Next Page 
ఒప్పందం పేజి 1

                                 

        
                                                                 

   

                                                  ఒప్పందం
                                                                                 అత్తలూరి విజయలక్ష్మీ
    
    "రమ్యా! నీకు ఫోన్" రూమ్ మేట్ సౌజన్య గుమ్మంలోంచి లోపలికి తొంగి చూసి అరిచి ఎటో వెళ్ళిపోయింది. రమ్య ఒక్క ఉదుటున లేచి ఆఫీస్ రూమ్ లోకి పరుగెత్తింది. ఫోన్ కాల్ మాట్లాడేసి, వచ్చిన రమ్య మనసంతా ఉల్లాసంగా మారిపోయింది.
    ఎంత మంచివార్త చెప్పాడు సురేష్! తన కల నెరవేరబోతోంది. కలా! అవును కలే!
    ఆడదానికి తనదైన ఒ ఇంట్లో స్వతంత్ర్యంగా జీవించడం అనేది ఓ కలే. ఆ కల నెరవేరబోతోంది.
    రమ్య కూనిరాగం తీస్తూ రూమంతా కలియతిరిగింది.
    రెండు మంచాలు , రెండు టేబుల్స్, రెండు కుర్చీలు, ఓ కూజా , రెండు ప్లాస్టిక్ మగ్ లు, ఓ ప్లాస్క్ ఈమధ్యే కొంది. ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఏడాది గడిపింది. రూమ్మేట్ సౌజన్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తోంది. తను ఇన్ఫర్మేషన్ డిపార్ట్ మెంట్ లో పి.ఆర్.ఓ. సౌజన్య మంచి స్నేహశీలి, ఏడాదిగా తామిద్దరి మధ్యా ఎంతో సాన్నిహిత్యం పెరిగింది. రోజూ రాత్రిళ్ళు ఒకళ్ళ మనసులోని భావాలు మరొకరితో పంచుకుంటూ ఆత్మీయంగా కలిసిపోయిన తీయటి స్నేహం.
    బహుశా ఇంత ఇరవై నాలుగు గంటల్లో తను వెళ్ళిపోతుంది. కేవలం ఒక్క సూట్ కేస్, ఓ ఎయిర్ బ్యాగ్ తీసుకుని తనిక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
    పాపం! సౌజన్య మరో రూమ్ మేట్ దొరికే దాకా ఒక్కతే ఉండిపోతుంది.
    తనని అర్ధం చేసుకుని ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయే ఓ సహచరుడి కోసం అన్వేషిస్తూ ఎదురు చూస్తూ ఇలా ఎంతకాలం ఈ హాస్టల్లో ఉండి పోతుందో!
    రమ్య మనసు ఆలోచనా సాగరంలో అలల మధ్య ఊగుతున్నట్టుగా ఉంది. ఇన్నాళ్ళ నుంచీ సౌజన్య దగ్గర దాచిన ఒకే ఒక్క రహస్యం ఇవాళ రాత్రి కి చెప్పేయాలి. ఏమంటుందో తన నిర్ణయం విని.
    అసలే తన భావాలన్నీ అతిగా, విచిత్రంగా అన్పిస్తాయి ఆమెకి.
    సురేష్ ని జీవిత భాగస్వామి గా....కాదు కాదు సహచరుడిగా కాదు కాదు.... జీవన నేస్తంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిస్తే ఏమంటుంది?
    ముందు అడిరిపడుతుంది. తరువాత ఆశ్చర్యపోతుంది. తరువాత తరువాత.... రమ్య పెదాల పైన ఓ చిరునవ్వు మెరిసింది. 
    లేచి గబగబా దండెం మీద , మంచం మీద చిందరవందరగా పడి ఉన్న బట్టలన్నీ మడత పెట్టి సూట్ కేస్ లో సర్దింది. మిగతావి బ్యాగ్ లో సర్దింది.
    అరగంటలో తయారై మెస్ కి వెళ్ళింది.
    సాంబారు, బీన్స్ కూరు, అన్నం....
    ఈ రొటీన్ తిండికి ఇంక ఇరవై నాలుగు గంటల్లో గుడ్ బై చెప్పబోతోంది..
    "హాయ్ రమ్యా! ఏమిటివాళ లేట్ అయింది. ఆఫీస్ కి వెళ్ళడం లేదా?' కంచంలో సాంబారు వేసుకుంటూ అడిగింది మనీష.    
    "వెళ్తున్నాను. నువ్వు పోవా?"
    "ఊహు....' అని కొంచెం రహస్యంగా "నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. పిక్చర్ కి వెళ్తున్నాను...." అంది.
    "గుడ్ లక్ 'అంది.
    కొంచెం అన్నం తినేసిచేయి కడుక్కుని బైటికి వచ్చేసింది.
    బ్యాంక్ కి వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఆఫీస్ కెళ్ళింది. ఆరోజు పనేమీ చేయాలనిపించలేదు.
    మనసంతా ఎంతో హాయిగా ఉంది. గంటలు నిమిషాలు లెక్కపెట్టుకుంటూ గడిపింది. సరిగ్గా ఐదయింది. ఒక్క ఉదుటున పర్స్ తీసుకుని బైటి కొచ్చేసింది. అటో తీసుకుని పిక్ అండ్ మూన్ కెళ్ళింది. సురేష్ చిరునవ్వుతో ఎదురొచ్చాడు. 
    "హాయ్ !" పలకరించింది.
    "ముందు ప్లాట్ చూసి వద్దమ్మా? ఐస్ క్రీం తిందామా?" అడిగాడు సురేష్.
    "ఐస్ క్రీం " 
    ఇద్దరూ లోపలికి నడిచారు.
    రెయిన్ బో ఐస్ క్రీం ఆర్డర్ చేశాడు.
    "ప్లాట్ ఎంత బాగుందో తెలుసా?"
    "ప్రైవసీ ఉందా?"
    "బోల్డంత . మనిద్దరం రేపు రాత్రి నుంచే "డోంట్ డిస్టర్బ్" బోర్డు పెట్టుకుంటే వారం దాకా ఎవరూ అడగరు."
    నవ్వింది. "వారం దాటాక పోలీస్ హెల్ప్ తో తలుపులు విరగ్గోడతారేమో!"
    'అపశకున పక్షి"
    ఐస్ క్రీం వచ్చింది.
    "మన అనుబంధాని కున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీ వార్డెన్ తిడుతుందని తొమ్మిదింటి కే పరిగెత్తకెళ్లక్కర్ల్రేదు."
    "అప్పుడేనా! కొన్ని కొన్ని సమస్యలు ఇప్పట్నించే ప్రారంభం అవుతాయి. నా మీద నీకున్న ప్రేమని పరీక్షించే సమస్యలు" ఐస్ క్రీం సుతారంగా చప్పరిస్తూ అంది.
    'అలా అనకు భయమేస్తుంది" తన చేతిలో స్పూన్ ఆమె చేతికి అందించాడు.
    "ఇంత తీయగా ఉందెం?"
    "అందులో నా ప్రేమానురాగాలు కలిపాను."
    "ఊ" నవ్వింది.
    అరగంట లో ఇద్దరూ కలిసి గగన్ మహల్ నర్సింగ్ హోం కి దగ్గరగా ఉన్న అపార్ట్ మెంట్స్ కి వెళ్ళారు.
    ఫస్ట్ క్లాస్ లో ఉన్న సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ చూడగానే రమ్య మనసుని దోచుకుంది. బొమ్మరిల్లు లా వుంది ఈ ప్లాట్.... బెడ్ రూమ్ కి అటాచ్ అయి ఉన్న సిట్ అవుట్.
    "బాగుంది కానీ ఇక్కడ్నించి చూస్తె ఈ రోడ్లు, వాహనాలు , మనుషులు కాకుండా పచ్చని చెట్లు, నీలాకాశం కన్పిస్తే ఎంత బాగుంటుందో!" కొంచెం నిరాశ వ్యక్తం చేసింది.
    "తల్లీ! సిటీకి మధ్యలో చెట్లు, పుట్టలు, ఎక్కడ్నించి వస్తాయి? అదిగో ఆకాశం అడిచూడు" అన్నాడు పైకి చూస్తూ.
    రమ్య నవ్వి అతని చెంప మీద సున్నితంగా కొట్టింది. 
    "అడ్వాన్స్ ఇచ్చేద్దామా?" అడిగింది పర్స్ జిప్ తీస్తూ.
    "ఇచ్చేశాను. అందుకే కీ నా దగ్గరుంది."
    "ఇచ్చేశావా?" నాకు నచ్చకపోతే"
    "నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఏడాదిన్నర మన స్నేహంలో నీ అభిరుచి నాకు తెలీదా?"
    బెడ్ రూమ్ కి నడిచిన సురేష్ ఆమెని అనుసరించి హటాత్తుగా ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు.
    "రమ్యా! ఇహ నుంచీ మనం కలుసుకోడానికి పార్క్ లు, ఐస్ క్రీం పార్లర్లూ ట్యాంక్ బండ్ ఏవీ అక్కర్లేదు. మనింట్లో మనం కలుసుకోవచ్చు కదూ!"
    "ఇది మనిల్లు" గర్వంగా అంది అతణ్ణి పెనవేసుకుంటూ.
    "అవును మనిల్లు. రేపట్నించీ ఈ చిన్న సామ్రాజ్యానికి మనమే చక్రవర్తులం." సురేష్ ఆమెని ఇంకా దగ్గరగా తీసుకున్నాడు.
    "సంతోషించాం. ఇంక ఈ జోరు తగ్గించండి." అతణ్ణి విడిపించుకుని చిలిపిగా నవ్వింది.
    "అబ్బా! ఇంకా ఏమిటి రమ్యా ఈ రిస్త్రిక్షన్స్ " గారంగా అన్నాడు.
    "పవళించగా పూలపానుపు లేదు, తల ఊనగ పట్టు తలగడయే లేదు. జలకాలాడగా పన్నీరు లేదు" సన్నగా రాగం తీసింది.
    "నీ కౌగలిలో నాకు అన్నీ" మళ్ళీ దగ్గరకు లాక్కున్నాడు.
    "ఏయ్! డోంట్ బీ సిల్లీ" అతడి చెంప మీద ముద్దు పెట్టుకుని విదిపించుకుంది.
    "పద వెళ్దాం."
    ఉసూరుమంటూ ఆమెని అనుసరించి బైటికి నడిచాడు.
    ఎనిమిదింటికి రమ్యని హాస్టల్ దగ్గర దింపేసి "గుడ్ నైట్' చెప్పి వెళ్ళిపోయాడు సురేష్.
    కూనిరాగాలు తీస్తూ హుషారుగా ఉన్న రమ్యని సర్ది ఉన్న సూట్ కేస్ బ్యాగులను చూస్తూ అడిగింది సౌజన్య ఆ రాత్రి.
    "ఊరేళుతున్నావా రమ్యా!"
    డిమ్ గా వెలుగుతున్న బెడ్ లైట్ చూస్తూ "ఊహూ...రూమ్ ఖాళీ చేస్తున్నాను." అంది.
    "వ్వాట్!" ఆశ్చర్యంగా చూసింది సౌజన్య.
    "అదేంటి అంత సడన్ గా?"
    రమ్య పక్కకి ఒత్తిగిల్లి చిరునవ్వుతో సౌజన్య ని చూస్తూ "నీకిది సడన్ న్యూస్. షాకింగ్ న్యూస్. కానీ నేనీ నిర్ణయానికి వచ్చి నాలుగు నెలలైంది" అంది.
    "మరి నాకు చెప్పలేదేం? అసలెందుకు తీసుకున్నావీ నిర్ణయం?" అనుమానంగా చూసింది సౌజన్య.
    రమ్య తన మంచం మీంచి లేచి సౌజన్య మంచం మీదకి చేరి "జరుగు" అంది.
    సౌజన్య పక్కకి ఒత్తిగిల్లి రమ్యకి చోటిచ్చింది.
    రమ్య ఆమె పక్కన పడుకుని "రేపట్నించీ నీ ఈ ప్లేస్ లో సురేష్ ఉంటాడు" అంది.
    "సురేషా! ఎలా?" విస్తుబోయింది సౌజన్య.
    "పెళ్ళి చేసుకున్నావా?" సీరియస్ గా అడిగింది.
    "పెళ్ళా!" నవ్వింది రమ్య. "సౌజన్యా! పెళ్ళి తాళి, భాజాలు నాకు వీటన్నింటి మీదా నమ్మకం లేదు. నేను సురేష్ తో బతకాలని నిశ్చయించుకున్నాను."
    "పెళ్ళి కాకుండానా?"
    "ఏం? ఏమవుతుంది?"
    "మతి పోయిందా? మనం ఉన్నది ఇండియాలో. ఇక్కడ పెళ్ళి కాకుండా కలిసి బతికే వాళ్ళని ఏమంటారో తెలుసా?"
    "ఎవరేమన్నా అనుకున్నా నాకనవసరం. ఇది నా జీవితం . నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా మలుచుకునే హక్కు నాకుంది. సౌజన్యా! నాకెందుకో పెళ్ళి అనే తంతు ఇష్టం లేదు. పెళ్ళి పేరుతొ ఓ మగవాడు నా మెళ్ళో ఒ తాడు బిగించి నామీద పెత్తనం చేయటం నేను సహించలేను. నేను పూర్తీ స్వతంత్రురాల్ని అలా ఉండడమే నాకిష్టం. అంతేకాదు ఇంకో విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో!"
    "ఏమిటది?"
    "సురేష్ కి అల్ రెడీ పెళ్ళైంది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు." ఈసారి సౌజన్యకి నిజంగానే షాక్ తగిలినట్ల అయింది.

Next Page