హైకోర్టులో డీజీపీ శివధర్‌రెడ్డికి ఊరట

 

తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో కీలక ఊరట లభించింది. డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు డీజీపీగా శివధర్‌రెడ్డి కొనసాగడంపై తాత్కాలిక అడ్డంకులు తొలగినట్ల య్యాయి.ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ నియామకానికి సంబంధించి రెగ్యులర్ ప్రాసెస్‌ను తప్పనిసరిగా నాలుగు వారాల్లో పూర్తి చేయాలని పేర్కొంది. ముఖ్యంగా యూపీఎస్సీ  ద్వారా జరగాల్సిన నియామక ప్రక్రియను నిర్ణీత గడువులోగా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

యూపీఎస్సీ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కూడా హైకోర్టు సూచించింది. నియామకంలో విధివిధానాలు, నిబంధనలు పూర్తిగా పాటించాలన్న అంశంపై కోర్టు స్పష్టతనిచ్చింది. డీజీపీ నియామక వ్యవహారంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ప్రభుత్వం యూపీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మొత్తానికి, డీజీపీ శివధర్‌రెడ్డికి ప్రస్తుతం హైకోర్టు నుంచి ఊరట లభించినప్పటికీ, తుది నియామకం విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ప్రక్రియలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏర్పడింది. ఈ కేసుపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని

  భారత తొలి వందే భారత్ స్లీపర్ రైలును  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌‌లోని మాల్దాలో ప్రారంభించారు. హౌరా-గువాహటి మధ్య ఈ రైలు నడవనుంది. 16 బోగీలు, 823 మంది ప్రయాణికులతో సుమారు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వేగం, సురక్షితం, మరిన్ని సదుపాయాలతో సుదూర ప్రయాణాలను సాగించనుంది.  టికెట్ ధరలు రూ.2,300-3,600 మధ్య నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు రైళ్లు, రోడ్డు ప్రాజెక్టులను.. ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మాల్దాలో జరుగనున్న బహిరంగ సభలో రూ.3,250 కోట్ల విలువ చేసే రైల్, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించనున్నారు. కాగా.. మోడ్రన్ ఇండియాలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో వందే భారత్ స్లీపర్ రైలును డిజైన్ చేశారు. మేక్‌ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్‌లోనే వీటి డిజైన్, తయారీ చేపడుతున్నారు. జనవరి 18న హుగ్లీ జిల్లాలోని సింగూరు వద్ద రూ.830 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభింస్తారు. 

పురుషులకు ఫ్రీ బస్...ఏఐడీఎంకే మేనిఫెస్టోలో ప్రకటన

  రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏఐడీఎంకే పార్టీ  తొలి విడత  మేనిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతినెలా రూ. 2 వేలు, సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం..ఇళ్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ. 25 వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించారు.  తమిళనాడు ఇప్పటికే అప్పుల్లో ఉండగా ఇన్ని ఉచిత పథకాలు ఎలా సాధ్యమని మీడియా ప్రశ్నించగా.. పళనిస్వామి అందుకు ధీటుగా స్పందించారు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వానికి పరిపాలనా దక్షత లేదని. తాము అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపినట్లు తెలిపారు. సరైన ప్రణాళిక, పరిపాలనా సామర్థ్యం ఉంటే ఇవన్నీ సాధ్యమేనని అని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాము రూ. 1,500 ఇస్తామని చెబితే, డీఎంకే దాన్ని కాపీ కొట్టిందని, కానీ ఇప్పుడు తాము మరింత మెరుగైన పథకాలతో ప్రజల ముందుకు వస్తున్నామని పళనిస్వామి వెల్లడించారు.  

మేడారం మహాజాతర ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ఇందు కోసం కోసం ఏర్పాటైన మహాజాతర ట్రస్ట్ బోర్డు శనివారం (జనవరి 17) ప్రమాణ స్వీకారం చేసింది. మహాజాతర ట్రస్ట్ బోర్డు  చైర్మన్ గా  నియమితులైన ఇర్ప సుకన్య సునీల్ దోర. 15 మండి డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఇక పోతే మేడారం మహాజాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)  విస్తృత స్థాయిలో సన్నాహాలు   చేస్తోంది. లక్షల మంది భక్తులు వన దేవత లైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు తరలి రానున్న నేపథ్యంలో.. వారికి ఎటువంటి ప్రయాణ ఇబ్బందులూ తలెత్తకుండా  టీఎస్ఆర్టీసీ  రవాణా ప్రణాళికను సిద్ధం చేసింది. మహాజాతర కోసం టీఎస్ఆర్టీసీ   రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ప్రత్యేక బస్సులను  అందుబాటులోకి తెస్తోంది. మొత్తం 42,810 ప్రత్యేక ట్రిప్పులు నిర్వహించి దాదాపు 20 లక్షల మంది భక్తులకు మేడారం జాతరకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సర్వీసులు అందుబాటులో ఉంచనుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ, అలాగే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడప నుంది. ఇక మేడారం మహాజాతరకు స్వయంగా వెళ్లలేని భక్తులకు కూడా ఆర్టీసీ సేవలందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేవాదాయ శాఖ సమన్వయంతో  భక్తుల ఇంటి వద్దకే సమ్మక్క–సారలమ్మ ప్రసాదాన్ని అందించడానికి కూడా ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం  299 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన భక్తులకు వారి ఇంటి వద్దకే ఇంటి  సమ్మక్క, సారలక్క బంగారం ప్రసాదం ప్యాకెట్ ను అందించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ ప్రసాద ప్యాకెట్‌లో అమ్మవార్ల ఫొటోతో పాటు బెల్లం, పసుపు, కుంకుమ ఉంటాయి.  ఇక తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా మౌలిక సదుపాయల కల్పన చేసింది.  భక్తుల రాకపోకల ను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రత వంటి అంశాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల  28 నుంచి నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే 

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు కీలక నేత పాపారావు హతం

ఛత్తీస్‌గఢ్ లోని  బీజాపూర్ జిల్లాలో  జరిగిన ఎన్ కౌంటర్ లో  మావోయిస్టు పార్టీ అగ్రనేత  పాపారావు హతమయ్యాడు. ఈ ఘటనతో   బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టైంది.  అత్యంత విశ్వసనీయంగా అందిన  సమాచారం మేరకు, గత కొన్ని రోజులుగా పాపారావు నేషనల్ పార్క్ పరిసర అటవీ ప్రాంతంలో దాక్కుని ఉన్నాడని తెలుసుకున్న భద్రతాదళాలు కూంబింగ్ చేపట్టాయి.   డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , స్పెషల్ టాస్క్ ఫోర్స్, మరియు కోబ్రా ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కూబింగ్ లో తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో  ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత పాపారావు అక్కడికక్కడే  మరణించాడు.   సంఘటనా స్థలం నుంచి  రెండు ఏకే–47 తుపాకులు,  మందుగుండు సామగ్ర, మావోయిస్టు సాహిత్యాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.  పాపారావు మావోయిస్టు పార్టీలో  కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, భద్రతా బలగాలపై దాడులు, ఆయుధాల సరఫరా, కొత్త క్యాడర్ నియామకం వంటి కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.  ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఎఇంకా మావోయిస్టులు అనుమానంతో  భద్రతా బలగాలు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.  

గ్రీన్ లాండ్ ను ఆక్రమిస్తాం.. వ్యతిరేకించే వారిపై అదనపు సుంకాలు విధిస్తాం!

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో సారి టారిఫ్ వార్ ప్రకటించారు. తమ ఆక్రమణలను అడ్డుకుంటే అదనపు సంకాలను విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.  ఔను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మరోసారి టారిఫ్  హెచ్చరికలు చేశారు. గ్రీన్ లాండ్   విషయంలో తమతో విభేదించే దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానని హుంకరించారు.   అమెరికా జాతీయ భద్రత విషయంలో గ్రీన్ లాండ్ అత్యంత కీలకమన్న ట్రంప్  ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని తీరుతామని, ఈ విషయంలో తమను వ్యతిరేకించేవారెవరైనా సరే సహించేది లేదని ప్రపంచ దేశాలకు ట్రంప్ అల్టిమేటమ్ ఇచ్చారు.  అయితే టంప్ చేసిన ఈ వార్నింగ్ డెన్మార్క్ కు మాతర్మేనని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ ను ఆక్రిమించుకుంటామన్న ట్రంప్  తీరును డెన్మార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  డెన్మార్క్ ఎప్పటికీ తమ అధీనంలోని స్వతంత్రదేశాంగానే ఉంటుందని  డెన్మార్క్ అధ్యక్షుడు మెట్టె ఫ్రెడెరిక్సన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వార్నింగ్ డెన్మార్క్ కేనని అంటున్నారు. 

స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఎన్డీఆర్ జీవన సాఫ్యల పురస్కారం దక్కింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో  ఈ పురస్కారాన్ని శుక్రవారం (జనవరి 16) ప్రదానం చేశారు. అంతకు ముందు  నర్సీపట్నంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో    మకర జ్యోతి ఉత్సవాలు  శుక్రవారం (జనవరి 16) ముగిశాయి. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన శోభాయాత్ర విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ఐదు రోడ్ల కూడలి నుంచి ప్రారంభమైన స్వామివారి రథోత్సవం కృష్ణ బజార్ , వేంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా సాగింది.  ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభావేదికపై  స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి  ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం  ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. పరిషత్తు అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఈ అవార్డును అందజేశారు.   

పోక్సో కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడలోని పోక్సో కోర్టు  నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గోరంట్ల మాధవ్ పై గతంలో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అత్యాచారానికి గురైన బాలిక వివరాలను బహిర్గతం చేశారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుపై గోరంట్ల మాధవ్ పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా గోరంట్ల మాధవ్ కోర్టుకు హాజరు కాకపోవడంతో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇలా ఉండగా తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను రీకాల్ చేయాలని కోరుతూ గోరంట్ల మాధవ్ సోమవారం (జనవరి 19) కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.  

ఎక్స్ సేవలకు అంతరాయం

 ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' సేవలకు అంతరాయం కలిగింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న ఎక్స్ మరోసారి  మొరాయించింది. శుక్రవారం (జనవరి 16) సాయంత్రం  ఎక్స్ సేవలు నిలిచిపోవడంతో  ప్ర ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్  సేవలు కొద్ది సేపు నిలిచిపోయాయి. కంటెంట్ డెలివరీ, భద్రతా సేవలు అందించే క్లౌడ్‌ఫ్లేర్ సంస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యలే ఈ అంతరాయానికి కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. అయితే, ఈ అంతరాయంపై ఎక్స్ యాజమాన్యం గానీ, ఎలాన్ మస్క్ గానీ  అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలా ఉండగా వారం వ్యవధిలో ఎక్స్ సేవలకు అంతరాయం కలగడం ఇది రెండో సారి.   

గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం (జనవరి 17)  కాకినాడలో  పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా వారు  రాష్ట్ర పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా చెబుతున్న ప్రతిష్ఠాత్మక  గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు. గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ  13 వేల కోట్ల రూపాయల వ్యయంతో  ఈ ప్రాజెక్టును చేపడుతోంది. కాకినాడలో సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఏడాదికి  మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభం కానున్న ఈ పరిశ్రమను, భవిష్యత్తులో 1.5 మిలియన్ టన్నులకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.   ఎటువంటి కర్బన ఉద్గారాలు లేకుండా అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత సాంకేతికతతో ఇక్కడ ఇంధన ఉత్పత్తి జరుగుతుంది. పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా  ప్రత్యక్షంగా, పరోక్షంగా పాతిక  వందల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.