పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు బాంబు బెదరింపు!

పశ్చిమ బెంగాల్  గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టింది. గవర్నర్ ను బాంబు పెట్టి పేల్చివేస్తాం అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్ వార్నింగ్ తో  గురువారం (జనవరి 8) అర్ధరాత్రి అప్పటికప్పుడు లోక్ భవన్  వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. 

ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. 

అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి. 

వెస్ట్ బెంగాల్ గవర్నర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనకు హెచ్చరికలు అందాయి. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో  తాజా బెదరింపును అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు.

నిఘా సంస్థల డైరెక్టర్ జనరల్‌‌లను మార్చిన కేంద్రం

  జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్‌ఐఏ  కొత్త డైరెక్టర్ జనరల్‌ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎన్‌ఐఏ డైరెకర్ట్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వాల్‌ను నియమించింది. ఆయన ఈ పదవిలో 2028 ఆగస్టు 31 వరకు కొనసాగనున్నారు. హిమాచల్‌ క్యాడర్‌కు చెందిన అగర్వాల్‌ 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఎన్‌ఐఏలో స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఏసీసీ సమావేశం ఈ నియామకాన్ని ఆమోదించింది. ఎన్‌ఐఏ మాజీ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ ను మహారాష్ట్ర కేడర్‌కు పంపింది. దీంతో ఎన్ఐఏ డీజీగా అగర్వాల్‌కు పదోన్నతి లభించింది. ఏజెన్సీతో అగర్వాల్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. అలానే సంక్లిష్ట దర్యాప్తులను నిర్వహించడంలో అనుభవం ఆయన తాజా నియామకానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.  ఎన్ఐఏతోపాటు బీఎస్‌ఎఫ్, ఐటీబీపీలకు కొత్త డైరెక్టర్‌ జనరళ్లనూ కేంద్రం నియమించింది. సీనియర్‌ ఐపీఎస్‌ శతృజీత్‌ సింగ్‌ కపూర్‌ను కేంద్రం ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డీజీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీకి నేతృత్వం వహిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ను బీఎస్‌ఎఫ్‌ కొత్త చీఫ్‌గా నియమించింది.

జన నాయగన్ రిలీజ్ వాయిదా.. విజయ్‌కు చేదు అనుభవం

  దళపతి విజయ్ కు ఈ సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అతను నటించిన చివరి సినిమా 'జన నాయగన్' విడుదల మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ఆదేశాలు జారీ చేయమంటూ నిర్మాతలు సుప్రీమ్ కోర్టు తలుపు తట్టగా, అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కేసులో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది.  దాంతో పిటీషనర్ తరఫు న్యాయవాది రోహత్గి ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని, వీలైనంత త్వరగా తీర్పు ఇచ్చేలా చూడమని న్యాయమూర్తులకు విన్నవించుకున్నారు. రోహత్గి అభ్యర్థన మేరకు ఈ కేసును మద్రాసు హైకోర్టు లోనే తేల్చుకోమని, అయితే ఈ నెల 20లోగా తీర్పును వెలువర్చమని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మషి పేర్కొన్నారు. మద్రాస్ సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన ప్రతికూల తీర్పుపై సి.బి.ఎఫ్.సి. ద్విసభ్య ధర్మాసనంకు వెళ్ళింది. కేసును ప్రాధమికంగా విచారించిన న్యాయమూర్తులు సినిమా విడుదల అనుమతిపై స్టే విధించి, కేసును ఈ నెల 20కు వాయిదా వేశారు. దాంతో 'జన నాయగన్' నిర్మాత సుప్రీమ్ కోర్టు కు వెళ్ళి తమకు న్యాయం చేయమని కోరారు.  కానీ అక్కడ కూడా వారికి చుక్కెదురై తిరిగి ఈ వ్యవహారం చెన్నయ్ హైకోర్టు డివిజన్ బెంచ్ కోర్టులో పడినట్టు అయ్యింది. ఈ లోగా రివైజింగ్ కమిటీ సినిమాను చూసి ఎలాంటి సూచనలు చేస్తుందో చూడాలి. వాటిని నిర్మాతలు అంగీకరిస్తే, సినిమా ఇదే నెలలో జనం ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. ఒకవేళ కోర్టు కూడా సుప్రీమ్ కోర్టు సూచనలను అనుసరించి, 20వ తేదీకి తుది తీర్పు ఇచ్చినా... ఈ నెల 23వ తేదీ లేదా 30న 'జన నాయగన్' జనం ముందుకు రావచ్చు.  

ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్‌

  ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. గత నెలల్లో పార్టీ ఫిరాయింపుకు సరైన ఆధారాలు లేవని ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్‌కుమార్ తమ అనర్హతపై ఇంక సభాపతికి వివరణ ఇచ్చుకోలేదు. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి గెలిచి..  10మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని.. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని.. ప్రతీ నెలా బీఆర్ఎస్‌ఎల్పీకి చందాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసమే.. సీఎం రేవంత్‌ను కలిశామని వారు తెలిపారు  

కడపను తాకిన కోస్తా కోడి కత్తి...కొక్కరోకో అంటున్న కోడిపందాలు

  కోడిపందేలు అంటే కోస్తా గుర్తుకొస్తుంది. పందెం రాయుళ్ళు తెలుగు రాష్ట్రాలనుంచి అక్కడికి చేరుకొని సంక్రాంతి కోడిపందేలతో జోష్ మీద ఉంటారు...ఈ సారి కోస్తా కోడి కత్తి కడపకు చేరింది. భీమవరం, అమలాపురం లాంటి ప్రాంతాల్లో ఆడే కోడి పందేలు కడపజిల్లా లోను కోత లేస్తున్నాయి. లక్షలకు లక్షల పందేలు తో సంక్రాంతి రోజున కోళ్ళ పందేలు జోరుగా జరిగాయి. కోడిపందేలు ఆడకుండా చర్యులు తీసుకోవాలని కోర్టులు చెప్పినా , కోడిపందాలు ఉండకూడదన్న నిభంధనలున్నా  పలుచోట్ల మాత్రం కోడి కత్తులు ఆడాయి.ఈ ప్రాంతంలో  సుశిక్షితులైన పందె ఆర్గనైజర్ లు లేక పోవడంతో కొందరు కోస్తా నుంచి ఆర్గనైజర్ లను రప్పించి నట్లు సమాచారం. జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా కోడిపందాలు ఆడించడం ,పందెం రాయుళ్లు, వాటి తిలకించేందుకు వచ్చే వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జిల్లాలో ఆసక్తికరంగా మారింది *నేతలే అండగా ! ఉమ్మడి కడప జిల్లాలో యధేచ్చగా కోడి పందేలు సాగాయి. అధికార నేతల  అండతో ప్రత్యేక బరులు ఏర్పాటు చేసి మరీ కోడి పందేలు నిర్వహించారు.పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో, పులివెందులలో కోడిపందాలు టిడిపి నేతలే ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.పులివెందుల నియోజక వర్గంలో వేంపల్లి, లింగాల మండలాల్లో కోడిపుంజులు కాలు దువ్వాయి.  లింగాల మండలం దొండ్ల వాగులో భీమవరం నుంచి ఆర్గనైజర్లతో కోడి పందేలు ఆడించినట్లు సమాచారం. కొన్ని చోట్ల కోడి పందేలతో పాటు ఇతర ఆటలు ఆడించినట్లు గా తెలుస్తోంది.వేముల మండలం భూమయ పల్లె, పార్నపల్లి ,అలవలపాడు, పాములూరు, ఎర్రబెల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు జరిగాయి.రాజంపేట అత్తిరాల అమగంపల్లె, పుల్లంపేట ప్రాంతాల్లో జోరుగా కోడిపందాలు జరిగినట్లు సమాచారం. *ఆటగాళ్ళు కు సదుపాయాలు. ఆటగాళ్లకు సకల సదుపాయాలు కల్పించారు. ఒక్కో ఆట రెండు నుంచి ఐదు లక్షలు పలికినట్లు తెలుస్తోంది. తాడిపత్రి కదిరి తదితర  ప్రాంతాల నుంచి పులివెందుల, రాజంపేట లకు పందెంకాసేవారు, జూదరులు రావడం జరిగింది..సంక్రాంతి ఆటవిడుపు గా అని చెబుతున్న నేతలు పండుగ సంబరాల మాటున కోస్తాకు దీటుగా భారీ మొత్తంలో  కోడి పందేలు నిర్వహించడం కడప జిల్లాలో సంక్రాంతి కోస్తా కోడి పందేలను తలిపించింది. *పోలీసు ఆంక్షలను లెక్క పెట్టకుండా పోలీసు ఆంక్షలను లెక్క చేయని పందెం రాయుళ్లు యదేచ్చగా ఆటసాగించారు. కొన్ని చోట్ల కోళ్ల పందేలు ప్రత్యేక వీడియో షూట్ చేసి మరీ ఆడించడం జరిగింది. *పోలీసుల దాడులు  కోస్తా బరుల కు తీసిపోని రీతిలో కోడి పందేలు జరగడంతో వీటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. కొండాపురం మండలం ఓబన్న పేట గ్రామ పొలాల్లో కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించి ఆరుగురు అరెస్టు చేశారు. టీ.కోడూరు కోడి పందేల స్థావరంపై దాడి చేసి ఆరుగురు అరెస్టు చేశారు. మొత్తంగా జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో కోడిపందాలు జరగడం గమనార్హం.

మున్సిపల్‌ ఎన్నికల్లో వివాదం...సిరాకు బదులు మార్కర్ పెన్నులు!

  మహారాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓటింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్ల చేతివేలిపై గుర్తులు పెట్టేందుకు సిరాకు బదులుగా మార్కర్ పెన్నులు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. ఎన్నికల్లో మోసాలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే అధికారులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాన్ని బృహన్ముంబయి మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగ్రాని కూడా అంగీకరించారని విపక్షాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే మాట్లాడుతూ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తారుమారు చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు  ఓటర్లకు డబ్బు ఆశ చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకైనా పాల్పడేందుకు వారు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు అని ప్రశ్నించారు.  వ్యవస్ధను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికి ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.అయితే, ఈ ఆరోపణలను బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఖండించింది. ఎన్నికల్లో సిరాకు బదులుగా మార్కర్ పెన్నులను ఉపయోగిస్తున్నారన్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది

స్పోర్ట్స్ హాస్టల్‌లో ఇద్దరు బాలికలు సుసైడ్

  కేరళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో విషాదం నెలకొంది. ఇద్దరు మైనర్ ట్రైనీ బాలికలు (17, 15 ఏళ్లు) ఇవాళ ఉదయం తమ గదిలో ఉరివేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోజికోడ్‌, తిరువనంతపురానికి చెందిన వీరు ఒకరు అథ్లెటిక్స్, మరొకరు కబడ్డీ క్రీడాకారిణి.  మార్నింగ్ ట్రైనింగ్ సెషన్‌కు ఆ ఇద్దరు బాలికలు హాజరు కాకపోవడంతో ఇతర విద్యార్థినులకు అనుమానం వచ్చింది. ఆ బాలికల రూమ్‌కు వెళ్లి పదేపదే తలుపు తట్టినా సమాధానం రాకపోవడంతో హాస్టల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు తలుపు పగలగొట్టి చూశారు. గదిలో ఇద్దరు బాలికలు ఉరివేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమె పదో తరగతి చదువుతోంది. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజ్‌కోట్‌లో రికార్డు సృష్టించిన యువ బ్యాటర్ రాహుల్

  అంతర్జాతీయ క్రికెట్లో భారత్ యువ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో రాహుల్(112*) సెంచరీతో అజేయంగా నిలిచాడు. అయితే రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో శతకం బాదిన తొలి భారత వన్డే ప్లేయర్‌గా కేఎల్ రాహుల్ రికార్డులకెక్కాడు.  దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో శతక్కొట్టి.. అరుదైన ఘనతను సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(56), కేఎల్ రాహుల్(112*) అజేయ శతకంతో చెలరేగి ఆడారు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా నిరాశపర్చారు. 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రాహుల్ ఆఖరి వరకు పోరాడాడు. దీంతో భారత జట్టు ఆ మోస్తరు స్కోరు అయినా చేయగలిగింది.  ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 96 వ్యక్తిగత స్కోర్ వద్ద జెమీసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా రాహుల్‌కి ఇది వన్డేల్లో 8వ సెంచరీ. ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు కూడా ఇతడిదే. ఈ క్రమంలో అతను 11 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2015లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మైదానంలో 108 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ మైదానంలో ఇదే హయ్యెస్ట్ వన్డే వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో రాహుల్ దీన్ని అధిగమించాడు. ఈ మైదానంలో కేఎల్ రాహుల్(112 నాటౌట్), క్వింటన్ డికాక్(108), స్టీవ్ స్మిత్(98), శిఖర్ ధావన్(96), మిచెల్ మార్ష్(96) టాప్-5 స్కోరర్లుగా కొనసాగుతున్నారు

నారావారిపల్లిలో ఘనంగా సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ కులదైవం నాగాలమ్మకు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తండ్రి ఖర్జూరనాయుడు, తమ్ముడు రామ్మూర్తి సమాధుల వద్ద నివాళులు అర్పించారు.అలానే ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించనున్నారు. వారిరి స్మరించుకున్నారు. గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేశారు.  పండుగ వాతావరణంలో సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ వారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి, వినతులు ఇవ్వడానికి పెద్దఎత్తున ప్రజలు నారావారిపల్లికు చేరుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రి నారా లోకేష్, భువనేశ్వరి, నారా రోహిత్, నందమూరి రామకృష్ణ, ఎంపీ భరత్  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఉండవల్లికి చేరుకుంటారు.

ట్రేడింగ్ పేరుతో సినీ దర్శకుడి కుమారుడికి భారీ మోసం

  హైదరాబాద్‌లో ట్రేడింగ్ పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్‌ తేజను అధిక లాభాల ఆశ చూపి హైదరాబాద్‌కు చెందిన ఓ దంపతులు నిలువునా ముంచేసి ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయని నమ్మించి మొత్తం రూ.63 లక్షలు కాజేసినట్లు ఆరోపణలు చేస్తూ దంపతులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమితవ్‌ తేజ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.  గత ఏడాది 2025 ఏప్రిల్‌లో మోతీ నగర్‌కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్‌ దంపతులతో అమితవ్‌ తేజకు పరిచయం ఏర్ప డింది. ఆ పరిచయాన్ని అవకాశంగా మలుచుకున్న దంపతులు ట్రేడింగ్‌లో పెట్టు బడి పెడితే భారీ లాభాలు వస్తాయని, ఒకవేళ నష్టం వస్తే తాముంటున్న అపార్ట్‌ మెంట్‌ ఫ్లాట్‌ను అప్పగిస్తా మని హామీ ఇచ్చారు. దంపతుల మాటలు నిజమని నమ్మిన అమితవ్‌ తేజ తొలుత కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టారు. వారం రోజులకే రూ.9 లక్షలు లాభం వచ్చిందంటూ నిందితులు కొన్ని నకిలీ పత్రాలు, స్టేట్‌ మెంట్లు చూపించి అమితవ్‌ తేజ నమ్మించారు.  వాటిని చూసి నిజమని భావించిన అమితవ్‌ తేజ క్రమంగా విడతల వారీగా మరిన్ని పెట్టుబడులు పెట్టాడు.ఇలా మొత్తం రూ.63 లక్షలు దంపతులకు అందజేశారు. అయితే రోజులు గడుస్తున్నా కూడా ఎటువంటి లాభాలు రావడంతో పాటు పెట్టిన అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది.. దంపతులను ప్రశ్నించగా మాట తప్పించ డంతో మోసపోయినట్టు గ్రహించిన అమితవ్‌ తేజ చివరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.  బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రేడింగ్ పేరుతో నకిలీ పత్రాలు చూపించి డబ్బులు కాజేసిన ఘటనపై సైబర్ కోణంలోనూ విచారణ చేపట్టే అవకాశముందని పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడుల పేరుతో ఉపయోగించిన ఖాతాలు, ఇతర బాధితులు ఉన్నారా అనే అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం...ట్రేడింగ్, పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద ఆఫర్లు వస్తే ముందుగా పూర్తిగా పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.