Next Page 
మహాశక్తి పేజి 1

                                    మహాశక్తి
                                                                                        ----    : చందు సోంబాబు

    అశ్వత్థము, అష్టపత్రిక ఆకుల రెపరెపలమధ్య గలగలల మధ్య ఊసులాడుకొంటున్నాయి.

    మెత్తని పచ్చని పచ్చికపైన తలకింద చేతులు పెట్టుకొని అభ్రమణిలా వెలిగిపోతూ పడుకొని ఉన్నాడు ఈశ్వర్.

    కాలేజీ లోపల క్లాసుల్లేని కొందరు విద్యార్ధులు అక్కడక్కడా జట్లు జట్లుగా గుమిగూడి ముచ్చట్లు చెప్పుకొంటున్నారు.

    ఈశ్వర్ కీ ఫస్టవరు లేదు.

    సాధారణంగా ఒంటరిగా ఉండడు ఈశ్వర్. అలాంటి మనిషి ఒంటరిగా చెట్టుకింది పడుకొని విశ్రాంతి తీసుకోవడం కొందరికి ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎప్పుడూ అతని పక్కన అతని వర్గానికి చెందిన వాళ్ళుంటారు.

    నిజానికి తను విశ్రాంతి తీసుకోవడం లేదు. అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు రాబోతున్న ఎన్నికల గురించి.

    రావిచెట్టు ఆకులు గలగలలు, నాగమల్లి చెట్టునుంచి వస్తు్న పరిమళాలు అతని ఆలోచనలకి మరింత పదును పెడుతున్నాయి.

    స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ గురించి వ్యూహరచన చేస్తున్నాడతను. అందుకే తన స్నేహితులకి తనను ఓ గంటపాటు ఒంటరిగా విడిచిపెట్టమని చెప్పాడు.

    కేవలం విద్యార్ధి నాయుకుడుగా ఎన్నిక కావడం కాదు ముఖ్యం! నాయకుడుగా ఎన్నికైన వాడు విద్యార్థినీ విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించగలగాలి.

    కానీ రాజకీయ నాయకుల స్వార్ధ ప్రయోజనాలకోసం విద్యార్థుల్ని పావులుగా వాడుకొంటున్నారు. యీ ఎన్నికల్లో ఇలాంటి వాటికి తావివ్వకూడదు. దాని గురించే అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

    ముఖ్యంగా ఆ కాలేజీలో రెండు వర్గాలున్నాయి.

    ఒక వర్గానికి నాయకుడు ఈశ్వర్. రెండో వర్గానికి జగన్నాథ్ ఎలియాస్ జెన్నీ నాయకుడు.

    యీ రెండు వర్గాలకీ మధ్య చాలా కాలంగా వైరం ఉంది. యీ ఇద్దరికీ చెందిన పెద్దవాళ్ళలో ఎప్పుడో అలనాడు చెలరేగిన వైషమ్యాలే యీనాటికీ కక్ష సాధింపు చర్యలుగా మిగిలిపోయాయి. అవే తమ ఊరి నుంచి చదువుకోడానికి ఆ ఊరు వచ్చిన ఆ ఇద్దరి మధ్య రెండు వర్గాల చీలికకు కారణమయ్యాయి.

    ఒక వర్గం మనిషి రెండో వర్గానికి ఒంటరిగా దొరికితే చిత్రహింస అనుభవించాల్సిందే. అందుకనే ఏ వర్గంవారూ కూడా జట్లుగానే ఉంటారు.

    ఎన్ని గొడవలు జరిగినా ఈశ్వర్ మంచి విద్యార్థిగా పేరు పొందాడు. అతని ఆలోచనా సరళి వేరు. స్నేహశీలి. అందుకే అతన్ని చాలామంది ఇష్టపడతారు.

    జెన్నీ పొగరుబోతు. నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాడు. కాలేజీ లెక్చరర్ల దగ్గర్నించీ, విద్యార్థినీ, విద్యార్థుల వరకూ అతనంటే ఏవగింపు. కానీ అతనికున్న పరపతికి నోరెత్తలేని స్థితిలో ఉన్నారు.

    జెన్నీ మేనమామ అంకయ్య. కొన్నాళ్ళు ఎమ్మెల్యేగా చేశాడు. కోర్టు అతని ఎన్నిక చెల్లదని తీర్పుచెప్పడంతో కోరలు పీకిన పాములా తయారయ్యాడు.

    రాబోతున్న జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి బలగాన్ని పోగుచేసుకొంటున్నాడు.

    అక్కడ పచ్చికమీద పడుకొని ఆలోచనలలో మునిగి ఉన్న ఈశ్వర్ని ఒక విషపు చూపు చూసి ముందుకి కదిలాడు జెన్నీ.

    అసౌమ్యమైన ఆ చూపునే గనక ఈశ్వర్ చూసివుంటే అసిపుత్రిని చేతబట్టి ఆ క్షణంలో జెన్నీ పీక కత్తిరించేంత ఉద్రేకపడి ఉండేవాడే

    అదే సమయంలో కాలేజీ వెనక గేటులోంచి యీలపాటపాడుతూ సైకిల్ మీద వస్తున్నాడు రాజు. తమ పక్కకి రానిచ్చి జెన్నీ వర్గంలోని కొందరు రాజుని కిందికి తోసేశారు. అతను సైకిల్ మీద నుంచి కిందపడిపోయాడు. మోచేతులు గీరుకుపోయినాయి. రాజు కిందనుంచి లేవబోతూ తలెత్తి చూశాడు.

    వాళ్ళు నలుగురు. తను ఒక్కడే.

    తనకి మూడిందని రాజుకి అర్థమైంది. వాళ్ళని తనొక్కడే ప్రతి ఘటించలేడు

    తప్పించుకోవాలి.

    ఎలా?

    వాళ్ళు తనను వెకిలిగా, హేళనగా నవ్వుతూ చుట్టుముట్టేశారు.

    వికారంగా నవ్వుతూ పైకి లేవమన్నట్టుగా చిటికెలు వేస్తున్నారు. రాజు అయోమయంగా చూశాడు.

    లేవాలి.


    లేస్తే మళ్ళీ దెబ్బలు తప్పవు.

    లేవకపోతే కాళ్ళతో కుమ్మేస్తారు. ఎలాగైనా జరిగేది ఒక్కటే. తను చాలా తెలివితక్కువతనంగా వాళ్ళకి చిక్కిపోయినందుకు తనని తానే నిందించుకొంటూ చూశాడు.

    క్షణం ఆలస్యం చెయ్యడానికి వీల్లేదు.

    తనకి సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల ఎవరూ లేరని అర్థమైపోయింది రాజుకి.

    ఇలాంటి గొడవలు అతనికి కొత్తవి కాదు. వాళ్ళలో ఎవరైనా తమకి దొరికినా వాడిగతీ ఇంతే?

    కానీ..... తన ఎముకలు విరిచేస్తారని తెలిసే అవకాశం ఇవ్వడం కన్నా అక్కడినుంచి తప్పించుకోడానికే ప్రయత్నం చెయ్యాలి.

Next Page