కోమలికి నేనంటే యిష్టమని నాకు తెలుసు. నాకు ఇష్టమయిన వంటకాలు అన్నీ ఆమెకు తెలుసు. వాళ్ళింట్లో అవి చేస్తున్నప్పుడల్లా మా ఇంట్లో ఇస్తూంటుంది నాకివ్వమని. తను కొత్తబట్టలు కట్టుకున్నప్పుడల్లా ఏదో వంకపెట్టుకుని నాకళ్ళ బడుతుంది. నా అభిప్రాయం తెలుసుకుంటే కానీ ఆమెకు తృప్తి వుండదు.
కోమలి నాతో చాలా చనువుగా వుంటుంది. చిన్న తనంనుంచీ మాకు పరిచయమున్నది కాబట్టి ఆ చనువు సహజమే కావచ్చును. కానీ మా వయసు దృష్ట్యా ఆ చనువు అంత సహజం కాదు.
ఆమెకిప్పుడు పదహారేళ్లుంటాయేమో....మనిషి కాస్త ఏపుగా ఉంది ఇరవయి ఏళ్ళ పిల్లలా వుంటుంది. మనిషి చాలా అందంగా వుంటుంది. అందమంటే ఇది అని చెప్పలేను. ఆమె రూపురేఖలు నాకు బాగా వచ్చాయి.
కోమలి నాతో ఏ విధంగా ప్రవర్తించినదీ ఎన్నోసార్లు మననం చేసుకున్నాను. ఆ ప్రవర్తన ఇది అని చెప్పలేను గానీ-ఆమెకు నామీద మనసున్నదనే అనిపిస్తుంది.
ఆమె ముఖంలోకి చూస్తుంటే ఆమె కళ్ళు ఏవో చెబుతున్నాయనిపిస్తుంది. ఆమె నవ్వులో ఏదో ఆహ్వానం ఉన్నదనిపిస్తుంది. ఆమె మాటల్లో నాతో ఏకాంతాన్నభిలషిస్తున్నదనిపిస్తుంది.
కానే నేను ముందడుగువేయడంలేదు. నేను చోరవ తీసుకుంటే ఆమె కాదనదని నాకు అనిపిస్తుంది. అదొక సంతోషం యవ్వనంలో వచ్చిన ఒక అపూర్వానుభవాన్నీ, అవకాశాన్నీ సత్ప్రవర్తనకారణంగా వదిలిపెట్టాను-ఇలా అనుకోవడంలో ఎంత ఆనందం....ఎంతటి ఆత్మతృప్తి!
అదే నేను చొరవతీసుకుంటే....ఆమె కాదంటే...
తప్పుచేశానన్న అనుభూతి జీవితాంతం వెన్నాడుతుంది.
నేను, కోమలి మంచి స్నేహితులంగా ఉంటున్నాం నేను ఆ స్నేహాన్ని దుర్వినియోగం చేసుకోబోతే-ఆమె ఏం చేస్తుంది?
ఈ ప్రశ్నకు సమాధానం దొరకనంతసేపు రకరకాల ఊహల్లో తేలిపోయేవాడిని నేను ఊహాజీవిని.
ఇప్పుడు నేను వాస్తవంలోకి వచ్చాను.
కోమలి కొండల్రావు చెంప పగులకొట్టింది. అదీ చెప్పుతో! ఆ సమయంలో ఆమె మధ్యాహ్న భానుడిలా గుండడం కూడా నేను గమనించాను.
ఈ సంఘటన నన్ను భయ భాంతుడ్ని చేసిందంటే ఆశ్చర్య మేముంది....? కొండల్రావు స్థానం నాకు రావలసినదేమో!
నా భయం స్వార్ధానికి సంబంధించినంతవరకూ క్షణకాలం మాత్రమే వున్నది. కొండల్రావుతో పోలిస్తే నేను సామాన్యుడ్ని కొండల్రావుతో వంటి వాడినే ఆమె చెప్పుదెబ్బ కొట్టింది, ఆమెకు నేనెంత?
ఈ విషయం పక్కకునెడితె...
ఇప్పుడు కొండల్రావు ఏం చేస్తాడు?
ఈ తలపు నన్నింకా వణికించింది.
కొండల్రావు బారినుంచి కోమలిని కాపాడాలి. ఎలా?
నాకూ కొండల్రావంటే భయముంది. శారీరకంగా కూడా నేనతడికంటే బలహీనుడ్ని, అయినా ఎదుటి మనిషిని లొంగదీసుకునేందుకు శారీరకబలం అవసరంలేదు. నేను బుద్దుడు, గాంధీ పుట్టిన దేశంలో పుట్టి పెరిగి ఇంత వాడినైనాను.
సహజంగా నాకు ధైర్యం తక్కువ. కానీ ఆక్షణంలో ధైర్యం చేసి కొండల్రావును నాలుగడుగుల్లో సమీపించాను.
కొండల్రావు కాస్త నెమ్మదిగా నడుస్తున్నాడు. ఊహించని పరాభవం ఎదురయింది. అందుకు తట్టుకునేలా లేడు దెబ్బతిన్నాక అతడు ఓ సారి వెనక్కు తిరిగి చూశాడు. దరిదాపుల్లో నేను తప్ప ఎవరూలేరు. ఈ దృశ్యాన్ని ఎక్కువ మంది చూడలేదని సంతోషిస్తున్నాడో-కోమలిపై పగ ఎలాతీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాడో...
నేనతడ్ని సమీపించి "కొండల్రావుగారూ...!" అన్నాను.
"ఎవరూ?" అన్నాడు.
నా పేరు చెప్పాను.
"ఏమిటి నాతో పని" అన్నాడతను చిరాగ్గా.
"మిమ్మల్నిప్పుడు కొట్టిన అమ్మాయి పేరు కోమలి"
కొండల్రావు కళ్ళు పెద్దవయ్యాయి. అతడు దెబ్బ తినడం నేను చూశాను అతడ్ని కొట్టిన అమ్మాయిపేరు చెప్పాను అంటే ఆ అమ్మాయి నాకు తెలుసనేగదా అర్ధం లేని విషయం తనకెందుకు చెబుతున్నానో అర్ధమయుండదు.
"అయితే?" అన్నాడతను.
"ఆమె దుడుకు మనిషి ఆమెకు మీ గురించి తెలియదు. తెలిస్తే అలా ప్రవర్తించి ఉండదు. దయుంచి ఆమె పైన పగబట్టకండి" అన్నాను.
కొండల్రావు మీసం దువ్వాడు. "తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుకు శిక్ష తప్పదు" అధి కొండల్రావు సిద్దాంతం.
"అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నా మీరుకోరితే నేనామెచేత క్షమార్పణకూడా చెప్పించగలను. ప్లీజ్ ....నా మాట వినండి" అన్నాను.
"ఆమె గురించి నీకెందుకు బాధ?"
"ఆమె నాకు మరదలు. కాబోయే భార్య" నోటికి వచ్చిన అబద్దం చెప్పాను.
కొండల్రావు పకపకా నవ్వి "నువ్వేం మగాడివి?" అన్నాడు.
నేను నెమ్మదిగా "ఆడాళ్ళముందు ప్రతివాడూ మగాడే అవుతాడు నేను అలాంటి మగాడ్ని. మగాళ్ళ ముందు మగాడు అనిపించుకో తగ్గవారు మీలాంటి ఏ కొద్దిమందో ఉంటారు. మీ వంటి వారిముందు నాబోంట్లు తల వంచక తప్పదు...."