యాదవ్ ఓ సీరియల్ రేపిస్ట్ టాక్సీ డ్రైవర్
posted on Dec 12, 2014 @ 3:14PM
ఇటీవల డిల్లీలో ఉబెర్ క్యాబ్ సర్వీస్ (టాక్సీ సర్వీస్) కు చెందిన శివ కుమార్ యాదవ్ అనే టాక్సీ డ్రవర్ ఒక సాఫ్ట్ వేర్ సంస్థ ఉద్యోగిని ఇంటికి తీసుకువెళుతూ మార్గమద్యంలో కారులో ఆమెపై అత్యాచారం చేసిన తరువాత పోలీసులు అతనిని అరెస్ట్ చేసి లోపల వేశారు. ఆ తరువాత అతని భారిన పడిన మరికొంత మంది మహిళలు కూడా ముందుకు వచ్చి పిర్యాదులు చేయడంతో అతనొక పాత నేరస్తుడేననే విషయం బయటపడింది.
డిల్లీకి సమీపంలో గల రామ్ నగర్ అనే ఒక మురికివాడలో తన ఇంట్లోనే చిన్న పాన్ షాపు నడుపుకొనే 46 ఏళ్ల మహిళపై కూడా అతను కొన్నేళ్ళ క్రితం అత్యాచారం చేసాడు. ఒకే వీధిలో ఉంటున్నందున చనువుగా ఆమెను పిన్ని అని సంభోదిస్తుండేవాడు. కానీ ఒకరోజు ఆ పిన్నినే ఆమె ఇంట్లోనే చెరిచాడు. అయితే నలుగురికి తెలిస్తే తలవంపులని ఆమె భర్త ఈ విషయాన్నీ ఎవరికీ తెలియనీయలేదు. కానీ ఎలాగో అందరికీ తెలిసిపోయింది. అయితే అత్యాచారం చేసిన శివకుమార్ యాదవ్ ను జనాలు ఏమీ అనలేదు కానీ ఆమెను మాత్రం కాకుల్లా పొడుస్తూ చిత్ర హింసలు పెట్టారని ఆమె కన్నీళ్ళు పెట్టుకొంది. ఆ తరువాత 2003లో అతను అదే వీధిలోగల మరొక యువతిని కూడా చెరిచాడు. అయితే ఆమెకు కూడా వీధిలో జనాల నుండి అటువంటి చేదు అనుభవాలే ఎదురవడంతో ఆమె చేసేదేమీ లేక ఆ వీధిని విడిచి ఎక్కడికో వెళ్లిపోయింది.
ఆ తరువాత 2011లో గుర్ గావ్ లో ఒక బార్ డ్యాన్సర్ ని కూడా శివకుమార్ రేప్ చేసాడు. అప్పుడు ఆమె పోలీసు కేసు పెడితే దాదాపు ఏడు నెలలు జైల్లో ఉన్నాడు. ఆ తరువాత ఆమెతో ఏదోవిధంగా కోర్టు బయట సెటిల్ మెంట్ చేసుకొని జైల్లో నుండి బయట పడ్డాడు. ఆ తరువాత అతను ఆగస్ట్ 2013లో రామ్ నగర్ సమీపంలో గల నాగ్లతార్ అనే ప్రాంతంలో నివసిస్తున్న ఒక 15ఏళ్ల బాలికను తుపాకీ చూపి అత్యాచారం చేసాడు. వెంటనే ఆమె తల్లి తండ్రులు పోలీసులకి పిర్యాదు చేయకుండా ఆమెకు పక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేసేసి పంపించేసారు. ఆ తరువాత ఆమె భర్తకు ఆ సంగతి తెలిసినప్పుడు అతను పోలీస్ స్టేషన్ లో శివకుమార్ యాదవ్ పై భార్య చేత పిర్యాదు చేయించే ప్రయత్నం చేసాడు. కానీ పోలీసులు పిర్యాదు తీసుకొనేందుకు అంగీకరించలేదు.
ఇంతవరకు ఇంతమంది మహిళల జీవితాలతో చెలగాటమాడుకొన్నప్పటికీ అతనికి ఎటువంటి శిక్షపడకపోవడమే బహుశః అతనికి ఆ దైర్యం కలిగించి ఉండవచ్చును. ఈసారి కూడా తప్పించుకోవచ్చుననే ధీమాతోనే అతను సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం చేసి ఉంటాడు. నిర్భయ కేసు జరిగినప్పుడు దేశమంతా ముక్త కంటంతో ఖండించింది. అప్పుడు కేంద్రం చట్టంలో కొన్ని కటినమయిన మార్పులు చేసింది. ఆ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా నెలకొల్పింది. కానీ ఇంతవరకు ఆ కేసులో నిందితులకు ఎటువంటి శిక్షాపడలేదు. పైగా ప్రభుత్వ ఖర్చులతో జైలులో కులాసాగా గడుపుతున్నారు. వారిలో ఒకరు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకొంటున్నాడని ఆ మధ్యన వార్తలు వచ్చేయి. బహుశః చట్టం యొక్క ఈ బలహీనతే ఇటువంటి నేరస్తులకు దైర్యం కల్పిస్తోంది.
కటినమయిన నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ, ఆనాటి నుండే దేశంలో మహిళలు, బాలికలు చివరికి అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లలపై ఇటువంటి మానవ మృగాలు అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. దానికి తోడు సమాజం కూడా భాదితురాలినే దోషిగా చూడటం వలన వారి మనోవేదన ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కారణంగా ఇటువంటి మానవ మృగాలు నేటికీ సమాజంలో విచ్చలవిడిగా తిరుగగలుగుతున్నాయి.
ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు కొలువయ్యి ఉంటారని పెద్దల మాట. అదే విధంగా కలకంటి కన్నీరు ఒలికిన చోట శాంతి ఉండదని మహాభారతం నిరూపిస్తోంది. అయినప్పటికీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేరు ప్రజలు, ప్రభుత్వం, చట్టాలు కూడా. ఈ సమాజం ఎప్పుడు మారుతుందో.. ఈ చట్టాలు ఆ మానవ మృగాలను ఎప్పటికి శిక్షించగలుగుతాయో...ఎవరికీ తెలియదు. కానీ అంతవరకు స్త్రీ జాతికి ఈ మనోవేదన అనుభవించక తప్పదు.