Read more!
 Previous Page Next Page 
ఆడపడుచు పేజి 2

    "నేను ఫలానా అని నిర్మల చెప్పి ఉంటుంది-" అనుకుంది ముక్త. అయితే నిర్మల ముక్తను పలకరించలేదు. ఆమె వంక చూడలేదు. అక్కడ పెత్తనం చెలాయిస్తూ హడావిడి పడి పోతోంది. తనకు లభించిన కొత్తపధవిని నిర్వహించడంలో ఉన్న ఆనందం-ఎరిగున్న వారిని పలకరించడంలో ఆమెకున్నట్లు లేదు.   
    సంధ్య ఆమెను కాస్త లోపలకూ తీసుకెళ్ళి ఓ కుర్చీలో కూర్చోమని చూపించింది.   
    ముక్త కుర్చీలో కూర్చుంది.   
    కొత్త మోడల్ ఫైబర్ గ్లాసు కుర్చీ అది.   
    రంగు రంగుల చీరల్లో ఆడవాళ్ళున్నట్లే-ఆ కుర్చీలు కూడా వివిధ రంగుల్లో ఉన్నాయి.   
    కుర్చీలో కూర్చుంటే మెత్తగా సోఫాలో కూర్చున్నట్లుంది.   
    "చాలా ఉన్నాయి. కొన్నారో - అద్దెకు తెచ్చారో-" అనుకుంది ముక్త.   
    సంధ్య అక్కణ్ణించి వెళ్ళిపోయింది.   
    ముక్తకు పక్కనే కూర్చున్న ఒకామె ఆమెను పలకరించి- "మిమ్మల్నెప్పుడూ చూడలేదు-" అంది.   
    "నేనూ అంతే!" అంది ముక్త.   
    పక్కనున్నావిడ దెబ్బతిని- "నా పేరు సరళ. మావారు రావ్ అండ్ రావ్ కంపెనీలో మానేజింగ్ డైరెక్టర్" అంది.   
    ముక్త ఏదో అనే లోగానే ఆమె తన భర్త గురించి చాలా వివరాలు చెప్పుకుని ముక్త గురించేమీ అడగ లేదని గుర్తించిందో ఏమో-"మీ వారేం చేస్తున్నారు?" అనడిగింది.   
    తటపటాయిస్తూనే చెప్పింది ముక్త.   
    "ఓహో_" అంది సరళ. తర్వాతామె తన కాటు పక్కనున్న మరోస్త్రీతో కబుర్లు ప్రారంభించింది.   
    తన హోదా తెలియగానే సరళకు తనపై ఆసక్తి నశించిందని గ్రహించిన ముక్తకు మనసు చివుక్కుమంది.   
    అప్పుడామె అక్కడున్న వారొక్కరినే పరిశీలిస్తోంది.   
    ప్రతివారి ముఖంలోనూ డబ్బుకళ స్పష్టంగా కనబడుతోంది. కానీ వారందరి లోకీ తనే అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే తను హీరోయిన్లా ఉంది.   
    అక్కడ చాలా మంది స్త్రీలు గుంపులు గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. ముక్తకు తోడెవ్వరూ లేరు.   
    ఎవరైనా కొత్తవారు రాగానే చాలామంది ఆమె చుట్టుచేరుతున్నారు.   
    సరళ తన హోదా గురించి చెప్పేసిందేమో-ఎవరు తన పక్కకు రావడంలేదని ముక్త అనుకుంది.   
    ఆసమయంలో అక్కడకో యువతి ప్రవేశించింది. ఆమెకు సుమారు ముప్పై ఏళ్లుంటాయి.   
    సుమారైన అందగత్తె ఆమె. మనిషి హుందాగా, గంభీరంగా ఉంది.   
    ఆమెలోపలకు రాగానే సంధ్య ఆమెను రిసీవ్ చేసుకుందుకు వెళ్ళింది. "రా పావనీ!" అందామె.   
    ఆమాటలు హాల్లో అందరికీ వినిపించాయి.   
    సంధ్య పావనిని హాల్లో కుర్చీలో కూర్చోపెట్టకుండా లోపల గదిలోకి తీసుకొని వెళ్ళింది.   
    హాల్లో ఒక్కసారి నిశ్శబ్దం.   
    ముక్త ఆశ్చర్య పడింది.   
    ఎవరీ పావని? వస్తూనే ఇక్కడింత నిశ్శబ్దాన్నెలా సృష్టించగలిగింది? సంధ్య ఆమెను ప్రత్యేకంగా లోపలకెందుకు తీసుకెళ్ళింది?   
    పక్కనున్న సరళ మరో ఆమెతో అంటోంది- "పావనిట....పావని! కనీసం పేరు మార్చుకోవాలనైనా తోచలేదు...."  
    "బాగ చెప్పారు. మనమైతే జరిగిందానికేనుయ్యో గుయ్యో చూసుకునే వాళ్ళం...." అంది సరళ పక్కనున్నామె.   
    ముక్త కుతూహలం చంపుకోలేక- "ఎవరండీ ఆపావని?" అని సరళ నడిగింది.  
    ఆ ప్రశ్నకు సరళ ముందుగా చలించలేదు. అయితే తనకోగొప్ప అవకాశం పోనున్నదని వెంటనే ఆమె గ్రహించి ఉండాలి....ముక్తవైపు తిరిగింది.   
    స్నేహభావంతో పలకరించడానికి మనిషి తనచుట్టూ ఎన్నైనా అడ్డుగోడలు నిర్మించుకుంటాడు. కానీ సత్య మనిషిని కించపర్చడానికదే మనిషి ఎన్ని మెట్లయినా దిగిరావడానికి సంకోచించడు.   
    సరళ నోట ముక్త పావని కధ వింది.   
    పావనికో ప్రియుడున్నాడు. పెళ్ళికి ముందే వాళ్ళిద్దరికీ సంబంధమేర్పడింది. ప్రియుడామెను మోసం చేశాడు. పావని అబార్షన్ చేయించుకుంది. అబార్షన్ చేసిన డాక్టరే ఆమె అంటే యిష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. అలా కొన్నేళ్ళు గడిచాయి. ఎక్కడికో పోయిన పాపని ప్రియుడూరికి తిరిగొచ్చాడు. పావనిని బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నాడు. ఫలించలేదు. పావని కథ భర్తకు తెలుసునని తెలిశాక - అతడామెను రేప్ చేశాడు. పావని పోలీసు రిపోర్టిచ్చింది- పావని ప్రియుడికి యావజ్జీవ కారాగారశిక్ష పడింది.   
    జరిగిందానికి పావని సిగ్గుపడలేదు. పైగా ధైర్యంగా తలెత్తుకుని తిరుగుతోంది. పావని భర్తకామెఅంటే ప్రాణం. అతడు బహుశా నపుంసకుడై ఉండాలి.   
    లేకుంటే చెడిన ఆడదాన్నెందుకు పెళ్ళి చేసుకుంటాడు? ఆ తర్వాత ఆమె అత్యాచారానికి గురైతే ఎందుకు మన్నిస్తాడు?   
    "అనాదిగా మగాడి వంచనకు, అత్యాచారానికి గురవుతోంది ఆడది. నా ధైర్యం, నా భర్త, సహనం- ఆ వంచకుల కెదురుదెబ్బ! మహిళామణులకు కొత్త ఊపిరి-" అంటుంది పావని.   
    పావని భర్త హస్తవాసి మంచిది. కాబట్టి సమాజంలో ఆయన్నెవరూ చిన్న చూపు చూడ్డంలేదు. కానీ- సంప్రదాయానికి విలువనిచ్చే సమాజంలో పావని పతిత గానే గుర్తించబడుతోంది. ఎందరో ఆమెను వెలివేశారు.   
    ఎక్కువ పార్టీలకు పావని రాదు. సాటివారు వేసే ప్రశ్నలామె భరించలేదు. ప్రశ్నలు వేయనిచోట  వారి చూపులనుకూడా ఆమె భరించలేదు.   
    "నేనేమీ తప్పు చేయలేదు. ఓ పురుషుణ్ణి నమ్మి ప్రేమించి నా తనువు నర్పించాను. అతడు నన్ను మోసం చేశాడు. తర్వాత నాకు పెళ్లయింది. నిండు మనసుతో నా భర్తను ప్రేమించాను. నన్ను మోసగించినవాడు నాపై అత్యాచారం చేశాడు. అందులో నా తప్పేముంది? నా దురదృష్టం. వాడు మళ్ళీ మరొకరిపై అత్యాచారం చేయకూడదని పోలీసులకప్పగించాను. సమాజం నా ధైర్యాన్నభినందించాలి అంటుందామె.   
    ఆమె ధైర్యం సాటి ఆడవారిలో ఆమెకు సానుభూతి లేకుండా చేసింది.   
    ఎవరి విషయమెలాగున్నా సంధ్య పావనిని ప్రతి పేరంటానికీ, పార్టీకీ పిల్చి తీరుతుంది.   
    పార్టీలో యితరులెవ్వరికీ పావనిరాక గిట్టదని ఆమెకు తెలుసు. అందుకే ఆమెను ప్రత్యేకంగా లోనికి పిలిచి వాయనాలిచ్చి ముందుగా పంపేస్తుంది. ఆమె వెళ్ళి పోయాకనే అసలు ఫంక్షన్ ప్రారంభమవుతుంది.   
    పావనికి సిగ్గులేదు. తన్నుచూసి నవ్వుకుంటారని తెలిసికూడా పిల్చిన ప్రతిచోటకూ వెడుతూంది.   
    పావనికి అహంకారం. నలుగుర్ని పిలిచి పలకరించి స్నేహం పెంచుకోవాలని చూడదు. తనతో స్నేహం కోరేవారు తననే పలకరించాలంటుంది.   
    సంధ్యకు పావనితో స్నేహమెందుకో తెలియదు.   
    పావని భర్త సంధ్యకు ఫామిలీ డాక్టరుకూడా కాదు.   
    సరళ అభిప్రాయంలో సంధ్య అమాయకురాలు. మాయ, మర్మం తెలియని మనిషి. పావనికెక్కడా స్నేహితురాండ్రు లేరు. సంధ్యనామె బుట్టలో వేసుకుని స్నేహితురాలిని చేసుకుంది.   
    పావని గురించింకా రకరకాలుగా చెప్పాలనుకుంది సరళ. కాని యింతలోనే వాయనం తీసుకుని వెళ్ళిపోతోందామె.   
    ఆమె వెళ్ళిపోయేదాకా హాల్లో నిశ్శబ్దం.   
    పావని నిష్క్రమించాకనే అక్కడ కార్యక్రమం ప్రారంభమయింది. కార్యక్రమం నడుస్తూండగా ఎందుకో భానుప్రకాష్ వచ్చాడు.   
    సంధ్య అతడికెదురై- "ఈ సమయంలో వచ్చారేమిటి?" అంది.   
    అతడు నవ్వాడు.   
    అతడి రూపం అతడి హోదాకు తగ్గట్లే వుంది.   
    ఎందరో కన్నెపిల్లలు కలలుగనే సినీ హీరోలా ఉన్నాడతడు.   
    అతడి నవ్వుమాత్రం సినీ హీరోల నవ్వుకంటే మనోహరంగా ఉంది.   
    "ఉండండి. వీరందర్నీ మీకు పరిచయం చేస్తాను-" అంది సంధ్య.   
    ఆమె ఒక్కొక్కరినే పేరు పేరునా భర్తకు పరిచయం చేసింది. వారిలో చాలామంది భానుప్రకాష్ కు తెలుసు. తనకు తెలియని వారివంక అతడు కుతూహలంగా చూస్తున్నాడు.   
    తనను పరిచయంగానే-"నమస్తే!" అన్నాడతడు.   
    "నమస్తే!" అంది ముక్త.   
    క్షణకాలం ఇద్దరి చూపులూ కలిశాయి.   
    అతడి చూపుల్లో అయస్కాంతంవంటి ఆకర్షణ చూసింది ముక్త.   
    భానుప్రకాష్ లోపలకు వెళ్ళిపోయాడు.   
    "పావని అయితే- నమస్తే చెప్పి ఊరుకోదు. షేక్ హ్యాండిస్తుంది..." అంది సరళ.   
    నలుగురైదుగురు నవ్వారు.   
    "మన సంప్రదాయమంతా ఆడదాని పవిత్రతలో ఉంది. అది నిలుపుకోనినాడు మనం మనంకాదు-" అందింకొకామె.   
    ముక్తకూడా ఆ సంభాషణలో ఆసక్తిగా పాల్గొంది.   
    డబ్బున్నవారికి లేనివారు చులకన. అధికారమున్న వారికి లేనివారు చులకన. నీత్య్పరులకు అవినీతి పరులు చులకన...కానీ...   
    లేనివాళ్ళ శ్రమతో ఉన్నవాడి దగ్గర డబ్బు చేరుతోంది. ఊరూ పేరూలేని సామాన్యుడు ఓటు- మరో సామాన్యుడి నధికారిగా మార్చుతోంది. ఫలితంగా అవినీతిపరులు నీతిపరులను శాసిస్తున్నారన్న విషయం తెలిసికూడా గ్రహించరెవ్వరూ...   
    మనను పాలించే వాడిలో అవినీతి ఉంది. మనకు పాఠం చెప్పేవాడిలో అవినీతి ఉంది. మనం బ్రతికే బ్రతుకులో క్షణం క్షణం అవినీతి ఉంది.
     కానీ ప్రతివాడూ తను నీతిపరున్ననే అనుకుంటాడు.   
    ముక్త ఈ ఫక్కీలో ఆలోచించడం లేదు.   
    ఆమె పావని గురించి ఏహ్య భావాన్ని పెంచుకుంటోంది.   
    ఎంత నమ్మిస్తేమాత్రం - పెళ్ళికి ముందే పరాయి మగాడితో ఎందుకు సంబంధం పెట్టుకోవాలి? అందులో ఆమె మానసిక బలహీనత ఉంది. ఆ బలహీనతనే సమాజం తప్పు పడుతోంది.   
    ఒకసారి మోసగించబడిన ప్రియుడు-తిరిగి ఆమెను బలాత్కరించగల ఏకాంతాన్నెలా పొందాడు? ఆమెకతడికలాంటి అవకాశమెలా యిచ్చింది?   
    పావనిలో ఏదో బలహీనత ఉంది.   
    పాత ప్రియుడినామె మరచిపోలేకపోతోంది.   
    లేక నలుగురూ అనుకుంటున్నట్లామె భర్త నపుంసకుడే కావచ్చు.   
    తన కోర్కెలను చంపుకోలేక, మనసు నదుపులో పెట్టుకోలేక-ఆమె పాత ప్రియుడితో తిరిగి సంబంధం పెట్టుకుని- పట్టుబడితే దాన్ని బలవంతంగా మార్చిఉంటుంది.   
    చీ...ఎలాంటి ఆడది?   
    క్రమంగా పేరంటం కార్యక్రమం ముగిసింది.  
    వచ్చిన వారిలో చాలామందిని వెనక్కు తీసుకుని వెళ్ళడానికి కార్లు వచ్చాయి.  
    తనూ లేచింది ముక్త.   
    "మొదటిసారి వచ్చారు. కాసేపు కూర్చోండి-" అంది సంధ్య.   
    ముక్త ఆమె బలవంతం చేయగా కాదనలేక పోయింది.  
    అంతా వెళ్ళిపోయాక సంధ్య, ముక్త మిగిలారు.  
    అప్పుడు సంధ్య ముక్తను ఆమె గురించిన వ్యక్తిగత వివరాలడిగింది.
    మొదట్లో తటపటాయించినా క్రమంగా సంధ్యతో మంచి స్నేహితురాలిగా భావించి - ఒక్కొక్కటిగా కుటుంబ విశేషాలు చెప్పిందామెకు ముక్త.
    తన కుటుంబం గురించి చెబుతున్నప్పుడు ముక్త కళ్ళలో కనబడ్డ మెరుపును చూసింది సంధ్య.
    "మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్ధిక సమస్యలున్నప్పటికీ అభిమానాలూ, ఆత్మీయతా వాటిని కమ్మేస్తాయి_" అంది సంధ్య.
    "అవును-అమ్మన్నా, నాన్నన్నా, అన్నయ్యలన్నా నాకెంతో యిష్టం" అంది ముక్త.
    "నాకూ అంతే! నేనూ మధ్యతరగతి నుంచే వచ్చాను. మావారుకూడా మధ్యతరగతిలోనే పుట్టి పెరిగారు. ఇప్పుడైశ్వర్యం పేరుకున్నప్పటికీ మేము వీలైనంత సింపుల్ గా ఉంటాం. మా కిద్దరు పిల్లలు. ఇద్దరూ స్కూలుకు వెడుతున్నారు. వాళ్ళనికూడా మధ్యతరగతి వాతావరణంలోనే పెంచాలన్నది మా కోరిక. అందుకే తరచు మేము బంధువులిళ్ళకు వెడుతూంటాం. స్నేహం కూడా ఎక్కువగా మధ్యతరగతి వారితోనే...." అంది సంధ్య.
    ఆమె మాటిమాటికీ మధ్యతరగతి అంటూంటే ముక్తకది తననే ఉద్దేశించి అన్నట్లనిపిస్తోంది. సంధ్య తనకంటే చాలా ఎత్తులో ఉన్నదనిపిస్తోంది. ఈ తరహా సంభాషణ ఆమెకు నచ్చలేదు.

 Previous Page Next Page