తెలంగాణాపై కాంగ్రెస్, బీజేపీల డబుల్ గేమ్స్-1

                                                                                కాంగ్రెస్ వ్యూహం: కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణా అంశంతో చాలా కాలంగా దాగుడు మూతలు ఆడుతున్నాయి. ఎన్నికలలోగా రాష్ట్ర విభజన చేసి, తెలంగాణా ఏర్పాటు చేస్తానని కాంగ్రెస్ పార్టీ చెపుతున్నపటికీ, సకాలంలో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి దానిని ఆమోదింపజేస్తుందో లేదో అనుమానమే. ఇక, బీజేపీ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తామని చెపుతున్నపటికీ, దాని మాటలకి చేతలకి ఎక్కడా పొంతన కనబడటం లేదు. రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్ధులను చావుదెబ్బతీసి, అధికారం చేజిక్కించుకోవాలని కలలుగంటున్నకాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత పరిస్థితుల్లో తప్పకుండా రాష్ట్ర విభజన చేస్తుందనే నమ్మకం లేదు. ఎందుకంటే, విభజన చేసినా, చేయకపోయినా తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. ఇంతవరకు వెలువడిన సర్వేలలో తెరాసకే విజయావకాశాలు ఎక్కువని తేలడంతో, కేసీఆర్ విలీనానికి ఇష్టపడటం లేదు. తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోయినట్లయితే తెరాసను తట్టుకొని కాంగ్రెస్ గెలవలేదు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ సీమాంధ్రలో చాలా వ్యతిరేఖత మూటకట్టుకొంది. అందుకే ఆ వ్యతిరేఖతను కూడా తెలివిగా సొమ్ము చేసుకొని రానున్నఎన్నికలలో గెలిచేందుకు కిరణ్ కుమార్ రెడ్డితో మరో ‘కాపీ కాంగ్రెస్ పార్టీ’ స్థాపనకు కూడా రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అమలు చేస్తున్నవ్యూహం ప్రకారం సీమాంధ్రలో సమైక్యవాదంతో కిరణ్, జగన్ ఇద్దరు గెలవాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర విభజన చేయడం కంటే, అంతవరకు తీసుకువెళ్ళగలిగితేనే వారిరువురూ ఎన్నికలలో పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి రాష్ట్ర విభజన జరిగి ఎన్నికలలోగా తెలంగాణా కూడా ఏర్పాటయిపోయినట్లయితే, ఇక వారు చేసే సమైక్యవాదానికి అర్ధం ఉండదు గనుక కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను కడదాకా తీసుకు వెళ్లి బీజేపీ మీద నెపం నెట్టి బయటపడవచ్చును. లేదా బిల్లుని రాష్ట్రపతి వద్ద త్రొక్కిపెట్టించయినా తప్పుకోవచ్చును. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చేఎన్నికలలో గెలిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణా సమస్యను తాపీగా పరిష్కరించుకొనే అవకాశం ఉంటుంది. ఓడిపోయేట్లు ఉంటే, తెలంగాణా సమస్యను మరింత జటిలం చేసి వదిలిపెట్టవచ్చును.

తెలంగాణాపై కాంగ్రెస్, బీజేపీల డబుల్ గేమ్స్-2

                                           బీజేపీ  వ్యూహం ఇక, బీజేపీ విషయానికి వస్తే, తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడమంటే కాంగ్రెస్ గెలుపుకి తోడ్పడటమే అవుతుంది. గనుకనే, మొదటి నుండి సమన్యాయం రాగం ఆలపిస్తూ తన జాగ్రత్తఃలో తాను ఉంది. ఆ ప్రయత్నంలోనే మొన్న డిల్లీలో తన సీమాంధ్ర నేతలతో ర్యాలీ చేయించి దానికి వెంకయ్యనాయుడిని పంపించి తన మనసులో మాట బయటపెట్టింది. తాము తెలంగాణా ఏర్పాటు కోరుకోతున్నామని చెపుతూనే, సీమాంధ్రకు అన్యాయం జరగకుండా బిల్లులో కొన్ని సవరణలు పెడతామని వెంకయ్యనాయుడు ద్వారా సూచింది.   రాష్ట్ర విభజన చేసి సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ సీమాంధ్ర ప్రాంతానికి అనుకూలంగా చేసే ప్రతిపాదనలను తిరస్కరించలేదు. అలాగని వాటిని ఆమోదించి తెలంగాణా ప్రజలకు ఆగ్రహం కలిగించలేదు. గనుక, ముందుగానే ఈవిధంగా హెచ్చరించి కాంగ్రెస్ పార్టీని వెనక్కి తగ్గేలా చేయగలిగితే దానిపై నెపం వేసి తప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిస్తే ఇరుప్రాంత ప్రజలకి పూర్తి ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేస్తామని బీజేపీ అధ్యక్షుడు రాజ నాథ్ సింగ్ తో సహా బీజేపీ అగ్రనేతలందరూ కొత్త పల్లవి అందుకొన్నారు. అచ్చ తెలంగాణావాది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పుడు గతంలో మాదిరిగా తమ పార్టీ తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తుందని గట్టిగా చెప్పలేకపోవడానికి కారణం కూడా అదే.   వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో బీజేపీ మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలంటే, మరింత బలంగా తెలంగాణా వాదం వినిపించాల్సి ఉంటుంది. అలా జరగాలంటే వచ్చే ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరగకూడదు గనుక బిల్లుకి బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకుండా తప్పుకోవచ్చును. అదేవిధంగా, సీమాంధ్రలో తెదేపాతో జత కట్టాలని భావిస్తున్న బీజేపీ అక్కడ కూడా లాభాపడాలంటే, కాంగ్రెస్ పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టినా, పెట్టకపోయినా వెంకయ్య నాయుడు వంటి వారు గట్టిగా సీమాంధ్ర హక్కుల గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అదే చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ లెక్కలు సరిచూసుకొని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్లయితే, ముందే చెప్పినట్లుగా బీజేపీ బిల్లులో సీమాంధ్రకు అనుకూలంగా కొన్ని సవరణలు సూచించి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టి తను క్షేమంగా బయటపడే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ ఏ కారణంగానయినా బిల్లుని ప్రవేశపెట్టకపోయినా అంతకంటే ఎక్కువ రాద్ధాంతం చేసి, తెలంగాణా ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయడం ఖాయం. అందువల్ల, ఈ రెండు ప్రత్యర్ధ పార్టీలు ప్రజలకిచ్చిన మాట కోసం ఒకదానికొకటి సహకరించుకొని వచ్చే ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేస్తాయని నమ్మడం కష్టం.

నేరారోపణలు ఎదుర్కొంటున్న శశీధరూర్ కి కాంగ్రెస్ సానుభూతి !

  కేంద్ర మంత్రి శశీధరూర్ భార్య సునంద పుష్కర్ రెండు రోజుల క్రితం డిల్లీలో ఒక ప్రముఖ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన భర్తకు మెహర్ తరార్ ఒక పాకిస్తానీ పాత్రికేయురాలితో వైవాహికేతర సంబంధం ఉందని, ఆమె తమ కాపురంలో చిచ్చుపెట్టినట్లు సునంద ఆరోపించింది. అంతేగాక, మెహర్ తరార్ పాకిస్తానీ గూడచారి సంస్థ ఐ.యస్.ఐ. ఏజెంట్ కూడా అని ఆమె ఆరోపించారు. ఈ నేపధ్యంలో సునంద పుష్కర్ హోటల్ రూములో అనుమానాస్పద పరిస్థితిలోమరణించడంతో, ఆమె భర్త శశీధరూర్ తన నిర్దోషిత్వం నిరూపించుకోవలసి ఉంది.   సునంద ఆరోపిస్తునట్లు శశీధరూర్ వైవాహికేతర సంబంధం కలిగి ఉండటం నిజమయితే అదొక నేరము. ఇక కేంద్రమంత్రి వంటి ఒక బాధ్యాతాయుతమయిన పదవిలో ఉంటూ, ఒక పాకిస్తానీ మహిళతో అందునా ఒక పాత్రికేయురాలు, పాకిస్తానీ గూడచారి సంస్థ ఐ.యస్.ఐ. ఏజెంట్ అని ఆరోపింపబడుతున్నవ్యక్తితో సంబంధాలు కలిగి ఉండటం మరో తీవ్రమయిన నేరం. సునంద పుష్కర్ వంటి ఒక మహిళ తన భర్తపై ఊసుపోక ఆరోపణలు చేసి ఆత్మహత్య చేసుకొంటుందని భావించలేము. కానీ, ఆమె ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నపటికీ, వారిరువురి మధ్య పాకిస్తానీ మహిళా కారణంగానే చాలా గొడవలు జరిగాయని, చివరికి అదే ఆమె మరణానికి దారి తీసినట్లు స్పష్టమవుతోంది.   ఈ వ్యవహారంలో శశీధరూర్ దోషా, నిర్దోషా? అనే సంగతిని తేల్చవలసింది పోలీసులు. కానీ, సునంద పుష్కర్ మరణం తరువాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా మొత్తం కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆయనకు సంతాపం తెలిపేందుకు బారులు తీరడంతో అతను నిర్దోషని వారు ముందే దృవీకరిస్తునట్లుంది. ఒక పాకిస్తానీ మహిళతో వైవాహికేతర సంబంధం, భార్య అనుమానస్పద మరణం వంటి రెండు తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటున్న శశీధరూర్ ని, ముందుగా మంత్రి పదవిలోనుండి తప్పించి, ఆయనపై విచారణకు ఆదేశించవలసిన కాంగ్రెస్ అధిష్టానం, అతనికి సానుభూతి చూపడం ఒక తప్పయితే, అతనికి తమ మద్దతు ఉన్నట్లుగా వ్యవహరించడం ద్వారా పోలీసు విచారణను, కేసును కూడా పరోక్షంగా ప్రభావితం చేయడం మరో పెద్ద తప్పు. స్వయంగా ఒక మహిళా అయిన సోనియా గాంధీ, సాటి మహిళకు అన్యాయం చేసిన (చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న) వ్యక్తిని స్వయంగా పరామర్శించడం చాలా తప్పని చెప్పవచ్చును. అదే ఒక సాధారణ వ్యక్తి ఇటువంటి నేరారోపణలు ఎదుర్కొంటునట్లయితే సమాజం అతనిని ఇంచుమించుగా వెలివేసినంత పనిచేసేది. మహిళా సంఘాలు కూడా ఉద్యమించి ఉండేవి. కానీ, శశీ ధరూర్ కేంద్రమంత్రి కావడంతో అతనికి మినహాయింపు దక్కిందేమో! అని భావించాల్సి ఉంటుంది.                 

సమైక్య పార్టీ రిలీజ్ ఎప్పుడు?

సీమాంధ్రలో కొత్త రాజకీయ పార్టీ స్థాపనకి తెర వెనుక సన్నాహాలు చాలా జోరుగానే సాగుతున్నట్లున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల తరచూ పలుకుతున్న“సమైక్యం మా విధానం, సమైక్యాంధ్ర మా నినాదమంటూ” వ్రాసి ఉన్నపోస్టర్లు, భారీ ఫ్లెక్సీ బ్యానర్లు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో, ప్రధాన కూడళ్ళలో ఇప్పుడు విరివిగా కనిపిస్తున్నాయి. కానీ పోస్టర్లలో ఏ రాజకీయ నేత ఫోటో లేకపోవడంతో, కొత్త పార్టీపై ప్రజలలో, మీడియాలో కూడా చర్చ సాగుతోంది. దానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారధ్యం వహిస్తారని అందరూ భావిస్తున్నపటికీ ఇంతవరకు ఆయన మాత్రం బయటపడలేదు.   పార్టీ పెట్టకమునుపే, పార్టీ ఊరు పేరు కూడా లేకుండా ఇంత భారీ ఖర్చుతో భారీ ఎత్తున ప్రచారం చేయడం చూస్తే కనీసం రెండు మూడు పెద్ద తలకాయలు దీనివెనుక ఉండవచ్చుననిపిస్తోంది. ఒకవేళ ఇది కూడా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగమే అయినట్లయితే, కొత్త పార్టీ స్థాపనకు తెరవెనుక నుండి కాంగ్రెస్ కూడా సహాయపడుతున్నా ఆశ్చర్యం లేదు. కానీ, ఇందులో ప్రస్తుతానికి ప్రధాన పాత్రధారులుగా ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులయిన శైలజానాథ్, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావు, లగడపాటి తదితరులు కనిపిస్తున్నారు. వీరికి ఏపీయన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబును కూడా జోడించుకోవచ్చును. ఆయన ఈ కొత్తపార్టీలో చేరడమో లేక దానికి తమ ఉద్యోగుల పూర్తి మద్దతు అందించడమో చేయవచ్చును. బహుశః జనవరి 23ముహూర్తం ఖరారు చేసుకొని ప్రచారం మొదలుపెట్టినట్లున్నారు గనుక, ఆరోజుకి ఈ కొత్త సమైక్య పార్టీపై పూర్తి స్పష్టత రావచ్చును.

జగన్ ప్రతిష్ట మసకబారడానికి కారణాలెన్నో

  ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక సర్వేసంస్థ సీమాంధ్రలో నిర్వహించిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధారణ (పాపులారిటీ) రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడున్న70 శాతం నుండి ఒకేసారి 22శాతానికి పడిపోయినట్లు బయటపెట్టింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఓదార్పుయాత్ర మొదలుపెట్టిన తరువాత ప్రజాధారణ కొంత నిలకడగా ఉన్నట్లు కనబడినప్పటికీ, ఆయన అరెస్టుతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు సీబీఐ జేడీ లక్ష్మి నారాయణ జగన్మోహన్ రెడ్డి కేసుల పరిశోధనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో మంచి పేరు సంపాదించుకొనగా, క్రింద కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు అన్ని కోర్టులు బెయిలు తిరస్కరిస్తున్నపుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం పరువు పోగోట్టుకొన్నారు.   కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకోగానే, వైకాపా వెంటనే తట్టాబుట్టా సర్దుకొని తెలంగాణాలో బయటపడి సమన్యాయం అనడం, ఆ తరువాత సమైక్యాంధ్ర నినాదం అందుకోవడంతో, మొట్టమొదటిసారిగా ప్రజలకి ఆయన విస్వసనీయతపై అనుమానాలు మొదలయ్యాయి. నాటి నుండే ఆయనను తెలంగాణా ప్రజలు ద్వేషించడం కూడా మొదలుపెట్టారు. తెలంగాణాను వదులుకొని సమైక్య శంఖం పట్టుకొని సీమాంధ్రకు వచ్చిపడినప్పటికీ, సమైక్య ముసుగులో విభజనవాదనే ప్రచారం, కాంగ్రెస్ అధిష్టానంతో ఆయనకున్న రహస్య సంభందాల గురించి సీనియర్ కాంగ్రెస్ నేతలే చెపుతుండటంతో అయన చేస్తున్న ఉద్యామలపట్ల ప్రజలలో నమ్మకం కలగలేదు. నానాటికీ దిగజారుతున్న పార్టీ పరిస్థితి గురించి వైకాపా సమావేశాలలో విజయమ్మ పదే పదే ప్రస్తావిస్తూ, అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాలని హెచ్చరిస్తునప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ, జగన్మోహన్ రెడ్డి జైలు నుండి వెలువడటంతో మళ్ళీ ఆయన పాపులారిటీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.   ఆయన బయటకు వచ్చేసాడు గనుక ఇక పార్టీ దూసుకుపోతుందని అందరూ భావించారు. కానీ, ఆయన ఏపీయన్జీవోలతో వ్యవహరించిన తీరు, తన ఇంటి ముందు టెంట్ వేసుకొని ఆయన చేసిన ఐదు రోజుల ఆమరణ నిరాహార దీక్ష వంటివన్నీ ఆయన ప్రతిష్టను మరింత మసకబార్చాయి. ఆ తరువాత ఆయన హైదరాబాదులో సమైక్య శంఖారావం పూరించినా, దానివలన ఆయన కానీ, వైకాపాకు గానీ ఎటువంటి మైలేజీ పొందలేకపోయారు. ఆ తరువాత, రాష్ట్ర విభజన ప్రక్రియ జోరుగా సాగుతున్న సమయంలో ఆయన ఉద్యమాలు పక్కనబెట్టి దేశాటన చేసి ప్రతిపక్ష నేతలను కలవడం వలన ప్రజలలో మరిన్ని అనుమానాలు పెరిగాయే తప్ప ఆయన ఆశించినట్లు సమైక్య ఛాంపియన్ గా ఎదగలేకపోయారు.   శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చిన నాటి నుండి సమైక్య తీర్మానం కోరుతూ వైకాపా సభ్యులు బిల్లుపై చర్చలో పాల్గొనకుండా తప్పించుకోవడం, అదేసమయంలో ఆయన మళ్ళీ ఏపీయన్జీవో సంఘాల ఎన్నికలలో వేలుపెట్టి భంగ పడటంవంటివి ఆయన ప్రతిష్టను మరింత దిగజార్చాయి. వీటికి తోడు పార్టీలో టికెట్స్ కోసం లుకలుకలు, లక్షలు ఖర్చు బెట్టేసి టికెట్స్ దొరకక బయటకి పోయేవారు జగన్మోహన్ రెడ్డి గురించి చెపుతున్నమాటలు అన్నీకూడా ఆయన ప్రతిష్టను దిగజార్చుతూనే ఉన్నాయి. వెంటనే ఏదోకటి చేయకపోయినట్లయితే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆలోచనతోనే ఆయన చంద్రబాబు నియోజక వర్గం కుప్పం నుండి సమైక్యశంఖారవం చెప్పట్టారు. కానీ దానివలన అతని దుందుడుకు స్వభావమే బయటపడింది తప్ప ఆయనకు, పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ కలగలేదు.   ఇప్పుడు తాజాగా మారెప్పపార్టీని వీడుతూ జగన్ గురించి అన్నమాటలు, ఆ వెనువెంటనే పొట్లూరి వరప్రసాద్ పార్టీలో చేరే ఆలోచన విరమించుకోవడం వగైరాలు పార్టీ ప్రతిష్టను మరింత మసకబార్చాయి. అందువలన త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక భారీ సభో, లేక మరో కార్యక్రమమో ప్రకటించవచ్చును.

వైకాపాకు పొట్లూరి బైబై.. మీడియా సృష్టేనా

  ఎన్నికల ముందు రాజకీయ నేతలు ఒక పార్టీలో నుండి మరొక దానిలోకి కప్పగంతులు వేస్తూ, అందుకు యదోచితంగా వివరణ ఇచ్చుకొంటుంటారు. వారి సంజాయిషీలకు మీడియా కూడా ఉడతా భక్తిగా నాలుగు ముక్కలు జోడించి బాష్యం చెపుతుంటుంది. ఇక వైకాపా విషయానికి వస్తే, ఆ పార్టీకి ఒక స్వంత బాకా మీడియా కూడా ఉంది గనుక దానికి మరికొంత రంగులద్ది అందంగా ప్రదర్శిస్తుంది. కానీ పార్టీ నుండి బయటకి పోయేవారి గురించి, వెళ్తూవెళ్తూ వారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పే నాలుగు ముక్కలు గురించీ ఎన్నడూ ప్రస్తావించదు.   ఇక విషయంలోకి వస్తే, నాలుగైదు రోజుల క్రితమే వైకాపాకు గుడ్ బై చెప్పేసిన మారప్ప “జగన్మోహన్ రెడ్డికి చాలా అహంకారమని, అతనికి చిన్నపెద్దా లెక్క లేదని, పార్టీలో ఎవరికీ గౌరవం ఉండదని” ఇచ్చిన కితాబు వైకాపాలో చేరాలనుకొనే వారికి ఒక హెచ్చరికగా కనబడుతుంటే, తాజాగా పొట్లూరి వరప్రసాద్ కూడా అవే కారణాలతో వైకాపాలో చేరే ఆలోచన విరమించుకోన్నట్లు మీడియాలో వార్తలు గుప్పుమనడంతో వైకాపాలో కలవరం మొదలయింది. గత నెల రోజులుగా పొట్లూరి వరప్రసాద్ వరప్రసాద్ వైకాపాలో చేరబోతున్నట్లు మీడియాలో బాగానే టాంటాం అయింది. అప్పుడు వైకాపా ఆ వార్తలను ఖండించలేదు కూడా. కానీ, నెల తిరక్కుండానే ఆయన ఇంకా పార్టీలో చేరకముందే, జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక వైకాపాలో చేరే ఆలోచనను విరమించుకొంటున్నట్లు మీడియాలో వస్తున్నవార్తలు చూసి వైకాపా వెంటనే దిద్దుబాటు చర్యలు చెప్పటింది.   వైకాపా నరసాపురం లోక్ సభ అభ్యర్ది మరియు ఆ నియోజకవర్గ కన్వీనర్ అయిన రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ, “అసలు పొట్లూరి వైకాపాలో చేరుతున్నట్లు ప్రచారం చేసింది మీడియానే. మళ్ళీ ఇప్పుడు చేరడం లేదని ప్రచారం చేస్తున్నదీ ఆ మీడియానే. అసలు పొట్లూరి వైకాపాలో చేరబోతున్నట్లు పార్టీలో ఎవరూ ఎన్నడూ నిర్దారించలేదు. వైకాపాను, మా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికే చంద్రబాబు ఈ మైండ్ గేమ్ వెనుకుండి నడిపించారు. పొట్లూరికి మా పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదు,” అని అన్నారు.   గతంలో కాంగ్రెస్ యంపీ సబ్బం హరి కూడా వైకాపా తరపునే మాట్లాడేవారు. కానీ, ఆయన మరి కొద్ది రోజులలో వైకాపాలో చేరబోతున్నసమయంలో “వచ్చే ఎన్నికల తరువాత తమ పార్టీ (వైకాపా) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని వైకాపా తరపున హామీ ఈయడంతో జగన్మోహన్ రెడ్డి కంగుతిన్నారు. వెంటనే ఆ పార్టీ నేతలు “సబ్బం హరితో కానీ, ఆయన చేసిన ప్రకటనతో గానీ తమ పార్టీకి ఎటువంటి సంబంధమూలేదని, అసలు ఆయన మా పార్టీ సభ్యుడే కాదని” ఆయన మొహం మీదనే తలుపులేసారు. ఇప్పుడు పొట్లూరి విషయంలో కూడా వైకాపా ఇంచుమించు అదేవిధంగా మాట్లాతోంది. కాకపోతే, ఈసారి తమ సమస్యని (అతి)తెలివిగా చంద్రబాబు మెడకి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానయితే పొట్లూరి వరప్రసాద్ కి వైకాపా టికెట్ గురించి మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నప్పుడు ఖండించని వైకాపా, ఇప్పుడు ఖండించడం, దానిని చంద్రబాబుపైకి నెట్టే ప్రయత్నం చేయడం చూస్తే వైకాపా అతితెలివి ప్రదర్శిస్తోందని అర్ధమవుతోంది.

బాలకృష్ణ రాజ్యసభకు పోటీ చేస్తారా?

  గతంలో నందమూరి బాలకృష్ణ చాలాసార్లు తను వచ్చే ఎన్నికలలో కృష్ణా జిల్లానుండి శాసనసభకు పోటీ చేస్తానని చెప్పేవారు. కానీ, గత కొంత కాలంగా ఆయన ఆ ఊసు ఎత్తడం లేదు. ఆయన సోదరుడు హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో, ఆయన ఇప్పుడు రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం (ఏప్రిల్ 4) కూడా ఖాయమయింది గనుక, బాలకృష్ణ రాజ్యసభకు పోటీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. హరికృష్ణ స్థానంలో బాలకృష్ణకు రాజ్యసభ టికెట్ కేటాయిస్తే పార్టీలో ఎవరికీ అభ్యంతరమూ ఉండదు గనుక, చంద్రబాబు కూడా ఆయనను రాజ్యసభకు పంపేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదీగాక వచ్చే ఎన్నికలలో శాసనసభ టికెట్స్ కోసం, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో తీవ్రమయిన ఒత్తిడి ఉంటుంది గనుక, బాలకృష్ణను రాజ్యసభకు పంపడమే శ్రేయస్కరమని చంద్రబాబు భావిస్తునట్లు తెలుస్తోంది. కానీ, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున, ఈలోగా లోక్ సభ, శాసనసభకు అభ్యర్ధుల ఎంపిక ఒక కొలిక్కి వస్తే, దానిని బట్టి బాలకృష్ణను రాజ్యసభకు పంపడమా లేక లోక్ సభ లేదా శాసనసభకు పోటీ చేయించడమా? అనేది తేలవచ్చును. ఏమయినప్పటికీ, బాలకృష్ణ వంటి బలమయిన అభ్యర్ధి లోక్ సభ లేదా శాసనసభకు పోటీ చేయడం వలన పార్టీకి లాభం కలుగుతుందని చెప్పవచ్చును.

థాంక్యూ వెరీమచ్ చిరూ!

      మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేసిన దాఖలాలు లేవు. ఏదైనా వుందేమో మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఆలోచించినా ఒక్కటి కూడా ఎంత షార్ప్ మైండ్‌కైనా దొరకదు. పార్టీ పెట్టడం, తుక్కుగా ఓడటం, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి పదవులు సంపాదించుకోవడం మినహా ఆయన సాధించిందేమీ లేదు. ఈ విషయాన్ని చెప్పడానికి రాజకీయ పరిశీలకులు, విశ్లేషకుల అవసరమేమీ లేదు.   రాష్ట్రంలో చిన్నపిల్లాడిని కదిలించినా  పాయింట్ మీద చాలా క్లారిటీగా మాట్లాడతాడు. రాష్ట్రంలో రాజకీయంగా ఇంత ‘మంచి’ ఇమేజ్ వున్న చిరంజీవి రాష్ట్ర ప్రజల్ని ఇంకా బాధపెట్టడం దేనికని అనుకున్నాడో, అంతర్లీనంగా మరో కారణం ఏదైనా వుందేమోగానీ రాష్ట్ర ప్రజల నెత్తిన పాలు పోసే నిర్ణయం తీసుకున్నారు.  ఆయన తీసుకున్న సదరు నిర్ణయం ఆషామాషీ నిర్ణయం కాదు. తెలుగోళ్ళంతా ముక్తకంఠంతో ఆయనకి థాంక్స్ చెప్పి తీరాల్సిన నిర్ణయం. ఇంతకీ ఆ నిర్ణయమేంటంటే, చిరంజీవి గారికి తన మానస పుత్రిక అయిన ‘ప్రజారాజ్యం పార్టీ’ని పునరుద్ధరించే ఆలోచన ఎంతమాత్రం లేదట. హమ్మయ్య థాంక్ గాడ్ అనిపిస్తోంది కదూ?! ఈమధ్య కాలంలో చిరంజీవి గారు కాలం చేసిన తన పార్టీని సమాధిలోంచి బయటకి తీసే అవకాశం వుందన్న రూమర్లు వినిపించాయి. ఈ రూమర్లని బయటివారు క్రియేట్ చేశారో లేక జనాల రెస్పాన్స్ ఎలా వుంటుందో చూద్దామని చిరంజీవి వర్గీయులే క్రియేట్ చేశారో తెలియదుగానీ మొత్తానికి రూమరైతే బాగా వ్యాపించింది. చిరంజీవిగానీ పొరపాటుగా ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరిస్తారేమోనని తెలుగు ప్రజలంతా తల్లడిల్లిపోయారు. ఆ పొరపాటు మళ్ళీ జరిగితే అది తెలుగువారి పాలిట మరోసారి గ్రహపాటుగా మారే ప్రమాదం వుందని విలవిలలాడిపోయారు.  ఎందుకంటే, ఆరోజుల్లో చిరంజీవి పార్టీ పెట్టి ఓట్లు చీల్చడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందని, అప్పుడు అయ్యగారు పార్టీ పెట్టకుండా వుంటే తెలుగు జనాలు కాంగ్రెస్ పార్టీ బారిన పడి వుండేవారు కాదని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీని బతికిస్తే వచ్చే ఎన్నికలలో ఇంకెన్ని దుష్పరిణామాలు జరుగుతాయోనని భయపడ్డారు. అయితే చిరంజీవి తన పార్టీకి మళ్ళీ అంత సీన్ లేదని అర్థం చేసుకున్నాడో లేక తెలుగు వారి మీద దయదలిచాడో గానీ తన పార్టీని పునరుద్ధరించే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. అందుకే ప్రతి తెలుగువాడూ చిరంజీవికి రుణపడి వుండాలి. ఆయనకి మనస్పూర్తిగా థాంక్యూ వెరీమచ్ అని చెప్పాలి.  

కేజ్రీవాల్ క్రేజీ ఆలోచన!

      అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఢిల్లీ ప్రజలు పెంచుకున్న భ్రమలు మంచు పొరల్లా కరిగిపోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా రాజకీయ పార్టీలన్నిటి కంటే డిఫరెంట్ అని అపోహ పడిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు తమ తప్పుకు తామే లెంపలు వేసుకుంటున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే కేజ్రీవాల్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడో ఆ కాంగ్రెస్ పార్టీతోనే చెట్టపట్టాల్ వేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం మీదకి ఎక్కి కూర్చున్న కేజ్రీవాల్‌ని చూసి ఢిల్లీ ప్రజలకు నోట మాట రావడం లేదు.   అధికారంలోకి  రాకముందు ఏ ప్రగల్భాలు అయితే పలికారో  అధికారంలోకి వచ్చాక వాటికి వ్యతిరేకమైన పనులు చేయడం ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార నివాసం వద్దనడం, అధికార కార్లు వద్దనడం దగ్గర్నుంచి అనేక విషయాలలో కేజ్రీవాల్ రివర్స్ గేర్ వేసేశారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా అవినీతిని ఊడ్చడానికి ఉపయోగించాల్సిన చీపుర్ని అవినీతి మురికి పట్టిపోయిన హస్తానికి అందించిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఢిల్లీ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చి మంచి చేసుకోవాలని కేజ్రీవాల్ ప్రయత్నించినప్పటికీ, ఆయన పరిపాలన మీద ఢిల్లీ ప్రజల్లో ఇప్పడికే అసంతృప్తి ప్రారంభమైంది. మిగతా రాజకీయ పార్టీలకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతమాత్రం భిన్నం కాదన్న అభిప్రాయం ఢిల్లీ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే ఢిల్లీలో బీజేపీకి సంపూర్ణ అధికారం రావడంతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తుడిచిపెట్టుకుపోయే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం కళ్ళ ముందు అధికార తెరలు కప్పుకుపోయిన కేజ్రీవాల్ ఆలోచనలు మాత్రం మరోలా వున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో దేశవ్యాప్తంగా పోటీ చేసే ఆలోచనలో ఆయన వున్నారు. స్థానికంగా వుండే ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా భారీ స్థాయిలో లోక్‌సభ స్థానాలు పొందవచ్చన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. అప్పనంగా దక్కిన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంతో సంతృప్తి పడకుండా ఏకంగా దేశ ప్రధాని పదవి మీదే కేజ్రీవాల్ కన్ను వేసినట్టు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో రాజకీయంగా తనకు ఉపయోగపడే ప్రాంతీయ పార్టీలతో కేజ్రీవాల్ ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జనాల్లో తనకు క్రేజ్ తగ్గిపోయిందన్న విషయం కేజ్రీవాల్ తెలుసుకుంటే మంచిది.  

ఉన్న పరువు కూడా పోయింది!

      మొన్నీమధ్య భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో ఆలోచని పెంచాయి. రెండోసారి ప్రధాని అయ్యాక దేశ ప్రజలకు ఆయన మీద గౌరవం బాగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు ఆయన మీద ఉన్న కాస్తంత గౌరవాన్ని కూడా పోగొట్టేలా వున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రధానిగా తన పదేళ్ళ పదవివీకాలంలో చేసిన పొరపాట్లు, సాధించిన ఫలితాల గురించి చెప్పుకోవడానికి అన్నట్టు కాకుండా నరేంద్రమోడీని తిట్టిపోయడానికి, రాహుల్ గాంధీని మునగచెట్టు ఎక్కించడానిన్నట్టుగా మాట్లాడ్డం క్షమార్హంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశాన్ని నిట్టనిలువుగా ముంచేసిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం ఇవ్వండి... ఈసారి నా ప్లేసులో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేయండని చెప్పిన ఆయన తీరు విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రధానమంత్రి దేశ ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నట్టు కాకుండా, ఒక ఎన్నికల సభలో మాట్లాడే రాజకీయ నాయకుడిలా ప్రధాని అప్పుడు కనిపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ అల్లర్లు, హింసాకాండ విషయంలో కోర్టు మోడీకి క్లీన్ చిట్ ఇచ్చినా ఆ అల్లర్లకు మోడీయే కారణమంటూ ప్రధాని మాట్లాడ్డం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా భావించవచ్చని అంటున్నారు. సోనియాగాంధీ ఎలా ఆడిస్తే అలా ఆడే కీలుబొమ్మలా పేరు సంపాదించుకున్న మన్మోహన్ సింగ్ ఈ అధికార సంధ్యలో అయినా తనమీద గౌరవం పెరిగేలా మాట్లాడి వుంటే  బావుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోడీని  చూసి భయపడుతున్న కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ని ఈ రకంగా కూడా వాడుకోవడం దారుణమని అంటున్నారు. ఇప్పటికే తనకున్న మిస్టర్ క్లీన్ ఇమేజ్‌ను పూర్తిగా పోగొట్టుకుని అసమర్థ ప్రధాని అని గొప్ప గుర్తింపు సంపాదించుకున్న మన్మోహన్ సింగ్ తనను మీడియా అర్థం చేసుకోలేకపోయిందని, చరిత్రకారులైనా తనను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించడం ఆయన బేలతనానికి నిదర్శమని విమర్శకులు అంటున్నారు. అనవసరపు ప్రెస్ మీట్లు పెట్టి జనాల్లో చులకన అయ్యే రాహుల్ గాంధీ బాటలోనే ప్రధాని మన్మోహన్ సింగ్ పయనిస్తున్నారని భావిస్తున్నారు.

జగన్‌కి అశోక్‌బాబు షాక్!

      ఏపీఎన్జీవోల ఎన్నికలలో అశోక్‌బాబు సాధించిన ఘన విజయాన్ని కేవలం ఉద్యోగులకు సంబంధించిన విషయంగానే రాజకీయ పరిశీలకులు భావించడం లేదు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులను అధిగమిస్తూ సాధించిన విజయంగా భావిస్తున్నారు. ఉద్యోగులు సమైక్య ఉద్యమం జరిపిన సమయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ అశోక్‌బాబును తనకు అనుకూలంగా మాట్లాడే విధంగా ప్రేరేపించారు. అయితే దానికి అశోక్‌బాబు అంగీకరించకపోవడంతో ఆయన మీద అప్పటి నుంచే రాజకీయాలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు ఏపీ ఎన్జీవోల ఎన్నికల సందర్భంగా ఆ రాజకీయాలు మరింత ముదిరి అశోక్‌బాబుకు పోటీగా ఒక అభ్యర్థి నిలబడేంత వరకూ పరిస్థితి వెళ్ళిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   సమైక్య ఉద్యమాన్ని ఎంతో అభినందనీయంగా నడిపిన ఏపీ ఎన్జీవోలలో ఐక్యత దెబ్బతినేలా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని అంటున్నారు. అయితే అశోక్‌బాబుకు ఘన విజయం అందించడం ద్వారా ఏపీ ఎన్జీవోలు తమలో ఐక్యత అలాగే వుందని చెప్పారని అంటున్నారు. మొత్తమ్మీద అశోక్‌బాబు సాధించిన విజయం జగన్‌కు ఒక షాక్‌లా భావించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఎపీ ఎన్జీవోల ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి దశలోనూ జగన్ వర్గం అశోక్‌బాబుకు వ్యతిరేకంగా పనిచేసింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల  సందర్భంలో ఎన్ని వ్యూహాలు రచిస్తారో అన్ని వ్యూహాలు రచించారు. అశోక్‌బాబుకు వ్యతిరేకంగా బాహాటంగానే అన్ని పనులూ చేశారు. చివరకు ఈ ఎన్నికలు అశోక్‌బాబు వెర్సెస్ జగన్ అన్నట్టుగా తయారయ్యాయి. అయితే జగన్ ఎన్ని ప్లానులు వేసినా అశోక్‌బాబు ఎంతమాత్రం నిబ్బరాన్ని కోల్పోకుండా వ్యవహరించడం అభినందనీయమైన అంశమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అశోక్‌బాబు సాధించిన విజయం వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కున్న డబ్బు, పలుకుబడిని దెబ్బతీశాయని భావిస్తున్నారు. సమైక్య ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న అశోక్‌బాబుకు వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా జగన్ సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకిగా మారారు. ఈ ప్రభావం రాబోయే ఎన్నికల మీద వుండే  అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. అశోక్‌బాబును వ్యతిరేకించి జగన్ తేనెతుట్టెను కదిపారని విశ్లేషిస్తున్నారు.

సర్వేల స్పెషలిస్టు లేటెస్ట్ సర్వే!

  సర్వేల స్పెషలిస్టు లేటెస్ట్ సర్వే! టీడీపీ-బీజేపీ కూటమికి ఆధిక్యం   ఎన్నికల సర్వేలు చేయించడంలో స్పెషలిస్టు అయిన కృష్ణా జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు తాజాగా మరో రహస్య సర్వే జరిపించారు. 2014 ఎన్నికలలో రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న పాయింట్ మీద జరిపించిన ఈ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాలలో హల్‌చల్ సృష్టిస్తోంది. ఏ నలుగురు రాజకీయ నాయకులు ఒక్కచోట చేరినా ఈ సర్వే ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు.   సదరు నాయకుడు జరిపించిన సర్వే ఫలితాల ప్రకారం సీమాంధ్ర ప్రాంతంలో టీడీపీ-బీజేపీ కూటమి 93 ఎమ్మెల్యే స్థానాలు, 14 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం వుందని తెలుస్తోంది. అలాగే వైఎస్సార్సీపీ 71  ఎమ్మెల్యే స్థానాలు, 10 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది. రాష్ట్ర విభజన విషయంలో అత్యుత్సాహం చూపించిన కాంగ్రెస్ పార్టీ 9 ఎమ్మెల్యే స్థానాలు, ఒక్క ఎంపీ స్థానంతో సరిపెట్టుకోక తప్పదని సదరు సర్వే స్పష్టం చేసింది. ఇక తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎం.ఐ.ఎం. ఈ మూడు పార్టీలకు కలిపి 71 ఎమ్మెల్యే స్థానాలు, 10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం వుందని సర్వే చెబుతోంది. టీడీపీ-బీజేపీ కూటమికి 46 ఎమ్మెల్యే స్థానాలు, 7 ఎంపీ స్థానాలు వస్తాయని సర్వే ఫలితాలు పేర్కొంటున్నాయి. వైఎస్సార్సీపీకి తెలంగాణలో అకౌంట్ ఓపెన్ అయ్యే అవకాశం లేదని ఆ సర్వే స్పష్టం చేసింది.

కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు

  రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో ఒక వికృత రాజకీయ క్రీడ మొదలుపెట్టింది. అందులో కాంగ్రెస్ నేతలందరూ తమతమ పాత్రలను చక్కగా పోషిస్తూ ప్రజలను మభ్యపెడుతూ 2014 ఎన్నికలలో తమ రాజకీయ భవిష్యత్తును దానితో బాటే పార్టీకి విజయాన్నిసాధించి పెట్టేందుకు రకరకాలుగా యధాశక్తిగా కృషి చేస్తున్నారు. వారిలో అధిష్టానానికి వ్యతిరేఖంగా వ్యవహరించే ముఖ్యమంత్రి, సీమాంధ్ర కేంద్ర మంత్రులు, యంపీలు, యం.యల్.యే.లు. ఉన్నారు. అధిష్టానాన్ని వ్యతిరేఖించడం ద్వారా పార్టీ పట్ల ప్రజలలో ఉన్నవ్యతిరేఖతను ఓట్లరూపంలో క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది ఈ గ్రూపు. బహుశః కిరణ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఏర్పడే కొత్తపార్టీని నెంబర్:1 గ్రూపుగా భావించవచ్చును. ఈ గ్రూపుకి అనుబంధంగా వేరే పార్టీలు కూడా పనిచేస్తుంటాయి. అవి ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడమో లేక కలిసి పనిచేయడమో లేక మద్దతు ఈయడమో చేయవచ్చును.   ఇక పార్టీలోనే విధేయవర్గం కూడా ఒకటుంది. దీనిని గ్రూప్ నెంబర్:2గా పిలుచుకోవచ్చును. రాష్ట్ర విభజన ప్రభావం తట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా తమంతట తాము గెలవగలవారు మాత్రమే ఈ గ్రూపు నెంబర్:2లో సభ్యులుగా ఉండేందుకు అర్హులు. ఇక పార్టీలో గ్రూప్ నెంబర్:3 కూడా ఉంది. వీరు పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేఖంగా గానీ మాట్లాడరు. కానీ, తెర వెనుక ఉండి పార్టీ వ్యవహారాలు చక్కబెడుతుంటారు. వీరు ఎన్నికలలో చేయకపోవచ్చును. వీరు అందిస్తున్నరహస్య సేవలకి గాను, శాసనమండలి, రాజ్యసభ టికెట్స్ లతో సత్కరించబడతారు.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఎలాగు పూర్తిగా గెలవలేదు గనుక తెలంగాణా కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా 50:50 ప్లాన్ సిద్ధం చేసింది. అందులో తెలంగాణా సాధించిన కాంగ్రెస్ ఘనులు, తెరాస నేతలు ఉంటారు. అదృష్టం బాగుండి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాగలిగే అవకాశాలు ఉంటే తెరాస మద్దతు ఉంటుంది. లేకుంటే లేదు.   కానీ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకొన్నాతెరాస ప్రభావానికి తట్టుకొని నిలబడాలంటే వారికి కొంత బూస్టింగ్ అవసరం ఉంటుంది. అది అందించే భాద్యత మాత్రం పూర్తిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదే. ఆయన అప్పుడప్పుడు ఏవో చిలిపి మాటలు మాట్లాడుతూ, చిలిపి చేష్టలు చేస్తుంటే వారందరూ మూకుమ్మడిగా ఆయనపై విరుచుకుపడుతూ తమ తెలంగాణాను ఆయన బారి నుండి కాపాడుకొంటూ, పనిలోపనిగా తమ రేటింగ్ కూడా పెంచుకొంటుంటారు.   ఈవిధంగా కాంగ్రెస్ నేతలందరూ ఒకరినొకరు తిట్టుకొంటూ, అధిష్టానాన్నికూడా తిడుతూ, భజన చేస్తూ, కాంగ్రెస్ తోనే పోటీచేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి చాలా కృషి చేస్తున్నారు. వీరి ఐఖ్యత ఎంత గొప్పదో, ఇంత అనైక్యంగా ఏమి సాధించబోతున్నారో తెలుసుకోవాలంటే ఎన్నికలు పూర్తయ్యేవరకు వేచి చూడక తప్పదు మరి.  

కాంగ్రెస్ యంపీల సంకల్ప డ్రామా

  రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని, తమ పదవులకు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాలు చేసేదిలేదని తెగేసిచెప్పిన పనబాక లక్ష్మి, కిల్లి క్రుపారాణీ, జేడీ.శీలం, కావూరిల గురించి సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి అపోహలు లేవు. సీమాంధ్రకు కావలసిన ప్యాకేజీల గురించి మాట్లాడిన పురందేశ్వరి గురించి కూడా ఎటువంటి అనుమానాలు లేవు. చివరికి హైదరాబాద్ ను యూటీ చేయవలసిందేనని వాదించి అకస్మాత్తుగా మాయమయిపోయిన చిరంజీవిని కూడా తప్పు పట్టడానికి లేదు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరుగకుండా అడ్డుకొంటామని మైకులు పగిలిపోయేలా ఘర్జిస్తూ ఒకసారి రాజీనామాలు, మరోసారి కోర్టులో కేసులు, ఇంకోసారి స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం అంటూ రకరకాల డ్రామాలు ఆడుతున్న ఆ ఆరుగురు కాంగ్రెస్ యంపీలు లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, హర్ష కుమార్, సాయి ప్రతాప్, సబ్బంహరిల వ్యవహార శైలే చాలా అనుమానాస్పదంగా ఉంది.   వారందరూ రేపటి నుండి సంకల్ప దీక్ష పేరుతో రెండు రోజులు సాగే మరో కొత్త నాటకం ప్రదర్శించబోతున్నారు. అందుకు వేదిక హైదరాబాదులో ఇందిరా పార్క్. వారందరూ తమ యంపీ పదవులకు రాజీనామాలు చేసామని చెప్పుకొంటారు. కానీ నేటికీ అవి ఆమోదం పొందలేదు గనుక యంపీలుగా కొనసాగుతున్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానం పెట్టామంటారు. కానీ అది సభలో చర్చకే రాదు. ఇప్పడు రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ రెండు రోజులు దీక్ష చేయబోతున్నారు. కానీ రాష్ట్ర విభజన ఆగబోదు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నపుడు యంపీలయిన వారందరూ అధికారికంగా ఏమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద వారు చేసే దీక్షవల్ల కొత్తగా ఏమి ఒరుగుతుందో వారికే తెలియాలి.   బహుశః తామే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్నామని మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం కావచ్చును. రేపు తెలంగాణావాదులెవరయినా అక్కడకి వచ్చిఅలజడి సృష్టిస్తే, తాము ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నామని చెప్పుకొని సానుభూతి ఓట్లు కూడా ఆశించవచ్చును. తాము ఏ పార్టీలో చేరి, ఏ రంగు కండువా కప్పుకొన్నా ప్రజలందరూ తమ మొహాలను జాగ్రత్తగా గుర్తుంచుకొని రానున్నఎన్నికలలో తమకే ఓట్లు వేయాలని చెప్పేందుకు వారి దీక్ష ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్ర విభజనను ఆపలేదని వారికి కూడా తెలుసు. వారి రాజీనామాలు, ఉద్యమాలు, దీక్షలు అన్నీ ప్రజలని ఆకట్టుకొని ఓట్లు రాల్చుకోవడానికి కాదని వారు చెప్పదలచుకొంటే, తాము కాని, తమ పుత్రరత్నాలు గానీ తమ కుటుంబంలో మరెవరూ కూడా వచ్చేఎన్నికలలో పోటీ చేయబోమని ప్రకటిస్తే వారిని విశ్వసించవచ్చును. కానీ కోటి విద్యలు కూటి కొరకేనని వారి ఆరాటం అంతా కూడా వచ్చే ఎన్నికలలో గెలిచేందుకేనని అర్ధం చేసుకొని జాలిపడాలి అంతే.

లాంచనంగా అమాద్మీకి బల పరీక్ష

  ఆమాద్మీ పార్టీ డిల్లీ ప్రభుత్వపగ్గాలు చేప్పట్టి అప్పుడే వారం రోజులయిపోయింది. మొదటి మూడు రోజులలోనే తన ఎన్నికల హామీలలో ముఖ్యమయిన రెండు హామీలు-డిల్లీ ప్రజలకు 700 లీటర్ల ఉచిత నీళ్ళ సరఫరా, విద్యుత్ ధరలలో 50 శాతం తగ్గింపును అమలు చేసింది. అంతే గాక డిల్లీకి విద్యుత్ సరఫరా చేస్తున్నమూడు విద్యుత్ కంపెనీల రికార్డులను ఆడిటింగ్ చేయిస్తానని ఇచ్చిన మరో హామీని కూడా నిలబెట్టుకొంటూ అరవింద్ కేజ్రీవాల్ నిన్న ఆడిటర్ జనరల్ ని కలిసి, ఆ మూడు విద్యుత్ కంపెనీల రికార్డులను ఆడిటింగ్ చేయవలసిందిగా అభ్యర్దించారు. మూడు కంపెనీలలో ఒకటి ఇప్పటికే ఆయన ప్రతిపాదనను స్వాగతించగా మరో రెండు కంపెనీలు ఇంకా స్పందించవలసి ఉంది.   ఇక కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యులందరూ నిన్నడిల్లీ శాసనసభలో ప్రమాణ స్వీకారాలు చేసారు. ఈరోజు శాసనసభలో ఆమాద్మీ బలం నిరూపించుకోవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ అమాద్మీకి తన మద్దతు ఉంటుందని ఇప్పటికే మరో మారు స్పష్టం చేసింది గనుక ఈరోజు జరిగే బలనిరూపణ కార్యక్రమం కేవలం లాంచనప్రాయమే. అందువలన ఇక నేటి నుండి ఆమాద్మీ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మరింత జోరుగా ప్రయత్నించవచ్చును.   ప్రభుత్వ పగ్గాలు చెప్పటిన 15రోజులలోనే అన్నాహజారే కోరిన విధంగా జన్ లోక్ పాల్ బిల్లుని సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినందున, ఇప్పుడు దానిపై అమాద్మీ దృష్టి కేంద్రీకరించవచ్చును. కానీ, దీనికి కాంగ్రెస్, బీజేపీల మద్దతు అవసరం ఉంటుంది. రాహుల్ గాంధీ తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేఖంగా చేస్తున్న పోరాటానికి నిదర్శనంగా ఇటీవల పార్లమెంటులో అమోదం పొందిన లోక్ పాల్ బిల్లు గురించి మాట్లాడుతున్నారు గనుక, ఇప్పుడు ఆమాద్మీ ప్రభుత్వం ప్రవేశపెట్టే జన్ లోక్ పాల్ బిల్లుకి కూడా మద్దతు ఇచ్చేఅవకాశం ఉంది. కానీ, తమకు అధికారం దక్కకుండా చేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఆమాద్మీకి మద్దతు ఇచ్చి ఇద్దరూ కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్న బీజేపీ ఈ బిల్లును ఏదో ఒక కుంటిసాకుతో వ్యతిరేఖించవచ్చును.   ఇక అమాద్మీ పార్టీ యువతను, సామాన్య, మధ్యతరగతి, ఉద్యోగస్తులు, వ్యాపారులను చేరేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకొంటున్న తీరు, దానికి వస్తున్న అపూర్వ స్పందన, ఒబామా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నపుడు చేసిన ఎన్నికల ప్రచారం, స్పందన కంటే చాలా బాగుందని ఫేస్ బుక్ సర్వేలో తేలింది. అమాద్మీ తను అధికారం చేప్పట్టిననాటి నుండి ఇంతవరకు అమలు చేసిన హామీల గురించి ఫేస్ బుక్ పేజీలలో ప్రజలకు తెలియజేసి, మిగిలిన హామీలను కూడా అమలుచేయడానికి కృషి చేస్తామని, అందు కోసం సదా వారి మద్దతు అవసరమని చేసిన విజ్ఞప్తికి ప్రజల నుండి చాలా మంచి ప్రతిస్పందన వస్తున్నట్లు ఫేస్ బుక్ సర్వేలో తేలింది.

తె.దే.పాను ‘కాపు’ కాస్తాం...

      రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో... వచ్చే ఎన్నికల్లో ఊహించని విధంగా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఓ కులం మద్ధతు టోకున లభించనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయవిశ్లేషకులు. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజికవర్గం తదనంతరం దశలవారీగా చోటుచేసుకున్న పరిణామాలలో కొంచెం కొంచెంగా ఆ పార్టీకి దూరమైంది. తె.దే.పాతో కాపు కులం వైరానికి విజయవాడలో వంగవీటి రంగా హత్య తొలి బీజం వేసింది. అక్కడ నుంచి కాపు కులస్థులు రాజకీయంగా మరింత ప్రాధాన్యతను కోరుకోవడం, సహజంగానే కమ్మ సామాజికవర్గం డామినేషన్‌ ఉన్న తెదేపాలో తాము ఎదగలేమనే భయంతో... స్వంతంగా ఎదిగే ప్రయత్నం చేయడం వంటివి ఈ దూరాన్ని మరింత పెంచాయి. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన కాపు కులస్థులు ఆ పార్టీ కూడా తమను ఓటుబ్యాంకుగానే చూస్తోందని గ్రహించి నిరాశలో కూరుకుపోయారు. అదే సమయంలో 2009లో రాజకీయనగారా మోగించిన చిరంజీవిలో వారికి ఆపద్భాంధవుడు కనిపించాడు. అంతే ఆస్థులూ, ఆభరణాలూ సైతం తాకట్టు పెట్టి చిరంజీవికి అన్ని విధాలుగా సహకరించారు. నిజానికి చిరంజీవికి పడిన 70లక్షల ఓట్లలో కాపు కులస్థుల ఓట్లే అత్యధికం అనడంలో సందేహం లేదు. ఆ ఎన్నికల్లో చిరంజీవి అధికారంలోకి రాకపోయినా వారు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదేమో కాని... నమ్మినవారిని నట్టేట ముంచుతూ ఆయన కాంగ్రెస్‌ బోటెక్కేశారు. దీంతో మరోసారి, అదీ గతంలో ఎన్నడూ లేనంత పెద్దస్థాయిలో మోసపోయినట్టు భావించారు కాపులు.   వీటన్నింటి నేపధ్యం, ప్రస్తుత రాజకీయపరిస్థితులు బేరీజు వేసుకుంటున్న కాపు సామాజికవర్గం తెలుగుదేశం పార్టీ  వైపు మొగ్గు చూపుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా తమను మోసం చేయడమే కాకుండా చిరంజీవి అనే ఏకైక నాయకుడ్ని కూడా తమకు కాకుండా చేసిన కాంగ్రెస్‌ తప్పులు రాష్ట్ర విభజనతో పరాకాష్టకు చేరాయని కాపుల భావన అనీ, ఈ నేపధ్యంలో ఎలాగైనా ఆ పార్టీని ఓడిరచాలని  ఆ సామాజికవర్గం  ఆత్రుతగా ఎదురు చూస్తోందంటున్నారు. రాష్ట్రజనాభాలో దాదాపు 35శాతంగా ఉన్న కాపుల ఓట్లు గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనేది  తెలిసిందే. కాంగ్రెస్‌, సోనియాలను ఎదిరించినందుకు గాను విభజనకు ముందు కాపులు  వైకాపా వైపు, జగన్మోహన్‌రెడ్డి వైపు మొగ్గు చూపినా విభజనానంతరం వారిలో జగన్‌ వైఖరి పట్ల భ్రమలు తొలగిపోయాయి. జగన్‌ కూడా  తర్వాత తర్వాత కాంగ్రెస్‌లో కలవక తప్పదని, ఇదంతా  కాంగ్రెస్‌ ఆడిస్తోన్న నాటకం అని భావిస్తున్న కాపు వర్గం... ఈ కుట్రలను ఛేధించాలని, దీంతో తమ పాత మిత్రుని చెంతకే చేరాలని నిశ్చయించుకుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీనికి నిదర్శనంగానే విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కన్నబాబు వంటి పలువురు కాపు నేతలు తె.దే.పా లోకి దూకేందుకు సిద్ధమవడాన్ని వీరు చూపుతున్నారు.  ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా  మలచుకునేందుకు కాపులకు మరింత దగ్గరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ కూడా  ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

మోడీ, రాహుల్ జీవితాలను మలుపు తిప్పే ఎన్నికలు

  రానున్నసార్వత్రిక ఎన్నికలు యూపీయే, ఎన్డీయేలకు చాలా కీలకమయినవి. కేంద్రంలో తిరిగి యూపీయే అధికారంలోకి రాలేకపోతే ఇక రాహుల్ గాంధీ ప్రధాని పదవిపై శాస్వితంగా ఆశలు వదులుకోవలసిందే. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రాన్నిఅభివృద్ధిపదంలో నడిపించినట్లే, నరేంద్ర మోడీ దేశాన్నికూడా ముందుకు నడిపించగలిగితే, కనీసం మరో పదేళ్ళపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చొని భజన చేసుకోక తప్పదు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియాగాంధీ ఈ ఎన్నికల తరువాత రాజకీయాల నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఐదు లేక పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో కూర్చొన్నరాహుల్ గాంధీని ఇక కాంగ్రెస్ లో లెక్కచేసేవారుండకపోవచ్చును. గనుక, ఈ ఎన్నికలలో గెలవడం యూపీయేకి అత్యావశ్యకం. అయితే, దేశమంతటా కాంగ్రెస్ ఎదురు గాలులు వీస్తున్న సంగతి మొన్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోనే రుజువయింది. గనుక ఎన్డీయే అధికారంలోకి రావచ్చును. పరిస్థితి తీవ్రతను గమనించిన సోనియా గాంధీ, అది పూర్తిగా చెయ్యి దాటిపోక ముందే రాహుల్ గాంధీని తప్పించి అతని స్థానంలో తన కుమార్తె ప్రియాంకా గాంధీని రంగంలోకి దింపినా ఆశ్చర్యం లేదు.   దేశమంతా మోడీ జపం చేస్తున్నఈ తరుణంలో ఈ సువర్ణావకాశం ఉపయోగించుకొని మోడీ ప్రధాని కాలేకపోతే ఇక ఆయనకు కూడా మళ్ళీ ఇటువంటి అవకాశం మరోసారి రాకపోవచ్చును. తన జీవితకాల ఆశయాన్నినెరవేర్చుకోవడం ఆయనకు అత్యవసరం గనుక వచ్చే ఎన్నికలలో గెలవడం ఆయనకు అత్యావశక్యమే. ఇక గత పదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చొన్నఎన్డీయేకు కూడా ఈ ఎన్నికలలో గెలవడం అత్యావశ్యకమే. లేకుంటే ప్రస్తుతం ఉన్న నేతలందరూ రాజకీయాల నుండి రిటర్మెంట్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చును. అందువల్ల వచ్చే ఎన్నికలలో ఏ కూటమి నెగ్గినా, రెండో కూటమిలో ప్రధాని అభ్యర్ధికి రాజకీయంగా జీవితంలో మళ్ళీ కోలుకోలేనంతగా నష్టం కలగకడం తధ్యం. ఇంతవరకు చెప్పుకొన్నదానిప్రకారం చూస్తే, మోడీ కంటే రాహుల్ గాంధీయే ఎక్కువ నష్టపోతారని అర్ధం అవుతోంది. ఒకవేళ ఎన్డీయే అధికారంలోకి రాలేకపోతే మోడీ మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోయి పాలించుకోవచ్చును. కానీ రాహుల్ గాంధీకి కనీసం ఆ అవకాశం కూడా ఉండదు. ఆయన రాజకీయ జీవితం ఉన్నత దశకు చేరక మునుపే ముగింపుకి చేరుకొంటుంది.   అందువల్ల రానున్న ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు. రెండు ప్రధాన పార్టీల, ప్రధాని అభ్యర్ధుల జీవన్మరణ పోరాటమని చెప్పుకోవచ్చును.

కొత్తనీరు అంతా మంచిదే కాకపోవచ్చును:తెదేపా కార్యకర్తలు

  ఎన్నికల సమర శంఖం పూరించిన చంద్రబాబు నాయుడు, తెదేపా నుండి గతంలో ఇతర పార్టీలలోకి వెళ్ళినవారిని తిరిగి పార్టీలోకి రప్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆశిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడాలనుకొంటున్నసమర్దులయిన నేతలను కూడా పార్టీలోకి ఆకర్షించాలని ప్రయతిస్తున్నారు.    చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అవినీతిమయమయిన కాంగ్రెస్ పార్టీలో చాలా మంది దొంగలు ఉన్నపటికీ, కొందరు సమర్ధులు, ప్రజాదారణకల నేతలు కూడా ఆ పార్టీలో ఉన్నారని, అటువంటి వారు తెదేపాలోకి రాదలిస్తే మనం వారిని స్వాగతిద్దాము” అని అన్నారు.   వైజాగ్ నుండి మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు తెదేపాలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ గంటా రాకను తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అదేవిధంగా తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి తెదేపాలోకి రావడాన్ని పరిటాల వర్గం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. తోట శ్రీరాములు, వంగా గీత తదితరలు కూడా తెదేపాలోకి వచ్చేఆలోచనలో ఉన్నారు. నెల్లూరు నుండి కాంగ్రెస్ శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, సర్వేపల్లి నుండి అడ్డాల ప్రభాకర్ రెడ్డి తెదేపాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకా అనేకమంది కాంగ్రెస్ శాసనసభ్యులు, కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్న గల్లా జయదేవ్ వంటివారు అనేకమంది తెదేపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే వారి రాకవల్ల పార్టీలో అలజడి లేవకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఎవరయినా ఇతర పార్టీల నేతలను తెదేపాలోకి చేర్చుకొనే ముందు స్థానిక తెదేపా నేతల, కార్యకర్తలని సంప్రదించి, తప్పనిసరిగా వారి అభిప్రాయలు పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే కొత్తవారిని చేర్చుకొంటామని ఆయన చెపుతున్నారు. వారిమాట కాదని బలవంతంగా కొత్తవారిని తెచ్చివారి నెత్తిన పెట్టబోమని కూడా ఆయన హామీ ఇచ్చారు.   ఒకేసారి బయట నుండి అనేకమందిని పార్టీలోకి ఆహ్వానిస్తే, చిరకాలంగా పార్టీని అంటిపెట్టుకొని సేవ చేస్తు టికెట్స్ఆశిస్తున్నవారు ఆందోళన చెందడం సహజం, అందువల్ల చంద్రబాబు నాయుడు, కొత్తావారిని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నపటికీ, చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగయినా పార్టీ గెలవడం అత్యవసరమయినప్పటికీ, ఆ తొందరలో ఎవరినిపడితేవారి నమ్మిఅవకాశావాదులకు టికెట్స్ ఇస్తే, ఎన్నికలలో గెలిచిన తరువాత వారు పార్టీని మోసం చేసి వేరే పార్టీలలోకి మారిపోయే ప్రమాదం ఉంది.   కొన్ని నెలల క్రితం దాదాపు 11మంది తెదేపా శాసనసభ్యులు ఒకేసారి వైకాపాలోకి చేరడం, వారిపై స్పీకర్ ని అనర్హత వేటు వేయమని పిర్యాదు చేయవలసిరావడం వంటి అంశాలను మరిచిపోకూడదని తెదేపా కార్యకర్తలు కోరుతున్నారు. కొత్త నీరు అంతా మంచిది. పాతనీరు పనికి రాదని బయటపారబోసుకోవడం మంచిది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు వారి సలహాలను పాటిస్తారో లేదో, వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారో లేదో క్రమంగా తేలుతుంది.

ఎంపీల..ఘీంకారాలు...ఏం సాధించాలని?

      ఆ పార్టీ అధ్యక్షురాలేమో రాష్ట్రాన్ని ముక్కలు చేసే విషయంలో మరో మాట లేదంటారు. ఆ పార్టీ ఎంపీలేమో ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వబోమంటారు. ఒకవైపు విభజన బిల్లు మీద చర్చ జరగాలంటారు. మరోవైపు ఆ బిల్లును రాష్ట్రపతి తిప్పి పంపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూంటారు. తాము రాజీనామా చేశామని అయితే స్పీకరు ఆమోదించకపోతే తామేం చేయగలమంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తారు. మిన్ను విరిగి మీదపడినా విభజనను ఆపి తీరుతామని నిబద్ధత ఒలకబోస్తారు. ఇవన్నీ చెప్పింది ఎవరి గురించో ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాంగ్రెస్‌ ఎంపీల గురించే. ఓ వైపు విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే వీరు మాత్రం తమ డాంబికాలతో జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. తాజాగా ఆదివారం వీరిలో ఓ 5గురు ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు. తమ వాదన వినిపించారు. వీరి వాదనను ప్రణబ్‌ సావధానంగా విన్నారని, రాజ్యంగప్రకారం విభజన అనే విషయంలో సానుకూలంగా స్పందించారని వీరు బయటకు వచ్చి మీడియాతో చెప్పారు. అయితే కొంతకాలంగా ఈ కాంగ్రెస్‌ ఎంపీల ప్రకటనల్లోని డొల్లతనాన్ని అర్థం చేసుకుంటున్నారు కనుక జనం ఏమీ నమ్మలేదనుకోండి. తొలిసారి డిసెంబరు 9న విభజన ప్రకటన వెలువడిన దగ్గర్నుంచి పరిశీలిస్తే గత 3 సంవత్సరాలుగా తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడడంలో సీమాంధ్ర ప్రజల ఆకాంక్షల ప్రకారం నడుచుకోవడంలో వీరు విఫలమైన సంగతి స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రాంత నేతలు ఒకటే మాట మీద ఉండి తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే ఊరుకోమని, పార్టీ మారడం తధ్యమని అధినేత్రిని పదునైన పదజాలంతో, చేష్టలతో హెచ్చరిస్తుంటే... వీరు మాత్రం స్వంత వ్యాపారాల్లో, లాబీయింగుల్లో, లాలూచీల్లో తలమునకలైపోయి తెలంగాణ విషయం మీడియా ప్రస్తావించినప్పుడల్లా ‘అధిష్టానం ఎలా చెబితే అలా ఓకె’ అంటూ పరోక్ష అంగీకారాన్ని చెబుతూ వచ్చారు. అదే విధంగా సీమాంధ్రలో జగన్‌ తమ పార్టీని చీలుస్తున్నా...చీల్చి చెండాడుతున్నా పట్టించుకోకుండా జగన్‌పార్టీ ఎదుగుదలకు మూగసాక్షులుగా నిలిచారు. అవినీతి కేసుల మీద జైలుపాలైన వ్యక్తిని విమర్శించడం మాని పరోక్ష మధ్ధతు తెలియజేస్తూ... చేజేతులా తమ పార్టీ నాశనాన్ని కొనితెచ్చుకున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన అధిష్టానం... ఎన్నికలవేళ ఎలాగోలా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మరో దారి లేక విభజనకు పచ్చజెండా ఊపేసింది.     సరే... ఇంతవరకూ జరిగిందేదో జరిగింది. విభజన నిర్ణయం తర్వాతైనా సరిగా స్పందించారా అంటే అదీ లేదు. నిర్ణయం జరిగిన కొన్ని రోజుల తర్వాత అది కూడా ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగసిన తర్వాత... హడావిడిగా ప్రెస్‌మీట్లు పెడుతూ... తొలుత ఇది జస్ట్‌ కేవలం ప్రకటనే కదా అన్నారు. ఆ తర్వాత సీడబ్యూసీ తీర్మానమే కదా అన్నారు... ఆ తర్వాత బిల్లు రాష్ట్రపతికి వెళ్లాలికదా అన్నారు. ఆనక అసెంబ్లీకి రావాలి కదా... ఇప్పుడేమో తిరిగి రాష్ట్రపతి ఆమోదం పొందాలి కదా..... అంటూ జనాల్ని వెర్రివెంగళప్పలు చేద్దామనే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు. పైగా ఇదంతా అయ్యాక అప్పుడు వచ్చి ఉద్యమిస్తారట. (ఇది అంటోంది కూడా అందరూ కాదు కొందరే) అయినా తమ పార్టీ రాజకీయం కోసమే ఈ విభజనకు పాల్పడిరదంటున్న నేతలు అధినేత్రిని పల్లెత్తుమాట అనకపోవడంలోని అంతర్యం ఏమిటి? అనైతికంగా ఓట్లు  సీట్లు తెచ్చుకోవడం, లాలూచీ పడడం ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్న వైనాన్ని పూర్తిగా బయటపెట్టడానికి జంకు దేనికి?     కొద్దో గొప్పో వీరు చెప్పుకోగలుగుతున్నది అవిశ్వాసతీర్మానం గురించి మాత్రమే. అయినా స్వంత పార్టీ మీద అవిశ్వాసం పెట్టినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని ఎవరూ ఆశించలేదు. ఇక ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఎం.పీ సబ్బం హరి ఏమంటారంటే...‘‘మూడేళ్ల క్రితం అయితే విభజన సాఫీగా జరిగిపోయేదే’’నని. మరో ఎం.పి ఉండవల్లి ఏమంటారంటే... కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం వల్ల తమకు రాజకీయభవిష్యత్తు లేకుండా పోయిందని... ఈ మాటలు వింటుంటే... వీరు విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఉందా? లేకపోతే తమకు రాజకీయంగా నష్టం కాబట్టి తప్పదు కాబట్టి మాట్లాడుతున్నట్టు ఉందా? ఒకవైపు ఆమ్‌ఆద్మీ లాంటి పార్టీలను గెలిపిస్తూ... దేశవ్యాప్తంగా జనం తమ తెలివిడిని తాము నిరూపించుకుంటున్నా.... మన రాష్ట్రంలోని రాజకీయనేతలు మాత్రం ఇంకా జనం చెవుల్లో పూలు పెట్టగలమనే ధీమాతోనే ఉండడం నిజంగా... వారి అజ్ఞానానికి నిదర్శనం.