Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 4

    కొండల్రావు కొంత సంబరపడ్డాడు. కానీ అతడికి నేనంటే వేళాకోళంగానూ ఉన్నది. "ఇలా మాట్లాడితే ఎవడైనా నీ పెళ్ళాన్ని తెచ్చి అప్పగించమంటాడు" అన్నాడు.
   
    నేను ఆవేశపడలేదు "సంస్కారాన్ని నమ్ముతాను నేను. మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. మా నాన్నగారి స్నేహితుడు పోలీస్ ఇన్ స్పెక్టర్ అయినా ఏ విషయమూ తెగేదాకా లాగడం ఇష్టముండదునాకు. మీతో నేను స్నేహాన్ని కోరుతున్నాను. జరిగింది మరిచిపొండి. కావాలంటే ఆమె మీకు క్షమార్పణ చెప్పుకుంటుంది" అన్నాను.
   
    కొండల్రావు కొంత దిగివచ్చి "నువ్వంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి నేనామెను ఏమీ చెయ్యను. రేపు సాయంత్రం ఆమెను తీసుకుని మయూరా గార్డెన్స్ కురా. ఆమె నాకు క్షమార్పణ చెబితే జరిగింది మరిచిపోతాను" అన్నాడు.
   
    "సరే" అన్నాను నేను.
   
                                        o    o    o    o
   
    కొండల్రావుకు మాట ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడా మాట నిలబెట్టుకోవాలి ఎలాగ?
   
    అందుకు కోమలితో మాట్లాడవలసి ఉంది. కానీ కోమలితో ఈ విషయం ఎలా మాట్లాడాలా అన్నది నా సమస్య. ఆమె ఇందుకు అంగీకరిస్తుందా? నన్నే ఇందుకు దెబ్బలాడదు కదా!
   
    ఆమె కాలేజీ వదిలేసమయానికి గేటు వద్ద కాశాను. ఆమె బయటకు రాగానే ఆమెను సమీపించి "నీతో అర్జంటుగా మాట్లాడాలి" అన్నాను.
   
    ఆమె తన స్నేహితురాండ్రను వదిలి నాతో వచ్చింది.
   
    ఇద్దరం కలసి నడుస్తున్నాం.
   
    నేను నెమ్మదిగా "పొద్దున్న నువ్వు చేసింది చాలాపెద్ద పొరపాటు" అన్నాను.
   
    "ఏమిటది?" అన్నది కోమలి. ఆమెకు అర్ధం కాలేదు.
   
    నేను వివరంగా కొండల్రావుగురించి చెప్పాను. కోమలి ముఖంలో కంగారు కనబడింది. "ఎవడో వెధవనుకుని ఆవేశంలో నాకు తోచింది చేసేశాను. వాడు ప్రమాదకరమైన మనిషని నాకు తెలియదు"
   
    "అందుకే నేనో ఉపాయం ఆలోచించాను" అన్నాను.
   
    "ఏమిటది?"
   
    "రేపు పార్కుకు వచ్చి వాడికి క్షమార్పణ చెప్పుకోవాలి."
   
    కోమలి ముఖం ఎర్రబడింది. "తప్పు చేసింది వాడానేనా?"
   
    "వాడేం తప్పుచేశాడు. ఈలవేశాడు. నడిరోడ్డుమీద ఈలవేసుకునే స్వతంత్రం వాడికి ఉన్నది. అలా ఈలవేసిన వాడ్ని చెప్పుదెబ్బ కొట్టే స్వతంత్రం నీకు లేదు. అందుచేత నువ్వు చేసిందే తప్పు" అన్నాను.
   
    "నా తప్పొప్పులసంగతి నేను చూసుకుంటాను... నువ్వేమీ చెప్పనక్కరలేదు" అన్నది కోమలి ఉక్రోషంగా.
   
    "కోమలీ....ప్లీజ్ ... నా కోసం ఒప్పుకో....అసలు వాడిందుకు ఒప్పుకొనడమే మన అదృష్టం..." అన్నాను.
   
    "ఎందుకొప్పుకోడు? వాడు చేసిన తప్పుకు నేను క్షమార్పణ చెప్పుకుంటానంటే ఏ వెధవైనా అందుకు ఒప్పుకుంటాడు."
   
    "కాదు .... నేను అబద్దం చెప్పడం వల్ల ఒప్పుకున్నాడు..."
   
    "ఏమిటా అబద్దం?" అన్నది కోమలి.
   
    "నువ్వు నాకు మరదలివనీ, కాబోయే భార్యవనీ అబద్దం చెప్పాను" అన్నాను.
   
    నడుస్తున్నదల్లా కోమలి ఆగిపోయింది. ఆమె షాక్ తిన్నట్లున్నది. నా వంక అదోలా చూస్తూ...." ఎందుకలా చెప్పావు?" అన్నది. గొంతు కాస్త తీవ్రంగానే పలికింది.
   
    "ఏం చేయను? నీకూ నాకూ బంధుత్వం కలవని పక్షంలో వాడు వినడు."
   
    "అధి సరే-పోనీ నీ చెల్లెలని చెప్పవచ్చునుగా..." అన్నదామె.
   
    ఇప్పుడు నేను ఆగిపోయాను. చాలా సూటిగా అడిగిందామె. బదులుగా ఏం చెప్పను? ఈ విషయంకొండల్రావుతో మాట్లాడే టప్పుడు నాకు స్ఫురణకు రాకపోలేదు. కానీ గోపీతో మాట్లాడేటప్పుడు ఎన్నోసార్లు కోమలిమీద కోరిక పుట్టింది కలలోకూడా ఎన్నోసార్లు కోమలి కోరిక కలిపి వచ్చారు. అటువంటప్పుడు ఆమె నా చెల్లెలని అబద్దం ఎలా చెప్పను? చెల్లెలు అనే పదానికి నేను విలువనిస్తాను. నాకు చెల్లెలు ఉన్నది.
   
    నేను మాట్లాడకపోవడం గమనించి "మొత్తం మీద మగాడిననిపించుకున్నావు" అన్నది ఆమె.
   
    "అయాం సారీ..." అన్నాను.
   
    "అయాం నాట్ సారీ-థాంక్యూ" అన్నది కోమలి.
   
    నేను ఆశ్చర్యంగా .... "థాంక్స్ దేనికి?" అన్నాను.
   
    "కొండల్రావు దగ్గర్నుంచి నాకు రానున్న ప్రమాదాన్ని తప్పించాలనుకున్నందుకు..." అన్నది ఆమె.
   
    నా మనసుమాత్రం అందుకేనా లేక కాబోయే భార్య అని కొండల్రావుకి చెప్పినందుకా అని ఆలోచిస్తూనే ఉంది.
   
                                                                    *    *    *    *
   
    "జరిగిందానికి నేను చాలా విచారిస్తున్నాను" అన్నది కోమలి.
   
    కొండల్రావు ఆమె వంకనే అదోలా చూస్తున్నాడు.
   
    నేను కొండల్రావు వంక చూస్తున్నాను. ముగ్గురం మూడు చోట్లనుంచి బయల్దేరి ఇక్కడ కలుసుకున్నాం.

 Previous Page Next Page