ పవార్ మహారాష్ట్రలో ఉల్లి, చెరుకు, పంచదార మార్కెట్లను తన గుప్పిట్లో పెట్టుకొని కృత్రిమ కొరత సృష్టిస్తుంటే యువరాజవారు ఎందుకు చూస్తూ ఊరుకోవలసి వచ్చింది?   కోట్లాది ప్రజలు, పసిపిల్లలు ఒకపూట అన్నానికి కూడా నోచుకొక ఆకలి చావులు చస్తుంటే, మరోవైపు గోదాములలో లక్షలాది టన్నుల బియ్యం, గోధుమలు ముక్కిపోతుంటే కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అదిలించినా యువరాజవారు ఎందుకు మేల్కొనలేదు? సమస్యలను గుర్తించినప్పుడు వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండా, పేదరికం గురించి, సామన్యుల సమస్యలు, కష్టాల గురించి ఎంతో బాధపడిపోతూ ఎన్నిఊకదంపుడు ఉపన్యాసాలు చేసినా వాటివలన ప్రజలకు ఒరిగేదేమీ లేదు.   అధికారం, ప్రభుత్వం అన్నీతన చేతిలో ఉంచుకొని, “సమస్యలు తీర్చవలసి ఉంది. అవినీతిని తొలగించవలసి ఉంది. అధిక ధరలు తగ్గించవలసి ఉంది. ప్రభుత్వం పనిచేయవలసి ఉంది” అంటూ ప్రజల వద్దకు వచ్చి చెప్పడం తమ చేతకాని తనాన్ని ప్రదర్శించుకోవడమే.   ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ఉపగ్రహ ప్రయోగంలో విఫలమయితే, అది ఎందుకు విఫలమయిందో తెలుసుకొని ఆలోపాలను సవరించుకొంటూ ముందుకు సాగుతున్నందేనే నేడు వారు మనదేశానికి గర్వకారణమయిన ‘మంగళ యాన్’ న్ని దిగ్విజయంగా ప్రయోగించగలిగారు. మరి అదేవిధంగా దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేటికీ తమ ప్రభుత్వంలో, వ్యవస్థలలో లోపాలను సరిచేయడంలో ఎందుకు అశ్రద్ద వహిస్తోంది? అంటే దానికి చిత్తశుద్ది కొరవడటమే కారణమని చెప్పవచ్చును.   ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నమన యువరాజవారు, తను గుర్తించిన ఈ సమస్యలను సవరించడానికి, సరిద్దదానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఇలా మైకు, ప్రేక్షకులు, అవకాశం దొరికినప్పుడల్లా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం వలన ఏమి ప్రయోజనం? మాటలకు, చేతలకు పొంతన లేకపోతే ఆ మాటలకు కూడా ఎటువంటి విలువ ఉండదు. అదే పొంతన ఉంటే అది అమాద్మీలా తిరుగులేని ప్రజామోదం పొందుతుందని రుజువయింది కూడా. ప్రజలలో ఇంత రాజకీయ చైతన్యం చూసిన తరువాత కూడా వారిని ఇంకా ఇంకా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలతో మెప్పించగలమని ఆయన భావిస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీయే నష్టపోవడం తధ్యం.

దేవయానికి ఎంపీ టికెట్టిస్తారట...

      ఇళ్ళు కాలి ఒకడేడుస్తుంటే...చలిమంట వేసుకుంటాం అన్నట్టుంది దేశంలో రాజకీయ పార్టీల తీరు. మనదేశపు మహిళా దౌత్యాధికారి 'దేవయాని'కి జరిగిన అవమానం అమెరికా భారత్ ల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే౦త స్థాయికి చేరిన విషయం తెల్సిందే. 'దేవయాని'పై అమెరికా అధికారులు తీరును నిరసించిన భారత్, క్షమాపణతో పాటు ఆమెపై అక్రమ౦గా బనాయించిన కేసుల్ని సైతం ఎత్తేయాలని డిమాండ్ చేస్తోంది.   మరోవైపు తన కూతురి పట్ల అగ్రరాజ్యం వ్యవహరించిన పద్దతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న 'దేవయాని' తండ్రి ఉత్తమ్ క్షమాపణ,కేసుల ఉపసంహరణ కోరుతూ ఆమరణ దీక్షకు సైతం దిగుతానని హెచ్చరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పాటు పలు స్వచ్చంద సంస్థలు అమెరికా వైఖరికి వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నాయి. ఇంత గందరగోళ౦ నేలకొంటుంటే..సమాజ్ వాదీ పార్టీల అవన్నీ  వదిలేసి 'దేవయాని'కి పార్టీ టిక్కెట్ ఆఫర్ చేసింది. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని ఆ పార్టీ చూడడం సిగ్గుచేటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు...ఇటీవల సచిన్ టెండూల్కర్ ను సైతం రమ్మంటూ సమాజ్వాదీ పార్టీ ఆహ్వానించడాన్ని వీరు గుర్తు చేస్తూ పార్టీ సిద్దాంతాల మీద కాకుండా వ్యక్తుల పాప్యులారీటీ మీద ఆధారపడి ఆ పార్టీ నడవాలనుకుంటో౦దని అంటున్నారు.                                                                                   

ప్రత్యర్ధి పార్టీలపై లోకేష్ నిశిత విమర్శలు

  ట్వీట్ వీరుడు నారా లోకేష్ అప్పుడప్పుడు జనాల మధ్యకు కూడా వచ్చిహడావుడి చేస్తుంటారు. నిన్న ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టీఎన్ఎస్ఎఫ్ వర్కుషాపులో పాల్గొన్నఆయన తమ రాజకీయ ప్రత్యర్దులయిన కాంగ్రెస్, వైకాపా, తెరాసలపై సునిశితమయిన విమర్శలు చేసారు. నిత్యం తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసే వైకాపా, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, “తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో చంద్రబాబు చొరవ వల్ల రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలు తరలి వచ్చిఎనలేని సంపదను సృష్టిస్తే, ఆ తరువాత వచ్చిన వైయస్సార్ ప్రభుత్వం వెనుకుండి కధంతా నడిపించిన జగన్మోహన్ రెడ్డి ధాటికి కొత్తగా ఒక్క ఐటీ కంపీనీ కూడా రాష్ట్రానికి రావడానికి భయపడ్డాయని, వైయస్స్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఫ్యాబ్ సిటీలు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా సృష్టించలేకపోయినా, అనేకమంది అధికారులను, మంత్రులను వ్యాపారవేత్తలను కోర్టుల చుట్టూ తిరిగేలా చేశాయని లోకేష్ ఎద్దేవా చేసారు. వైయస్స్ మొదలుపెట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు వల్ల కూడా ప్రజలకు ఎటువంటి లాభం కలగకపోయినా, అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నివిధాల లాభపడ్డారని ఆరోపించారు.   జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతకీ బెయిలు దొరకకపోవడంతో చివరికి సోనియా గాంధీని బ్రతిమాలుకొని బెయిలు తెచ్చుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తే, దానిని ఆ తరువాత వచ్చిన వైయస్సార్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయని విమర్శించారు.   తెదేపా ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టేనాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదని, చంద్రబాబు కృషితో ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచగలిగారని తెలిపారు. విద్యుత్ ఉంటేనే పరిశ్రమలు, పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయని గ్రహించిన తెదేపా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి రంగానికి పెద్ద పీట వేసిందని ఆయన అన్నారు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడి పరిశ్రమలు మూతపడుతున్నాయని, తత్ఫలితంగా మళ్ళీ నిరుద్యోగ సమస్య తీవ్రం అయ్యిందని తెలిపారు.   తెదేపాను నిత్యం విమర్శించే కేసీఆర్, తెదేపా ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మని చంద్రబాబు సవాలు విసిరితే తన ఫాంహౌస్ లోకి దూరి దాకోన్నారని లోకేష్ ఎద్దేవా చేసారు. తెదేపా-కాంగ్రెస్-వైయస్సార్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై తెదేపా చర్చకు సిద్దమని, జగన్మోహన్ రెడ్డి తమ సవాలు స్వీకరించడానికి సిద్దమేనా? అని లోకేష్ ప్రశ్నించారు.   సమావేశంలో పాల్గొన్న యువత నుద్దేశించి మాట్లాడుతూ అవినీతిపరుడయిన జగన్ కావాలో, లేకపోతే డిల్లీ నుండి పిలుపు రాగానే చేతులు కట్టుకొని పరుగులుపెట్టే కాంగ్రెస్ నేతలు కావాలో లేకపోతే తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్దికి కృషి చేసే తెదేపా కావాలో మీరే నిర్ణయించుకోండని సలహా ఇచ్చారు.

అమ్మ గారి చెయ్యి

    Vijaya Kumar Ponnada   'ఇవాళ చాలా సుధినం అని నేను మనవి చేస్తా వున్నాను. భారతదేశంలోనే అతి పెద్దయిన మా పార్టీ అధ్యక్షురాలికి గుడి కట్టడానికి ఇవాళ శంఖుస్థాపన చేసే భాగ్యం నాకు దక్కింది. ' అని వూపిరి ఓ సారి గట్టిగా పీల్చుకుని, మళ్ళీ మొదలెట్టాడు భజనరావు. 'నిజానికి ఆవిడ గారు మనకి చేసిన సేవలు ఇంతా అంతా కాదు. ఆ మాటకొస్తే ఆవిడ అసలు మనకి ఎందుకు చేయాలీ అని నేను ఈ సభా ముఖంగా మిమ్మల్నందరినీ ప్రశ్నిస్తా వున్నాను? ఆవిడదేమయినా మన పేటా? మన వూరా? మన రాష్ట్రమా? పోనీ మన దేశమా? కాదు ఎక్కడో ఇటలీలో పుట్టి ఇక్కడకొచ్చి మనల్ని వుద్దరిస్తున్నారు. మొన్న యన్నీబీసేంట్ అనే ఆవిడా, నిన్న మథర్ తెరెస్సా, ఇవాళ ఇక ఈవిడా. రేపు ఇక ఎవ్వరూ వుండరని నేను నొక్కి వొక్కాణిస్తున్నను.' మన దేశానికి వచ్చి, రాజీవుగాంధిగారి మరణాంతరం తిరిగి ఇటలీ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, నాలాంటి తమ్ముళ్ళు, అన్నలు, అక్కలూ, చెల్లేళ్ళు ఆవిడకి అడ్డంగా నిల్చుని, మీకు మేమున్నాము, అని చెప్పి వొప్పించి, ఖాళీగా వుండకుండా, ఏదో కాలక్షేపానికి వారు వొద్దంటున్నా అందరం కలసి, పార్టీ అధ్యక్షపదవి ఇచ్చాము. ఇవాళ ఆవిడ అలా పార్టీ కుర్చీకి అత్తుక్కు పోయారంటే ఆవిడ నిరంతర కృషే అని వేరే చెప్పనక్కర్లేదు. గిట్టని వాళ్ళు, విపక్షాల వాళ్ళు ఆవిడకి పదవి కాంక్ష ఎక్కువంటారు. అదే నిజమయితే ఆవిడ ఈనాడు మన్మోహనంగారి స్థానంలో ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చునేవారు. నాకు తెలుసు ఆవిడ ప్రధాని మంత్రి అభ్యర్ధికోసం ఎంత శ్రమ పడ్డారో.' అని కళ్ళలోంచి వచ్చే నీళ్ళని చొక్కాతో తుడుచుకుంటూ, 'ఎన్నికలయ్యాకా ప్రధానిగ ఎవరిని కూర్చోపెట్టాలా అని ఆవిడ చాలా వ్యధ చెందారు. ఒకరోజు ఆవిడ తన డాక్టరు దగ్గరకి వెళ్ళినప్పుడు లోపల నుంచి మాటలు వినిపించాయి. 'లాభంలేదు సింగు గారు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పైగా వృధాప్యం వల్ల కాస్త చూపు మందగించింది, వినికిడి కూడా తగ్గింది. ఇక రెస్టు తీసుకోండి ' అన్న మాటలు వినిపించాయి. అప్పుడే సింగు గారు చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని, వచ్చే దుఖాన్ని ఆపుకుంటూ, ఇక ఆగలేక పరిగెత్తుకుంటు వెళ్ళిపోయారు. అది చూసిన అమ్మాగారు, వెంటనే 'యూరేఖా ' అని అర్కెమిడిసులా అరచి 'నేను అనుకున్న లక్షణాలున్న ప్రధాన మంత్రి దొరికాడోచ్ ' అని ఆయన వెనకాలే పరిగెత్తుకెళ్ళి, ఆయన్ని పట్టుకుని ప్రధానిని చేసారు ' అన్నాడు భజనరావు. 'మన దేశానికి మన వారే ప్రధాని కావలన్నది ఆవిడా ఆకాంక్ష. ఆవిడ త్యాగనిరతికి ఓ తార్కాణం.' 'ప్రణభ్ ముఖర్జీ గారు రాజీవగాంధీగారితో పడక వేరే వాళ్ళ వూరెళ్ళిపోయి ఓ కుంపటి కొనుక్కుని, దానికి 'రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ ' అని పెట్టుకుని, స్వయం పాకం మొదలెట్టారు. అప్పుడు సొంతగా చెయ్యి కాల్చుకునే ఆయన్ని చూసి సదరు రాజీవ్గాంధీగారే జాలి పడి 'వేరే కుంపటి ఎందుకు, 'చెయ్యి ' కాలుతుంది, మాతో చెయ్యి కలిపేయండి ' అనేసరికి, ఆయన కుంపటి ఆర్పెసి, వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో కలసి పోయారు. మరి అలా సమయానికి వచ్చి చేరినా ఆతరువాత, నాకు ఇది కావాలీ అది కావాలీ అని పెచీ పెట్టలేదు. అది చూసి అమ్మగారు తాను 'భారతరత్న ' తీసేసుకోగల స్థితిలో వున్నా, అలాకాదని ప్రణబ్గారికి, 2008లో 'పద్మ విభూషణ్ ' బిరుదుని ఇచ్చేసారు. 'ఆతరువాత, ప్రధాని పోస్టు ఇవ్వరూ అని అడిగితే, చస్! వల్ల కాదు. కావస్తే రాష్ట్రపతి పదవి తీసేసుకోండి ' అని త్యాగం చేసారు ' అని మళ్ళీ చొక్కతో కళ్ళనీళ్ళు తుడుచుకుని, చొక్క తడిసిపోయిందని అది తీసేసి, మరో చొక్క వేసుకున్నాడు, భజనరావు.  'ఇవాళ కూడా ఆవిడ చాలా సాదా సీదాగానే వున్నారు. వాళ్ళబ్బాయి పదవిలేక, చేసేది ఏమీలేక, మీటుంగులు గట్రాలు పెట్టుకుని, వచ్చిన వారికి పలాయన వేగం గురించి మరియు ప్రయాగ శాస్త్రములో పాటాలు చెప్పి, కాలక్షేపం చేస్తున్నా అతనికి ప్రధాన మంత్రి పదవి ఇవ్వటానికి ససేమిరా వొప్పుకోటల్లేదు. మళ్ళీ గిట్టని వాళ్ళు 'అబ్బే అదేంలేదు, అతగాడిది ఇంకా కుర్ర తనం. పైగా అతన్ని ప్రధానిని చెయ్యలంటే చాలా కష్టం. అతను చెప్పింది వినిపించుకోడు తప్ప, చెముడు లేదు. ముందు చూపు లేదు తప్ప, అతని చూపు బానే వుంది, ఇక మాట్లాడం మొదలెడితే ఆపడు ' అని అంటారు.   ఈ మధ్యన ఓ వెబ్సైట్ వాళ్ళూ ఈవిడగారికి 12 వేల పైచిలుకు కోట్లున్నాయని రాసి పారేసారు. అయితే కొంచం అటూ ఇటుగా అన్నారు. దాంటో అమ్మగారు కుమిలి పోయారు. 'ఆ దిక్కుమాలినాళ్ళకి లెక్కలు రావా? సరిగ్గ లెక్కెట్టి చెప్పమను ' అని కోప్పడ్దరు. దాంతో వాళ్ళూ నాలిక్కరుచుకుని, మళ్ళీ లెక్కలెట్టడం మొదలెట్టారు. ఈ సారి గిట్టని వాళ్ళు 'నిజమే వాళ్ళకి బుద్దిలేదు. సరిగ్గ లెక్కెట్టకుండా చెప్పేసారు. వాళ్ళు చెప్పినదానికంటే ఇంకా చాలా ఎక్కువే వుంటుందన్నారు.' 'ఏది ఏమయినా మన దేశం చాలా గొప్పదేశం. లేక పోతే ఆంగ్లేయులని తరిమి కొట్టి, ఇటలీ వాళ్ళకి పీటేస్తారా చెప్పండి? ఈవిధంగా మనం ప్రపంచంలోనే ఓ కొత్త వొరవడికి నాంది పలికాము. ఏ దేశం వారయినా, ఏ దేశంలోనయినా తమ సత్తా చూపొచ్చని, దానికి మా అమ్మగారి తరువాతే ఎవరినయిన చెప్పుకోవాలి. ఆవిడని నేను కోరుకునేది ఒక్కటే. ఇలా మన దేశంతో ప్రారంబించినా ఆవిడ ప్రస్థానం, పక్క దేశాలకి కూడా పాకి, వచ్చే పుట్టిన రోజుకి ఆవిడ మరో మాలుగు దేశాలకి అధిపత్యం వహించాలని ఈ సభా ముఖంగా ఆవిడకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పక్క దేశాల్లోను ఇలా ఆవిడకి గుడి కట్టే అదృష్టం నాకే దక్కాలని, ఇప్పుడు కట్టబోయే గుడి తాలూకా దేవతని వేడుకుంటున్నాను.' అని కళ్ళలో నీళ్ళు తుడుచుకున్నాడు. ఈసారి అవి ఆనందంతో వచ్చినవిలెండీ!

ఆమాద్మీ చీపురు దెబ్బలు సమ్మగా ఉన్నాయిట

  డిల్లీలో 15 ఏళ్లుగా అధికారం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నఈ కీలక తరుణంలో ఆమాద్మీ పార్టీ చీపురు దెబ్బలు తిని అధికారానికి దూరమయింది. డిల్లీ ప్రజలను మళ్ళీ మంచి చేసుకోవాలంటే వారి మద్దతు ఉన్నఆమాద్మీకి తను మద్దతు ఈయడం మంచిదనే ఆలోచనతోనో, లేక నాలుగు రాష్ట్రాలలో తలకు బొప్పి కట్టినందునో తెలియదు గానీ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలంగా సాగిస్తున్న తన సాంప్రదాయ రాజకీయ పద్దతులను పక్కనబెట్టి, మళ్ళీ ఆమాద్మీకే బేషరతు మద్దతు ఇచ్చేందుకు సిద్దమయింది.   అయితే కాంగ్రెస్ ఊహించినట్లు ఆమాద్మీ ఎగిరిగెంతేయలేదు. పైగా కాంగ్రెస్ హయాంలో గత 15ఏళ్లుగా జరిగిన కుంభకోణాలను త్రవ్వితీస్తాము. విద్యుత్ మీటర్ల గోల్ మాల్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించి నేరం రుజువయిన వారినందరినీ కటకటాల వెనక్కి పంపిస్తాము. కాంగ్రెస్, బీజేపీ నేతలు డిల్లీలో సాగిస్తున్న అక్రమ నీటి మాఫియా వ్యాపారాలకు అడ్డుకట్టవేసి వారి చేత ఇంతవరకు బొక్కినదంతా కక్కిస్తాము. ఎవరు పడితే వారు ఎర్రబుగ్గ కార్లేసుకొని డిల్లీ వీదుల్లో తిరగడాన్ని నిషేదిస్తాము,” అంటూ కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీనే భయపడే విధంగా లేఖ వ్రాసి వాటికి మీకు అభ్యంతరం లేకపోతే మాకు మద్దతు ఇవ్వచ్చునంటూ ఒక లేఖ వ్రాసి ఆమాద్మీ చేతులు దులుపుకొంది.   అదే అమాద్మీ కాక మరొక పార్టీ అయితే కాంగ్రెస్ మరోలా వ్యవహరించేది. కానీ నాలుగు రాష్ట్రాలలో తల బొప్పికట్టిన తరువాత, ఇంత ప్రజాదారణ కల ఆమాద్మీతో కొంచెం సంయమనంగానే వ్యవహరించాలని నిశ్చయించుకొని, ఆ పార్టీ వ్రాసిన లేఖకు జవాబు ఇచ్చింది.   కాంగ్రెస్, డిల్లీ ఇన్-చార్జ్ షకీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ, “ఆమాద్మీ తన లేఖలో లేవనెత్తిన 18అంశాలలో 16 పూర్తిగా పరిపాలనా సంబందమయినవే. గనుక వాటి గురించి మేము ఎటువంటి వివరణ ఈయవలసిన అవసరం లేదు. మిగిలిన రెండు అంశాలలో డిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఈయడానికి మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయితే అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది గనుక, ఆమాద్మీ దాని గురించి ప్రభుత్వంతో చర్చించవలసి ఉంటుంది. ఇక డిల్లీలో ఇప్పటికే బలమయిన లోకాయుక్తా వ్యవస్థ ఉంది. దానిని ఇంకా బలపరచాలని ఆమాద్మీ భావిస్తే దానికోసం మమ్మల్ని సంప్రదించనవసరం లేదు,” అని అన్నారు.   అంటే అమాద్మీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంత కాలంగా కాంగ్రెస్ కప్పెట్టిన కుంభకోణాలను వెలికి తీసి చర్యలు చేపడితే తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అంగీకరించినట్లే భావించవలసి ఉంటుంది. ఇటువంటి షరతులకి అంగీకరించడం కొరివితో తల గోక్కోవడమేనని తెలిసి ఉన్నపటికీ ఆమాద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రావడం చాలా విడ్డూరమే. అయితే, తన పార్టీ నేతలను ఆమాద్మీ జైలుకి పంపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొంటుందని ఆశించడం అవివేకం. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గ్రహ స్థితి ఏమీ బాగాలేనందునే కనీసం ఆమాద్మీ చీపురు దెబ్బలు తింటేనయినా ఆ దోషం పోతుందేమోననే చిన్న ఆశతోనే బహుశః ఇందుకు అంగీకరించి ఉండవచ్చును.   కాంగ్రెస్ పార్టీకి తను షాక్ ఇస్తే, కాంగ్రెస్ కూడ ఈవిధంగా తన అన్ని షరతులకి అంగీకరిస్తూ ఈవిధంగా జవాబీయడంతో ఆమాద్మీ కూడా షాకయింది. అందుకే ఆ పార్టీ నేతలందరూ మళ్ళీ ఈరోజు అత్యవసరంగా డిల్లీలో తమ పార్టీ కార్యాలయంలోఈరోజు సమావేశమవుతున్నారు. రేపటితో డిల్లీ శాసనసభ కాలపరిమితి ముగియనుండటంతో, ఒకవేళ ఆమాద్మీ పార్టీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటుకి చొరవ తీసుకోకపోతే డిల్లీపై రాష్ట్రపతి పాలన విదింపబడవచ్చును. అయితే, ఆమాద్మీ తనను తాను నిరూపించుకొనేందుకు దొరికిన ఈ అపూర్వమయిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోదని ఆశిద్దాము.

ఆ తంతు కూడా ముగించేసిన ధర్మాన

  ధర్మాన ప్రసాదరావు సీబీఐ కేసుల పుణ్యామాని తన మంత్రి పదవి ఊడగొట్టుకొన్నారు కానీ, లేకుంటే నేటికీ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతూనే ఉండేవారు. ఆయనను కాపాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు, కానీ ఫలితం లేక పోవడంతో ఇక చేసేదేమి లేక ధర్మాన రాజీనామా చేసి బయటపడ్డారు. పదవిలో ఉన్నంత కాలమే ఎవరినయినా అందరూ గుర్తిస్తారు. అవి పోయిన మరుక్షణం వారిని కాంగ్రెస్ పార్టీలో పలకరించేవారు ఉండరు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మోపిదేవి, ధర్మాన, సబిత వంటి వారే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.   అటువంటప్పుడు వారు మళ్ళీ ఒంటరి పోరాటానికయినా సిద్దపడాలి, లేకుంటే వేరే పార్టీలలోకయినా మారిపోవలసి ఉంటుంది. ఎన్నికలు తరుముకొస్తున్నఈ తరుణంలో మొదటి ఆప్షన్ కంటే రెండవదే ఆచరణీయంగా ఉంటుంది గనుక ధర్మాన కూడా వైకాపాలోకి దూకేసేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. అయితే పార్టీ మారేందుకు నిశ్చయించుకొన్నతరువాత ఈ జంపింగ్ ప్రక్రియలో శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన తంతు, అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టి పోయడం, జగన్మోహన్ రెడ్డికి గొప్పదనం గురించి బాకా ఊదడం తదితర కార్యక్రామాలను ఆయన అందరి కంటే కొంచెం విభిన్నంగా నిర్వహించారు ఆయన తన అనుచరులతో కలిసి మొన్న శ్రీకాకుళంలో బహిరంగ సభకు తక్కువ, కార్యకర్తల సమావేశానికి ఎక్కువ అనదగ్గ ‘సమాలోచన’ అనే బహిరంగసమావేశం ఏర్పాటు చేసి ఆ తంతు శాస్త్ర ప్రకారం పూర్తి చేసేసారు.   ఆయన ఈ సమావేశంలో తన కాంగ్రెస్ కళ్ళద్దాలను తీసి పక్కకు పడేయగానే అంతవరకు దేవతలా కన్పించిన సోనియా గాంధీ ఆయనకు దయ్యంలా, 125 సం.లచరిత్ర గల గొప్ప పార్టీ అని స్వయంగా పొగిడిన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా కనబడింది. ఇక వైకాపా ఇచ్చిన కళ్ళద్దాలను పెట్టుకోగానే అంతవరకు స్పష్టంగా కనబడిన జగన్మోహన్ రెడ్డి యొక్క సీబీఐ రికార్డులు, అక్రమ సంపాదన చరిత్రలు ఏవో అర్ధం పర్ధం లేని పిచ్చిరాతలులా కనబడటం మొదలయ్యాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిలో ఇంతవరకు తను చూడలేకపోయిన గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా వైకాపా కళ్ళద్దాలు ధరించాగానే స్పష్టంగా కనబడతునట్లు ఆయన సభా ముఖంగా ప్రకటించారు.   ఇక శాస్త్రోక్తంగా తన ధర్మం తను నిర్వహించారు గనుక ఇక జగన్ వచ్చి వైకాపా కండువా కప్పడమే ఆలస్యం. మరీ ఆలస్యం చేస్తే అందరూ ‘ఇదేమి ధర్మం ధర్మానా?’ అంటే అనుకొంటే అనుకోవచ్చునేమోగానీ ఆయన మాత్రం మళ్ళీ ఇదే తంతు మరొకమారు నిర్వహించేసి ఏ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోకో జంపయిపోయే ప్రమాదం ఉంది. లేకుంటే సబ్బంహరిలాగే ఆయన కూడా తన కాంగ్రెస్ కండువాను ఓసారి గంజి పెట్టి ఉతికించేసుకొని మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరే అవకాశము లేకపోలేదు.