Read more!
 Previous Page Next Page 
సుహాసిని పేజి 3


    అతడు సరిగ్గా పది అంకెల్తెనా లెక్క పెట్టాడోలేదో నుదుటి మీద అపురూపమైన చల్లటి స్పర్శ....

    అప్రయత్నంగా గౌతమ్ కళ్ళు తెరిస్తే....

    సీత....!

    "తల నొప్పిగా ఉందా బాబూ!" అంది సీత నవ్వుతూ.

    "అలా నేను నవ్వగలిగితే...." అనుకున్నాడు గౌతమ్ బాధగా.

    సీత అతడి కణతలు నొక్కుతూంటే గౌతమ్ చటుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు.

    సీత అతడి చేయి వదిలించుకోలేదు.

    "నీ మనసులో ఏదయినా వుంటే చెప్పండి బాబూ!" అందామె.

    గౌతమ్ చెప్పాలనుకున్నాడు. పెదవులు సహకరించలేదు. అతడామె చేతినే నిమురుతూ గుటకలు మింగుతున్నాడు. ఆమె చేతిని నిమురుతున్న అనుభూతికి అతడి శరీరం పులకిస్తోంది.

    అతడేమైనా చేబుతాడేమోనని కాసేపెదురుచూసి విసిగిపోయి చేయి విడిపించుకుని అక్కణ్ణించి వెళ్ళిపోయింది సీత.


                                                          *    *    *    *


    అయిదో రోజు కూడా సీత వచ్చింది.

    "రేపట్నించి మళ్ళీ రంగమ్మే పన్లో కొస్తుంది బాబూ!" అందామె.

    గౌతమ్ కంగారు పడ్డాడు.

    ఇన్నాళ్ళకో ఆడపిల్ల తన్నాకర్షించింది.

    విశ్వామిత్రుడు చెప్పిన ప్రకారం స్త్రీ, పురుషులే పరస్పరాకర్షణతో ఈ సృష్టి చక్రాన్ని ముందుకు తిప్పుకున్నారు.

    ఇప్పుడు ఆమె స్త్రీ, తను పురుషుడు.

    "సీతా! నువ్వు నాకెంతో నచ్చావు" అన్నాడు గౌతమ్.

    "మీరూ నాకు నచ్చారు బాబూ" అంది సీత.

    సీత చాలా మంచిది. అతడు తినేసేలా చూసినా ఏమీ అనదు. చేయి పట్టుకున్నా నవ్వుతుంది. ఏ మాటన్నా ఆమెక్కోపం రాదు.

    మరి గౌతమ్ ఆమె కెందుకు భయపడాలి?

    మళ్ళీ సీత తనింటికి రాదన్న భయమేమో గౌతమ్ లో ధైర్యాన్ని పెంచింది. అప్పుడప్పుడు భయమే ధైర్యానిక్కారణమవుతుందనడానికి ఉదాహరణగా గౌతమ్ సీతను కౌగలించుకుని పెదాలపై సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు.

    అప్పుడు కూడా సీత నవ్వింది.

    ఆ నవ్వులో ప్రేమ, అభిమానం, చిలిపితనం....ఇలా ఎన్నున్నాయో చెప్పడం కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నవ్వులో ఆడది ఉంది!

    దేనికీ ఆమె అభ్యంతరపెట్టదని గౌతమ్ కి అర్ధమైపోయింది. అతడామెతో నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్లు, "నీకేం కావాలో అడుగు" అన్నాడు.

    సీత "మీరే కావాలి" అంటుందనుకున్నాడతడు.

    "నాకో బుల్లి రేడియో కొనిపెట్టండి. సినిమా పాటలు వింటాను" అందామె వెంటనే.

    గౌతమ్ తెల్లబోయి "ఛీ! ఇది చాలా చిన్న కోరిక. ఇంకా పెద్దకోరిక కోరు" అన్నాడు.

    సీత ముఖంలో నవ్వు మాయమయింది. ఆమె ఆశ్చర్యంగా, ఆ పాండురంగం ఇదే చాలా పెద్ద కోరికని పది రూపాయలు చేతిలో పెట్టాడు. బుల్లి రేడియో వంద రూపాయలు పైన చేస్తుందిట. మీరసలు ఎంతిద్దామనుకుంటున్నారు నాకు?" అంది.

    అప్రయత్నంగా ఆమె కౌగిలి విడిచిపెట్టాడు గౌతమ్. అతడి శరీరంలో ఆమె పట్ల జుగుప్స ప్రారంభమయింది.

    "ఏమయింది బాబూ?" అంది సీత.

    "నువ్వు మంచిదానివనుకున్నాను. నీ శరీరం మైలపడింది."

    అతడి భావం ఆమె కర్దమయింది.

    "నేను చెప్పేదాకా ఆ సంగతి మీకు తెలియలేదుగా! ఇప్పుడూ నేను మంచిదాన్నే అనుకోండి. మీరనుకుంటే బాగానే కనబడతానుగా."

    తనకు తెలియకుండానే సీత ఓ గొప్ప వేదాంత విషయం చెప్పింది. పాండురంగానికీ ఆమెకూ సంబంధముందని తెలియడం వల్లనే అతడికామె పట్ల జుగుప్సా భావం ఏర్పడింది. అంటే మనిషి పవిత్రత మనసుకే తప్ప శరీరానికి సంబంధించింది కాదు.

    గౌతమ్ విభ్రాంతుడై, "జీవితంలో నువ్వేం నష్టపోయావో ఇప్పుడు నీ కర్ధంకాదు" అన్నాడు.

    "బుల్లి రేడియో వద్దులెండి మీరూ పది రూపాయలే యివ్వండి" అంది సీత నవ్వుతూ.

    అదే నవ్వు. అతడు చేయి పట్టుకున్నప్పుడూ, కౌగలించుకున్నప్పుడూ, ముద్దు పెట్టుకున్నప్పుడూ కూడా అదే నవ్వు!

    "సీతా! నేను డబ్బిచ్చి నిన్ను కోరే రకం కాదు. నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను" అన్నాడు గౌతమ్.

    ఈసారి తెల్లబోవడం సీత వంతయింది.

    "ఇంతకాలం నువ్వొక మామూలు పనిమనిషి. నిన్ను నా యిల్లాలిగా చేసుకుని సమాజంలో గౌరవస్థానం కల్పిద్దామనుకున్నాను. కానీ అలాంటి గౌరవం గురించి నువ్వాలోచిస్తున్నట్లే కనబడదు" అని నిట్టూర్చాడతడు.

    "ఇంతవరకూ ఆలోచించలేదు. నాకు తెలిసినంత వరకూ మగాడు ఆడదాని వళ్ళు చూసి పెళ్ళంటాడు. ఆడది పెళ్ళికోసం మగాడికి వళ్ళిస్తుంది. ఇప్పుడిది కొత్తగా ఉంది. ఆలోచించి మళ్ళీ కనిపిస్తాను మీకు" అనేసి వెళ్ళిపోయింది సీత.

    ఆమె ఎంతలా ఆలోచిస్తోందో కానీ నెలరోజులు గడిచినా మళ్ళీ అతడిక్కనిపించలేదు.


                                3


    సీత కనిపించకపోయినా గౌతమ్ సీత కోసం ఎదురు చూడ్డం లేదు. తాత్కాలికంగా స్త్రీ పట్ల ఆకర్షితమైన అతడి మనసు తిరిగి యధాస్థాయికి చేరుకుంది.

    "నీ చుట్టూ ఉన్నవాళ్ళ కోసం ఏదో ఒకటి చేయి. నీకు అవసరమైనంత మాత్రమే దగ్గరుంచుకుని మిగతాది అవసరంలో ఉన్నవాళ్ళకోసం వినియోగించు. రేపు గురించి ఆలోచించకు" అన్నాడు కాషాయాంబరధారి విశ్వామిత్రుడు.

    అలాగే చేయాలనుకున్నాడు గౌతమ్.

    ముందుగా తన వీధిలో వాళ్ళందరి కష్టసుఖాలూ విచారించాడతడు.

    పక్కింట్లోనే ఉన్న శ్యామల్రావుకి పదివేల రూపాయల అప్పుంది. ఆ అప్పు తీర్చే మార్గం తెలియక దినదినగండంగా రోజులు గడుపుతున్నాడతడు.

    ఆ పక్కింట్లో ఉన్న వెంకట్రామయ్యకి పెళ్ళీడు కూతురు. కట్నం పాతికవేలిస్తే తప్ప మంచి సంబంధం దొరికేలా లేదు.

    ఆ పక్కింట్లో కిరణ్ ఉంటున్నాడు. పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూల్లో వేయాలంటే అయిదు వేలు డొనేషన్ కట్టాలి.

    ఇంకా ఆ వీధిలో రోగిష్టివాళ్ళు, నిరుద్యోగులు, వ్యాపారాభిలాషులు ఎందరో ఉన్నారు. అందరి సమస్యలకూ మూలకారణం డబ్బు.

    అంతమందికీ సాయపడగలంత డబ్బు గౌతమ్ దగ్గర లేదు. ఒక్కరోజు ఒక్క మనిషికి అవసరమైనంత సాయం చేస్తే మర్నాటి నుంచి గౌతమ్ కి కూడా డబ్బు సమస్య వస్తుంది.

    పది రోజుల్లోనే గౌతమ్ కి తెలిసిపోయింది తానెంత అసమర్ధుడో!

    అప్పుడతడొకరోజు రాత్రంతా మంచంమీద పడుకుని ఆలోచించాడు.

    నెలకు పదహారు వందలు వస్తున్నాయతనికి. కానీ తన వీధిలో కొందరికి అంతకంటే చాలా ఎక్కువ వస్తోంది. అయినా తనకంటే ఎక్కువ సమస్యలు వాళ్ళకున్నాయి.

    అందుక్కారణం పెళ్ళి!

    వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. తను చేసుకోలేదు.

    "జీవితాన్ని ఒక ప్రణయ యాత్రగా కొనసాగించు" అన్నాడు విశ్వామిత్రుడు.

    ప్రణయం జీవితంలోని సుఖసారాన్ని పీల్చివేస్తుంది. తను విశ్వామిత్రుడు చెప్పిన ప్రణయ యాత్రకు సుముఖుడు కాలేడు.

    గౌతమ్ కి ఏం చేయాలో స్పురించలేదు. రాత్రి నిద్రంతా పాడయింది.


                        *    *    *    *


    టైపు మిషన్లు టకటక మంటున్నాయి.

    ఫైలు కాగితాలు గరగరమంటున్నాయి.

    అది ప్రయివేటు కంపెనీ కావడంవల్ల, గవర్నమెంటాఫీసు కాకపోవడం వల్ల అంతా ఎవరి పనులు వాళ్ళు శ్రద్ధగా చేసుకుపోతున్నారు.

    అంతమందిలో గౌతమ్ ఒక్కడే అన్యమనస్కంగా ఉన్నాడు. అతడి వద్దకు సంతకానికి వచ్చిన వెంకట్రత్నం అది గమనించి, "బాబూ. నువ్వు పది రోజుల్నించిలాగే కనబడుతున్నావు. కారణం తెలుసుకోవచ్చా?" అన్నాడు.

    అప్పుడు గౌతమ్ ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.

    వెంకట్రత్నం అతడికంటే వయసులో పదిహేనేళ్ళు పెద్ద. ప్రవర్తనలో పాతికేళ్ళు పెద్ద. జీతంలో రెండొందలు తక్కువ. హోదాలో ఓ మెట్టు తక్కువ. భవిష్యత్తులో గౌతమ్ కింకా అయిదారు ప్రమోషన్లకి అవకాశముంది. వెంకట్రత్నానికి ఒకటికి మించి రాదు. ఆ కంపెనీలో అందరికంటే అన్నింటా మెరుగయిన వెంకట్రత్నం చదువులో స్కూలు ఫైనల్ మాత్రమే పాసయ్యాడు.

 Previous Page Next Page