ఇండియాకు డోనాల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక
posted on Jan 5, 2026 8:27AM
అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ తన భారత వ్యతిరేకతను మరోసారి ప్రదర్శించారు. రష్యా నుంచిచమురు కొనుగోలు విషయంలో తన దారికి రాకపోతే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు మరింత పెంచుతామని హెచ్చరించారు.
రష్యా చమురు విషయంలో భారత్ అమెరికాకు సహకరించకుంటే.. ఆ దేశంపై టారిఫ్ లు మరింత పెంచుతామని ట్రంప్ ఓ బహిరంగ సభలో ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. భారత్ - అమెరికా మధ్య వాణిజ్య చర్చలతో రష్యా చమురు అంశాన్ని ఆయన ముడిపెట్టినట్లు తెలిపింది. ట్రంప్ ఈ ప్రకటనతో భారత్-రష్యా ఇంధన సంబంధాల చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు మరో సారి తెరపైకి వచ్చినట్లైంది.
గతంలో కూడా రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ ప్రకటనను భారత్ అప్పట్లో నిర్ద్వంద్వంగా ఖండించింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించి టారిఫ్ ల పెంపు అంటూ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.