తెలుగు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరించుకుందాం : సీఎం రేవంత్
posted on Jan 9, 2026 @ 4:03PM
పక్క రాష్ట్రంతో సయోధ్య లేకుండా తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం అవసరం అని ముఖ్యమంత్రి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ కంటే పరిష్కారానికే తాను మొగ్గు చూపుతానని తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలని రేవంత్ పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని తెలిపారు. దేశంలో పోర్టు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని...అందుకే మచిలీపట్నం పోర్టు నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి 12 లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్రం అనుమతులు అడిగామని ముఖ్యమంత్రి అన్నారు.
పోర్టు కనెక్టివిటీ ఉంటేనే మానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు వస్తాయిని సీఎం తెలిపారు. ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో సయోధ్య, సహకారం ఉండాలని తెలిపారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ విజ్ఞప్తి చేశారు. అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదు తెలిపారు. రాష్ట్రంపై ఆర్ధిక భారం కూడా పడుతోందని పేర్కొన్నారు. మేం వివాదం కోరుకోవడంలేదు, పరిష్కారం కోరుకుంటున్నామని రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
మరోవైపు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అనవసరంగా తెలుగు రాష్ట్రాలమధ్య గొడవలు వద్దు. మాకు రెండు రాష్ట్రాల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే కొంతమంది నీళ్లొద్దు గొడవలే కావాలంటున్నారని చంద్రబాబు అన్నారు. అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు వద్దని చంద్రబాబు హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఓ వీరుడు బయలుదేరాడని అని ఆయన తెలిపారు.