సాంబయ్యకు ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళెవరూ లేరు. పుట్టిన రోజే అమ్మ కరువయింది. అయిదో ఏడు వచ్చేప్పటికి అయ్యపోయాడు. ఇక తన భారమంతా అరవై ఏళ్ళ అవ్వమీద పడింది.
అరవై ఏళ్ళ ముసలి అవ్వ! పాపం, జీవితంలో మిగిలిన ఆ కొద్ది రోజులూ, కృష్ణా రామా అంటూ కుక్కిమంచంలో గడపవలసిన దానికి ఇరుగు పొరుగు ఇండ్లలో అడ్డమైన చాకిరీ అంతా చేసి, ఇంత కూడు తినేలాగ చూడవలసిన భారం తానే మోయవలసి వచ్చింది.
ఆ అవ్వా గతించింది. తను ఇంతవరకూ బ్రతుకును అలా భారంగా లాక్కు వస్తున్నాడు. దరిద్రం, కురూపితనం....కాని, ఈనాడు....?
సాంబయ్య ఆవు పాలు పితికేందుకు కూర్చున్నాడు. అంత సంతోషంలోనూ అతనికి గత జీవితంలోని ఘట్టాలు స్పురణకు వస్తూనే వున్నాయి ఒక పీడకలలాగ.
వెనుక ఏదో చప్పుడైంది. వెంటనే వెన్ను పూసమీద తన్నినట్లు అమ్మగారి గర్జన "ఓరి నీ శిరసు మండా! ఏమిట్రా ఆవు కాళ్ళముందు కూ...."
సాంబయ్య త్రుళ్ళిపడ్డాడు. గబగబా పాలు పితకసాగాడు. అతని మనస్సు కళ్ళెంలేని బలిసిన గుర్రంలాగ చెంగు చెంగున పరుగులు తీస్తూంది.
అవ్వ అతన్ని ఎన్నడూ బయటకు పోనిచ్చేది కాదు. ఒకవేళ ఖర్మం చాలక వెళ్ళినా, తోటి పిల్లల్తో యెలా మెలగాలో అర్ధమయ్యేది కాదు. పిల్లలు కూడా సాంబయ్యను తమ ఆటల్లో చేరనిచ్చేవారు కాదు. పైగా 'చెదల ముఖం' అంటూ గేలి చేసేవారు. చివర చివరకు బయటికి వెళ్ళటం పూర్తిగా మానుకున్నాడు.
పాల తప్పాలతో వంటింటివైపుకు నడుస్తున్నాడు, యధాలాపంగా వెంకన్న వచ్చి తన మేనకోడల్ని ఇస్తానంటే తను నమ్మలేదు సుమా! అతి కష్టంమీద చివరకు నమ్మవలసి వచ్చింది.
రేపే పెళ్ళి, తనింతవరకూ యే ప్రయత్నమూ చేయలేదు. కనీసం పెళ్ళికూతురికి ఒక చీర అయినా కొనలేదు. జీతంలో రెండు రూపాయలు మాత్రం మిగిలివున్నాయి.
ఇలా ఆలోచిస్తూ పోతున్న సాంబయ్య కాలికి వంటయింటి గడప కొట్టుకుని బొక్కబోర్లా పడ్డాడు. ఆ శబ్దానికి ఇంట్లో వున్నవాళ్ళంతా వచ్చి మూగారు. వంట ఇల్లంతా పాలమయం, సాంబయ్య రాబోయే ప్రమాదాన్ని ఊహించుకుంటూ, వణుకుతూ నిల్చున్నాడు ఒక మూల.
చౌదరి భార్య మాలక్షమ్మగారు ఇవ్వాళ ఎ గుణాన వున్నారోగాని, కోపానికి మారుగా జాలి కలిగింది సాంబయ్య మీద ఆమెకు. దగ్గరకెళ్ళి అడిగింది. "ఏంరా, ఇవ్వాళ చాలా పరధ్యానంగా వున్నావూ! మీ అవ్వ గుర్తొచ్చిందా?"
"లేదమ్మగారూ!" ఏదో చెప్పబోయి సందేహిస్తున్నాడు సాంబయ్య. గుండెలు కొంతవరకు
కుదుటపడ్డాయి.
మా లక్ష్మమ్మ గారు ముసు ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. బహుశా ఆమెకు తన పెళ్ళిరోజు గుర్తువచ్చి వుంటుంది. "అయితే నా కిన్నిరోజులూ చెప్పలేదేం."
"నాలుగు రోజులు ముందు పిల్ల మేనమామ వచ్చి, శుక్రవారం మంచి లగ్నం వున్నదని చెప్పాడు" అన్నాడు సాంబయ్య.
మా లక్ష్మమ్మగారు ఏదో ఆలోచిస్తూ అడిగారు. "పిల్లను గురించి ఏమైనా అడిగావా?"
"లేదమ్మా!" అన్నాడు సిగ్గుతో తలవాల్చి.
"కొంపతీసి, ఏ కుంటిదో, గుడ్డిదో కాదు గదా?"
మాలక్ష్మమ్మగారి మాటలు చాకుల్లాగ గ్రుచ్చుకున్నాయి సాంబయ్య అమాయక హృదయానికి ముఖం వెల వెల బోయింది. శుభమా అంటూ పెళ్ళిచేసుకోబోతుంటే ఈ శకునిపక్షి దీవనలేంటి? సాంబయ్యకు బలే కోపం వచ్చింది. అతనికి జీవితంలో ఎప్పుడూ, ఎవరిమీదా ఇంత కోపం రాలేదు.