Previous Page Next Page 
ఆమె నవ్వింది పేజి 3

    ఒక మిఠాయి కొట్టుముందు ఆగి, రెండు నూనె లడ్లూ, నాలుగణాల నూనె పకోడీలు కొని గబగబా నడుస్తున్నాడు. ఇంతలో __" కుంటిదో, గుడ్డిదో" అనే శబ్దం చెవుల్లో....కళ్ళు తిరుగుతున్నాయి. శరీరం భారంగా తోస్తున్నది. తడబడుతున్న కాళ్ళు మాట వినటం లేదు.

    "బాబూ! మీ కడుపు పండాలి. పదిమంది పిల్లల్ని కానీ చల్లగా వుండు బాబూ" అని వినిపించింది సాంబయ్యకు రోడ్డుకు ఓ ప్రక్కనుండి. త్రుళ్ళిపడి వెనుదిరిగి చూశాడు. తన్నేనా? అవును. తననే! దాదాపు ఇరవయి సంవత్సరాల  ఒక గుడ్డి అమ్మాయి ఐదు సంవత్సరాల ఒక పిల్లవాని చెయ్యి పట్టుకు నిల్చొని వున్నది. సాంబయ్య సంతోషంతో ఒక అణా ఆమె చేతిలో వేసి ముందుకు సాగాడు.

    చివరకు తనను దీవించేవాళ్ళు కూడా వున్నారు ఈ ప్రపంచంలో కాదు, ఆ అమ్మాయి గుడ్డిది అందువల్లనే తనను దీవించ కలిగింది. తన రూపం చూస్తున్నంతవరకూ ఎవరూ దీవించలేరు. దీవించరు. గుడ్డివాళ్ళు పై పై మెరుగులూ, రంగులూ చూసి ప్రేమించరు. వాళ్ళకున్న హృదయం, కళ్ళున్నవాళ్ళకు వున్నదా? వాళ్ళు కోరేది హృదయం రూపం కాదు. తన దగ్గర రూపం లేదు హృదయం వున్నది. తనకు కాబోయే భార్య కుంటిది కాకుండా గుడ్డిడయితే. నిజంగా తను చాలా అదృష్టవంతుడే. ఇంతసేపూ భయపడ్డ తన తెలివితక్కువతనాన్ని నిందించుకున్నాడు.

    సాంబయ్య ఇంటికి చేరేప్పటికే పిల్ల మేనమామ అతనికోసం ఎదురుచూస్తున్నాడు. "నీకు పిల్లనిచ్చేదీ కాక ఎంతసేపు పంచలు పట్టుకుని పడుండాలి? బయలుదేరూ?" అన్నాడు విసుగ్గా.

    సాంబయ్య ముఖం చిన్నపుచ్చుకున్నది. కిక్కురుమనకుండా లోపలకు పోయి ఒక్క నిమిషంలో చంకలో గుడ్డల మూటతో బయటకొచ్చాడు.

    ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. రెండు ఊళ్ళకు మధ్య దూరం మూడు మైళ్ళు. సాంబయ్యకు రెండు మూడుసార్లు పిల్ల విషయం అడగాలని నోటివరకూ వచ్చింది కాని ఆ పెద్దమనిషి ముఖవైఖరి చూస్తూ ధైర్యం చేయలేకపోయాడు.

    ఊరు దగ్గరకు వస్తున్నది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. కల నిజం కాబోతోంది. ఒకవేళ కుంటిదయితే? నడవలేకపోతున్నాడు.

    ఇద్దరూ ఒక పూరి గుడిసెవైపు నడుస్తున్నారు. అదేనా అత్తవారి ఇల్లు? నడికప్పున ఆకుల్లేవు. ఎర్రమట్టితో కట్టిన ఆ చిన్న గోడల అండలు పడిపోయి వున్నవి. ఎంత జాగ్రత్తగా ఆ చిన్న వాకిలినుండి లోపల ప్రవేశించ ప్రయత్నించినా ఆజానుబాహుడు సాంబయ్యకు దెబ్బ తప్పలా? ఆ దెబ్బకు దిమ్మరపోయిన సాంబయ్య, పిల్ల మేనమామ చెయ్యి పట్టుకుని లాగి, కూర్చో పెట్టేంతవరకూ మామూలు స్థితికి రాలేదు.

    ఎదురుగా కూర్చున్న పిల్లపైన సాంబయ్య దృష్టిపడింది. ఆదుర్దాగా కళ్ళవైపు చూశాడు. వోరగా తననే చూస్తున్న ఆ పెద్ద పెద్ద కళ్ళు క్రిందకు వాలాయి సిగ్గుతో, మరి కాళ్ళో?

    ఇల్లు నాలుగు మూలలా కలియచూశాడు. పిల్చి పిల్లనిస్తామన్న కారణం అర్ధమయింది. సాంబయ్య వాళ్ళ ముందు తనెంతో మెరుగనుకున్నాడు. ఇంత దరిద్రులకు తనకంటె మించినవాడు ఎక్కడా దొరుకుతాడు? సాంబయ్యలో అహంభావం రేకెత్తింది. ప్రక్కన కూర్చున్న ఆ పెద్దమనిషి గొంతు నులిమేద్దామా అన్నంత కోపం వచ్చింది. ఈ భాగ్యానికేనా తనను ఇంత భయపెట్టాడు. పిల్ల కుంటిదయితే ఈ పెళ్ళికి తను ఏమాత్రం అంగీకరించడు. పిల్ల కుంటిదో కాదో తేల్చుకోవటం యెలా? ఒక ఉపాయము ఆలోచించి దీన వదనంతో ఒక మూల నిల్చొని వున్న ఆ పిల్ల తల్లిని మంచినీళ్ళు అడిగాడు. ఆమె సాంబయ్య హృదయంలోని భావాన్ని గ్రహించినట్లు పిల్లకు సైగ చేసింది. వెంటనే లేచి మంచినీళ్ళు కుండవైపు నడిచింది పెళ్ళికూతురు.

    పిల్ల కుంటిదీ కాదు, గుడ్డిదీ కాదు. పెద్ద అందమైనది కాకపోయినా ఆకర్షణీయంగానే వుంది. సాంబయ్యకు అంతులేని సంతోషం కలుగుతూంది. అతనికిదంతా ఒక కలలాగా వుంది.

    సాయంత్రం భోజనంచేసి సాంబయ్యా, అతని భార్యా బైలుదేరారు ఇంటికి ఒక వంటెద్దు బండిలో ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. పిల్లను చూస్తున్న కొద్దీ సాంబయ్యకు తన కురూపితనం గుర్తుకొస్తున్నది. పిల్ల ముఖంలో విషాదచ్చాయలేమీ లేనందువల్ల సాంబయ్యకు కొంత తృప్తి కలుగుతోంది.

    సాంబయ్య పిల్లతో మాట్లాడాలని ప్రయత్నించి కూడా, ఏమి మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు. ఆమె తనను చూడటం లేదనుకున్నప్పుడు చూసేవాడు. పొరపాటున ఇద్దరి కళ్ళూ కలిసినవా, ఏదో విచిత్ర సంకోచంలో పడేవాడు. కళ్ళ రెప్పలు వాటంతటవే సిగ్గుతో, బరువుగా వాలేవి. సర్దుకుని కూర్చునేవాడు.

    దాదాపు రాత్రి ఎనిమిది గంటలకు బండి సాంబయ్య ఇంటిముందు ఆగింది. అతను దిగి బందివాడికి కూలిచ్చి తడిక ఊడదీస్తున్నాడు. ఒకరి పిలుపుకు ఎదురు చూడకుండానే ఆ అమ్మాయి వచ్చి సాంబయ్య ప్రక్కనే నిలబడ్డది. ఇద్దరూ మౌనంగానే లోపల ప్రవేశించారు. కుక్కిమంచం వాల్చి ఆ అమ్మాయి కళ్ళల్లోకి కూర్చోమన్నట్లు చూశాడు. ఇద్దరికీ సిగ్గు వేసింది. సాంబయ్యకు గొంతు పెకిలి రావటం లేదు. నాలుక ఆడదు, పెదిమలు కదలవు. తన అసమర్ధతకు సిగ్గుపడుతున్నాడు. ఎలాగో ధైర్యంచేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని కూర్చోపెట్టాడు. ఆ స్పర్శతో సాంబయ్య హృదయ తంత్రులన్నీ ఒక్కమారుగా స్పందించాయి. ఏదో అపూర్వమైన స్వర్గీయానందంతో ఊపిరాడటం లేదు. ఆ అమ్మాయి తలొంచుకొని కూర్చున్నందువల్ల ఆమెలో కలిగే భావోద్రేకాలను సాంబయ్య గ్రహించలేక పోతున్నాడు.

    యెలాగయినా ధైర్యంచేసి పలకరించాలి. ఒక్కసారి గట్టిగా సకిలించి గొంతు సరిచేసుకుని, వణుకుతున్న స్వరంతో అడిగాడు. "నీ పేరేంటి".

    ఆ అమ్మాయి అలానే తలవంచుక్కూర్చున్నది ఈసారి ఇంకా కొంచెం ధైర్యంగా అడిగాడు. జవాబు లేదు. ఒకటికి నాలుగుసార్లు అదే ప్రశ్న వేశాడు. లాభం లేకపోయింది. సాంబయ్యకు కోపమొచ్చింది. తనంటే ఈ పిల్లక్కూడా అలుసే. బహుశా తన రూపంచూసి మాట్లాడ బుద్ధి పుట్టటంలేదు లాగుంది.

    కోపంతో మొరటుగా ఆ అమ్మాయి గడ్డం పట్టుకుని తల పైకెత్తుతూ గర్జించాడు. "నీ పేరేమంటే మాట్లాడవేం?" ఆ అమ్మాయి విశాల నేత్రాల్లో నీరు క్రమ్మి వుంది. ఆమె సన్నని శరీరం పెనుగాలిలోని లతలాగ కంపించిపోతున్నది. వణుకుతున్న చేతిని పైకెత్తి సైగ చేసింది. "తనకు మాటలు రావని...."

    సాంబయ్య నెత్తిన పిడుగు పడ్డట్లయింది. గుండెలు బరువెక్కినయి. కళ్ళముందు చీకట్లు క్రమ్ముకుంటున్నాయి. రెండు చేతుల్తో జుట్టు పీక్కుంటూ 'మోసం' అంటూ గట్టిగా అరిచాడు. ప్రక్కన కూర్చుని, రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ అమ్మాయి రెక్క పట్టుకుని బట బట బయటకు ఈడ్చి తడిక బిగించాడు.

    మంచంమీద బోర్లాపడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అలా ఎంతసేపు ఏడ్చాడో తనకే తెలియదు. హృదయం కొంచెం తేలికపడ్డది.

    ఇంక ఆలోచించలేకపోయాడు. వెంటనే లేచి బయటకెళ్ళాడు. మనిషి అలికిసి కాగానే ఆ అమ్మాయి సాంబయ్య కాళ్ళు గట్టిగా పట్టుకుని ముఖాన్ని పాదాలమీద వుంచి వెక్కి వెక్కి ఏడుస్తూంది. సాంబయ్య హృదయం తరుక్కుపోయింది. అతని కళ్ళనుండి కారే వేడి కన్నీళ్ళు ఆ అమ్మాయి తలను తడుపుతున్నాయి. సాంబయ్య వంగి రెండు చేతుల్తో ఆ అమ్మాయిని పైకెత్తి హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు.

 (ఇది నేను రాసిన మొదటి కథ. అచ్చయిన మొదటి కథ కూడా ఇదే. 1952 లో "ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక"లో ప్రచురించబడింది.)

 Previous Page Next Page