"ఇంత చక్కని భార్య ఉన్నవాడు __ విలువైన తన సమయాన్ని ఇతరుల కోసం కవిత్వం చెప్పడానికి వృధా చేయలేడు" అన్నాడు. రామారావు . అతని భార్య వంకనే తదేక దృష్టితో చూస్తున్నాడు. అతని ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. ఉదయం జరిగిన సంఘటన అతని ఆలోచనలకు మరీ మరీ పదును పెడుతోంది.
* * * *
సెలవు రోజు ఉదయం ఎనిమిది గంటలకు కూరల బజారుకి వెళ్ళి అవసరమైన కూరలు తేవడం రావారావుకి రివాజు. అందుకు చాలా కారణాలున్నాయి. కూరల బజారు చాలా రష్ గా ఉంటుంది. పువ్వులాంటి లత ఆ రష్ లో నలిగి పోవడం అతని కేమాత్రమూ ఇష్టముండదు. అతనికి తెలిసినట్ట్లుగా లతకు కూరల నాణ్యతతెలియదు. లతతో కలిపి తిరిగే స్థలాలు గుర్తు చేసుకున్నప్పుడు కూరల బజారు స్పురించడం అతని కిష్టముండదు. ఈ సంగతి తెలిసిన లత అప్పుడప్పుడు అతనితో _ "ఈ రోజు రాత్రి కూరల బజారులో మనిద్దరం కలసి తిరుగుతున్నట్టు కల వచ్చిందండీ!" అని ఉడికిస్తూంటు౦ది. లత కలలోకి కూరల బజారు వచ్చినందుకు అట నెంతగానో నొచ్చుకుంటాడు.
ఎప్పటిలాగే ఈ రోజూ రామారావు కూరల బజారుకు వెళ్ళాడు. త్వరత్వరగా అతను కూరలు కొనడం పూర్తీచేశాడు. కూరలు కొని బయటకు వచ్చేక ఎదురుగా ఉన్న కిళ్ళీ కొట్టు దగ్గర ఓ మనిషిని అక్కడే నిలబడి వచ్చేపోయే వాళ్ళను చూస్తున్నాడు. అతని దృష్టిరామారావు పైన కూడా పడినట్లుంది కానీ, నిలకడగా ఆగలేదు.
రామారావు మాత్రం రెండు మూడు సార్లు __'ఎవరు చెప్మా? అని నోట్లో గోణుక్కుని _ ఒకసారి నుదుటి మీద కొట్టుకుని 'పోనీ అడిగితే పోలా?' అనుకున్నాడు.
అడుగుదామనుకునే అతనా మనిషిని సమీపించి పలకరించ బోయేటంతలో చటుక్కున జ్ఞాపశక్తి పనిచేయగా __" నువ్వు మోహన్ వి కదూ ?" అన్నాడు.
అతను రామారావుని ఒక్క క్షణం పరీక్షగా చూసి, "అరే __ రామారావు నువ్వా?" అన్నాడు.
ఆ మనిషి గుర్తువచ్చినందుకు రామారావు స్వరంలో ధ్వనించిన ఉత్సాహం అతని స్వరంలో లోపించింది.
మోహన్, రామారావు కాలేజీలో నాలుగు సంవత్సరాలు క్లాస్ మెట్స్, రూమ్ మేట్స్ ఇద్దరూ బాగా క్లోజ్ గానే ఉండేవారు. కానీ ఆశయాల్లో మాత్రం ఇద్దరికీ చాలా తేడా ఉండేది. మోహన్ కలవారి బిడ్డ. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఆడపిల్లలు వెనకాల పడేవాడు. రూములో సెక్సుపుస్తకాలు చదివేవాడు. రామారావు విటన్నింటికి దూరంగా ఉండేవాడు. రామారావుని తన దారికి మళ్ళించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు మోహన్. కానీ అతని స్నేహాన్నీ మాత్రం వదులుకోలేదు.
"రామారావ్ ! చాలా మందికంటే నువ్వు చాలా మెరుగు. నాతో ఉంటూ నా ప్రభావానికి లోనుకావడం లేదు. వెధవ నీతులు చెప్పి నన్ను బోర్డు కొట్టడంలేదు." అని మోహన్ అతన్ని మెచ్చుకునే వాడు.
కాలేజీ వదిలిపెట్టగానే ఇద్దరూ ఒకరినొకరు ఉత్తరాలినా రాసుకోలేదు. ఆ తర్వాత ఇదే ఇద్దరూ ఒకర్నొకరు చూసుకోవడం.
"ఇందాకట్నించి ఆలోచిస్తున్నాను. ఎవరా అని? ఇప్పటికి స్పురించింది" అన్నాడు రామారావు.
"నేను నిన్నూ చూస్తూనే గుర్తు పట్టాను. నన్నూ నువ్వు చూసే ఉంటావనీ, గుర్తుపట్టనట్టు నటిస్తున్నావనీ అనుకున్నాను" అన్నాడు మోహన్.
"అవేం మాటలు ?" అన్నాడు రామారావు నొచ్చుకుంటూ.
"మామూలు మాటలు కావివి. అనుభవంతో అంటున్నవి" అన్నాడు మోహన్.
రామారావు ఆశ్చర్యంగా, "నీ అనుభవాలు చిత్రమీనవసుకుంటాను.
నాతో ఇంటికి రా! అక్కడ తీరుబడిగా మాట్లాడుకుందాం" అన్నాడు.
"నీకు పెళ్ళయిందా?" అనడిగాడు మోహన్.
"ఈ కూరల సంచీ చూస్తె తెలియడం లేదూ?" అన్నాడు రామారావు నవ్వుతూ.
"సంచీని చూస్తె తెలుస్తోంది. కనీ నీ ముఖం చూస్తె టెలియడం లేదు. పెళ్ళయిన వల్ల కళ్ళల్లో అదో రకం నీరసం కనబడుతూంటు౦ది. అది కనబడ్డం లేదు నీ కళ్ళలో" అన్నాడు మోహన్.
"దటీజ్ కాప్లమేంట్స్ టు మై వైఫ్" అన్నాడు రామారావు గర్వంగా.
మోహన్ ముఖం చిట్లించి, నా కాంప్లిమెంట్స్ నీ అమాయకత్వానికి" అన్నాడు.
రామారావు నవ్వి, "పద_ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి పోదాం" అన్నాడు.
"నేను నీ ఇంటికి రాను." అన్నాడు. మోహన్.
"ఎందుకని?"
"నీకు పెళ్ళయింది కాబట్టి ?"
"ఇదేం విచిత్రం?" అన్నాడు రామారావు నిజంగా ఆశ్చర్యపోతూ.
"అయితే నువ్వు నా గురించి ఏమీ వినలేదా?" అన్నాడు మోహన్ కూడ ఆశ్చర్యంగా.
"కాలేజీలో ఆఖరి పరీక్షలు రాసి రూమ్ వదిలిపెట్టక ఇదే నిన్ను చూడడం?"
"అందుకే నువ్వు నన్ను నీ ఇంటికి ఆహ్వానించగలిగావు" అన్నాడు మోహన్.
"అవేం మాటలు ? నేను నాలుగేళ్ళు రూమ్ మేటుని, ఆ విషయం మరచిపోకు" అన్నాడు రామారావు అదొక రకమైన బాధతో.