Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 2

    అదే విధంగా ఆటలు, బాల్యంలో సరైన శిక్షణ లేనిదే ఏ క్రీడాకరుడూ వయసు వచ్చేక ఉత్తమార్హతలు సంపాదించలేడు.
   
    ఇదంతా గోపీ ఎందుకు చెప్పడమంటే ప్రతి విషయానికీ ఉపోద్ఘాతం అవసరమని వాడు అంటాడు. ఈ ఉపోద్ఘాతం దేబికి అంటే...
   
    మనిషి జీవితంలో అత్యంత ప్రముఖపాత్ర వహిస్తున్న శృంగారానికి, ఎవ్వరూ సరయిన ప్రాముఖ్యత నివ్వడంలేదని వాడి ఘోష.
   
    ఒక వయసు వచ్చేసరికి ఆడపిల్లలోనూ, మగపిల్లల లోనూ శృంగార భావాలు మొలకెత్తుతాయి. ఈ సృష్టి కొనసాగడానికి అది ఎంతో అవసరం.
   
    కానీ మనదేశంలో ఎటువంటి వాతావరణం సృష్టించబడినదంటే, యువతీ యువకులు పరస్పరం కలిసి సంభాషించుకోవాలంటే ఎంతో బెరుకు ఒక యువతీ యువకుడుగానీ, ఒక యువకునికి యువతిగానీ శారీరకంగా దగ్గరయ్యే అవకాశం వివాహంలోనే!
   
    క్రికెట్ అంటే తెలిసినంత మాత్రాన టెస్ట్ మ్యాచ్ లో అవకాశం లేదు. ఆ స్థాయికి చేరుకునే ముందు అతడు తన సామర్ధ్యాన్ని ఇతర పోటీల్లో పెంపొందించుకుని నిరూపించుకోవాలి.
   
    శృంగారం యువతీ యువకులకు అత్యంత సహజం అనుకుంటే__వివాహం వారికి క్రీకెట్లో టెస్ట్ మ్యాచ్ వంటిది కానీ ఏ మాత్రమూ పూర్వ శృంగారానుభవంలేని ఇద్దరు యువతీ యువకులు వివాహం పేరిట శృంగారానికి సార్ధకత కల్పించడానికి ఒకచోట చేరుకున్నారు. అందువలన శృంగారానికి అన్యాయం జరుగుచున్నది. మన వైవాహిక వ్యవస్థలో దాంపత్యం జీవితంలో శృంగారానికి ప్రాముఖ్యత నశిస్తుంది. ఎన్నో సంసారాల్లో ఈ కారణంగా కలతలు రేగుతున్నవి అసంతృప్తి నెలకొంటున్నది.
   
    అంతేకాదు-శృంగారానికి విధించబడిన పరిమితులవల్ల యువతీ యువకులు చదువులో రాణించలేకపోతున్నారు. కళాశాలల్లో నేరాలు అధికమవుతున్నవి. దేశంలో మానభంగాల సమాఖ్య పెరుగుతున్నది. ఎందరో అతివలు వివాహానికి ముందే తల్లులై అనాధలను తయారు చేయడమో, ఆత్మహత్య చేసుకోవదమో జరుగుచున్నది.
   
    వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం!
   
    యువతీ యువకులకు తగిన వయసులో లవ్ అఫైర్ ఉండాలి శృంగారానికి సంబంధించిన అవగాహనకు అధి దోహదం చేస్తుంది.
   
    గోపీకి చిన్ననాటి స్నేహితురాలున్నది. ఈ విషయంలో ఆమె అతడికి సహకరిస్తున్నది.
   
    తన అఫైర్ గురించి గోపీకి అందరితో చెప్పుకోవాలని కోరిక ఉన్నది. ఆ కారణంగా అధి వాడు మాకు చెప్పాడేమోనని నా అనుమానం. నా అనుమానాన్ని వాడితో అనలేదు నేను.
   
    రఘు పద్దతి మాత్రం వేరు. అతడు ఏకపత్నీ వ్రతాన్ని, పవిత్రతనూ సమర్షించేవాడు. శృంగారం ఇతర క్రీడల వంటిది కాదనీ__దానికి పూర్వానుభవం అవసరం లేదనీ అతడు వాదించేవాడు.
   
    "నా కారణంగా నీలో తప్పు చేస్తున్నానన్న భావం కలిగింది. ఆ భావాన్ని అధిగమించడం కోసం నువ్వీ సిద్దాంతాన్ని తయారు చేశావు తప్పితే-నీవూ దీన్ని నమ్ముతున్నావని నాకు తోచదు" అన్నాడు రఘు గోపీతో.
   
    మనిషి తప్పు చేస్తాడు. తప్పులో రుచి వున్నది. తను చేస్తున్నది తప్పు అని తెలిసి, అది మానగల శక్తి లేనప్పుడు అతడు కొన్ని సిద్దాంతాలు తయారు చేస్తాడు. అతడిలో బలమయిన వ్యక్తిత్వముంటే ఆ సిద్దాంతాలు బహుళప్రచారం పొంది మతాల పేరిట వర్ధిల్లుతవి లేదా అతడితోనే అంతరించిపోతవి.
   
    గోపీ సిద్దాంతం అంతేనని రఘు అంటాడు.
   
    నా మనసు వీరిరువురి సిద్దాంతాల మధ్యనూ ఊగిసలాడు తున్నది. గోపీ సిద్దాంతంలో ఆకర్షణ ఉన్నది. కానీ అందుకు చొరవ కావాలి. రఘు సిద్దాంతంలో త్యాగం వున్నది. కానీ ఆచరణకు సుఖమైనది.
   
    గోపీ నాతో తరచుగా "నువ్వు కూడా ఏ పక్కింటి అమ్మాయినో పట్టు-అందులో తప్పులేదు. ఇంకా చెప్పాలంటే చిన్నతనం నుంచీ నీకు పరిచయమయిన అమ్మాయి ఉన్నదంటే-అసలామే నీనుంచి పిలుపు కోసం ఎదురు చూస్తూంటుంది ఇలాంటి విషయాలలో ఆడవాళ్ళకున్నంత తెగువ మగవారికుండదు. అనుభవం మీద చెబుతున్నాను" అంటూండేవాడు.
   
    వాడికీ, కోమలికీ నాకూ ఉన్న పరిచయం గురించి చూచాయగా తెల్సు అందుకే వాడలాగనగానే నా దృష్టిలో కోమల మెదిలేది.
   
    "కానీ రఘు చెప్పే దానిలో నాకు సబబు అనబడుతున్నది" అని నేను వాడితో అన్నాను మేమిద్దరము మాత్రమే ఉన్నప్పుడు.
   
    గోపీ నవ్వి- "వాడి సంగతి నీకు తెలియదు. కొందరంతే-అలా గుంభనంగా ఉంటారు. వాడికో అఫైర్ వుంది. అధి చెప్పుకోవడం ఇష్టముండదు" అన్నాడు.
   
    రఘుకూడా నాతో "గోపీ మాటలు నమ్మకు వాడికిదో మానసిక దౌర్భల్యం తీరని కోరికలను అనుభవాలుగా చెప్పుకుంటాడు. వాడికే అఫైరూ లేదని నాకు బాగా తెలుసు" అని ఒక్కసారి చెప్పాడు.
   
    వీళ్ళిద్దరిలో ఎవరిమాట నమ్మాలీ అన్నది నేను పట్టించుకోలేదు. కోమలికీ నాకూ వున్నా స్నేహంతో ప్రణయానికి అవకాశమున్నదా అని నేను ఆలోచిస్తున్నాను. నేను ముందడుగువేస్తే కోమలి అందుకు తగిన ప్రోత్సాహమిస్తున్నదా అని సంకోచిస్తున్నాను.
   
    అబద్దం చెప్పకూడదు. ఆమెపై నాకు అటువంటి శాపాలు అప్పుడప్పుడు కలుగుతూనే ఉన్నాయి. తరచు ఆమె నాకు కలలో కనబడుతూంటుంది కూడా! అయితే కల్లోకూడా నాకు చొరవలేదు.

 Previous Page Next Page