పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరు?!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసినట్లుగా పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరంటూ బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ తారాచంద్ డోనాల్డ్ ట్రంప్ ను నిలదీశారు. వెనిజులాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా నికోలస్ మదురోను అరెస్టు చేసిన అమెరికా అధ్యక్షుడు  పాక్ ఆర్మీ చీఫ్ విషయంలో ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.

నికోలస్ మదురో వెనిజులా నేచురల్ రిసోర్సస్ ను  చైనాకు అప్పగించి దోపిడీకి సహకరిస్తున్నారంటున్న ట్రంప్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కూడా బలోచిస్థాన్ లోని ఖనిజ సంపద, సముద్ర వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డాక్టర్ తారాచంద్ ప్రశ్నించారు.  పాక్ ఆర్మీ చీఫ్ మునీర్  డబుల్ ఏజెంట్ లా వ్యవహరిస్తూ, ఒకవైపు బలోచ్ వనరులను చైనాకు కట్టబెడుతూనే, మరోవైపు అమెరికాను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. . మదురోపై అమెరికా ఇటీవల  మెరుపు దాడి జరిపి అరెస్టు చేసినట్లుగానే  పాక్ ఆర్మీ చీఫ్‌ను కూడా బంధించాలని ఆయన డిమాండ్ చేశారు. 
వనరుల దోపిడీకి తోడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బలోచిస్థాన్‌లోనూ, సరిహద్దులకు ఆవల కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ తారాచంద్ ఆరోపించారు.  

వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బలోచ్ అమెరికన్ కాంగ్రెస్  బలోచిస్థాన్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు  డాక్టర్ తారా చంద్ గతంలో బలోచిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా  కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ప్రవాసంలో ఉన్నారు.  అక్కడి నుంచే బలోచిస్థాన్ హక్కుల కోసం పోరాటం జరుపుతున్నారు. 

పట్టాలెక్కిన జ్ణాన బుద్ధ ప్రాజెక్టు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పురోగతి శరవేగంగా సాగుతోంది. గతంలో అంటే జగన్ హయాంలో ఆగిపోయిన కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కిస్తోంది. అందులో భాగంగానే జ్ణాన బుద్ధ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు రెండు కోట్ల రూపాయలు విడుదల చేయడంతో జ్ణానబుద్ధ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి.    2014 నుంచి 2019 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘జ్ఞాన బుద్ధ’ పేరుతో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో బౌద్ధ ఆరామానికి సంబంధించిన అనేక విశేషాలతో పాటు బుద్ధుని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ, చుట్టూ హరిత హారాన్ని నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది.ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి బౌద్ధులను ఆకర్షించే అవకాశాలుంటాయని భావించిన చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లోనే ఈ ప్రాజెక్టుకు ఐదెకరాల భూమిని కూడా కేటాయించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న నూటపాతిక అడుగుల ఎత్తైన  బుద్ధుని విగ్రహ నిర్మాణం కూడా ఇందులో భాగమే.  అయితే ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రాజధాని అమరావతిని పక్కన పెట్టేసి మూడు రాజధానుల విధానమంటూ.. ఈ ప్రాజెక్టును కూడా మూలన పడేసింది.   ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకు సంబంధించి విధివిధానాలను పర్యటక శాఖ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా జ్ఞాన బుద్ధ ప్రాజెక్టుకు నిధులు కేటాయిం చింది.  ప్రత్యేక ధ్యాన మందిరం, గ్రంథాలయం, బౌద్ధుని స్మృతులతో కూడిన ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసి జ్ణాన బుద్ధను   పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తారన్నది అంచనా. ఆ అంచనాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.  

మరోసారి ట్రంప్ స్వోత్కర్ష.. తనను మించిన శాంతి దూత ఎవరని నిలదీత

నోబెల్ శాంతి పురస్కారానికి తనను మించిన అర్హులెవరున్నారంటూ అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన భుజాలను తానే చరుచుకుని స్వోత్కర్షలో తనకు తానే సాటి అని చాటుకున్నారు. వైట్‌హౌస్‌లో చమురు సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రసంగించిన ఆయన తన హయాంలో ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకున్నారు. అంతే కాదు.. భారత్ పదేపదే ఖండిస్తున్నప్పటికీ భారత్, పాకిస్థాన్ ల మధ్య అణుయుద్ధాన్ని తానే నివారించానని పునరుద్ఘాటించారు.  గత ఏడాది భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య  తీవ్ర ఉద్రిక్తతలు తెలిత్తి యుద్ధం అనివార్యం అన్న పరిస్థితులు నెలకొన్న సమయంలో  తాను జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్యా యుద్ధం జరగకుండా  అడ్డుకున్నానని  చెప్పుకున్నారు. తాను జోక్యం చేసుకోకుంటే అణుయుద్ధం జరిగేదని చెప్పుకొచ్చారు. తన చొరవ వల్లే  కనీసం కోటి మంది ప్రాణాలు దక్కాయని పాకిస్థాన్ ప్రధాని అప్పట్లో చేసిన బహిరంగ ప్రకటనను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.  ఇన్ని యుద్ధాలను ఆపిన తన కంటే నోబెల్ శాంతి పురస్కారం పొందేందుకు ఎవరికి అర్హత ఉందని చెప్పుకున్నారు. అయితే తనకు శాంతి పురస్కారాల కంటే.. జనం ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని చెప్పుకున్నారు.  

జగ్గన్నతోట ప్రభల తీర్ధానికి రాష్ట్రపండుగ హోదా

కోనసీమలో ఏటా కనుమ పండుగ రోజున జరనిగే జగన్నతోట ప్రభల తీర్ధానికి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపును ఇచ్చింది. కొనసీమ సంస్కృతికి చిహ్నంగా నిలిచే ఈ ప్రభల తీర్ధం ఇక నుంచి అధికారికంగా రాష్ట్రపండుగగా జరగనుంది. ఈ ప్రభల తీర్ధానికి దాదాపు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది.  ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.  జగన్నతోట ప్రభల తీర్థానికి  రాష్ట్ర పండుగ హోదా కల్పించడం తెలుగువారి ఆచారాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన అత్యున్నత  గౌరవంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ గుర్తింపు   దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.   సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున   జగన్నతోట ప్రభల తీర్థం జరుగుతుంది.   అమలాపురం పరిసర గ్రామాల నుంచి  ఏకాదశ రుద్రులు ప్రభల రూపంలో ఒకేచోట కొలువుదీరడం ఈ జగ్నన్నతోట ప్రభత తీర్థం ప్రత్యేకత.  ఎత్తైన ప్రభలను భుజాలపై మోస్తూ కౌశికా నదిని దాటించే దృశ్యం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. ముఖ్యంగా గంగలకుర్రు ప్రభ కౌశికను దాటి వచ్చే దృశ్యం ఒళ్లుగొగుర్పొడిచేలా ఉంటుంది. ఈ ప్రభల తీర్థానికి  ఏటా సుమారు ఆరు లక్షల మందికి పైగా తరలివస్తారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రభల తీర్థ విశిష్ఠతను గతంలో కొనియాడారు. అదలా ఉంచితే ప్రభల తీర్థానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా  కల్పించడంతో ఈ ఉత్సవాల నిర్వహణకు   ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో ఈ ఏడాది ప్రభల తీర్థం మరింత వైభవంగా నిర్వహిస్తామని  మంత్రి కందుల రమేష్ తెలిపారు. 

మలేసియా ఓపెన్..సెమీస్ లో పీవీ సింధు ఓటమి

ప్రంపంచ  బాడ్మింటన్​ సీజన్​ ఆరంభ టోర్నీ.. మలేషియా ఓపెన్లో భారత స్టార్​ షట్లర్ ​ పీవీ సింధూ పోరాటం ముగిసింది. శనివారం (జనవరి 10) ఇక్కడ జరిగిన సెమీఫైనల్ లో ఆమె పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.    సెమీ ఫైనల్ ​ లో  సింధు    డ్రాగన్​ షట్లర్  వాంగ్ జియి చేతిలో   16- 21, 15-21 తేడాతో వరుస సెట్లలో  పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.  గాయం కారణంగా సుదీర్ఘ కాలం  విరామం తీసుకున్న సింధూ  మలేషియా  టోర్నీలో పునరాగమనం చేసింది. ఈ టోర్నీలో ఆరంభ మ్యాచ్ లలో అదరగొట్టి సెమీస్ కు దూసుకెళ్లింది. పూర్వపు ఫామ్ అంది పుచ్చున్నట్లుగా సింధు కనిపించడంతో సంక్రాంతి కానుకగా ఆమె మలేషియా ఓపెన్ టోర్నీ విజేతగా నిలిచి స్వదేశానికి తిరిగివస్తుందని అంతా ఆశించారు. అయితే ఆమె సెమీఫైనల్ లో ఓడిపోవడంతో నిరాశ చెందారు. ఇలా ఉండగా   మలేషియా ఓపెన్‌లో  8 ఏళ్ల తర్వాత తొలిసారిగా సింధు సెమీఫైనల్ కు చేరుకుంది.   ఇక  లాస్​ ఏంజిల్స్​ ఒలింపిక్స్ లో సత్తా చాటి మరో ఒలింపిక్ మెడల్ ను తన ఖాతాలో వేసుకోవాలని సింధు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటి వరకూ సింధు ఖాతాలో రెండు ఒలింపిక్ మెడల్స్ ఉన్న సంగతి తెలిసిందే.

అయోధ్యలో మాంసాహార ఫుడ్ డెలివరీపై నిషేధం

అయోధ్యలో ఆన్ లైన్ లో మాంసాహార ఫుడ్ డెలివరిపై అధికారులు నిషేధం విధించారు. అయోధ్య రామ మందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో  మాసాహార ఫుడ్ డెలివరీని పూర్తిగా నిషేధించామనీ, ఆ నిషేధం వెంటనే అమలులోకి వస్తుందనీ  అధికారులు తెలిపారు.  పవిత్ర పుణ్యక్షేత్రం పంచకోశి పరిక్రమ పరిధిలోని ప్రాంతాల్లోకి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు మాంసాహారాన్ని సరఫరా చేస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయోధ్య లోని కొన్ని హోటళ్లు, హోమ్‌స్టేలు అతిథులకు మాంసాహారంతో పాటు మద్యం కూడా అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వాటి యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. అయితే నిషేధం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బుకింగ్ ల  ద్వారా పర్యాటకులకు నాన్-వెజ్ ఫుడ్ అందుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆన్‌లైన్ నాన్-వెజ్ ఫుడ్ డెలివరీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. హోటళ్లు, హోమ్‌స్టేలు కూడా ఈ నిబంధనలు పాటించాలని  నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు హెచ్చరించారు.  

సంక్రాంతి ప్రయాణాల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి ఆరంభమైపోయింది. పండుగను స్వగ్రామంలో జరుపుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో  తెలుగు రాష్ట్రాల్లో  బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి.  రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో పండుగకు నాలుగైదు రోజుల ముందే ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారు కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరడంతో  తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ప్రయాణాల సందడే కనిపిస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు ఇలా అన్ని నగరాలలోనూ  బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.    రద్దీ కారణంగా తోపులాటలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా అవసరాన్ని బట్టి బస్సు సర్వీసులను పెంచుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏ మాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. ఏపీఎస్ ఆర్టీసీ అయితే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.  అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ కూడా తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ.. ప్రయాణీకులకు బస్సు సర్వీసుల విషయంలో సమాచారం అందించేందుకు అదనపు సిబ్బందిని కూడా నియమించాయి.  ఈ రద్దీ సంక్రాంతి సెలవులు ముగిసే వరకూ అంటే ఈ నెల  18 వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఇక హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ఇప్పటికే వాహనాల రద్దీ పెరిగింది. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లు ఆరంభమైపోయాయి. 

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

   పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సెషన్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న  కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే అవకాశం ఉంది. వరుసగా తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అత్యధికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్‌ రికార్డు ఉంది. ఆయన రెండు దఫాల్లో 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

చైల్డ్ పోర్న్‌పై సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్... 24 మంది అరెస్ట్

  తెలంగాణ రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన సంచలన ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పిల్లలపై జరుగుతున్న ఆన్‌లైన్ లైంగిక దుర్వినియోగాన్ని అడ్డుకునే లక్ష్యంతో ఒక్కరోజు వ్యవధిలోనే 18 ప్రత్యేక బృందాలతో తెలంగాణ వ్యాప్తంగా దాడులు నిర్వహించిన అధికారులు, చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను చూస్తూ, షేర్ చేస్తూ, అప్లోడ్ చేస్తున్న 24 మంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అత్యధికంగా హైదరాబాద్ నగరానికి చెందిన వారే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితుల్లో ఇరిగేషన్ శాఖకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండటం సంచలనంగా మారింది. నిందితుల వయస్సు 18 నుంచి 48 సంవత్సరాల మధ్య ఉండగా, వారంతా మధ్యతరగతి వర్గానికి చెందినవారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులే కావడం గమనార్హం. అరెస్ట్ అయిన నిందితుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డిజిటల్ స్టోరేజ్ పరికరాలను ఫోరెన్సిక్ పరిశీలన చేయగా, వీరి వద్ద భారీగా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు లభ్యమయ్యాయి. ఈ వీడియోలు ప్రధానంగా విదేశాలకు చెందిన 4 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల మైనర్ బాలికలవిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియా యాప్‌లు, ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫార్ములు, మెసేజింగ్ యాప్‌ల ద్వారా ఈ కంటెంట్‌ను షేర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.ఈ వ్యవహారంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మాట్లాడుతూ, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన నేరాలపై ఏమాత్రం ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.  ఐటీ యాక్ట్‌తో పాటు పోక్సో చట్టం కింద నిందితులపై కఠిన కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తరహా నేరాల్లో పాల్గొన్నవారిని గుర్తించేందుకు అధునాతన టెక్నాలజీ, అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో మరింత నిఘా పెంచుతున్నట్లు తెలిపారు. చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను చూడడం, డౌన్‌లోడ్ చేయడం, షేర్ చేయడం కూడా నేరమేనని అధికారులు మరోసారి హెచ్చరించారు. ఇటువంటి కంటెంట్‌పై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సంచలన ఆపరేషన్‌తో తెలంగాణలో చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో స్పష్టమైందని, పిల్లల భద్రతే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో సంచలన విషయాలు

  తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యికి సంబంధించి కల్తీ ఆరోపణల కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నెయ్యి సరఫరా చేస్తున్న కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు లంచాలు తీసుకున్నట్టు టీటీడీ డైరీ ఎగ్జిక్యూటివ్ విజయ భాస్కర్ రెడ్డి అంగీకరించినట్టు సిట్ విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఆయనను A-34గా పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ఏసీబీ  కోర్టులో విజయ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, సిట్ తరఫున అసిస్టెంట్ పీపీ జయశేఖర్ వాదనలు వినిపించగా వాటిని సమర్థిస్తూ బెయిల్‌ను తిరస్కరించింది. సిట్ వివరాల ప్రకారం 2023లో భోలే బాబా కంపెనీ నుంచి రూ.75 లక్షల లంచం, ప్రీమియర్ కంపెనీ నుంచి రూ.8 లక్షలు, ఆల్ఫా డైరీ నుంచి ఎనిమిది గ్రాముల బంగారం లంచంగా స్వీకరించినట్టు బయటపడింది. నిందితుడు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ విషయాన్ని వెలిబుచ్చారు.  ఇవన్నీ హవాలా మార్గంలో స్వీకరించినట్టు సిట్ గుర్తించింది. 2019 నుంచి 2024 వరకు సంబంధిత కంపెనీల పనితీరు సరైన విధంగా లేకపోయినా, నెయ్యి క్వాలిటీ బాగుందని తప్పుడు రిపోర్టులు ఇచ్చిన కారణంగా టిటిడికి సుమారు రూ.118 కోట్ల మేర నష్టం జరిగినట్టు విచారణలో తేలింది. ఇప్పటికే విజయ భాస్కర్ రెడ్డి నుండి సిట్ రూ.34 లక్షలను సీజ్ చేసింది. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని అసిస్టెంట్‌ పీపీ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన నెల్లూరు ఏసీబీ కోర్టు.. విజయ భాస్కర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌‌ను చేసింది. 

పాలసీల స్థిరత్వమే పెట్టుబడుల ప్రవాహానికి బలం : మంత్రి లోకేష్

  మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో జరిగిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కీలకోపన్యాసం చేశారు. గతంలో ఏపీలో పీపీఏలను రద్దుచేయడంతో 2019–24 మధ్య అనేక కంపెనీలు భయపడి పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని ఆయన అన్నారు. అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు, పాలసీల స్థిరత్వం అత్యంత కీలకమని ప్రజలు కూడా చైతన్యవంతులుగా ఉండాలని సూచించారు. రాష్ట్ర పరిపాలనలో టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతంగా పెంచుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెనెన్స్ ద్వారా 36 శాఖలకు చెందిన వెయ్యికి పైగా సేవలను ప్రజలకు సులభంగా అందిస్తున్నామని చెప్పారు. ఏఐ ఆధారంగా స్కిల్ సెన్సస్, ల్యాండ్ రికార్డులను బ్లాక్‌చైన్‌పైకి తీసుకురావడం వంటి విప్లవాత్మక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ కంపెనీలు ఏపీపై చూపుతున్న నమ్మకానికి మూడు కారణాలున్నాయని చెప్పారు—నిరూపితమైన నాయకత్వం, వేగవంతమైన అనుమతి విధానం, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో పనిచేసే “డబుల్ ఇంజిన్” ప్రభుత్వం. పరిశ్రమలకోసం “లిఫ్ట్ పాలసీ” అమలు చేస్తున్నామని, టాలెంట్, నీరు, విద్యుత్ వంటి వనరులతో పాటు వేగవంతమైన అనుమతులు అందించడం వల్లే పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని వివరించారు. క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్లు, రిన్యూవబుల్ ఎనర్జీ, స్పేస్, ఎలక్ట్రానిక్స్ మొదలైన రంగాల్లో పెద్ద ఎత్తున ఎకోసిస్టమ్ నిర్మాణం జరుగుతోందని లోకేష్ తెలిపారు. రాజకీయ సంకల్పంతో, పారదర్శక విధానాలతో భారీ ఎఫ్‌డీఐలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం గెలుస్తుందనీ, ఇందుకోసం పాలసీల స్థిరత్వమే ప్రధానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.