Previous Page Next Page 
ఆడపడుచు పేజి 3

    మాట మార్చడంకోసం ఆమె పావని ప్రసక్తి తెచ్చింది.
    సంధ్య ముఖం పాలిపోయింది.
    "పావని గురించి మీకెవరు చెప్పారు?" అందామె.
    "ఇక్కడ చేరిన వాళ్ళంతా ఆమె గురించే మాట్లాడుకున్నారు. మీరు మంచి వారు కాబట్టికానీ ఆమె వంటివారితో స్నేహం చేయరన్నారు..."
    "పావని చేసిన తప్పేమిటో వాళ్ళు మీకు చెప్పారా?"
    ముక్త పావని గురించి తను విన్నదామెకు చెప్పి- "ఇది నిజమేనా?" అంది.   
   "నిజమే - కానీ మీకందులో తప్పు కనబడుతోందా?"
    "ఊఁ" అంది ముక్త ఆలోచించకుండా.
    "వెంటనే ఊ అనడం కాదు. కాసేపాలోచించి చెప్పండి-"
    "ఇందులో ఆలోచించడానికేముంది? బలహీనతను జయించడం లోనే సంస్కారముంది..."
    "సంస్కారం బలహీనతను జయించడంలోకాదు. మన్నించడంలో ఉంది." అని-"పావని పరిస్థితులు మీకే ఏర్పడితే ఏం చేసేవారు?" అంది సంధ్య.
    "ఆ పరిస్థితుల నామె ఆహ్వానించింది. పెళ్ళయ్యే వరకూ నాకు పరాయి మగాళ్ళలో పరిచయమే లేదు...."
    "పోనీ - ఇంట్లో ఏ బావో ఉంటే...?"
    ముక్తకు తన బావ గుర్తుకొచ్చాడు. అతడు తన కంటే రెండేళ్లు పెద్ద. ఒకటి రెండు సార్లతడు తనకు దగ్గరగా రావడానికి ప్రయత్నించాడు. ఆమె సాగనివ్వలేదు.
    "ఎవరైనా మనమిస్తేనే అవకాశం...." అంది ముక్త నమ్మకంగా....
    సంధ్య తనూ నవ్వేసి- "మీవి కచ్చితమైన అభిప్రాయాలు. ఇలాంటి వారితో మాట్లాడ్డం మా వారికి చాలా యిష్టం. కాసేపుండకూడదూ?" అంది.
    ముక్త తడబడుతూ- "నేను వారితో ఏం మాట్లాడగలను?" అంది.
    "ఈ మాట వారితో మాట్లాడేక అందురుగాని..." అంది సంధ్య.
    ఇద్దరూ ఓ గదిలోకి వెళ్ళారు.
    గదిలో నాలుగు సోఫాలు, రెండద్దాల బీరువాలు ఉన్నాయి.
    ఒక సోఫాలో కూర్చుని భానుప్రకాష్ చదువుకుంటున్నాడు.
    "మావారి రీడింగ్ రూమిది!" అని అంది సంధ్య.
    భానుప్రకాష్ పుస్తకంలోంచి తలెత్తి వారివంక చూసి చటుక్కున లేచి నిలబడి ప్రశ్నార్ధకంగా భార్యవంక చూశాడు.
    "మిసెస్ గౌతమ్ - పేరు ముక్త - అభిరుచుల్లో మీవంటిదే ఈమె. మనకు మంచి స్నేహితురాలు..." అంది సంధ్య.
    ఇద్దరూ అతడి కెదురుగా కూర్చున్నారు.
    కబుర్లు మొదలయ్యాయి.
    "ఆఫీసుకు నేనే బాస్ ని కావడం వల్ల నా యిష్టం వచ్చినప్పుడల్లా యింటికి వచ్చేస్తూంటాను. అయితే అందరికంటే నేనే ఎక్కువసేపు పనిచేస్తాను. రాత్రింబవళ్ళు తేడా లేకుండా పనిచేస్తాను..." అన్నాడు ముందుగా భానుప్రకాష్.
       ఆ సమయంలో యింట్లో ఉండడానికతడు సంజాయిషీ యిస్తున్నట్లు తోచింది ముక్తకు.
    "ఒక సారింటికి వచ్చేక మళ్ళీ ఆఫీసుకు వెళ్ళ బుద్దేస్తుందా?" అంది ముక్త.
    "ఏముంది? ఏ మీవంటి వారినో పలకరించడమవుతుంది. ఆ ఇన్ స్పిరేషన్ తో మరింత ఉత్సాహంగా పని చేయగల్గుతాను..." అన్నాడు భానుప్రకాష్.
    ముక్త ఇబ్బందిగా నవ్వింది.
    సంధ్య వెంటనే- "అయితే మీ స్టాఫ్ ను కూడా ఓ వేళాపాళా లేకుండా ఇంటికి పంపేస్తూండండి - బాగా పని చేస్తారు-" అంది.
    "నువ్వు చెప్పిందాలోచించవలసిందే..." అంటూ భానుప్రకాష్ ఆలోచన నభినయించ సాగాడు.
    "మీ రాలోచిస్తూండండి. నేనిప్పుడే వస్తాను....." అంటూ సంధ్య అక్కన్నించి లేచి వెళ్ళి పోయింది.
    ముక్త తనూ లేవాలనుకుంది కానీ సంధ్య చాలా త్వరగా వెళ్ళిపోయింది. ముక్త లేచేలోగా భానుప్రకాష్ ఆమెతో - "మిగతా స్టాఫ్ విషయమెలాగున్నా మీ వారిని ఆఫీసు మధ్యలో ఇంటికి పంపలేను. మాకు మీరు ఇన్ స్పిరేషన్ కావచ్చు. కానీ మీవారికి ఎట్రాక్షన్...అంటే అయస్కాంతం. ఒకసారింటికి వెడితే ఇకరాడు రాలేడు..." అన్నాడు.
    ముక్త కేమనాలో తోచక ఇబ్బందిగా నవ్వింది.
    "మిసెస్ ముక్తా! మీ ముఖంలో సంస్కారంతో పాటు- ఒక విధమైన గ్రేస్ ఉంది. ఏ దేశానికో మహారాణి కావలసిన సౌందర్యం మీది. కాకపోవడం మీ అదృష్టం. ఎందుకంటే మహారాణికి భర్త సాన్నిధ్యం లభించదు..." అన్నాడు భానుప్రకాష్.
    తను మాట్లాడక పోతే బాగుండదని- "మీ యిల్లు చాలా అందంగా తీర్చిదిద్దారు. సంధ్యగారి అభిరుచి గొప్పది-" అంది.
    "అభిరుచి సంధ్యది కాదు-నాది!" అన్నాడు భానుప్రకాష్.
    అతడ లాగనడం మోటుగా అనిపించింది ముక్తకు. భార్య గురించి తనన్న ఒకే ఒక్క మంచి ముక్క నతడామోదించక పోవడం సంస్కారం కాదనిపించిందామెకు.
    భానుప్రకాష్ మళ్ళీతనే- "నేను సంధ్యను చిన్నబుచ్చాలనిలాగనలేదు. నిజం చెప్పడానికి నేను సంకోచించను. సంధ్య కూడా నా నిజాలంటే ఇష్టపడుతుంది. ఉదాహరణకు మీరు వెళ్ళాక సంధ్యతో చెబుతాను-ఐశ్వర్యమున్న నాకంటే-మీరున్న గౌతమ్ అదృష్టవంతుడని! ఆమె ఏమీ అనుకోదు..." అన్నాడు.
   మొదటిసారిగా ముక్తకు చిరాకు కలిగింది. ఆ చిరాకు ముఖంలో వ్యక్తం చేసిందామె.
    భానుప్రకాష్ అది గమనించిన వాడిలా-"ఒక విధంగా నేనదృష్టవంతున్ని. నాకు తోచింది నేను ధైర్యంగా మాట్లాడగలను. ఎదుటి వాళ్ళకు నా మాటలు చిరాకు కలిగించినా వింటారు. ఎందుకంటే నేను వారికో, వారి భర్తలకో అధికారిని కనుక! ఎందరి భవిష్యత్తో నా చేతుల్లో వుంది కనుక!" అన్నాడు.
    ముక్త కతడి మాటలో హెచ్చరిక కనబడింది. ఆహెచ్చరిక ఆమె చిరాకును భయంగా మార్చింది.
    భానుప్రకాష్ ఆ భయాన్నికూడా చదివినట్లే ఉన్నాడు- "సినిమాల్లో అసభ్యదృశ్యాలు, సంభాషణలు ఉంటున్నాయి. వాటికారణంగా చిత్రం ఘనవిజయం సాధిస్తుందని నిర్మాతల అభిప్రాయం. పత్రికల్లో క్రమంగా అశ్లీలత చోటుచేసుకుంటోంది. పత్రిక సర్క్యులేషన్ కవే కారణమని సంపాదకుల అభిప్రాయం. మనమంతా ఆ సినిమాలు చూస్తున్నాం. పత్రికలు చదువుతున్నాం. స్నేహితులతో చనువుగా మాట్లాడుకుందుకు భయపడుతున్నాం. హేమమాలిని బాగుంటుంది. శ్రీదేవి బాగుంటుంది. భానుప్రియ బాగుంటుంది. వాళ్ళు బాగున్నారని చెప్పుకుంటానికేమీ సందేహించని మనం- మనలో మనం బాగోగుల గురించి చెప్పుకుందుకెందుకు తటపటాయిస్తామో నాకు తెలియదు. అందంలో మీరు వాళ్ళను మించారు. సినిమాల్లో నటించని కారణంగా మీ అందం గురించి మాట్లాడ్డానికే భయపడాలా-నేను!"
    అతడి వాదన చిత్రంగా అగుపించిందామెకు.
    "ఏ మిధున్ చక్రవర్తో, గోవిందాయో బాగుంటాడని మీరు మీ భర్తకు చెప్పకుండా వుండగలరా? అది తప్పుగా మీ భర్త భావిస్తాడా? అలాంటప్పుడదే విధంగా నేను మీ గురించీ, మీరు నా గురించీ మాట్లాడుకోవడం తప్పవుతుందా?"
    "ఇదంతా ఎందుకు చెబుతున్నారు?" అంది ముక్త.
    "స్నేహానికి మొదటిమెట్టు చనువు. అర్ధంలేని బహువచనాలతో ఒకరినొకరు దూరం చేసుకోకూడదు. నేను నిన్ను నువ్వంటాను. నువ్వు నన్ను నువ్వను. ఆ విధంగా మనం స్నేహితుల మవుదాం. మన స్నేహం నా మానసిక వికాసానికీ, మీ ఆర్ధిక వికాసానికీ మంచిది. నాతో స్నేహాన్నాశించే వారెందరో ఉన్నారు. కానీ నేను నాకు నచ్చిన వారితోనే స్నేహం చేస్తాను. నాకు నువ్వు నచ్చావు..." అన్నాడు భానుప్రకాష్.
    ముక్తకేం చెప్పాలో తెలియలేదు. అతడి చనువామెకిచ్చిందిగానే పరిణమించింది.
    భానుప్రకాష్ మళ్ళీ- "నువ్వు బహుశా నాసంస్కారం గురించి ఆలోచిస్తూంటావు. నాసంస్కారం గొప్పది. ఆడవాళ్ళను స్నేహితులుగా చూడగలను. నా స్నేహితులగురించి నా భార్యతో మామూలుగా మాట్లాడగలను. అదే విధంగా ఆమె స్నేహితుల గురించి వినగలను. నా సంస్కారం గురించి ఆలోచించేముందు ఈ సంభాషణను నీ భర్తకు చెప్పుకోగలవేమో ఆలోచించు. అతడి సంస్కారం గురించి తెలుస్తుంది నీకు..." అన్నాడు.
    ముక్తకంతా అయోమయంగా అనిపించింది. భానుప్రకాష్ మనసులో ఏదో దురూహ ఉన్నట్లు లీలగా తోస్తోందామెకు.
    "నేను మధ్యతరగతిలో పుట్టి పెరిగాను. మధ్యతరగతి గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. మధ్యతరగతి అంటే నా కెంతో యిష్టం. కానీ మధ్యతరగతిలో కొన్ని లోపాలున్నాయి. వారిలో ఫ్రాంక్ నెస్ లేదు. నిజాయితీ లేదు. సాహసం లేదు. నేను జీవితంలో పైకిరావడానికి మధ్యతరగతి లోపాల్ని అధిగమించగలగడమే కారణం. నువ్వూ అంతే! తలచుకుంటే కార్లలో తిరగ్గలవు. మేడల్లోమసలగలవు. ఫోన్లలో మాట్లాడగలవు. మధ్యతరగతి లోపాల్ని జయించాలి అంతే! నా స్నేహం నీ కందుకు సహకరిస్తుంది..."
    ముక్త సహనానికి అంతం వచ్చింది. ఆమె లేవాలనుకుంటూండగా అక్కడికి వచ్చింది సంధ్య ఆమె. చేతిలో ట్రే ఉంది. ట్రేలో మూడుగ్లాసులు....
    "ఆరంజి జ్యూసు...." అంది సంధ్య.
    "చాలా ఆలస్యమయింది..." అంది ముక్త ఇబ్బందిగా.
    "మావారు మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తారు..." అంది సంధ్య.
    "మిమ్మల్ని అనకు. ఆమె ఈ క్షణంనుంచీ మన స్నేహితురాలు..."
    "అంటే?"
    "చనువుగా నువ్వు అను...అక్కచెల్లెళ్ళలా మసలండి..."
    "భలే వారే - నేను బైటకు వెళ్ళిన కాసేపట్లోనే ఏం మంత్రం వేశారండీ?" అంది సంధ్య ఆశ్చర్యం ప్రకటిస్తూ.
    ముక్త ధైర్యం తెచ్చుకుని- "భార్య భర్తను ఏమండీ అంటే పోని చనువు పరాయి వాళ్ళంటే పోతుందా?" అంది.
    "భార్యా భర్తల అనుబంధం వేరు. మీరని మన్నించినా ఆమె ఎరా అనే తల్లికంటే భర్త దగ్గర చనువుగా  ఉండగలదు, భార్యా చెల్లెలు మరదలు కూడా నన్ను నువ్వనే పిలుస్తుందని మర్చి పోకూడదు-" అన్నాడు భానుప్రకాష్.
    "వారిని మాటల్లో జయించడం కష్టం-" అంది సంధ్య.
    ముగ్గురూ జ్యూస్ తాగేరు-"నేనొక్కర్తినీ వెళ్ళగలను..." అంది ముక్త.
    "వద్దు. నిన్ను నేనే ఉంచేశాను నిన్నింటిదగ్గర దింపడం నాదీ బాధ్యత..."
    "ఎవరైనా చూస్తే బాగుండదు..." అంది ముక్త.
    సంధ్య నవ్వి-"ఎందుకు బాగుండదు! కార్లో నేనూవస్తున్నాగా-" అంది.
    "మీరూ వస్తున్నారా?" అంది ముక్త ఉత్సాహంగా. అంతలోనే-"అనవసరంగా మీకెందుకుశ్రమ!" అంది మొహమాటానికి.
    "శ్రమకాదు. ఇట్సే ప్లెజర్..." అన్నాడు భానుప్రకాష్.
    ముక్త ఉత్సాహంపై నీళ్ళు చల్లినట్లయింది. ఆమె సంధ్య వంక చూసింది. సంధ్య ముఖం గంభీరంగా ఉంది.
                                                        3
    ఇల్లు చేరుకున్నాక ముక్త కేపనిమీదా ధ్యాస మళ్ళ లేదు.
    భానుప్రకాష్  మాటలామె చెవిలో గింగురుమంటున్నాయి.
    అతడి రూపం ఆమె కాళ్ళ ముందు కదలాడుతోంది.
    అతడి చూపులామెను వళ్ళంతా తడుముతున్నాయి.
    "ఛీ-ఏం మనిషి?" అనుకుందామె.
    ఐశ్వర్యంలో ఓ స్థాయి చేరుకుంటే మనిషి సంస్కారాన్ని కోల్పోతాడా! లేక సంస్కారాన్ని కోల్పోయే ధైర్యాన్ని ఐస్వర్యం మనిషికిస్తుందా?
    ఐశ్వర్యవంతులకు సంస్కారాన్ని కోల్పోవడమే సంస్కారమేమో!
    భానుప్రకాష్ గురించి భార్య సంధ్యకు తెలుసా? ఆమె అతడి గురించేమనుకుంటోంది?
    అసలు సంధ్యే తనను ప్రత్యేకంగా భర్తకు పరిచయం చేసింది. అదీకాక ఆఫీసు టైములో కూడా అతడింట్లోనే ఉన్నాడు. అంటే ముందుగానే అనుకుని ఇలా చేశారా? ఇలాచేయడం వల్ల సంధ్యకు ప్రయోజనమేమిటి? ఆమె భర్త విషయంలో అసహాయురాలా? అతడి ప్రవర్తన నదుపు చేయలేదు సరిగదా - అతడి చెడు నడత కామె సహకరించాలా? అదే నిజమైతే ఎంత దురదృష్టం?
    "నీవంటి భార్య ఉంటే నేనూ యిల్లొదిలి పెట్టలేను. నావంటి వారికి ఇన్స్ పిరేషన్...నీ భర్తకు ఎట్రాక్షన్..."
    భానుప్రకాష్ సూటిగా చెప్పిన మాటలివి.
    అతడికి భార్యంటే యిష్టంలేదా?
    సంధ్యంటే అతడికెలాంటిష్టమో తెలియదు. కానీ తానంటే అతడికిష్టం బయల్దేరిందని ముక్త గ్రహించింది.
    అది దేనికి దారి తీస్తుందోనని ఆమెకు భయంగా ఉంది.
    భానుప్రకాష్ మాటల్లోంచీ-
    "నువ్వు నాకు నచ్చావు..."
    "నువ్వు తలచుకుంటే కార్లలో తిరగ్గలవు. మేడలో మసలగలవు. ఫోన్లలో మాట్లాడగలవు...నా స్నేహం నీ కందుకు సహకరిస్తుంది.
    వగైరాలామె చెవుల్లో గింగురు మంటూ అతడు తన్ను ప్రలోభ పెడుతున్నాడని చెప్పక చెబుతున్నాయి. ఆప్రలోభానికి తాను లొంగ కూడదనుకున్నప్పుడల్లా-
    "ఎదుటి వాళ్ళ నా మాటలు చిరాకు కలిగించినా వింటారు. ఎందుకంటే నేను వారికో వారి భార్తలకో అధికారిని కనుక! ఎందరి భవిష్యత్తో నాచేతుల్లో ఉంది కనుక..."అన్న భానుప్రకాష్ హెచ్చరిక ఆమెను భయపెడుతోంది.

 Previous Page Next Page