వారిపై అనర్హత వేటు పడదు ష్యూర్!

  ఇటీవల తెరాస కండువాలు కప్పుకొన్న కాంగ్రెస్, తెదేపాలకు చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ రెండు పార్టీలు స్పీకర్ మధుసూధనాచారికి విజ్ఞప్తి పత్రాలు అందజేశాయి. ఆ రెండు పార్టీలు తమ పార్టీకి చెందిన శాసనసభ్యులను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే పార్టీ కండువాలు కప్పి మరీ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించారని తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు దానినే సాక్ష్యంగా భావించి పార్టీ ఫిరాయించిన తమ శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసాయి.   ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్, తెదేపాలకు చెందిన శాసనసభ్యులు మూకుమ్మడిగా వైకాపాలోకి ఫిరాయించినప్పుడు కూడా తెదేపా తన సభ్యులపై అనర్హత వేటు వేయవలసిందిగా అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కోరింది. కానీ ఆయన చాలా కాలం వరకు వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. రాజకీయ కూడికలు, తీసివేతలు అన్నీ సరిచూసుకొన్న తరువాత వారిపై అనర్హత వేట వేశారు. అప్పటి పరిస్థితులకి, ఇప్పటికీ చాలా వ్యత్యాసం కూడా ఉంది. ఇప్పుడు ఇతర పార్టీ శాసనసభ్యుల చేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పార్టీ ఫిరాయింపజేసి తమ తెరాస పార్టీలో చేర్చుకొంటున్నారు. అందువలన అదే పార్టీకి చెందిన స్పీకర్ మధుసూదనాచారి, ఆయన కోరి తెచ్చుకొన్న శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేందుకు సాహసిస్తారని ఆశించడం అత్యాశే కాదు అవివేకం కూడా. అందువలన కాంగ్రెస్, తెదేపాలకు కంటశోష తప్ప వారికొచ్చే ప్రమాదం ఏమీ లేదనే చెప్పవచ్చును.

జగన్ ఈ లెక్కలు ఎప్పుడు ఆపుతారో...

  సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అధికారంలోకి వచ్చిన పార్టీ సంబరాలు చేసుకుంటుంది. ఓడిపోయిన పార్టీ తన ఓటమికి బాధ్యతని ఎవరి నెత్తిన వేయాలా అని ఆలోచిస్తూ వుంటుంది. తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం తనదేనని చెబుతూ వుంటుంది. గెలిచిన పార్టీ అవినీతి అక్రమాలకు పాల్పడిందని, తాము అమాయకులమని చెప్పుకుంటూ వుంటుంది. అధికారంలోకి వచ్చిన పార్టీ కంటే తమ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం చాలా తక్కువని, అంచేత తాము నైతికంగా ఓడిపోయినట్టు కాదని చెప్పుకుంటూ వుంటుంది. చరిత్రలో ఓడిపోయిన ఏ పార్టీ అయినా ఇలాగే చేసింది. భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తుంది. అయితే ఎన్నికలలో ఓడిపోయిన ఏ పార్టీ అయినా ఎన్నికల ముగిసిన వారం పది రోజుల వరకు ఇలాంటి లెక్కలు చెబుతూ ఆత్మానందం పడుతూ వుంటుంది. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎన్నికలు ముగిసిపోయి, తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అయినప్పటికీ ఇంకా ఎందుకూ పనికిరాని లెక్కల్లోనే మునిగి తేలుతున్నారు.   వైసీపీ నాయకుడు జగన్ ఎప్పుడు మీడియా ముందుకు, ప్రజల ముందుకు, తన పార్టీ కార్యకర్తల ముందుకు వచ్చినా ఆర్నెల్ల క్రితం జరిగిపోయిన ఎన్నికల ఫలితాల తాలూకు చిట్టా విప్పుతున్నారు. గత ఎన్నికలలో విజయం సాధించిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ప్రశంసనీయంగా పరిపాలన చేస్తుంటే, జగన్ మాత్రం ఇంకా తన లెక్కల లోకం వదలి బయటకి రావడం లేదు. తాజాగా సోమవారం నాడు ఒంగోలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన లెక్కల లెక్చరర్ అవతారం ఎత్తారు. గడచిన ఎన్నికలలో వైసీపీకి, టీడీపికి మధ్య ఓట్ల తేడా కేవలం ఐదు లక్షలేనని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ఏవేవో ప్లస్సులు, మైనస్సులు చెప్పి కార్యకర్తల బుర్రలు హీటెక్కించారు. ఐపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు పాత లెక్కలన్నీ చెప్పి సారు ఎందుకు బుర్ర తింటున్నారో అర్థం కాక కార్యకర్తలు జుట్టు పీక్కున్నారు. చంద్రబాబుకి దేవుడి దయ లేదని, మనకు మాత్రమే దేవుడి దయ వుందని కూడా జగన్ వాళ్ళకి చెప్పారు. మనకి దేవుడి దయ వుంటే మనం ఎందుకు గెలవలేదని కార్యకర్తలు తలలు పట్టుకున్నారు. ఏది ఏమైనా జగన్ భూతకాలంలో విహరించడం మాని వర్తమానంలోకి వస్తే మంచిదని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.

ఎయిర్‌పోర్టుకి పీవీ పేరు ఒప్పుకోం...

  శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టెర్మినల్‌కి తెలుగుతేజం నందమూరి తారక రామారావు పేరు పెట్టడం మీద విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ పీవీ నరసింహారావు, కొమరం భీమ్ లాంటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి పేరు పెడితే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. దీనిమీద అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా ఆమోదించారు. అయితే కేసీఆర్ చేసిన ప్రకటనను దక్షిణ తెలంగాణకు చెందిన అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ తెలంగాణ మీద ఉత్తర తెలంగాణ ఆధిపత్యం పెరిగిపోయిందని, ఆ ఆధిపత్యమే కేసీఆర్ ప్రకటనలో కూడా కనిపిస్తోందని అంటున్నారు. ఒకవేళ శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కి పీవీ నరసింహారావు పేరు పెట్టే ఆలోచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని అంటున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తామో కూడా వారు వివరిస్తున్నారు.   పీవీ నరసింహారావు ఉత్తర తెలంగాణకు చెందిన వ్యక్తి. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు దక్షిణ తెలంగాణలో వుంది. ఈ ప్రాంతంలో వున్న ఎయిర్‌పోర్టుకు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరును ఎలా పెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. పీవీ నరసింహారావు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు అనే విషయం ఒక కోణమైతే, పీవీ కుటుంబం కూడా కేసీఆర్ కుటుంబం తరహాలోనే సీమాంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిందని చరిత్రని తవ్వుతున్నారు. పీవీ నరసింహారావు పూర్వికులు కూడా సీమాంధ్ర గోదావరి ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణలో వున్న గోదావరి ప్రాంతానికి వలస వచ్చారని గుర్తు చేస్తు్న్నారు. ఇలా వలస వచ్చిన ఉత్తర తెలంగాణ వ్యక్తి పేరును దక్షిణ తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. అదీ కాకుండా, పీవీ నరసింహారావు రెండుసార్లు పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించింది కూడా సీమాంధ్ర తెలుగువారుండే ఒరిస్సాలోని బరంపురం, రాయలసీమలోని నంద్యాల నియోజకవర్గాలు. ఆయన ఏదైనా సేవ, అభివృద్ధి చేసి వుంటే ఆ రెండు ప్రాంతాలకు చేసి వుంటారని, మరి అలాంటప్పుడు ఆయనకీ దక్షిణ తెలంగాణకీ సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పీవీ కావొచ్చు.. మరెవరైనా కావొచ్చు.. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరును ఎయిర్‌పోర్టుకు పెడతామని ప్రకటించడాన్ని కూడా తాము సహించబోమని అంటున్నారు.

‘దక్షిణ తెలంగాణ’ ఉద్యమం రాజుకుంటోంది

  విడిపోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, మనకంటూ సొంత రాష్ట్రం వుంటేనే ఆత్మగౌరవం నిలబడుతుందని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గొంతెత్తి చాటింది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ అవే ప్రాతిపదికల మీద ‘దక్షిణ తెలంగాణ’ ఉద్యమం రాజుకుంటోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణను చిన్నచూపు చూస్తోందని, త్వరలో ‘దక్షిణ తెలంగాణ’ ఉద్యమం రాక తప్పదని దక్షిణ తెలంగాణకే చెందిన టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి కొద్ది నెలల క్రితమే చెప్పారు. అలాగే కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. కేవలం రెండు మూడు నెలల క్రితం మొదలైన ఈ అభిప్రాయాలు ఇప్పుడు ఉద్యమం రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణతో కలసి వుండటం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయి దక్షిణ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అనివార్యమని ఆ ప్రాంత నాయకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంతా దక్షిణ తెలంగాణలో వుంటే ఆధిపత్యం మాత్రం ఉత్తర తెలంగాణ వారి చేతిలో వుండటాన్ని ఈ ప్రాంతం వారు భరించలేకపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.   బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పుడు డీకే అరుణతో సహా పలువురు దక్షిణ తెలంగాణ వారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు దక్షిణ తెలంగాణలో బతుకమ్మకి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అక్కడ బోనాలు వైభవంగా జరుపుకుంటారు. అలాంటిది బతుకమ్మను దక్షిణ తెలంగాణ మీద బలవంతంగా రుద్దుతున్నారన్న భావన ఆ ప్రాంతంలో వ్యాపించింది. దీనికితోడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన చెరువుల పూడిక తీత కార్యక్రమానికి ‘మిషన్ కాకతీయ’ అంటూ కాకతీయుల పేరు పెట్టారు. దీనిని దక్షిణ తెలంగాణలోని నాయకులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాకతీయులు ఉత్తర తెలంగాణను మాత్రమే పరిపాలించారు. సంస్థానాధీశులు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. దక్షిణ తెలంగాణకు ఉన్నత చరిత్ర వుంది. ఉన్నత సంస్కృతి వుంది. అయితే తమ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేని కాకతీయులను తమమీద రుద్దడం మీద దక్షిణ తెలంగాణ వాదులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తమ చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవాలని భావిస్తున్నారు.   ఇప్పుడంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకుడైపోయారుగానీ, తెలంగాణలో మొట్టమొదట ఉద్యమాన్ని రగిల్చిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి. దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయన ఇప్పుడు మళ్ళీ దక్షిణ తెలంగాణకు జరుగుతున్న అవమానాలు చూసి ‘దక్షిణ తెలంగాణ’ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలన్న ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. చిన్నారెడ్డికి అండగా డీకే అరుణ లాంటి మంచి నాయకురాలు నిలుస్తున్నట్టు సమాచారం. దక్షిణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం ప్రారంభించడానికి వీరితోపాటు ఆ ప్రాంతంలోని అనేకమంది నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

తెరాస వైకాపాల మధ్య ఉన్నదీ దోస్తీయా...కుస్తీయా?

  ప్రస్తుతం తెలంగాణాలో తెరాస ఒక్కటీ ఒక్కవైపు, కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు మరో వైపు నిలిచి యుద్ధం చేస్తుండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైకాపా వంటి ఆప్తమిత్రుడు అండగా ఉంటే బాగుండునని తెరాస భావిస్తే తప్పులేదు. ఎందుకంటే తెరాస, వైకాపాల మధ్య ఉన్న మంచి అనుబంధం సంగతి ఎవరికీ తెలియంది కాదు. దాని గురించి పవన్ కళ్యాణ్ తో సహా చాలా మంది డౌట్లు వ్యక్తం చేసారు. కానీ ఆ రెండు పార్టీలు ఇంతవరకు నేరుగా జవాబు చెప్పలేదు. అందువల్ల ఆ రెండు పార్టీలు ఒకటీ అరా విమర్శలు చేసుకొన్నా వారి స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉందని భావించవలసి ఉంటుంది. పోలవరం, విద్యార్ధుల ఫీజ్ రీ-ఇంబర్స్ మెంటు, నీళ్ళు, విద్యుత్, ఇంటర్ పరీక్షలు వంటి అనేక అంశాలపై కేసీఆర్, ఆయన మంత్రులు ఎంతగా గొడవ చేస్తున్నా వైకాపా నోరు మెదపకపోవడమే అందుకు చక్కటి నిదర్శనం.   ప్రస్తుతం తెలంగాణాలో రెండు జాతీయ పార్టీలను, త్వరలో జాతీయ పార్టీగా మారబోతున్న తెదేపాను డ్డీ కొని ఒంటరిపోరాటం చేస్తున్న తెరాసకు వైకాపా వంటి స్నేహితుడి మద్దతు చాలా అవసరం కనుక వచ్చే ఎన్నికలలో వారిని నిలువరించేందుకే బహుశః వైకాపాను తెరాసయే ఆహ్వానించి ఉన్నా ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే తనకంటే బలవంతుడయిన వాడితో స్నేహం చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది కనుకనే తెలంగాణాలో ఏ మాత్రం బలం లేని వైకాపాను ఆహ్వానించి ఉండవచ్చును. ఉదాహరణకు సోనియాగాంధీ తను ఎప్పుడు దిగిపోమంటే అప్పుడు ప్రధాన మంత్రి కుర్చీలో నుండి దిగిపోయే డా. మన్మోహన్ సింగుకి అవకాశం ఇచ్చింది తప్ప ఆ కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలేయాలని ఆశపడిన చిదంబరాన్ని కూర్చోనీలేదు. అదేవిధంగా తెలంగాణాపై ఆసక్తిలేని వైకాపాను పక్కనబెట్టుకోవడం వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు కనుకనే ఆ పార్టీ తెలంగాణాలో రీ-ఎంట్రీ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా అందరూ నోరు మెదపడం లేదని భావించాల్సి ఉంటుంది.   అందువల్ల వైకాపా కూడా తెలంగాణాలో బలం పెంచుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయకపోవచ్చును. ఆ పార్టీ తెలంగాణాలో తెలంగాణాలో తన ఉనికిని చాటుకోవడానికే పరిమితమవవచ్చును. దాని వలన వైకాపాకు ఏమి ప్రయోజనం అంటే తమ ఉమ్మడి శత్రువు తెదేపాపై ఇరువురూ కలిసి పోరాడి తెలంగాణాలో దానిని పూర్తిగా బలహీనపరచవచ్చును. అంతేకాదు...జాతీయ పార్టీగా మారాలని భావిస్తున్న వైకాపా తెలంగాణాలో కూడా పోటీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక మళ్ళీ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టేందుకు తెరాస, వైకాపాలు ఒకదానిపై కత్తులు దూసుకొంటూ కాలక్షేపం చేయవచ్చును.

స్వర్గీయ యన్టీఆర్ ఎవరివాడు?

  గాంధీ, నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్ వంటి మహానుభావులను కూడా రాజకీయ పార్టీలు వాటాలేసుకొని పంచేసుకొంటున్న రోజులివి. టంగుటూరి, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములవారిని కూడా కులాలు వారిగా పంచేసుకొంటున్న రోజులివి. ఆ చేత్తోనే దేవుళ్ళని కులాలు, ప్రాంతాల వారిగా పంచేసుకొంటున్నారు. ఆంద్ర దేవుడయిన ఏడుకొండల వెంకన్నకు మనం మొక్కడమేమిటి...అని భావించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వాములవారిని ‘ఎడాప్ట్’ చేసుకొంటే, దానికి బేషరతు మద్దతు ప్రకటించాడు మన రామ్ గోపాలవర్మ. అంతేకాదు తెలంగాణా ప్రజలు ఆంద్ర వెంకన్నకు మొక్కడం అంటే లక్ష్మీ నరసింహ స్వాములవారిని ఇన్సల్ట్ చేసినట్లేనని ఆయన తీర్మానించాడు కూడా.   దేవుళ్ళని, దేశనాయకులనీ కూడా కులాలు, ప్రాంతాల వారిగా వాటాలేసి పంచుకొంటున్నప్పుడు, ఆంధ్రా హీరో స్వర్గీయ యన్టీఆర్ పేరును తెలంగాణాలో ఉన్న విమానాశ్రయానికి పేరుపెడితే కేసీఆర్ కి ఆగ్రహం వచ్చిందంటే రాదూ..? ఆయనకే కాదు తెలంగాణా కాంగ్రెసోళ్లకు మిగిలిన పార్టీల వాళ్ళకీ కూడా నచ్చలేదు. అందుకే ‘ఆ పేరు మాకు వద్దు’ అని శాసనసభలో నిన్న తీర్మానించారు కూడా. అందుకు తెదేపా, బీజేపీలు అభ్యంతరాలు వ్యక్తం చేసి తమ వాదనలు వినిపించాయి.   అయితే ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ, తన పార్టీ జెండా దిమ్మకు గౌరవం దక్కని నిమ్మకూరులో తాను జీవితంలో మళ్ళీ కాలు పెట్టనని శపథం చేసిన స్వర్గీయ యన్టీఆర్, ఒకవేళ బ్రతికివస్తే తనకు గౌరవం లేని చోట తన పేరు పెట్టడాన్ని అంగీకరించేవారు కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. గాంధీ, నెహ్రు, సుబాష్ చంద్ర బోస్,అంబేద్కర్ తదితరులు ‘మనోళ్ళు కాకపోయినప్పటికీ దేశంలో ప్రతీ మారుమూల గ్రామాల్లో ఆ మహానుభావుల విగ్రహాలను పెట్టుకొని ప్రజలు పూజిస్తుంటారు. కానీ తెలుగుజాతికే ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావుడు స్వర్గీయ యన్టీఆర్ మాత్రం పరాయివాడయిపోయాడు.   కానీ దేవుళ్ళనే కులాలు, ప్రాంతాల వారిగా వాటాలేసుకొని పంచేసుకొంటున్న ఈ రోజుల్లో ఆయనకు కూడా మినహాయింపు ఉండదని ఇంత ఖచ్చితంగా తేల్చి చెప్పిన తరువాతయినా కేంద్రం ఈ విషయంలో పునరాలోచించుకొని, ‘ఆ మహానుభావుడిని ఆంధ్రాకే కేటాయిస్తే’ బాగుంటుంది. త్వరలో విజయవాడలో నిర్మించబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టి గౌరవిస్తే, పైనున్న ఆయన సంతోషిస్తారు.... తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను తమకు అప్పగించేసినందుకు ఆంధ్రా వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు.

పరామర్శ యాత్రకు ముహూర్తం ఖరారు

  మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణవార్త విని తట్టుకోలేక తెలంగాణాలో గుండెపగిలి చనిపోయిన వారిని ఓదార్చేందుకు ముహూర్తం, ఓదార్చవలసిన 16 కుటుంబాలను పేర్లను వైకాపా ఖరారుచేసింది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ‘బయటే’ ఉన్నప్పటికీ, ఆయన ఆంద్ర వ్యవహారాలతో  క్షణం తీరిక లేకుండా ఉంటుండటంతో ఆ బాధ్యతను షర్మిలమ్మకు అప్పగించారు. అందువల్ల ఆమె తన అన్నగారి తరపున వారిని ఓదార్చేందుకు మళ్ళీ కొంగు బిగించక తప్పలేదు. ఆరేళ్ళయినా...అరవైఏళ్లయినా...మాటంటే మాటే... అందుకే అన్న ఇచ్చిన మాటకు కట్టుబడి షర్మిలమ్మ డిశంబర్ 8నుండి ఓదార్పు యాత్రకి బయలుదేరుతున్నారు.   ఆమె మొదట మెహబూబ్ నగర్ జిల్లాలో షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, కొడంగల్, వనపర్తి, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఐదు రోజుల పాటు పర్యటించి అక్కడ ఆరేళ్ళ క్రితం గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చుతారు. ఆ తరువాత మిగిలిన జిల్లాలలో రాజశేఖర్ రెడ్డి కోసం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారని ఆ పార్టీ తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అయితే ఈ యాత్రకు 'ఆంద్రాయాత్ర'లకు పెట్టిన పేరే పెట్టి తెలంగాణా ప్రజల మనసు కష్టపెట్టడం ఇష్టం లేక, ఆమె ఓదార్పుయాత్రకు ‘పరామర్శయాత్ర’ అని పేరు పెట్టారు.   అయితే  గిట్టనివారు ఇదంతా చూసి, ఎప్పుడో చనిపోయినవారి కుటుంబాలను ఆరేళ్ళ తరువాత తాపీగా వచ్చి ఇప్పుడు ఓదార్చడం ఏమిటి వెటకారం కాకపోతేనూ...అయినా తెలంగాణాలో జెండా పీకేసి పార్టీ కార్యాలయాలను ఖాళీ చేసేసి వెళ్ళిపోయిన వైకాపా, మళ్ళీ ఇప్పుడు అక్కడ జెండా పాతి, పార్టీ నడిపించుకోదలిస్తే దానికి ఈ డ్రామాలన్నీ ఎందుకు? ఆ పనేదో నేరుగా చేస్తేనే సరిపోతుంది కదా...అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ షర్మిలమ్మ కేవలం చనిపోయిన వారి కుటుంబాలకు ‘మనోధైర్యం’ ఇచ్చేందుకే వారిని పరామర్శిస్తున్నారు తప్ప మీరనుకొన్నట్లు జెండా పాతడానికీ కాదు..పార్టీని బలపరుచుకోవడానికీ కాదు...అది గిట్టని వారు చేసే ప్రచారం మాత్రమేనని వైకాపా సర్దిచెప్పుకోవలసిరావడం చాలా బాధాకరమయిన విషయమే. 

ఆ ధర్నాలు ప్రజా సమస్యల కోసమా, ఎన్నికల కోసమా?

  ఇటీవల హూద్ హూద్ తుఫాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వైజాగులో వారం రోజులు మకాం వేసి సహాయ, పునరావాస చర్యలు పర్యవేక్షించడంతో స్థానిక ప్రజలు ఆయనను చాలా మెచ్చుకొన్నారు. కేవలం వారం పదిరోజుల్లోనే తుఫాను దెబ్బకు ఘోరంగా దెబ్బ తిన్న వైజాగ్ నగరాన్ని మళ్ళీ గాడినపెట్టిన తరువాత కానీ ఆయన కదలలేదు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందంటూ ధర్నాలు చేసారు, కానీ దానికి బొత్తిగా ప్రజల నుండి స్పందన కరువయింది. అంతే కాదు ప్రధాని మోడీ ప్రకటించిన రూ. వెయ్యి కోట్లు తీసుకు రావడంలోను రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందంటూ, ఆయన ఆ వంకతో డిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధిక, హోంశాఖ మంత్రులను కలిసి రావడం కూడా విమర్శలకు తావిచ్చింది.   గతంలో వివిధ కారణాల వలన వాయిదా పడిన విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జి.వి.యం.సి.) ఎన్నికలను త్వరలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పసిగట్టగానే ఆయన కన్ను మళ్ళీ విశాఖ మీద పడింది. గతంలో అక్కడి నుండి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పోటీకి నిలబెట్టవద్దని కొణతాల వంటి పార్టీ విధేయులు ఎంతగా వారిస్తున్నా వినకుండా పోటీకి నిలబెట్టి ఆమె ఓటమికి కారణమయిన జగన్మోహన్ రెడ్డి, ఈసారి జి.వి.యం.సి. ఎలాగయినా గెలిచి వైజాగ్ పై పట్టు సాధించాలని భావిస్తున్నారు. కానీ కొణతాల, దాడి వీరభద్ర రావు, గండి బాబ్జి, వంటి కొందరు నేతలు వారి అనుచరులు ఇప్పటికీ పార్టీని వీడి వెళ్లిపోగా మరో నలుగురు యం.యల్యే.లు వారి అనుచరులు కూడా త్వరలో పార్టీని వీడి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఎన్నికలు ముంచుకు వస్తున్న ఈ కీలకమయిన సమయంలో పార్టీని వీడి ఎవరూ బయటకువెళ్లిపోకుండా నిలిపి ఉంచేందుకు ఈనెల 21న అంటే రేపు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలతో విస్త్రుత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. విశాఖలో తన ఉనికిని చాటు కొనేందుకు, రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల హామీలను వెంటనే అమలుచేయాలని కోరుతూ వచ్చేనెల 5న జగన్ స్వయంగా మహాధర్నా నిర్వహించబోతున్నారు.   పోగొట్టుకొన్న చోటే ఉంగరం వెతుక్కోవాలనే ఆయన ఆలోచన సరయినదే. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ధర్నాలు చేస్తూ అవి ప్రజా సమస్యలపై పోరాటాలని కలరింగ్ ఇస్తే అది ‘అవిశ్వసనీయత’ అవుతుంది. తుఫాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన చొరవను, నిర్వహించిన సహాయ చర్యలను మెచ్చుకొంటున్న ప్రజల ముందు ఆయనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ ధర్నాలు చేయడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందేమో?

జానా కూడా జంప్ జిలానీ అవుతారా?

  యుద్ధంలో సేనాధిపతి అందరికంటే ముందు వుండాలి. సైన్యం వీరోచితంగా యుద్ధం చేసేలా ఉత్సాహాన్నివ్వాలి. అయితే అలాంటి సేనాధిపతి శత్రువులకు లొంగిపోతే యుద్ధం ముగిసిపోయినట్టే. మరి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయా అనే సందేహాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేల మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. ఆ మంత్రానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమధ్య తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరితే ఎంటర్‌టైన్‌మెంట్ చూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తూ వుండటంతో బిత్తరపోయారు. అర్జెంటుగా ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించారు. అసెంబ్లీలో కూడా నానా లొల్లి చేశారు. ఇంతవరకూ ఓకే... ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నానా గందరగోళం చేస్తుంటే, శాసనసభా పక్షం నాయకుడు జానారెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ వుండటం అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.   తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ నాయకులు ప్రతి అంశంలోనూ వాగ్ధాటితో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. వారి ధాటికి తట్టుకోలేకే ప్రభుత్వం వారిని వారం రోజులపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రలోభపెట్టే అంశం మీద అసెంబ్లీలో గానీ, బయట గానీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి మాట్లాడిన తీరు చప్పచప్పగా వుండటమే కాకుండా, ఆయన ప్రసంగం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదని అంటున్నారు. మాటలతో ప్రభుత్వాన్ని కడిగిపారేయాల్సిన జానారెడ్డి ఒక్కోమాట ఆచి తూచి మెల్లగా మాట్లాడుతూ, నీతిసూత్రాలు చెబుతున్నట్టుగా మాట్లాడుతూ వుండటం ఎంతమాత్రం బాగాలేదని కాంగ్రెస్ పార్టీవారే గొణుక్కున్నారు. ఆ తర్వాత ఒక రోజు జానారెడ్డి సభకు రాకపోవడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఉప నాయకుడు జీవన్ రెడ్డి సభలో వాడిగా, వేడిగా మాట్లాడి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేశారు. అంతకుముందు రోజు జానారెడ్డి మాట్లాడిన తీరుకంటే జీవన్ రెడ్డి మాట్లాడిన తీరు బాగుందని, టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా పోరాడే విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం పెంచిందన్న అభిప్రాయాలు వినిపించాయి.   ఇదిలా వుంటే మొన్న ఒకరోజున అసెంబ్లీ స్పీకర్ జానారెడ్డి మినహా కాంగ్రెస్ సభ్యులందరినీ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అందర్నీ సస్పెండ్ చేసి జానారెడ్డిని మాత్రం ఎందుకు వదిలేశారో ఎవరికీ అర్థం కాలేదు. సస్పెండ్ అయిన కాంగ్రెస్ సభ్యులందరూ సభ నుంచి బయటకి వెళ్ళిపోతే, వారికి నైతిక మద్దతు ఇస్తూ జానారెడ్డి కూడా బయటకి వెళ్ళిపోతే మర్యాదగా వుండేది. అయితే జానారెడ్డి మాత్రం తాను కూర్చున్న సీట్లోంచి అంగుళం కూడా కదలకుండా కూర్చున్నారు. జానారెడ్డి వ్యవహరించిన ఈ తీరు కాంగ్రెస్ సభ్యులకే అర్థం కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జానా గళం విప్పకపోవడం, కాంగ్రెస్ సభ్యులకు నైతిక మద్దతు ఇవ్వకపోవడం చూస్తుంటే టీఆర్ఎస్ ఆకర్ష మంత్రానికి జానారెడ్డి కూడా లొంగిపోయారా అనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే జానారెడ్డి కూడా జంప్ జిలానీ అయ్యే ఛాన్స్ ఉందని ఊహిస్తున్నారు.

పార్టీ ఫిరాయింపులు..తిలా పాపం తలో పిడికెడు

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఒక దుస్సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారని ప్రతిపక్షనేత జానారెడ్డి విమర్శించారు. అందుకు తెరాస సభ్యులు కూడా కాంగ్రెస్, తెదేపాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరిని ఏవిధంగా పార్టీ ఫిరాయింపులకి ప్రోత్సహించిందీ పేర్లు, గణాంకాలతో సహా వివరించి ఇదేమీ తాము కొత్తగా మొదలుపెట్టిన ప్రక్రియ కాదని సమర్ధించుకొన్నారు. తెరాస వాదనలో నూటికి నూరు శాతం నిజమని ఒప్పుకోక తప్పదు.   గతంలో రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఇదేవిధంగా బలహీనపరిచారు. ఆ తరువాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కూడా తను తలుచుకొంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతున్న తన విధేయులను బయటకు రప్పించి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వాన్ని కూలదోయగాలనని గర్వంగా చెప్పుకోవడమే కాక కాంగ్రెస్, తెదేపా సభ్యులను పార్టీ ఫిరాయింపజేశారు కూడా. అయితే ఆయన ఊహించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోలేదు. అదివేరే సంగతి. రాష్ట్ర విభజన తరువాత, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు కప్పలు దూకినట్లు ఏవిధంగా వైకాపా, తెదేపాలలోకి దూకేరో అందరూ చూసారు.   ఆ తరువాత నుండి నేటి వరకు కూడా అధికార పార్టీలయిన తెరాస, తెదేపాలలోకి ఇతర పార్టీల యం.యల్యే.లు వచ్చి చేరుతూనే ఉన్నారు. ఇదొక నిరంతర ప్రక్రియ. అందుకు ఎవరినీ ఎవరూ నిందించుకొనవసరం లేదు. పార్టీలన్నీ సిద్దాంతాలకు, విలువలకు తిలోదకాలు ఇచ్చినప్పుడే ఇక న్యాయం, ధర్మం గురించి మాట్లాడే అర్హత కోల్పోయాయి. అందువలన తాము స్వయంగా తయారుచేసుకొన్న ఈ వికృత రాజకీయ వ్యవస్థను చూసి ఇప్పుడు అవి భయపడటం, ఇతరులను నిందించడం చాలా హాస్యాస్పదం.

హైదరాబాద్ లో మరింత పటిష్టమయిన నిఘా వ్యవస్థ అవసరం

  అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డిపై ఈరోజు ఉదయం హత్యా ప్రయత్నం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఆయన త్రుటిలో తప్పించుకోగలిగారు. ఆయనపై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు? ఆయనను ఎందుకు హత్య చేయాలనుకొన్నాడు? హత్య చేయదలిస్తే చేతిలో ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం ఉంచుకొని, దూరం నుండి కాల్చే బదులు కారులో ప్రవేశించి కాల్చాలని ఎందుకు ప్రయత్నించాడు. అంటే అతను నిజంగా ప్రొఫెషనల్ కిల్లర్ కాడా? కానప్పుడు అతను ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం ఏవిధంగా సంపాదించాడు? అతను నిజంగానే నిత్యానంద రెడ్డిని హత్య చేయాలను కొన్నాడా లేకపోతే కేవలం ఆయనను భయపెట్టేందుకే ఆ విధంగా చేసాడా? పారిపోతున్నపుడు తనను పోలీసులకి పట్టివ్వగల సాక్ష్యాలుగా పనికి వచ్చే ఏ.కె.47, బ్యాగుని కారులో ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? బ్యాగులో ఏమున్నాయి? అనే అనేక ప్రశ్నలు ఎవరికయినా కలుగక మానవు. వాటన్నిటికీ పోలీసులే సమాధానాలు కనుగొనాల్సి ఉంటుంది.   ఇక ఈ సంఘటన హైదరాబాద్ లో ప్రజల ప్రాణాలకు ఎంత భద్రత ఉందో అద్దం పట్టేదిగా ఉంది. ఒక వ్యక్తి పట్టపగలు జనసందోహం బాగా ఉన్నప్రాంతంలో అందరి కళ్ళ ఎదుటే ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధంతో హత్యాప్రయత్నం చేయడం, తప్పించుకొని పారిపోగలగడం వంటివి నిఘా వ్యవస్థ మరింత పటిష్టం కావలసిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. ఈరోజు నిత్యానంద రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఒక మామూలు హత్య కేసుగా పరిగణించలేము. ఎందుకంటే ఆ వ్యక్తి చేతిలో ఉన్నది సైనికులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు మాత్రమే ఉపయోగించ గలిగే ఏ.కె.47వంటి అత్యధునికమయిన ఆయుధం. అదే అయుధాన్ని ఆ వ్యక్తి పార్క్ కు వచ్చిన ప్రజలపై గురిపెట్టి ఉండి ఉంటే ఎంత అనర్ధం జరిగి ఉండేదో ఎవరయినా తేలికగానే ఊహించగలరు. గన్ సంస్క్రతికి బాగా అలవాటుపడిన అమెరికా దేశంలో ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు జరగడం చూస్తూనే ఉన్నాము.   అందువల్ల ఈ సంఘటనను అంత తేలికగా తీసిపారేయలేము. హైదరాబాద్ నగరాన్ని ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులు కన్నెత్తి చూడలేని విధంగా అత్యాధునికమయిన పోలీసింగ్ వ్యవస్థను, నగరమంతా సిసి. కెమెరాలతో కట్టుదిట్టం చేస్తానని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు చాలా సార్లు ప్రకటించారు. ఆ ప్రయత్నంలోనే నగర పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలతో కూడిన ఇన్నోవా కార్లను కూడా కొని ఇచ్చారు. అయినా అసాంఘిక శక్తులు తరచూ నగరంలో ఎక్కడో అక్కడ తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నాయి. అయితే నగరంలో జరిగే ఇటువంటి ప్రతీ సంఘటనను నియత్రించడం ఎంతవారికయినా అసాధ్యం కనుక పోలీసులను నిందించడానికి ఏమీ లేదు.   కానీ ఈరోజు జరిగిన సంఘటన నగరంలో నిఘా వ్యవస్థ మరింత కట్టు దిట్టం కావలసిన అవసరం చాలా ఉందనే సంగతిని నొక్కి చెపుతోంది. అంతే కాదు ఇటువంటి సంఘటనలు కేవలం హైదరాబాద్ లో మాత్రమే జరుగుతుంటాయని మిగిలిన జిల్లాలు, రాష్ట్రాలు నిర్లిప్తత వహించకుండా ముందే ఇటువంటి వాటికి అవసరమయిన నివారణ చర్యలు చెప్పట్టడం మంచిది. ముఖ్యంగా కొత్తగా నిర్మించబోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలో, ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్న విశాఖలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అత్యాదునికమయిన పరికరాలను పోలీసింగ్ వ్యవస్థను ముందు నుండే ఏర్పాటు చేసుకోవడం మంచిది.

తెదేపా సభ్యులను సభలోనే ఉండనిస్తే బాగుండేదేమో?

  శాసనసభ నుండి వారం రోజుల పాటు బహిష్కరింపబడిన తెదేపా సభ్యులు, ఈరోజు ఇందిరా పార్క్ వద్ద చేసిన ధర్నాతో తెరాస ప్రభుత్వం తలపట్టుకోనేలా చేసినట్లు కనబడుతోంది. వారిని సభలో ఉండనిచ్చి ఉంటే, వారు కేవలం నినాదాలతో సరిబెట్టుకొనేవారు. కానీ వారిని ఏకంగా వారం రోజుల పాటు బహిష్కరించడంతో వారు మొదటి రోజు జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహించి, ప్రభుత్వ నిరంకుశ ధోరణిని ఎండగట్టారు. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద వారు చేసిన ధర్నాకు ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను కూడా రప్పించి వారి చేతనే ప్రభుత్వాన్ని నిలదీయించడంతో, తెరాస ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన పరిస్థితి కల్పించారు.   ఎన్నికలకు ముందు కరెంటు ఇస్తాము, రైతులను ఆడుకొంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఇప్పుడు మరో మూడేళ్ళ వరకు విద్యుత్ ఇవ్వలేనని తెగేసి చెప్పడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతులపట్ల కనీసం మానవతా దృక్పధంతో స్పందించలేకపోతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒకవైపు రైతులు ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొంటుంటే, ఇప్పుడు మంత్రులకు బుల్లెట్ ప్ర్రోఫ్ లగ్సరీ కార్లు కొనాలనుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. కార్లు కొనడం కాదు ఆ డబ్బుతో ముందు రైతులను ఆదుకొంటే బాగుంటుందని ఆయన అన్నారు.   ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ “ప్రభుత్వం తన అసమర్ధతను, వైఫల్యాలను కప్పి పుచ్చుకోనేందుకే గత ప్రభుత్వాలను నిందిస్తోందని, కానీ తెలంగాణా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆయన విమర్శించారు. తెదేపా నేతలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం వలన దానికి మీడియా కవరేజి కూడా బాగానే వచ్చింది.   శాసనసభ్యులను సస్పెండ్ చేసి బయటకు పంపించి వేస్తే హాయిగా సభ జరిపించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తే వారు బయటకు వెళ్లి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్రజలందరి దృష్టిని ఆకట్టుకొంటున్నారు. ఈరోజు 13 మంది కాంగ్రెస్ సభ్యులను కూడా సభ నుండి సస్పెండ్ చేయడంతో వారు కూడా గవర్నరు వద్దకు వెళ్లి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుపై పిర్యాదు చేయబోతున్నారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద సమావేశం పెట్టి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవేళ నేడో రేపో బీజేపీ సభ్యులను కూడా సభ నుండి సస్పెండ్ చేసి బయటకు పంపినట్లయితే తెలంగాణా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాసి నిరంకుశ పోకడలు పోతోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరుతుంది. కనుక సాధ్యమయినంత వరకు అటువంటి పరిస్థితి రాకుండా తెరాస జాగ్రత్త పడవచ్చును.

పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొన్న యంపీ చిరంజీవి

  ఆశయం, ఆలోచన మంచిదయితే దేవుడు కూడా అటువంటి పనులకు సహాయం అందిస్తాడని పెద్దలు అంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ కార్యక్రమానికి పార్టీలకతీతంగా పార్లమెంటులో యంపీలు, కేంద్రమంత్రులు స్పందిస్తూ తమ తమ నియోజక వర్గాలలో గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసేందుకు నడుం కడుతున్నారు. మోడీని, బీజేపీని అమితంగా ద్వేషించే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీతో సహా అనేకమంది కాంగ్రెస్ యంపీలు తమకు నచ్చిన గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయదానికి సిద్దపడటం విశేషం.   అధినేత్రి బాటలోనే నడుస్తూ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా తన స్వస్తలమయిన పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు మండలంలో గల పేరుపాలెం గ్రామాన్ని దత్త తీసుకొంటున్నట్లు ప్రకటించారు. తన యంపీ లాడ్స్ నిధులతో ఆ గ్రామంలో నీళ్ళు, మురుగు కాలువలు, లెట్రిన్ల నిర్మాణం, విద్యుత్, విద్యా, వైద్య సదుపాయాలూ కల్పించి అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు.   ఇంతవరకు 344మంది లోక్ సభ సభ్యులు, 86మంది రాజ్యసభ సభ్యులు దేశంలో వివిధ గ్రామాలను దత్తత తీసుకొన్నారు. వారిలో అశోకగజపతి రాజు, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, చిరంజీవి, సచిన్ టెండూల్కర్, సుషమా స్వరాజ్, జితేంద్ర సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, సుప్రియ సూలె తదితర యంపీలున్నారు.   పార్టీల కతీతంగా సాగుతున్న ఈ మహా యజ్ఞంలో కాంగ్రెస్, బీజేపీ, తెదేపాలతో సహా వైకాపా, తృణమూల్ కాంగ్రెస్, జే.డి.యు.,ఆర్.జే.డి.,యన్.సి.పి.,అన్నాడియం.కె.,యల్.జే.పి., జే.యంయం.,మరియు అనేక ఇతర రాజకీయ పార్టీలకు చెందిన యంపీలు పాలుపంచుకోవడం విశేషం.   ఇంతవరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా దేశంలో అన్ని పార్టీలను ఈవిధంగా ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి దేశాభివృద్ధికి కష్టపడేలా చేయలేదు. కనీసం ఇటువంటి ఆలోచన కూడా ఎవరికీ కలగలేదు. కానీ మోడీ అధికారం చేపడుతూనే దేశాన్ని ప్రగతి పధం వైపు నడిపించేందుకు ప్రయత్నించడమే కాక అందులో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన యంపీలను కూడా భాగస్వాములు చేయడం విశేషం. ఈ మహా ప్రస్తానం మోడీ నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతోందని చెప్పవచ్చును.

తెలంగాణ మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టుల సమస్య పెరిగే అవకాశాలు వున్నాయని కొంతమంది దుష్ప్రచారం చేశారని, అయితే అలాంటిదేమీ లేదని రాష్ట్రం చాలా ప్రశాంతంగా వుందని, మావోయిస్టులనేవాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కోణం ఇలా వుంటే తాజాగా తెలంగాణ మంత్రులందరికీ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం వారం రోజుల క్రితం 70 వాహనాలు కొనుగోలు చేయడానికి నిధులను కూడా విడుదల చేసింది. ఈ నిర్ణయం అనేకమందికి అనేకానేక సందేహాలు కలిగిస్తున్నాయి. మావోయిస్టులతో ఇబ్బంది లేనప్పుడు మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి మావోయిస్లు సమస్య లేకపోయినా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనడం ఎందుకు? ప్రజల డబ్బును వృధా చేయడం ఎందుకున్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అలా ప్రశ్నించినవారిని సమాధానపరిచే సమాధానాలు మాత్రం రావడం లేదు.   ఇప్పుడు మంత్రులుగా వున్నవారి వాహనాలన్నీ పాతవైపోయినందున వారికి కొత్త వాహనాలు కొనడం తప్పనిసరి అయిందని, ఎలాగూ వాహనాలు కొంటున్నాం కాబట్టి ఆ కొనేవేవో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అయితే మరీ మంచిది కదా అనే ఉద్దేశంతోనే భారీ ఖర్చుతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొంటున్నామన్న సమాధానాలు అధికారవర్గాల నుంచి వస్తున్నాయి. అయితే ఈ సమాధానాలు విమర్శకులకు సంతృప్తిని కలిగించడం లేదు. నిజానికి ప్రభుత్వం మావోయిస్టుల నుంచి మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు ముప్పు పొంచి వుందని భయపడుతోందని, ఆ భయాన్ని బయటపెట్టడం ఇష్టం లేక ఏవేవో కారణాలు చూపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇవ్వడంతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో వున్న మొత్తం వాహనాలను మొత్తం మార్చేసి అన్ని వాహనాలూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వుండేలా చూసుకుంటున్నట్టు సమాచారం. వీటిలో ఒక్కో వాహనం ఖరీదు దాదాపు కోటి నలభై లక్షల రూపాయలు చేస్తుందని తెలుస్తోంది.

మెట్రో రైల్ ప్రాజెక్టుకి కేసీఆర్ లైన్ క్లియర్

  హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు-రెండవ దశ పనులపై నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది. యల్. యండ్.టి. సంస్థ చైర్మన్ ఏ.యం. నాయక్ మరియు సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారంనాడు నిర్వహించిన సమావేశంలోఎవరికీ నష్టం జరగకుండా, అందరికీ ఆమోదయోగ్యమయిన విధంగా ప్రాజెక్టు పూర్తిచేయాలని అందరూ ఒక అంగీకారానికి వచ్చారు. రెండవ దశలో అలైన్మెంట్ మార్పు కారణంగా ఆయె అదనపు ఖర్చును ప్రభుత్వమే భరించేందుకు కేసీఆర్ అంగీకరించారు. కనుక కేసీఆర్ సూచించిన విధంగానే యల్. యండ్.టి. సంస్థ కూడా అలైన్మెంట్ మార్పుకి అంగీకరించింది. ప్రస్తుతం 70కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 200కి.మీ.లకు పొడిగిద్దామని కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు సంస్థ యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.   ఈ ప్రాజెక్టు లాభదాయకం కాదు కనుక మధ్యలో వదిలి వెళ్లిపోతామంటూ ఇదివరకు ఆ సంస్థ చైర్మన్ ఏ.యం. నాయక తెలంగాణా ప్రభుత్వానికి వ్రాసిన లేఖను పట్టుకొని, ఆంధ్రాకు అనుకూలంగా పనిచేస్తున్న కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని ప్రాజెక్టు గురించి, ప్రభుత్వం గురించి కూడా చాల చెడు ప్రచారం చేశాయని, కానీ కోర్టు వివాదాలు, అభ్యంతరాల కారణంగానే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయిన అనుమతులు మంజూరు చేయడంలో ఆలస్యం అవుతోంది తప్ప, ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా చేయడం లేదని ఆయన వివరణ ఇచ్చాక. సంస్థ చైర్మన్ నాయక కూడా తన లేఖ వల్ల ప్రభుత్వానికి కలిగిన ఇబ్బందులకి చింతిస్తున్నానని తెలపడమే కాకుండా అందుకు బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు.   ఇకపై మెట్రో ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణా ప్రభుత్వం నిర్మించతలబెట్టిన, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం, ట్యాంక్ బ్యాండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం కోసం తమ సంస్థకు అవకాశం ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు. మళ్ళీ ఈ నెల 20న వారు మరోమారు సమావేశమయ్యి, ఈ ప్రాజెక్టులో మిగిలిన అంశాల గరించి కూడా చర్చిస్తారు.

త్వరలో ఏపీకి మరో రెండు భారీ పరిశ్రమలు

  అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పరిశ్రమలన్నీ దాదాపు హైదరాబాదుకే తరలిపోయేవి. ఆ కారణంగానే రాష్ట్రంలో మరే జిల్లాలో చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమ ఒక్కటీ కనబడటం లేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాష్ట్ర విభజనకు ముందు పారిశ్రామిక ప్రగతి ప్రసక్తే వినని ఆంద్రప్రదేశ్ లో విభజన తరువాత ఈ ఐదు నెలలోనే భారీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడుతుండటం చాలా శుభ పరిణామం.   కొన్ని రోజుల క్రితం హీరో మోటార్ సైకిల్స్ కంపెనీ దక్షిణ భారతదేశంలో తన మొట్ట మొదటి ఉత్పత్తి కేంద్రాన్ని చిత్తూరులో స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. సుమారు రూ.1600కోట్లతో ఆ కర్మాగారం నెలకొల్పుతున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి మరో భారీ సంస్థ రాబోతోంది.   భారతదేశంలో మంచి పేరు మోసిన ‘క్రిషబ్ కో’ ఎరువుల తయారీ కర్మాగారం నెల్లూరులో సర్వేపల్లి వద్ద గల పారిశ్రామిక వాడలో నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం 286 ఎకరాల భూమిని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏ.పి.ఐ.ఐ.సి.) బదలాయిస్తూ నిన్నే ఒక జీ.వో. జారీ చేసింది. ఏ.పి.ఐ.ఐ.సి. సంస్థ ఆ భూమిని ఎకరం ఏడూ లక్షల చొప్పున ‘కృషబ్ కో’కు అమ్ముతుంది. అదే ప్రాంతంలో యూ.పి.ఐ. పాలిమర్స్ అనే పైపులు, నీటిని వెదజెల్లే స్ప్రిన్క్లర్స్ మరియు డ్రిప్ ఇరిగేష్ పరికరాలు తయారుచేసే కర్మాగారం కోసం మరో 50 ఎకరాల భూని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నన్నే ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కాకుండా అదే ప్రాంతంలో 150 ఎకరాల విస్తీరణంలో కంటైనర్ కార్పోరేషన్ సంస్థ స్థాపించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు వచ్చింది. త్వరలోనే దానికీ భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీ.ఓ.జారీ చేసే అవకాశాలున్నాయి.   నిజానికి ‘కృషబ్ కో’ యాజమాన్యం రాష్ట్రంలో ఈ భారీ కర్మాగారం స్థాపించేందుకు 2012లోనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంది. కానీ అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యమే ఇప్పుడు రాష్ట్రానికి వరంగా మారడం విశేషం. ఈ సంస్థ మొత్తం రూ.2000 కోట్లు రెండు దశలలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఎరువుల కర్మాగారంలో రోజుకి 1600టన్నుల ఎరువు తయారవుతుంది. ఈ కర్మాగారం ద్వారా నేరుగా 300 నుండి 400 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తే, ప్యాకింగ్, రవాణా, కేటరింగ్, హోటల్ పరిశ్రమల ద్వారా పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది అని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏ.పి.ఐ.ఐ.సి.) చైర్మన్ పి.కృష్ణయ్య మీడియాకు తెలిపారు. త్వరలోనే ఈ క్రిషబ్ కో యాజమాన్యానికి భూమిని కేటాయించబోతున్నామని, వచ్చే ఏడాది మార్చిలోగా కర్మాగార నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయని ఆయన తెలిపారు. రెండేళ్లలో పరిశ్రమ పూర్తి స్థాయిలో ఉత్పత్తి మొదలుపెట్టగలదని క్రిషబ్ కో యాజమాన్యం తెలిపింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసినట్లయితే బహుశః మరిన్ని భారీ, మధ్య తరహా పరిశ్రమలు, ఐటీ సంస్థలు రాష్ట్రానికి క్యూ కట్టవచ్చును.      

రాష్ట్రంలోనే కాదు సభలో కూడా ఎదురు ఉండకూడదంటే ఎలా?

  తెలంగాణా అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి హరీష్ రావు అవసరమయితే తెదేపా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసయినా సరే సభను నిర్వహిస్తామని మొన్న హెచ్చరించారు. చెప్పినట్లే అన్నంత పనీ చేసి చూపించారు కూడా. సభ సజావుగా సాగనీయకుండా అడ్డుపడుతున్నారంటూ పదిమంది తెదేపా సభ్యులను ఏకంగా వారం రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు నోటికి ఎంతవస్తేంతా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ యంపీ కవితపై నిరాధారమయిన ఆరోపణలు చేసినందుకు రేవంత్ రెడ్డి సభలో క్షమాపణలు చెప్పవలసిందే అంటూ పట్టుబట్టారు. కానీ రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. బహుశః అందుకే తెదేపా సభ్యులందరినీ సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని సభ నుండి సస్పెండ్ చేయించినట్లు కనిపిస్తోంది.   రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే ఆయన ఒక్కరిని సభ నుండి సస్పెండ్ చేసి ఉంటే సరిపోయేది. కానీ ఆ మిషతో మొత్తం తెదేపా సభ్యులు అందరినీ సభ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేయడం చాలా అప్రజాస్వామిక చర్య. తెలంగాణా రాష్ట్రంలో తమ పార్టీకి అసలు వేరే పార్టీ నుండి పోటీయే ఉండకూడదని భావించే తెరాస అధినేత కేసీఆర్, శాసన సభలో కూడా తమకు ఎవరు ఎదురు చెప్పకూడదు. తమ తప్పులు ఎత్తి చూపుతూ తమను విమర్శించ రాదు. తమను ప్రశ్నించకూడదు...అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే తమను సభలో గట్టిగా నిలదీస్తున్న తెదేపా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు.   తెరాస చర్యలను సభలో మిగిలిన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈవిధంగా ప్రతిపక్ష సభ్యులందరినీ ఏదో ఒక సాకుతో సభ నుండి సస్పెండ్ చేసుకొంటూపోతే చివరికి సభలో అధికార పక్ష సభ్యులే మిగులుతారని కాంగ్రెస్ సభ్యుడు కె జానారెడ్డి ఎద్దేవా చేసారు. నిజానికి తెరాస కూడా అదే మేలని భావిస్తుండవచ్చు. కానయితే ఆ విషయం బహిరంగంగా చెప్పడం మంచిది కాదని ఊరుకొని ఉండవచ్చును. అంతే. సభలో బీజేపీ సభ్యులు కూడా తెరాస ప్రభుత్వాన్ని కడిగి పడేస్తున్నారు కనుక, బహుశః నేడో రేపో వారిని కూడా సభ నుండి సస్పెండ్ చేసి బయటకు పంపివేస్తారేమో! ఒకవేళ తెరాస నేతలు శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల గొంతు వినబడకూడదని భావిస్తున్నట్లయితే ఈ సభా సమావేశాలు నిర్వహించడమే అనవసరం. కానీ అది మన దేశంలో వీలుపడదు కనుకనే నిర్వహించవలసి వస్తోంది.   ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా సభ్యులు, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా గట్టిగా నిలదీస్తున్నప్పటికీ, అధికార పార్టీ సభ్యులు వారికి ధీటుగా సమాధానాలు చెపుతూ ప్రతివిమర్శలు చేస్తున్నారు తప్ప ఈవిధంగా ప్రతిపక్ష సభ్యులందరినీ సభ నుండి బయటకి పంపేసి సభలో తమ మాటకు ఎదురులేకుండా చేసుకోవాలని ప్రయత్నించలేదు.   నియంతృత్వ పోకడలకు ప్రజాస్వామ్యంలో తావు లేదు. ఒకవేళ అటువంటి లక్షణాలు కనబరిస్తే దానిని చక్క దిద్దగల సమర్ధత మన రాజ్యాంగ వ్యవస్థలకు ఉంది కనుకనే నేటికీ మనదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా నిలబడి ఉంది. అధికారంలో ఉన్నవారికి సహనం చాలా అవసరం. అది లేకపోతే ప్రజల ముందు తామే అభాసుపాలవుతామని తెరాస నేతలు గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కృష్ణమ్మ ఒడ్డున సింగపూరు కడితే, హుస్సేన్ సాగర్ పక్కన పెట్రోనాస్ కట్టాల్సిందే

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదుకి ధీటుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప రాజధాని నిర్మిస్తానని చెప్పడమే కాకుండా ఆ దిశలో అప్పుడే చురుకుగా అడుగులు వేస్తున్నారు కూడా. కేంద్రం కూడా అందుకు సహాయం అందించేందుకు సిద్దంగా ఉంది. ఆ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించేందుకు ఆయనకు ముగ్గురు మంత్రులు కూడా డిల్లీలో ఉన్నారు. ఇదివరకు హై టెక్ సిటీ నిర్మించి చూపిన ఆయన ఇప్పుడు ఈ అత్యంత ఆధునికమయిన సుందర రాజధానిని తప్పకుండా నిర్మిస్తారని ప్రజలు కూడా గట్టిగా విశ్వసిస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు కనుక తప్పని సరి పరిస్థితుల్లో కొత్త రాజధానిని నిర్మించవలసి వస్తోంది. కనుకనే చంద్రబాబు ఆ పనిలో పడ్డారు.   ఆయనకు ఎందులోనూ తీసిపోకూడదనే ఆలోచనో లేకపోతే ప్రజల దృష్టి విద్యుత్ సమస్యలపై మళ్ళించేందుకో తెలియదు కానీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా హుస్సేన్ సాగర్ ను మంచి నీటి చెరువుగా మార్చి దాని చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని డిసైడ్ అయిపోయారు. రాజుగారు తలుచుకొంటే కొరడా దెబ్బలకు కరువా? అన్నట్లు ఆయన వెంటనే అధికారులను సమావేశపరిచి, దీనినేవిధంగా వర్కవుట్ చేయాలో చూడమని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న మురికివాడలలో ప్రజలను అందరినీ ఖాళీ చేయించి, కొత్తగా తన ప్రభుత్వం కట్టబోయే ఆ ‘పెట్రోనాస్ టవర్స్’ లలోకి మార్చేద్దామని ఆయన ప్రతిపాదించారుట. కలల ప్రపంచంలో జీవిస్తున్న కేసీఆర్, ప్రజలని వారి కష్టాల నుండి మరిపించేందుకే వారిని కూడా తన కొత్త బంగారి లోకంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారేమో?   ఆయన రాష్ట్ర బడ్జెట్ ను లక్ష కోట్లయితే చాలా వీజీగా దాటించేయగలిగారు, కానీ దానిలో పేర్కొన్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి తన వద్ద అంత సొమ్ము లేదని, కేంద్రం నియమనిబంధనలు సడలించి తన ప్రభుత్వానికి అనుమతిస్తే బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకొని ‘పని కానిచ్చేస్తామని’ ఆయనే స్వయంగా శాసనసభలో చెపుతున్నప్పుడు, లక్షల కోట్లు ఖర్చయ్యే పెట్రోనాస్ టవర్లు ఒకటో రెండో డజన్లు ఒకేసారి నిర్మించేద్దామనుకోవడం చాలా గొప్ప విషయమే.   ఈ ఐదేళ్ళలో ఆయన ట్యాంక్ బ్యాండ్ చుట్టూ పెట్రోనాస్ టవర్లు నిర్మించినా నిర్మించలేకపోయినా, దానిలో పేరుకు పోయిన మురుగు నీటిని మాత్రం తప్పకుండా ఖాళీ చేయించగలరని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే దానికి పెద్దగా ఖర్చవదు కనుక. ఒకవేళ ఆయన ఆ ఒక్కపని పూర్తిచేసినా చాలు హైదరాబాద్ ప్రజలు చాలా మెచ్చుకొంటారు.   ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. దానిని అధిగమించడానికి ఇరుగుపొరుగు రాష్ట్రాల నుండి వేలు,లక్షల కోట్లు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేయవలసి ఉంది. అదేసమయంలో లక్షల కోట్లు వ్యయం అయ్యే తన హామీలను కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ ఆయన ఇవి సరిపోవన్నట్లు హటాత్తుగా ఈ పెట్రోనాస్ టవర్లు కట్టేయాలని ఎందుకు భావిస్తున్నారు? వాటికి లక్షల కోట్ల నిధులు ఏవిధంగా సమకూర్చుకొంటారు? రైతు సమస్యలను పక్కన బెట్టి గాల్లో మేడలు కడతామంటే ప్రజలు ఏమనుకొంటారు? వంటి ప్రశ్నలకు ఆయన సమాధానాలు సిద్దం చేసుకోవలసి ఉంటుంది. ఒకవైపు నిత్యం రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటుంటే ఆయన ఆకాశానికి నిచ్చెనలు వేయాలనుకోవడం ఇటువంటి విమర్శాలకే దారి తీస్తుంది.   అయితే ఆయన తలబెట్టిన చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుండే కాదు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తోంది. ఎందుకంటే ఆ పని చేయడానికి ఈవిధంగా ఆకాశానికి నిచ్చెనలు వేయనవసరం లేదు. పైగా దాని వలన రైతాంగానికి తక్షణమే ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో పాడి పంటలకు పెద్ద ఇబ్బందులు ఏవీ లేవు. కనుక చంద్రబాబు నాయుడు తన రాష్ట్రానికి ముందు ఏది అవసరమో అది చేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా తన రాష్ట్రానికి ఏది అవసరమో దానికే ప్రాదాన్యాత నిస్తే అందరూ హర్షిస్తారు.

కేసీఆర్ పరిపాలనలో ఫెయిల్: రేవంత్ రెడ్డి

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ అధికారుల కొరత కారణంగా ఆశించినంత సమర్ధమయిన పాలన అందించలేకపోతున్నామని త్వరలోనే అన్నీ సర్దుకొంటాయని అంతవరకు ప్రజలు, ప్రతిపక్షాలు కూడా కొంచెం ఓపిక పట్టాలని కోరడం అందరూ విన్నారు. కానీ తెలంగాణా తెదేపా శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి దానిపై స్పందించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సమస్య కేవలం తెలంగాణాకే కాక ఆంద్రప్రదేశ్ కు కూడా ఉందని, అయినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా అధికారుల కొరతని సాకుగా చూపి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కనబెట్టలేదని, అన్నిటినీ ఎంతో సమర్ధంగా నిర్వహించుకొంటూ పరిపాలన సాగిస్తున్నారని, కానీ కేసీఆర్ పరిపాలన చేతకాకనే ఇటువంటి కుంటి సాకులు చెపుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేసారు.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణాలో మెదక్‌ జిల్లాకు చెందిన రఘునందనరావు అనే ఐ.ఏ.యస్. అధికారిని కృష్ణాజిల్లా కలెక్టర్‌గా నియమించుకొని సేవలు పొందుతుంటే, కేసీఆర్ మాత్రం ఉన్నవారితో కూడా సక్రమంగా పని చేయించుకోలేకపోతున్నారని విమర్శించారు. కార్తికేయన్ అనే సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి, కేసీఆర్ నిర్ణయంతో అసంతృప్తితో చెంది దీర్గకాలిక శలవుపై వెళ్లిపోవడాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తుచేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర పార్టీల శాసనసభ్యులను తెరాసలోకి ఆకర్షించడానికి పడుతున్న కష్టమేదో ప్రభుత్వం నడపడం కోసం పడితే తప్పకుండా మెరుగయిన ఫలితాలు కనబడి ఉండేవని విమర్శించారు.