Read more!
 Previous Page Next Page 
సుహాసిని పేజి 2


    "నేను వివాహానికి విముఖుడ్ని...."

    "అయితే సరే. ఈ రోజునుంచీ సన్యాసి జీవితం గడుపు...." అంటూ కాషాయాంబరధారి వెనక్కు తిరిగాడు.

    "స్వామీ!" అంటూ గౌతమ్ ఆయన్ను కంగారుగా అనుసరించి అందుకుని, "మళ్ళీ! మిమ్మల్ని కలుసుకోవాలంటే నేనేం చేయాలి....?" అన్నాడు.

    "వెర్రివాడా! నీకు సంబంధించినంతవరకూ నా కథకిదే ముగింపు. తర్వాత నా కోసమని ఎక్కడ వెతకగలవు? త్వరలోనే ఎన్నికలొస్తున్నాయి. ఎక్కడ చూసినా నీకు నా వంటివాళ్ళే కనబడతారు. వాళ్ళలో నువ్వు నన్ను వెతికి పట్టుకోలేవు. నీకేమైనా సందేహాలుంటే యిప్పుడే అడిగి తీర్చుకో!" అన్నాడు కాషాయాంబరధారి.

    "అయితే ఆ టాబ్లెట్ నాకిచ్చి వెళ్ళండి స్వామీ! మనసుకు నిలకడ ఉండదు కదా! అదెప్పుడెలా మారుతుందో ఏం చెప్పగలం....?" అన్నాడు గౌతమ్.

    "చాలా సంతోషం నాయానా! అయితే ఒక విషయం గుర్తుంచుకో_ ఈ టాబ్లెట్ ఒక స్త్రీ విషయంలోనే పనిచేస్తుంది. ఏ కారణం చేతనైనా నువ్వా స్త్రీని వివాహం చేసుకోలేక పోయావో, జీవితాంతం అవివాహికుడిగానే వుండిపోతావు. ఇది నీ కిష్టమేనా?"

    "ఇష్టమే స్వామీ!" అన్నాడతడు.

    కాషాయాంబరధారి గౌతమ్ చేతిలో ఓ టాబ్లెట్ వుంచాడు. అది చూడ్డానికి టెట్రాస్టెక్లిన్ కాప్సూల్ లా నీలంగా తళతళ మెరుస్తోంది?

    "ధన్యుడ్ని స్వామీ!" అన్నాడు గౌతమ్.

    "ఇంకేమైనా సందేహాలుంటే యిప్పుడే అడుగు. మళ్ళీ మనం కలుసుకోము" అన్నాడు కాషాయాంబరధారి.

    వెంటనే గౌతమ్ "అసలు తమరిక్కడికెలా వచ్చారో చెప్పండి అన్నాడు.

    "సృష్టికి ప్రతిసృష్టి చేసిన వాడ్ని. నా రాకపోకలు నీ కర్దమవుతాయా? నా సృష్టిలో శబ్దం కాంతి కంటే వేగంగా పయనిస్తుంది ఇందాక నీవు ఉరిమిన శబ్దం విన్నావుగా. ఆ మెరుపునిప్పుడు చూస్తావు...." ఆ కాషాయాంబరధారి అంటూండగా ఆకాశంలో పెద్దగా మెరిసింది.

    మిరుమిట్లు కొలిపే ఆ కాంతికి తట్టుకోలేక క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు గౌతమ్.

    అతను కళ్ళు తెరిచేసరికి కాషాయాంబరధారి లేడు.


                               2


    నాలుగు గదుల యిల్లది! అందులో ఒకే గదిలో వుంటున్నాడు గౌతమ్.

    ఆ యిల్లు గౌతమ్ తండ్రి సీతాపతి స్నేహితుడు భీమారావుది.

    భీమారావు పెళ్ళి చేసుకోలేదు. దేశ దిమ్మరిలా తిరుగుతూంటాడు. కదిపితే వేదాంతం మాట్లాడతాడు. తన యిల్లుని అద్దెకివ్వడం అతడికి నచ్చదు. సీతాపతి పట్ల స్నేహభావంతో గౌతమ్ వరడందులో ఉండనిచ్చాడు. పది నెలలుగా గౌతమ్ ఆ యింట్లో వుంటున్నాడు. ఆ పది నెలల్లోనూ మొత్తం తొమ్మిది రోజులు మాత్రం భీమారావందులో వున్నాడు.

    ఆ యిల్లు శుభ్రం చేయడానికి రోజూ పనిమనిషి వస్తుంది దాని జీతం భీమారావే యిస్తాడు. ఇల్లు, పని మనిషి ఊరికే రావడంవల్ల గౌతమ్ ఖర్చు ఊళ్ళో సగానికి సగం తగ్గిపోయింది.

    ఆ రోజు గౌతమ్ ఎప్పటిలాగే తెల్లవారుఝామున అయిదింటికి నిద్రలేచి తలుపు గడియ బయటినుంచి లాగితే పడేలాగున ఏర్పాటు చేసి మళ్ళీ పడుకున్నాడు. ఆ తర్వాత అతడికి మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఎదుట కనపడ్డ దృశ్యం చూసి ఉలిక్కిపడ్డాడు.

    ఎదురుగా సుమారు పద్దెనిమిదేళ్ళ యువతి నిలబడి ఉంది. ఆమె పైట జారి వుంది. ఆమె తల వంచి ఉంది ఆమె చేతులు రవిక ముడివేస్తున్నాయి.

    వయసుకు నిర్వచనంలాగుందామె.

    తన పని ముగించి పైట వేసుకుని తలెత్తిందామె.

    అప్పుడే అతడామె ముఖం చూశాడు. ఆమె అతడి మెలకువను గుర్తించింది.

    విచ్చిన కలువ రేకుల్లావున్న ఆమె కనుల కతడి చూపుల్లో సూర్యుడి తీవ్రత కనపడిందేమో అరమోడ్పు చూపులతో ఆమె క్రిందకు వంగింది. వంగినప్పుడామె పైట మళ్ళీ జారింది. ఆమె నేలమీదున్న చీపురు తీసుకుని జారిన పైటను సవరించుకుని లేచి తిన్నగా నిలబడింది.

    గౌతమ్ మంచం మీద లేచి కూర్చున్నాడు.

    అతడి చూపులామెనిబ్బంది పెడుతున్నాయేమో ఇల్లు తుడవడానికి తటపటాయిస్తోంది.
   
    ఇద్దరూ కాసేపు సంగిగ్దావస్థలో ఉన్నారు.

    "ఎవర్నువ్వు?" అన్నాడు గౌతమ్ చివరికి.

    "నా పేరు సీత. రంగమ్మ కొంట్లో బాగోలేదు. నన్ను పంపింది...." అందామె.

    రంగమ్మ పనిమనిషి.

    "నిన్ను నేనెప్పుడూ చూడలేదే?"

    "నేను వచ్చి మూణ్నెల్లయింది. మిమ్మల్ని చాలాసార్లు చూశాను. తెల్లవారు జామున రంగమ్మకు సాయంగా వచ్చి కాసేపుండి వెడుతూంటాను. నేను వెళ్ళేలోగా మీరెప్పుడూ నిద్రలేవలేదు. మిమ్మల్ని మెలకువగా చూడ్డం ఇదే మొదటిసారి" అందామె.

    "నిజమే, ఈ వేళదాకా నేను నిద్రపోతున్నాను" అనుకున్నాడు గౌతమ్.

    "ఓ పట్టాన మీకు మెలకువ రాదని రంగమ్మ చెప్పింది. ఆ ధైర్యంతోనే...." అని ఆగిపోయిందామె.

    గౌతమ్ కర్దమయింది.

    నిజంగానే తనకో పట్టాన మెలకువరాదు. ఆడగాలి సోకేసరికి ఈ రోజు కథ మారింది.

    అతడి మనసు కూడా యిప్పుడు నిర్మలంగా లేదు.

    ఆమె తన ఎదుట రవిక ముడివేసుకుంది. ఆ దృశ్యం కళ్ళముందు తుడిచినా పోవడంలేదు.

    ఏమయింది తనకీ రోజు?

    నిన్న సాయంత్రం ఎప్పటిలాగే తను మైదాన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఎప్పటిలా కాకుండా ఓ కాషాయాంబరధారి కనిపించాడు. అది కలలాగే తోస్తోంది. కానీ ఆయనిచ్చిన టాబ్లెట్ గదిలోనే ఉంది.

    గౌతమ్ తలగడ పైకి ఎత్తాడు. దాని క్రింద తెల్లని పోలిథీన్ సంచీలో నీలంగా మెరుస్తోందా టాబ్లెట్.

    గౌతమ్ సీతవంక చూశాడు.

    ఆమె యిల్లు తుడుస్తూ అతడివంక చూసింది.

    ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి.  

    "నా జీవితంలో ఈమె మేనక కాదుకదా....!" అనుకున్నాడు గౌతమ్.

    అతడే మనుకున్నా ఆమె అతడ్ని ఆకర్షిస్తోంది.


                        *    *    *    *


    సీత వరుసగా నాలుగు రోజులు తనొక్కతే ఆ యింటిపని చేయడానికి వచ్చింది.

    గౌతమ్ కిప్పుడామె ఉండగా సంగతటుంచి ఆమె లేనప్పుడు కూడా నిద్రపట్టడం లేదు.

    "విశ్వామిత్రుడు నాకేదో మంత్రం వేశాడు!" అనుకున్నాడతను. అది తెలిసి కూడా అతడా మంత్రానికి లోబడిపోతున్నాడు.

    గౌతమ్ ఇప్పుడు తెల్లవారుజామున గడియ బయట నుంచి తలుపు లాగితే పడే విధంగా ఏర్పాటు చేయడం లేదు. సీత వచ్చి తలుపు తట్టగానే తీయాలనుకున్నాడు. కానీ ఆమె అడుగుల చప్పుడే అతడికి దూరాన్నుంచి వినిపిస్తోంది. ఆమె తలుపు తట్టేలోగానే అతడు వెళ్ళి తీసేవాడు.

    సీత అతడి ఆరాటం గమనించిందో లేదో తెలియదు. కానీ ఆమె ఆ యింటికి తనతోపాటు చిన్న సంచీ తెచ్చుకునేది. అందులో ఓ జత బట్టలుండేవి. ఇంటి పనయ్యేక ఆమె అక్కడే స్నానం చేసి బట్టలు మార్చి కట్టుకుని యిల్లంథా, ముఖ్యంగా గౌతమ్ గదిని శుభ్రంగా సర్దేది. అతడికి కాఫీ కలిపి అందించేది.

    ఇది గౌతమ్ కి వింత అనుభూతి.

    అతడి మనసు సీత వైపు లాగుతోంది. దానికి కళ్ళెం వేసి ఎలా లాగాడో అతడికే తెలియదు.

    నాలుగో రోజున అతడు తన్నుతాను నిగ్రహించుకోలేనని గ్రహించి ఆదర్శాలు అదేపనిగా మనసును చీవాట్లు పెట్టగా సీత పని చేసుకుంటున్న సమయంలో తను వెళ్ళి మంచం మీద పడుకుని కళ్ళుమూసుకుని అంకెలు లెక్క పెట్ట సాగాడు.

 Previous Page Next Page