Read more!
Next Page 
తెల్ల గులాబి  పేజి 1

                           తెల్ల గులాబి 

                                          అత్తలూరి విజయలక్ష్మి

 

    "అదీ! అదీ!లోపల్నించి శీరిష పిలుపు వినిపించింది.
    ఆదిత్యకి పలకాలనిపించలేదు. తను కూర్చున్న బాల్కనీ లోంచి కదలాలనీ అనిపించలేదు. అమ్మ పిలుస్తూనే ఉంటుంది. కాస్సేపన్నా రిలాక్స్ అవనివ్వదు. కాలేజ్ నుంచి వచ్చి గంట సేపు కూడా ఆదుకోలేదు. ఆదిత్యకి చాలా కోపంగా ఉంది. శిరీష మీద. తనకి పదహారేళ్ళు దాటుతున్నాయి. అయినా చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తుందేమిటో ఈ అమ్మ అనుకున్నాడు.
    ఆదిత్యకి శిరీష ఎందుకు పిలుస్తుందో తెలుసు. చదువుకో చదువుకో అని చంపుకు తినడానికి. చదువు...చదువు.... ఆ మాట వింటేనే చిరాగ్గా అనిపిస్తుంది. అడుకోనివ్వదు ఫ్రెండ్స్ తోమట్లాడనివ్వదు ఎప్పుడూ నాలుగ్గోడల మధ్యే కూర్చుని క్లాసు పుస్తకాలతో ఫ్రెండ్ షిప్ చేయాలన్తుంది ఎంత బోర్!
    ఆదిత్య చూపి కింద వాకిట్లో ఆడుతున్న కుర్రాళ్ళ మీద కేంద్రీకృత మై ఉంది. వాళ్ళంతా ఎంచక్కా ప్రతిరోజూ ఆడుకుంటారు. క్రికెట్, షటిల్ ఎన్ని ఆటలున్నాయి! ఎంతసేపూ వెధవ చదువేనా? పిల్లలన్నాక అడుకోవద్డా? వాళ్ళంతా గంటా, గంటన్నర సేపు ఆదుకుని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి కాస్సేపు చదువుకుంటారు . టి,వి,చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. వాళ్ళంతా అదే అపార్ట్ మెంట్ లో ఉండే పిల్లలు. ఆడపిల్లలంతే, మగపిల్లలంతే.... వాళ్ళందరి ఇళ్ళలో చాలామంది ఉంటారు. నలుగురుంటారు ఇద్దరు పిల్లలు, అమ్మా, నాన్న కొంతామంది ఇళ్ళలో వాళ్ళ నానమ్మలు, తాతయ్య లుకూడా ఉంటారు. ఎప్పుడూ వాళ్ళింటికి ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళమ్మ లు ఉద్యోగాలు చేయరు ఇంట్లోనే ఉంటారు.
    కానీ, ఈ ఇంట్లో అమ్మా,తనూ.... ఎప్పుడూ ఎవరూ ఈ ఇంటికి రారు. రెండు రోజులకోసారి వివేక్ అంకుల్ తప్ప ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దంగా , ఏంటోగా ఉంటుంది. ఆ నిశ్శబ్దం అంటే ఆదిత్యకి భయం... ఇల్లంతా సందడిగా ఉండాలని ఆదిత్య కోరిక . చుట్టుపక్కల ప్లాట్స్ లో లాగా ఈ ఇల్లు ఎందుకుండదో అనిపిస్తుంటుంది.
    ఆదిత్య కెందుకో భయం వేసింది. ఇలా ఒంటరిగా కామ్ గా ఉంటె భయం కదా! సాధారణంగా కామ్ గా ఉన్న ఇంట్లో దెయ్యాలుంటాయని విన్నాడు తను. కధల్లోకూడా అలాగే రాస్తారు. దయ్యాలున్న ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుందని, కొంపదీసి..... వణికిపోయాడు...
    "అదీ, పిలుస్తుంటే వినిపించడం లేదా? ఏం చేస్తున్నావిక్కడ" శిరీష కొంచెం కోపంగా అరుస్తూ వచ్చింది బాల్కనీ కి.... ఆదిత్య బెదిరిపోయి లేచి నిలబడ్డాడు.
    "ఏం లేదు మమ్మీ.... బోర్ గా ఉంటేనూ" నసిగాడు.
    "బోర్ ఏంటిరా చదువుకోక పద పరీక్షలు దగ్గర కొస్తున్నాయి. ఫైనల్ ఇంటర్ అవగానే ఐఐటి కూడా రాయాలా? ఇలా టైం వెస్ట్ చేస్తే నీకు ర్యాంక్ ఎలా వస్తుంది? పద, పద చదువుకో."
    ఆదిత్య మౌనంగా లోపలికి నడిచాడు.
    తన గదిలోకి వెళ్ళిపోయి పుస్తకం తీశాడే గానీ చదవాలని పించదం లేదు. ఏడుపొస్తోంది. ఏంటి ఈ ఇల్లు....అమ్మకి ఎందుకింత కామ్ గా ఉండడం ఇష్టం.... అసలు నాన్న ఏమయాడు? ఎప్పుడు అడిగినా చెప్పదు అమ్మ...
    ఒకటి రెండుసార్లు అడిగాడు కూడా "అమ్మా నాన్న ఎక్కడ? మనింటికి ఎందుకు రారు?" అని. ఖయ్యిమని లేచింది. "నీకెందుకురా అయన సంగతి....నీకేం తక్కువైంది ఇక్కడ వెళ్ళు చదువుకో వెధవ ఆలోచనలు మానేయి..."
    బైట పిల్లలతో అడుకోనివ్వదు. ఎవరింటికీ వెళ్ళనివ్వదు. వేరే ప్లాట్స్ వాళ్ళతో కలవనివ్వదు.... ఎందుకో! ఆదిత్య కళ్ళు పుస్తకం మీద ఉన్నాయి....కానీ ఆలోచనలు మాత్రం ఎటో ఉన్నాయి.
    రెండు రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది. ఇప్పటి నుంచే అందరూ బాంబులు కాలుస్తున్నారు. ప్లాట్స్ వాళ్ళంతా చాలా సరదాగా ఉన్నారు....అందరిళ్ళలో ఎవరో చుట్టాలు వస్తున్నారు.
    ఈ ఇంటికి చుట్టాలు రారు... అమ్మమ్మ, నానమ్మ తాతయ్య, ఎవరూ రారు. ఎందుచేత? తన స్కూల్లో ఫ్రెండ్స్ అంతా సమ్మర్ హాలీడేస్ రాగానే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరో, మావయ్య ల ఊరో వెళ్తుంటారు... కానీ, తనకి తెలిసి ఏ ఊరు వెళ్ళలేదింత వారకూ . తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం , ఇలా కొన్ని పుణ్య క్షేత్రాలకు తప్ప అమ్మ ఎక్కడికీ తీసి కెళ్లలేదు.
    హల్లో శిరీష ఏదో చదువుకుంటోంది.
    టి.వి.అన్ లోఉంది . కానీ, ఆడియో రావడం లేదు. శీరిష పూర్తిగా వాల్యూమ్ తగ్గించి  ఏదో చదువుకుంటోంది. ఎప్పుడూ అంతే టి.వి అన్ లో ఉంటుంది కానీ సౌండ్ ఉండదు. అది మరీ చిరాకు ఆదిత్యకి. టి.వి అన్నా మోగుతుంటే ఇంట్లో కాస్త సందడిగా అనిపిస్తుంది. ఛీ.....ఎవరన్నా ఇలా ఉంటారా?
    ఏమిటి జీవితం? ఆదిత్య కి అర్ధం కాలేదు ఎందుకిలా అందరి కన్నా విభిన్నంగా ఉంటున్నాం మేము అనే ఆలోచన , ఇతరులతో పోల్చుకుని బాధపడే తత్త్వం ఈ మధ్యే అతనిలో కలుగుతోంది. చాలాసార్లు శిరీష ను అడగడానికి ప్రయత్నించి భంగ పడడం అతనికి తెలుసు. ఆమెని గుచ్చి గుచ్చి అడిగి తన మనసులో కలిగే అనేక సందేహాలకు సమాధానం పొందే సాహసం ఆదిత్య చేయలేక పోతున్నాడు. దానికి కారణం శిరీష గాంభీర్యం.
    శిరీష వయసు 42, 43 ఉండచ్చు. కాని నిత్యం యోగాసనాలు, వేయడం వలన సన్నగా, నాజుగ్గా ముప్పై ఏళ్ళ యువతి లా ఉంటుంది. గులాబీ రంగులో ఉండే శిరీష కి నల్లటి ఉంగరాల జుట్టు ప్రత్యేక ఆకర్షణ. ఆమె స్టేట్ బ్యాంక్ లో మేనేజరు. అంతేకాదు.... ఆమెకి చాలా యాక్టివిటేస్ ఉన్నాయి....ఎప్పుడూ బిజీగా ఉంటుంది. పుస్తకాలు చదువు కుంటూ, ఏవో రాసుకుంటూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా బిజీగానే ఉంటుంది. బ్యాంకుకి వెళ్ళడం రావడం , ఆదిత్యని కాస్సేపు చదువుకో అని పోరి, అతను చదువు కోడానికి గదిలోకి వెళ్ళగానే తన పని తను చేసుకుని టి.వి అన్ చేసి కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది. శిరీష ట్రెబల్స్ మీద ఎం.ఫిల్ చేస్తోంది.
    గ్రాడ్యుయేషన్ పూర్తీ కాగానే తన క్లాస్ మేట్ లతీఫ్ ని ప్రేమించి, తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్ళిచేసుకుంది.
    లతీఫ్ ముస్లిం శిరీష వాళ్ళు బ్రాహ్మలు గుంటూరు దగ్గర కారం పూడి శిరీష వాళ్ళ ఊరు. ఆ ఊళ్ళో శిరీష తండ్రి కరణీకం చేసేవాడు. ఎన్టీ రామారావు కరణాలను తీసేయడంతో అదే ఊళ్ళో ఉన్న ఆస్తి కాపాడుకుంటూ, గౌరవంగా ఊరి వాళ్ళతో మర్యాద, మన్నన పొందుతూ బతికే వాళ్ళు శిరీష తల్లి, తండ్రి..... శీరిష ఒక్కతే కూతురు.... ఆమె పుట్టినపుడు తల్లి లలితకి బాగా జబ్బు చేయడంతో డాక్టర్లు మరోసారి ఆమె గర్భం దాలిస్తే ప్రాణానికే ముప్పు అనిచెప్పడం తో ఆ ప్రమాదం జరక్కుండా జాగ్రత్త పడ్డారు దంపతులు. శిరీష ని గారభంగా చూసుకున్నారు. శిరీష లో మొండి తనానికి, పెంకి తనానికి అది ఒక కారణం.
    రెండోది ఆ ఊళ్ళో శిరీష పెద్ద అందగత్తె గా పేరు పొందింది. ఆ గర్వం కూడా ఆమెకి ఉండేది. అందుకే ఎవరు చెప్పిన మాట వినేది కాదు. తనకి ఏది తోస్తే అదే చేయడం ఆమె అలవాటు.
    ఒక్క కూతుర్ని బాగా చదివించాలన్న కోరికతో టెన్త్ అవగానే ఆమెని గుంటూరు కాలేజీలో చేర్పించారు సుబ్రహ్మణ్యం. రోజూ బస్సులో వెళ్లి రావడం , పైగా గంట ప్రయాణం. నాన్ స్టాప్ బస్సు దోరికితే నలభై నిమిషాలు.
    శిరీష కొన్నాళ్ళు అలాగే వెళ్ళింది. తరవాత తనకి బండి కొని పెట్టమని మొండి పట్టు పట్టింది. బండి మీద కాలేజీ కి వెళ్ళి వస్తుండేది. అలాగే డిగ్రీ పూర్తీ చేసింది.
    అయితే ఈ లోపలే లతీఫ్ తో శిరీష కి పరిచయం అయింది. ఆతను కూడా గుంటూరు లో ఆమెతో పాటు అదే కాలేజీలో చదువుకున్నాడు....ఇద్దరూ డిగ్రీ అయిపోగానే పెళ్ళి చేసుకోడానికి నిర్ణయించు కున్నారు.
    లతీఫ్ గులాబీ రంగులో , ఆరడుగుల ఎత్తు తో అందంగా ఉండేవాడు. అతను తప్ప తనకి ఇంకెవరూ జోడీ కారని గట్టిగా నమ్మింది శిరీష. అతన్ని పెళ్ళి చేసుకుంటానంటే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని కూడా ఆమెకి తెలుసు. అందుకే పరీక్షలవగానే ఎవరికీ చెప్పకుండా ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి చేసుకుని తల్లి, తండ్ర్రులకి చెప్పడానికి వచ్చిన శిరీష ని ఒక్క కూతురు ప్రాణానికి ప్రాణం అయినా, ఆమె చేసిన పని ముందు ఆ మమకారం పని చేయలేదు. నిర్దయగా ఆమెని ఇంటి నుంచి, ఊరు నుంచి వెళ్ళగొట్టాడు సుబ్రహ్మణ్యం....
    ఇద్దరూ లతీఫ్ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు కూడా శిరీష మతం తీసుకునే కండీషన్ మీద వాళ్ళ పెళ్ళిని అంగీకరిస్తామనడంతో శిరీష మతం తీసుకోడానికి ఎంత మాత్రం అంగీకరించలేదు.... చేసేది లేక ఇద్దరూ హైదరాబాదు వచ్చేసి విడిగా కాపురం పెట్టి బ్యాంకు ఎగ్జామ్, యు.పి.ఎస్.సి. ఎగ్జామ్స్ రాయడం, లతీఫ్ కి రైల్వే లో , శిరీష కి బ్యాంకు లో ఉద్యోగాలు రావడం జరిగింది.
    అయితే ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువ కాలం పట్టలేదు...
    ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో శిరీష లతీఫ్ ని భరించలేక పోయింది .

Next Page