"లతా! నీ పేరులో ఉన్నవి రెండే రెండు అక్షరాలు. కానీ ఆ రెండు అక్షరాలనూ కలిపి పిలిస్తే ఓ లావణ్యారాశి పలుకుతుంది. ఆ పేరుకు నీ కారణంగా సార్ధకత లభించింది" అన్నాడు రామారావు.
ఆ సమయంలో లత అతని ఎదురుగా నిలబడి ఉంది. ఆమె ఒంటిమీద బట్టలు లేవు. పచ్చటి శరీరం బంగారంలా మెరిసిపోతూంటే, పలచటి ఆమె శరీరం లతలా ఊగిపోతూంటే __ ఆలంబన లేకుండా అలా ఆమె సంతోషపు నిలబడలేదన్న వ్యధ ఎవరికయినా కలుగుతుంది. కానీ రామారావుకు కలిగినట్లు లేదు. ఏదో అపురూప శిల్పాన్ని చూస్తున్నట్లు, సృష్టిలోని అధ్బుతం తన కళ్ళముందు నిఅలబడ్డట్లు విస్మయంగా చూస్తున్నాడత డామెను.
లత సిగ్గుపడడం లేదు. అతనామెకుకొత్తకాదు. ఇది ఆమెకూ కొత్త కాదు.
రామారావు లతకు తాళికట్టిన భర్త. వారి వివాహమై రెండు సంవత్సరాలయింది.
రామారావు కవికాడు. కవిత్వంపట్ల అతనికి ఆసక్తి కూడా లేదు. అతను లతను తొలిచూపులోనే ప్రేమించాడు. వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాతనుంచీ అతను కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. అతని కవిత్వం వస్తువులలోనూ, అందుబాటులోనూ కూడా లతకు మాత్రమె పరిమితం. లతపైన అతను కవిత్వం చెప్పాలేడు. లత సమక్షంలో తప్ప అతను కవిత్వం పలకలేడు.
"లతా! నువ్వు నిజంగా నా జీవన లతవు" అన్నాడు రామారావు.
లత అతన్ని సమీపించి పక్కన కూర్చుంది. తనను అరాదించే భర్తపట్ల ఆమెకు ఎంతో అభిమానం. ఆమె మనసునిండా అతనిపట్ల అనురాగమే నిండి ఉంది.
"మిమ్మల్ని అల్లుకోవడం కోసం పుట్టిన నేను నిజంగా లతనే!" అంటూ ఆమె అతన్ని పెనవేసుకుంది. ఇద్దరూ కాసేపు తన్మయావస్థలో ఉండిపోయారు.
"మన ప్రేమ ఎప్పుడూ ఇలాగే వుండిపోవాలి లతా!" అన్నాడతను.
"ఇలాగే అంటే........?" కొంటెగా అడిగింది లత.
ఆమె ప్రశ్నలోని కొంటెతనాన్ని రామారావు గుర్తించలేదు. సీరియస్ గానే __ "ఇలాగే ... దాపరికం లేకుండా...." అన్నాడు.
"మీ దగ్గర నాకు దాపరికం దేనికి?" అంది లత చిలిపిగా.
"మనం భార్యభర్తలం అగ్ని సాక్షిగా నిన్ను నేను చేపట్టాను. మనసారా ఒకరి నొకరు ప్రేమించుకున్నాం. భౌతిక కాయానికి సంబంధించినంతవరకూ మనిద్దరి మధ్యనూ ఏ విధమైన దాసరికమూ లేదు. మానసికంగా కూడా అలాగే ఉండగలగాలి" అన్నాడు రామారావు.
"ఈ రోజు మీరు వింతగా మాట్లాడుతున్నారు" అంది లత.
"వింత కాదు లతా!" నీ పేరు లత. లతకు ఆలంబనం కావాలి. నేను నీకా ఆలంబనాన్ని. ఇలా అంటే అది కవిత్వమవుతుంది. కానీ నిజం అదికాదు. నాలో పొంగి పొరలుతున్న ప్రేమకు నువ్వు అబలంనంగా ఉన్నావు. నువ్వే లతవైన పక్షంలో నువ్వు లేకపోయినా నేను బ్రతకగలగాలి. నువ్వు లేని జీవితాన్ని ఊహలో కూడా భరించలేను. నేను నీకు ఆలంబనం ఎలాగౌతాను?" అన్నాడు రామారావు.
లత నవ్వి. "ప్రేమకు సంబంధించినంత వరకూ ఇద్దరమూ లతలమే" అంది.
"కాదు" అన్నాడు రామారావు.
"ప్రేమ లతలాంటిది. ఆ ప్రేమలతకు అల౦బనం చేసుకున్న ఇద్దరు వేర్వేరు వ్యక్తులం మనం. లతకూ, వృక్షానికీ సృష్టి సంభంధం లేదు. మనిద్దరికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వాలున్నాయి. ఇద్దరం వేర్వేరు మనుషులం . సృష్టి సహజమైన ఆకర్షణ మనల్ని దగ్గర చేసింది. చేరువయ్యాం. సంసారం ప్రారంభించి ఇద్దరూ వేర్వేరు బాధ్యతలు తీసుకున్నాం . నా ఇంటికొక అర్ధాన్నిస్తున్నావు నువ్వు. అవసరమైన అర్ధం నేను సంపాదిస్తున్నాను. డబ్బు సంపాదించే నాకు బయటి ప్రపంచంలో ఒక వ్యక్తిత్వముంది. గృహిణిగా నీకో ప్రత్యెక వ్యక్తిత్వముంది. పరప్సరావలంబనం మాటమరచి ఎవరి వ్యక్తిత్వాన్ని వారు నిలబెట్టుకో గలమంటావా?"
"ఎన్నడూ లేనిది ఈ రోజు మీలో నాకు కొత్త మనిషి గోచరిస్తున్నాడు. మీరిలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడంలేదు? నిజం చెప్పాలంటే మీ మాటలే నాకు సరిగ్గా అర్ధం కావడం లేదు?" అంది లత.
"నువ్వు నాకంటె తెలివైన దానివని నాకు తెలుసు. నీకు అర్ధంకానంత తెలివిగా మాట్లాడడం నావల్ల కాదు. బహుశా నా మాటలు శ్రద్దగా విని ఉండవు" అన్నాడు రామారావు.
సమాధానంగా లత నవ్వి ఊరుకుంది.
రామారావు మళ్ళీ భార్యవంకే పరీక్షగా చూసి, "ఈ ప్రపంచంలో నా అంతటి అదృష్టవంతుడు౦డడు. లేకపోతె నీకు భర్త అయ్యేటంత అర్హత నా కెక్కడిది?" అన్నాడు.
లతకు నిజంగానే కోపం వచ్చింది. ఆమె ముఖం సిగ్గుతో కోపంతో ఎర్రబడింది. అర్హత గురించి మీరు మాట్లాడినప్పుడల్లా నాకు నా అనర్హతే గుర్తు కొస్తుంది. మీరిలా మాట్లాడడం నాకు నచ్చదని ఎన్ని సార్లో చెప్పాను" అంది.
రామారావు భార్య వంక ఆరాధనా పూర్వకంగానే చూసి _ "తీవ్రత కారణంగా కోపం సూర్యుడి లాంటిదే అవుతుంది. అదెంత తీవ్రమైనదైనా నేను భరించగలను. ఎందుకంటే ఆ కోపానికే గదా పద్మలాంటి నీ ముఖం ఎంతో చక్కగా వికసించింది" అన్నాడు.
లత భర్త వంక నిస్సహయంగా చూసి _ " కవి కాని మీతోనే నా కింత అవస్థగా ఉంది. కవిని చేసుకున్న వాళ్ళ అవస్థ ఎలా ఉంటుందో కదా?' అంది.