Next Page 
పెళ్ళి చేసి చూడు పేజి 1

                                 


                                                పెళ్ళి చేసి చూడు

                                                                                     వసుంధర

                                               


    శ్రీ మహావిష్ణువు భక్తులను బాధపెడితే దాన్ని పరీక్ష అంటారు. భగవంతుడి లీల అంటారు. ఒక ధనవంతుడు పేదవాడిని బాధిస్తే ఎక్స్ ప్లాయిటేషన్ అంటారు. ప్రజాపీడన అంటారు.
    జరిగినపని మంచిదా చెడ్డదా అన్న విషయం - ఆ పనిచేసిన వాడిమీదా. ఆ విషయం గురించి ఆలోచించే వాడి మీద ఆధారపడి ఉంటుంది తప్పితే - అసలుపనిలో ఏమీలేదు.
    ఇదీ వెంకట్రామయ్యగారి వాదం! ఆయన్నందరూ బద్దకస్తుడంటారు. కాదు నెమ్మదస్తున్నంటారాయన. ప్రతిపనీ ఆలశ్యంగా చేస్తాడంటారు. ఆలశ్యంగా కాదు నిదానం మీద చేస్తానంటారాయన.
    వెంకట్రామయ్యగారిని మంచివాళ్ళలో మంచివాడుగా అభివర్ణించవచ్చు. ఎటొచ్చీ అయన మంచితనం ఆయనకు మేలు చేసిందనలేము. సుమారు రెండువందల ఎకరాల ఆస్తిని వారసుడాయన. అందులో నూటయాభై ఎకరాలాయనకు భార్య ద్వారా సంక్రమించాయి. ఇంత ఆస్తిని హారతి కర్పూరంలా హరింపజేశాడు వెంకట్రామయ్య తండ్రి - కేవలం కొడుకు మంచితనాన్నిసరగా చేసుకుని. వెంకట్రామయ్య తండ్రికి దురలవాట్లూ, దురుద్దేశ్యాలూ లేకపోయినా భారీ చెయ్యి ఉన్న కారణంగా దుబారా మనిషని చెప్పవచ్చు. బంగారు కోడిగుడ్లు పెట్టె బాతును చంపి బంగారాన్ని తీసుకోవాలనుకునే తొందర మనిషి. డబ్బు చేసుకునేవాడాయన. ఆ డబ్బుతో అయన చాలా సత్కార్యాలు చేసి పేరు సంపాదించుకున్నాడు.
    అయిన స్టీన్ ధియరీ ప్రకారం సృష్టిలో పదార్ధానికి శాశ్వతత్వముంది. అది ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతుంది. తప్పితే - పూర్తిగా నాశనం కాదు. కొత్తగా సృష్టించబడదు. వెంకట్రామయ్య తండ్రి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తున్నాడంటే - ప్రతిగా డబ్బు పోగొట్టుకుంతున్నాడనే అర్ధం. అయన పోయేనాటికి వెంకట్రామయ్యకు రెండెకరాల భూమి , పదిమంది పిల్లలూ మిగిలారు.
    వెంకట్రామయ్య భావకుడు. ఆయనకు చక్కగా కవిత్వం చెప్పగల శక్తి సహజంగా వచ్చింది. అయన అమాయకుడు. తండ్రి డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నా ఆయనెప్పుడూ బాధపడలేదు. అందుకు కారణం కూడా ఉంది. డబ్బెలాగ సంపాదిస్తారో ఆయనకు తెలియదు. అయాచితంగా ఆస్తి వచ్చింది. అవసరమైనప్పుడు పోలాలమ్మడ మొక్కటే ఆయనకు తెలిసిన విషయం.
    తనకు పదిమంది పిల్లలున్నారని అందులో ఆరుగురు ఆడపిల్లలనీ అయన ఎన్నడూ దిగులుపడ్డట్లు కనబడదు. మగపిల్లల చదువు గురించి కానీ, ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించి కానీ అయన డబ్బు నిలవేయడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆయనకు తండ్రి ఆదర్శం! అయన పంధాలోనే హాయిగా కాలం గడిపేయాలని ఉంటుంది. అందుకవసరమైనది తనకిప్పుడు లేదే అన్న దిగులు మాత్రం ఆయనకుంది.
    తన కన్నబిడ్డల భవిష్యత్తు గురించి క్షణ మాత్రం కూడా ఆలోచించని అతికొద్ది తండ్రులలో వెంకట్రామయ్య కూడా ఒకడు. అందువల్ల చాలామంది అతన్ని బాధ్యతలను మరచిపోయాడనుకోవచ్చు. కానీ వెంకట్రామయ్య మాత్రం తన నొక నిస్వార్ధపరుడుగా భావించుకుంటాడు. తనగురించి ఆలోచించుకోకుండా సర్వమూ తండ్రికి ధారపోసిన పితృభక్తీ పరాయణుడిగా, సంసారాన్ని నిర్వహిస్తూ కూడా ఆ బాధ్యతలు పట్టించుకోని పరమయోగిగా తన్నాయన సరి పెట్టుకుంటుంటాడు.
    వెంకట్రామయ్య భార్య పార్వతమ్మదింకో రకం మనస్తత్వం. చెప్పుకోదగ్గ ఆస్తితో ఆమె వెంకట్రామయ్యకు భార్యగా వచ్చింది. కానీ ఆమె పెద్దగా సుఖపడిందేమీ లేదు. కళ్ళముందే ఆస్తి అలా అలా కరిగిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేక ఆవిడ ఎన్నోసార్లు మామగారితో దెబ్బలాడింది. కానీ అందువల్ల తన భర్త మనసు కష్టపడుతోంది తప్పితే మామగారు మారరని ఆవిడ తొందరగానే గ్రహించింది. తన కన్నబిడ్డల భవిష్యత్తు గురించి ఆవిడ అనుక్షణమూ కలవరపడుతుండేది. ఆవిడ పట్టుదలకు ఫలితంగానే ఆవిడ పిల్లలందరికీ చిన్నతనంలోనే పెద్ద చదువు లబ్బాయి.
    ఇప్పుడు పిల్లలందరూ పెద్దవారయ్యేసరికి - ఉన్న ఆస్తి చాలక పోవడం - ఇంటి యజమాని కింటి సంగతులు సరిగా పట్టకపోవడం కారణంగా - ఆ ఇంట్లో దరిద్రం విలయతాండవం చేసింది. పిల్లలంతా ఏక కంఠంతో అందుకు బాధ్యులు తల్లిదండ్రులే అన్నట్లు మాట్లాడే వారు. కనీసం కట్టుకుందుకు గుడ్డయినా ఇవ్వలేని మీరు మమ్మల్నేందుకు కన్నారని నిలదీసి అడిగే ఆ పిల్లల ప్రశ్నలకు వెంకట్రామయ్య కళ్ళలో నీరు తిరిగేది. నిజానికి వాళ్ళ ప్రశ్న కాయనకు జవాబు తెలియదు. అలోచించి ఒకపని చేయడానికి అయన అలవాటు పడలేదు. తండ్రి డబ్బు అడిగితె - ఎందుకని అయన ఆలోచించలేదు. తండ్రి భూమి అమ్మమంటే ఎందుకని అయన ఆలోచించలేదు. భార్య ఆస్తి పోతుందని తగవు పెడితే కూడా ఎందుకని అయన ఆలోచించలేదు. మాములుగా సంసారం నిర్వహించుకుపోతుంటే పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళ భవిష్యత్తేమిటి అని కూడా అయన ఆలోచించలేదు. ఇప్పుడు పిల్లలు నిలదీసి మా గతికి నువ్వే కారకుడివంటుంటే తన తప్పేమిటో అని అయన ఆలోచించడం లేదు. తన్ను పిల్లలు గౌరవించడం లేదని కోపమూ, బాధా కలగ్గా - తన మంచితనం కోపన్నాపగా - బాధతో కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు.
    కొన్ని దశాబ్దాలుగా వెంకట్రామయ్యతో కాపురం చేస్తున్న పార్వతమ్మకు భర్త మంచితనం పూర్తిగా తెలుసును. అందుకే వెంకట్రామయ్యనేమైనా పిల్లాలంటే ----- ఆవిడ విరుచుకుపడిపోయేది. తండ్రి కోసం ఎన్నో త్యాగాలు చేసిన అయన కడుపున మీరు చెడ బుట్టారనేది. త్యాగాలు చేయడానికి మాకు వారసత్వపుటాస్తి లేదనే సరికి - మీరు నష్టజాతకులు - అందుకే అన్నీ పోయాయనెది. వెంకట్రామయ్యను పిల్లల బారి నుండి రక్షించడం కోసం పార్వతమ్మ పిల్లల్ని ఏ తల్లీ అనని ద్యుర్భాషలాడేది.
    పార్వతమ్మకు పిల్లలమీద అపారమైన ప్రేమ ఉంది. కానీ అంతకుమించిన జాలి భర్త నిస్సహాయతపైన ఉంది.
    పిల్లలిప్పుడు ప్రాజ్ఞులవుతున్నారు. చదువులు బాగా వస్తున్నాయి. ఏదో ఒకవిధంగా వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకలేకపోరు. వాళ్ళు కూడా సంపాదించి ---------వెంకట్రామయ్యను మనసు కష్టపడని విధంగా చూసుకోవాలి. వాళ్ళలా ప్రవర్తించేలా చేయడం ప్రస్తుతం పార్వతమ్మ ధ్యేయం. ఆవిడ దృష్టిలో ఇప్పుడు పిల్లల భవిష్యత్త లేదు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు లేవు. పిల్లలు తండ్రిని గౌరవరించేలా చేయాలన్న కోరిక మాత్రముంది.
    ఎందువల్లనో కానీ వెంకట్రామయ్యకూ, పార్వతమ్మకూ కూడా పిల్లలు తమను సరిగ్గా చూడరన్న అనుమానం కలిగింది. అందుక్కారణం వాళ్ళ ఆలోచనశక్తి నశించడం మాత్రమే!    
    ఎందుకంటే వెంకట్రామయ్యగారి పెద్దకొడుకు లిద్దరూ ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. నెలనెలా తండ్రికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ ఇద్దరు కొడుకుల కారణంగా గ్రామంలో మళ్ళీ వెంకట్రామయ్యగారి పరపతి పెరిగింది.
    పరపతి పెరిగింది కానీ వెంకట్రామయ్య'గారి ఇంటి పరిస్థితి మెరుగుపడలేదు. ఆయనకు చేతిలో కాస్త డబ్బు కనపడగానే మళ్ళీ వెనుకటి దానగుణం విజ్రుంభిన్చింది. నెలకు సుమారు వందరూపాయలకు పైగా - చందాల రూపేణా అయితేనేం, పేద విద్యార్ధులకు సహాయమని అయితేనేం ---- ఏదో విధంగా అయన చేతిలో ఖర్చు అవుతుండేది.
    ఆర్ధిక పరిస్థితి ఎలాగున్నప్పటికి -- వెంకట్రామయ్యగారిలో ఇంకా పులుపు చావలేదు. పదిమందీ పదిరూపాయలూ విరాళమిచ్చే చోట అయన పాతిక ఇస్తాడు. తన పాత జమీందారీ హోదాను నలుగురూ గుర్తుంచుకోవాలని అయన చాలా తాపత్రయ పడిపోతుంటాడు. ఆ తాపత్రయం ఖర్చు రూపంలో కనబడుతుంది. ఈ కారణాల వల్ల కొడుకులు డబ్బు పంపిస్తున్నప్పటికి ఏటా ఒకటి రెండు వేల రూపాయలకు చిల్లర అప్పులవుతుండేవాయనకు. ఈ విషయం తెలిసిన కొడుకులిద్దరూ తల్లి దగ్గిర బాధను వ్యక్తం చేసుకుంటే పార్వతమ్మ వాళ్ళ మీద మండిపడేది -- 'సంసారం పెద్దది కాబట్టి - ఖర్చులు పెద్దవిగా ఉంటాయి - లింగు లింగుమంటూ ఉన్న మీకేం తెలుస్తాయి ?" అనేసేదావిడ.

Next Page