Next Page 
అర్చన పేజి 1

                                 


                                   అర్చన
                                                                                         

                                    ...అత్తలూరి విజయలక్ష్మి


        డిసెంబరు నెల చివరి వారం. ఆంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన, పవిత్రమైన ధనుర్మాసం తొలిరోజులు.
    అది ఆంద్రదేశంలో,  గోదావరి గట్టున ఉన్న చిన్న పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పొలాలు, మధ్యగా పారే పంటకాలువలు, కాయలతో బరువుగా వంగి, గోదావరి చల్లని ఒడిలో సేదతీరుతోన్న కొబ్బరి చెట్లు, చల్లగా, పరిమళభరితంగా వీచే గాలి. కోనేటి ఒడ్డున, ప్రశాంతమైన పరిసరాల్లో వెలసిన వేణుగోపాలస్వామి కోవెల. పిఠాపురం చుట్టుపక్కల ఉన్న ఆ ఊరు అనంతంగా పెరిగిపోయిన నాగరికతకీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాపు వాసనలకి అతీతంగా, కనుమరుగవుతోన్న స్వచ్చమైన, అసలైన అమాయకపు పల్లెటూళ్ళకీ చిహ్నంగా ఉంది, ఆ ఊరికి కరెంటు ఉన్నా, కొన్ని ఇళ్ళల్లో ఇంకా సంధ్య వాలడంతోటే లాంతర్లు చూరుకి వేలాడుతూ కనిపిస్తాయి, ప్రభుత్వం వారు ఇంటింటికీ గ్యాసు పొయ్యిల పథకం కింద ఎందరికో గ్యాసుస్టవులిచ్చినా, ఆ ఊరికి మాత్రం గ్యాసుస్టవ్ లు ఇంకా చేరుకోలేదు. అందుకే కొన్ని డాబా ఇళ్ళలో కిరోసిన్ స్టవ్ లు వెలుగుతూ, మరికొన్ని పెంకుటిళ్ళలోంచి కట్టెల పొయ్యి పొగ, వెలుగు కనిపిస్తూ ఉంటుంది.
    ఆ ఊరికి చిన్న రైల్వే గేటుంది. అటునుంచి ఎప్పుడన్నా ఒకటీ, అరా ప్యాసింజరు బండ్లు మాత్రం పక్క స్టేషనువైపు నిదానంగా వెళుతూ ఉంటాయి. ఆ ఊరికి రైలు స్టేషను లేదు. ఆ ఊళ్ళో సినిమా థియేతారు లేదు. కానీ అప్పుడప్పుడూ డేరా హాళ్ళు వేసి, పాత సినిమాలు ప్రదర్శిస్తుంటారు. ఆ సినిమాలకి, చిన్నా, పెద్దా, ముసలీ, ముతకా అంతా కలిసి పొలోమంటూ వెళ్ళి చూసి వస్తూంటారు. ఆ చూసిన సినిమా గురించి, మరో సినిమా ప్రదర్శించేదాకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కుర్రకారు. ఆ సినిమాలో హీరోయిన్ లా ఉండాలని అమ్మాయిలు, హీరోలా ఉండాలని అబ్బాయిలూ కలలు కంటూ, తామెన్నడూ చూడని అందమైన ప్రదేశాలను ఊహల్లో చూసి తృప్తిపడుతుంటారు.
    ఏ కల్మషం, ఏ మాలిన్యం, ఏ రాజకీయం అంటని ఆ ఊరు మంచు కడిగిన ముత్యంలా, హిమాలయాల్లో పూసిన గులాబీలా స్వచ్చంగా, అందంగా ఉంటుంది.
    ప్రపంచం మొత్తం ముందుకు వెళ్ళిపోతుంటే ఆ ఊరు మాత్రం ఇంకా వెనకబడే ఉంది. అక్కడ ఎర్రబస్సులే తప్ప, మరో బస్సు తిరగదు. ఇటు రాజమండ్రి, పిఠాపురం, అటు ఏలూరు, కాకినాడ నుంచి కొన్ని బస్సులు మాత్రం అడపా దడపా దూసుకొచ్చి దుమ్ములేపి, రోడ్డుపక్కన మర్రిచెట్టు కింద ప్రయాణీకులను దింపి, తిరిగి పక్క ఊరికి వెళ్ళిపోతాయి. మట్టిరోడ్డు తప్ప తారురోడ్డు ఎరగని మట్టిమనుషులు... అయితేనేం మనసుల నిండా బంగారమే.
    అప్పుడు సరిగ్గా సమయం ఉదయం ఐదున్నర.
    అప్పటివరకూ మబ్బులచాటున మత్తుగా పడుకున్న సూరీడు బద్ధకం వదిలించుకుని, మెల్లిగా ప్రయాణమైన సూచన వచ్చిందేమో చంద్రుడు మెల్లిగా తన కర్తవ్యాన్ని ముగించుకుని ఆ పూటకి సెలవు తీసుకోడానికి కదిలాడు. అప్పటిదాకా చలికి ముడుచుకు పడుకున్న పక్షులు బద్ధకంగా లేచి అవలించాయి.
    అప్పుడే మొదటి బస్సు శబ్దం చేస్తూ వచ్చి ఆగింది. ఆగిన బస్సులోంచి భుజం మీద పసిపాపను వేసుకుని, కుడిచేత్తో సూట్ కేసు పట్టుకుని ఓ యువతి దిగింది. బస్స్తు తిరిగి శబ్దం చేస్తూ కదిలింది. పక్కనే పొలాల్లోకి పైర్లు తలలూపుతూ వయ్యారంగా కదులుతున్నాయి. వాటికి దూరంగా కనిపించీ, కనిపించని కొండలు మంచుతో కప్పబడి, అస్పష్టంగా కనిపిస్తున్నాయి మసక చీకట్లో. చలి వణికిస్తోంది. ఆమె తన చేతిలో ఉన్న సూట్ కేసు కింద పెట్టి, భుజం మీద ఉన్న పాప చలికి వణుకుతున్నట్లుగా అనిపించి, ఆ పాపమీద కప్పిన బట్ట ఇంకా కొంచెం పైకి జరిపింది, తిరిగి సూట్ కేసు చేతిలోకి తీసుకుని, అర్ధచంద్రుడి వెలుగులో అస్పష్టంగా ఉన్న మట్టిరోడ్డు మీదనుంచి ముందుకి నడిచింది.
    ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. రెండు పక్కలా పొలాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. గాలి చేస్తున్న శబ్ధం ఆమె చేయబోయే పనిని ఊరంతటికీ టముకు వేస్తున్నట్టుగా అనిపించి ఆమె ఒక్కక్షణం వణికింది. దీనంగా, మూగగా గాలినందిస్తున్న పొలాలవైపు చూసింది శబ్దం చేయవద్దన్నట్టుగా. చలికి కాళ్ళు కొంకర్లు పోతున్నాయి. అడుగులు బరువుగా పడుతున్నాయి. గుండె ఎప్పటికన్నా వేగంగా కొట్టుకుంటోంది. 'భగవంతుడా దీనంగా వేడుకుంటూ, కనిపించిన మలుపు తిరిగింది. అయిపోయింది. దగ్గర పడింది. అందరూ నిద్ర లేచారు. చలికి బైటికి రాకపోయినా ఇళ్ళల్లో పనులు చూసుకుంటున్నారు. కొంచెం దూరంగా కనిపిస్తున్న పెంకుటిళ్ళలో సన్నని వెలుగు కనిపిస్తోంది. ఆమె నెమ్మదిగా ఎడం పక్కకి తిరిగి, దేవాలయాలవైపు నడిచింది.
    చలికాలం కాబట్టిగానీ, అదే ఎండాకాలం అయివుంటే ఈపాటికి ఊరంతా బైటే ఉండేవాళ్ళు. చిరుచీకట్లోనే గృహిణులు వంటగదుల్లో కుంపట్లు రాజేయడానికి, కన్నెపిల్లలు వీధుల్లో పేడకళ్ళాపి జల్లి, అందమైన ముగ్గులు తీర్చిదిద్దడానికి, పురుషులు పొలాలకి బయలుదేరడానికి అనువైన సమయం, అలవాటైన సమయం. వాళ్ళెవరూ బైటికి రాకముందే తనని ఎవరూ చూడకుండా, గుర్తుపట్టకుండా తానొచ్సిన పని పూర్తిచేసుకుని వెళ్ళిపోవాలి. దేవాలయం సమీపిస్తుండగా అర్చకులు మోగిస్తున్న చిరుగంటల శబ్దం ఉండి, ఉండీ వినిపించసాగింది.
    'భగవంతుడా! నా పని విజయవంతంగా పూర్తికావాలి తండ్రీ!' మనసులో మనసారా వేడుకుందామె దేవుడిని. దేవాలయం సమీపించింది.
    అప్పుడే ఆ వైష్ణవాలయం అర్చకుడు కృష్ణస్వామిగారు కోవెలలో స్నానం ముగించి, తడితువ్వాలు చుట్టుకుని, రాగిచెంబుతో నీళ్ళు తీసుకుని దేవాలయం మెట్లు ఎక్కుతున్నారు. ఆ యువతి ఆయనని చూడగానే అడుగులు వేయడం ఆపి, వేపచెట్టు వెనక్కి నక్కి నిలబడింది. ఆ వేపచెట్టు దేవాలయం మెట్లకి అతిసమీపంలో ఎడం పక్క బాగా విశాలమైన కొమ్మలతో బలంగా పెరిగి ఉంది. చీకటిగా ఉంది కాబట్టి ఆమెని ఆయన గమనించలేదు. పైగా ఆయన మనసంతా దేవుడిపైన లగ్నం అయి ఉంది. ఆదిత్య హృదయం చదువుతున్నాడు. అందుకే పరిసరాలవైపు దృష్టి సారించలేకపోయాడు. ఆయన ద్వారం దాటి లోపలికి వెళ్ళగానే, యువతి ఒక్కసారి తలెత్తి దూరంగా కనిపిస్తున్న డాబా ఇంటివైపు దృష్టి సారించింది. ఆ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. ఆమె గుండెల్ని చీల్చుకుంటూ ఓ నిట్టూర్పు వెలువడింది. కళ్ళు చెమర్చాయి. చెట్టు చాటునుంచి కదిలి నెమ్మదిగా ఆలయం మెట్లు ఎక్కింది. సరిగా పదిమెట్లు.... తొమ్మిదో మెట్టు ఎక్కబోతుండగా, ఓ స్త్రీ దైవదర్శనం ముగించి, బైటికి రాబోతూ, ద్వారానికి అభిముఖంగా ఉన్న రావిచెట్టు దగ్గరకి వెళ్ళి ప్రదక్షిణలు చేయసాగింది. ఆ సమయం అవకాశంగా వాడుకోడానికి చటుక్కున లోపలికి ప్రవేశించి ద్వారా చాటు చేసుకుని ఊపిరి తీసుకుంది.

Next Page