Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 3


    అలాంటి పరిస్థితుల్లో వున్న రమణి ఓదార్పు మాటలకంటే అలా విషయాన్ని ఈజీ చేసి మాట్లాడ్డం మంచిదని అవంతి అభిప్రాయం.


    "అదో పక్క దిక్కుతోచక ఛస్తుంటే ఏమిటే ఆ మాటలు?" అంది కుసుమ.


    అవంతి నవ్వుతూనే అన్నది.


    "పిల్లని కంటుందో లేక హుష్ కాకి చేస్తుందో?"


    "డాడీకి తెలిస్తే నరికేస్తాడు," అంది రమణి.


    అవంతి అనవసరంగా నవ్విందిప్పుడు.


    "మీ డాడీకి ఎందరే పిల్లలు?"


    "నేనొక్కదాన్నే."


    "ఏడవమను నీ డాడీని, ఒక్కకూతుర్ని సరిగ్గా పెంచుకోలేనివాడు ఓ తండ్రా? తాగుడు, పేకాట, గుర్రప్పందాలు ఆడే నీ తండ్రి తన సుఖం, తన ఆనందం చూసుకొంటున్నాడేగానీ కన్నందుకు బాధ్యతని నిర్వహించలేనప్పుడు నీదారి నువ్వు చూసుకొన్నావు తప్పులేదు. అవసరం అనుకుంటే నువ్వు నీ డాడీని షూట్ చెయ్యి."

    
    అవంతి ఆవేశంతో అన్నమాటలకి ఏ ఒక్కరూ ఎదురుసమాధానం చెప్పలేకపోయారు.


    రమణి మోకాళ్ళపైన తలపెట్టుకుని ఏడుస్తూనే వుంది.


    రమణి తలపైన చెయ్యివేసి ఆప్యాయంగా నిమిరింది అవంతి. ఆ చెయ్యి కారణం తెలీకుండానే లిప్తకాలం వణికింది. అదే సమయంలో ఆమె పెదవుల పైన చిన్న దరహాసం వెలిగింది.


    "చూశావా రమణీ, మనం ఆడవాళ్ళమన్న విషయాన్ని ఎంత చక్కగా గుర్చుచేశావో? మగాళ్ళతో మనం సమాన హక్కుల్ని కోరుతున్నామే కానీ అవి అర్థం లేని కోరికలనీ, ఆడది మగాడితో సమానం కాలేదని నువ్వు ఏడిచే ఏడుపే చెబుతుంది."


    అంతర్లీనంగా ఆమె గుండెల్లో గూడు కట్టుకొని వున్న ఆ మాటలు ఆ గుండె లోతుల్లోంచి బరువుగా వస్తున్నాయి.


    "అలాగని ఎందుకనుకోవాలి?" అంది శ్యామల.


    అవంతి లిప్తకాలం పాటు కళ్ళు మూసుకుంది.


    "ఆడది మగాడి దగ్గర పడుకోవాలి. అలా కాదని మగాడినే కింద పడుకోబెట్టినా నెల తప్పేది ఆడదానికే. ఆడది వీకర్ సెక్స్ కి చెందడం చేత ఆడది ఓ బ్లడీ ఆడదిగానే మిగిలిపోయింది. అందుకే నేను ఆడదాన్నన్న సంగతి ఏనాడో మరచిపోయాను" అంది భారంగా నిట్టూరుస్తూ అవంతి.


    "ఇంతకీ ఏం చేద్దాం?" కుసుమ అడిగింది.


    "దానిష్టం."


    "డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళండి" అంది రమణి భయం భయంగా.


    "ఓ.కె. డన్. శ్యామలా మీకు ఇదే నా వార్నింగ్. ఇలాంటివి జరగడానికి వీల్లేదు. జాగ్రత్తగా వుండండి గుడ్ నైట్" అంది.


    శ్యామల, కుసుమ వెళ్ళిపోయాక గది తలుపులు మూసి వచ్చింది అవంతి.


    "ఈ విషయం చెప్పడానికేనా ఇంత నాన్చావు."    


    "ఏమో నాకు బుద్దొచ్చింది. ఇక ముందు నా జాగ్రత్తలో నేనుండదలచుకున్నాను" అంది రమణి.


    "నిన్నిలా చేయమని ఎవరూ చెప్పలేదు. ఫోర్సుగా చేయించనూ లేదు" అంది అవంతి.


    "అఫ్ కోర్స్......"


    "చూడు రమణి, కేవలం మన అవసరం కోసం చేశాం. డబ్బు మనకి కావాలి. వాళ్ళకి మన దగ్గరుంది కావాలి. అంతవరకే నా ఆలోచన!"


    "దీన్ని వ్యభిచారమంటారు. నలుగురికీ ఈ విషయం తెలిసిన రోజున మనం కట్టకట్టుకొని హుస్సేన్ సాగర్ లో దూకేది." రమణి బొంగురు గొంతుతో అంది.


    "దీన్ని వ్యభిచారమను. మరో మాటను. నేను బాధ పడను వినను. మనం ఇదో బిజినెస్ గా చేయడం లేదు. అవసరం అనిపించినప్పుడు గుట్టుగా ఎవడో వున్న వాడిని పట్టుకొంటున్నాం."


    "వళ్ళు అమ్ముకోడాన్ని ఏమంటారు?" అడిగింది రమణి.


    "దీనికి పెద్ద పెద్ద పేర్లు పెట్టకు. చెప్పాను ముందే. వాడి సరదా మనం తీరుస్తున్నాం. వాడు మన అవసరాలను గట్టెక్కిస్తాడు. దట్సాల్."


    "ఏమో! ఏదో ఒక రోజున పాపం బద్దలై మన రంగుల జీవితం రోడ్డున పడితే మన కుటుంబాల పరువు బజారున పడుతుంది. ఆ పైన చదువుకున్న చదువు, ఇల్లు, పరువు, అన్నీ మరిచిపోయి సానిముండల్లా బ్రతకాలి" అంది రమణి.


    "అలాంటి రోజే వస్తే నేను మనుషుల్ని విరుచుకొని తినే రాక్షసినవుతాను." అని "ఇటు చూడు" అంటూ ఒక కాగితం తీసుకొని దానిపైన పెన్నుతో చిన్న బొమ్మని వేసింది అవంతి.


    అది అస్థిపంజరం బొమ్మ. పుర్రెపైన చిన్న తలపాగా వుంది.


    "ఏమిటీ ఈ బొమ్మ?" రమణి అడిగింది.


    "ఇది నా తండ్రి బొమ్మ. ఎముకల గూడు పైన చర్మం తప్పితే పిల్లి పీకేందుకు కండలేదు. నాకోసం సర్వాన్నీ ధారపోసి నన్నో ఉన్నత స్థానం ఎక్కించాలని ఆరాటపడే ఓ అస్థిపంజరం.


    దిసీజ్ డాడీ.


    ఓల్డ్ గోవింద రాజులు.


    సంపాదనలేదు. అయినా ఆలోచనలో తపన చల్లారలేదు.


    వ్యసనాలు లేవు అయితేనేం డబ్బులేదు. అందుకే నా తండ్రిని ఆయన చివర రోజుల్లో అయినా దగ్గరగా తీసి ఈ గుండెల్లో దాచుకోవాలనీ, సుఖపెట్టాలనీ కూతురిలా కాదు. ఓ తల్లిలా చూసుకోవాలని తపించిపోతున్నాను" అంది అవంతి.


    ఆమెకి తెలీకుండానే ఆమె కళ్ళలోకి నీరు ఉప్పెనలా పొంగింది.


    "నన్నేడవద్దని చెప్పి నువ్వేడుస్తున్నావా అవంతీ!" అడిగింది రమణి.


    అవంతి కళ్ళతోనే నవ్వింది. చెంపలపై నుండి జారుతోన్న కన్నీటిని కనీసం తుడుచుకోడానికి కూడా ఆమె ప్రయత్నించలేదు.

 Previous Page Next Page