Read more!
Next Page 
ఆడపడుచు పేజి 1

                                 

 

                                                                ఆడపడుచు
   
                                                                  --వసుంధర

                                             

                                            

                                                             
       రాత్రి ఎనిమిది గంటల సమయం. నేలంతా పిండార బోసినట్లు వెన్నెల వెన్నెల్లో జలకాలాడుతోందా అన్నట్లు పెరట్లో అసహనంగా అటుయిటూ పచార్లు చేస్తోంది ముక్త.   
    ఆమె ఆలోచనలనిండా భర్త గౌతమ్ ఉన్నాడు.  
    వారిద్దరికీ వివాహమై ఏన్నర్ధం దాటింది.   
    పెళ్ళికి ముందు ముక్త జీవితం గురించి ఎన్నోకలలు కంది.   
    ఆమె తండ్రి బడి పంతులు. అదృష్టం కొద్దీ ముగ్గురే పిల్లలు. అందులోతనొక్కర్తే ఆడపిల్ల.   
    గారంగానే పెరిగింది కానీ కోరికలేమీ తీరేవికాదు.   
    తండ్రి తనకు వచ్చే జీతంలో ఒబ్బడిగా గడుపుకుంటూ తన కోరికలన్నీ త్యాగం చేసి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలను కున్నాడు. అప్రయత్నం లోనే ముక్తకు గౌతమ్ వంటి వరుణ్ణిచ్చి చేశాడు.   
    గౌతమ్ ఉద్యోగం ప్రైవేట్ కంపెనీలో. ఎమ్మే ప్యాసయ్యాడు. నెలకు పదిహేను వందలు జీతమంటే చాలా ఎక్కువనే అనుకుందామె.   
    వేరు కాపురం ప్రారంభించాక కానీ అసలు విషయం తెలియలేదు.  
    ముక్త కలలు కనే లాంటిల్లు కావాలంటే అద్దె కనీసం వెయ్యి రూపాయలవుతుంది. మూడు వందల యాభై రూపాయలిచ్చి ఓ రెండు గదులింట్లో ఉంటున్నారు. అందులోనే అదృష్టం-ఇంటికి కాస్త పెరడుండడం!   
    గౌతమ్ కింటి బాధ్యతలున్నాయి. నెలనెలా అతడు తల్లిదండ్రులకు రెండువందల రూపాయలు పంపిస్తూంటాడు. పెళ్ళికి ముందు అతడు తన గురించంటూ ఏమీ నిలవేసుకోకుండా-మిగిలిందంతా తల్లిదండ్రులకే పంపేవాడు.   
    ఒక్కసారిగా పదివేలు ఖర్చు పెట్టలేక గౌతమ్ స్కూటర్ కొనడంలేదు. అతడాఫీసుకు బస్సులో వెడతాడు.   
    ముక్తకు గట్టిగా తనకు నచ్చిన చీర కొందామంటే లేదు. మంచి చీరలేవీ రెండొందల యాభైకి తక్కువలో లేవు.   
    "నెల ఖర్చుల్లో జాగ్రత్తగా ఉంటే, ఆర్నెల్ల కొకసారి దర్జాగా ఉండొచ్చు" అని గౌతమ్ అంటాడు.   
    బయటకు వెళ్ళినప్పుడల్లా దర్జాగా ఉండాలని ముక్త కోరిక.   
    బైటకు వెడితే ఆటోలో వెళ్ళాలి. బైట కూర్చుంటే ఐస్ క్రీమ్ లు తినాలి.   
    అందుకే దంపతులిద్దరూ కలిసి బైటకు వెళ్ళడం తగ్గించేశారు.   
    ఇంట్లోనే ఒకరి నొకరు చూసుకుంటూ, ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ గంటలు క్షణాల్లా దొర్లించేయగలమని గౌతమ్ అంటాడు.   
    ముక్త మనసు కది సరిపడలేదు.   
    ఆమెకు బయట ప్రపంచంలో తిరగాలని ఉంది. తామందరికీ కనబడాలి. తను రాకుమారిలా, తన పక్కన భర్త రాకుమారుడిలా....ఇద్దరూ విహరిస్తూంటే లోకమంతా కళ్ళప్పగించి తమవంకే చూడాలన్నదామె కోరిక....   
    భర్త తనను ప్రేమించడంలో ఆమెకానంధంలేదు. భర్త తనకిచ్చే హోదాను ప్రదర్శించడంలోనే ఉందామె సంతోషం.   
    "మీ అంతస్థు, హోదా పెరగాలి....అందుకోసం మీరేం చేసినా నా కభ్యంతరంలేదు-" అనితరచుగా ఆమె భర్తతో అంటూండేది.   
    భార్యంటే ఎంతో యిష్టపడే గౌతమ్ కామె కోరిక మన్నించి తన హోదాను పెంచుకోవాలనే ఉంది. కానీ అతడి పరిమిషనులతడికున్నాయి. ఆ విషయం భార్య ముందొప్పుకోవడమిష్టంలేక- ప్రేమ గొప్పతనాన్ని పొగుడుతూండేవాడు. జీవితంలో ప్రేమను మించినదేదీలేదనీ, ఏ దారి తొక్కినా డబ్బు సంపాదించవచ్చుననీ - ప్రేమ అలా దొరికేది కాదనీ భార్యతో అంటూండేవాడు- ముక్త ప్రేమ తనకు లభించడం వల్ల ఇతర భోగభాగ్యాల మీద మనసు లేదన్నాడు. భార్య కూడా అలాగే అంటుందని ఆశించాడు.   
    కానీ ముక్త అతడేదారైనా సరే తొక్కి- డబ్బు సంపాదిస్తే-అప్పుడే అతన్ని నిజంగా ప్రేమించేలాగుంది.   
    ఈ విషయం చూచాయగా పెళ్ళైన ఆర్నెల్లల్లోనే గ్రహించాడు గౌతమ్. అతడది గ్రహించాక మరో ఏడాది గడిచింది.   
    సరిగ్గా నిన్నటి రోజున గౌతమ్ కీ విషయం మరింత ఎక్కువగా గ్రహించాల్సిన అవసర మేర్పడింది.  
    గౌతమ్ బాస్ పేరు భానుప్రకాష్.   
    అతడికి బాగా డబ్బున్నప్పటికీ సింపుల్ గా ఉంటాడు. తన క్రింది వారందరి తోనూ అరమరికలు లేకుండా మాట్లాడుతాడు. కంపెనీ యాజమాన్యంలో అతడికి చాలా మంచిపేరుంది.   
    భానుప్రకాషింట్లో పేరంటం.   
    పేరంటానికి పిలుపు భానుప్రకాష్ ద్వారా అందింది గౌతమ్ కు.   
    భానుప్రకాష్ భార్య సంధ్యకు రెండ్రోజుల నుండి జ్వరం. ఆ కారణంగా అందరిళ్ళకూ స్వయంగా వెళ్ళి పిలవడంలేదు. చాలామందిని ఫోను ద్వారా పిలిచింది. కొందరికి కార్లో మనిషి ద్వారా కబురంపింది. ఆఫీస్ స్టాఫ్ కు భానుప్రకాష్ ని చెప్పమంది.   
    పేరంటం గురించి గౌతమ్ భార్యకు చెప్పాడు.   
    అతడు భానుప్రకాష్ వైభవాన్ని వర్ణించి_"అక్కడ నీకు గొప్పగొప్ప వాళ్ళ పరిచయాలవుతాయి_"అన్నాడు.   
    ముక్తకా సరదా ఉన్నట్లు లేదు. ఆమె తను వెళ్ళనంది.   
    "నాకో మంచి చీరలేదు-పార్టీకెలా వెళ్ళను?" అందామె.   
    ముక్తకు పెళ్ళినాటి పట్టుచీరలు రెండున్నాయి. కానీ ముక్తకు పట్టుచీర కట్టుకోవడం ఇష్టం లేదు.   
    "వెళ్ళేది పేరంటానికైనా-పట్టుచీర నా వయసుకు తగ్గది కాదు. మంచి గార్డెన్ చీరైతే బాగుంటుంది-" అంది ముక్త.   
    రెండు నెలల క్రితం గౌతమ్ ఆమెకో గార్డెన్ చీర కొన్నాడు. ఖరీదు రెండు వందల ఎనభై రూపాయలు.   
    "గొప్ప వాళ్ళింటికి పేరంటానికి వెడుతూ నగ లేసుకోకుండా ఎలా? పెళ్ళికి మా నాన్న చేయించిన నీలపురాళ్ళ నెక్లెస్ వేసుకుంటాను. దానికి మ్యాచింగ్ ఉంగరం కూడా ఉంది. ఈ రెండూ ఉన్నవి వాటికి మ్యాచింగ్ చీర లేకపోతే ఏంబాగుంటుంది? అప్పుడు కొన్న గార్డెన్ చీర లేతపసుపు రంగుది..." అందిముక్త.   
    అంటే యిప్పుడు నీలంరంగులో గార్డెన్ చీర కొనాలి. వెళ్ళేది గొప్పింటి పార్టీకి కాబట్టి చీరఖరీదు మూడొందల యాభైకి తగ్గకూడదు. పాతచీరతోనే సరి పెట్టుకోవాలంటే అందుకూ ఆమె సిద్దమే! దానికి మ్యాచింగ్ గా రాళ్ళనెక్లెస్, ఉంగరం కావాలి. కాకిబంగారం ఆమెకు పడదు.   
    చీరరంగు నిర్ణయమైతే మ్యాచింగ్ జోళ్ళుకూడా కొనుక్కోవాలనుకొంటోందామె.   
    గౌతమ్ అప్పుడు తనకొచ్చిన యిబ్బందులన్నీ ఆమెకేకరువుపెట్టుకుని-"నీ కోసం కొండమీద కోతిని దింపాలనుంటుందినాకు. నీ అంత అందమైన భార్యనిచ్చిన దేవుడు- నిన్ను సంతోషపెట్టే శక్తినివ్వలేదు-"అని బాధపడ్డాడు....   
    ముక్త అతడి జుత్తులోకి వేళ్ళు పోనిచ్చి ఎంతో ప్రేమగా- "పోనీ లెద్దురూ నాకు మీ ప్రేమాభిమానాలు చాలు. పేరంటానికి వెళ్ళకపోతేనేం?" అంది.   
    అది బాస్ ఇంటిపిలుపు. వెళ్ళకపోతే ఆయనక్కోపం వస్తుంది. ఆఫీసులో ఆయన తనపై కక్ష గట్టవచ్చు.   
    "నాభార్య స్వయంగా పిలవలేదని నీభార్య రానంటుంది. ఆమెకు నిజంగా జ్వరం. నీభార్యనెలాగో అలా ఒప్పించాలి-" అన్నాడు బాస్ ప్రతి ఉద్యోగితో.   
    ముక్త వెళ్ళకుంటే అది అసహాయతగాకాక అహంకారంగా భావించబడుతుంది   
    గౌతమ్ భార్యకు తన యిబ్బంది చెప్పుకున్నాడు.   
    "మీరు మీ సంగతే చూసుకుంటున్నారు. నా సంగతి ఆలోచించరేం? ఆడాళ్ళ మధ్య ఎన్నో ఉంటాయి. నలుగురిలోను అవమానపడే కంటె పేరంటానికి వెళ్ళకపోవడమే మేలు....."అంది ముక్త.   
    చివరకు గౌతమ్ అప్పు చేయాలని నిర్ణయించుకున్నాడు. నెలాఖరు రోజుల్లో అయిదారొందలంటే మాటలు కాదు. అతడు తన ప్రయత్నం తను చేస్తున్నాడు.   
    ఆ రోజాఫీసునుంచి పెందరాళే యింటి కొచ్చేస్తాననీ-ఇద్దరం కలసి షాపింగుకు వెడదామనీ భర్త ఆమెకి చెప్పాడు.   
    పెందరాళే అన్నవాడు అసలు టైము దాటినా యింటిని రాలేదు.   
    టైము ఎనిమిదయింది. అయినా అతడింకా రాలేదు.   
    ముక్త అసహనంగా పచార్లు చేస్తోంది పెరట్లో!   
    పేరంటం వంక పెట్టి గార్డెన్ చీర కొనుక్కోవాలనుందామెకు. కానీ ఏదైనా కుంటిసాకు చెబుతాడేమోనని ఆమె భయం.
    గుమ్మంలో ఎదురు చూసి చూసి-చివరకు పెరట్లోకి వచ్చింది.   
    ఆకాశంలో వెలిగిపోతున్న చంద్రుడుకానీ, అతడు కురిపిస్తున్న వెన్నెలకానీ ఆమెకు సంతోషాన్నివ్వడంలేదు.   
    తలుపు తట్టిన శబ్దం కోసం ఎదురు చూస్తోంది.   
    చివరికాశబ్దమామెకు వినిపించింది.   
    ఒక్క పరుగున యింట్లోకి వెళ్ళి వీధి తలుపు తీసింది.   
    గుమ్మంలో గౌతమ్!   
    "ఇంత ఆలస్యమయిందేం?" అంది ముక్త.   
    "ఆలస్య మయితేనేం డబ్బు దొరికింది. ఎల్లుండి కదా! రేపు సాయంత్రం మనం షాపింగుకి వెడదాం-" అన్నాకనే గౌతమ్ లోపల ప్రవేశించాడు.   
    భానుతేజంలో వెన్నెలలు కురిపిస్తూ-ఎందరికో కవితా వస్తువైన పున్నమి చంద్రుణ్ణి మించి- గౌతమ్ ముఖం వెలిగి పోతోంది.   
    ఆ వెన్నెలలు ముక్త కానందాన్ని కలిగిస్తున్నాయి.   
                                                       2   
    ఆటో ఆ బంగళా ముదాగింది.   
    ముక్త ఆటో వాలాకు డబ్బిచ్చి క్రిందకి దిగింది.   
    ఎదురుగా చిన్న గేటు...   
    ముక్త గేటు తీసుకుని లోపలకు వెళ్ళింది....   
    ఇంటి చుట్టూ పూలతోట.   
    తోటలో రకరకాల పూలు....అందమైన పూలు...   
    ఆ పూలన్నీ ముక్తను పలకరిస్తున్నాయి.   
    ముక్త వాటి అందాన్ని చూడ్డం లేదు. పలకరింపుని వినడం లేదు.   
    ఆ పూలతోట యజమానురాలిని తల్చుకుని అసూయ పడుతోంది.   
    ఆ అసూయతోనే ఆమె ఆ యింట్లో ప్రవేశించింది.   
    ముందుగానే ఉందో పెద్ద హాలు....   
    ఆహాల్లోనే పేరంటాళ్ళున్నారు....
    ముక్త గుమ్మంలో అడుగు పెట్టగానే చాలామంది కళ్ళటు తిరిగాయి.
    ఆ యింటిని దూరాన్నించి చాలాసార్లు చూసింది ముక్త లోపలకు వెళ్ళడం అదే మొదలు  
    ఒక సన్నని పొడవాటి స్త్రీ ఆమెను సమీపించింది.  
    ఆమె మరీ అంత అందగత్తెకాకపోయినా హుందాగా ఉంది. ఛాయ మాత్రం బంగారంలా మెరిసి పోతోంది.  
    ఆమె కనులలో కనిపించీ కనిపించని విషాదం.  
    అది కూడా ఆమె కందాన్నే యిచ్చింది.  
    "నేను మిసెస్ భాను ప్రకాష్. అంటే సంధ్య మీరు మిసెస్ గౌతమ్ కదూ మీ పేరు?" అందామె.   
    "ముక్త-"
    "మీ అందానికి తగ్గపేరు-" అందామె.
    తను మిసెస్ గౌతమ్ అని ఆమెకెలా తెలిసిందా అని ఆలోచిస్తూ లోపల అడుగు పెట్టింది ముక్త.
    దూరంగా నిర్మల కనబడింది.
    నిర్మల సదానందం భార్య సదానందం గౌతమ్ కు సీనియర్ కొలీగ్ వారందరికీ చాల కాలం నుంచీ పరిచయముంది.

Next Page