కన్నయా, ఉమర్‌ఖాలిద్‌ల మీద వేటు!

జేఎన్‌యూ విద్యార్థి నాయకులు కన్నయా కుమార్‌, ఉమర్‌ఖాలిద్‌లను విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరో ముగ్గురు కూడా, ఓ వివాదాస్పద సమావేశాన్ని నిర్వహించినందుకు, వేటుని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ విషయమై విచారణ జరిపిన ఒక ఉన్నతస్థాయి సంఘం, తన నిర్ణయాన్ని యూనివర్శిటీ నిర్వాహకులకు అందచేసినట్లు సమాచారం. ఈ విచారణలో భాగంగా ఆనాటి సమావేశంలో 21 మంది విద్యార్థుల పాత్రను పరిశీలించిన సంఘం, వారి మీద జరిమానా, బహిష్కరణ... తదితర చర్యలను సూచించిందట. ఈ నివేదికను కనుక యథాతథంగా అంగీకరిస్తే, జేఎన్‌యూ మరోమారు భగ్గుమనే ప్రమాదం లేకపోలేదు. అందుకని నివేదికను అనుమతిస్తారా లేకపోతే విద్యార్థుల నుంచి తీసుకునే తుది వివరణతో సంతృప్తి చెందుతారా అన్నది త్వరలోనే తేలనుంది. కన్నయా కుమార్‌, ఉమర్‌ఖాలిద్‌లు మాత్రం తమ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా... వాటిని అంగీకరించే పరిస్థితిలో లేరు. కాబట్టి నివేదిక మీద చర్యలు ఎంత సాధారణంగా ఉన్నా, వివాదం మాత్రం అసాధారణంగానే రాజుకునే అవకాశం కనిపిస్తోంది.

‘నేను భారత్ మాతాకీ జై అనను’- అసదుద్దీన్‌

ఈ నెల మూడో తేదీన ఆరెస్సెస్‌ ముఖ్యులు మోహన్‌ భగవత్ మాట్లాడుతూ ‘జన్మభూమికి అనుకూలమైన నినాదాలను చేసేలా ఇప్పటి యువతను తీర్చిదిద్దాలని’ సూచించారు. జేఎన్‌యూలో పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు వినిపించిన నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ ఈ సూచన చేశారు. అయితే దానికి ప్రతిస్పందనగా అసదుద్దీన్‌ ఓవైసీ ఇవాళ ఓ సంచలన వ్యాఖ్యని చేశారు. ‘నేను భారత్‌ మాతాకీ జై అన్న నినాదాన్ని చేయను. ఏం చేస్తారు భగవత్‌గారూ!’ అంటూ ప్రశ్నించారు అసదుద్దీన్‌. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లాలో పర్యటిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ‘తన పీక మీద కత్తి పెట్టినా కూడా ఇలాంటి నినాదాలను చేయననీ, అలా నినదించాలని మన రాజ్యాంగంలో ఎక్కడా లేదని’ తేల్చిచెప్పేశారు. అంతేకాదు! గుజరాత్‌లోని ఒక ఎన్‌కౌంటర్‌లో మరణించిన తీవ్రవాది ఇస్రత్ జహాన్‌ కుటుంబానికి తమ పార్టీ సాయం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు.

దుమారం రేపుతున్న షాహిద్‌ ఆఫ్రిది వ్యాఖ్యలు

పాకిస్తాన్‌లో కంటే తమను ఇక్కడి భారతీయులే ఎక్కువగా అభిమానిస్తారంటూ ఆ దేశ టి-20 కేప్టెన్ షాహిద్‌ ఆఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు, తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే, ఈ వ్యాఖ్యలను ఖండించేందుకు ఆ దేశ మాజీ కేప్టెన్‌ జావేద్‌ మియాందాద్‌ ముందుకు వచ్చాడు. భారత దేశం అంటే ఎప్పుడూ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే మియాందాద్‌కు ఆఫ్రిది మాటలు మంట పుట్టించినట్లున్నాయి. ‘ఇలాంటి మాటలు అనడానికి సిగ్గుపడాలనీ, భారత్‌లో అడుతున్నంత మాత్రాన ఆ దేశాన్ని పొగడాల్సిన అవసరం లేదని’ మియాందాద్‌ దుయ్యపట్టాడు. భారత దేశంలో విధ్వంసాన్ని సృష్టించి పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న దావూద్‌ ఇబ్రహీంతో వియ్యమందుకున్న మియాందాద్‌, ఆఫ్రిది మాటలకు తనను గాయపరిచాయని వాపోయాడు. అంతేకాదు! ‘పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలనీ, ఆటగాళ్లు విదేశాలకు వెళ్లే ముందు వారికి తగిన హెచ్చరికలు చేసి పంపాలనీ’ సూచించాడు. గత ఐదేళ్లుగా ఇండియా, పాకిస్తాన్‌కు ఏమీ ఇవ్వలేదనీ... అలాంటి దేశాన్ని పొగడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు మియాందాద్‌. ఇంతకీ పాకిస్తాన్‌కు, ఇండియా ఏం ఇవ్వాలో చెప్పనేలేదు!

పాకిస్తాన్‌ క్రికెటర్ల స్వరం మారుతోందా!

అదివరకు 'నువ్వెంతంటే నువ్వెంత' అనుకునే పాకిస్తాన్‌, భారత్‌ క్రికెటర్ల మధ్య ఉన్న సంబంధాలు ఇప్పుడు మెరుగుపడుతున్నాయా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. భారత్‌లో జరగనున్న టి-20 ప్రపంచ కప్‌ను ఆడేందుకు వచ్చిన పాకిస్తాన్‌ సీనియర్ల మాటలే దీనికి నిదర్శనం. ‘క్రికెట్‌ ఇరు దేశాలను దగ్గరకు తీసుకువస్తుందని, తమ దేశంలో కంటే ఇక్కడే ఎక్కువగా అభిమానాన్ని సంపాదిస్తున్నామని’ పాకిస్తాన్‌ కేప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది పేర్కొన్నాడు. పైగా ‘రక్షణ ఏర్పాట్ల గురించి వ్యాఖ్యానించడానికి తాము రాజకీయ నాయకులం కాదనీ, క్రికెటర్లుగా ఇక్కడ పొందే అపారమైన అభిమానమే తమను ఇక్కడ ఆడేందుకు ప్రేరేపిస్తోందని’ చెప్పుకొచ్చాడు. ఇదివరకు దూకుడుగా మాట్లాడే షాహిద్‌ ఆఫ్రిది నోటి వెంట ఇలాంటి మాటలు ఆశ్చర్యాన్నే కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఆఫ్రిది, భారతీయులకు అంత ఔదార్యం లేదని నోరుజారి విమర్శలపాలయ్యాడు. మరో క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ కూడా షాహిద్‌ను అనుసరిస్తూ భారతీయులను వెనకేసుకొచ్చాడు. టెన్నిస్‌ తార సానియా మీర్జాను పెళ్లి చేసుకుని లక్షలాది యువకుల అసూయకు కారణమైన షోయబ్‌కి కూడా భారత్‌- పాకిస్తాన్ సంస్కృతిలో పెద్ద తేడా కనిపించదట. ‘తను తరచూ భారతదేశానికి వస్తూనే ఉంటాననీ, తనకి ఎప్పుడూ ఇక్కడ రక్షణపరమైన సమస్యలు తలెత్తలేదని’ అన్నాడు. అంతేకాదు! ‘తనకి భారతదేశమంటే చాలా ప్రేమ అనీ, ఇక్కడ ఉండటం ఓ గౌరవమనీ’ పేర్కొన్నాడు. భారతదేశంలో ఉండటం ఓ గౌరవం అన్న విషయం, ఇక్కడి పౌరులు కూడా గుర్తిస్తే బాగుండు!

మణిపూర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం

కొద్ది రోజుల క్రితమే అరుణాచల్ ప్రదేశ్‌లో హాయిగా సాగిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాస్తా కుప్పకూలిపోయింది. అక్కడ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 60 సీట్లకుగాను 42 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్. కానీ అందులో 30 మంది సభ్యులు తిరుగుబాట పట్టడంతో పరిస్థితి రాష్ట్రపతి పాలన దాకా వచ్చింది. ప్రస్తుతం ఆ 30 మంది మద్దతుతో స్థానిక ‘పీపుల్స్‌ పార్టీ ఆఫ్ అరుణాచల్‌’ ముఖ్యమంత్రి పీఠాన్ని తన్నుకుపోయింది. ప్రస్తుతం మణిపూర్‌ పరిస్థితీ ఇలాగే ఉంది. అక్కడ 47మంది కాంగ్రెస్‌ సభ్యులలో ప్రస్తుతం ఓ 25మంది బీజేపీలోకి దూకేందుకు సిద్ధంగా ఉండటంతో, ప్రభుత్వం సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మీద తమ నిరసనలను పార్టీ అధినాయకత్వం పట్టించుకోకపోవడంతో, వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో జరిగిన పొరపాటుని ఈసారి కాంగ్రెస్‌ అధినాయకత్వం చేయబోవడం లేదు. అప్పట్లో అసమ్మతి సభ్యులను సోనియా, రాహుల్‌ ఇద్దరూ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి సోనియా వారి డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి సోనియా హామీలు అసమ్మతిని శాంతింపచేస్తాయో లేదో చూడాలి!

రాహుల్‌గాంధిని పార్లమెంటు నుంచి బహిష్కరిస్తారా?

ఇంగ్లండులో ఒక వ్యాపారసంస్థను స్థాపించే సమయంలో, రాహుల్ గాంధి తాను బ్రిటిష్ పౌరుడినని చెప్పుకున్న విషయం ఆయనను చిక్కుల్లో పడవేయనుందా! అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయమై తగిన ఆధారాలు ఉన్నాయంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గతంలో ప్రధానమంత్రికి ఓ లేఖ కూడా రాశారు. భారతదేశ పౌరుడిని అని చెప్పి పార్లమెంటులో అడుగుపెట్టిన రాహుల్‌గాంధి, బ్రిటన్‌ పౌరుడినంటూ అక్కడ ఎలా ప్రకటిస్తారంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఈ విషయమై ఇప్పడు పార్లమెంటు నైతిక సంఘం (ఎథిక్స్‌ కమిటీ), రాహుల్ కార్యాలయానికి ఒక షోకాజ్ నోటీసుని పంపినట్లు తెలుస్తోంది. భారత రాజ్యంగం ప్రకారం, మన దేశ పౌరులు మాత్రమే పార్లమెంటుకు పోటీ చేసేందుకు అర్హులు. పైగా భారత దేశం ఉమ్మడి పౌరసత్వాన్ని అంగీకరించదు. అంటే ఒక వ్యక్తి తాను బ్రిటన్ పౌరుడిని అని చెప్పుకుంటే, అతడి భారతదేశపు పౌరసత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్‌ గట్టి చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. ఒకవేళ రాహుల్ గాంధి మీద వచ్చిన అభియోగం నిజమే అయితే... ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని మాత్రమే కాదు, దేశ పౌరసత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వద్దు- ఆరెస్సెస్‌

అఖిల భారతీయ ప్రతినిధి సభ పేరిట ఏటా జరిగే తమ వార్షక సమావేశంలో ఆరెస్సెస్‌ కొత్త పంథాను ప్రకటించింది. ‘రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదనీ, అయితే ఉన్నత వర్గాలకు ఈ సౌలభ్యాన్ని అందచేయడం సబబు కాదనీ...’ ఆ సంస్థ కార్యదర్శి సురేశ్‌ జోషి పేర్కొన్నారు. దీంతో ఆరెస్సెస్‌ తాను రెండు ప్రశ్నలకు జవాబు చెప్పినట్లుగా అయింది. కొన్నాళ్ల క్రితం ఆరెస్సెస్‌ ముఖ్యులు మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ‘రిజర్వేషన్ల ప్రక్రియను సమీక్షించాల్సిన అవసరం ఉందని’ పేర్కొన్నారు. దీని మీద దేశవ్యాప్తంగా విమర్శలు తలెత్తాయి. ఇప్పుడు తాను రిజర్వేషన్లకు అనుకూలమే అని ఆ సంస్థ సర్దిచెప్పినట్లైంది. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలోని జాట్‌ వర్గంవారు, గుజరాత్‌లోని పటేల్ వర్గంవారు తమకు రిజర్వేషన్లు కావాలని గొడవపడుతున్న సంగతి తెలిసిందే! ఈ విషయంలో తొందరపడవద్దని ఆరెస్సెస్‌ ప్రభుత్వానికి సూచించినట్లైంది. ఆలయాలలో మహిళల ప్రవేశం గురించి ప్రస్తుతం జరుగుతున్న వివాదం గురించి కూడా ఆరెస్సెస్‌ ఆచితూచి స్పందించింది. ‘మహిళల పట్ల ఉన్న వివక్షని రూపుమాపేందుకు చర్యలు తీసుకోవలసిందేకానీ, ఉద్యమాల ద్వారా కాకుండా చర్చల ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించాలని’ జోషి సూచించారు. ఇక ఎప్పటినుంచో అనుకుంటున్న ఆరెస్సెస్ దుస్తులకి సంబంధించిన మార్పు కూడా జరిగిపోయింది. 90 ఏళ్లకు పైగా వారు ధరిస్తూ వస్తున్న ఖాకీ నిక్కరుకు బదులుగా, ఇప్పుడు గోధుమ రంగు ప్యాంటు రానుంది. మొత్తానికి ఆరెస్సెస్‌ దేశంలోని అన్ని వర్గాలకూ చేరువయ్యేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లుంది!

జికా వైరస్‌ మన దేశానికి వచ్చేస్తోంది

ప్రపంచాన్నంతా వణికిస్తున్న జికా వైరస్‌ ఇప్పుడు మన దేశంలోకి రానుంది. అయితే ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు! ఎందుకంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని పరీక్షల కోసం జికా వైరస్‌ నమూనాను అమెరికా నుంచి తెప్పిస్తోంది, అంతే! భారతదేశంలో ఇప్పటివరకూ జికావైరస్‌కు సంబంధించి ఎటువంటి కేసులూ నమోదు కాలేదు. అయితే ఆ ఆ వైరస్‌ను గుర్తించేందుకు అవసరమయ్యే యంత్రాంగం మాత్రం మన దగ్గర ఉంది. అది సరిగా పనిచేస్తోందో లేదో తెలుసుకునేందుకే, జికా వైరస్‌ను అమెరికాను నుంచి తెప్పిస్తున్నారు. ఈ నమూనాలు మన దేశాన్ని చేరుకోగానే, వాటని నేరుగా భారతీయ వైద్య పరిశోధనా సంస్థకు పంపించనున్నారు. ప్రస్తుతానికి మన దేశంలో జికా కేసులు నమోదు కానప్పటికీ, ఈ వైరస్‌ను వ్యాప్తి చేసే ఈడిస్‌ దోమలు మన దేశంలో విస్తృతంగా ఉండటం, అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈడిస్‌ దోమల వల్ల చికెన్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు మన దేశంలో వేలాదిమందిని పొట్టనపెట్టుకున్నాయి. ఇప్పుడు ఈ దోమలు జికా వైరస్‌ను కూడా మోయడం మొదలుపెడితే, పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంది. జికా వైరస్‌ వల్ల ప్రాణానికి ఏమీ నష్టం లేకపోయినప్పటికీ, గర్భిణీ స్త్రీలను కనుక ఈ దోమలు కుడితే, వారికి పుట్టే సంతానంలో మెదడుకి సంబంధించిన లోపాలు బయటపడే అవకాశం ఉంది.

కేరళలో పోటీ చేయనున్న తృణమూల్ కాంగ్రెస్‌

పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య ఉన్న పొత్తు అనైతికమని విమర్శలు చేస్తున్న మమతా బెనర్జీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తమ పార్టీ కేరళలో కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకోసం ఇవాళ 70 మంది అభ్యర్థులతో కూడిన ఒక జాబితాను కూడా విడుదల చేశారు. కేరళలో అసెంబ్లీ పోరు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, విపక్షంగా ఉన్న వామపక్షాల మధ్య జరగనున్న విషయం తెలిసిందే! ఒకపక్క పశ్చిమ బెంగాల్లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని కేరళలో ఎలా కత్తులు దూసుకుంటాయని మమతా విమర్శిస్తూనే ఉన్నారు. కేరళలో ఈ రెండు పార్టీలూ కలిసి నాటకం ఆడుతున్నాయని తరచూ దుయ్యపడుతున్నారు. కేరళలో మమత పార్టీ పోటీ చేయడమే కాదు. తమ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో తలమునకలై ఉన్నా కూడా మమతా బెనర్జీ, కేరళలో కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు సమాచారం. కేరళలో దాదాపు 15 లక్షల మంది బెంగాలీలు ఉన్నారనీ, వీరందరి ఓట్లూ తమకే పడతాయనీ ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే తృణమూల్‌ కేరళలో ఒక్క సీటైనా గెల్చుకుంటుందని ఆ పార్టీకే నమ్మకం లేదు. కానీ తమకి పడే ఓట్లు ఈ ఎన్నికల తీరుని ప్రభావితం చేస్తాయనీ, వచ్చే ఐదేళ్లలో తాము ఒక బలమైన శక్తిగా ఎదుగుతామనీ అక్కడి తృణమూల్‌ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

స్మృతీ ఇరానీకి మద్దతుగా 600 మంది ఉపాధ్యాయుల లేఖ

అన్నివైపులా విమర్శలను ఎదుర్కొంటున్న మానవ వనరులశాఖ మంత్రి స్మృతీ ఇరానీకి సంతోషం కలిగించే వార్త ఇది. దిల్లీలోని వివిధ విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నా దాదాపు 600 మంది ఉపాధ్యాయులు జేఎన్‌యూలో జరిగిన ఘటనను ఖండిస్తూ ఆమెకు ఓ లేఖను రాశారు. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిన సంఘటన నిజంగానే దేశవ్యతిరేక చర్య అని వారంతా ముక్తకంఠంతో తమ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ఉన్న వివిధ సంస్థలు విద్యార్థులలో అలజడిని రేకెత్తించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయనీ, భావప్రకటన స్వేచ్ఛ అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదనీ... వారు తమ లేఖలో తెలిపారు. కన్నయాకుమార్‌కు కూడా ఈ లేఖలు కాస్త చురకలు అంటించారు సదరు ఉపాధ్యాయులు. ‘రాజ్యాంగం అందించిన హక్కులను అనుభవిస్తున్నవారే, అందుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని’ దుమ్మెత్తిపోశారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనకి విద్యార్థులలోనూ, ఉపాధ్యాయులలోనూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయని వారన్నారు.

ఆరెస్సెస్‌ తీరు మార్చుకోనుందా!

ఈ ఏడాది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు అంతగా కలిసి వస్తున్నట్లు లేదు. మొదట హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలోని దళిత విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య సంచలనాన్ని సృష్టించింది. ఇందులో ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ మీద విమర్శలు వచ్చాయి. ఆ తరువాత జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద సమావేశం తరువాత ఏబీవీపీ తీరు వల్ల కూడా, ఆరెస్సెస్‌కు వెనుకబడిన వర్గాలు దూరమయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాము దళితులకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని ఆరెస్సెస్‌ స్పష్టం చేయక తప్పని స్థితి వచ్చింది. దాంతో ఆ సంస్థ వెనుకబడిన వర్గాల నమ్మకాన్ని చూరగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నడూ లేనివిధంగా జేఎన్‌యూలో ఏబీవీపీ సంఘం ఉపాధ్యక్షుడు మనుస్మృతిని తగలబెట్టారు. ఇందులోని విషయాలు మహిళలకు, దళితులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నది సదరు ఉపాధ్యక్షుల ఉవాచ. అంతేకాదు! అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సావాల సందర్భంగా ఈ ఏడాది కులవివక్షకు వ్యతిరేకంగా తాము కట్టుబడి ఉంటామని ఆరెస్సెస్‌ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

భారత భూభాగంలోకి చైనా సైన్యం

భారత దేశంతో దూకుడుగా వ్యవహరించే చైనా సైన్యం కదలికలు మరోసారి ఉద్రిక్తలకు దారితీశాయి. గత మంగళవారం చైనా సైనికులు, జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలోకి కనీసం 6 కిలోమీటర్లు చొచ్చుకురావడంతో, భారత సైనికులు వారిని వెనక్కి పంపాల్సి వచ్చింది. ఈ సందర్భంలో ఎలాంటి కాల్పులూ చోటు చేసుకోకపోయినా, ఇరువర్గాల మధ్యా ఇంకా ఘర్షణ వాతావరణం నెలకొనే ఉంది. నిన్న మరోసారి చైనా సైన్యం లడఖ్‌లోకి దూసుకురావడంతో ఇవేవీ అనుకోకుండా జరిగిన ఘటనలుగా కనిపించడం లేదు. అయితే భారత సైన్యం మాత్రం ఈ విషయం మీద ఆచితూచి స్పందిస్తోంది. మంచు కరిగిపోయిన తరువాత, వేసవిలో సైనికులు విస్తృతంగా గస్తా కాస్తూ ఉంటారనీ... ఆ సందర్భంలో దారి తప్పే అవకాశం ఉందనీ చెబుతున్నారు అధికారులు. మరి చైనా సైనికులు దారి తప్పే వచ్చారా, కొత్త దారులు వెతుక్కుంటూ బయల్దేరారా అన్నది చూడాల్సిందే!

గుజరాత్‌ అణువిద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం

జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం సంభవించి నేటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు. సునామీ వల్ల దెబ్బతిన్న ఆ కేంద్రం నుంచి అణుధార్మిక శక్తి బయటకు వెలువడటం మొదలవడంతో, దాన్ని అదుపుచేసే వరకూ ప్రపంచం ఊపిరి బిగపెట్టుకుని చూసింది. ఇవాళ ఉదయం దినపత్రికలలో వచ్చిన మరో వార్త ఆనాటి భయానక పరిస్థితిని మళ్లీ గుర్తుకుతెచ్చింది. గుజరాత్‌లోని కక్రాపూర్‌లో ఉన్న అణువిద్యుత్‌ కేంద్రంలో నిన్న అనుకోని విపత్తు ఏర్పడిందన్నదే ఆ వార్త. అక్కడి అణువిద్యుత్‌ కేంద్రంలోని శీతలీకరణ యంత్రాలు పనిచేయకపోవడం వల్ల, రియాక్టర్‌ ఒక్కసారిగా వేడెక్కిపోయిందనీ, అయితే రియాక్టర్ ఆగిపోవడంతో పెనువిపత్తు తప్పిందని చెబుతున్నారు. అణువిద్యుత్‌ కేంద్రాలలో చిన్నాచితకా ప్రమాదాలు జరగడం వింటున్నదే అయినా, భారతదేశంలో ఇదే మొదటి సంఘటన. ఇలాంటి చోట్ల ప్రమాదం జరిగితే అటు పర్యావరణానికీ, ఇటు ప్రజలకీ దీర్ఘకాలిక నష్టం కలుగుతుంది కాబట్టి... అణు ప్రమాదం అంటేనే ఉలిక్కపడక తప్పదు. అయితే కక్రాపూర్‌లో జరిగిన ప్రమాదం చాలా చిన్నదేననీ, అణువిద్యుత్‌ కేంద్రాన్ని చల్లబరిచే భారజలం లీక్ అవడం వల్ల, రియాక్టర్‌ ఒక్కసారిగా వేడెక్కి ఉత్పత్తి నిలిచిపోయిందనీ చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఈ విద్యుత్‌ కేంద్రాన్ని పరిశీలించి, అంతా సవ్యంగానే ఉందని పేర్కొన్న తరువాతే తిరిగి ఉత్పత్తిన మొదలుపెడతామని హామీ ఇస్తున్నారు కక్రాపూర్‌ అధికారులు.

కన్నయాకుమార్‌ మీద సస్పెన్షన్‌ ఎత్తివేత

ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో జరిగిన వివాదాస్పద సమావేశానికి సంబంధించి కన్నయాకుమార్‌ మీద విధించిన సస్పెన్షన్‌ను ఆ సంస్థ ఎత్తివేసింది. దీంతో కన్నయా శుభ్రంగా తరగతులకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ఈ వివాదానికి సంబంధించిన విశ్వవిద్యాలయం ఒక సంఘాన్ని నియమించడంతో, ఈ సంఘం ఇచ్చే సూచనల ఆధారంగా కన్నయా మీద తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కన్నయాతో పాటుగా మరో ఏడుగురి మీద విచారణ జరిపే ఈ సంఘం, వారిని జరిమానా విధించడం మొదలుకొని సంస్థ నుంచి బహిష్కరించడం వరకు ఎలాంటి చర్యనైనా సూచించవచ్చు. అయితే ఇప్పటికే వస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో కన్నయా మీద కఠిన చర్యలేవీ తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ అదేకనుక జరిగితే జేఎన్‌యూ మరో రావణకాష్టంగా మారుతుందన్న భయాలు ఎలాగూ ఉన్నాయి. కాబట్టి కన్నయా ఇక మీదట నిర్భయంగా మరో సమావేశాన్ని నిర్వహించవచ్చునేమో!

అక్కడి పిల్లలని వాతలు పెట్టి చంపుతారు

  అది ఒడిషాలోని నబరంగ్‌పూర్ జిల్లా. ఎటుచూసిన పేదరికం తాండవించే ఆ జిల్లాలో మూఢనమ్మకాలకు మాత్రం లోటు లేదు. అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదన్నా అనారోగ్యం ఏర్పడితే ముందుగా పరిగెత్తేది ఆసుపత్రికి కాదు... భూతవైద్యుడి దగ్గరకి! సదరు భూతవైద్యులు పిల్లలకు చిత్రవిచిత్రమైన వైద్యం చేస్తారు. పిల్లవాడి రాత బాగుండి బయటపడితే ఆ పేరు వైద్యుడితే, ఒకవేళ వైద్యం వికటించి పిల్లవాడు చనిపోతే అది తమ దురదృష్టంగా భావిస్తారు. అలాంటి ఒక మోటు వైద్య విధానమే కాల్చిన మేకుతో కానీ, గాజులతో కానీ వాత పెట్టడం. గత కొద్ది నెలలుగా నబరంగ్‌పూర్లో పదికి పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు చనిపోయారు కూడా! తాజాగా మలిగూడ గ్రామానికి చెందిన ఓ నెల రోజుల పసికందు మరణం వార్తల్లోకి ఎక్కింది. ఆ పిల్లవాడి పొట్ట మీద నరం పైకి తేలిందంటూ అతని తండ్రి ధనగౌడ స్థానిక భూత వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. భూత వైద్యుడు ఆ పిల్లవాడి పొట్ట మీద కాల్చిన మేకుతో వాత పెట్టడంతో అది కాస్తా పుండుగా మారింది. పరిస్థితి విషమించిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. పిల్లవాడు చనిపోయాడు! నబరంగ్‌పూర్‌లో తరచూ ఇలాంటి సంఘటనలు జరగడంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం కాక తప్పలేదు. ప్రస్తుతం వారు ‘జ్యోతి’ అనే 45 రోజుల ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. గ్రామాల్లో ఉండే స్థానిక వైద్యులలో మోటైన వైద్యవిధానాల పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం! మరి ప్రజల్లో మూఢనమ్మకాల సంగతో!

విజయకాంత్‌ ఒంటరి పోరుతో ఎవరికి మేలు!

  తమిళనాట రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. డీఎంకే, అన్నాడీఎంకే ముఖ్యపార్టీలుగా ఉన్న ఆ రాష్ట్రంలో, విజయ్‌కాంత్‌ నెలకొల్పిన డీఎండీకే కూడా ఎంతో కొంత ప్రభావం చూపించేది. క్రితంసారి అసెంబ్లీ ఎన్నికలలో అయితే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఏకంగా 29 సీట్లను కైవసం చేసుకుంది డీఎండీకే. అలా అసెంబ్లీలోనే రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. గత ఎన్నికలలో డీఎండీకే సత్తా చూసినవారంతా ఈసారి ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడారు. బీజేపీ కేంద్ర మంత్రి జవదేవ్‌కర్ స్వయంగా చెన్నైకు వచ్చి విజయ్‌కాంత్‌తో పొత్తుల గురించి కదిపారు. ఆ సమావేశం ముగిసిన కొద్దరోజులపాటు బీజేపీతో విజయ్‌కాంత్‌ కలిసి నడవడం ఖాయం అనుకున్నారంతా! కానీ ఇంతలో డీఎంకే పెద్దాయన కరుణానిధి రంగంలోకి దిగి విజయ్‌కాంత్‌ తమతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇంతకీ విజయ్‌కాంత్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారా అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగానే... తాను ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరదీశారు.   పైకి గొప్పగా కనిపించే ఈ నిర్ణయం నిజానికి నష్టదాయకమని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. విజయ్‌కాంత్‌ పార్టీ కనుక రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తే ప్రతిపక్షాలకు రావల్సిన ఓట్లన్నీ చీలిపోతాయనీ, దాంతో అన్నాడీఎంకేకు తిరుగులేకుండా పోతుందని తలలు పట్టుకుంటున్నాయి. కానీ విజయ్‌కాంత్‌ మాత్రం తాము తమిళనాట ఉన్న రెండు పార్టీలకూ అతీతంగా మరో ప్రత్యామ్నాయాన్ని చూపించి తీరతామని శపథం చేస్తున్నారు. మరి ఈ కెప్టెన్ తన నౌకను విజయతీరాలకు నడిపిస్తారా లేకపోతే తాను మునిగి మిగతా ప్రతిపక్షాలను కూడా ముంచుతారా చూడాలి!

కన్నయా మీద మరో కేసు నమోదు

  జేఎన్‌యూలో భారతవ్యతిరేక నినాదాలు చేసినందుకుగాను దేశద్రోహం కేసుని ఎదుర్కొంటున్న కన్నయాకుమార్‌ను, బెయిల్‌ మీద బయటకు వచ్చాక కూడా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ఒక ఉపన్యాసంలో, కన్నయాకుమార్‌ దేశ సైనికుల మీద చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ‘కశ్మీర్‌లోని భారతీయ సైనికులు అక్కడి స్త్రీల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు’ అంటూ కన్నయా చేసిన వ్యాఖ్యల మీద కాన్పూర్‌లో ఒక ఫిర్యాదు నమోదైంది. కన్నయాతో పాటుగా జేఎన్‌యూ ప్రొఫెసర్‌ నివేదితా మీనన్‌ను కూడా ఈ ఫిర్యాదులో చేర్చినట్లు సమాచారం. నివేదిత తను ఉపన్యసించే చోటల్లా భారతీయ సైనికుల గురించి చెడుగా మాట్లాడతారనీ, కశ్మీర్‌ను మన దేశం బలవంతంగా ఆక్రమించిందని జనాలని రెచ్చగొడుతూ ఉంటారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాన్పూర్‌ పోలీసులు కనుక ఈ ఫిర్యాదుని FIRగా మారిస్తే కన్నయా మరోసారి కోర్టు మెట్లు ఎక్కక తప్పదు!

ప్రభుత్వమే మాల్యాని దేశం దాటించింది- కాంగ్రెస్‌

  వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి పత్తాలేకుండా పోయిన విజయ్‌మాల్యా కోసం ఇప్పుడు కొట్లాట మొదలైంది. ‘విజయ్ మాల్యాకు రుణాలు ఇచ్చింది మీ ప్రభుత్వ హయాంలోనే’ అని బీజేపీ అంటే, ‘ఇస్తే ఇచ్చాం, ఇప్పుడెందుకు ఆయనను పారిపోనిచ్చారు’ అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. ఇవాళ రాజ్యసభలో జరిగిన వాడివేడి చర్చలో... ప్రభుత్వ సహకారం ఉండటం వల్లే విజయ్‌మాల్యా దేశం దాటిపోయాడంటూ, కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్ విరుచుకుపడ్డారు. కనపడకుండా పోవడానికి మాల్యా ఏమీ సూది కాదనీ, లుక్‌ఔట్‌ నోటీసుల ఉండగానే అతను దేశం దాటి పోవడం ఎలా సాధ్యమనీ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాల్యా ఏదో ఒక రోజున ఎగిరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసి కూడా ప్రభుత్వ సంస్థలు అతణ్ని ఎందుకు అరెస్టు చేయలేదని మండిపడ్డారు. మాల్యా దేశం వదిలి పారిపోయిన కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక దోషిగా ఎంచి సుప్రీంకోర్టు విచారించాలని డిమాండ్ చేశారు. గులాంనబీ ఆజాద్‌ ఆరోపణలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా దీటుగా స్పందించారు. విజయ్ మాల్యా విషయంలోని ఆర్థిక అవకతవకలన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయనీ, తాము ఆయన నుంచి చివరి పైసా వరకూ రాబడతామని పేర్కొన్నారు. అరుణ్‌జైట్లీ చెప్పిన లెక్కల ప్రకారం విజయ్‌మాల్యాగారు బ్యాంకులను ఎగ్గొట్టిన రుణాల మొత్తం అక్షరాలా 9,091.4 కోట్లు!

నేను అమాయకుడిని- సల్మాన్‌ఖాన్‌!

  1998లో జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ మరోసారి బోనెక్కాడు. జింకలను వేటాడే సమయంలో సల్మాన్‌ వాడిన ఆయుధాలకు లైసెన్స్‌ చెల్లిపోయిందన్నది ప్రస్తుత ఆరోపణ. ఈ ఆయుధాలను ముంబై నుంచి సల్మాన్‌బాబే తనతో తెప్పించుకున్నాడని ఉదయ్‌ రాఘవన్‌ అనే వ్యక్తి సాక్ష్యం కూడా ఇచ్చాడు. అయితే సల్మాన్‌ఖాన్‌ తనకేమీ తెలియదంటున్నాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాను మాత్రం అమాయకుడినని జోధ్‌పూర్‌ న్యాయస్థానం ముందర స్పష్టం చేశాడు. ఈ కేసుని నమోదు చేసిన అటవీశాఖ అధికారులు తనతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని అంటున్నాడు సల్మాన్‌. అయితే కోర్టు కూడా ఈ విషయంలో సల్మాన్‌ పట్ల చాలా ఉదారంగా ఉంది. మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఏవన్నా సాక్ష్యాలు ఉంటే తీసుకురమ్మంటూ, కేసుని ఏప్రిల్ 4కి వాయిదా వేసింది.