రాజధాని డిజైనింగ్ వరకే ఒప్పందం: మంత్రి నారాయణ
posted on Dec 11, 2014 6:50AM
రాజధాని నిర్మాణం కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చురుకుగా అడుగులు వేస్తోంది. ఒక అత్యద్భుతమయిన అత్యాధునికమైన రాజధాని నిర్మించాలనే ఆలోచనతో నగరాల డిజైయినింగ్ చేయడంలో మంచి అనుభవం, నైపుణ్యం గల సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో మూడు రోజుల క్రితమే ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకొంది. వారు కూడా అంతే చురుకుగా స్పందిస్తూ వెంటనే పని మొదలుపెట్టేసారు. ఒప్పందం సంతకాలు చేసిన మరునాడే రాష్ట్ర రాజధాని సలహా కమిటీ సభ్యులతో సమావేశమయ్యి రాజధాని బృహత్ ప్రణాళిక రూపకల్పన కోసం తాము అవలంభించబోతున్న విధానాలను వివరించి, మూడు దశలలో మొత్తం 22 వారాలపాటు సాగే తమ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఆ మరునాడే అంటే నిన్న బుధవారం నాడు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణతో కలిసి సింగపూర్ నిపుణుల బృందం రాజధాని నిర్మించబోయే 200కిమీ పరిధిలో హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.
అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఏరియల్ సర్వేతో నిపుణుల బృందం చాలా సంతృప్తి చెందింది. దీనివలన రాజధాని నిర్మించబోయే ప్రాంతం, దానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, పట్టణాలు, విస్తారంగా ఉన్న ప్రకృతి వనరులు వంటివన్నీ పరిశీలించగలిగారు కనుక వారికి ఆ ప్రాంతంపై సమగ్ర అవగాహన ఏర్పడింది. త్వరలోనే ఈసారి రోడ్డు మార్గాన్న కూడా అన్ని ప్రాంతాలు పర్యటించి మరింత అవగాహన పెంచుకొన్న తరువాత రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు, డ్రాయింగుల పని మొదలుపెడతారు."
"వారు ఆరు నెలలలోగా ఈ పని మొత్తం పూర్తి చేయవలసి ఉంటుంది. ఈరాత్రికే వారు తమ కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వానికి అందజేసే అవకాశాలున్నాయి. వారు కృష్ణ నది మధ్యలో సహజ సిద్దంగా ఏర్పడిన భవానీ ద్వీపాన్ని చూసి చాలా ముచ్చటపడ్డారు. అటువంటి ద్వీపాలను తాము కృత్రిమంగా సృష్టిస్తుంటామని, కానీ ఆంద్రప్రదేశ్ రాజధాని పక్కనే అటువంటి సహజసిద్దమయిన అందమయిన ద్వీపం ఉండటం చాలా కలిసివచ్చేదిగా ఉందని వారు తెలిపారు,” అని మంత్రి చెప్పారు.
సింగపూర్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందంపై కూడా ప్రతిపక్షాలు వివాదం సృష్టించడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. “ప్రతిపక్షాలు చెపుతున్నట్లుగా ఆ రెండు సంస్థలు ప్రైవేట్ సంస్థలు కావు. ఆ రెండు సింగపూర్ ప్రభుత్వాధీనంలో నడుస్తున్న సంస్థలు. ఒక ప్రభుత్వ సంస్థ మరొక దేశ ప్రభుత్వ సంస్థలతో చేసుకొన్న ఒప్పందాన్ని కూడా తప్పు పట్టగలగడం, దానిపై అనవసర రాద్ధాంతం చేయడం మన ప్రతిపక్షాలకే చెల్లింది. ఆ ఒప్పందంలో దాచిపెట్టేందుకు ఏమీ లేదు. దానిలో ఎటువంటి రహస్యాలు, లొసుగులు లేవు. ఆ ఒప్పందం కేవలం రాజధాని నగరానికి బృహుత్ ప్రణాళికను, మాస్టర్ ప్లాన్ ఇవ్వడం వరకే పరిమితం. ఆ రెండు సంస్థలు రాజధాని నిర్మాణంలో కూడా పాలు పంచుకొంటాయా లేదా అనే విషయం సమయం వచ్చినప్పుడు ఆలోచిస్తాము."
"ప్రస్తుతానికి వారి పని రాజధానికి డిజైన్, డ్రాయింగులు అందించడం వరకే పరిమితం. వచ్చే ఆరు నెలలలో వారు రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్దం చేసి ఇస్తారు. రాష్ట్రప్రభుత్వంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో వారు సమావేశామవుతూ, రాష్ట్ర అవసరాలను, రాష్ట్ర వనరులను బట్టి రాష్ట్రానికి అన్ని విధాల సరిపోయేవిధంగా రాజధానికి రూపకల్పన చేస్తారు,” అని మంత్రి తెలిపారు.