Next Page 
సుహాసిని పేజి 1

                                 


                                                                    సుహాసిని

                                                                                             __ వసుంధర

 




    మనోహర నీలాకాశం కింద విశాలమైన పచ్చిక బయల్లో అప్పుడతడొక్కడే మనిషి!

    అతడి పేరు గౌతమ్ !

    గౌతమ్ ఆకాశం వైపే చూస్తూ "ఓ భగవంతుడా! ఎంత ప్రయత్నించినా నా చూపుల వేగం నిన్నందుకోవడం లేదు. నీవు నాకెంత దూరంలో ఉన్నావు?" అంటూ ఎలుగెత్తి అరిచాడు.

    అప్పుడాకాశంలో ఉరుమొకటి ఉరిమింది. అది అతడి మాటల ప్రతిధ్వనిలా కాక అతడి ప్రశ్నకు సమాధానంలా వుంది....ఆ సమాధానంలోని అంతరార్ధం భగవంతుడి ఉనికిలాగే అతడికి అందకుండా ఉంది.

    దేవుడినుంచి ఇంకా ఏదో సందేశం అందుతున్నట్లుగా అతడు ఆకాశంవైపే చూస్తున్నాడు.

    "ఎవరు నాయనా నువ్వు?"

    ఆ పిలుపు ఉరుము తర్వాతి వానచినుకులా లేచి ఉలిక్కిపడి చూశాడు గౌతమ్.

    ఎదురుగా దబ్బపండువంటి ఛాయతో, పండిన కేశాలతో, నిండైన గెడ్డంలో, నిర్మలమైన చూపులతో- ఆజానుబాహుడైన కాషాయాంబరధారి కనిపించాడతనికి.

    క్షణంపాటు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడా అన్న భావం కలిగింది అతనికి.

    "ఎవరు నాయనా నువ్వు?"

    అది ప్రశ్నలా, పలకరింపులా కాక భగవంతుడి పిలుపులా విన్పిచిందతనికి.

    "నా పేరు గౌతమ్."

    "ఏం చేస్తున్నావిక్కడ?"

    "తల్లిదండ్రులు నాకు గౌతమ్ అని పేరెందుకు పెట్టారు అని విచారిస్తున్నాను."

    "విచారమెందుకు?" అన్నాడు కాషాయాంబరధారి.

    "నా చుట్టూ వున్నవారిలో నూటికి ఎనభైమందికి కడుపునిండా తిండి లేదు. కట్టుకునేందుకు బట్టలేదు. తల దాచుకునేందుకు గూడులేదు. విచారించక ఏం చేయను?"

    "విచారించి ఏం చేస్తున్నావ్?"

    "ఏం చేయాలో తెలియకే విచారం!"

    "నీ చుట్టూ వున్న మనుషుల మీద నీకు నిజంగా జాలి వుంటే వాళ్ళను చూసి విచారించకు. వాళ్ళకోసం ఏదో చేయి."

    "ఏం చేయను?"

    "ఏం చేయాలో నేను చెప్పగలను. కానీ నువ్వేం చేయాలో నాకు తెలియాలిగా. ముందు నీ గురించి చెప్పు" అన్నాడు కాషాయాంబరధారి.


                                                              *    *    *    *

    "అబ్బాయి దగ్గర్నుంచి వుత్తరం వచ్చిందా?" అంది హనుమాయమ్మ.

    "వాడుత్తరం రాస్తాడా? కట్నంలేకుండా పెళ్ళి చేసుకోవాలని వాడి ఆదర్శం కదా!" అన్నాడు సీతాపతి.

    "బాగుందండీ! నెలకు పదహారొందలోచ్చే వుద్యోగం, పాతికేళ్ళకే యింత మంచి వుద్యోగం చేసేవాళ్ళెందరీ రోజుల్లో? అయినా మనమేమైనా లక్షలడిగామా? పాతికవేలు కట్నమడిగాం. పదితులాల బంగారం పెట్టమన్నాం. బంగారం పిల్లకే వుండిపోతుంది, కట్నం డబ్బు పెళ్ళిలోనే ఖర్చయిపోతుంది...."

    "అంతేనా! వాడి అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. అన్నలిద్దరూ మంచి వుద్యోగాల్లో వున్నారు. నీకూ, నాకూ నా పెన్షన్ డబ్బులే ఎక్కువ. మనకు స్వంత యిల్లుంది. మన గౌతమ్ కి ఏ బాధ్యతలూ లేవు. వాణ్ణి చేసుకున్న పిల్ల అదృష్టవంతురాలు కదూ!"

    "అందుకేగా ఆ జగన్నాధంగారు ఎగిరి గంతేసి మన సంబంధానికి ఒప్పుకున్నాడు...."

    "కానీ అబ్బాయొప్పుకుంటాడని నాకు తోచదు. ఉన్నవాళ్ళ పిల్లకి సంబంధం కుదరడం కష్టం కాదూ, లేనివాళ్ళ పిల్లను కట్నం లేకుండా చేసుకోవాలీ అంటాడు. ఆ సంగతలాగుంచు, అసలు పెళ్ళంటేనే వాడికిష్టమున్నట్లు కనిపించదు...."


                         *    *    *    *


    "అది సరేమ్ నీకు పెళ్ళంటే ఎందుకిష్టంలేదు?" అడిగాడు కాషాయాంబరధారి.

    "విచారించడం మాని సాటి పౌరుల కోసం ఏదయినా చేయమని మీరేకదా యిప్పుడన్నారు. పెళ్ళయితే నేను ఎవరికీ ఏమీ చేయలేను. విచారించడమొక్కటే మిగులుతుంది నాకు" అన్నాడు గౌతమ్.

    కాషాయాంబరధారి నవ్వి "పెళ్ళయితే మిగిలేది విచారమా? నీ ఆలోచన నాకు విచారం కలిగిస్తోంది" అన్నాడు.

    "అయితే మీరెందుకు పెళ్ళి చేసుకోలేడు?" చటుక్కున సూటిగా అడిగాడు గౌతమ్"

    "నీవు అదృష్టవంతుడివి. ఏ తపస్సూ అవసరం లేకుండానే అప్సరసను పొందగలవు. అందరికీ అలాంటదృష్టముండదు. నేను మేనకకోసం తపస్సు చేస్తున్నాను. పది సంవత్సరాలయింది. ఇంకా ఆ భగవంతుడు నాపై కరుణ కలగలేదు" అంటూ నిట్టూర్చాడు కాషాయాంబరధారి.

    "అసలు తమరెవరు స్వామీ?" అడిగాడు గౌతమ్ కుతూహలంగా.

    "ఒకప్పుడు గాధిదేశపు రాజుని. రాజవైభోగంకంటే తపోభోగం గొప్పదని అన్నీ వదులుకుని సన్యాసినయ్యాను. అప్పుడూ మేనక అప్సరస నన్ను కరుణించింది. ఈ దేశానికి నా మనుమడి పేరే వచ్చింది"

    "అంటే తమరు విశ్వామిత్రులా?"

    "ఊఁ"

    "తమరీ రోజున యిలా నాకు దర్శనమివ్వడం చాలా ఆశ్చర్యం. బ్రహ్మర్షి విశ్వామిత్రులకు నాతో పనేమిటి?" అన్నాడు గౌతమ్ ఆశ్చర్యంగా.

    "నన్ను బ్రహ్మర్షి అనకు, ఆ పేరు విని విని విసిగిపోయాను. బ్రహ్మర్షి పదవి వదిలి ఈ దేశానికి ప్రధానమంత్రినై తిరిగి రాజరికం చేయాలనుంది నాకు. అందుకే యిలా వచ్చాను...."

    "బ్రహ్మర్షి విశ్వామిత్రులా, ఎన్నికల్లో పాల్గొంటారా?"       

    "ఆశ్చర్యపడకు. నేను చెప్పేది విను. ఎన్నికల్లో పాల్గొనేందుకు నా కథను ప్రజలకు మరోసారి గుర్తుచేస్తాను. అందుకు ఏకైక సాధనం సినిమా. నా కథ నేనే సినిమాగా తీస్తాను"

    "సన్యాసి రాజ్యమేలడమేకాక సినిమా కూడా తీయడమా?"

    కాషాయాంబరధారి నవ్వి "సినిమా తీయడమే కాదు. అందులో నా వేషం నేనే ధరిస్తాను. నేను ఫలానా అని తెలిసేక ఈ మహా భారతానికి నేనే మకుటం లేని మహారాజునౌతాను" అన్నాడు.

    "ఇదంతా చిత్రంగా వుంది నాకు. మీ మాటల్లో ఏదో మర్మముంది. మీరు విశ్వామిత్రులు కాదు. అసలు మీరెవరు? ఇక్కడికెందుకొచ్చారు? నా నుంచి మీరే ప్రయోజనమాశిస్తున్నారు?"

    "నీ వల్ల నాకే ప్రయోజనమూ లేదు. నా గురించి నీకు చెబుతున్నానంటే అదీ నీ ప్రయోజనం కోసమే. అన్నీ అందుబాటులో వున్న సమయంలో బ్రహ్మర్షి కావాలన్న పాడు కోరిక నాలో పుట్టింది. ఆ తప్పు దిద్దుకోవడం చాలా కష్టం. నాలో యిప్పుడు సరయిన కోర్కెలు లేవు. గత జీవితం తిరిగి రావాలని నేను పదేళ్ళుగా తపస్సు చేస్తున్నాను. అందువల్ల ప్రయోజనం కనబడలేదు. అందుకే యిప్పుడు సినిమా తీసి రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నాను. సినిమా తీయడంవల్ల మరో ప్రయోజనముంది నాకు. అప్సరస మేనకను మించిన సుందరితో మళ్ళీ తాత్కాలిక విహారం చేయొచ్చు."

    "మీరు కావాలనుకుంటే ఆ విహారం శాశ్వతం చేసుకోవచ్చు" అన్నాడు గౌతమ్.

    కాషాయాంబరధారి నవ్వి "కొన్ని తప్పులు దిద్దుకోలేనివి. బ్రహ్మర్షినై నేను సాధించినదేమిటి? సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన నా వల్ల సామాన్యులక్కలిగిన ప్రయోజనాలేమిటి? నన్ను నమ్మిన త్రిశంకు మహారాజుకు నేనిచ్చిన స్వర్గమెలాంటిది? అంతా అనర్ధమే! అందుకే చెప్తున్నాను. నీకు లభించిన జీవితాన్ని యధాతధంగా అనుభవించడం నేర్చుకో. సృష్టికి ఎదురు తిరక్కు...." అన్నాడు.

    "నాకు అందరిలా జీవించాలని లేదు. అర్ధవంతమైన ప్రత్యేక జీవితం గడపాలని వుంది"

    "వెర్రివాడా! అదంతా నీ భ్రమ. ఈ సృష్టి థియరీ ఆఫ్ రెలెటివిటీ కనిపెట్టిన ఐన్ స్టీన్ కారణంగా నడవడం లేదు. సత్యాగ్రహమనే ఆయుధాన్ని కనిపెట్టిన మహాత్మాగాంధీ దీన్ని నడిపించడం లేదు. ఒక స్త్రీ, ఒక పురుషుడు-వాళ్ళే ఈ సృష్టి చక్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ సృష్టిలో వున్న సమస్త జంతువులూ స్త్రీ పురుషుల ఆకర్షణకు లోబడి మసలుతున్నాయి. అన్ని జంతువులలోకీ మేధావి అయిన మానవుడు ఈ ఆకర్షణకు పెళ్ళి అనే పేరుతో నియమబద్ధం చేశాడు...."

    "ఆపండి స్వామీ! నాకు పెళ్ళంటే యిష్టం లేదని ముందే చెప్పాను. నా వివరాలు తెలుసుకుని కర్తవ్యం బోధిస్తానన్నారు. పెళ్ళి తప్ప ఇంకేమయినా చెప్పండి నాకు...." అన్నాడు గౌతమ్.

    "సరే, చెబుతున్నాను విను__ఈ రోజునుంచీ నీ దగ్గర అవసరానికి మాత్రమే డబ్బుంచుకో. మిగతాది అవసరంలో వున్నవారికి దానం చేయి. రేపు గురించి ఆలోచించకు. పొరపాటున కూడా ఆడదానివంక కన్నెత్తి పరీక్షగా చూడకు. ఇలా చేయగలిగితే నీ జన్మ సార్ధకమవుతుంది. లేదా నేను నీకో గుళిక అంటే టాబ్ లెట్ ఇస్తాను. నీకు బాగా నచ్చిన ఆడపిల్ల కనిపించినప్పుడు ఆమెను తల్చుకుంటూ యిది చప్పరించు. ఆ తర్వాతనుంచి ఎంత దూరంలో ఉన్నా ఆమె గుండె చప్పుళ్ళు నీకు వినబడతాయి. నీ పలకరింపు ఆమె హృదయాన్ని చేరుకుంటుంది. లోతయిన ఆమె హృదయానుభూతులు నీవు పంచుకోగలవు. ఆమెనందుకో గలిగితే జీవితమే ఒక ప్రణయయాత్ర అవుతుంది నీకు...."    

Next Page