Read more!
Next Page 
మట్టి మనిషి పేజి 1

                                 

 

                                మట్టి మనిషి   
    
                                                              --వాసిరెడ్డి సీతాదేవి

 

                      
    
    చుక్కలు వెలవెలబోతున్నాయి. తొలివెలుగులు మంచుతెరల్ని తోసుకుంటూ వస్తున్నాయి.
    "ఏసోబూ! ఎల్లమందా! ఇంకా దిక్కులు చూస్తారేంరా? వూ! కానియ్యండి."
    "అయ్యగారిదే ఆలస్యం."
    కూలీలంతా తలగుడ్డలు బిగించి కుప్పచుట్టూ కమ్మారు. సాంబయ్య పైపంచ నడుంచుట్టూ కట్టుకుని వరికుప్పచుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి కుప్పమీదకు ఎగబాకి నడికొప్పు పగలదీశాడు.
    కూలీలంతా తలా వో మోపు అందుకున్నారు.
    సాంబయ్య వరిమోపు వాటేసుకుని కుప్పమీద నుంచి దూకాడు.
    "తొలిపన అయ్యగారు నూరిస్తే ఈ ఏడు బంగారం రాల్తుంది." అన్నాడు ఎల్లమంద.
    "అయ్యగారికి ఆనవాయితే గందా!" అన్నాడు ఏసోబు.
    సాంబయ్య పాన పైకెత్తి గాలిలోకి విసిరాడు.
    అరుణకాంతుల్లో నక్షత్రాల్లా వరికంకులు మెరిశాయి. ముందున్న బల్లమీద మూడుసార్లు బది పనవిప్పి కళ్ళంమీదకు విసిరాడు.
    ఏసోబూ, ఎల్లమందా చెరో పనా మార్చి నూర్చి కళ్ళంమీదకు విసిరారు.
    నూర్పిడి బల్లమీద మెరిసిపోతున్న తడిపొడి ధాన్యాన్ని రెండు చేతుల్తో పోగుచేశాడు. సాంబయ్య తన జీవిత సర్వస్వమూ, తన ఐశ్వర్యమూ అయిన ధాన్యాన్ని ఆప్యాయంగా చూసుకొని ఎల్లమందకేసి తిరిగి "ఏరా! ఎట్టా వుంది రాలుబడి?" ఆశగా అడిగాడు.
    తమరు పట్టింది బంగారం. పది పుట్లకేం తక్కువ రాలషు." పరిశీలనగా రాలిన ధాన్యపు కుప్పకేసి చూసి అంచనా చెప్పాడు ఎల్లమంద.
    సాంబయ్య గుండెలు పొంగినై. కండలు ఉబ్బినై, బరబరా మోపులు లాగుతూ బల్లమీద బాదసాగాడు. మిగతా కూలీలంతా సాంబయ్య వూపును అందుకోవడానికి ప్రయత్నించసాగారు.
    బారెడు పొద్దెక్కింది.    
    ఎద్దులు వాడుపుగా కళ్ళం తిరుగుతున్నాయి.
    కళ్ళంచుట్టూ  గడ్డి కడియం నడుం ఎత్తుకు లేచింది. కుప్ప సగం నూర్పిడి అయింది.
    కూలీలు అన్నం మూతలు విప్పుకొని కుంట ఒడ్డున కూర్చున్నారు.
    సాంబయ్య గడ్డిగూటిలో కూర్చొని అన్నంమూట విప్పాడు. కొరివికారప్పచ్చడి కలిసి చేతివాటు ముద్దచేసి ఎత్తాడు.
    "దొరగారూ! దొరగారూ!" రామి ఆదుర్దాగా సాంబయ్య గూటి ముందుకు పరుగెత్తుకొచ్చింది.
    సాంబయ్య నోటిదాకా వచ్చిన ముద్దను గిన్నెలోకి వదిలేసి రామికేసి చిరాగ్గా చూశాడు.
    "నీ సిగతరగ! ఏందే ఆ పొలికేకలూ?"
    "అయ్యగారూ, అమ్మగారికి నొప్పులొచ్చినయ్!"
    సాంబయ్య చివాల్న గూటిలోనుంచి బయటకొచ్చాడు. ఎంగిలి చెయ్యి భుజానవున్న పంచకు తుడుచుకున్నాడు. రామి ముఖంలోకి చూస్తూ అడిగాడు:
    "పిల్లా, పిల్లాడా?"
    "ఇంకా పెసవం అవలేదు. నొప్పులు మోపుగా వున్నాయి! అమ్మగారు అల్లాడిపోతున్నారు. తొందరగా బయలుదేరండయ్యగారూ!" రామి గొంతులో భయం తొణికింది.
    "వోసి నీయమ్మ! మగాణ్ణి నేనొచ్చేం జేస్తానే? చాకలి రత్తికి కబురు పెట్టారా?"
    "మా పుల్లి రత్తి కోసం లగెత్తింది. నేనేమో ఇట్టా లగెత్తుకొచ్చాను."
    సాంబయ్య రాలిన ధాన్యం, ఇంకా కొట్టవలసిన కుప్పకేసి పరకాయించి చూశాడు.
    "సరే, నువ్వు పద! ఎల్తా ఎల్తా చాకలి రత్తి మనింటికి ఇంకా వెళ్ళిందో లేదో చూడు. ఆ ముండేడ చచ్చిందో? ఇంటికాడ లేకపోతే రేవుకాడ వుందేమో చూడు." సాంబయ్య రామిని తొందరచేశాడు.
    ఇంకా ఏమో చెప్పాలనుకున్న రామి, సాంబయ్య ముఖం చూసి గుటక మింగి, వెనక్కు తిరిగి పరుగెత్తింది.
    సాంబయ్య కుంటదగ్గర తాపీగా అన్నం తింటున్న కూలీలను కేకవేశాడు.
    "ఎంతసేపు గూటుతార్రా-ఆ గంజీ? తొరగ ఎక్కండి కుప్పమీదకు!"
    సాంబయ్య కేకలకు కూలీలు తత్తరపోయారు. కుంటలో గిన్నెలు ఆదరాబాదరా కడిగి కళ్ళందగ్గరకు పరుగెత్తుకొచ్చారు.
    సాంబయ్య అన్నం గిన్నెమీద పడ్డ చెత్తపరకలను తీసే తీరిక లేక అంతా కలిపి నాలుగు ముద్దల్లో తిని గూటిలోనుంచి బయటకొచ్చాడు. కూలీలు చుట్టముక్కన్నా కాల్చకుండా పనిలోకి రావడంచేత మందగొండిగా పనిచేస్తున్నారు.
    సాంబయ్య తలగుడ్డ గట్టిగా బిగించి "వొరేయ్ ఎల్లమందా! ఏసోబూ! ఏందిరా ఆ కొట్టుడు? సచ్చు చేతు;ల్నాయాళ్ళలారా! పొద్దు నెత్తిమీద కొచ్చేసరికి నూర్పిడి అవాలి!" అంటూ కళ్ళంమీద కొచ్చాడు.
    సాంబయ్య ఒడుపుకూ, ధాటికీ కూలీలు సతమతమైపోయారు. నూర్పిడి వడిగా సాగింది. బంగారు తీగలు జడివానలా కురిశాయి.
    పొద్దు నెత్తిమీదకు వచ్చేసరికి కుప్పకొట్టడం అంతా అయిపోయింది. సాంబయ్య గబగబా ధాన్యం రాసిపోయించాడు. చుట్టూ గీతలు గీసి ఆనవాళ్ళు పెట్టుకున్నాడు.
    "ఎల్లమందా! ఇట్రా!" అని అరిచాడు.
    ఎల్లమంద చేతులు కట్టుకొని ఎదురుగా నిలబడ్డాడు.
    "ఒరేయ్! నేపోతున్నా! పొద్దుకూకేలోపల మళ్ళీ వస్తా. ఈలోపల గడ్డంతా తొక్కించి కింద గింజలన్ని వేరే రాసి పోయించు."
    "అట్టాగే దొరా!"
    "అట్టాగే అంటే కాదురోయ్. గడ్డి బాగా దులపాలి కడెంలోకి గింజపోయిందో పంబరేగిందే! తెలుసా?"
    "అదేంటయ్యగోరూ! తవరు సెప్పాలా! నాకు తెల్దా?"
    సాంబయ్య ఎల్లమందను దగ్గరగా పిల్చి మెల్లగా చెప్పాడు:
    "ఆ కుంటిగాడ్ని, దమ్మిడీ గాడ్ని వో కన్నేసి వుంచు. ఎందుకయినా మంచిది!"
    అంత నమ్మకం తనమీద వుంచినందుకు ఉబ్బితబ్బిబ్బై "అట్నే దొరా!" అన్నాడు ఎల్లమంద.
    సాంబయ్య చేలో పనిచేస్తున్న వాళ్ళందర్నీ పరకాయించి చూసి "మన చేనుదాటి పిట్ట బయటకు పోకూడదు! తెలిసిందా? తూర్పార వేళకు నే నొస్తా. గింజ పోకూడదు. తెలిసిందా!" అంటూ హెచ్చరించేడు.
    తలకు బిగించిన పైపంచ విప్పి భుజాన వేసుకొని గూటి పక్కన వున్న ముల్లుగర్ర అందుకొని సాంబయ్య ధాన్యంరాసి, కల్లాంపైకిలేస్తున్న గడ్డి కడియం, మరోసారి పరికించి పనిచేస్తున్న కూలీలను తేరిపారచూసి బయలుదేరాడు.
    సాంబయ్య పాదాల ధాటికి మాగాటి గనెం జవజవలాడిపోతుంది. ఆజానుబాహువులు గరుత్మంతుని రెక్కల్లా పంటగాలిని చీలుస్తున్నాయి. అతని చేతిలోని ముల్లుగర్ర ఆదిశివుని శూలంలా ఆకాశంకేసి చూస్తోంది. ఆరడుగుల నిండైన విగ్రహం. కోడెతాచులాంటి వయస్సులో వున్న అతని నరాలు - కాయ కష్టంలో కండలు తిరిగిన కండరాలను ధనస్సును లాగిపట్టిన నారిలా బిగించి పట్టివున్నాయి. మెలితిరిగిన అతని మీసాలు గవదలు దాటి గాలిలో ఆడుతున్నాయి. ఒత్తుగా మెడల మీదకు జారిన అతని జుట్టూ, నాగలిదుంపలా మొనతేలిన ముక్కూ, తీక్షణమైన చూపులూ, ఆ నడక తీరూ - అంతా భూమిని నమ్మి, భూమిమీదే బతికే మనిషిలా వున్నాడు సాంబయ్య.
    తన అయిదెకరాల మాగాణి ఖండ్రిక గనెందాటి కాలవగట్టుమీద కొచ్చాడు సాంబయ్య. కాలవగట్టు మీద ఒక క్షణం ఆగి తన మాగాణి చూసుకొన్నాడు.
    ఆ భూమి - ఆ బంగారు భూమి తనది. దాన్ని తన తల్లీ తండ్రీ అహర్నిశలూ శ్రమించి ఆర్జించారు. తను చెమటోడ్చి, రాయీ రప్పాతీసి బాగుచేసుకున్నాడు. తన భూమికి - తన ఆస్తికి వారసుడు పుట్టబోతున్నాడు. తన వంశోద్దారకుడు ఈపాటికి భూమిమీద పడివుంటాడు.

Next Page