నైతిక విలువలా? అంటే ఏంటి తలసానీ?

  తెలంగాణా కోసం ఉద్యమించిన తెరాస నేతలకు, ఉద్యమకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీలో నుండి బయటకు వచ్చి తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులకు మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టారు. నిజానికి వారిరువురూ ఆ షరతు మీదే పార్టీ మారినట్లు వార్తలు వచ్చేయి. తెదేపా తరపున శాసనసభకు ఎంపికయిన తలసాని తదితరులు పార్టీ ఫిరాయించినందుకు వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా కోరడం, స్పీకర్ వారికి నోటీసులు జారీ చేయడం గురించి అందరికీ తెలిసిందే.   తెరాసలోకి మారి మంత్రిపదవి సంపాదించుకొన్న తలసాని యాదవ్ ఈ అనర్హత వేటు తప్పించుకొనేందుకు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. లేకుంటే ఆయనపై అనర్హత వేటు పడితే మంత్రి పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదీగాక ఆయన ఇప్పుడు తెదేపా శాసనసభ్యుడిగా కొనసాగే పరిస్థితి కూడా లేదు. కొనసాగితే ప్రతిపక్షాలకు, ముఖ్యంగా తెదేపా సందించే ప్రశ్నలకు, విమర్శలకు జవాబు చెప్పుకోవడం ఆయనకీ, ప్రభుత్వానికీ కూడా చాలా కష్టమవుతుంది. అందుకే ఆయన మంత్రి పదవి చేప్పట్టే ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. అయితే ఆయన దానికి ‘నైతిక విలువల’ రంగులద్దే ప్రయత్నం చేయడం అందరికీ నవ్వు కలిగిస్తుంది.   తను నైతిక విలువలకు కట్టుబడే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని ఆయన చెప్పుకొన్నారు. నైతిక విలువల గురించి తను వేరేవారి దగ్గరో పాటాలు నేర్చుకోనవసరం లేదని అన్నారు. మంత్రి పదవి కోసమే పార్టీ ఫిరాయించానని ఎవరేమనుకొన్నా తను పట్టించుకోనని అన్నారు. కానీ తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోనని ఒక హెచ్చరిక కూడా జారీ చేసారు. చంద్రబాబు కూడా నోరు అదుపులో ఉంచుకొంటే మంచిదని అన్నారు. ఆయన మంత్రి పదవి చేప్పట్టబోతున్నందుకు చాలా ఆనందంపడిన ఆయన తల్లిగారు, తనకు పెద్దకొడుకు వంటి చంద్రబాబు నాయుడికి తన కొడుకు దూరం కావడం తనకు చాలా బాధ కలిగిస్తోందని చెప్పడం గమనిస్తే తలసాని ఏమి కోల్పోయారో అర్ధమవుతుంది.   ఆయన మంత్రి పదవి కోసమే తను పార్టీ ఫిరాయించానని ఎవరేమనుకొన్నా తను పట్టించుకోనని చెప్పుకోవడం ద్వారా ఆ ఆరోపణలు నిజమని ఆయనే స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది. తనకు సమాజంలో ఈ హోదా, గౌరవం కలిగించిన పార్టీని మంత్రి పదవి కోసమే వీడినప్పుడే ఆయన నైతిక విలువలను తుంగలో తొక్కారు. అటువంటప్పుడు ఆయన నైతిక విలువలు కాపాడేందుకే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.   రాజకీయ నాయకులు పార్టీలు మారితే జానాలు ఆశ్చర్యపోయే రోజులు ఎప్పుడో పోయాయి. మారకపోతేనే వారు ఆశ్చర్యపోతుంటారు. అటువంటప్పుడు నైతిక విలువలను కాపాడేందుకే తన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని తలసాని చెప్పుకోవడం కూడా అనవసరం. ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థలో నేతలు తమను తాము సమర్దించుకొనేందుకు అవసరమయిన కొన్నిమూస పద్దతులు, కొన్ని నిశ్చితమయిన వాదనలు, వాటికి అవసరమయిన పడికట్టు పదాలు అన్నీ సిద్దంగా ఉన్నాయి. కనుక నేతలందరూ ఇటువంటి సందర్భాలలో వాటి నుండి తమకు అవసరమయిన పాయింట్లు, పద్దతులు, పదాలు ఏరుకొని మీడియా ముందుకు వచ్చి తదనుగుణంగా చిలకల్లా వల్లె వేస్తుంటారు. ఆ మూస పద్దతులను, పడికట్టు పదాలను ఉపయోగించడం వలన పెద్దగా విమర్శల బారిన పడకుండా తప్పించుకోగలుగుతున్నారు.   తలసాని కూడా అటువంటిదే ‘నా హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకోనేందుకే పార్టీ మారానని’ పద్ధతి ప్రకారం బాగానే చెప్పినప్పటికీ ఈ ‘నైతిక విలువల’ సంగతి ఎత్తడం వల్ల ఇంత ఆలోచించవలసి వచ్చింది. లేకుంటే ఆయనని కూడా నలుగురితో నారాయణ అనేసి ఊరుకొనేవారు.

వందల కోట్ల ఆస్తులు జప్తయినా చలించని ఏకైక ధీరుడు?

  ఇదివరకు ప్రభుత్వం ఇచ్చే రెండు వందల రూపాయల పెన్షన్ కోసం అనేక వేల మంది వృదులు కాళ్ళరిగిపోయేలా తిరిగడం మనకి తెలుసు. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు వచ్చిన తరువాత ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ కి అర్హుల జాబితాలో పేరు లేకపోవడంతో కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకొంటున్నవారు, గుండెపోటుతో చనిపోతున్న వారి గురించి కూడా మనకి తెలుసు. నీళ్ళు లేక కళ్ళ ముందు పంటలు ఎండిపోతుంటే, వాటి కోసం చేసిన అప్పులు తలుచుకొని అదే పొలాలలో పురుగుల మందులు త్రాగి ప్రాణాలు తీసుకొంటున్నవారి గురించి మనకి తెలుసు. వారు చనిపోయాక, వారి భార్యా పిల్లలను అప్పులిచ్చినవారు వేధిస్తుంటే పాపం ఆ తల్లీ పిల్లాలూ కూడా ఏ బావిలోనో దూకి ఆత్మహత్యలు చేసుకోవడం గురించి వార్తలు వింటున్నాము. ఇవన్నీ వింటున్నప్పుడు ఎవరికయినా మనసు ఉసూరుమనక మానదు. కేవలం వెయ్యి రూపాయల కోసం ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు అంటే వారికి ఆ చిన్న మొత్తం ఎంత అమూల్యమయిందో అర్ధమవుతుంది.   కానీ ప్రతీ రెండు మూడు నెలలకీ ఒకసారి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి చెందిన కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేస్తున్నా ఆయనకు చీమ కుట్టినట్లు లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ప్రత్యర్ధులు అతని వద్ద లక్షల కోట్ల ఆస్తులు పడున్నాయని ఆరోపిస్తే ఆయన వారి ఆరోపణలకు ఏనాడు నేరుగా జవాబు చెప్పే ప్రయత్నం చేయరు. కానీ వారందరూ కలిసి అమాయకుడయినా తనపై లేనిపోని తప్పుడు కేసులు పెట్టించారని ప్రత్యారోపణలు చేస్తారు. లేకుంటే ఫలానా ఫలానా వాళ్ళ మీద ఆనాడు కోర్టులో కేసులు వేస్తే స్టే తెచ్చుకోలేదా అని వితండవాదం చేస్తారు తప్ప ప్రత్యర్ధులు చేస్తున్న ‘ఆ లక్షల కోట్ల’ ఆస్తుల ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడుతుంటారు.   అయితే ఆయన తన ఆస్తుల గురించి చెప్పుకొన్నా చెప్పుకోకపోయినా, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంతవరకు జగన్ మరియు అతని సహచర సంస్థలకు చెందిన జప్తు చేసిన ఆస్తుల విలువే రూ. 863 కోట్లుంది. ఈ రోజు తాజాగా మరో 47 కోట్ల విలువయిన ఆస్తులను జప్తు చేసింది. అంటే మొత్తం రూ.910 కోట్లు అన్నమాట. అయినప్పటికీ జగన్ కి చీమ కుట్టినట్లుగా అయినా ఉందో లేదో తెలియదు. వెయ్యి రూపాయల కోసం పాపం పేదవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొంటుంటే, ఏకంగా రూ. 910 కోట్లు పోయినా చలించకుండా జగన్మోహన్ రెడ్డి తన బిజినెస్సులు, ధర్నాలు నిరాహార దీక్షలు వగైరా అన్నీకార్యక్రమాలు ఏమీ జరగనట్లుగా యధావిధిగా చేసుకుపోతుండటం గమనిస్తే ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనని నమ్మక తప్పేలా లేదు.

రామోజీని కేసీఆర్ ఎందుకు పొగిడారంటే...

  అనవసరంగా ఎవర్నీ పొగడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నీమధ్య మీడియా మొఘల్, ఫిలింసిటీ రూపకర్త, ముఖ్యంగా ‘ఆంధ్రోడు’ అయిన రామోజీరావును భారీ స్థాయిలో పొగిడారు. తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా రామోజీ ఫిలింసిటీలో ఐదు గంటలపాటు గడిపి ఫిలింసిటీని, త్వరలో నిర్మించబోయే ‘ఓం’ నగరాన్ని, రామోజీని పొగడ్తల వర్షంలో ముంచేశారు. కేసీఆర్ నోటి వెంట ఆంధ్రులను తిట్టడమే విన్నవారికి ఇది ఒక పిడుగులాంటి పరిణామం. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ‘‘లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలింసిటీని దున్నుతాం’’ అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడిలా రామోజీని లక్ష పొగడ్తలతో ముంచేయడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని బిత్తరపోయేలా చేసింది. జనానికి షాకులివ్వడం కేసీఆర్‌కి కొత్త కాదు. అయితే ఇంత పెద్ద షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. ఆ షాక్ నుంచి జనం తేరుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం వుంది. ఊరికే పొగడరు మహానుభావులన్నట్టుగా రామోజీని కేసీఆర్ ఈ రకంగా పొగడ్డం వెనుక వున్న అసలు కారణాన్ని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   దొరతనం పుష్కలంగా వున్న కేసీఆర్ మొదటి నుంచీ రామోజీరావుకు చెందిన సామాజికవర్గం అంటే విపరీతమైన మంట. రాష్ట్ర విభజనను ఆ సామాజికవర్గానికి చెందినవారే విపరీతంగా వ్యతిరేకించారన్న ఆగ్రహం ఆయనకి వుంది. అందుకే తన మాటల్లో, చేతల్లో ఆ కులం మీద తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ వుండేవారు. ఆ కులానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న అక్కసు కూడా ఆయన మాటల్లో ధ్వనిస్తూ వుండేది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు రామోజీరావు ఆహ్వానించకుండానే ఫిలిం సిటీకి వెళ్ళడానికి, పొగ్గడ్డానికి వెనుక వున్నది రాజకీయ కారణాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఉద్యమం చేస్తున్న సమయంలో ఆ సామాజికవర్గానికి చెందిన వారిని కేసీఆర్ ఎంత ఘాటుగా విమర్శించినా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు బలమైన ఆ సామాజికవర్గాన్ని తిట్టి ఉపయోగం లేదని కొంతమంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు కేసీఆర్‌కి ఉపదేశం చేసినట్టు సమాచారం. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, ఇప్పటికే చెందిన అభివృద్ధి ఆగిపోకుండా వుండాలంటే ఆ సామాజికవర్గంతో అనుబంధాన్ని పెంచుకోక తప్పదని వారు సూచించినట్టు తెలుస్తోంది.   వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రామోజీరావు మీద, ఫిలింసిటీ మీద, మార్గదర్శి మీద కక్షగట్టి వ్యవహరించారు. అది అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని రామోజీ కులస్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రామోజీ మీద చేస్తున్న దాడి తమ సామాజికవర్గం మీద చేస్తున్న దాడిగానే అందరూ భావించారు. దాంతో వారంతా క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారు. ఇప్పుడు వైఎస్సార్ చేసిన తప్పే మీరూ చేయడం ఎందుకని కేసీఆర్ సన్నిహితులు చెవిలో ఇల్లు కట్టుకుని బోధించినట్టు భోగట్టా.   తెలంగాణలో పెట్టుబడులు పెట్టినవారిలో, భారీ సంఖ్యలో పరిశ్రమలు నిర్వహిస్తున్నవారిలో ఆ కులానికి చెందిన వారే ఎక్కువమంది వున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వాళ్ళంతా మూటాముల్లె సర్దుకుని ఆంధ్రప్రదేశ్‌కి తరలి వెళ్ళిపోతే తెలంగాణకు తీరని నష్టం జరిగే ప్రమాదం వుంది. ఇప్పటికే ఆర్థిక కష్టాలు ప్రారంభమైన తెలంగాణకు అది మరొక పెద్ద కష్టం అయ్యే అవకాశం వుంది. అందుకే ఆ కులాన్ని మంచి చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. అందులో భాగమే రామోజీని పొగడ్డం, అదే సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇవ్వబోవడం అని విశ్లేషకులు అంటున్నారు.   ఇవాళో రేపో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖతోపాటు విద్యుత్ శాఖను కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇది కూడా కేసీఆర్ రాజకీయ వ్యూహంలో ఒక భాగమే. తెలంగాణ రాష్ట్రంలో విద్యుదుత్పాదన కంపెనీలు నిర్వహిస్తున్నవారు, బిల్డర్లు ఎక్కువమంది తుమ్మల సామాజికవర్గానికి చెందినవారే. ఆ రెండు రంగాలకూ తుమ్మలను మంత్రిగా చేయడం వల్ల తన సామాజికవర్గానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా తుమ్మల చేయగలరన్న నమ్మకంతోనే కేసీఆర్ ఆ రెండు శాఖలను తుమ్మలకు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల హోంశాఖ మంత్రి కావాలన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కేసీఆర్ ఆయనను ఈ రెండు శాఖలనే కేటాయించనున్నారని తెలుస్తోంది.   ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన సామాజికవర్గం టీఆర్ఎస్‌కి దూరమైపోయింది. కాంగ్రెస్ నాయకుడు జానా ఛార్మ్ కోల్పోవడంతో ఇప్పుడు అందరూ టీడీపీ నాయకుడు రేవంత్ వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ అని వాళ్ళు నమ్ముతున్నారు. రేవంత్ సామాజికవర్గానికి రామోజీ సామాజివర్గం వాళ్ళు కూడా కలిశారంటే అది రాజకీయంగా టీఆర్ఎస్‌కి పెద్ద నష్టం చేసే అవకాశం వుంది. దాంతో రేవంత్ కులం ఎలాగూ తనకు దూరమైపోయింది... ఇప్పుడు రామోజీ కులాన్నయినా దగ్గర చేసుకోవాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంచేత లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలింసిటీని కేసీఆర్ దున్నితే చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఇక ఆశలు వదులుకోవడం మంచింది.

విభజన బిల్లుకి సవరణలు సాధ్యమేనా?

  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం తనకు కంచుకోట వంటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రద్దలు కొట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు. అయితే వ్రతం చెడ్డా ఫలం కూడా దక్కలేదన్నట్లయింది దాని పరిస్థితి. అయితే అది చేసిన తప్పుకి నేడు ఆంద్ర, తెలంగాణా ప్రజలు, ప్రభుత్వాలు గొడవలుపడాల్సి వస్తోంది. రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత అవి క్రమంగా తగ్గకపోగా నానాటికీ మరింత పెరుగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఇక కేంద్రమో లేకపోతే సుప్రీంకోర్టో జోక్యం చేసుకొని ఈ సమస్యలను పరిష్కరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొన్ని గొడవలు సుప్రీంకోర్టుకు చేరుకోన్నాయి. బహుశః త్వరలో మరిన్ని పిటిషన్లు పడవచ్చును. అదేజరిగితే, ఇంతవరకు నిర్లిప్తంగా కూర్చోన్నందుకు సుప్రీంకోర్టు మొదట కేంద్రానికి మొట్టికాయలు వేసినా ఆశ్చర్యం లేదు. మరి ఆ భయంతోనో లేక ఈ సమస్యలను పరిష్కరించక తప్పని పరిస్థితులు ఏర్పడినందునో గానీ, కేంద్రం అవసరమయితే రాజ్యాంగాన్ని కానీ లేదా విభజన బిల్లును గానీ సవరించడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి యం. వెంకయ్యనాయుడు తెలిపారు.   కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో న్యాయ సలహాలు కోరిందని తెలిపారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ ని కూడా ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సహాయం అందించమని కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఈసారి ఇరు రాష్ట్రాల ప్రతినిధులను సంప్రదించి వారి సలహాలను, సూచనలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఆ ప్రకారమే రాజ్యాంగంలో కానీ విభజన బిల్లులో గానీ నియమ నిబంధనలు మార్చుతామని ఆయన తెలిపారు.   వాస్తవిక దృక్పధంతో చూస్తే వెంకయ్యనాయుడు పద్ధతి ద్వారా అన్ని సమస్యలను శాస్వితంగా పరిష్కరించే అవకాశం ఉంది. కానీ ప్రతీ విషయంలో తమ మాటే నెగ్గాలని, తమ వాదనే సరయినదని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నప్పుడు, బిల్లులో లేదా రాజ్యాంగంలో సవరణలు సాధ్యమేనా? అని ఆలోచిస్తే సాధ్యం కాదనే అనిపిస్తుంది. విభజన బిల్లును కదపడం అంటే తేనే తుట్టెను కదపడమేనని చెప్పవచ్చును. కానీ ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు కనుక ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవడమే మంచిదని చెప్పవచ్చును.

కొప్పులు పట్టుకొంటున్న తెరాస నేతలు

  ఎన్నికలలో టికెట్స్ కేటాయింపు, మంత్రివర్గ విస్తరణ ఏ రాజకీయపార్టీకయినా అగ్ని పరీక్షల వంటివే. వాటికి ముందు ఒక రకమయిన పరిస్థితి తరువాత పూర్తిగా విభిన్నమయిన పరిస్థితులు ఉంటాయి. ముందు పార్టీ అధిష్టానాల చుట్టూ ఆ పార్టీ నేతలు తిరిగితే, ఆ తరువాత పార్టీ అధిష్టానాలు అసమ్మతి రాగాలు ఆలపించే వారి చుట్టూ తిరగడం పరిపాటి. అందుకే ఈ రెండు పనులు కత్తి మీద సాము వంటివేనని చెప్పక తప్పదు. రేపు మంత్రి వర్గ విస్తరణకు పూనుకొన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.   ఆయనకు అత్యంత సన్నిహితుడు, విశ్వసనీయ అనుచరుడు అని పేరు పొందిన కొప్పుల ఈశ్వర్ కు మొదట్లోనే ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. ఆయన కరీం నగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుండి మూడు సార్లు యం.యల్యే.గా పోటీ చేసి గెలిచారు. కానీ కనీసం మంత్రి పదవి కూడా దక్కలేదు. కనీసం ఈసారయినా తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని ఆయన, ఆయన అనుచరులు కూడా ఆశించారు. కానీ ఈసారి కూడా వేరే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ఆయనకు మాత్రం చీఫ్ విప్ పదవి ఇవ్వజూపితే ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది.   ఆయన అనుచరులయితే అప్పుడే కరీంనగర్ జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు అంటూ వీరంగం అడేస్తున్నారు కూడా. మూడు సార్లు వరుసగా యం.యల్యే.గా గెలిచి, కేసీఆర్ ఆదేశానుసారం రెండు సార్లు తన యం.యల్యే. పదవికి రాజీనామాలు చేసిన తమ నాయకుడు కొప్పులకుమంత్రి పదవి ఈయకుండా నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి, మొట్టమొదటిసారిగా యం.యల్యే.గా ఎన్నికయిన వారికీ మంత్రిపదవులు ఇస్తున్నందుకు ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముందే తాము ధర్నాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని మీడియా ముఖంగానే వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారు. అది వారు చేస్తున్న హెచ్చరికలు కావు వారి ద్వారా కొప్పులే స్వయంగా చేస్తున్న హేచ్చారికలుగా భావించవలసి ఉంటుంది.   ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇంకా24 గంటలు సమయం ఉన్నందున ఈలోగా అటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు కొప్పుల వర్గీయులు తాము అనుకొన్నది సాధించేందుకు సామదానబేధ దండోపాయలన్నీ ప్రయోగించడం తధ్యం. ఒకవేళ ముఖ్యమంత్రి కొప్పులను వెనక్కి తగ్గేలా ఒప్పించగలిగితే, తాత్కాలికంగా మంటలు ఆర్పివేసినా లోలోన నిప్పు రాజుకొంటూనే ఉంటుంది.   ఒకవేళ కొప్పుల ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి మంత్రి పదవి దక్కించుకోగలగితే, ఆయన వలన వేరేవారి నోటికాడ కూడు లాకోన్నట్లవుతుంది కనుక అప్పుడు సదరు నేత ఇంతకంటే తీవ్ర స్థాయిలో అసమ్మతి రాగం ఆలపించే అవకాశం ఉంది. అయితే ఎవరు ఎన్ని కుప్పి గంతులు వేసినప్పటికీ ప్రస్తుతం అధికార పార్టీని వీడి బయటకు వెళ్ళే దుస్సాహసం ఎవరూ చేయబోరు కనుక ఈ అలకలు, అసమ్మతి రాగాలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టక తప్పదు. మన రాజకీయ పార్టీల చరిత్రలను తిరగేస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.

సమయం కాని సమయంలో వైకాపా ధర్నాలు

  ప్రతిపక్ష పార్టీ అన్నాక ఏదో ఒక హంగామా చేస్తూ ఉండక తప్పదు లేకుంటే ప్రజలు, ప్రభుత్వం కూడా పట్టించుకోవడం మానేస్తారు. ‘అసలు రాష్ట్రంలో ఆ పార్టీ ఉందా లేదా?’ అంటూ మీడియా కూడా వెనక నుండి గిల్లుతో ఉంటుంది. అదీగాక నిత్యం ఏదో ఒక హడావుడి చేయకపోతే పార్టీ నేతలు వారి అనుచరులు కూడా పక్క పార్టీల వైపు దిక్కులు చూడటం మొదలుపెడుతుంటారు. కనుక ఏదో ఒక సాకు దొరకబుచ్చుకొని ప్రతిపక్షాలు హడావుడి చేయక తప్పదు. కనుకనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటాయి, ప్రభుత్వాలు, ప్రజలు ఏమనుకొన్నా సరే.   ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా కూడా ఆ సూత్రమే పాటిస్తోందని చెప్పవచ్చును. ప్రభుత్వం తన హామీలను అమలుచేయకపోవడాన్ని నిరసిస్తూ మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, మహా ధర్నాలు నిర్వహించిన వైకాపాకు వైజాగ్ కాకుండా మరో ఒకట్రెండు జిల్లాలలో మాత్రమే స్పందన కనబడింది. వైజాగ్ లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ధర్నాకు కూర్చొన్నారు గనుక ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనసమీకరణ చేయడంతో అక్కడ జనాలు బాగానే కనబడ్డారు.   మళ్ళీ వచ్చే నెల 6, 7 తేదీలలో జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ధర్నాలు చేయబోతున్నారు. కారణం అదే. అయితే సార్వత్రిక ఎన్నికలలో ఆ జిల్లాలో వైకాపా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే ఆ జిల్లాలో పార్టీకి అంత పట్టులేదని అర్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి ఆ జిల్లాలో జగన్ ధర్నాకు కూర్చోన్నాక ధర్నా కార్యక్రమంలో జనాలు కనబడకపోతే చాలా అవమానకరం కనుక స్థానిక నేతలు మళ్ళీ జనసమీకరణ కోసం చెమటోడ్చక తప్పదు.   ఇక ధర్నా కోసం ఆయన ఎంచుకొన్న సమయం కూడా సరిగ్గాలేదని చెప్పవచ్చును. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత సంక్రాంతి పండుగకు సరిగ్గా వారం రోజుల ముందు ధర్నాకు కూర్చోవడం వలన ఆశించిన ఫలితం కనబడక పోవచ్చును. అదే అసెంబ్లీ సమావేశాలకు ముందు తనకు బాగా పట్టున్న ఏ కడపలోనో నెల్లూరులోనో ధర్నాలో, మహామహా ధర్నాలో విజయవంతంగా చేసుకొని ఉంటే, ఆ పేపర్ కటింగులు పట్టుకొనొచ్చి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశం ఉండేది. కానీ తనకు బొత్తిగా బలం లేని చోట ప్రజలందరూ పెద్ద పండగకి సిద్దమవుతున్న సమయంలో ధర్నాలు చేయడం తప్పు నిర్ణయమేనని భావించవచ్చును.

చంద్రబాబు మరో కొత్త ప్రయోగం, సరికొత్త రికార్డు

  దేశంలో మొట్ట మొదటి సారిగా కాగితం లేకుండా ఐ-ప్యాడ్ లతో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి గూగూల్ హాంగ్ అవుట్స్ ద్వారా ప్రజలతో మాట్లాడబోతున్నారు.   ఈనెల 20వ తేదీన సాయంత్రం ఆరు నుండి ఏడూ వరకు గంటసేపు సాగే ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారు. ఇందుకుగాను ఆసక్తిగలవారు ముందుగా తమ ప్రశ్నలను ఫేస్ బుక్, ట్వీటర్ లేదా గూగూల్ హ్యాంగ్ అవుట్స్ లలో #ఆస్క్ ఏపీ సియం లేదా #ఆస్క్ సిబియన్ (#AskAPCM or #AskCBN) లద్వారా అడగవచ్చును. ఈసారి నైపుణ్యాల అభివృద్ధి మరియు ఉన్నత విద్య అనే రెండు అంశాల మీద ప్రశ్నలు అడిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి సమాధానాలు రాబట్టుకావచ్చును. అయితే ఈ కార్యక్రమం కేవలం ఒక గంట సేపు మాత్రమే సాగుతుంది కనుక కేవలం 15మంది మాత్రమే ఆయనతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ ప్రశ్నలు పోస్ట్ చేసినవారందరితో ఆయన స్వయంగా మాట్లాడలేకపోయినా వారికి ఆయన సమాధానాలు వెళతాయి.   ఇప్పటికే దీని గురించి ఫేస్ బుక్, ట్వీటర్ గూగల్ , రాజకీయ వెబ్ సైట్లలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండు అంశాలపై ముఖ్యమంత్రిని ప్రశ్నించదలచిన వారు తక్షణమే తమ ప్రశ్నలను పోస్ట్ చేయవచ్చును.

యాదవ్ ఓ సీరియల్ రేపిస్ట్ టాక్సీ డ్రైవర్

  ఇటీవల డిల్లీలో ఉబెర్ క్యాబ్ సర్వీస్ (టాక్సీ సర్వీస్) కు చెందిన శివ కుమార్ యాదవ్ అనే టాక్సీ డ్రవర్ ఒక సాఫ్ట్ వేర్ సంస్థ ఉద్యోగిని ఇంటికి తీసుకువెళుతూ మార్గమద్యంలో కారులో ఆమెపై అత్యాచారం చేసిన తరువాత పోలీసులు అతనిని అరెస్ట్ చేసి లోపల వేశారు. ఆ తరువాత అతని భారిన పడిన మరికొంత మంది మహిళలు కూడా ముందుకు వచ్చి పిర్యాదులు చేయడంతో అతనొక పాత నేరస్తుడేననే విషయం బయటపడింది.   డిల్లీకి సమీపంలో గల రామ్ నగర్ అనే ఒక మురికివాడలో తన ఇంట్లోనే చిన్న పాన్ షాపు నడుపుకొనే 46 ఏళ్ల మహిళపై కూడా అతను కొన్నేళ్ళ క్రితం అత్యాచారం చేసాడు. ఒకే వీధిలో ఉంటున్నందున చనువుగా ఆమెను పిన్ని అని సంభోదిస్తుండేవాడు. కానీ ఒకరోజు ఆ పిన్నినే ఆమె ఇంట్లోనే చెరిచాడు. అయితే నలుగురికి తెలిస్తే తలవంపులని ఆమె భర్త ఈ విషయాన్నీ ఎవరికీ తెలియనీయలేదు. కానీ ఎలాగో అందరికీ తెలిసిపోయింది. అయితే అత్యాచారం చేసిన శివకుమార్ యాదవ్ ను జనాలు ఏమీ అనలేదు కానీ ఆమెను మాత్రం కాకుల్లా పొడుస్తూ చిత్ర హింసలు పెట్టారని ఆమె కన్నీళ్ళు పెట్టుకొంది. ఆ తరువాత 2003లో అతను అదే వీధిలోగల మరొక యువతిని కూడా చెరిచాడు. అయితే ఆమెకు కూడా వీధిలో జనాల నుండి అటువంటి చేదు అనుభవాలే ఎదురవడంతో ఆమె చేసేదేమీ లేక ఆ వీధిని విడిచి ఎక్కడికో వెళ్లిపోయింది.   ఆ తరువాత 2011లో గుర్ గావ్ లో ఒక బార్ డ్యాన్సర్ ని కూడా శివకుమార్ రేప్ చేసాడు. అప్పుడు ఆమె పోలీసు కేసు పెడితే దాదాపు ఏడు నెలలు జైల్లో ఉన్నాడు. ఆ తరువాత ఆమెతో ఏదోవిధంగా కోర్టు బయట సెటిల్ మెంట్ చేసుకొని జైల్లో నుండి బయట పడ్డాడు. ఆ తరువాత అతను ఆగస్ట్ 2013లో రామ్ నగర్ సమీపంలో గల నాగ్లతార్ అనే ప్రాంతంలో నివసిస్తున్న ఒక 15ఏళ్ల బాలికను తుపాకీ చూపి అత్యాచారం చేసాడు. వెంటనే ఆమె తల్లి తండ్రులు పోలీసులకి పిర్యాదు చేయకుండా ఆమెకు పక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసేసి పంపించేసారు. ఆ తరువాత ఆమె భర్తకు ఆ సంగతి తెలిసినప్పుడు అతను పోలీస్ స్టేషన్ లో శివకుమార్ యాదవ్ పై భార్య చేత పిర్యాదు చేయించే ప్రయత్నం చేసాడు. కానీ పోలీసులు పిర్యాదు తీసుకొనేందుకు అంగీకరించలేదు.   ఇంతవరకు ఇంతమంది మహిళల జీవితాలతో చెలగాటమాడుకొన్నప్పటికీ అతనికి ఎటువంటి శిక్షపడకపోవడమే బహుశః అతనికి ఆ దైర్యం కలిగించి ఉండవచ్చును. ఈసారి కూడా తప్పించుకోవచ్చుననే ధీమాతోనే అతను సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం చేసి ఉంటాడు. నిర్భయ కేసు జరిగినప్పుడు దేశమంతా ముక్త కంటంతో ఖండించింది. అప్పుడు కేంద్రం చట్టంలో కొన్ని కటినమయిన మార్పులు చేసింది. ఆ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా నెలకొల్పింది. కానీ ఇంతవరకు ఆ కేసులో నిందితులకు ఎటువంటి శిక్షాపడలేదు. పైగా ప్రభుత్వ ఖర్చులతో జైలులో కులాసాగా గడుపుతున్నారు. వారిలో ఒకరు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొంటున్నాడని ఆ మధ్యన వార్తలు వచ్చేయి. బహుశః చట్టం యొక్క ఈ బలహీనతే ఇటువంటి నేరస్తులకు దైర్యం కల్పిస్తోంది.   కటినమయిన నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, ఆనాటి నుండే దేశంలో మహిళలు, బాలికలు చివరికి అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలపై ఇటువంటి మానవ మృగాలు అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. దానికి తోడు సమాజం కూడా భాదితురాలినే దోషిగా చూడటం వలన వారి మనోవేదన ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కారణంగా ఇటువంటి మానవ మృగాలు నేటికీ సమాజంలో విచ్చలవిడిగా తిరుగగలుగుతున్నాయి.   ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు కొలువయ్యి ఉంటారని పెద్దల మాట. అదే విధంగా కలకంటి కన్నీరు ఒలికిన చోట శాంతి ఉండదని మహాభారతం నిరూపిస్తోంది. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేరు ప్రజలు, ప్రభుత్వం, చట్టాలు కూడా. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో.. ఈ చట్టాలు ఆ మానవ మృగాలను ఎప్పటికి శిక్షించగలుగుతాయో...ఎవరికీ తెలియదు. కానీ అంతవరకు స్త్రీ జాతికి ఈ మనోవేదన అనుభవించక తప్పదు.

ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

  ఈనెల 18 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవబోతున్నందున దానికి రెండు రోజుల ముందుగా అంటే ఈనెల 16న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నిన్న ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే పంట రుణాల మాఫీ కార్యక్రమం మొదలుపెట్టింది కనుక ఆ అంశంపై ఇంతకాలం నానా రభస చేస్తూ దానిని అసెంబ్లీలో కూడా లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకొన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపాకు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే రాజధాని భూముల విషయం, సింగపూర్ సంస్థలతో ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును. రాజధాని భూముల సేకరణలో నేటికీ కొన్ని ఇబ్బందులున్నందున, దానినే అవకాశంగా మలుచుకొని వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేయవచ్చును.   సింగపూర్ సంస్థలతో చేసుకొన్న ఒప్పందం గురించి ఇప్పటికే ఆ పార్టీ రభస చేయడం గమనిస్తే, దానిపై వివాదం సృష్టించి ప్రజలలో లేనిపోని అనుమానాలు సృష్టించి అప్పుడు అసెంబ్లీలో కూడా ఆ అంశంపై రభస చేయాలని వైకాపా ఆలోచన కావచ్చును. అయితే పంట రుణాల మాఫీపై ఆ పార్టీ రభస చేస్తున్నప్పుడు కూడా దానిని చూసి చూడనట్లు ఊరుకొని చివరి నిమిషంలో రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటించి ఆపార్టీ గాలి తీసేసినట్లే, బహుశః ఈ విషయంలో కూడా చంద్రబాబు తన వ్యూహం సిద్దం చేసుకొని ఉండవచ్చును. అందుకే ప్రభుత్వం అంత నిబ్బరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏమయినప్పటికీ ప్రభుత్వం విద్యుత్, పంట రుణాల మాఫీ, పెన్షన్లు, రాజధాని నిర్మాణం వంటి అన్ని అంశాలలో చురుకుగా ముందుకు అడుగులు వేస్తోంది కనుక ఈసారి కూడా అసెంబ్లీలో ప్రతిపక్షంపై దానిదే పైచెయ్యి కావచ్చును.

రాజధాని డిజైనింగ్ వరకే ఒప్పందం: మంత్రి నారాయణ

    రాజధాని నిర్మాణం కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చురుకుగా అడుగులు వేస్తోంది. ఒక అత్యద్భుతమయిన అత్యాధునికమైన రాజధాని నిర్మించాలనే ఆలోచనతో నగరాల డిజైయినింగ్ చేయడంలో మంచి అనుభవం, నైపుణ్యం గల సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో మూడు రోజుల క్రితమే ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకొంది. వారు కూడా అంతే చురుకుగా స్పందిస్తూ వెంటనే పని మొదలుపెట్టేసారు. ఒప్పందం సంతకాలు చేసిన మరునాడే రాష్ట్ర రాజధాని సలహా కమిటీ సభ్యులతో సమావేశమయ్యి రాజధాని బృహత్ ప్రణాళిక రూపకల్పన కోసం తాము అవలంభించబోతున్న విధానాలను వివరించి, మూడు దశలలో మొత్తం 22 వారాలపాటు సాగే తమ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఆ మరునాడే అంటే నిన్న బుధవారం నాడు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణతో కలిసి సింగపూర్ నిపుణుల బృందం రాజధాని నిర్మించబోయే 200కిమీ పరిధిలో హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.   అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఏరియల్ సర్వేతో నిపుణుల బృందం చాలా సంతృప్తి చెందింది. దీనివలన రాజధాని నిర్మించబోయే ప్రాంతం, దానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాలు, విస్తారంగా ఉన్న ప్రకృతి వనరులు వంటివన్నీ పరిశీలించగలిగారు కనుక వారికి ఆ ప్రాంతంపై సమగ్ర అవగాహన ఏర్పడింది. త్వరలోనే ఈసారి రోడ్డు మార్గాన్న కూడా అన్ని ప్రాంతాలు పర్యటించి మరింత అవగాహన పెంచుకొన్న తరువాత రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు, డ్రాయింగుల పని మొదలుపెడతారు."   "వారు ఆరు నెలలలోగా ఈ పని మొత్తం పూర్తి చేయవలసి ఉంటుంది. ఈరాత్రికే వారు తమ కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వానికి అందజేసే అవకాశాలున్నాయి. వారు కృష్ణ నది మధ్యలో సహజ సిద్దంగా ఏర్పడిన భవానీ ద్వీపాన్ని చూసి చాలా ముచ్చటపడ్డారు. అటువంటి ద్వీపాలను తాము కృత్రిమంగా సృష్టిస్తుంటామని, కానీ ఆంద్రప్రదేశ్ రాజధాని పక్కనే అటువంటి సహజసిద్దమయిన అందమయిన ద్వీపం ఉండటం చాలా కలిసివచ్చేదిగా ఉందని వారు తెలిపారు,” అని మంత్రి చెప్పారు.   సింగపూర్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందంపై కూడా ప్రతిపక్షాలు వివాదం సృష్టించడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. “ప్రతిపక్షాలు చెపుతున్నట్లుగా ఆ రెండు సంస్థలు ప్రైవేట్ సంస్థలు కావు. ఆ రెండు సింగపూర్ ప్రభుత్వాధీనంలో నడుస్తున్న సంస్థలు. ఒక ప్రభుత్వ సంస్థ మరొక దేశ ప్రభుత్వ సంస్థలతో చేసుకొన్న ఒప్పందాన్ని కూడా తప్పు పట్టగలగడం, దానిపై అనవసర రాద్ధాంతం చేయడం మన ప్రతిపక్షాలకే చెల్లింది. ఆ ఒప్పందంలో దాచిపెట్టేందుకు ఏమీ లేదు. దానిలో ఎటువంటి రహస్యాలు, లొసుగులు లేవు. ఆ ఒప్పందం కేవలం రాజధాని నగరానికి బృహుత్ ప్రణాళికను, మాస్టర్ ప్లాన్ ఇవ్వడం వరకే పరిమితం. ఆ రెండు సంస్థలు రాజధాని నిర్మాణంలో కూడా పాలు పంచుకొంటాయా లేదా అనే విషయం సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తాము."   "ప్రస్తుతానికి వారి పని రాజధానికి డిజైన్, డ్రాయింగులు అందించడం వరకే పరిమితం. వచ్చే ఆరు నెలలలో వారు రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్దం చేసి ఇస్తారు. రాష్ట్రప్రభుత్వంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో వారు సమావేశామవుతూ, రాష్ట్ర అవసరాలను, రాష్ట్ర వనరులను బట్టి రాష్ట్రానికి అన్ని విధాల సరిపోయేవిధంగా రాజధానికి రూపకల్పన చేస్తారు,” అని మంత్రి తెలిపారు.

మరో ఇద్దరితో పవన్ కళ్యాణ్ కటీఫ్

  ‘పవర్‌స్టార్’ పవన్ కళ్యాణ్ తానే స్వయంగా అందర్నీ దూరం చేసుకుంటూ వుంటారా? లేక పవన్ కళ్యాణ్‌కే అందరూ దూరమైపోతూ వుంటారా? ఈ ప్రశ్న ‘‘విత్తు ముందా.. చెట్టు ముందా’’ అనే ప్రశ్నకంటే చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతికే రిస్కు చేయడం కంటే... అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమయిందో ఆ పాయింట్లోకి వెళ్తే మంచిది. పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లోనూ, వ్యక్తిగతంగానూ ఆయనకి ఎంతోమంది దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా దూరమయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), ‘జనసేన’ పార్టీకి సోలో ప్రతినిధిగా వున్న రాజు రవితేజ కూడా చేరారు. అరె... మొన్నటి వరకూ వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్‌కి జిగిరీ దోస్తుల్లా వున్నారే... ఇంతలోనే ఏమైందన్న సందేహం కలుగుతోంది కదూ?   ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్‌కి బాగా సన్నిహితమైన వ్యక్తుల్లో పీవీపీ కూడా ఒకరు. పీవీపీ అంటే సామాన్యమైన వ్యక్తేమీ కాదు... పెద్ద వ్యాపారవేత్త. సినిమా రంగంలో కూడా విజయాలు సాధించాడు. అలాంటి పీవీపీ పవన్ కళ్యాణ్‌తో సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో ఆయనకి చేరువయ్యారు. అలా పవన్‌కి, పీవీపికి మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహంతోనే ‘జనసేన’ పార్టీకి సంబంధించిన రెండు భారీ బహిరంగసభల్ని పీవీపీ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. అందుకు ప్రత్యుపకారంగానే గడచిన ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం టిక్కెట్‌ కోసం పీవీపీని పవన్ కళ్యాణ్ రికమండ్ చేశారు. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ మాట కాదనలేక పీవీపీకి పార్లమెంట్ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయితే ఆ టిక్కెట్ని ఆశించిన తెలుగుదేశం నాయకుడు కేశినేని నాని పట్టుపట్టడంతో చంద్రబాబు పీవీపీకి సారీ చెప్పేశారు. అయితే ఆ దశలో పవన్ కళ్యాణ్ పట్టుబట్టి తనకు టిక్కెట్ ఇప్పిస్తారని పీవీపీ ఆశించారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎక్కువ చొరవ చూపించకపోవడంతో విజయవాడ ఎంపీ కావాలన్న పీవీపీ కల కరిగిపోయింది.   తన కలను నిజం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా చొరవ చూపలేదని పీవీపీ మనసు కష్టపెట్టుకున్నారని తెలుస్తోంది. అందుకే విజయవాడలో భారీ షాపింగ్ మాల్‌ని నిర్మించిన పీవీపీ దాని ప్రారంభోత్సవానికి సచిన్ టెండూల్కర్ని ఆహ్వానించారు. అప్పటి వరకూ సన్నిహితంగా వున్న పవన్ కళ్యాణ్‌‌ని మాత్రం ఆహ్వానించలేదు. అక్కడితో ఆగని పీవీపీ జనసేన సభల కోసం తాను ఖర్చుపెట్టిన డబ్బుతోపాటు, సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేయాలని పవన్ కళ్యాణ్‌ని డిమాండ్ చేశారట. దాంతో పవన్ కళ్యాణ్ రెండు కోట్లు మినహా మిగతా డబ్బంతా తిరిగి ఇచ్చేశారట. ఆ రెండు కోట్లు త్వరలో సర్దుతానని చెప్పారట. ఇలా వీరిద్దరి స్నేహ సుమం వాడిపోయింది.   ఇక పవన్ కళ్యాణ్‌కి దూరమైన మరో మిత్రుడు రాజు రవితేజ. పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని పెట్టకముందు రాజు రవితేజ అంటే ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణే స్వయంగా రాజు రవితేజ తన పార్టీ వ్యవహారాలన్నీ చూస్తారని ప్రకటించడంతో రాజు రవితేజ సడెన్‌గా లైమ్ లైట్‌లోకి వచ్చారు. చాలాకాలంపాటు పవన్ కళ్యాణ్ అంటే రాజు రవితేజ, రాజు రవితేజ అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వీరిద్దరి మధ్య స్నేహ బంధం వెల్లివిరిసింది. అయితే ఆ తర్వాత ఏమైందోగానీ రాజు రవితేజని పార్టీ వ్యవహారాల నుంచి పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టడం ప్రారంభించారు. పార్టీకి సంబంధించి ఏదైనా చెప్పాలంటే తానే చెబుతానని తన పార్టీకి వేరే ప్రతినిధులెవరూ లేరని పవన్ వెల్లడించడంతో రాజు రవితేజ ఎంత వేగంగా లైమ్ లైట్లోకి వచ్చారో అంతే వేగంగా చీకట్లోకి వెళ్ళిపోయారు. ఇదీ జరిగింది. ఇక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌కి ఎవరెవరు చేరువవుతారో.. ఎవరెవరు దూరమవుతారో వేచి చూడాలి.

మోడీ మీద కేసీఆర్ పొగడ్తల వర్షం

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది చాలా పెద్ద మనసు.. ఎవర్నయినా తిట్టే విషయంలో ఎంత ధారాళంగా తిడతారో, పొగిడే విషయంలో కూడా అంత బాగా పొగుడుతారు. గతంలో తిట్టిన వారిని పొగిడే విషయంలో కూడా ఆయన ఎంతమాత్రం వెనుకడుగు వేయరని రాజకీయ పరిశీకులు అంటూ వుంటారు. నిన్న మొన్నటి వరకూ మోడీని మోడీ,.. గీడీ.. సన్నాసి అని తిట్టిన కేసీఆర్ ఇప్పుడు మోడీ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మొన్నామధ్య ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగినప్పుడు అందులో పాల్గొన్న కేసీఆర్ మోడీతో ఎంత సన్నిహితంగా మెలిగారో అందరం చూసి తరించాం. ఈ సందర్భంగా దిగిన గ్రూప్ ఫొటోలో కూడా మోడీ, కేసీఆర్ అతుక్కున్నట్టుగా నిలబడ్డారు. తెలియనివాళ్ళెవరైనా చూశారంటే, కేసీఆర్ - నరేంద్ర మోడీ ఇద్దరూ అతుక్కునిగానీ పుట్టారేమోనని అనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకోగానీ కేసీఆర్ ఈ మధ్య నరేంద్ర మోడీ మీద అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. రాష్ట్రంలో బీజేపీ వారితో కూడా చాలా మర్యాదగా వ్యవహరిస్తున్నారు. సర్లెండి.. కేసీఆర్ ఏమి చేసినా, ఎలా ప్రవర్తించినా అది బంగారు తెలంగాణ కోసమే అనుకోండీ.. అది వేరే సంగతి.   తాజాగా కేసీఆర్ గతంలో తిట్టిన నోటితోనే నరేంద్ర మోడీ మీద పొగడ్తల వర్షం కురిపించారు. ఈ శుభ సందర్భం మంగళవారం నాడు జరిగిన అఖిలపక్ష సమావేశం‌లో వచ్చింది. ఈ సమావేశం అలా ప్రారంభమైందో లేదో కేసీఆర్ ఇలా మోడీని పొగడ్డం మొదలుపెట్టారట. ఇటీవల తాను ప్రణాళికా సంఘానికి సంబంధించిన సమావేశానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు మోడీ పనితీరును చాలా బాగా గమనించానని, ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారని, మోడీ తన పనితీరుతో ప్రపంచ ఖ్యాతిని పొందుతున్నారని పొగిడారట. అక్కడితో ఆగారా.. లేదు.. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలకు మోడీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, మొత్తం 66 పథకాలకు నిధులు ఇచ్చే విషయంలో మోడీ ఎంతో చొరవ చూపి తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తున్నారని చెప్పారట. ఇలా మోడీ పొగడ్తల పరంపర నాన్‌స్టాప్‌గా ఓ పావుగంట సేపు కొనసాగిందట. మోడీ అంటే గిట్టని కొంతమంది సభ్యులు మమ్మల్ని పిల్చిన పనేంటో చెప్పండి సార్ అని అనేసరికి కేసీఆర్ పొగడ్తల ప్రపంచం నుంచి బయటపడ్డారట.

అందరినీ ఊరిస్తున్న తమిళనాడులో రాజకీయ శూన్యత

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆమె బెయిలు పొందినప్పటికీ ఆమెపై అనర్హత వేటు పడింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయిన డి.యం.కె.పార్టీ అధినేత కరుణానిధి (90) వయోభారంతో పార్టీని నడిపించలేక అవస్థలు పడుతుంటే, అతని ఇరువురు కుమారులు అళగిరి, మరియు స్టాలిన్ తండ్రి తరువాత పార్టీని స్వంతం చేసుకొనేందుకు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటుండటంతో ఆ పార్టీ కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది.   ఇదే అదునుగా రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆలోచనతో రాష్ట్ర పి.సి.సి.అధ్యక్షుడుగా ఉన్న వాసన్ కాంగ్రెస్ పార్టీని వీడి స్వంత కుంపటి పెట్టుకొన్నారు. తమిళ సినిమా రంగాన్ని శాసిస్తున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ ని తన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు గట్టిగానే చేసారు. కానీ అవీ ఫలించలేదు. రాష్ట్రంలో నెలకొన్న ఈ రాజకీయ అస్థిరతను చూసి రజనీకాంత్ కూడా రాజకీయాలలోకి ప్రవేశించాలని కొంచెం ఊగిసలాడారు. కానీ దైర్యం చేయలేకపోయారు.   అలాగే తమిళనాట విశేష ఆదరణ ఉన్న మరో హీరో విజయ్ కూడా రాజకీయపార్టీ పెట్టేందుకు ఊగిసలాడుతున్నారు. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది అభిమానులు, 350 అభిమాన సంఘాలు ఉన్నందున, వారి మద్దతుతో రాజకీయాలలో చాల తేలికగా రాణించవచ్చని భావించారు. అందుకు ఆయన అభిమానులు కూడా మద్దతు తెలిపారు. కానీ ఆయన తండ్రి మాత్రం గట్టిగా వ్యతిరేకించారు. సినీ రంగంలో పతాక స్థాయికి చేరి మంచి పేరు, డబ్బు, అభిమానుల ఆదరణ సంపాదించుకొంటున్న ఈ సమయంలో దానిని వీడి, రాజకీయాలలో ప్రవేశించడం అంటే ఆత్మహత్యతో సమానమని ఆయన గట్టిగా హెచ్చరించడంతో విజయ్ కూడా ఆ ఆలోచన విరమించుకొన్నారు.   అయితే రాజకీయాలలో చేరాలనే ఆ దురద మాత్రం వదిలించుకోలేక పోయారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలలో దేనిలోనూ చేరే అవకాశం, ఆలోచనా రెండూ లేవు కనుక ఆయన త్వరలో బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని తహతహలాడుతున్న బీజేపీ కూడా ఆయన వంటి మంచి ప్రజాధారణగల నేత వచ్చి చేరుతానంటే తప్పకుండా స్వాగతిస్తుంది. ఆయన కనుక చేరితే తమిళనాట నెలకొన్న ఈ రాజకీయ శూన్యతను బీజేపీ భర్తీ చేసేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేయవచ్చును. బీజేపీ కాక మరో నాలుగయిదు ప్రాంతీయ పార్టీలు కూడా రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.   అయితే జయలలితపై అనర్హత వేటు పడినప్పటికీ, ఆమె అధికారంలో లేనప్పటికీ, ప్రభుత్వాన్ని నడుపుతున్నది మాత్రం ఆమె వీర విధేయులే. పైగా అధికార అన్నాడియంకె ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది. మరోనాలుగున్నరేళ్ళ వరకు అసెంబ్లీకి ఎన్నికలు కూడా లేవు. కనుక ఆమె కూడా చాలా నిశ్చింతగానే కనిపిస్తున్నారు.

జగన్ కి ఆ వివరాలు ఎందుకు?

  రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆదాయం, ఖర్చులు, అప్పులు, ప్రణాళికేతర ఖర్చులు వంటి వివరాలు కోరుతూ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ వ్రాసారు. కేంద్రప్రభుత్వం తన ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారిక వెబ్ సైట్లో ఉంచుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ వివరాలన్నిటినీ ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో పెడుతున్నట్లయితే ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకొనే అవకాశం కలుగుతుందని సూచించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాలపై అర్ధవంతమయిన చర్చలు చేయాలనే ఉద్దేశ్యంతోనే తానీ వివరాలు కోరుతున్నానని, అందువల్ల అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా తను కోరిన వివరాలను తనకు అందజేయాలని ఆయన ముఖ్యమంత్రిని లేఖలో కోరారు.   అయితే దానికి ఆర్ధిక మంత్రి చాలా ఘాటుగా బదులిచ్చారు. అనేక ఆర్ధిక నేరాలలో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అటువంటి వివరాలు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. వీలయితే అతనే తన అక్రమాస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించి, తన అధికారిక వెబ్ సైట్లో కూడా ఆ వివరాలు పెడితే బాగుంటుందని సూచించారు. యనమల మంచి ధీటుగా, చాలా ఘాటుగానే జవాబు ఇచ్చారు.   అయితే జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక నేరాలలో నిందితుడిగా ఉన్నప్పటికీ ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత కనుక ఆ వివరాలు కోరే హక్కు అతనికి ఉంటుంది. ఒకవేళ ఆయనకు నిజంగా ఆ వివరాలు కావలసి ఉండి ఉంటే, ఆయన ముఖ్యమంత్రికి ఈ విధంగా లేఖ వ్రాసే బదులు, ఒక ప్రజా ప్రతినిధి హోదాలో లేదా క్యాబినెట్ ర్యాంక్ హోదా అనుభవిస్తున్న ఒక ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సంబంధిత అధికారులకు నేరుగా లేఖ వ్రాసి ఉండేవారు. అప్పుడు వారు ఆయన కోరిన వివరాలను అందజేయడానికి నిరాకరిస్తే అప్పుడు ఆయన ఆ సంగతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి ఉంటే, ఆయనను ఎవరూ అనుమానించే, విమర్శించే అవకాశం ఉండేది కాదని చెప్పవచ్చును.   కానీ ఆయన ఉద్దేశ్యం ఆ వివరాలు సేకరించడం కాదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇటువంటి సమాధానం ఏదో రాబట్టడమే కనుక ముఖ్యమంత్రికి లేఖ వ్రాసారు. ఆయన హించినట్లే ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఘాటుగా బదులిచ్చారు. కనుక ఇప్పుడు ప్రభుత్వం ఏదో దాస్తోందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేయవచ్చును.   కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా పాలనలో పూర్తి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు కనుకనే ఆయన క్రమంగా కాగితాలు, ఫైళ్ళ స్థానంలో కంప్యూటర్లను ప్రవేశపెడుతున్నారు. క్రిందటి సారి జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఎక్కడా కాగితం ఉపయోగించకుండా కంప్యూటర్లతోనే ఆయన సమావేశం నిర్వహించారు. ఆ కంప్యూటర్లలో నిక్షిప్తమయిన వివరాలు అన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ పద్దతిలో ఆన్ లైన్లో భద్రపరిచారు. ఒకవేళ పాలనలో లొసుగులు, అక్రమాలు జరుగుతున్నట్లయితే ఎవరూ కూడా ఈ విధంగా వివరాలను కంప్యూటర్లలో భద్రపరిచే సాహసం చేయరని జగన్ కూడా గుర్తించవలసి ఉంది. అతను నిజంగా సభలో అర్ధవంతమయిన చర్చల కోసమే ఆ వివరాలు కోరి ఉండి ఉంటే ప్రభుత్వం ఆ వివరాలను క్షణాలలో అతనికి అందజేయగలదు. కానీ అతను ప్రభుత్వంపై ఏదో రకంగా బురద జల్లే ఉద్దేశ్యంతోనే ఈవిధంగా లేఖ వ్రాసి ఉండవచ్చనే అభిప్రాయంతోనే బహుశః యనమల ఆ విధంగా సమాధానం ఇచ్చి ఉండవచ్చును. ఏమయినప్పటికీ అసెంబ్లీ సమావేశాలలో ఇది కూడా ఒక వివాదానికి దారి తీయవచ్చును. దీనిపై సభలో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య వాగ్వాదం జరగడం తధ్యం.

ఈ-టీవీ, సాక్షి ఛానళ్ళ ప్రసారాలపై కూడా వేటు?

  గత ఐదున్నర నెలలుగా తెలంగాణాలో ఆంధ్రజ్యోతి, టీవి-9 న్యూస్ ఛానళ్ళపై నిషేధం కొనసాగుతున్న సంగతి, దానిపై సుప్రీంకోర్టులో పిటిషను వేయడం గురించి అందరికీ తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా ఆంధ్రాకు చెందిన మరో రెండు న్యూస్ ఛానళ్ళు(ఈ-టీవి ఆంద్రప్రదేశ్ మరియు సాక్షి) కూడా ప్రసారం కావడం లేదని సికింద్రాబాద్ లోని మారేడ్ పల్లి, సైనిక్ పూరి, తార్నాక, హబ్సిగూడా మరియు ఉప్పల్ ప్రాంతాల ప్రజల నుండి పిర్యాదులు అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై ఎటువంటి నిషేధము లేదని గ్రేటర్ హైదరాబాద్ కేబిల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు యల్. హరి గౌడ్ తెలిపారు. జంట నగరాలలో దాదాపు 90శాతం కేబిల్ ప్రసారాలను నాలుగు కేబిల్ ఆపరేటింగ్ సంస్థలు నిర్వహిస్తున్నాయని, వారి మధ్య ఈ ప్రసారాల ద్వారా వచ్చే ఆదాయం పంచుకోవడంలో ఏమయినా సమస్యలు ఏర్పడినట్లయితే ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఆ కారణంగా యం.యస్.ఓ.లు సదరు న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకి ‘క్యారీయింగ్ ఫీజ్’ చెల్లించడంలో ఆలస్యం అవడం చేత తాత్కాలికంగా ఏవయినా చానల్స్ నిలిచిపోయి ఉండవచ్చు తప్ప కొత్తగా దేనిపైనా ఎటువంటి నిషేధం లేదని చెప్పారు. ఇంతవరకు నిలిపివేయబడిన టీవి-9 న్యూస్ ఛానల్ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో ప్రసారం అవుతున్నట్లు సమాచారం.

ఎర్ర పార్టీలకీ కులం స్టిక్కర్లు ..

  కడవంత గుమ్మడికాయ కూడా కత్తిపీటకు లోకువేనన్నట్లుగా ఏ రంగంలో ఎంత సుప్రసిద్దులయినప్పటికీ వారు కూడా వారి కులానికి, మతానికీ, ప్రాంతానికీ కట్టుబడి వ్యవహరించక తప్పదు. భారతదేశం రాజకీయాలలో కుల మతాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తాము 100 పర్సంట్ లౌకికవాద పార్టీలమని భుజాలు చరుచుకొనే కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఈ కులసమీకరణలు లేకుండా ఏ శుభకార్యం తలపెట్టవు అంటే అతిశయోక్తి కాదు. అందుకు కాంగ్రెసే కాదు ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు లెఫ్ట్ పార్టీలతో సహా. కులమతాల లెక్కలకు తాము అతీతులమని చెప్పుకొనే లెఫ్ట్ పార్టీలు, చివరికి మావోయిష్టులలో కూడా అప్పుడప్పుడు ఈ కులసమీకరణాలు సరి చూసుకోక తప్పడం లేదీరోజుల్లో. అందుకే జనాలు కూడా కులాల వారిగా కార్తీకమాసంలో వన(కుల) భోజనాలు ఏర్పాటు చేసుకోవడం అందరికీ తెలిసిందే.   ఒకప్పుడు అవి కేవలం విందు వినోద సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమయ్యి ఉండేవి. కానీ ప్రజలలో కుల చైతన్యంతో బాటు రాజకీయ చైతన్యం కూడా క్రమంగా పెరుగుతుండటంతో, ఈ వన (కుల)భోజనాలకి తమ ‘కులపోడు’ అయిన ఏ రాజకీయ నాయకుడినో తోలుకొని రావడం ఇప్పుడు ఆనవాయితీగా మారిపోయింది. ఆ విధంగా ఆ నేతతో పరిచయం చేసుకొని ఎప్పుడయినా అవసరపడితే తమ ఆ కులపోడి సహాయం పొందాలనే ఆలోచన నిర్వాహకులదయితే, కులపోళ్ళు ఓట్లు అంటే పెరట్లో కోళ్ళవంటివని నమ్మే సదరు నేతలు కూడా వారు పిలవగానే ఆ పేరంటానికి వచ్చి హాజరు వేయించుకొని, టోటల్ ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఓసారి లెక్క చూసుకొన్నాక, తాము కులపోళ్ళకి ఏవిధంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నదీ చెప్పుకొని, అవసరమయితే తమని సంప్రదించమని ఒక అభయహస్తం పడేసి, ఎన్నికల సమయంలో గుర్తుంచుకోమని ఒక విన్నపం చేసుకొని దర్జాగా వచ్చిన కారులోనే వెళ్ళిపోతారు. ఆవిధంగా వన(కుల) భోజనాలు పూర్తవుతుంటాయి.   ఇక విషయంలోకి వస్తే, ఈ వన(కుల) భోజనాలకి రమ్మనిపిలిస్తే రాము పొమ్మని చెప్పే సాహసం ఎవరూ చేయలేరు. చివరికి కులం, మతం పేరు చెపితే కళ్ళెర్ర జేసే ఎరెర్ర పార్టీ ఓళ్ళు కూడా కాదనలేని పరిస్థితి ఏర్పడింది. అలాగని వస్తే మీడియావాళ్ళు ఇలా కాకుల్లా పొడిచేసే ప్రమాదం ఉంటుంది. చట్టానికి ఎవరూ అతీతులు కానట్లే ఎవరూ కూడా కులానికి అతీతులు కారు గనుక ఎర్రనేతలు ఫోటోలు బ్యానర్లు కూడా వన(కుల) భోజనాలలో ప్రత్యక్షం అవుతున్నాయి. దైర్యం ఉన్నవాళ్ళు చడీ చప్పుడు చేయకుండా వెళ్లివచ్చేస్తున్నారు. లేకుంటే ఏదో ఊర్లోనో, రాష్ట్రంలోనో ఓ ఎర్ర మీటింగ్ పెట్టుకొని తప్పించుకొంటారు. అయినప్పటికీ నిర్వాహకులే కొంచెం చొరవ తీసేసుకొంటూ ‘ఈడూ మన కులపోడే’ అనే ఫోటో బ్యానర్లు పెట్టేసుకొని మమ అనిపించేస్తున్నారు.   ఇటువంటి సమస్యే సీపీయం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి టీ. వీరభద్రం, ఖమ్మం జిల్లా కార్యదర్శి పి. సుదర్శన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బి. హేమంత్ రావు, పార్టీ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వర రావు, సీపీఐ (యం.యల్.) న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నేత పోటు రంగ రావు, తదితరుల ఫోటోలున్న ఫ్లెక్సీ బ్యానర్లు ఇటీవల జిల్లాలో నిర్వహించిన వన(కుల) భోజనాల కార్యక్రమంలో దర్శనమిచ్చాయి. అయితే వాటిని ఖండిస్తే ఏమవుతుందో వారికీ తెలుసు కనుక తమ ఫోటోలు, బ్యానర్లు పెట్టుకొనంత మాత్రాన్న తమకి ఆ కుల ఫీలింగ్ అంత లేదని చెప్పుకొనేందుకు మిక్స్ డ్ విజిటేబిల్ కర్రీ లాగ అందరు కులపోళ్ళన్ని పోగేసి మళ్ళీ వారు ‘సమానత్వ భోజనాలు’ అనే కార్యక్రమాలు నిర్వహించ వలసివచ్చింది.   ఎన్నికలు వచ్చే వరకు ఈ కుల, మతాతీతం ట్యాగ్ కాపాడుకోవడం కోసం ఈ తిప్పలు తప్పవు. కానీ ఎన్నికలలో మాత్రం కంప్యూటరో లేకపోతే ఓ కాలిక్యులెటర్ పట్టుకొని మరీ పక్కగా కులసమీకరణాల లెక్కలు సరిచూసుకొన్న తరువాతనే సీట్ల కేటాయింపులు చేస్తారు. దానిని బట్టే జనాల ఓట్లు కూడా పడుతుంటాయి. ఏమి చేస్తాం కులానికి ఎవరూ అతీతులు కారాయె మరి!

ఇక అవి కూడా ఆంధ్రప్రదేశ్ లో భాగమే

  ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే ఏడు మండలాలను, ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను, కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఏడు మండలాల బదిలీ ప్రక్రియ ఈ మధ్యనే పూర్తయిందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణరావు తెలిపారు. ఆ మండలాలతో బాటు అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేయబడ్డారు. కనుక వారికి ఈ నెల నుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే జీతాలు చెల్లించబోతున్నట్లు ఆయన తెలిపారు. పరిపాలనా సౌలభ్యం మరియు భౌగోళిక స్థితిని బట్టి ఆ ఏడు మండలాలో కొన్నిటిని తూర్పు గోదావరి మరి కొన్నిటిని పశ్చిమ గోదావరి జిల్లాలలో విలీనం చేసారు. కనుక రాష్ట్ర పోలీస్ పరిధి కూడా ఆ మేరకు పెంచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.   అదేవిధంగా భద్రాచలం సమీపంలో ఆంద్ర సరిహద్దులో గల ఏటిపాక కేంద్రంగా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. రెండు జిల్లాలలో విస్తరించిన ఆ ఏడు మండలాలు దాని క్రిందకు వస్తాయి. ఈ పని పూర్తయిన తరువాత నుండి ఆ ఏడు మండలాలలో నివసిస్తున్న ఆదివాసీల పునరావాసానికి అవసరమయిన చర్యలు చెప్పట్టడం మొదలయ్యే అవకాశం ఉంది. కొత్తగా రాష్ట్రంలో విలీనమయిన ఈ మండలాలకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిని విస్తరించేందుకు అవసరమయిన మార్గదర్శకాలు, ఏర్పాటు మరొక వారం రోజుల్లో పూర్తవుతాయని ఆయన తెలిపారు.

మరో ఉద్యమమా... తమరికో దండం...

  ఆ పెద్దమనిషి ఒక ప్రభుత్వోద్యోగి. ఉద్యోగ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారన్న విషయం అలా వుంచితే, విప్లవం పేరు చెప్పి కుర్రాళ్ళని రెచ్చగొట్టడంలో, ఉద్యమం పేరుతో ప్రాంతీయ విభేదాలను పెంచడంలో ఆయనకు ఆయనే సాటి. ముగిసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్ర తక్కువేమీ కాదు. ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ ఆయన రోజుకు రెండు మూడుసార్లు తెలంగాణ యువతకు పిలుపునిచ్చేవారు. అయితే ఆయన పిలుపు పుణ్యమని అనలేముగానీ, అప్పట్లో తెలంగాణలో యువకుల ఆత్మహత్యలు మాత్రం బాగా పెరిగిపోయాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన టీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సహకారం కూడా అలాంటి ఇలాంటి సహకారం కాదు. టీఆర్ఎస్ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నిటినీ తెలంగాణ ప్రజలకు దూరం చేయడంలో ఆయన తనవంతు పాత్రని విజయవంతంగా పోషించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆ పార్టీకి అంత సేవ చేసి వుండరేమో... ఈయన గారు మాత్రం ఆ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈయనకి పెద్దపెద్ద పదవులు రావడం ఖాయమని అప్పట్లో చాలామంది గుసగుసలాడుకున్నారు. కొంతమంది బాహాటంగానే అన్నారు. అయినప్పటికీ ఈ సారు ఎంతమాత్రం వెనకడుగు వేయకుండా టీఆర్ఎస్‌కి అండగా నిలబడ్డారు.   ఉద్యమ ఫలితమో, ఆత్మహత్యల ప్రభావమో, రాజకీయ క్రీడలో భాగమోగానీ.. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. మంచో, చెడో ఒక చారిత్రక పరిణామం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఎవరి బతుకు వారు బతకాలని డిసైడైపోయింది. ఆరకంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ముగిసింది. అలా ఉద్యమం ముగిసిందో లేదో... ఇలా రాజకీయ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉద్యమంలో సదరు పెద్దమనిషి చిటికెన వేలు పట్టుకుని నడిచిన చాలామంది ఉద్యమకారులు ఎమ్మెల్యేలు అయిపోయారు. ఎంపీలు అయ్యారు. రకరకాల పదవులు పొందారు. అయితే సదరు పెద్దాయనని మాత్రం పలకరించినవాళ్ళెవరూ లేరు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించేవరకూ పెద్దాయనని ఎంతో గౌరవించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. తన శాయశక్తులా టీఆర్ఎస్ పార్టీ కోసం కృషి చేశా కదా.. తనకు కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందని, ఏదో ఒక మంచి పదవి తనకు దక్కుతుందని ఎదురుచూశారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోయేసరికి షాక్‌కి గురైన ఆయన గత కొంతకాలంగా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడిపోయారు. తనను ఎంతమాత్రం పట్టించుకోని కేసీఆర్ మీద బాహాటంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలని వున్నా, ఒకవేళ తాను నోరు జారితే ‘దారిలో వున్న’ పదవి కూడా రాకుండా పోతుందేమోనని ఓర్పు వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు దాటినప్పటికీ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు, గుర్తింపు రాకపోవడంతో ఆయన ఇప్పుడు గొంతు సవరించుకుని విమర్శల పరంపరను ప్రారంభించారు.   గత కొద్ది రోజులుగా సదరు పెద్దమనిషి కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ సాధించే పోరాటం అయిపోయిందని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సరిగా పనిచేసేలా చేసే పోరాటం చేయాల్సి వుందని పిలుపు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ తెలంగాణ మేధావులు, కేసీఆర్ వ్యతిరేక శక్తులు గుర్తుకు వచ్చారు. వాళ్ళందరూ తనకు అండగా వుంటే మరో పోరాటం చేపట్టాలని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వున్న ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని ఆయన బాధగా చెబుతున్నారు. ప్రభుత్వాన్ని సరిగా పనిచేసేలా ఉద్యమించబోతున్నానని ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన మీటింగులు ఏర్పాటు చేసే పనిలో వున్నారు. మొన్నటి వరకూ పదవి ఏదైనా వస్తుందేమోనని ఆశగా ఎదురుచూసిన ఆయన ఇక తనకు అలాంటి ఛాన్స్ లేదని స్పష్టంగా తెలిసిపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఉద్యమం కబుర్లు చెబుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆయనచెప్పినట్టుగా ఉద్యమాలు చేసే స్థితిలో లేరని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా విద్యార్థులతోపాటు తెలంగాణలోని ఎన్నో వర్గాలు నష్టపోయాయి. ఇప్పుడు కాస్తంత ప్రశాంతంగా ఉన్నాయి. మళ్ళీ ఉద్యమాలంటూ ఈ పెద్దమనిషి చేస్తున్న హడావిడిని ప్రజలు హర్షించరని అంటున్నారు. అందువల్ల తెలంగాణ ప్రజలు సదరు పెద్దమనిషి చేపట్టిన కొత్త ఉద్యమానికో దండం అంటున్నారని పరిశీకులకులు చెబుతున్నారు.

కేసీఆర్ అమెరికా పర్యటన ఎప్పుడో...ఎందుకో?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న హైదరాబాద్ లో గల అమెరికన్ కౌన్సిలేట్ కార్యాలయానికి వెళ్లి డిప్లోమేటిక్ వీసా కోసం అవసరమయిన ఫార్మాలిటీలు పూర్తి చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన కార్యాలయ అధికారులు ఇంతవరకు ఎన్నడూ కూడా ఆయన వీసా కోసం దరఖాస్తు చేయబోతున్నట్లు కానీ, అమెరికా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లుగానీ చెప్పలేదు. అందువల్ల కేసీఆర్ నిన్నవీసా కోసం దరఖాస్తు చేసి రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇటీవల సింగపూర్ వెళ్ళి వచ్చిన తరువాత ఆయన కొత్త పరిశ్రమల ఊసు ఎత్తలేదు గానీ, సింగపూర్ పర్యటన ప్రభావమో ఏమో తెలియదు గానీ హుస్సేన్ సాగర్ చుట్టూ వంద అంతస్తుల భవనాలు కట్టిస్తానని, ఇందిరా పార్క్ వద్ద ప్రపంచంలోకెల్లా ఎట్టయినా భవనం కట్టిస్తానని ప్రకటించేశారు. హైదరాబాద్ ఈ కొస నుండి ఆ కొసకి స్కై వేలు, ఎక్స్ ప్రెస్ హైవేలు కట్టించేసేందుకు ఫిక్స్ అయిపోయారు.   అయితే ఈసారి ఆయన అమెరికా ఎప్పుడు, ఎందుకు వెళతారో ఇంకా తెలియవలసి ఉంది. ఇప్పటికిప్పుడు కాక పోయినా వచ్చే ఏడాదిలోనయినా ఆయన అమెరికా వెళ్ళడం తధ్యంలా కనబడుతోంది. రాజకీయ నేతలకు ఇచ్చే ఈ వీసాకు గడువు పదేళ్ళు ఉంటుంది. కనుక అప్పటిలోగా ఎన్నిసార్లయినా అమెరికా వెళ్లి రావచ్చును.   బహుశః తన సింగపూర్ పర్యటన ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, తెలంగాణా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన అమెరికా వెళ్లి వారి ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకు రావాలని ఆశిస్తున్నారేమో? అందుకే అయితే అది మంచి ఆలోచనేనని చెప్పవచ్చును. కొన్ని పత్రికలలో ఆయన హెల్త్ చెకప్ కోసమే అమెరికా వెళ్ళాలనుకొంటున్నట్లు వార్తలు వచ్చేయి. కానీ దానికోసం ఆయన డిప్లోమేటిక్ వీసా తీసుకోనవసరం లేదు. అదేవిధంగా అమెరికాలో ఉన్న తన బంధుమిత్రులను కలిసి వచ్చేందుకు కూడా ఇటువంటి వీసా అవసరం లేదు. కనుక ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకే ఆయన అమెరికా వెళ్లాలని భావిస్తుండవచ్చును. కానీ ఎప్పుడు వెళతారనేది ఆయనే చెప్పాలి.   వచ్చే ఫిబ్రవరి నెలలో 2015-16 ఆర్ధిక సం.నికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టవలసి ఉంది కనుక, బహుశః ఆ పని పూర్తయిన తరువాత ఎప్పుడయినా ఆయన అమెరికా వెళతారేమో. కాకపోతే ఈసారి అమెరికా వెళ్లి వచ్చిన తరువాత అసలు పని పక్కనబెట్టి మరేదో తలకెత్తుకోకుంటే చాలు.