ఆపరేషన్ మేడిపండు
-వసుంధర
రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులో 'నాయుడమ్మ భవనం' ధగదగా మెరిసిపోతోంది. భవనం ముందు రంగురంగుల మనుషులతో కోలాహలంగా వుంది.
ఆ మనుషుల్లో ఐరోపా తెల్లపారు, ఆఫ్రికా నల్లవారుమ్ చైనా పసుపువారు, అరబ్బు గోధుమవారితోపాటు వివిధ వర్ణాల భారతీయులూ వున్నారు. వీదేశీయులు ఒంటిరంగుతో వేరుగా వుంటే భారతీయులు కంటికి కనిపించని 'వర్ణాల' తో వేరుగా వున్నారు. విదేశీయులు స్వదేశానుబంధంతో ఒకో గుంపుగా వుంటే భారతీయులు అతిథిభావంతోనో, దాస్యభావంతోనో ఆ గుంపులకు అనుబంధంగా వున్నారు.
రాజు మాత్రం అలా లేడు. బహుశా అలా వుండే అవకాశం అతడికి లేదు. అతడు నిరుద్యోగి. అందరూ వేడుక చూడాలని అక్కడికి వస్తే అతడు ఉద్యోగాన్వేషణలో అక్కడికి వచ్చేడు. కానీ అక్కడకు రాగానే భగవంతుడి దర్శనభాగ్యం పొందిన భక్తుడిలా అతడు సర్వం మరచిపోయాడు.
నాయుడమ్మ-తెలుగుజాతి గర్వించదగ్గ అంతర్జాతీయ శాస్త్రవేత్త. తెలుగువారి ముద్దుబిడ్డ. మద్రాసులో సెంట్రల్ లెదర్ రీసెర్చి లెదర్ ఇన్ స్టిట్యుట్ కు డైరెక్టరై-తనవారందరూ- నీకిదేం కర్మరా, తోళ్ళపరిశ్రమకు దిగజారిపోతున్నావూ అంటూంటే లెక్కచేయకఆ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతినీ, భారతీయ తోళ్ళపరిశ్రమ అనంతంగా వరాల్నీ ప్రసాదించి తన సామర్థ్యాన్ని అలాంటి అన్ని సంస్థలకూ పంచిపెట్టాలని అఖిలభారత విజ్ఞాన సంస్థ-'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి'కి డైరెక్టర్ జనరల్ పదవిని స్వీకరించి దానిని అపూర్వంగా నిర్వహించి-దురదృష్టశాత్తూ విమానప్రమాదంలో అసువులు బాసిన అమరజీవి.
అప్పుడాయన వ్యక్తిత్వం ధగధగా మెరిసింది.
ఇప్పుడాయన పేరిట ఈ భవనం ధగధగా మెరుస్తోంది.
ఆ ఊళ్ళో నాయుడమ్మ భావనానికో ప్రత్యేకత వుంది.
అది ఊరంతా అభిమానించే ప్రముఖ పారిశ్రామికవేత్త రామావధాని నేతృత్వంలో తన ఉనికిని సంతరించుకుంది. అందులో విజ్ఞానశాస్త్రానికి మాత్రమే సంబంధించిన సభలు నిర్వహించబడతాయి. సామాన్యప్రజల్లో శాస్త్రీయ దృక్పధం పెంపోందడం కోసం ఆ భవన నిర్వాహకులు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూంటారు. నిర్వాహకుల చిత్తశుద్ధిపై సామాన్యులందరికీ చెప్పలేనంత నమ్మకముంది.
"ఆ రోజు నాయుడమ్మ భవనంలో అజేయ్ కి సన్మానం.
అజేయ్ సామాన్యుడు కాదు.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియాల రీసెర్చి (క్లుప్తంగా సిఎస్ఐఆర్) స్వర్ణోత్సవం జరుపుకున్నా పారిశ్రామిక పరిశోధనా సంస్థ. అయితే అక్కడి పరిశోధనలు మందకొడిగా వుంటున్నాయని కొందరంటారు. అక్కడి శాస్త్రజ్ఞులు పాశ్చాత్యుల అవసరాలకు మాత్రమే స్పందిస్తారని కొందరంటారు. ఆ సంస్థవల్ల దేశానికి జరుగుతున్న మేలు తక్కువని అందరూ అంటారు. కాంగ్రెసేతరులు ప్రభుత్వాలేర్పరచినప్పుడు దానిని మూసి వేయాలని కూడా ఆలోచించారు. అదంత సులభం కాదని గ్రహించేక రాజకీయవాదులు- డిస్కవరీ హౌస్ - అనే కొత్త సంస్థను సృష్టించారు.
డిస్కవరీ హౌస్ కూడా సిఎస్ఐఆర్ లాంటి పరిశోధనాసంస్థ. అయితే ఇక్కడ పూర్తిగా ప్రజలకోసమే పరిశోధనలు జరుగుతాయి. సామాన్యులా అవసరాలు గుర్తించి వారి జీవితాలను మెరుగుచేసే పరికరాలను సృష్టించడమే ఆ సంస్థ పని.
ముద్దుగా డీహెచ్ అని పిలువబడే డిస్కవరీ హౌస్ ని సిఎస్ఐఆర్ కు అనుబంధ సంస్థగా చేస్తే బాగుంటుందని కొందరన్నారు. సిఎస్ఐఆర్ లోని కొన్ని అనుబంధ సంస్థలను సిస్కవరీ హౌస్ లుగా మార్చవచ్చునని కొందరన్నారు.
కానీ వివేకాన్ని రాజకీయం మింగివేయగాప్ డిస్కవరీ హౌస్ ఒక కొత్త సంస్థగానే వెలసింది. అంతేకాదు- అది సిఎస్ఐఆర్ కు పోటీ సంస్థగా మారింది. ఆ విధంగా విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో కూడా రాజకీయాలు చోటుచేసుకున్నాయి.
సిఎస్ఐఆర్ లో అనుభవమున్నవారెవ్వరికీ డీహేచ్ లో స్థానముండదు. డీహెచ్ లో స్థానముండదు. డీహెచ్ లు అనుకున్నవిధంగా పనిచేస్తే- కొన్ని సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థలను మూసివేసే అవకాశం కూడా వుంది.
దేశంలో మొత్తం నాలుగు డిస్కవరీ హౌస్ లు ఏర్పడ్డాయి. దక్షిణాది డీహెచ్ ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకోగలిగింది.
ప్రతిష్ఠాత్మకమైన ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరానికి కాస్త దూరంగా ఆట్టే జనాభా లేని ఒక చిన్న గ్రామంలో ప్రారంభించబడింది. ఆ సంస్థ రావడంతోనే ఆ గ్రామం స్వరూపమే మారిపోయింది. పల్లె పట్నంగా రూపుదిద్దుకోవడమే కాక చుట్టుపక్కల పల్లెలపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తోంది. పాశ్చత్యం ప్రాచ్యాన్ని మానభంగం చేస్తూంటే-అది ప్రణయసుఖమనుకునే అమాయకత్వం నానాటికీ శాఖావిస్తరణ చేస్తున్న మహావృక్షమవుతున్న రోజులివి కదా!
డిస్కవరీ హౌస్ ఇన్ ఆంద్రప్రదేశ్ కు తొలి డైరెక్టరుగా వచ్చాడు ప్రొఫెసర్ అజేయ్. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేశాడు. ఆమెరికాలో పిహెచ్ డి చేశాడు. అక్కడే ప్రోఫెసరయ్యాడు. అందువల్లనే ఆయనకు డిస్కవరీ హౌస్ డైరెక్టరు పదవి నలభై ఏళ్ళు రాకుండానే లభించింది.
డైరెక్టరైన మర్నాటినుంచీ అజేయ్ వార్తల్లోనే వున్నాడు. విజ్ఞానశాస్త్రాన్నాధారంగా చేసుకుని ప్రజలు రూపస్వరూపాలను ఆయన మార్చేస్తాడని చాలా ప్రచారం జరిగింది. పదేళ్ళలో దేశంలో నిరుద్యోగ సమస్య వుండదనీ, జనాభా సమస్య తొలగిపోతుందనీ, స్వంత ఇల్లు లేని కుటుంబం వుండదనీ, జనాభా సమస్య తొలగిపోతుందనీ, స్వంత ఇల్లు లేని కుటుంబం వుండదనీ ఆయన అన్నాడు.
అజేయ్ పరిశోధనలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించినట్లూ. డిస్కవరీ హౌస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పరిశోధనా సంస్థలో అగ్రశ్రేణికి చేరుకున్నట్లు పత్రికలు రాస్తూండేవి.
ప్రొఫెసర్ అజేయ్ కు సామాన్యులాపట్లనే ఆసక్తి. ఆయన ఎక్కువగా సామాన్యులతోనే సంభాషించి వారి సమస్యలను తెలుసుకకుంటూండేవాడు. ఆయన టీవీలో కనిపించడు. రేడియోలో వినిపించడు. పత్రికలవారితో కూడా ముఖాముఖీ మాట్లాడడు. ఎవరైనా సందేహాలుంటే లిఖితపూర్వకంగా ఆయన ఆఫీసులో ఇవ్వవచ్చు. ఒకటి రెండు రోజుల్లో లిఖితపూర్వకంగా బదులు వస్తుంది.
అజేయ్ డైరెక్టరైన అయిదు సంవత్సరాలకే ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇవ్వబోయింది. ఆయన తిరస్కరించాడు. 'భారతరత్న' అందుకునే స్థాయి పరిశోధనలు చేసే వరకూ ఆయన ఏ బిరుదులూ స్వీకరించనన్నాడు.
ప్రొఫెసర్ అజేయ్ డైరెక్టరై పది సంవత్సరాలైంది. ఈ పదిసంవత్సరాల్లోనూ ఆయన ఎన్నో అద్భుతాలు సాదించాడట. అందుకే ఇప్పుడు రామావధాని ఆయన్ను సన్మానించదలిచాడు. ఆ సన్మానం సందర్భంగానే ఇప్పుడు రాజమండ్రిలో నాయుడమ్మ భవనం ధగధగా మెరిసిపోతోంది.
ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ప్రొఫెసర్ అజేయ్ కు విద్యాదికులైన యువకులను ప్రత్యేకంగా కలుసుకునే అలవాటుంది. అది కూడా రెండు సంవత్సరాలుగా ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సమావేశాలు తనకెంతో మేలుచేశాయనీ-విద్యాధికులకూ ప్రయోజనాలనిచ్చాయనీ ఆయన అంటాడట.
రాజు ఇప్పుడు అజేయ్ ని కలవాలని వచ్చాడు. కానీ ఇక్కడి వాతావరణం చూస్తే అతడికి మతిపోతోంది. ప్రొఫెసర్ అజేయ్ అంతర్జాతీయ ప్రముఖుడు. నిజంగా తనకాయన్ను కలుసుకునే అవకాశం వస్తుందా? వస్తే ఆయన తన మాటలు వింటాడా? విన్నాక ఏం చేస్తాడు? రాజు ఆలోచిస్తున్నాడు.
అంతలో అక్కడ కలకలం....
ప్రొఫెసర్ అజేయ్ వున్న కారు నాయుడమ్మ భవనం ముందాగింది.
* * *
సన్మాసం అద్భుతంగా జరిగింది.
వేదికపై దేశావిదేశీ ప్రముఖులు పలువురు అజేయ్ పై ప్రశంసావర్షం కురిపించారు.
రామావధాని సన్మానం గురించి ప్రస్తావిస్తూ-"తెలుగువారు గర్వించదగ్గ ప్రొఫెసర్ అజేయ్ ని సన్మానించే అవకాశం నాకు రావడం అదృష్టం. త్వరలో తెలుగువారికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ప్రొఫెసర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరిట ఒక పురస్కారాన్ని నెల కొల్పబోతున్నాను. దానికి న్యాయనిర్ణేతల బృందాన్ని ఎంపికచేయడానికి ప్రొఫెసర్ అజేయ్ సాయం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏటా ఒక తెలుగు శాస్త్రజ్ఞుడి పరిశోధనాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడానికి ఈ పురస్కారం దోహదం చేయాలని నా సంకల్పం" అని కూడా చెప్పాడు.
ప్రొఫెసర్ అజేయ్ సన్మానానికి ప్రతిస్పందిస్తూ "నేను ఉత్తమ పౌరుణ్ణీ కాదు. ఉత్తమ శాస్త్రజ్ఞుణ్ణీ కాదు. నేను సేవకుణ్ణి. నా సేవలు ఉత్తమంగా వున్నాయని నాకీ సన్మానం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని విజ్ఞానశాస్త్రాన్నీ , భారత ప్రజలను ఇతోధికంగా సేవించుకుంటూంటాను. నేనిలాగన్నానని నన్నో రాజకీయవాదిగా పోరపడవద్దు. నేను రాజకీయలకు ఎప్పుడూ ఆమడదూరంలో వుంటానని ఇంతమంది ప్రజలు ముందు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. అలాగని రాజకీయాలంటే నాక అగౌరవం లేదు. ప్రజాసేవలో వారి పాత్ర వారిది. నా పాత్ర నాది" అన్నాడు .
చుట్టూ జనం కొట్టారని కాక అప్రయత్నంగా తనకై తానుగా రాజు కూడా చప్పట్లుకొట్టాడు. అజేయ్ మాటలకు అతడి మనసులో పులకరింత కలిగింది. తన పక్కవారి భావాలెలా వున్నాయో తెలుసుకుందుకు చెప్పట్లు కొడుతూనే అతడటూ ఇటూ చూశాడు.
రాజుకు కుడిపక్కన ఒక పొడవాటి వ్యక్తి కూర్చునివున్నాడు. మనిషి చామమనచాయగా వున్నాడు. గెడ్డం కొద్దిగా మాసింది. చురుకైన కళ్ళు. అతడు చురుగ్గా అజేయ్ నే చూస్తున్నాడు. అతడి చేతులు చప్పట్ల కోసం కూడా కదలడంలేదు.
రాజుకు ఆశ్చర్యం కలిగింది. అతడు చప్పట్లు కొట్టడేం?
అదే సమయానికి అతడు కూడా రాజును చూశాడు. అతడి కళ్ళలోని ఆశ్చర్యాన్ని చదివినట్లుగా "నాకు ప్రొఫెసర్ అజేయ్ బాగా తెలుసు" అన్నాడు.
"ఎలా?" అన్నాడు రాజు.
"ఆయన డిస్కవరీ హౌస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కు డైరెక్టరు. నేను దియాలో సైంటిస్టును అన్నాడతను.
"దియా అంటే ఏమిటి?" అన్నాడు.
"డిస్కవరీ హౌస్ లు నాలుగున్నాయికదా-ఆంధ్రప్రదేశ్ వున్నడిస్కవరీ హౌస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అబ్రివేషన్ డిహెచ్ఐఎలో అక్షరాల్ని కలిపి ముద్దుగా దియా అంటాం. దియా అంటే దీపం కదా- అలా కూడా ఈ పేరు బాగుంది."
"మరి మీ డైరెక్టర్ మాట్లాడుతూంటే చప్పట్లు కొట్టరా?"
"కొట్టాలనిపించదు-భయం!"
"భయమా- భయం దేనికి?" అన్నాడు రాజు ఆశ్చర్యంగా.
"అజేయ్ చాలా గొప్పవాడు. ఆయన గొప్పతనం మీకు దూరాన్నుంచి తెలుసు మాకు దగ్గర్నుంచి తెలుసు....." అన్నాడతను.
"అయితే మాత్రం చప్పట్లు కొట్టడానికి భయమెందుకు?" అన్నాడు రాజు.
"మీరు సినిమాలు చూస్తారుకదా- అందులో గొప్పగొప్ప శాస్త్రజ్ఞులకేమవుతుందో చూడలేదా?" అన్నాడతను.
సినిమాల్లో శాస్త్రజ్ఞులుంటారని రాజుకు గుర్తులేనే లేదు. హీరోలు, హీరోయిన్లు. పాటలు, నృత్యాలు....అంతేకదా సినిమాలంటే.... అంతగా లేకుంటే కొట్లాటలు....
రాజు ముఖభావాలు చూస్తూ. "ఒక శాస్త్రజ్ఞుడు అద్భుతం కనిపెడితే విలన్లు ఏం చేస్తారు?" అన్నాడతడు.
అప్పుడు గుర్తుకొచ్చింది రాజుకి. "కిడ్నాప్ " అన్నాడు తడుముకోకుండా.
"ప్రొఫెసర్ అజేయ్ ఇప్పటికే అద్భుతాలెన్నో సాధించాడు. ఇంతవరకూ కిడ్నాప్ కాకపోవడమే అదృష్టం. ఇటీవలే ఆయన సరికొత్త పరిశోధన ఒకటి ఫలించింది. అది ప్రపంచాన్నే తలక్రిందులు చేయగలదు. ఇప్పుడాయన వేదికమీద దాని ప్రస్తావన తెస్తే కిడ్నాప్ తప్పదు. మేమందరం ముందుగానే ఆయన్ను హెచ్చరించాం. అయినా ఆయనది భయపడే తత్వం కాదు. అందుకే ఇందాకకట్నుంచీ నాకు చేతులు కదలడంలేదు"
రాజుకీ విషయం చాలా కుతూహలంగా వుంది.
వేదికమీద కొందరు విదేశీ శాస్త్రజ్ఞులు ఇటీవల తాము సాధించిన పరిశోధనా ఫలితాలను క్లుప్తంగా వివరిస్తున్నారు. అవి ఆసక్తికరంగా వున్నాయి. సభికులు నిశ్శబ్దంగా వింటున్నారు.
అప్పుడొక చైనీయుడు- పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యాన్ని ముడిపదార్ధంగా తీసుకుని ఏమేం చేయవచ్చునో వివరిస్తూండగా ఉన్నట్లుండి ప్రొఫెసర్ అజేయ్ లేచాడు.
"విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్" అన్నాడు.
"ప్లీజ్" అన్నాడు చైనీయుడు.