కేసీఆర్ అమెరికా పర్యటన ఎప్పుడో...ఎందుకో?
posted on Dec 5, 2014 @ 5:44PM
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న హైదరాబాద్ లో గల అమెరికన్ కౌన్సిలేట్ కార్యాలయానికి వెళ్లి డిప్లోమేటిక్ వీసా కోసం అవసరమయిన ఫార్మాలిటీలు పూర్తి చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన కార్యాలయ అధికారులు ఇంతవరకు ఎన్నడూ కూడా ఆయన వీసా కోసం దరఖాస్తు చేయబోతున్నట్లు కానీ, అమెరికా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లుగానీ చెప్పలేదు. అందువల్ల కేసీఆర్ నిన్నవీసా కోసం దరఖాస్తు చేసి రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇటీవల సింగపూర్ వెళ్ళి వచ్చిన తరువాత ఆయన కొత్త పరిశ్రమల ఊసు ఎత్తలేదు గానీ, సింగపూర్ పర్యటన ప్రభావమో ఏమో తెలియదు గానీ హుస్సేన్ సాగర్ చుట్టూ వంద అంతస్తుల భవనాలు కట్టిస్తానని, ఇందిరా పార్క్ వద్ద ప్రపంచంలోకెల్లా ఎట్టయినా భవనం కట్టిస్తానని ప్రకటించేశారు. హైదరాబాద్ ఈ కొస నుండి ఆ కొసకి స్కై వేలు, ఎక్స్ ప్రెస్ హైవేలు కట్టించేసేందుకు ఫిక్స్ అయిపోయారు.
అయితే ఈసారి ఆయన అమెరికా ఎప్పుడు, ఎందుకు వెళతారో ఇంకా తెలియవలసి ఉంది. ఇప్పటికిప్పుడు కాక పోయినా వచ్చే ఏడాదిలోనయినా ఆయన అమెరికా వెళ్ళడం తధ్యంలా కనబడుతోంది. రాజకీయ నేతలకు ఇచ్చే ఈ వీసాకు గడువు పదేళ్ళు ఉంటుంది. కనుక అప్పటిలోగా ఎన్నిసార్లయినా అమెరికా వెళ్లి రావచ్చును.
బహుశః తన సింగపూర్ పర్యటన ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, తెలంగాణా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన అమెరికా వెళ్లి వారి ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకు రావాలని ఆశిస్తున్నారేమో? అందుకే అయితే అది మంచి ఆలోచనేనని చెప్పవచ్చును. కొన్ని పత్రికలలో ఆయన హెల్త్ చెకప్ కోసమే అమెరికా వెళ్ళాలనుకొంటున్నట్లు వార్తలు వచ్చేయి. కానీ దానికోసం ఆయన డిప్లోమేటిక్ వీసా తీసుకోనవసరం లేదు. అదేవిధంగా అమెరికాలో ఉన్న తన బంధుమిత్రులను కలిసి వచ్చేందుకు కూడా ఇటువంటి వీసా అవసరం లేదు. కనుక ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకే ఆయన అమెరికా వెళ్లాలని భావిస్తుండవచ్చును. కానీ ఎప్పుడు వెళతారనేది ఆయనే చెప్పాలి.
వచ్చే ఫిబ్రవరి నెలలో 2015-16 ఆర్ధిక సం.నికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టవలసి ఉంది కనుక, బహుశః ఆ పని పూర్తయిన తరువాత ఎప్పుడయినా ఆయన అమెరికా వెళతారేమో. కాకపోతే ఈసారి అమెరికా వెళ్లి వచ్చిన తరువాత అసలు పని పక్కనబెట్టి మరేదో తలకెత్తుకోకుంటే చాలు.