మేం మందు తాగం- బీహార్లో తండ్రుల ప్రతిజ్ఞ

  వచ్చే ఏప్రిల్ 1 నుంచి బీహార్లో మద్యనిషేధాన్ని అమలుచేసేందుకు అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందు దేశవాళీ మద్యాన్ని నిషేధించనున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వెల్లడించారు. ఎంతో కొంత సెంటిమెంటు లేకపోతే ఈ మద్యనిషేధం విజయవంతం కాదనుకున్నారో ఏమో... నితీశ్‌ ఓ వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 73 వేలమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తండ్రులకు ఓ ప్రతిజ్ఞా పత్రాన్ని అందచేయనున్నారట. ‘మా పిల్లల క్షేమం కోరి మేము మద్యం జోలికి పోము’ అన్నదే ఈ ప్రతిజ్ఞ సారాంశం. ఇలా కనీసం పిల్లల మొహాలు చూసైనా ఇంటిపెద్దలు మద్యాన్ని మానేస్తారన్నది నితీశ్‌ ఆశ! మద్యనిషేధం విషయంలో తాము ఎలాంటి విమర్శలనూ పట్టించుకోమనీ, అనుకున్నది సాధించి తీరతామని నితీశ్‌ సెలవిస్తున్నారు.

ఆటోలను తగలబెట్టండి- రాజ్‌ థాకరే!

  మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన అధ్యక్షుడు రాజ్‌థాకరే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన 70,000 కొత్త ఆటోలు రోడ్ల మీద కనిపిస్తే వాటిని తగలబెట్టమని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులు కొందరు, సదరు ఆటోలను నడపడమే రాజ్‌థాకరే గారి ఆగ్రహానికి కారణమట! మహారాష్ట్రలో ఆటోను నడిపేందుకు 15ఏళ్లపాటు అక్కడే నివాసం ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ, ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా స్థానికేతరులకు లైసెన్సులను మంజూరు చేస్తోందని ఆరోపించారు రాజ్‌. బాల్‌థాకరే మేనల్లుడైన రాజ్‌థాకరే తరచూ ఇలాంటి వ్యాఖ్యలను చేస్తూనే ఉంటారు. వీటికి ప్రభావితం అయిన ఆయన పార్టీ కార్యకర్తలు నిజంగానే హింసకు పాల్పడిన ఘట్టాలు కోకొల్లలు. శివసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంత కుంపటిని పెట్టుకున్న రాజ్‌థాకరే ఇలాంటి స్థానికపరమైన అంశాలతోనే పలు ఎన్నికలకు వెళ్లారు. కానీ మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన చెప్పుకోదగ్గ పార్టీగా ఎదగలేకపోయింది. అయినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు రాజ్‌థాకరే. అమితాబ్‌ మొదలుకొని సచిన్‌ టెండుల్కర్ వరకూ తమ కెరీర్‌లో అందరూ ఆటుపోట్లను ఎదుర్కొన్నవారేననీ, తాము కూడా ఎప్పటికైనా విజేతగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బహుశా అలాంటి విజయాల కోసమే, ఇలాంటి వివాదాలను రేకెత్తుతున్నారేమో!

అదేపనిగా చూస్తున్నారని... విమానంలోంచి దించేశారు

  తీవ్రవాదుల మీద అమెరికా పైచేయి సాధించి ఉండవచ్చుగాక. కానీ ఇంకా ఏమూల నుంచి ఎవరు దాడి చేస్తారో అన్న భయంతోనే బతుకుతున్నట్లున్నారు. అందులోనూ 2001 సెప్టెంబరు 11న విమానాలతో అమెరికా మీద దాడి చేసిన దగ్గర్నుంచీ అక్కడి విమానయాన సంస్థలు అతిజాగ్రత్తగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అమెరికాలోని బోస్టన్‌ నగరం నుంచి లాస్‌ఏంజిల్స్ నగరానికి వెళ్తున్న ఓ విమానంలో ఇద్దరు ముస్లిం వనితలు ఎక్కారు. అయితే వారి చూపులు తనకి ఇబ్బందిగా ఉన్నాయంటూ విమానంలోని ఓ ఉద్యోగి చెప్పడంతో, మిగతా ప్రయాణికులకంటే ముందే వారిద్దరినీ దింపేశారు. ఈ తతంగాన్నంతా రహస్యంగా చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టడంతో జరిగిన విషయం ప్రపంచానికి తెలిసింది. నిజానికి ఆ ముస్లిం మహిళలు చాలా అమాయకంగా ఉన్నారనీ, తమ ప్రయాణాన్నంతా సినిమాలు చూస్తూ గడిపారని సాటి ప్రయాణికుల పేర్కొన్నారు. అయినా ఈ విమానాన్ని నడుపుతున్న జెట్‌బ్లూ సంస్థ మాత్రం తన తప్పును ఒప్పుకోలేదు సరికదా.... ‘వాళ్లు మా గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారన్న అనుమానంతో దింపేశాం. అసౌకర్యానికి చింతిస్తున్నాం!’ అని చేతులు దులిపేసుకుంది.

జయలలిత ఫొటో ఎందుకు- సుప్రీంకోర్టు ఆక్షేపణ

  రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ప్రకటనల మీద, ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండరాదంటూ సుప్రీం కోర్టు గత ఏడాది ఓ తీర్పునిచ్చింది. మరీ అంతగా అవసరం అయితే దేశ ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్య న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ముద్రించాలని సదరు తీర్పులో పేర్కొంది. మరి అమ్మ బొమ్మ లేకుండా తమిళనాడులో ఏ ప్రకటనా ఉండదు కదా! అందుకని సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా కూడా అక్కడి పౌరసంబంధాల శాఖ, జయలలిత బొమ్మలతోనే ప్రభుత్వ ప్రకటనలను రూపొందిస్తోంది. దిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వం కూడా ‘కేజ్రీవాల్ మీకోసం ఏమేం చేశారంటే’ అంటూ ఆయన చిత్రాలతో కూడిన ప్రకటనలను రూపొందిస్తోంది. ఈ విషయమై సుప్రీంకోర్టులో ఓ కేసు దాఖలు కావడంతో, న్యాయస్థానం ఆయా రాష్ట్రాలకు తాఖీదులను పంపింది. కానీ సదరు రాష్ట్రాల తరఫున వాదిస్తున్న న్యాయవాది మాత్రం ఇందులో తప్పేముంది అంటూ సుప్రీం కోర్టునే తిరిగి ప్రశ్నించారు. దేశానికి ప్రధానమంత్రి ఎంత ముఖ్యుడో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అంతే అవసరమనీ... రాష్ట్రానికి సంబంధించిన పథకాలలో వారి ముఖచిత్రం ఉండటమే సబబనీ సదరు న్యాయవాది పేర్కొన్నారు. మరి సుప్రీంకోర్టు ఈ వాదనతో ఏకీభవించి తన మాటని వెనక్కి తీసుకుంటుందో లేకపోతే తీర్పుని గౌరవించనందుకు జయలలిత ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తుందో చూడాలి!

రాష్ట్రపతి ప్రసంగానికి సవరణ!

  పార్లమెంటులో ఉభయసభలనూ ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, దానికి ధన్యవాదాలు చెబుతూ పార్లమెంటు సభ్యులు ధన్యవాదాలు చెప్పడం ఆనవాయితీ. ఒకవేళ రాష్ట్రపతి ప్రసంగంలో తమకు నచ్చని అంశం ఏదన్నా ఉంటే, ప్రతిపక్షాలు దాని మీద చర్చను లేవనెత్తుతాయి. అరుదైన సందర్భాలలో మాత్రం ప్రసంగానికి ఒక సవరణ అవసరం అంటూ ప్రతిపాదిస్తాయి. ఇది నిజంగానే ప్రభుత్వానికి ఇబ్బందిలోకి నెట్టే అంశం. ఎందుకంటే ప్రసంగాన్ని చదివేది రాష్ట్రపతే అయినా, ఆ ప్రసంగపాఠాన్ని ప్రభుత్వానికి అనుకూలంగానే రూపొందిస్తారు. నిన్న పార్లమెంటులో ఇలాంటి సంఘటనే జరిగింది. త్వరలో హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో జరగబోయే స్థానిక ఎన్నికలలో పాల్గొనేందుకు కనీసం మెట్రిక్యులేషన్‌ చదివి ఉండాలన్న నియమాన్ని అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పరిచాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు చాలామంది ఎన్నికలలో పాల్గొనలేరనీ, ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే అక్కడి ప్రభుత్వాలు ఈ నియమాన్ని ఏర్పరిచాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్నికలలో పాల్గొనేందుకు అందరికీ సమాన హక్కులు ఉండాలనీ, ఈ విషయాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొని ఉంటే గౌరవంగా ఉండేది అంటూ రాష్ట్రపతి ప్రసంగానికి ఒక సవరణను ప్రతిపాదించింది కాంగ్రెస్‌. రాష్ట్రపతి పదవికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను వెనక్కి తీసుకోవల్సిందిగా మోదీ సహా ఎందరు నాయకులు వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. సవరణ కోసం కాంగ్రెస్ తుదివరకూ పట్టుపట్టడంతో సభ దానిని ఆమోదించింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాష్ట్రపతి ప్రసంగానికి సవరణ చేయడం అనేది ఇది కేవలం ఐదోసారి. మరి పాలకపక్షం దీన్ని అవమానంగా భావించకుండా ఉంటుందా!

విజయ్‌ మాల్యా పారిపోయాడో

  అనుకున్నదంతా అయ్యింది! కడుపుకాల్చుకుని, కన్నీళ్లు దాచుకుని, రూపాయి రూపాయి కూడబెట్టి మనం బ్యాంకుల్లో దాచుకుంటే... ఆ బ్యాంకుల్లో ఉన్న సొమ్ముని కాస్తా ఓ సోగ్గాడు ఎత్తుకుపోయాడు. అధికారిక లెక్కల ప్రకారం తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టి మరీ విజయ్‌ మాల్యాగారు విమానంలాగా ఎక్కడికో ఎగిరిపోయారు. ‘విజయ్‌ మాల్యాను దేశం విడిచి పోకుండా చూడండి’ అని ప్రభుత్వరంగ బ్యాంకులు వేసిన కేసులో ప్రభుత్వం తరఫున న్యాయవాది పేల్చిన బాంబు ఇది. తాము విజయ్‌ మాల్యా గురించి సీబీఐను సంప్రదించగా వారు ‘మాల్యా సాబ్‌ మార్చి రెండునే దేశం దాటేశారని’ సెలవిచ్చారట. పోనీ మాల్యా పేరున ఇక్కడ ఆస్తులు ఏమన్నా ఉన్నాయా అని న్యాయమూర్తులు అడిగితే ‘ఆయన ఆస్తులు విదేశాలలోనే ఎక్కువగా ఉన్నాయి. మనదేశంలో ఐదో వంతు ఆస్తులే ఉన్నాయి’ అని నీళ్లు నమిలారట బ్యాంకుల తరఫున న్యాయవాదులు. మరి మీరు ఏ ధైర్యంతో అప్పులిచ్చారు అని అడిగితే ‘అప్పట్లో ఆయన కింగ్‌ఫిషర్‌ విమానాలకి మంచి పేరుండేది. ఆ పేరుని చూసి ఇచ్చాం’ అన్నారు న్యాయవాదులు. తన పేరు చెప్పగానే బ్యాంకులు కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు మాల్యాగారు అప్పులు తీసుకోకుండా ఎలా ఉంటారు. ఆ డబ్బు ఖర్చయ్యాక వెనక్కి తిరిగి ఇచ్చేందుకు ఏముంటుంది. అందుకే చక్కగా లండనో, జెనీవానో చెక్కేసి ఉంటారని అనుమానం. మరి మాల్యాను వెనక్కి తీసుకువచ్చి, విదేశాలలో ఉన్న ఆయన ఆస్తులను అమ్మి బ్యాంకు రుణాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందా!

జేఎన్‌యూలో రాందేవ్‌బాబా శిబిరం

  దేశంలోని వార్తల్లో సగం జేఎన్‌యూ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో తనెందుకు వెనుకబడి ఉండాలనుకున్నారో ఏమో... యోగా గురువు రాందేవ్‌ బాబాగారు కూడా జేఎన్‌యూకి బయల్దేరుతున్నారట. అక్కడి విద్యార్థులకు యోగాలో శిక్షణని అందించేదుకు ఓ శిబిరాన్ని నిర్వహించేందుకు రాందేవ్‌గారు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారట. ఇంతకుముందు ఇలాగే ఓసారి రాందేవ్‌గారు విశ్వవిద్యాలయంలోకి వెళ్లేందుకు సిద్ధపడుతుండగా వామపక్ష విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. కానీ మారిన పరిస్థితులలో, రాందేవ్‌ను మరోసారి అడ్డుకుంటే ఇబ్బందులు తప్పవని సదరు సంఘాలు గ్రహించినట్లున్నాయి. అందుకే ఈసారి ఏ సంఘమూ చప్పుడు చేయడం లేదు. పైగా భాజపా అనుకూల విద్యార్థి సంఘమైన ఏబీవీపీ రాందేవ్‌గారి రాకకోసం  ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి 9న తీవ్రవాది అఫ్జల్‌గురుకు అనుకూలంగా వివాదాస్పద సమావేశం జరిగిన తరువాత, ఇలాంటి యోగా కార్యక్రమం జరగడం ఒక మంచి మార్పుకి సూచనగా సదరు ఏబీవీపీ నేతలు భావిస్తున్నారు. మరి రాందేవ్‌గారి శిబిరం ఎప్పుడు మొదలవుతుందో, అందులో ఆయన ఏం వ్యాఖ్యానిస్తారో చూడాలి!

మోదీగారూ ఆదుకోండి- కింగ్‌ఫిషర్ ఉద్యోగులు!

  వేలకోట్ల రూపాయలు దిగమింగి చల్లగా జారుకోవాలని చూస్తున్న విజయ్‌మాల్యాకు మరో చుక్కెదురైంది. ఇప్పటికే ఆయనకు అప్పులిచ్చిన బ్యాంకులన్నీ మాల్యాను అరెస్టు చేయమంటూ సుప్రీం కోర్టును వేడుకోగా, ఇప్పడు మాల్యా ఉద్యోగులు కూడా ఉద్యమబాట పట్టారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పేరుతో కోట్లకి కోట్లు అప్పు తీసుకున్న మాల్యా తమకు మాత్రం పైసా ఇవ్వలేదని విరుచుకుపడుతున్నారు ఆ సంస్థ ఉద్యోగులు. ప్రస్తుతం కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ మూతపడినప్పటికీ, 2012 నుంచి తమకు రావల్సిన జీతాలు రానేలేదని వాపోతున్నారు. ఇప్పటికే మాల్యాకు బహిరంగ లేఖలు రాసిన వీరు, ఇప్పడు ముంబైలోని కింగ్‌ఫిషర్‌ కార్యాలయం ముందు ధర్నాలకు దిగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీనే ఈ విషయంలో చొరవ చూపాలని వీరు కోరుతున్నారు. ప్రభుత్వం కనుక తల్చుకుంటే, మాల్యా మీద చర్యలు తీసుకోవడం పెద్ద కష్టం కాదని వీరు ఆశిస్తున్నారు. గత నాలుగేళ్లుగా కింగ్‌ఫిషర్‌ విమాన సంస్థ తన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం 800 కోట్లకి పైనే ఉంటుందని ఓ అంచనా! ఈపాటికే విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్న నేపథ్యంలో, అంత సొమ్ముని మాల్యా నుంచి రాబట్టడం అయ్యే పనేనా అన్నది సామాన్యుడి ప్రశ్న!

మహిళాదినోత్సవం రోజున... రేప్‌చేసి తగలబెట్టేశాడు

  తెల్లవారితే దేశవ్యాప్తంగా మహిళాదినోత్సవాన్ని జరుపుకొనేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. అలాంటిది, దేశ రాజధాని దిల్లీకి కూతవేటు దూరంలో జరిగిన ఒక దారుణం, మహిళల భద్రత విషయంలో ఎలాంటి మార్పూ రాలేదని చెప్పకనే చెబుతోంది. దిల్లీకి దగ్గరలోని నోయిడాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో... అజయ్‌ శర్మ అనే యువకుడు తన ఇంటి పక్కనే ఉండే 15 ఏళ్ల అమ్మాయితో స్నేహంగా ఉండేవాడు. సోమవారం అర్థరాత్రి అజయ్‌ శర్మ ఆ ఇంట్లోకి ప్రవేశించి బాధితురాలి మీద అత్యాచారం చేశాడు. ఈ విషయం ఇంట్లోవారికి ఎక్కడ తెలుస్తుందో అన్న అనుమానంతో ఆమెను తగలబెట్టేశాడు. బాధితురాలి అరుపులు విని మేడ మీదకు వచ్చి చూసిన కుటుంబసభ్యులకు, ఆమె మంటల్లో చిక్కుకుని కనిపించింది. వెంటనే బాధితురాలిని దిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు. 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు ఇవాళ ఉదయం చనిపోయింది. ఈ కేసులో నిందితుడు  మైనర్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే అతను తేలికపాటి శిక్షతో తప్పించుకోవచ్చు. ఈ నెల 8వ తేదీన మన దేశం ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకొంది!!!

నువ్వు గెలుస్తానంటే, నే వద్దంటానా- బెంగాల్‌ కాంగ్రెస్!

  ఎన్నికల నగారా ఇలా మోగిందో లేదో, బెంగాల్లో అలా ఎన్నికల చిత్రాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఏప్రిల్‌ 4 నుంచి మే 5 వరకూ ఆరేడు దఫాలుగా సాగనున్న ఈ ఎన్నికల పోరు ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షకూటములకు మధ్యే సాగనుంది. ఈ పోరులో తలదూరిస్తే మొదటికే మోసం వస్తుందనుకున్నాయో ఏమో కాంగ్రెస్‌, భాజపా రెండూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. వామపక్ష కూటమి పోటీ చేసే స్థానాలలో, తాము అభ్యర్థులను నిలపబోమని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఎలాంటి పొత్తూ, ఉమ్మడి మ్యానిఫెస్టో లేకుండానే కాంగ్రెస్ ఇలా పరోక్ష సాయానికి పాల్పడటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. మరోవైపు భాజపా కూడా ఈసారి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలలో తృణమూల్ విజయాలను దెబ్బతీయకుండా ఉండేందుకు, తన దూకుడుని తగ్గించుకోనున్నట్లు సమాచారం. మోదీ రెండోసారి కూడా ప్రధాని కావాలంటే తృణమూల్, అన్నాడీఎంకేల సాయం అవసరం కాబట్టి.... తమిళనాడు, పశ్చిమబెంగాల్లోని అసెంబ్లీ ఎన్నికలను భాజపా కాస్త చూసీచూడనట్లు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. తమ బలం అంతంత మాత్రంగానే ఉన్న ఈ రాష్ట్రాలలో హడావుడి చేయబోతే, పెద్దగా లాభం రాకపోగా ఓట్లు చీలిపోయి ప్రతిపక్షాలు సంబరపడే పరిస్థితులు వస్తాయని భాజపా ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం.

జేఎన్‌యూలో మరో వివాదం... మనుస్మృతిని తగలబెట్టారు

  దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఒకదాని తరువాత ఒకటి వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఏబీవీపి విద్యార్థి సంఘం నేతలు కొందరు మనుస్మృతిని తగలబెట్టడంతో మరోసారి జేఎన్‌యూ వార్తల్లో నిలిచింది. మనుస్మృతిలోని కొన్ని అంశాలు స్ర్తీలకు వ్యతిరేకంగా ఉన్నాయనీ, అందుకని ప్రపంచ మహిళా దినోత్సం సందర్భంగా తాము ఈ పని చేస్తున్నామనీ ఏబీవీపీ వారు చెప్పుకొచ్చారు. మనుస్మృతిలో కనీసం 40 అంశాల మీద తమకు అభ్యంతరాలు ఉన్నాయనీ, ఈ విషయంలో ఎవరితోనైనా వాదించేందుకు సిద్ధంగా ఉన్నామనీ సవాలు విసిరారు. మనుధర్మశాస్ర్తంగా పిలవబడే మనుస్మృతిలో కులాల ఆవిర్బావానికి సంబంధించి కొన్ని కీలక ప్రస్తావనలు ఉన్న విషయం తెలిసిందే! అందుకే వివక్షకి సంబంధించిన చారిత్రక అంశాలు పేర్కొనేటప్పుడు ఉద్యమకారులు తరచూ మనుస్మృతిని నిందిస్తూ ఉంటారు. ఇప్పటికే సున్నితంగా ఉన్న జేఎన్‌యూలోని పరిస్థితులు నిన్న జరిగిన ఘటనతో తిరిగి ఉద్రిక్తంగా మారినట్లు అయింది. జేఎన్‌యూ అధికారులు ఈ ఆందోళనకు ఎలాంటి అనుమతినీ ఇవ్వనప్పటికీ, కార్యక్రమం యథావిథిగా కొనసాగడం గమనార్హం. రోహిత్‌, కన్నయాకుమార్‌ల వివాదంలో ఏబీవీపీ సంఘానికి దళితవ్యతిరేకిగా ముద్రపడటంతో, వారు ఈ తాజా చర్యకు పూనుకుని ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ఆ క్రెడిట్‌ నాదే- రాహుల్

  ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ భవిష్యనిధి మీద విధించిన పన్నుని రద్దు చేస్తున్నట్లు ఇలా ప్రకటించారో లేదో, అలా రాహుల్ గాంధి నోరు విప్పేశారు. ప్రభుత్వం మీద తను తీసుకువచ్చిన ఒత్తిడి కారణంగానే, వారు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారనీ, అందుకు తనకెంతో సంతోషంగా ఉందనీ చెప్పుకొచ్చారు. ఆర్థికమంత్రి మొన్న బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ భవిష్యనిధి నుంచి తీసుకునే సొమ్ములో 60% పన్ను పరిధిలోకి వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన గురించి సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీతో సహా నిరసనలు వ్యక్తం చేయడంతో, మంత్రిగారు తన ప్రకటనను వాపసు తీసుకున్నారు. అయితే ఈ క్రెడిట్‌ అంతా తనదేనని రాహుల్‌ చెప్పడంతో కాంగ్రెస్‌ వర్గాలు సైతం విస్తుపోతున్నాయి. ముందుముందు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేసిన ప్రతిసారీ, తనవల్లే అదంతా జరిగిందని రాహుల్‌గారు అంటే ఏం చేసేది అంటూ ఇటు బీజేపీ నేతలూ తలపట్టుకుంటున్నారు. మొత్తానికి రాహుల్‌ మాటల వెనుక మర్మం ఏమిటో ఎవరికీ తెలియదు సుమా!

సిండికేట్ బ్యాంకులో భారీ కుంభకోణం

  బ్యాంకులకు రుణాలిచ్చే బడాబాబులు ఎలాగూ ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్నారనుకున్నారో ఏమో, కొందరు అధికారులే ఇప్పడు తమ బ్యాంకుకి కన్నం వేస్తూ పట్టుపడ్డారు. సిండికేటు బ్యాంకులలోని ఉత్తరాది శాఖలలో ఇలా ఒకటి కాదు రెండు కాదు.... వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు సమాచారం. నకిలీ బిల్లులను ఉపయోగించి, ఓవర్‌డ్రాఫ్టుల పేరు చెప్పుకుని కోట్లాది సొమ్ముని కైంకర్యం చేసిన విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంలో నిజానిజాలను తేల్చేందుకు, పోయిన సొమ్ములెంతో లెక్కని తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఫిర్యాదులు వచ్చిన శాఖలమీదా, కొందరు బ్యాంకు అధికారుల ఇళ్ల మీదా దాడులు చేసి సోదాలను నిర్వహించింది. ఈ దెబ్బతో షేర్‌మార్కెట్‌లో సిండికేట్‌ బ్యాంకు షేరు విలువ దారుణంగా పడిపోయింది. ఒకపక్క మొండిబకాయిలు పేరుకుపోతూ నిస్తేజంలోకి జారుకుంటున్న బ్యాంకింగ్‌ రంగానికి ఇది నిజంగా దుర్వార్తే!

బ్యాంకుల జోలికి రావద్దు... అరుణ్‌జైట్లీకి హెచ్చరిక!

  లక్షలకోట్లకొద్దీ నష్టాలతో కుంగిపోతున్న బ్యాంకులను ఆదుకునేందుకు, ఆర్‌.బీ.ఐ మొదలుకొని ఆర్థికమంత్రిదాకా ఏవేవో పథకాలు ప్రకటిస్తున్నారు. కానీ ఈ విషయంలో ప్రజలు, ప్రతిపక్షాల నిరసనలను దృష్టిలో ఉంచుకోవలసి వచ్చేట్లుంది. ఉదాహరణకు, ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తన వాటాను 80 శాతం నుంచి 50 శాతం కంటే తక్కువకు తగ్గించుకోనుందని ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఐడీబీఐ బ్యాంకును ప్రైవేట్‌ పరం చేయడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం అంటూ సీతారాం ఏచూరి హెచ్చరించారు. ఐడీబీఐ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒకదానితో ఒకటి విలీనం చేయాలన్న ప్రతిపాదనలను కూడా ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలలో కూరుకుపోవడానికి కారణం... ఉన్నతస్థాయి అధికారుల వైఫల్యం, రాజకీయ జోక్యమనీ, బ్యాంకుల విలీనం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని ఉద్యోగసంఘాలు పేర్కొంటున్నాయి. మరి బ్యాంకులను తిరిగి లాభాలబాట పట్టించేందుకు ఆర్థికమంత్రి ఏం చేస్తారో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఏం చేస్తుందో!

రాహుల్‌ గాంధి జట్టులో ఐఐటి కుర్రాళ్లు

  ఐఐటి విద్యార్థులు అంటే చురుకైనవారన్నది దేశంలో ఓ నమ్మకం. రాహుల్‌ గాంధిలో ఆ నమ్మకం కాస్త మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. అందుకని ఏకంగా ఓ 15మంది ఐఐటి కుర్రవాళ్లని ఎంపిక చేసి త్వరలో జరగబోయే అసోం ఎన్నికలలో వారిని ప్రయోగిస్తున్నారట. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వీరి సేవలను ఉపయోగించుకుంటున్నారట రాహుల్‌. గత ఏడాది రాహుల్‌ గాంధి నేరుగా ఎంపిక చేసిన సదరు ఐఐటీలందరూ, అసోంలోని రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ గడుపుతున్నట్లు సమాచారం. వీళ్లందరూ కూడా అసోంకు పార్టీ జనరల్‌ సెక్రెటరీ అయిన సి.పి.జోషితో నేరుగా తమ పరిశీలనలను గురించి నివేదిస్తారట. రాహుల్ గాంధి ఇలా ఐఐటిల చేతిలో పార్టీ బాధ్యతలు చేపట్టడం వెనుక ఓ కథ కూడా ఉందంటున్నారు. 2014లొ రాహుల్‌ ఓ విశ్వవిద్యాలయంలో పర్యటిస్తున్నప్పుడు, అక్కడ పర్‌మర్‌ అనే ఓ ఐఐటి పట్టాదారుడు రాహుల్‌ని తన ప్రశ్నలతో తెగ తికమకపెట్టేశాడట. ఇతని ప్రశ్నలకు జవాబు చెప్పేకంటే, అసలు పార్టీని బలోపేతం చేసే బాధ్యతను పర్‌మర్‌కే ఎందుకు ఇవ్వకూడదు అన్న ఆలోచన వచ్చిందట రాహుల్‌కు. అనుకున్నదే తడవుగా పర్‌మర్‌ను పార్టీ కోసం నియమించుకున్నాడు. ఇదీ ఈ ఐఐటి కథలో మొదటిభాగం! మరి తరువాయి భాగం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!

పాపం షరపోవా!

షారపోవా పేరు వింటే చాలు టెన్నిస్‌ గుర్తుకువస్తుంది. 17 ఏళ్ల చిన్న వయసులోనే వింబుల్డన్‌ను కైవలం చేసుకున్నా, గాయాలతో బాధపడుతూ కూడా విజయాలు సాధిస్తున్నా, అత్యధిక సంపాదన కలిగిఉన్న క్రీడాకారిణిగా నిలిచినా... ఈ రష్యన్‌ తారది టెన్నిస్‌ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. అలాంటి షరపోవాని ఇప్పుడు టెన్నిస్‌నుంచే బహిష్కరించే పరిస్థితి వచ్చింది. మెల్‌డోనియం అనే ఒక ఉత్ప్రేరకాన్ని తీసకుంటోందని ఆమె రక్త పరీక్షలలో తేలడంతో అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య ఆమెను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ బహిష్కరణ నాలుగేళ్ల పాటు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే కొన్ని అరుదైన సందర్భాలలో సమాఖ్య తక్కువకాలం బహిష్కారంతో శిక్షని సరిపెట్టవచ్చు. కానీ అది ఎంత తక్కువకాలమైనప్పటికీ, సాధారణంగా ఒకసారి బహిష్కరణకు గురైన ఆటగాడు తిరిగి ఫాంలోకి రావడం అరుదుగా జరుగుతంది. ఒకోసారి ఈ బహిష్కరణ ఆటగాడి కెరీర్‌కు ముంగింపు పలికిన సందర్భాలు కూడా లేకపోలేదు. 2007లో ఇలా బహిష్కరణకు గురైన స్విస్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మార్టిన్‌ హింగిస్‌ తిరిగి టెన్నిస్ ఆడలేక రిటైర్మెంట్‌ తీసుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తుకురాక మానదు.   తాను ఉత్ప్రేరకాన్ని తీసుకోవడానికి సంబంధించి షరపోవా వాదన వేరేలా ఉంది. గత పది సంవత్సరాలుగా తాను ఈ మందుని తీసుకుంటున్నాననీ, డయాబెటిస్‌ రాకుండాఈ మందుని వాడుతున్నాననీ చెబుతోంది. కానీ మెల్‌డోనియంకి సంబంధించి నిపుణుల మాట వేరేలా ఉంది. ఆటగాళ్లు తమలో చురుకుదనం పెరిగేందుకు ఈ మందుని వాడతారనీ, దీన్ని చాలా దేశాల్లో నిషేధించారనీ చెబుతున్నారు. వీరిలో ఎవరి వాదన నిజమైనా షరపోవా కొన్నాళ్లపాటు నిషేధానికి గురికావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇంతటితో షరపోవా ఆట ముగిసినట్లేనా!

పశ్చిమబెంగాల్లో కన్నయాకుమార్‌ ప్రచారం

  పశ్చిమబెంగాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉండి, ప్రస్తుతం దీన స్థితిలో ఉన్న వామపక్షాలకు జేఎన్‌యూ వివాదం బాగానే కలిసివచ్చినట్లుంది. ప్రస్తుతం దేశ యువత నోళ్లలో నానుతున్న జేఎన్‌యూ వివాదాస్పద విద్యార్థి కన్నయాకుమార్‌ను అక్కడి ఎన్నికలలో వాడుకోవాలని అనుకుంటోంది. ఈ విషయాన్ని స్వయంగా సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి ప్రకటించారు. ఈసారి ఎన్నికలలో ప్రజలు ఈ దేశ యువశక్తిని కూడా రుచి చూడనున్నారని ఏచూరి ఈ సందర్భంగా అన్నారు. జేఎన్‌యూలో జరిగిన ఒక సమావేశానికి సంబంధించి దేశద్రోహం కేసు కింద కన్నయా అరెస్టై ప్రస్తుతం బెయిలు మీద విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కన్నయాకుమార్‌ చేసిన ఉపన్యాసాలకు యువత నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఎన్నికల సందర్భంతో కన్నయాను మమత ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. ఎందుకంటే అటు విద్యార్థులను కానీ, ఇటు హిందుత్వవాదులను కానీ నొప్పించకుండా ఉండేందుకు, జేఎన్‌యూ వివాదంలో ఇప్పటివరకూ మమత చూసీచూడనట్లు ఉన్నారు. కానీ ఆ వివాదానికి మూలపురుషుడే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా బరిలోకి దిగడంతో, మమతకు మాట్లాడక తప్పని స్థితి వచ్చింది.

మోదీ నన్ను తిట్టారు- రాహుల్‌ ఆక్రోశం

  ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అసోంలో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధి మరోసారి ప్రధానమంత్రి మీద విరుచుకుపడ్డారు. మోదీ నిన్న గంటా పదిహేను నిమిషాల సేపు పార్లమెంటులో చేసిన ఉపన్యాసంలో, తనని తిట్టేందుకే అధికప్రాధాన్యతని ఇచ్చారని విమర్శించారు. ‘మీకు సంతోషం కలిగితే అలాగే తిట్టుకోండి, కానీ నా ప్రశ్నలకు జవాబు ఇవ్వండి’ అంటూ ఆవేశపడిపోయారు. 15 సంవత్సరాలుగా అసోంను ఏలుతున్న కాంగ్రెస్‌నే ఈసారి కూడా ఎన్నుకోమనీ, ప్రత్యర్థి కూటమి మాటలు నమ్మి మోసపోవద్దనీ రాహుల్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే మోదీ తనను తిట్టే ముందు తాను కూడా ఆయనను తెగ విమర్శించిన విషయం మాత్రం రాహుల్‌ ప్రస్తావించలేదు. మోదీ ఎవరి మాటా వినరనీ, తాను ఈ దేశ ప్రధానమంత్రి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారనీ, తన మనసుకి ఏది తోస్తే అది చేస్తారనీ నిన్నగాక మొన్న రాహుల్‌గాంధి, మోదీని ఏకిపారేసిన విషయం తెలిసిందే! అందుకు మోదీ కూడా నిన్న దీటుగా జవాబునిచ్చారు. కొంతమంది ఎదుగుతారే కానీ, వారి బుద్ధి మాత్రం ఎదగదు అంటూ పరోక్షంగా రాహుల్‌ని దెప్పిపొడిచారు. పాపం! మోదీ మాటలకు రాహుల్‌బాబు మనసు బాగా గాయపడినట్లుంది.

ఐరోపాకు రావద్దు- ఐరోపా మండలి వినతి!

  సిరియాను అంతర్గత యుద్ధం ముంచెత్తుతోంది. ఇటు ప్రభుత్వానికీ అటు ISIS ఉగ్రవాద సంస్థకూ జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు కూడా జోక్యం చేసుకోవడంతో సిరియా రక్తసిక్తంగా మారిపోయింది. ఈ యుద్ధరంగం నుంచి తప్పించుకునేందుకు లక్షలాదిమంది ఐరోపాకు శరణార్థులుగా వలసకి వెళ్తున్నారు. ఐరోపా ముఖద్వారంగా భావించే టర్కీ ద్వారా స్వీడన్‌, గ్రీస్‌ వంటి ఐరోపా దేశాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇలా చాలా ఐరోపా దేశాలు శరణార్థులతో నిండిపోయాయి. వచ్చిన వారిని తిరిగి పంపలేక, వారిని దేశంలోని శరణార్థి శిబిరాలలో ఉంచలేక పలు దేశాలు సతమతమవుతున్నాయి. ఇటు శరణార్థ శిబిరాల వద్ద తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. దాంతో ఆర్థికంగానూ, శాంతిభద్రతల పరంగానూ గ్రీస్‌, స్వీడన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఐరోపా మండలి అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌ నిన్న ఒక ప్రకటనను జారీ చేశారు. శరణార్థులు తమ జీవితాలను, డబ్బుని పణంగా పెట్టి అక్రమంగా ఐరోపాలోకి ప్రవేశించే ప్రయత్నం చేయవద్దని డొనాల్డ్‌ అభ్యర్థించారు. ఇక్కడికి వచ్చాక వారు నానాఇబ్బందుల పడక తప్పదనీ, అందుకని ఐరోపాకి రాకపోవడమే మంచిదనీ ఆయన పేర్కొన్నారు. కానీ డొనాల్డ్‌ మాటలు వినే పరిస్థితుల్లో ఎవరూ ఉన్నట్లు కనిపించడం లేదు. క్రూరమైన ISIS దాడులకంటే ఐరోపా శరణార్థి శిబిరాలే మేలు కదా!