మరో ఉద్యమమా... తమరికో దండం...
posted on Dec 6, 2014 @ 8:50PM
ఆ పెద్దమనిషి ఒక ప్రభుత్వోద్యోగి. ఉద్యోగ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారన్న విషయం అలా వుంచితే, విప్లవం పేరు చెప్పి కుర్రాళ్ళని రెచ్చగొట్టడంలో, ఉద్యమం పేరుతో ప్రాంతీయ విభేదాలను పెంచడంలో ఆయనకు ఆయనే సాటి. ముగిసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన పాత్ర తక్కువేమీ కాదు. ఆత్మహత్యలు చేసుకోవద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ ఆయన రోజుకు రెండు మూడుసార్లు తెలంగాణ యువతకు పిలుపునిచ్చేవారు. అయితే ఆయన పిలుపు పుణ్యమని అనలేముగానీ, అప్పట్లో తెలంగాణలో యువకుల ఆత్మహత్యలు మాత్రం బాగా పెరిగిపోయాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన టీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సహకారం కూడా అలాంటి ఇలాంటి సహకారం కాదు. టీఆర్ఎస్ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నిటినీ తెలంగాణ ప్రజలకు దూరం చేయడంలో ఆయన తనవంతు పాత్రని విజయవంతంగా పోషించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆ పార్టీకి అంత సేవ చేసి వుండరేమో... ఈయన గారు మాత్రం ఆ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈయనకి పెద్దపెద్ద పదవులు రావడం ఖాయమని అప్పట్లో చాలామంది గుసగుసలాడుకున్నారు. కొంతమంది బాహాటంగానే అన్నారు. అయినప్పటికీ ఈ సారు ఎంతమాత్రం వెనకడుగు వేయకుండా టీఆర్ఎస్‌కి అండగా నిలబడ్డారు.
ఉద్యమ ఫలితమో, ఆత్మహత్యల ప్రభావమో, రాజకీయ క్రీడలో భాగమోగానీ.. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. మంచో, చెడో ఒక చారిత్రక పరిణామం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఎవరి బతుకు వారు బతకాలని డిసైడైపోయింది. ఆరకంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ముగిసింది. అలా ఉద్యమం ముగిసిందో లేదో... ఇలా రాజకీయ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉద్యమంలో సదరు పెద్దమనిషి చిటికెన వేలు పట్టుకుని నడిచిన చాలామంది ఉద్యమకారులు ఎమ్మెల్యేలు అయిపోయారు. ఎంపీలు అయ్యారు. రకరకాల పదవులు పొందారు. అయితే సదరు పెద్దాయనని మాత్రం పలకరించినవాళ్ళెవరూ లేరు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించేవరకూ పెద్దాయనని ఎంతో గౌరవించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఆయన్ని పట్టించుకోవడం మానేశారు. తన శాయశక్తులా టీఆర్ఎస్ పార్టీ కోసం కృషి చేశా కదా.. తనకు కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందని, ఏదో ఒక మంచి పదవి తనకు దక్కుతుందని ఎదురుచూశారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోయేసరికి షాక్‌కి గురైన ఆయన గత కొంతకాలంగా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడిపోయారు. తనను ఎంతమాత్రం పట్టించుకోని కేసీఆర్ మీద బాహాటంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలని వున్నా, ఒకవేళ తాను నోరు జారితే ‘దారిలో వున్న’ పదవి కూడా రాకుండా పోతుందేమోనని ఓర్పు వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు దాటినప్పటికీ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు, గుర్తింపు రాకపోవడంతో ఆయన ఇప్పుడు గొంతు సవరించుకుని విమర్శల పరంపరను ప్రారంభించారు.
గత కొద్ది రోజులుగా సదరు పెద్దమనిషి కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ సాధించే పోరాటం అయిపోయిందని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సరిగా పనిచేసేలా చేసే పోరాటం చేయాల్సి వుందని పిలుపు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ తెలంగాణ మేధావులు, కేసీఆర్ వ్యతిరేక శక్తులు గుర్తుకు వచ్చారు. వాళ్ళందరూ తనకు అండగా వుంటే మరో పోరాటం చేపట్టాలని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వున్న ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదని ఆయన బాధగా చెబుతున్నారు. ప్రభుత్వాన్ని సరిగా పనిచేసేలా ఉద్యమించబోతున్నానని ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన మీటింగులు ఏర్పాటు చేసే పనిలో వున్నారు. మొన్నటి వరకూ పదవి ఏదైనా వస్తుందేమోనని ఆశగా ఎదురుచూసిన ఆయన ఇక తనకు అలాంటి ఛాన్స్ లేదని స్పష్టంగా తెలిసిపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఉద్యమం కబుర్లు చెబుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆయనచెప్పినట్టుగా ఉద్యమాలు చేసే స్థితిలో లేరని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా విద్యార్థులతోపాటు తెలంగాణలోని ఎన్నో వర్గాలు నష్టపోయాయి. ఇప్పుడు కాస్తంత ప్రశాంతంగా ఉన్నాయి. మళ్ళీ ఉద్యమాలంటూ ఈ పెద్దమనిషి చేస్తున్న హడావిడిని ప్రజలు హర్షించరని అంటున్నారు. అందువల్ల తెలంగాణ ప్రజలు సదరు పెద్దమనిషి చేపట్టిన కొత్త ఉద్యమానికో దండం అంటున్నారని పరిశీకులకులు చెబుతున్నారు.