అంతరిక్షం నుంచి భారతదేశం భలే ఉంటుంది- సునీతా విలియమ్స్
posted on Feb 27, 2016 @ 4:58PM
అదివరకెప్పుడో భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన రాకేష్ శర్మను ఇందిరాగాంధి ఒక ప్రశ్న అడిగారు.... అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది అని. దానికి రాకేష్ ‘సారే జహా సే అచ్ఛా’ అంటూ బదులిచ్చారు. భారతీయ మూలాలు కలిగిన వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా ఇప్పుడు అదే మాట అంటున్నారు. ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సునీతా ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. వాటిలో కొన్ని...
- గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో సమయాన్ని గడపడం కొంత కష్టమే కానీ అసాధ్యం కాదు. మనం అక్కడ ఉండే సమయం చాలా తక్కువ కాబట్టి శరీరం ఏమీ అతలాకుతలం అయిపోదు.
- రోదసీలో ఉన్నప్పుడు తప్పకుండా ఇంటి భోజనాన్ని మిస్ అవుతాను. కానీ తప్పదు కదా! అక్కడ మాకు ఎలాంటి ఆహారం అందుబాటులో ఉంటే దాంతో సరిపెట్టుకోక తప్పదు!
- ఇంటిని వదిలి ఆకాశంలోకి అంతెత్తున ఎగిరిపోవడమంటే కాస్త బాధగానే ఉంటుంది. పైగా రోదసీ ప్రయాణం అనేది అనేక సవాళ్లతో కూడుకున్నది. కాబట్టి.... వాటన్నింటినీ తట్టకునేంత మానసిక దృఢత్వం ఒక వ్యోమగామికి ఉండాలి.
- స్పేష్ మిషన్లలో అనేక రకాల మనుషులు, దేశదేశాల పౌరులు ఎదురుపడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా ఒకరికొకరు ఎంత భిన్నంగా ఉన్నా ఒక జట్టుగా పనిచేస్తుంటాం.
- వ్యోమగాములే కాకుండా సామాన్య యాత్రికులు కూడా అంతరిక్షంలోకి ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. ఇది సంతోషించదగ్గ పరిణామమే!
- భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి అంతరిక్షయానాలు ఆర్ధికంగా భారమయ్యే మాట వాస్తవమే! కానీ ఇది భవిష్యత్తు కోసం, విజ్ఞానం కోసం మనం పెడుతున్న పెట్టుబడిలాంటిది.
- అంతరిక్షం నుంచి చూసినప్పుడు భారతదేశం, సిగలో హిమాలయాలతో ఒక అద్భుతమైన నగలాగా కనిపిస్తుంది. హిమాలయాలను చూసినప్పుడు భూమి కేవలం ఒక గ్రహం కాదనీ, ఒక సజీవమైన పదార్థం అనీ అనిపిస్తుంది.