ఆంధ్రా నుండి విద్యుత్ కొనుగోలుకు కేసీఆర్ కి అహం అడ్డువస్తోందా? లోకేష్

  తెలంగాణా రాష్ట్రం నేటికీ విద్యుత్ కొరతతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలో రామగుండం, నల్గొండ తదితర ప్రాంతాలలో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల స్థాపనకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అది ఇంటికి నిప్పు అంటుకొన్నాక నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లేనని భావించవచ్చును. అందుకే రైతులను మరో మూడేళ్ళు ఆగమని చెపుతున్నారాయన.   తెలంగాణా ప్రభుత్వం వివిధ రాష్ట్రాలతో విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంది. కానీ పొరుగునున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ తీసుకొనే ఆలోచన మాత్రం చేయలేదు. తెలంగాణాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న సమయంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 330 మెగావాట్స్ విద్యుత్ ఇచ్చేందుకు సిద్దమని తెలిపారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించలేదు కూడా.   ఒకవైపు విద్యుత్ లేక పంటలకు నీళ్ళు అందక రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా కూడా కేసీఆర్ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి విద్యుత్ తీసుకొనేందుకు ఇష్టపడలేదు. కేసీఆర్ కి అహం అడ్డు వస్తోందా? లేకపోతే ఆంధ్రా పాలకులు, ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అకారణ ద్వేషం కారణంగా విద్యుత్ తీసుకొనేందుకు అయిష్టత చూపుతున్నారా? అనేది ఆయనకే తెలియాలి.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇస్తామని చెపుతున్నా స్వీకరించేందుకు ఇష్టపడని కేసీఆర్ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయంగా రావలసిన విద్యుత్ ఇవ్వకుండా కుట్రలు పన్నుతోందని ఎదురు దాడి చేస్తూ తన ప్రజలని మభ్యపెడుతూ అదే ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని వారి ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేయడం ఆయన రాజకీయ చతురతకి మంచి నిదర్శనం. కానీ దాని వలన తెలంగాణా ప్రజలకి లాభం కలిగి ఉండి ఉంటే అందరూ సంతోషించే వారు కానీ ఆయన వైఖరి వలన తెలంగాణా ప్రజలు, రైతులే అందరి కంటే ఎక్కువగా నష్టపోతున్నారనేది కాదనలేని సత్యం.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ‘కేసీఆర్ & కో’ విద్యుత్ కొనుగోలు చేయకపోవడానికి కారణం ఏమిటి? అహం అడ్డు వస్తోందా? ఆయన అహానికి తెలంగాణా రాష్ట్రం బలయిపోతోంది,” అని నారా లోకేష్ ట్వీటర్ లో మెసేజ్ పెట్టారు.   కానీ అందుకు ఇంకా మరి కొన్ని ఇతర కారణాలు కూడా కనబడుతున్నాయి. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు రెండూ ఒకేసారి ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు చొరవ, కృషి, పట్టుదల కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడటమే కాకుండా ఇప్పుడు తెలంగాణాకు కూడా విద్యుత్ సరఫరా చేయగల పరిస్థితికి చేరుకొంది. కానీ కేవలం కేసీఆర్ వైఖరి కారణంగానే తెలంగాణా రాష్ర్టంలో నేటికీ విద్యుత్ సంక్షోభం నెలకొని ఉందిఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి విద్యుత్ తీసుకోవడం అంటే కేసీఆర్ తన వైఫల్యాన్ని తనే ఇంటి కప్పు మీదకు ఎక్కి మరీ ప్రకటించుకొన్నట్లవుతుంది. అది రాజకీయంగా ఆయనకు ఇబ్బందికరంగా మారవచ్చును. ప్రతిపక్షాల ముందు మరింత చులకన అయ్యే ప్రమాదం ఉంది.   పైగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు చేసినట్లయితే ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్న ఆ రాష్ట్రానికి దాని వలన ప్రయోజనం కూడా కలుగుతుంది. ఆంద్ర ప్రభుత్వాన్ని పాలకులను ద్వేషిస్తున్న కేసీఆర్ అందుకు ఇష్టపడకపోయుండవచ్చును. అందుకే ఎక్కడో వందల కిమీ దూరంలో ఉన్ననైవేలీ, ఝాఝార్, ధబోల్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల నుండి విద్యుత్ కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప పొరుగునున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ తీసుకొనేందుకు సుతరాము ఇష్టపడటంలేదు. అయితే దానివల్ల కూడా మళ్ళీ తెలంగాణా ప్రజలపైనే అదనపు భారం పడుతుంది. సుదూరప్రాంతాల నుండి తెలంగాణా విద్యుత్ సరఫరాకు అదనపు ఖర్చు ఎలాగూ ఉంటుంది. పైగా ఛత్తీస్ ఘర్ వంటి రాశ్రాల నుండి విద్యుత్ సరఫరా అవ్వాలంటే కొత్తగా ట్రాన్స్ మిషన్ లైన్లు కూడా వేయవలసి ఉంటుంది. అందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేయాలి. మావోయిష్టుల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల గుండా అవి నిర్మించాల్సి ఉంటుంది. కనుక దానికి ఎన్ని సం.లు పడతాయో ఎవరికీ తెలియదు. కారణాలు ఏమయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్ల అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే నష్టం జరుగుతుంది. అదే నారా లోకేష్ కూడా చెపుతున్నారు.

బీజేపీ ఆంద్ర తెలంగాణా టార్గెట్ 45/30 లక్షలు

  ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ లక్ష్యాలు స్థానిక నేతలకు అందనంత ఎత్తులో ఉంచారు. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణాలో ఆ పార్టీ కొంత బలంగానే ఉందని చెప్పుకోవచ్చును. కానీ అక్కడ ఆశించినంతగా సభ్యత్వ నమోదు జరుగలేదు. ఇంతవరకు 8 లక్షలు మంది మాత్రమే కొత్తగా ఆ పార్టీలో చేరినట్లు సమాచారం. కానీ అమిత్ షా అక్కడి నేతలకి ఏకంగా 30 లక్షల భారీ లక్ష్యం నిర్దేశించారు. మొబైల్ ఫోన్లు, ఆన్ లైన్ ద్వారానే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేప్పట్టాలని ఆయన సూచించడం మరో అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది.   ఇక ఈరోజు విజయవాడలో పార్టీ నేతలతో సమావేశమయిన ఆయన వారికి ఏకంగా 45లక్షల మంది కొత్త సభ్యులను చేర్చాలని నిర్దేశించారు. అయితే ఆయన రాష్ట్ర పర్యటన ఖరారు అయ్యే వరకు సభ్యత్వ నమోదు ప్రక్రియను పెద్దగా పట్టించుకోని ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలకు ఆయన ఇంత భారీ లక్ష్యం నిర్దేశించడం వలన ఏమయినా ప్రయోజనం ఉంటుందా? అని ఆలోచించక తప్పదు. ఇటువంటి కార్యక్రమాలని చాలా ప్రణాళికాబద్దంగా నిర్వహించే నేర్పు ఉన్న, బలమయిన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంతో శ్రమించి రెండు రాష్ట్రాలలో కలిపి మొత్తం 50 లక్షల మందిని కొత్తగా పార్టీలో చేర్చుకోగలిగింది. కానీ బీజేపీ నేతలలో అటువంటి పట్టుదల, ప్రణాళిక, క్యాడర్ సపోర్ట్ లేకపోయినా రెండు రాష్ట్రాలలో కలిపి 75లక్షలు సాధించాలనుకోవడం విచిత్రమే. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉంది కనుక ఆ పార్టీ దాదాపు 40 లక్షల మందిని పార్టీలోకి ఆకర్షించగలిగింది. కానీ రాష్ట్రంలో బలమయిన క్యాడర్ లేని బీజేపీ ఏవిధంగా 45 లక్షల లక్ష్యం చేరుకొంటుందో ఎవరికీ తెలియదు. “అంత భారీ లక్ష్యాలు పెట్టుకొంటే అందులో కనీసం పావు వంతు సాధించిన మంచిదే కదా!’ అనే ఆలోచనతో పెట్టుకొన్నారేమో!

విశాఖలో బిట్స్ పిలానీ సంస్థ ఏర్పాటు

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా మలిచేందుకు ఎంచుకోవడంతోనే దానికి మహర్దశ మొదలయిందని చెప్పవచ్చును. కానీ మధ్యలో హూద్ హూద్ తుఫాను వచ్చి నగరాన్ని అల్లకల్లోలం చేసి పోయింది. కానీ అంతా మన మంచికే అనుకోక తప్పదు. తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్ లైన్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి ప్రయోగం విశాఖ నగరంలోనే అమలవుటోంది. తరువాత కొత్తగా నిర్మించబోతున్న రాజధాని నగరంలో అమలవుతుంది.   ఇక విశాఖ నగరాన్ని ఐ.టీ.హబ్ గా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగానే కృషి చేస్తున్నారు. నగరం శివార్లలో గంభీరం అనే ప్రాంతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ ఏర్పాటుకు జోరుగా సన్నహాలు జరుగుతున్నాయి. ఈనెల ఐదున కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదుగా దాని శంఖుస్థాపన జరుగవలసింది కానీ భూసేకరణ విషయంలో స్థానిక రైతుల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. కానీ తాత్కాలికంగా ఆంద్ర విశ్వవిద్యాలయంలో గల ఆంధ్రాబ్యాంక్ భవనంలో ఐ.ఐ.యం. కోర్సుల శిక్షణ ఆరంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.   నగరంలో మూడు ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో రైల్ నిర్మాణానికి సర్వే కూడా మొదలయింది. మరొక ఆరు నెలలలో నిర్మాణపనులు మొదలయ్యే అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల అధినేత ఆదిత్య మంగళం బిర్లా తమ బిట్స్ పిలానీ అనుబంధ సంస్థను విశాఖ నగరంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. దానితో బాటే ఒక అంతర్జాతీయ పాటశాలను కూడా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. వాటికి అవసరమయిన భూములను ఇచ్చేందుకు చంద్రబాబు సంసిద్దత వ్యక్తం చేసారు. కనుక ఇక విశాఖ నగరానికి బిట్స్ పిలానీ కూడా వచ్చేస్తునట్లే భావించవచ్చును. ఇక రైల్వే జోన్ కూడా వచ్చేస్తే విశాఖవాసులు చాలా సంతోషిస్తారు. కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రమంతా విస్తరించడం కూడా చాలా అవసరం.

త్వరలో తెలంగాణాలో మరో తెలుగు దినపత్రిక

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విడిపోనంత వరకు కూడా రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూవచ్చేరు. కానీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టడం, రెడ్డి సామాజిక వర్గానికి బలమయిన కోట వంటి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో తునాతునకలయిపోవడంతో అంతవరకు దానినే నమ్ముకొన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరి పరిస్థితి అకస్మాత్తుగా తలక్రిందులయిపోయింది. వారి సామాజిక వర్గానికే చెందిన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా ఉన్నప్పటికీ, అందులో ఉన్నవారే ఆయన ధోరణితో విసిగెత్తిపోయి ఒకరొకరుగా బయట పడుతుండటంతో వారు ఎటువైపు వెళ్ళాలో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.   రాష్ట్ర విభజన తరువాత తప్పకుండా ఇటువంటి పరిస్థితి తలెత్తుతుందనే ఆలోచనతోనే తమకు మంచి బలం ఉన్న రాయలసీమను తెలంగాణాతో కలిపి రాయల తెలంగాణా ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చేరు. కానీ తెరాస నేతలు, తెలంగాణా ప్రజలు అందుకు గట్టిగా అభ్యంతరాలు చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆ ప్రతిపాదన పక్కనపడేసి రాష్ట్రాన్ని ఆంద్ర, తెలంగాణాలుగా విభజించేసి చేతులు దులుపుకొంది. దానివల్ల కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు దానినే నమ్ముకొన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల రాజకీయ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారింది.   ఆంధ్రాలో ఆ వర్గానికి చెందినవారిని బీజేపీలోకి ఆకర్షించి వారి అండతో రాష్ట్రంలో బలపడాలని ఆ పార్టీ భావిస్తున్నందున వారికి బీజేపీ ఆహ్వానం పలుకుతోంది. అయితే బీజేపీకి ఉన్న మతతత్వముద్ర కారణంగా నేటికీ ఆ పార్టీలో చేరేందుకు కొందరు వెనుకాడుతున్నారు. ఆంధ్రాలో నేతలు బీజేపీవైపు చూస్తున్నప్పటికీ, తెలంగాణాలో ఆ వర్గానికి చెందిన నేతలు మాత్రం ఎందుకో అసలు బీజేపీ వైపు కన్నెత్తి చూడటం లేదు.   ఇంతవరకు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వారు తమకున్న ఆ ప్రత్యేక గుర్తింపు నిలుపుకోవాలనే బలమయిన కోరికతో ఉన్నారు. తెలంగాణా రాజకీయాలలో తమ గొంతు బలంగా వినిపించాలనే ఉద్దేశ్యంతో వారిలో కొంతమంది కలిసి త్వరలో (ఉగాది నాటికి) ఒక తెలుగు దినపత్రికను తీసుకురాబోతున్నట్లు తాజా సమాచారం. అందుకోసం రూ.50 కోట్ల పెట్టుబడితో తెలంగాణాలో మూతపడిన ఒక పత్రిక కార్యాలయాన్ని అందులో యంత్రాలను అన్నిటినీ కొనుగోలు చేసి, పత్రిక రిజిస్ట్రేషన్ కార్యక్రమం వగైరా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టుని సంపాదకుడిగా ఎంచుకొన్నట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణాలో బలంగా నిలద్రొక్కుకొనున్న నాలుగయిదు తెలుగు దిన పత్రికలతో పోటీపడి తట్టుకొని నిలబడవలసి ఉంటుంది.

వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టులో కదలిక

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో నిర్మించబోయే మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఆ రంగంలో విశేష అనుభవం, మంచి నైపుణ్యం ఉన్న ఈ శ్రీధరన్ సలహాదారుగా నియమించుకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన కొన్ని రోజుల క్రితం విజయవాడ, వైజాగ్ నగరాలలో విస్తృతంగా పర్యటించిన తరువాత, విజయవాడ నగరం మధ్యలో ఒక మెట్రో రైల్వే లైన్, వైజాగ్ నగరంలో అన్ని ప్రాధాన కూడళ్ళను కలిపే విధంగా మూడు మెట్రో రైల్వే లైన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆరు నెలలలో వైజాగ్ మరియు విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు అందజేసి, రెండు చోట్ల ఒకేసారి నిర్మాణం ప్రారంభించాలనుకొంటున్నట్లు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిపారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును మూడేళ్ళలో పూర్తిచేసి ఇస్తానని హామీ కూడా ఇచ్చారు.   శ్రీధరన్ గుర్తించిన మూడు మెట్రో రైల్వే లైన్ మార్గాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు డిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ కి చెందిన నలుగురు నిపుణుల బృందం ఈరోజు వైజాగ్ రానుంది. వారు మెట్రో రైల్ ఏర్పాటుకు అవసరమయిన భూసేకరణ, ఏఏ ప్రాంతాలలో మెట్రో రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయాలి? వంటి అన్ని అంశాలపై అధ్యయనం చేస్తారు. వైజాగ్ లో పారిశ్రామిక ప్రముఖ ప్రాంతమయిన గాజువాక నుండి యన్.ఏ.డి. జంక్షన్, రైల్వే స్టేషన్, హనుమంతవాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్, జగదాంబ జంక్షన్ మీదుగా నగరం కొస నుండే పాత పోష్టాఫీసు ప్రాంతం వరకు మూడు మెట్రో రైల్వే లైన్లను నిర్మించి వాటిని ప్రధాన కూడళ్ళలో అనుసంధానం చేయాలని శ్రీధరన్ ప్రతిపాదించారు.   ఈరోజు నగరానికి వస్తున్న నిపుణుల బృందం ఆ మార్గాలలో మెట్రో రైల్వే లైన్ నిర్మాణం కోసం అధ్యయనం చేయనున్నారు. అన్నీ సవ్యంగా సాగినట్లయితే బహుశః వచ్చే దసరా పండుగ సమయానికి రెండు చోట్ల నిర్మాణపనులు ప్రారంభం అవవచ్చును.

ఏపీలో కూడా గిరిజన బెటాలియన్ ఏర్పాటు?

  మావోయిష్టుల ప్రభావం అధికంగా ఉన్న చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో వారిని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం అడవులలో నివసించే గిరిజన యువకులతో ‘సాల్వాజుడుం’ అనే గిరిజన పోలీస్ బెటాలియన్ తయారుచేసుకొని వారితోనే మావోయిస్టులను మట్టుబెట్టాలని చూసింది. కానీ వారు మావోయిస్టులను మట్టుబెట్టలేకపోయినా మావోయిస్టులు మాత్రం వారిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు వారి కుటుంబ సభ్యులను, ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకులయిన గిరిజనులను కిరాతకంగా హత్యలు చేయడంతో ఆ ‘సల్వాజుడుం’ ఐడియా బెడిసికొట్టింది. అంతే కాదు ఆ సల్వాజుడుం సృష్టికర్త ‘మహేంద్ర కర్మ’పై పగపట్టిన మావోయిస్టులు ఆయనను హతమార్చే ప్రయత్నంలో చేసిన దాడిలో ఒక మాజీ కేంద్రమంత్రితో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు, పోలీసులు దాదాపు డబ్బై మంది ఒకేసారి చనిపోయారు.   ఇదంతా తెలిసి కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విఫల ప్రయోగాన్ని రాష్ట్రంలో కూడా అమలుచేయాలని సిద్దమవుతోంది. అయితే దానికి వేరే బలమయిన కారణాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా అనేక వందల గిరిజన గ్రామాలు ఆ ప్రాజక్టు క్రింద మునిగిపోతాయి. ఆ కారణంగా నిర్వాసితులయిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వంపై ఆగ్రహం కలగడం సహజం. ఇదే అదునుగా వారిలో యువకులను మావోయిస్టులు ఆకర్షించే ప్రమాదం ఉంది. కనుక వారినందరినీ ప్రభుత్వమే చేరదీసి వారితో ఒక గిరిజన పోలీస్ బెటాలియన్ (సాల్వాజుడుం) ఏర్పాటు చేయడం ద్వారా వారి కుటుంబాలను ఆదుకోవచ్చును. ఈ గిరిజన పోలీస్ బెటాలియన్ ఏర్పాటు ద్వారా శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలలోని గిరిజన ప్రాంతాలలో తమ ఉనికిని చాటు కొనేందుకు విద్వంసానికి పాల్పడుతున్న మావోయిస్టులను నియంత్రించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.   ఈ గిరిజన బెటాలియన్ కోసం ప్రత్యేకంగా రంపచోడవరం లేదా పాడేరు ప్రాంతాలలో ఎక్కడో ఒకచోట ప్రధాన కార్యాలయం, శిక్షణా సంస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గిరిజనులకు ఈ విధంగా ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ ఆలోచన బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో కూడా మళ్ళీ ఛత్తీస్ ఘడ్ చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ఏవిధంగా నివారించాలో ముందుగానే ఆలోచించితే ఆ తరువాత ప్రభుత్వాన్ని ఎవరూ తప్పు పట్టే అవకాశం ఉండదు.

తాత్కాలిక రాజధానికి తరలి రావడానికి అయిష్టంగా ఉన్న ఉద్యోగులు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలయినంత త్వరలో విజయవాడ నుండి ప్రభుత్వ పాలన మొదలుపెట్టాలని కోరుకొంటున్నారు. అందుకోసం అమరావతి సమీపంలో తాత్కాలిక భవనాలను నిర్మించమని రాష్ట్ర మౌలికవసతుల కల్పన సంస్థకు ఆదేశాలు కూడా జారీ చేసారు. కానీ హైదరాబాద్ లో స్థిరపడిన ఉద్యోగులు మాత్రం మరో మూడేళ్ళ వరకు అక్కడి నుండి కదలలేమని కుండబ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నారు. పిల్లల చదువులు, భార్యా భర్తలలో ఒకరు ప్రైవేట్ లేదా కేంద్రప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు చేస్తుండటం వంటివి వ్యక్తిగత కారణాలున్నాయి.   అవికాక రెండు రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ, విద్యా, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు భవనాలు, ఆర్ధిక తదితర అనేక శాఖలకు చెందిన ఫైళ్ళు మార్పిడి ఇంకా జరుగవలసి ఉంది. ఆ ప్రక్రియ ఇంకా ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఇదికాక అనేక ప్రభుత్వ కేసుల విషయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు హైకోర్టు చుట్టూ నిత్యం తిరుగవలసి ఉంటుంది. ఒకవేళ గుంటూరుకి తరలి వెళ్ళినట్లయితే ఆ కేసుల కోసం నిత్యం గుంటూరు-హైదరాబాద్ మధ్య తిరగడానికే సమయం అంతా సరిపోతుందని ఉద్యోగుల సంఘాల నేతల వాదన.   ఎస్‌టి యు రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ “అసలు ఒకేసారి దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఎటువంటి ప్రాధమిక సౌకర్యాలు లేని చోటికి తరలించడం వలన ఉద్యోగులకీ, ప్రభుత్వానికీ కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అందువలన ముందుగా ప్రాధమిక సౌకర్యాలు కల్పించి ఆ తరువాత అవసరాన్ని బట్టి ఉద్యోగులను అంచెలంచెలుగా గుంటూరు తరలించాలని సూచిస్తున్నారు.   “ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉంటూ మిగిలిన ఉద్యోగులను గుంటూరుకి తరలించితే వారి మధ్య సరయిన సమన్వయం లేక పాలనపరమయిన చిక్కులు ఏర్పడుతాయని” ఎపిఆర్‌ఎస్‌ఎ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. “అయినా హైదరాబాద్ లో పదేళ్ళపాటు ఉండే అవకాశం ఉన్నప్పుడు ఇంత హడావుడిగా దానిని వదిలిపెట్టి ఎటువంటి సౌకర్యాలు లేనిచోటికి వెళ్లి ఇబ్బందులు పడవలసిన అవసరం ఏమిటని” ఆయన ప్రశ్నిస్తున్నారు.   ఇవ్వన్నీ విన్న తరువాత హైదరాబాద్ లో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడప్పుడే గుంటూరుకు తరలి వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

వచ్చే ఎన్నికల నాటికి వైకాపా జెండా మారుతుందేమో?

  ఆంధ్రలో చంద్రప్రభుత్వం రెండేళ్ళు మహా అయితే నాలుగేళ్ళు ఉంటుందని, ఆ తరువాత తానే ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి ఘంటాపదంగా చెపుతున్నారు. అందుకే తుళ్ళూరు రైతులను అధైర్యపడవద్దని, తను ముఖ్యమంత్రి అవగానే ఎవరి భూములు వారికి ఇచ్చేస్తానని హామీ కూడా ఇస్తున్నారు. ఆ భూముల మీద రాజధాని నిలబడిన తరువాత అదెలా సాధ్యపడుతుందో ఆయనే చెప్పి పుణ్యం కట్టుకొంటే బాగుండేది.   ఇదివరకు ఒకపక్క రాష్ట్ర విభజన జరిగిపోతుంటే, నాకు ముప్పై మంది యంపీలను, ఓ 115 మంది శాసనసభ్యులను ఇచ్చినట్లయితే డిల్లీలో చక్రం తిప్పి అడ్డేస్తానని ఆయన హామీ ఇచ్చినప్పుడూ జనాలు ఇలానే చాలా కన్ఫ్యూస్ అయిపోయారు. ఆ కన్ఫ్యూస్ లోనే ఆయనకి ఓటేయడం మరిచిపోయినట్లున్నారు. అయినప్పటికీ గతం గతః కనుక మళ్ళీ వచ్చే ఎన్నికల తరువాత ఆంధ్రాలో ఆయనే ముఖ్యమంత్రి అయిపోదామని డిసైడ్ అయిపోయారు. చాలా సంతోషం.   ఇక ఆ మధ్యన ఎప్పుడో ఆయన హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణాలో కూడా తమ పార్టీయే అధికారంలోకి రాబోతోందని ప్రకటించేశారు. వైకాపా, కాంగ్రెస్, బీజేపీలు తప్ప అధికార తెరాసతో సహా అన్ని పార్టీలు కూడా తెలంగాణా నుండి ఊడ్చిపెట్టుకుపోతాయని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలనే ఆలోచనతో, తనకు బాగా అచ్చి వచ్చిన బాణాన్ని తెలంగాణాపైకి వదిలారు. ఆ బాణం అంటే మన షర్మిలమ్మ తెలంగాణాపైకి రివ్వున అలా దూసుకువెళ్లి నలుగురినీ ఓసారి పరామర్శించేసి తిరిగి వెనక్కి వచ్చేశారు. మళ్ళీ ఇప్పుడప్పుడే వెళ్ళేలాలేరు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించడం లేదు.   మొన్నటి వరకు వైకాపా గట్టు మీద కూర్చొని అందరి మీద విరుచుకుపడ్డ రామచంద్ర రావు ఎవరికీ చెప్పాపెట్టకుండా గట్టు దూకేశారు. అంతకు ముందు మరో ఇద్దరు ముగ్గురు జంప్ అయిపోయారు. మళ్ళీ మరో పెద్దాయన శూన్యమాసం అని కూడా చూడకుండా ఈరోజు పార్టీలో నుండి జంప్ చేసేసారు. ఆయన మరెవరో కాదు అశ్వారావుపేట యం.యల్యే. తాటి వెంకటేశ్వర్లు. ఆయన ఉండేది వైకాపాలో అయినా తెదేపా నేత తుమ్మలతో మంచి దోస్తీ ఉండేది. అందుకే ఆయన వెంటే నేనూ సైతం అంటూ తెరాసలోకి వెళ్లిపోయేందుకు బ్యాగ్ సర్దేసుకొని వెళ్ళిపోతున్నారు.   గమ్మతయిన విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం పార్టీకి చెందిన వైరా యం.యల్యే. మదన లాల్ తెరాసలోకి దూకేసినప్పుడు, అయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఈయనే ఓ లేఖ వ్రాసి పట్టుకొని వెళ్లి స్పీకర్ మధుసూధనాచారి చేతిలో పెట్టి వచ్చేరు. కానీ ఇప్పుడు ఈయనే ఆ పార్టీలోకి దూకేస్తున్నారు. ఇక వైకాపాకు తెలంగాణాలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఒక్కరే మిగిలారు. కనుక ఇప్పుడు ఆయన వెళ్లి తాటి మీద అనర్హత వేటు వేయమని స్పీకర్ ని కోరుతారేమో. కానీ ఆయన కూడా బ్యాగ్ సర్దేసుకొన్నారని, కాకపోతే కాస్త వారం వర్జ్యం చూసుకొని వెళదామని ఆగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా వెళ్ళిపోతే ఇక వైకాపాకు తెలంగాణా శాసనసభతో పనుండదు. ప్చె! ఏమిటో...వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో అన్ని పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెపితే అన్నిటి కంటే ముందుగా వైకాపాయే తుడిచిపెట్టుకుపోతోంది. కానీ తెలంగాణాలో వైకాపా ఖాళీ అయిపోతున్నా, జగనన్న కానీ ఆ పార్టీ నేతలు గానీ ఏనాడూ కించిత్ బాధపడినట్లు లేదు. బహుశః వైకాపాను తెరాసలో విలీనం చేస్తున్నామని భావిస్తున్నారో ఏమో?   ఆంధ్రాలో కూడా సేమ్ టు సేమ్ పరిస్థితే కనబడుతోంది. కొంత మంది బీజేపీ తీర్ధం పుచ్చుకొని తరిస్తుంటే మరికొంతమంది తెదేపా కండువాలు కప్పుకోవాలని తహతహలాడుతున్నారు. బహుశః ఇదంతా చూసే కాబోలు ఎక్కడో మధ్యప్రదేశ్ లో ఉండే అజిత్ జోగీ అనే కాంగ్రెస్ పెద్దాయన జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇచ్చేరు. నిప్పులేనిదే పొగరాదు కనుక తెర వెనుక అటువంటి ప్రయత్నాలు ఏమయినా జరుగుతున్నాయేమోనని అనుమానించక తప్పడం లేదు. ఇలాగయితే వచ్చేఎన్నికల తరువాత జగనన్న ముఖ్యమంత్రి అవడం, రాజన్న రాజ్య స్థాపన చేయడం, స్వర్ణ యుగం తీసుకురావడం ఎలాగో అర్ధం కావడం లేదు.

అవును మళ్ళీ వాళ్ళు పార్టీ మారారు

  కడప జిల్లాలో కందుల సోదరులుగా పేరొందిన కందుల శివానందరెడ్డి, రాజమోహన్ రెడ్డి ముచ్చటగా మళ్ళీ మరోసారి పార్టీ మారారు. ఒకసారి తెదేపాలోకి మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి మారుతుండే వారిరువురు ఎన్నికల సమయంలో వైకాపాలో చేరారు. కానీ వారు ఊహించినట్లు ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో, వారిరువురూ చెట్టాపట్టాలేసుకొని మళ్ళీ బీజేపీలోకి దూకేశారు. పోతూపోతూ వారిరువురూ వైకాపాకు ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేసారు. ఆపార్టీకి భవిష్యత్ లేదనే ఉద్దేశ్యంతోనే తామిరువురం పార్టీని విడిచిపెట్టేస్తున్నామని చెప్పారు. కానీ ఎన్ని పార్టీలు మారినా తమ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అందువలన ఇప్పుడు బీజేపీలో చేరితే తమకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందనే వారి నమ్మకాన్ని మెచ్చుకోక తప్పదు. కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరిన పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి సీనియర్ నేతలను ఆ పార్టీ పక్కనబెట్టి ఆర్.యస్.యస్. నుండి రామ్ మాధవ్ ను పార్టీలోకి రప్పించి ఆయనకు పార్టీ కార్యదర్శి వంటి కీలకపదవిని కట్టబెట్టింది. అటువంటప్పుడు అనేక పార్టీలు మారి బీజేపీలోకి వచ్చిపడిన కందుల సోదరులు ఆ పార్టీ నుండి ఏమి ఆశించగలరు? ఏమీ దక్కకపోతే వారు ఆ పార్టీని అంటిపెట్టుకొని ఎంతకాలం ఉంటారు?

తెలంగాణా సెంటిమెంటు-సర్వ రోగ నివారిణి?

  రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాకు మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ నిత్యం అది డబ్బుకి కటకటలాడుతూనే ఉంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాణిజ్య పన్నుల విభాగం ఆంధ్రాకు చెందిన అధికారులు, ఉద్యోగులతో నిండి ఉండటమేనని తెలంగాణా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కీలకమయిన పదవులలో ఉన్న ఆంద్ర అధికారులు ప్రాంతీయ భేదభావం చేత, పన్నుల వసూళ్ళలో అశ్రద్ధ చూపుతున్నారని, ఆ కారణంగానే గత ఏడాది ఇదే సమయానికి 28,000 కోట్లు వసూలు కాగా, ఈ సారి కేవలం రూ 14,000 కోట్లు మాత్రమే వసూలు అయ్యిందని, మరొక మూడు నెలలలో మిగియనున్న ఈ ఆర్ధిక సం.లో ఆ లక్ష్యాన్ని అధిగమించడం మాటెలాఉన్నా, దానిని చేరుకోవడం చాలా కష్టమని ఆ శాఖలో గల తెలంగాణా అధికారులు భావిస్తున్నారు.   డిపార్టుమెంటులో ఆంద్ర అధికారుల అశ్రద్దను అలుసుగా తీసుకొని వ్యాపారస్తులు కూడా పన్ను ఎగవేస్తున్నారని, కనుక ఆంద్ర అధికారుల స్థానంలో వీలయినంత త్వరగా తెలంగాణాకు చెందిన అధికారులను నియమించాలని, ఆ శాఖకు చెందిన టీ-జేయేసి సభ్యులు కొత్తగా వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా నియమితులయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు.   వారు చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణాలో మొత్తం 12 రెవెన్యూ డివిజన్లు ఉండగా వాటిలో 10 డివిజన్లకు ఆంధ్రాకు చెందినవారే డిప్యూటీ కమీషనర్లుగా ఉన్నారు. వాటిలో అత్యంత కీలకమయిన హైదరాబాద్ పరిధిలో ఏడు డివిజన్లు ఉండగా వాటిలో ఆరింటికి ఆంద్ర డిప్యూటీ కమీషనర్లుగా ఉన్నారు. తెలంగాణా రాష్ట్రంలో మొత్తం 92 మంది వాణిజ్య పన్ను అధికారులలో అధిక శాతం మంది ఆంధ్రాకు చెందిన వారే. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరు అయిన హైదరాబాదులో 57 మంది వాణిజ్య పన్ను అధికారులుంటే వారిలో ఆంధ్రాకు చెందినవారు 24 మంది ఉన్నారు.   ఈ ఆంధ్రాకు చెందిన అధికారులు ప్రాంతీయ భేదభావం కారణంగా పన్నుల వసూళ్ళలో అశ్రద్ధ చూపడం వలననే ఆదాయం తగ్గిందని తెలంగాణా నాన్ గజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ యస్. దేవీప్రసాద్, ఆ శాఖకు చెందిన టీ-జేయేసి చైర్మన్ వెంకటేష్ తదితరులు ఆరోపిస్తున్నారు. వారు మంత్రి తలసాని యాదవ్ ని కలిసి తక్షణమే ఆంద్ర అధికారుల స్థానంలో తెలంగాణా అధికారులను నియమించాలని కోరారు. కానీ ఇప్పటికిప్పుడు అంతమందిని నియమించడం అసాధ్యం కనుక పదోన్నతి కల్పించడం ద్వారా ఆ స్థానాలలో తెలంగాణా అధికారులని నియమించాలని వారు మంత్రిని కోరారు.   ప్రభుత్వం కమలనాధన్ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నందున వారి ప్రతిపాదన అమలు చేయడం సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారు. అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే ఈ సమస్యను అధిగమించవచ్చని ఆయన వారికి సూచించారు.   తెలంగాణా అధికారులు సంఘాల నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఆంద్ర అధికారుల అశ్రద్ధ కారణంగానే ఇంత భారీ ఆదాయం నష్టపోయినట్లయితే, అందుకు భాధ్యులయినవారిని ప్రభుత్వం ఉపేక్షించనవసరం లేదు. ఎందుకంటే వారికి తెలంగాణా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. తన క్రింద పనిచేస్తున్న ఉద్యోగులు ఏ ప్రాంతానికి చెందినవారయినా వారిని ప్రభుత్వం సంజాయిషీ కోరవచ్చును. అలసత్వం ప్రదర్శించారని నిరూపితమయితే వారిపై కటిన చర్యలు కూడా చేప్పట్టవచ్చును.   మంత్రిని కలిసిన తెలంగాణా సంఘ ప్రతినిధులు, అధికారులు ఆదాయం తగ్గినందుకు సదరు ఆంధ్రా అధికారులను పిలిపించి వారి సంజాయిషీ కోరమనకుండా, తమకు పదోన్నతులు కల్పించమని కోరడంలో మర్మమేమిటి? తెలంగాణా సెంటిమెంటుతో రాష్ట్ర విభజన జరిగింది. అనేక శాఖల విభజన కూడా జరిగింది. చివరికి పదోన్నతుల కోసం కూడా తెలంగాణా సెంటిమెంటునే సర్వరోగనివారిణిలాగ ఉపయోగించుకోవాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకే మంత్రి వారికి కలిసిపనిచేయమని సూచించారేమో?

బైరెడ్డి అందుకే తెదేపాలో చేరాలనుకొంటున్నారా?

  రాయలసీమకు చెందిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముగ్గురూ కూడా సీమకు ద్రోహం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై ప్రశంశలు కురిపిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి చాలా కృషిచేస్తున్నారని, ఆయన అనుమతిస్తే తాను తెదేపాలో చేరేందుకు సిద్దమని మొన్న కర్నూలు పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసమే తను తెలుగుదేశంలో జేరాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు.   కానీ ఇదే బైరెడ్డి సార్వత్రిక ఎన్నికలలో తన అభ్యర్ధులను నిలబెట్టి రాయలసీమకు అన్యాయం చేస్తున్న అన్ని రాజకీయపార్టీలకు గట్టిగా బుద్ధి చెపుతానని ప్రగల్భాలు పలికారు. కానీ ఆయనపై పోలీసులు ఒక హత్యానేరం క్రింద కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ చాలా కాలం తరువాత అజ్ఞాతంలో నుండి బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతానని చెప్పడం హాస్యాస్పదం. ఆయన పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నా, చంద్రబాబు నాయుడు అటువంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పార్టీలో చేర్చుకొంటారా? అంటే అనుమానమే. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే, ఆయన అందులో జేరెందుకే మొగ్గు చూపేవారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండటంతో, వైకాపాలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేమనే ఆలోచనతోనే ఆయన తెదేపాను ఎంచుకొన్నారని చెప్పవచ్చును. ఒకవేళ చంద్రబాబు ఆయనను పార్టీలో చేర్చుకోకపోతే అప్పుడు ఆయన చంద్రబాబుని నిందిస్తూ బీజేపీ వైపు పరుగు తీయవచ్చును.

ఒక్క ఐఏఎస్.. మూడు పదవులు...

  ఒక్క ఐఏఎస్ ఆఫీసర్‌ ఒక్క పదవి అయితే సమర్థంగా నిర్వహిస్తారు. తనకు అప్పగించిన పదవీబాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. అయితే ఒక్క ఐఏఎస్ ఆఫీసర్‌కి ఒకేసారి మూడు పదవులను అప్పగిస్తే ఏమవుతుంది? ఆ ఆఫీసర్‌ ఆ పదవులకు న్యాయం చేయలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ ఆఫీసర్ తనకు అప్పగించిన బాధ్యతలను ఛాలెంజ్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి నడిమెట్ల శ్రీధర్ తనకు అప్పగించిన మూడు బాధ్యతలను అలా ఛాలెంజింగ్‌గా తీసుకుని నిర్వర్తిస్తారని ఆశిద్దాం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్‌గా వున్నారు. ఒక వ్యక్తి రెండు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేయడం అంటే అది తలకు మించిన భారమే అవుతుంది. అయితే ఆ రెండు బాధ్యతలను శ్రీధర్ ప్రశంసనీయంగా నిర్వర్తిస్తున్నారు. ఆయన ప్రతిభను గుర్తించారో ఏమోగానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు శ్రీధర్ భుజస్కంధాల మీద మరో భారాన్ని మోపారు. అది సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యత. ఇప్పటి వరకూ ఈ పదవిలో వున్న భట్టాచార్య కోల్ ఇండియా లిమిటెడ్ సీఎండీ బాధ్యతలను నిర్వర్తించడానికి బదిలీ అయి వెళ్ళారు. దాంతో ఏర్పడిన ఖాళీలో శ్రీధర్‌ని నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ శ్రీధర్‌కి మంచి టార్గెట్ కూడా ఇచ్చారు. గతంలో కంటే ఉన్నతమైన స్థానికి సింగరేణి కాలరీస్ కంపెనీని తీసుకురావాలని కోరారు. మరి మూడు బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారో చూడాలి.

జనవరిలో నారా లోకేష్ తెలంగాణా పర్యటన?

  ఇంతవరకు తెర వెనుకనే ఉంటూ తెదేపాను బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్న నారా లోకేష్, ఇకపై నేరుగా ప్రజలలోకి వచ్చి పార్టీని వారికి మరింత దగ్గర చేయాలని భావిస్తున్నాట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నంలోనే ఆయన వచ్చే నెలలో తెలంగాణాలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నట్లు తాజా సమాచారం.   తెలంగాణ ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో కూడా ఎంతో పటిష్టంగా ఉన్న తెదేపా, తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస ఆకర్షణకులోనయి కొంతమంది సీనియర్ నేతలు, యం.యల్యేలు. వారి అనుచరులు పార్టీని వీడి తెరాసలో జేరిపోవడంతో తెలంగాణాలో తెదేపా చాలా బలహీనపడింది. కానీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టడంతో తెలంగాణాలో పార్టీ కోసం సమయం కేటాయించలేకపొతున్నారు. బహుశః అందుకే ఆయన కుమారుడు నారా లోకేష్ ఇకపై తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసేందుకు చొరవ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   ఒకవేళ ఆయన తెలంగాణాలో పర్యటనలు ప్రారంభిస్తే, అప్పుడు తెరాస నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడవలసి ఉంది. ఒకవైపు నారా లోకేష్ తెదేపాను బలపరుచుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, మరో వైపు షర్మిల కూడా వైకాపాను బలోపేతం చేసుకొనేందుకు ఇప్పటికే పరామర్శ యాత్రల పేరిట తెలంగాణాలో పర్యటించారు. కనుక ఒకవేళ నారా లోకేష్ కూడా తెలంగాణాలో యాత్రలు మొదలుపెట్టినట్లయితే అప్పుడు తెరాస, తెదేపా, వైకాపాల మధ్య మాటల యుద్ధం అనివార్యమవవచ్చును.   అయితే, షర్మిల పరామర్శ యాత్రపై స్పందించని తెరాస, నారా లోకేష్ తెలంగాణా పర్యటనలపై విరుచుకుపడినట్లయితే, అది తెరాస-వైకాపాల మధ్య ఉన్న రహస్య అవగాహన గురించి ప్రశ్నించేందుకు తెదేపాకు అవకాశం కల్పించినట్లవుతుంది కనుక తెరాస వెంటనే స్పందించకపోవచ్చును.

ఏపీ రాజధాని అభివృద్ధి మండలి బిల్లుకు గవర్నర్ ఆమోదం

    ఏపీ రాజధాని అభివృద్ధి మండలి బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేసి, ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఆరు జీవోలు విడుదల చేసింది. వాటిలో మొదటి జీఓ ద్వారా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థను రద్దు చేసారు. రెండవ జీఓ ద్వారా రాజధాని యొక్క ఖచ్చితమయిన ఎల్లలను నిర్దారించారు. మొత్తం 122కిమీ పరిధిలో రాజధాని నగరం ఏర్పాటవుతుంది. కానీ 7068 కిమీకు విస్తరించి ఉండే రాజధాని అభివృద్ధి మండలి పరిధిలోకి గుంటూరు జిల్లాలోని 29 మండలాలు, కృష్ణా జిల్లాలోని 29 మండలాలు కలిపి మొత్తం 58 మండలాలు వస్తాయి.   ఈ మండలి పరిధిలోకి కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జి.కోండూరు, కంచికచర్ల, వీర్లుపాడు, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, నూజివీడు, పామిడిముక్కల, తోట్లవల్లూరు, పెదపారపూడి మండలాలు పూర్తిగా వస్తాయి. మొవ్వ, చల్లపల్లి, ఘంటశాల, పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, మోపిదేవి మండలాల్లోని చాలా గ్రామాలు వస్తాయి.   గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు, పెదకూరపాడు, ముప్పాళ్ల మండలాలు పూర్తిగా వస్తాయి. అచ్చంపేట, క్రోసూరు మండలాలలోని కొన్ని గ్రామాలు వస్తాయి.భట్టిప్రోలు, పొన్నూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాలలో సగానికిపైగా గ్రామాలు వస్తాయి.   రాజధాని అభివృద్ధి మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్ గా, మునిసిపల శాఖ మంత్రి నారాయణ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరిరువురితో కలిపి మండలిలో మొత్తం 11మంది సభ్యులు ఉంటారు. మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్య కార్యనిర్వాహక మండలి చైర్మన్ గా, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మండలి కమీషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ కార్యనిర్వాహక మండలి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. త్వరలో మిగిలిన సభ్యుల నియామకాలు కూడా జరుగుతాయి.   ఇప్పటికే రెవిన్యూ శాఖ 20 బృందాలకు అన్ని విధాల శిక్షణ ఇచ్చిసిద్దంగా ఉంచింది. రాజధాని అభివృద్ధి మండలి లాంఛనంగా ఏర్పాటయింది గనుక ఇక ఒకటి రెండు రోజుల్లో భూసేకరణ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది.

రేపటి నుండి రాజధాని కోసం తుళ్ళూరు భూసేకరణ మొదలు

  రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన 20 బృందాలు తుళ్ళూరు మండలంలో రాజధాని కోసం భూసేకరణ కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాయి. తుళ్ళూరు మండలంలో చాలా గ్రామాల ప్రజలు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నందున ఆ ప్రాంతాలలో భూసేకరణ సందర్భంగా ఉద్రిక్తతలు ఏర్పడవచ్చును. అందువలన రెవెన్యూ శాఖ డిప్యూటీ కలెక్టరు, తసిల్దారు, సర్వేయర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి వారికి భూసేకరణ విధివిధానాలు, ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారం వంటి అంశాలపై ముందుగానే శిక్షణ కూడా ఇచ్చింది.   ఒక్కో బృందానికి సుమారు 1400 ఎకరాల భూసేకరణ బాధ్యత అప్పగించడం ద్వారా ఈ ప్రక్రియలో ఒక ప్రాంతంలో ఆటంకాలు ఎదురయినప్పటికీ ఆ ప్రభావం మరో ప్రాంతం పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంది. ఆ విధంగా అత్యధిక భాగంలో భూసేకరణ పూర్తయినట్లయితే, అవరోధాలు ఎదురయ్యే ప్రాంతాలలో సమస్యలు పరిష్కరించుకొనేలోగానే నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది.   ఇక రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు పూనుకొంటున్న ఈ సమయంలోనే, కేంద్ర ప్రభుత్వం ఇదివరకు యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన కటినమయిన షరతులతో కూడిన భూసేకరణ చట్టంలో అటువంటి నిభంధనలను సరళతరం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా ఇదివరకు చట్టంలో ఉన్న ‘భూసేకరణకు భూయాజమాని ఆమోదం తప్పనిసరి’ అనే షరతును తొలగించేందుకు ఆమోదముద్ర వేసింది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవసరమయితే సవరించిన కొత్త చట్ట ప్రకారం రైతులకు ఇష్టం ఉన్నా లేకున్నా భూసేకరణ చేసే వెసులుబాటు ఏర్పడింది. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తోంది గనుక ఆ చట్టం ప్రయోగించవలసిన అవసరం ఉండకపోవచ్చును. ప్రభుత్వం నిర్దేశించుకొన్న మొత్తం 30,000 ఎకరాల భూసేకరణలో ఎక్కడయినా అవరోధాలు ఏర్పడినచోటనే ఈ చట్టం ప్రయోగించవచ్చును.

తుళ్ళూరులోఆ పాడు పని చేసిందెవరో?

  తుళ్ళూరు మండలంలో లింగాయపాలెం, పెనుమాక, ఉండవల్లి, మందడం గ్రామాల ప్రజలు రాజధానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ గ్రామాలలో అరటి తోటలను, షెడ్లను, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకు నిప్పు పెట్టడంతో ఆ గ్రామస్తులలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.   ఈ సంగతి తెలిసిన వెంటనే జిల్లా అర్బన్ యస్పీ రాజేష్ కుమార్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆయన జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. ఇటువంటి ఘటనల వలన ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నందున బాధ్యులను గుర్తించేందుకు తక్షణమే చర్యలు చెప్పట్టాలని అధికారులను ఆదేశించారు. సీఆర్‌డీఏ అథారిటీ సి.ఈ.ఓ.గా నియమితులయిన శ్రీకాంత్‌ తక్షణమే స్పందిస్తూ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి పరిస్థితిని సమీక్షించారు. దీనిపై విచారణ జరిపి ఇందుకు బాధ్యులయిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.   రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు ఆ గ్రామాల ప్రజలు నిరాకరిస్తున్నారు కనుక, సహజంగానే అందరూ తెదేపా నేతల హస్తం ఉందని అనుమానించవచ్చును. అయితే అధికారంలో ఉన్న తెదేపా ఇటువంటి పనులకు పాల్పడుతుందని భావించలేము. ఎందుకంటే దానివల్ల అందరూ దానినే అనుమానించే అవకాశం ఉంది. బహుశః ఇదే ఆలోచనతోనే దానిని వ్యతిరేకిస్తున్న వారెవరయినా చేసి ఉండవచ్చు. ఏమయినప్పటికీ పోలీసులు అసలయిన నిందితులను పట్టుకొని కోర్టులో నిలబెడితే తప్ప ఎవరినీ అనుమానించడానికి లేదు.

కాకినాడ నుండి చెన్నైకి బోట్ జర్నీ!

  కేరళ, బెంగాల్, గోవా వంటి కొన్ని రాష్ట్రాలలో నేటికీ ఒక ఊరు నుండి మరొక ఊరికి పడవల ద్వారా ప్రయాణించేందుకు తగిన కాలువలు, మరబోట్లు వాడకంలో ఉన్నాయి. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో కూడా భద్రాచలం వెళ్లేందుకు గోదావరి మీద చాలా లాంచీలు తిరుగుతున్నాయి. అయితే 1980 వరకు కూడా కాకినాడ నుండి చెన్నై వరకు ఉండే కాలువల ద్వారా సరుకు రవాణా చాలా జోరుగా సాగుతుండేది. కానీ ప్రభుత్వాలు కూడా అశ్రద్ధ చూపడంతో అది మూలపడింది. క్రమంగా కొన్ని చోట్ల ఆ కాలువలు భూకబ్జాదారుల చేతిలో పడి చిక్కి ఒకప్పుడు 32మీటర్ల వెడల్పు ఉండే కాలువలు ఇప్పుడు 6 మీటర్లకు కుచించుకుపోయాయి.   అంతర్గత జలరవాణ వ్యవస్థను అభివృద్ధి చేయడం కూడా మోడీ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి. కనుక కేంద్రం అంతర్గత జలరవాణ అధికార సంస్థ, రాష్ట్రంలో యానం-కాకినాడ-రాజమండ్రి-ఏలూరు-విజయవాడ-తెనాలి-నెల్లూరు మీదుగా చెన్నైకి ఉన్న 1100 కిమీ పొడవున్న అంతర్గత జలరవాణ వ్యవస్థను మళ్ళీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో కొద్ది రోజుల క్రితమే విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేసింది.   బకింగ్ హం కాలువగా ప్రసిద్ధి పొందిన ఈ కాలువను పునరుద్దరించి మళ్ళీ జలరవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రాలో వివిధ వస్తు ఉత్పత్తులను చెన్నైకి అదేవిధంగా చెన్నై నుండి ఆంధ్రాకి అతి తక్కువ ఖర్చుతో రవాణా చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. అంతా అనుకొన్నట్లుగా సవ్యంగా సాగితే దీనిని ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చి దిద్దే అవకాశం ఉంది. ఇది రెండు రాష్ట్రాలకు ఒక ప్రత్యేక టూరిస్ట్ ఆకర్షణగా నిలిచే అవకాశం కూడా ఉంది. కనుక ఈ ప్రాజెక్టును పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పట్టుదలగా ఉంది. ఈ కాలువను పునరుద్దరించి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.2000కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుపై ఆరు నెలలలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్రం స్థానిక అధికారులను ఆదేశించడంతో చీఫ్ ఇంజనీర్ సుభాకర్ దండపత్ నేతృత్వంలో వారు ఈ మధ్యనే సర్వే బకింగ్ హం కాలువను సర్వే చేయడం మొదలుపెట్టారు.   వారి ప్రాధమిక సర్వేలో ఆ కాలువ పలు ప్రాంతాలలో ఆక్రమణలకు లోనయినట్లు గమనించారు. అదేవిధంగా చాలా చోట్ల పూడికతీసి కాలువ లోతును పెంచవలసి ఉంటుందని గుర్తించారు. సాధారణంగా మరపడవలు తిరిగేందుకు కనీసం 32 మీటర్ల వెడల్పు 2.5 మీటర్ల లోతు ఉండాలి. కానీ ఇప్పుడది చాలా చోట్ల కేవలం ఆరు మీటర్ల వెడల్పు, ఒక్క మీటరు లోతు మాత్రమే ఉంది. అదేవిధంగా ఇదివరకు పరిస్థితులలో కాలువలో చిన్న చిన్న పడవలు మాత్రమే తిరిగేవి కనుక కాలువను దాటేందుకు అనేక చోట్ల తక్కువ ఎత్తులో వంతెనలు నిర్మించబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆధునిక మర పడవలు, భారీ సరుకు రవాణా చేసే లాంచీలను ఈ కాలువలో నడపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నందున ఆ పాత వంతెనల స్థానంలో మరింత ఎత్తున కొత్త వంతెనలు నిర్మించవలసి ఉంటుంది.   ప్రస్తుతం కాకినాడ కెనాల్-50కిమీ, ఏలూరు కెనాల్-139కిమీ, గుంటూరు జిల్లాలో కొమ్మమూరు కెనాల్-119కిమీ, బకింగ్ హం కెనాల్-316కిమీ, దక్షిణ బకింగ్ హం కెనాల్-116కిమీ మరియు పాండిచేరి కెనాల్-22కిమీ పొడవున్న కాలువలున్నాయి. వాటిలో ఆక్రమణలు తొలగించి, పూడికలు తీసి, వాటిపై అవసరమయిన చోట కొత్తగా వంతెనలు నిర్మించాల్సి ఉంది. కేంద్రమే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందున బహుశః రానున్న రెండు మూడేళ్ళలో ఈ పనులన్నీ పూర్తవవచ్చును. ఆంద్ర-తమిళనాడు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఈ అంతర్గత జలరవాణ వ్యవస్థ పునరుద్దరించబడినట్లయితే, అది రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా ఆర్ధికంగా కూడా ఎంతో వెసులుబాటు కల్పించవచ్చును.

దేవినేని - కేశినేని వార్ వెనుక కథేంటి?

  విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఈమధ్య ఓ సమావేశంలో విజయవాడలో పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ మీద ఆ మాటా ఈ మాటా మాట్లాడి, పనిలోపనిగా రాష్ట్ర మంత్రి, కృష్ణాజిల్లాలో బలమైన తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మీద కామెంట్లు కూడా చేశారు. ‘తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమ జాగీరు కాదు’ లాంటి భారీ కామెంట్ కేశినేని నాని నోటి వెంట రావడం తెలుగుదేశం వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేశినేని నానిని పిలిపించి క్లాసు ఇవ్వడం, ఒక్క క్లాసుతోనే తనకు జ్ఞానోదయం కలిగిపోయినట్టుగా పొరపాటైపోయిందని కేశినేని నాని ప్రకటించడం ఒకదాని వెంట మరొకటి చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారాన్ని చూసిన వారికి ఇదేదో టీకప్పులో తుఫానులా అనిపిస్తుందిగానీ, దీని వెనుక భారీ రాజకీయ చదరంగ ఎత్తుగడ వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీకి సుప్రీంగా కొనసాగుతున్న దేవినేని ఉమ ప్రాబల్యాన్ని, ప్రాధాన్యాన్ని తగ్గించే ఎత్తుగడలో భాగంగానే ఈ తతంగమంతా జరిగిందని అంటున్నారు.   కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమ సుప్రీం అయ్యారు. ఆయన్ని జిల్లాలో ‘చిన్న చంద్రబాబు’ అని పిలిచే స్థాయికి ఆయన ఎదిగారు. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక మహావృక్షంలా ఎదిగారు. ఆ మహా వృక్షం నీడలో తాము ఎదగలేకపోతున్నామన్న భావన పార్టీలోని ఇతర నాయకులలో వుంది. జిల్లాకి చెందిన ఏ విషయాన్నయినా చంద్రబాబు నాయుడు డైరెక్ట్‌గా దేవినేనితోనే చర్చిస్తూ వుండటం, ప్రతి విషయంలోనూ దేవినేని చురుకుగా అల్లుకునిపోతూ వుండటంతో ఒక్క కేశినేని నాని మాత్రమే కాకుండా అనేకమంది ఇతర నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం లభించడం లేదన్న ఆవేదన పెరిగిపోయింది. అయితే ఈ విషయాన్ని పార్టీ అధినేతకు స్పష్టంగా తెలియజేయాలన్న భావన అందరిలోనూ వుంది. అయితే పిల్లిమెడలో గంట కట్టే ధైర్యం ఇంతకాలం చేయలేకపోయారు. ఇప్పుడిక లాభం లేదని అందరి తరఫున కేశినేని నానిని రంగంలోకి దించారని తెలుస్తోంది. నాని చేసిన ఘాటు కామెంట్లతో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులలో ఉన్న ఆవేదన బయటపడింది. అది చంద్రబాబు నాయుడి దృష్టికి వెళ్ళింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చంద్రబాబు రంగంలోకి దిగేలా చేసింది. కేశినేనికి క్లాసు తీసుకోవడంతోపాటు కృష్ణాజిల్లాలోని పరిస్థితులను పరిశీలించడానికి సుజనాచౌదరిని నియమించే వరకూ వెళ్ళింది. ఒక దశలో లోకేష్ కూడా రంగంలోకి దిగారు.   ఇప్పటి వరకూ కృష్ణాజిల్లాకు సంబంధించినంత వరకు దేవినేని చెప్పిందే వేదం. అలాంటిది ఇప్పుడు ఆ జిల్లాలో పార్టీ పరిస్థితులను పరిశీలించడానికి మరొకరిని నియమించారంటే అది దేవినేని ప్రాధాన్యతని తగ్గించడంగానే భావించాలని దేవినేనిని వ్యతిరేకిస్తున్న వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాల ద్వారా తాము దేవినేని మీద విజయం సాధించినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఏది ఏమైనా కేశినేని నాని ఉదంతం కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా వున్న విభేదాలను బయటపడేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. దేవినేని వ్యతిరేక వర్గంలో వున్న అసంతృప్తిని తగ్గించడంతోపాటు మరోవైపు దేవినేని వర్గం హర్టవ్వకుండా వుండేలా చంద్రబాబు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం వుందని పరిశీలకులు అంటున్నారు.

సత్య నాదెళ్ళ మనోడే...ఆయనను పూర్తిగా వాడేసుకోక తప్పదు

  దేశాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోవడం, దాని స్థానంలో సమర్దుడయిన నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో దేశానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ఆశ అందరిలో చిగురించింది. అదే సమయంలో ప్రపంచ ప్రసిద్ద మైక్రోసాఫ్ట్ సంస్థకు భారతీయుడయిన సత్య నాదెళ్ళ సి.ఈ.ఓ.గా నియమితులవడం భారత్ కు మరో శుభ పరిణామంగా చెప్పుకోవచ్చును.   ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరియు ఐ.టి.శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ లతో నిన్న సమావేశమయిన ఆయన తమ మైక్రోసాఫ్ట్ సంస్థ తరపున దేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. దేశంలో క్రమంగా పెరుగుతున్న పరిశ్రమల, వ్యాపార సంస్థల మరియు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిలువచేసేందుకు తమ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందించేందుకు భారీ పెట్టుబడులతో డాటా సెంటర్లు నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ భారతీయ విభాగంలో ప్రధాని మోడీ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటాల్ ఇండియా పధకాలను కూడా ఒక భాగంగా చేసుకొని తదనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకొంటామని ఆయన తెలిపారు. భారత్ లో వివిధ అవసరాలకు తగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు తమ సంస్థ సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఐటీ రంగంలో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకొంది. కానీ ఇంకా ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్ వేర్ ఉత్పత్తి రంగంలో వెనుకబడే ఉంది. ఐ.టి. శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆ రెండు రంగాలను కూడా అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ భారత్ కు సహాయం చేయాలని కోరారు. భారతీయుడయిన ఆయన తన సంస్థ ద్వారా భారతదేశ అభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు ముందుకు రావడం చాలా అభినందనీయం.    భారతీయుడయిన సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సంస్థకు సి.ఈ.ఓ. కావడం అటు ఆ సంస్థకు ఇటు భారత్ కు రెంటికీ చాలా ప్రయోజనం చేకూర్చబోతోంది. ఆయన వలన భారత్ కు భారీ పెట్టుబడులు, ఆ సంస్థ సేవలు లభ్యమవుతాయి. భారత్ లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన కార్యాలయాలను మరిన్నిటిని తెరిచినట్లయితే, దానిని అనుసరించి అనేక చిన్నా పెద్ద సంస్థలు కూడా భారత్ కు తరలిరావడం తధ్యం. మైక్రోసాఫ్ట్ తో సహా ఆ సంస్థలన్నీ భారత్ లో తమ కార్యకలాపాలు మొదలుపెట్టినట్లయితే, దానివలన భారత ఆర్ధిక పరిస్థితి కూడా మరింత మెరుగుపడుతుంది.   సత్య నాదెళ్ళ భారతీయుడయిన కారణంగానే, మైక్రోసాఫ్ట్ సంస్థ 125 కోట్ల మంది జనాభా ఉన్న ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మార్కెట్ ద్వారా లబ్ది పొందగలుగుతుంది. భారతీయుల అవసరాల గురించి, వారి ఆలోచనా విధానం గురించి, వారి జీవన శైలి గురించి భారతీయుడయిన సత్య నాదెళ్ళకు తెలిసినంతగా మరే సంస్థకి తెలియక పోవచ్చును. అది ఆ సంస్థకు ఒక పెద్ద వరంగా మారబోతోంది. భారతీయ అవసరాలకు అనుగుణంగా తన సంస్థ సేవలను, టెక్నాలజీని అందించగలిగితే, మైక్రోసాఫ్ట్ సంస్థ ఊహించనంతగా భారత్ నుండి లాభాలు ఆర్జించగలదు. దేశంలో నానాటికి పెరుగుతున్న కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్, టాబ్లెట్ పీసీలు, మొబైల్ ఫోన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఇంటర్ నెట్, వైఫీ వినియోగం ద్వారా ఆ సంస్థ ఊహించనంత లాభాలు పొందే అవకాశం ఉంది.   అందువలన భారత ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ సంస్థ రెండూ కూడా ఈ సువర్ణావకాశాన్ని ఓడిసిపట్టుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. సత్య నాదెళ్ళ తెలుగువాడయ్యి ఉండటం ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు మరింత కలిసివచ్చే అంశమని చెప్పవచ్చును. అందువలన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల మాటను గుర్తుంచుకొని ఆయన ఆ పదవిలో ఉండగానే ఆయన ద్వారా రెండు రాష్ట్రాలలో భారీ పెట్టుబడులు, ఆ సంస్థ శాఖల ఏర్పాటుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నించడం చాలా అవసరం. ఇటువంటి సువర్ణావకాశం మళ్ళీ వస్తుందని ఆశించలేము.