Previous Page Next Page 
మనస్విని పేజి 3


    
    త్వరత్వరగా నడిచి కాలేజిలోకి వెళ్ళిపోయారు.
    
    అక్కా!
    
    నా బ్రతుకు అంధకారమయ్యేటట్టు వుంది......నేను ప్రైవేటుగా యస్.యస్.యల్.సి.కి కూర్చుంటున్నాను. పిన్నికి తెలియకుండా నాన్నఫీజయితే కట్టారుగానీ నా చదువుకి దోహదంమాత్రం చేయలేకుండా ఉన్నారు. ఏమి చేయాలో తోచటం లేదు.....నాచదువు విషయం అంతా నీ మీదే ఆధారపడివుంది.....నా బ్రతుకు కూడా....
    
                                                                                                               నీ చెల్లి
                                                                                                               సుశీల
    
    మనస్సుకరిగేట్టుగా వ్రాసినజాబును చదివేసరికి సుభద్రకి కళ్ళనీళ్ళువచ్చాయి.
    
    'పాపం ఎంత బాధపడుతోందో!'
    
    చులకనకావటంలో విశేషం ఏముంది?
    
    కన్నతల్లిలేకపోతే కరుణేహీనమయ్యే ఈ ప్రపంచం సుశీలలాంటి అమ్మాయిలకి ఇక ప్రపంచమేదుర్భరమవుతుంది.
    
    అలా ఆలోచనలు సాగిపోయేవే...
    
    అంతలో సారధి ప్రవేశించాడు.
    
    'వదినా......'
    
    మంచంమీద కూర్చోమని సైగచేస్తూ తనూ కాస్త జరిగింది.
    
    అక్కడే కూర్చుని అన్నాడు.
    
    'ఏమిటి వదినా అలా వున్నావు?'
    
    మౌనంగా ఉత్తరం చేతికిచ్చింది.
    
    'ఎక్కడనుంచి'
    
    'చదువు'
    
    ఒక్క క్షణం తటపటాయించాడు.
    
    'చదువు'
    
    '......'
    
    'నీ మరదలే వ్రాసింది'
    
    ఆలోచిస్తూ జాబు తెరిచి ఒక్క నిమిషంలో చదివేశాడు.
    
    అతనికి ఆమె ఎవరో అర్ధం కాలేదు.
    
    ప్రశ్నార్ధకంగా ఆమెవైపు చూశాడు.
    
    'మావారి మేనమామ కూతురు....'
    
    'ఓహో....'
    
    'అవును.....అప్పుడోసారి వచ్చి పోయిన అమ్మాయే.......'
    
    'మరి'
    
    'ఏంచేద్దాం?'
    
    'మీ ఇష్టం'
    
    'రమ్మని వ్రాద్దామని'
    
    లెటరుపేడ్ తెచ్చి కూర్చున్నాడు.
    
    చెప్పింది
    
    'చెల్లెలికి'
    
    క్షేమం. నీ ఉత్తరం అందింది వెంటనే రా!
    
    మీ అక్క
    
    వ్రాశాక తీసుకుని సంతకం చేసింది.
    
    మడిచికవర్లో పెట్టాడు.    

 

    'చూడు సారధీ! కాస్త ఆ అమ్మాయికి తెలియనివి ఏవైనా చెపుతూ వుండాలి'
    
    'మీ మాట ఏనాడైనా తీసివేశానా వదినా? మీరు అడగాలేకాని కొండ మీది కోతినైనా తెచ్చిస్తాను మీ ఆజ్ఞ సుగ్రివాజ్ఞ అనుకో!'
    
    'ఛీ! ఛీ!! ఆనాడు రాతినినాతి చేశావు. ఈనాడు నాతిని కమ్మంతావు. ఎప్పుడూ నీ పనులింతేనా?" నవ్వుతూ వదినగారన్నమాటలకి మురిసిపోయాడు. అతని దరహాసవదనారవిందాన్ని చూచి  ఆమె నిండుపైరుతో వున్న పొలాల్ని చూసి మురిసిపోయేరైతులా నిండు మనస్సుతో మనసునిండా సంతోషించింది. ఒక్క నిమిషం మౌనం వహించి అంది.
    
    'నీకు ఓ కథ చెప్పాలి సారధీ'
    
    'ఏమిటో!'
    
    'మళ్ళీ చెపుతాలే'
    
    'ఉహు ఇప్పుడే చెప్పాలి'
    
    'కాదులే! ఇప్పుడు కాదు.....మళ్ళీ చెపుతా సరేనా'
    
    'అయితేనేనూ మీతో ఓ కథ చెప్పుకోవాలి'
    
    'ఏమిటది'
    
    'ఇప్పుడు కాదు ఈ సారి వచ్చినప్పుడు చెపుతాగా'
    
    'ఓహో.....మాటకి మాట వేస్తున్నావుకదూ'
    
    'కాదొదినా......నిజం.....'
    
    'మరైతే ఒక్క ముక్కలో చెప్పు'
    
    'అలాకాదు'
    
    'అవుతుందిలే......చెప్పు'
    
    'మీ ఆజ్ఞ.....అది నా ప్రేమవిషయం వదినగారూ! తప్పక చెపుతాగా......వస్తాగుడ్ బై'
    
    వేగంగా వెళ్ళిపోయాడు సిగ్గుపడుతూ.
    
    సుభద్ర అతను వెళ్ళినవైపే అలాగే చూస్తూ నిలుచుంది.
    
    ----------
    
    చల్ల చల్లగా గాలి వీస్తోంది.
    
    తుంగభద్ర ఈస్టు కెనాల్ నిండుగా ప్రవహిస్తోంది.
    
    వరిమళ్ళమీదుగా అప్పుడప్పుడూ వీస్తోన్న గాలి ఆలమందలవాసన తెస్తోంది.
    
    పశుపోషణలేక సహజమైన పశువుల ఎరువులు దొరకక కృత్రిమ రసాయనిక ఎరువులు వాడుతూ అత్యధికమైన పంట పండిస్తున్నామని విభ్రమ చెందుతోంది ప్రజానీకం.
    
    సామాన్యమైన రైతుకి ఆనాడు తన ఇంట్లో తిరుగాడే పశువుఎరువు సులభంగా చేలకి వేసుకుని పంట పండించుకుని తిన్ననాటి సుఖం ఈనాడు దొంగ వ్యాపారులవద్ద బ్లాకులో అత్యధిక మైన ధరలకి కృత్రిమ ఎరువులని కొనలేక, చాలీచాలని ఎరువులతో, పండీ పండని పంటలతో శ్రమ ఎంతో అధికం చేసిపంట పండినా.....ఆనాటిరుచి నెరుగక సుఖం అనేది శూన్యం అనిపిస్తోంది.
    
    కెనాలుగట్టుపై కూర్చుని నిబ్బరంగా నిర్మలంగా ప్రవహిస్తోన్న నీటిని చూస్తూ కూర్చున్నాడు సారధి.
    
    అయిదుగంటలు కావస్తోంది.
    
    హేమంతకాలం
    
    అప్పుడే సూర్యుడు వ్రాలిపోయాడు.
    
    'ఇంకాగీత రాలేదేమో?' అని ఎదురుచూస్తూ ఆలోచిస్తున్నాడు.
    
    పశ్చిమాకాశంలో రంగురంగుల కుంచెలతో అగుపించని చిత్రకారుడు చిత్ర విచిత్రమైన దృశ్యాలని గీస్తున్నాడు క్షణక్షణానికీ ఒక్కో ఆకారం దాలుస్తున్న ఆ చిత్రాల విచిత్రానికి అబ్బురం కలుగుతోంది.
    
    సహజమైన ప్రకృతిపై భగవానుడు గీచే ఆ రంగురంగుల చిత్రాలముందు ఎన్నెన్ని రంగులు, ఎన్నెన్ని విదాలో కలిపి ఎన్నెన్ని తిప్పలో పడి గీసిన చిత్రాలు ఎందుకూ పనికిరావు'
    
    ఆలోచనల్లో మునిగి అలాగే అందచందాలని విమర్శించుకుంటూ ఆనందిస్తున్న సారధీ కళ్ళు మూశారు ఎవరు.           

 Previous Page Next Page