"సో సారీ!"
"నెవర్ మైండి. ఇంతకీ నీ ప్రాబ్లమ్ ఏమిటి? చాలా సేపటినుంచీ నిన్ను గమనిస్తూనే వున్నాను. చెప్పు!" అంది చూపుడు వేలితో కళ్ళనీరు తుడుచుకొంటూ అడిగింది అవంతి.
ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తోన్న రమణి నోరు విప్పి ఏదో చెప్పబోయింది. కానీ అంతలో ఎవరో తలుపుపైన మునివేళ్ళతో కొట్టిన చప్పుడైంది.
అవంతి బద్దకంగా లేచి వెళ్ళి తలుపు తీసింది.
శ్యామల, కుసుమ గుమ్మం అవతల నిలబడి వున్నారు.
"ఏమిటీవేళప్పుడు ఊడిపడ్డారు" అంటూ వాళ్ళిద్దరూ లోపలికిరాగానే తలుపులు వేసింది అవంతి.
శ్యామల గ్లాసు జగ్గులోంచి నీళ్ళని గ్లాసులోకి వంపుకొని తాగి వచ్చి కూర్చుంది.
"టరమ్ ఫీజు, హాస్టల్ ఫీజు కట్టాలన్నావు. ఏం చేశావు?" అడిగింది అవంతి శ్యామలని.
శ్యామల నవ్వింది.
"ప్రాబ్లమ్ సాల్వడ్!" అంది శ్యామల.
"ఎలా?"
"ఎం.ఎల్. ఏ. ఏడుకొండలు గారి కొడుకు సురేష్ కట్టేశాడు వాడెన్నాళ్ళనించో నావెనకపడుతున్నాడు నిన్న బస్ స్టాపులో నించుని వుంటే వచ్చి పలకరించాడు. మాట్నీకి రమ్మన్నాడు. వెళ్ళాను పసివాడు. ఇంటర్వెల్లో ఇండెంట్ వేశాను. ఇవాళ వచ్చి కట్టేశాడు" అంది శ్యామల.
"బాగానే వుంది. కానీ నువ్విలాంటి పనులు చేయడం నాకిష్టంలేదు. శ్యామలా, నీకు డబ్బు ఇంటి దగ్గరనించి వస్తున్నా ఈ కరువెందుకో అర్థం కావడంలేదు!" అంది అవంతి.
"నాకు మంచి చీరలు లేవు. ఏం చేయను?" అంది శ్యామల జాలిగా.
ఆమె మాటలకి అవంతి జాలిపడింది. నిజమే ఆడదానికి నగలు గట్రా లేకపోయినా కట్టుకోడానికి కనీసం మంచి చీరలు వుండాలి. మంచిచీరలు లేక తనుమాత్రం ఎంత అవస్థపడలేదు. కానీ శ్యామల మరీ అంత హీన స్థితిలో లేదు.
"నీ సంగతి ఏమిటి?" కుసుమని అడిగింది అవంతి.
"నా దగ్గర పాకెట్ మనీకూడా లేదు" అంది కుసుమ.
"ఇదో ప్రాబ్లమా?"
"కాదు"
"మరి?"
"డాడీ పంపిన డబ్బు అయిపోయింది."
"నీ దగ్గర నాలుగు రూపాయలుంటే నీకొళ్ళు తెలీదు. నలుగుర్ని పోగేసి సినిమాలు చూసేస్తావు. రూపాయికి విలువ లేకపోవచ్చు. కానీ అవసరం కలిగినప్పుడు ఆ రూపాయి వందగా కనబడుతుంది కుసుమా! లీప్ ది టాపిక్. నిన్న నీతో వున్న కుర్రాడెవరు?"
"రైస్ మిల్ ఓనర్ వెంకోజీ గారబ్బాయి. పేరు ఆనంద్. ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్" చెప్పింది కుసుమ.
"డియర్ ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు బాయ్స్ తో తిరగడం తప్పనడం లేదు. మగాళ్ళల్లో చాలా రకాలు వుంటారు. కేవలం వెంట తిరిగి సరదాపడేవాళ్ళు, కేవలం పొందుకోసం తపించేవాళ్ళు మరికొందరు మాట్లాడి తృప్తిపడేవాళ్ళు..... ఇలా..... అయితే గేలం వేసి చేపని పట్టాలనుకునే మగాళ్ళకి ఆ గేలానికి తగిలినట్టు కనిపించాలి. నమ్మించాలి. అంతే! అవసరం తీరాక ఎరని మింగేసి గేలాన్ని కొరికేసి పారిపోవాలి. తప్పు చేయకండి. కాలుజారకండి" అంది అవంతి.
"థాంక్స్, కానీ నిన్నో మాట అడగనా?" అడిగింది శ్యామల.
"ఏమిటి?"
"మా విషయంలో ఇన్ని జాగ్రత్తలను చెప్పే నువ్వు....." ఆగిపోయింది శ్యామల.
అవంతి పెదవుల పైన చిన్న నవ్వు కదలాడింది.
"నా కథ వేరు. నీళ్ళ నుంచి వడ్డున పడిన చేపని నేను. అందుకే ఆ అనుభవంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." అంది.
కుసుమ, శ్యామల, అభినందన పూర్వకంగా చూసారు అవంతివేపు.
రమణి మాత్రం నిర్లిప్తంగానో, ఉదాసీనంగానో వుండిపోయింది. ఆమె ఏదో చెప్పాలనుకొని చెప్పలేని సంకట స్థితిలో వున్నట్టుగా కనబడుతోంది.
"రమణీ." అని పిలిచింది అవంతి. రమణి తలెత్తి చూసింది.
"మనం నలుగురం ఇంచుమించుగా ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం! బ్రతకడానికి దారి వెదుక్కొంటున్నామే గానీ, మన బ్రతుకులేనాడో గమ్యాన్ని పోగొట్టుకున్నాయని మనకి తెలుసు. నాకు మీరు, మీకు నేనూ అండగా నిలవాలి. సిగ్గుగానీ, భయంగానీ అవసరం లేదు. చెప్పవే" అంది అవంతి.
రమణి కళ్ళలోకి నీరు చిప్పిల్లింది.
తలెత్తి ముగ్గురి కేసి చూసి తలొంచుకుంది.
"తల దించకు, తల దించుకోవాల్సింది సమాజం. మనం ఈ విధంగా నలిగిపోవడానికి కారణం ఈ వ్యవస్థ. మనని ప్రశ్నించే సమాజాన్నే వేలెత్తి సూటిగా చూపించగలిగే తెగింపూ గుండె ధైర్యం, మొండితనం, మనకుండాలి తిరగబడ్డానికి సిద్ధమవ్వాలే కానీ ఓడిపోయి ఆత్మహత్యకి మాత్రం అవకాశం ఇవ్వరాదు. అది నా ప్రిన్సిపాల్."
రమణి మాట్లాడలేదు. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.
అవంతి కొన్ని క్షణాలపాటు రమణికేసి చూస్తూ వుండిపోయింది కానీ రమణి ఏడుస్తూనే వుంది.
"ఏడవకు. ఏడిస్తే నాకు చిరాకు. ప్రతిచిన్న విషయాన్నీ ఓ సమస్యగా ఊహించుకొని దాన్ని భూతద్దాల్లోంచి చూచి దడుసుకొని ఏడవడం చేతకాని తనం అవుతోంది. కన్నీటి విలువ నీకు తెలీకపోవచ్చు, ఆ కన్నీళ్ళు అవసరానికి పనికి వస్తాయి. వాటిని వృధాచేయకు" అంది అవంతి.
రమణి ఎర్రబడిన కళ్లతో చూస్తూ "నాకు అనుమానంగా వుంది" అంది.
"ఏమిటా అనుమానం!"
"నేను..... నేను...... తల్లినవుతున్నానని - "
ఆ మాటలకి అవంతి పగలబడి నవ్వేసింది.
"బాగుందే, ఈ మాత్రం దానికేనా ఈ రాద్ధాంతం. ఓ విధంగా ఇది గుడ్ న్యూసే. దేశాన్ని ఉద్ధఱించగల దాన్నని నిరూపించుకున్నావు." అంది అవంతి.