ఇదీ కధ!
వాసిరెడ్డి సీతా దేవి
వన్ - టు- గో....
అమ్మాయిలు ఆరుగురూ ముందుకు దూకారు, అబ్బాయిలు అరవై మంది యీలలు వేశారు. కేకలు వేశారు. కొందరు అమ్మాయిలు ఎగిరెగిరి గంతులు వేస్తూ చప్పట్లు కొట్టారు.
"కమాన్! మాధవీ! ఫినిషిట్!" ప్రేమ్ సాగర్ గొంతెత్తి అరుస్తున్నాడు. మాధవి మెడ ప్రక్కకు తిప్పి ప్రే మ్ సాగర్ వైపు చూసింది.
"కమాన్! హరి అప్ రా!" నలుగురు అబ్బాయిల గొంతులు ఒక్కసారిగా మోగాయి.
రాణి ముందుకు వచ్చింది, మాధవి వెనుకపడింది.
అటూ ఇటూ చూడకు పరుగెత్తు" ప్రేమ్ సాగర్ ట్రాక్ ప్రక్కనే పరుగు లంకించుకున్నాడు.
హైదరాబాదు మలక్ పేటలో గుర్రాలు పరుగెడుతున్నాయి. కాలేజి మైదానంలో అమ్మాయిలూ పరుగెడుతున్నారు. హంటర్స్ తమ ఫేవరేటు గుర్రాలను పిలుస్తున్నారు. అబ్బాయిలు తమ ఫేవరేటు అమ్మాయిలను పిలుస్తున్నారు.
"కమాన్ మాధవి" ప్రే మ్ సాగర్ గొంతు చించుకుని అరిచాడు.
వందమీటర్లు పరుగు పందెం ఆఖరి ఘట్టంలో పడింది. ప్రేమ సాగర్ ట్రాక్ ప్రక్కన పరుగెడుతూ అయాసపడిపోతున్నాడు. ఫినిషింగ్ పోస్టుకు ముందు నిలబడి పళ్ళు బిగించి పరుగెడుతున్న మాధవిని చూసి రెండు చేతులు ముందుకు చాచాడు.
మాధవి ప్రేమ్ సాగర్ చేతుల్లో వాలిపోయింది.
2
కాలేజి దియేటరు కిటకిటలాడి పోతుంది. ముందు వరుసలో పుర ప్రముఖులు, పేరంట్స్ కూర్చున్నారు. విద్యార్ధులు, విద్యార్ధినులు ఉత్సాహంగా తిరుగుతున్నారు. సగానికి పైగా బెల్ బోటమ్స్ - నాలుగో వంతు జీన్స్.
ప్రిన్సి పాల్ మైకు ముందుకు వచ్చాడు.
"ఈనాటి బహుమతి ప్రదానోత్సవానికి జిల్లా జడ్జి శ్రీ రామనాధం గారిని అధ్యక్షత వహించమనీ , జిల్లా సూపరింటెండెంట్ శ్రీ సాంబశివరావు గారిని కాలేజి అవిష్కరించమని, జిల్లా మెడికల్ ఆఫీసర్ శ్రీ వి.వి. యస్. మూర్తి గారిని బాహుమతి ప్రదానం చేయమని కోరుతున్నాను. దయ చేసి వారంతా స్టేజి మీదకు రావాలని ప్రార్ధిస్తున్నాను.
కరతాళ ధ్వనుల మధ్య ఒక్కొక్కరే స్టేజి మీద కొచ్చి కూర్చున్నారు.
ప్రార్ధన - అధ్యక్షుని తొలిపలుకులు సావనీర్ ఆవిష్కరణ జరిగిపోయింది. విద్యార్ధి, విద్యార్దినులలో ఆతృత పెరిగి పోతుంది.
"ఇక పోటీలలో గెల్చిన వారికీ బహుమతి ప్రదానం జరుగుతుంది" ప్రిన్సిపాల్ మాటలు హాలులో చెలరేగిన కేకలు ఈలల్లో మునిగిపోయాయి.
విద్యార్ధి యూనియన్ సెక్రటరీ పేర్లు చదువుతున్నాడు. డాక్టరు మూర్తి కప్పులు - పతకాలు - మెరిట్ సర్టిఫికెట్లు అందిస్తున్నాడు.
"షటిల్ సింగిల్స్ చంపియన్ మాధవి యం. ఎ . సెకండ్ ఇయర్". ప్రేమ్ సాగర్ మాధవిని ముందుకు నెట్టాడు. హాలులో చప్పట్లూ, యీలలు మోగాయి. మాధవి చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. స్టేజి మీదకు వేగంగా నడిచింది.
"కంగ్రాచ్యులేషన్స్" డాక్టర్ మూర్తి మాధవి చేతికి కప్పు అందిస్తూ అన్నాడు. మాధవి డాక్టరు మూర్తికి నమస్కరించి కప్పు అందుకోడానికి ప్రయత్నించింది. చేతులు వణికాయి. "ఎలాగో కప్పు అందుకొన్నది. కప్పు అడుగు భాగం చేతిలో నుంచి జారి కింద పడింది' అమ్మాయిలూ- అబ్బాయులూ గోలగా అరిచారు. చేతిలో వున్న కప్పు కూడా కిందకు జారింది. హాలులో అల్లరి పెరిగింది. కిందపడ్డ కప్పు అందుకొంటున్న మాధవికి సహాయం చేయడానికి డాక్టరు మూర్తి ముందుకు వంగాడు. దగ్గరగా వచ్చిన డాక్టరు ముఖాన్ని చూసి మాధవి , చేతిలో వున్న కప్పును మళ్ళీ వదిలేసింది! ఈసారి స్టేజి మీద వున్నవాళ్ళు కూడా బిగ్గరగా నవ్వారు. ద్వితీయ బహుమతి అందుకోవడానికి వచ్చిన రజని కింద వున్న కప్పును అందుకొని మాధవి చేతిలో పెట్టింది. తడబడే అడుగుల్తో మాధవి స్టేజి దిగింది.
అధ్యక్ష స్థానంలో కూర్చున్న మాధవి తండ్రి రామనాధం గారు చిరాకు పడి ముఖం చిన్న బుచ్చుకున్నారు.
"చీటాలా పరుగెత్తిన నీ ఫేవరేట్ కుందేలు పిల్ల అయిందేమిటిరా సాగర్" అంటూ శ్రీకాంత్ ప్రే మ్ సాగర్ వీపు మీద చరిచాడు.
"స్టేజి ఫియరు లేరా" అన్నాడు సారధి.
"కాదు స్టేజ్ ఫీవరు" అన్నది రాణి.
సాగర్ తన చుట్టూ వున్నవాళ్ళ నుంచి తప్పుకొని మాధవి దగ్గర కొచ్చాడు. స్టేజి ప్రక్కన అయోమయంగా చూస్తూ నిలబడ్డ మాధవిని చూసి "ఏమిటి! ఏమైంది మాధవీ" అని అడిగాడు.
"ఏం కాలేదు! ఏమిటో అలా అయింది." నసిగింది మాధవి.
మరో పది నిమిషాల పాటు విజేతలకు బహుమతులు ఇవ్వడం కొనసాగింది.
"వంద మీటర్లు పరుగు - ప్రధమ బహుమతి - కుమారి మాధవీ - " మైకులో వినబడగానే ఈలలు కరతాళధ్వనులతో హాలంతా నిండిపోయింది.
"మాధవీ! నిన్నే వెళ్ళు" ప్రేమ్ సాగర్ ఆమె చేతిలోని కప్పు అందుకొని తొందర పెట్టాడు. మాధవి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుని ధైర్యాన్ని కూడతీసుకుని గబగబా స్టేజ్ ఎక్కింది. ఈసారి ఉత్సాహ పూరితంగా కరతాళధ్వనులు హాలులో వినపడ్డాయి. సభికుల కేసి ఓసారి చూసి, డాక్టరు మూర్తి కేసి తిరిగింది. డాక్టరు మూర్తి ప్రెషర్ కుక్కరు తీసి "పాపా , నీకు వంట వచ్చా" అన్నాడు. స్టేజి మీద వున్న వారంతా నవ్వారు. అధ్యక్షుడు రామనాధం గారు కూడా చిరునవ్వు విసిరారు కూతుర్ని చూస్తూ.
డాక్టరు మూర్తి ముందుగా వంగి మాధవికి ప్రెషర్ కుక్కర్ ను అందించారు. నవ్వుతూ వున్న మూర్తి కళ్ళల్లోకి చూసింది మాధవి.
సేప్టీ వాల్వు ఎగిరి ఇంటి కప్పుకు తగిలింది! జుయ్ మంటూ స్టీము లేచింది! "పాపా నీకు వంట వచ్చా" చెవులు గింగుర్లేత్తాయి.
నీటి ఆవిర్లు ముఖం మీద అలుముకున్నాయి. సెగల పోగల మధ్య డాక్టరు ముఖం మసక మసకగా కన్పించింది. స్టేజి మీద వాళ్ళూ కిందా, హాలులో ఉన్నవాళ్ళూ పైనా తిరుగుతున్నారు.
మాధవి చేతిలో నుంచి ప్రెషర్ కుక్కరు జారి పడింది! కిందకు వాలిపోతున్న మాధవిని పట్టుకోబోయిన డాక్టరు మూర్తి మైక్ కిందకు తోశాడు. జడ్జి రామనాధం గారు ఒక్క వూపున కుర్చీలో నుంచి లేచారు. ఆ కుదుపుకు టేబిలు మీదున్న ప్లవర్ వాజులూ, దండలూ కిందపడ్డాయి. సాగర్ ఆదుర్దాగా స్టేజి మీదకు పరుగెత్తాడు.
"మీరంతా దూరంగా నిలబడండి. గాలి రానివ్వండి" డాక్టర్ మూర్తి మాధవి చుట్టూ మూగిన వాళ్ళను చూసి హెచ్చరించాడు."
"ఏమైంది డాక్టరు గారూ! మాధవి తండ్రి ఆదుర్దాగా అడిగాడు.
"నధింగ్ టు వర్రీ, ఫైంట్ అయింది అంతే."
"డాక్టర్ గారూ?"
"ఫరవాలేదు డోంట్ వర్రీ, త్వరలోనే స్పృహ వస్తుంది. చల్లటి నీళ్ళు తీసుకు రండి."
"దయ చేసి నిశ్శబ్దంగాకూర్చోండి. స్టేజి మీద కొచ్చిన వాళ్ళంతా దిగిపోవాలి" ప్రిన్సిపాల్ విద్యార్ధులను అర్ధించాడు.
3
"నమస్తే"
"హలో సాగర్, కమాన్"
"మాధవి ఎలా వుంది"
"ఓ.కే. షి ఈజ్ అల్ రైట్. అలా కూర్చో" రామనాధం గారు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ సోఫాలో నుంచి లేచి నిలబడ్డారు.