Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 2

    సాంబయ్య స్థితిని అర్ధంచేసుకున్న మాలక్ష్మమ్మ గారు పలక్కుండా లోపలకు వెళ్ళి వచ్చి, ఒక పది రూపాయల నోటును సాంబయ్య చేతిలోపెట్టి అన్నారు, "ఇంక ఇంటికి వెళ్ళు ఈ రెండు రోజులూ పనిలోకి రావద్దులే."

    బ్రతుకు జీవుడా అని, ఒక్క అంగలో బయటపడి గట్టిగా ఊపిరి పీల్చాడు సాంబయ్య.

    ఇప్పుడు అతని దగ్గర మొత్తం పన్నెండు రూపాయలున్నవి. కోమటి నరసయ్య  గుడ్డల దుకాణంలోకి దూరాడు. పది రూపాయలు పెట్టి పెళ్ళికూతురుకు ఒక నల్ల అంచు తెల్లచీర, ఒక ఎర్ర రవిక గుడ్డ కొన్నాడు. మరి తనకో? రెండు రూపాయలు మాత్రం వున్నాయి. అతని అవస్థ తెలుసుకున్నట్లు నరసయ్య నవ్వుతున్నాడు. సాంబయ్యకు కోపం వచ్చింది. తనంటే ఈ ప్రపంచంలో అందరికీ అలుసే! పది రూపాయల నోటు కోమటి చేతులో వేసి, పైనున్న తుండలో గుడ్డలు చుట్టి, చంకలో ఇరుకించుకుని బయలుదేరాడు.

    నడుస్తుంటే సాంబయ్యకు రెక్కలు వచ్చినట్లూ, స్వేచ్చగా గాలిలో తేలిపోతునట్లూ వున్నది. సాలీల పేటకు చివరనున్న ఒక నిట్టాడి ఇంటిముందు ఆగి, తడిక ఊడదీసి లోపల ప్రవేశించాడు. చంకనున్న గుడ్డల మూటను ఒక తుప్పు పట్టిన పాత రేకు పెట్టెలో భద్రపరిచాడు.

    బాగా ఆకలేస్తున్నది అతనికి. ఇప్పుడు చెయ్యి కాల్చుకోవాలంటే కష్టంగా వుంది. ఈ ఒక్కరోజుకేగా ఈ కష్టం. రేపటినుండి.....హృదయంలో ఎవరో చక్కలిగింత పెట్టినట్లున్నది. సిగ్గు తెరలు కమ్ముకుంటున్నాయి ముఖం మీద. ఒకదాని వెనుక ఒకటిగా ఏవో స్మృతులు తల లెత్తుతున్నాయి పుట్టగొడుగులు లాగ.

    అకస్మాత్తుగా అమ్మవారి ఆ పాపిష్టి మాటలు "కుంటిదో, గుడ్డిదో" గింగురుమంటున్నాయి సాంబయ్య చెవుల్లో. అతని హృదయం దెబ్బతిని క్రిందపడ్డ పక్షి పిల్లలాగ గిలగిల తన్నుకుంటున్నది తను పడుకునివున్న మంచం ఎక్కడికో పాతాళానికి క్రుంగిపోతున్నది. రెండు చెవుల్లో చిటికెన వ్రేళ్ళు దూర్చి, ఆ శబ్దం వినపడకుండా చేయ ప్రయత్నిస్తున్నాడు.

    అవును. అంతే కావచ్చు. లేక తనలాంటి కురూపిని పిల్చి పిల్లనిస్తాననే దెవరు ఈ విశాల ప్రపంచంలో? బుర్ర వేడెక్కింది. ఇంక ఆలోచించలేకపోతున్నాడు.

    సాంబయ్య నల్లగా పొడవుగా వుంటాడు. కాళ్ళూ, చేతులూ చాలా పొడవుగా వుంటవి. అతనికి తొమ్మిదవ ఏట మశూచికము వచ్చింది. అందులో ఒక కన్ను కాయకాచింది. అసలు చచ్చిపోవాల్సిన దెబ్బ. ఎలాగో బ్రతికి బయట పడ్డాడు. ఆ నల్లని ముఖంమీద లోతైన గుంటలు, ఇనుముమీద త్రుప్పు పట్టినట్లు వుంటుంది.

    అతనికి జ్ఞానం తెలిసినప్పటినుండి నడివీధిలో నలుగురి ముందు తిరగటానికి, ఏదో తప్పుచేసిన వాడిలా బాధపడేవాడు. ఏ నలుగురు మాట్లాడుతున్నా, నవ్వుతున్నా సాంబయ్యకు తన గురించి మాట్లాడుతున్నట్లూ, తనను చూసి నవ్వుతున్నట్లూ అనిపించేది. అంతా తనను కావాలని పీడిస్తున్నట్టూ, తను మనుష్యులమధ్య కాక ఏ అడవి మృగాల మధ్యలో ఉన్నట్లు భయపడేవాడు. సమాజంలో స్వేచ్చగా, నలుగురిముందూ తలెత్తుకుని బ్రతకడానికి హక్కులేనట్లు తోచేది సాంబయ్యకు. ఆ భావమే అతని హృదయంలో పెద్దయ్యే కొద్దీ బలీయంగా నాటుకుపోయింది.

    ఇప్పుడు అతనికి ఇరవైయేడు యేళ్ళు. ఇంతవరకు చౌదరిగారి ఇల్లూ, తన ఇల్లూ తప్పితే వేరే ప్రపంచంతోనే సంబంధం లేదు అతనికి. అలా అని వయస్సుకు తగ్గ కోర్కెలు లేవని కాదు. ఇరుగు పొరుగున తన ఈడువాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతుంటే, సాంబయ్య కూడా ఎన్నో పగటి కలలు కనేవాడు. ఒక్కొక్కప్పుడు స్వప్న లోకంలో తన్ను తానే మర్చిపోయేవాడు. ఊహల్తోనే యెన్నో రాత్రిళ్ళు హాయిగా గడిపేవాడు. ఉదయం లేవగానే తనకు పిల్లనిచ్చే దౌర్బాగ్యుడు కూడా ఈ ప్రపంచంలో వున్నాడా అని క్రుంగిపోయేవాడు. దొంగతనం చేసినవాడిలాగ ఆత్మగ్లానితో బాధపడేవాడు. కాని ఈ రోజు.....తన కలలు నిజం కాబోతున్నాయి.

    నిజం కలలంత మధురంగా వుండదని పాపం, ఆ అమాయికుడికేం తెలుసు?

    తెల్లవారితే పెళ్ళి. ఎన్నో ఊహలు ముసురుకుంటున్నాయి. తను భార్యను ఎలా సంతోషపెట్టాలి? తన అంద వికారాన్ని ప్రేమతో మరుగుపరచ గలడా? ఇలా ఆలోచిస్తూనే సాంబయ్య యే తెల్లవారుఝాముకో నిద్రపోయాడు.

    సాంబయ్య నిద్రనుండి లేచేప్పటికి బాగా బారెడు ప్రొద్దేక్కింది. త్వరగా వేడినీళ్ళు పెట్టుకుని స్నానం చేశాడు. రాత్రి శుభ్రంగా ఉతికి ఆరవేసిన బట్టలు కట్టుకున్నాడు. రాత్రికి యేమైనా పండ్లు కొనటానికి బజారుకు బయలుదేరాడు.

    త్రోవలో ఆలోచిస్తూ బండ్లకు, మనుష్యులకు ఎదురు నడిచినందుకు తిట్లు తిన్నాడు. ఒక మామిడిపండ్ల తట్టముందు ఆగి బేరంచేసి ఎక్కువ ధర చెప్పినందువల్ల కొనకుండా ముందుకు సాగాడు. బేరంచేసి కొనకుండా పోతున్నందుకు పండ్ల అమ్మి శాపనార్ధాలు మొదలుపెట్టింది. అందులో ఎక్కువ భాగం తన కురూపితనానికే. సాంబయ్య కనీసం ఈరోజునన్నా తన కురూపితనాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు కాని ప్రతివాళ్ళూ ఈ విధంగా జ్ఞాపకం చేయటం అతని హృదయానికి బాకులు పొడిచి ఎత్తినట్లనిపించింది. "ఛీ, పాడు ప్రపంచం. పాడు మనుష్యులు. కనీసం ఈరోజునన్నా తన కురూపితనాన్ని సానుభూతితో చూడకూదదూ?" సాంబయ్య కళ్ళలో నీరు గిర్రున తిరిగింది.

 Previous Page Next Page