శారదా అశోకవర్ధన్ కథలు
ఇందులో .....
1. ఎర్రకలువ
2. గుండె తడిసిపోయింది.
3. చీకటి ఊబి
4. ప్రేమపుష్పం
5. నాణేనికి మరోవైపు
6. మరో మృగం
7. లేచిరా తల్లి
8. తోడొకరుండిన అదేభాగ్యమూ
9. జారిన మల్లెలు
10. జ్యోతి
11. ఆగు!
12. నాలోని నేను
13. జలదృశ్యం
14. కండక్టర్ సుందరం
15. కథ కంచికి
16. తుమ్మముల్లు
17. జారుడు మెట్లు
18. వారసులు
19. ఇలాంటి మగాళ్ళూ ఉంటారా?
20. మల్లెజడ
21. అమ్మమ్మల అందాల పోటీ
22. శక్తీ! నీకే ఈ పరీక్ష
23. నేను టామీని కాను
24. షాక్ ట్రీట్ మెంట్
25. నర్తకి
26. ఆంటీ.... ఆంటీ
27. అమ్మ మనసు
28. బిందూ ఆంటీ
1. ఎర్రకలువ!
చేతిలోని కర్రతో హుందాగా జీపు దిగింది మంజూష. వెనకాల ఇద్దరు కానిస్టేబుల్స్ ఆమె వెనకే వొస్తూంటే ముందు ఇద్దరు కానిస్టేబుల్స్ గబగబా నడిచి ఆమె గది డోరు తెరిచారు. మధ్యలో వున్నవాళ్ళంతా 'గుడ్ మార్నింగ్ మేడమ్' అంటూ లేచి నుంచుంటే. 'గుడ్ మార్నింగ్ ' అంటూ లోపలికి వెళ్ళింది మంజూష. ఆమె దృష్టి ఒక మూలగా నుంచున్న యువతి మీద పడింది. ఆమె రోజూలాగా జైలు దుస్తులు కాకుండా మామూలు చీర కట్టుకుంది. పైటకొంగు మెడచుట్టూ కప్పుకుని తలవంచుకు నుంచుంది. ఆమెకేసి పరికించి చూసింది మంజూష. మొహంలో అలసట, ఆ కళ్ళలో ఏదో ఆవేదనా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా, ఏదో మంచితనం ఆమె నుదుటన రాస్తున్నట్టు కనిపిస్తోంది. చదువు లేకపోయినా సంస్కారం ఉట్టిపడుతూన్నట్టనిపించింది ఆమెలో మంజూషకి. నీ ప్రవర్తన బాగుందని రిపోర్టు రాయడం వల్ల నీకు శిక్షకూడా ఆరునెలలు తగ్గింది. ముందుగానే విడుదల చేస్తున్నాం. ఇన్నాళ్ళు ఈ నాలుగు గోడల మధ్యా మెదిలిన నీవు ఇప్పుడు బయట ప్రపంచంలో ఎలా ఇముడుతావో జాగ్రత్త!" తన మామూలు ధోరణిలో చెప్పింది మంజూష.
"అలాగే," తలూపింది జైలు నుండి విడుదల కాబోతూన్న కనకమ్మ.
సాధారణంగా అయితే మరికొన్ని హెచ్చరికలు చేసి పంపించేసేదే మంజూష. కానీ కనకమ్మని చూసినప్పుడల్లా మంజూష మనసులో ఎదో ఘర్షణ! ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవాలనే తపన. ఎంత పోలీసాఫీసరైనా స్త్రీ పరంగా వుండే సహజమైన ఆమె కోమల మనస్తత్వం, దయ, సానుభూతి, విషయం తెలుసుకోవాలన్న ఆందోళనా ఆ రోజు ఆమె వెళ్ళిపోతుందని తెలిసే సరికి ఎక్కువయ్యాయి. గబగబా అందరితో మాట్లాడి పంపించేసి కనకమ్మని కాసేపు వుండమని సైగ చేసింది. కొన్ని పనులు ఫోన్లలో పూర్తిచేసి, కొన్ని ఫైళ్ళమీద సంతకాలు పెట్టడం పూర్తిచేసి కుర్చీలోంచి లేచొచ్చి, కనకమ్మ భుజంమీద చెయ్యివేసింది. కనకమ్మ ఒక్కసారి కన్నెత్తి మంజూషకేసి చూసి తలదించుకుంది.
మంజూష నవ్వుతూ ఆమె గడ్డం పుచ్చుకుని తలపైకెత్తి ఆమెకేసి చూసి "చూడు కనకమ్మా! జైలులోకొచ్చిన వాళ్ళందరూ దుర్మార్గులేననీ, జైలు బయటవున్న వాళ్ళందరూ మంచివాళ్ళేనని నమ్మని వాళ్ళలో నేనొకదాన్ని. కొందరు నేరం చెయ్యకపోయినా, లేదా ధర్మం ప్రకారం వారు చేసింది న్యాయమే కావొచ్చు. న్యాయశాస్త్ర ప్రకారం చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చర్య తీసుకోవడంవల్లా జైలుపాలు కావొచ్చు! కొందరు తెలివిగా ఎన్ని నేరాలు చేసినా తప్పించుకుపోవచ్చు! అది వేరే విషయం. నిను చూస్తే ఎందుకనో నువ్వు ఏ ఘోరాలు చెయ్యలేని వ్యక్తివని నా మనసు ఘోషిస్తోంది. అయితే ఉద్రేకంలో అనుకోనివిధంగా హత్య జరిగిపోయింది. జైలుపాలయ్యావు. నీ సత్ప్రవర్తన వల్ల శిక్షతగ్గి విడుదలై వెళ్ళిపోతున్నావు. అయితే ఒక పోలీసాఫీసరుగా కాక, ఒక వ్యక్తిగా, ఒక స్త్రీగా నిన్నీ ప్రశ్న అడుగుతున్నాను. సమాధానం వినాలని ఆశపడుతున్నాను" అంది మంజూష.
ఏమిటో చెప్పమన్నట్లు కనకమ్మ నమ్రతగా మంజూష కేసి చూసింది.
"ఈ దేశంలో పుట్టిన స్త్రీ భర్త దుష్టుడైనా, దుర్మార్గుడైనా, తాగుబోతైనా నానా హింసలు పెట్టినా పతియే ప్రత్యక్షదైవం అని పడుంటుందే తప్ప - లేదా అతని చేతిలో చావడానికైనా సిద్ధపడుతుందే తప్ప, భర్తను చంపదు. నువ్వు కూడా కావాలని చంపకపోయినా అంత ఎదురుతిరిగి ఘర్షణ పడేంత సంఘటన ఏమిటో నీ నోటిద్వారా తెలుసుకోవాలనుంది" అని అడిగింది మంజూష.
కనకమ్మ కళ్ళు నీటి కుండలయ్యాయి.
మనస్సు రాకెట్ లా రయ్ మని గతంలోకి దూసుకుపోయింది. చెంపల మీదుగా కారుతూన్న కన్నీటిని పమిటకొంగుతో తుడుచుకుంటూ చెప్పడం మొదలెట్టింది.
* * *
"నాకు ఏడెనిమిదేళ్ళున్నప్పుడే మా అయ్య నా పెళ్ళి నాకన్న పదియేండ్లు పెద్దయిన లింగమయ్యతో చేసేసిండు. అప్పటికే వాడికి తాగుడలవాటుంది. పైగా మిరపకాయ బజ్జీల బండి నాగమ్మతో సంబంధముంది! నాగమ్మ ఆడికి తాగటానికి పైసలిచ్చేది. ఆణ్ణి తన కాళ్ళకాడ పడుంటేటట్లు సేసుకుంది. కొలువు సేసేటోడుకాదు. రోజంతా తాగుడు, దాని కొంపలోనే కులుకుడు. నా పెండ్లికి బెట్టిన పుస్తెగొలుసు సిల్కుచీర అన్నీ గొండబోయి డానికే ఇచ్చిండు. మా అమ్మా నాయన నచ్చజేప్పేటందుకు సూసిండ్రు గానీ ఆడు ఇనకుంటే నా తలరాత గట్టగే వున్నదని ఒదిలి పెట్టిండ్రు.
ఈ లోపల నాకొక బిడ్డపుట్టింది. ఇంట్ల ఖర్చు బెరిగింది. ఆడు ఇంటికి పూరాగా రాకడ బంద్సేసిండు. అప్పుడు చైతన్య ఇస్కూలు పెద్ద టీచరమ్మ, అదే ప్రిన్సిపాల్ సావిత్రమ్మ కాడ నేను ఇంట్ల బట్టల బాసాన్లు సాపుచేసే కొలువుకు కుదిరిన. ఆయమ్మ దేవత - నా కట్టంజూసి, నాకు పాతబట్టలిచ్చేది. అన్నం బెట్టేది. ఆ యమ్మ ఇచ్చిన బట్టలుగూడ ఆడు కొండబోయి నాగమ్మకే ఇచ్చేటోడు! 'నా రాత అట్లగే సస్త' అని ఊకున్న! కానీ...." దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే మాటరాక వెక్కివెక్కి ఏడ్చింది కనకమ్మ. ఆమె గుండె బద్దలయి కన్నీరు వరదగా పారుతోందేమోననిపించింది మంజూషకి. "ఊరుకో కనకమ్మా! అనవసరంగా అడిగి నిన్న బాధపెట్టేను" అంది.
"చెప్పనీ తల్లీ! ఇన్నేళ్ళసంది గుండెలో గడ్డగట్టిన నీళ్ళు ఇప్పుడు కరిగికారిపోతున్నయ్" అంది కళ్ళు తుడుచుకుంటూ. మంజూష ఆసక్తిగా ఆమెనే చూస్తోంది.
కనకమ్మ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది:
"నా బిడ్డకి ఇందిర అని పేరు పెట్టుకున్న దానికి సదువంటే శానా ఇట్టం. నాతో పనికి గొంచబోతుంటే ఏడ్చేది. ఒకనాడు అది పనికి రానంటే బాగా గొట్టిన. బిడ్డ ఎక్కెక్కి ఏడిసింది. ఆయాల బువ్వ తినలేదు. ఆ సంగతి సావిత్రమ్మకి దెలిసింది. ఆ మర్నాటి నుంచే దాన్ని ఆమె ఇస్కూల్లనే సేర్పించింది. యూనిఫార మిప్పించింది. ఫీజుగూడ ఆమెనే గట్టేది. నా బిడ్డ బంగార మాలెగా తయ్యారయ్యింది. మంచిగ జదివేది, సావిత్రమ్మ చాన మెచ్చుకునేది." చెప్పడం ఆపి బోరున ఏడ్చింది కనకమ్మ.
మంజూష కంగారుపడిపోయింది. "ఏమయింది కనకమ్మా! ఊరుకో" అంటూ ఊరడించింది. మంచినీళ్ళ గ్లాసు నందించింది. కాసిన్ని నీళ్ళుతాగి మళ్ళీ చెప్పడం మొదలెట్టింది కనకమ్మ.
"నా సిట్టితల్లి సీరకట్టడం మొదలెట్టింది. ఆ బస్తీల అందరి కండ్లు దానిమీదనే! ముఖ్యంగా ఆ నాగమ్మ తమ్ముడు రాజిగాడు ఇందిరని ఆడికిచ్చి పెండ్లి జెయ్యమని పట్టుబట్టిండు. మా యింటాయనికి రోజూ పొద్దుగాల, పొద్దుమీకి బాగా తాగిపించి, పెండ్లిజెయ్యమని కొట్లాడెట్టోడు. బుడ్డీలు సూడంగనే అట్లగే జేస్తా అంటూ మాటిచ్చెటోడు మా ఆయన. ఒకనాడు ఇప్పుడు తోల్కెస్తెనెగానీ బుడ్డీలియ్యనన్నాడు రాజిగాడు. దాంతో బుడ్డిదీపంకాడ సదువుకుంటూన్న ఇందిరని సెయ్యిబట్టి ఈడ్చుకుంట ఆనికానికి తీస్కబోతుండు ఆయన. నేనడ్డుపడితే ఒక్క నూకుడు నూకిండు. ఇందిర గింజుకుంది, ఆడు ఒదిలిబెట్టలేదు. అప్పుడు నేను కూరగాయలు గోస్తున్న, లేచి ఇందిర సెయ్యిబట్టి నా దిక్కు లాక్కున్న. ఆడు దాన్ని ఒక్కతోపు తోసిండు. అది బోయి బుడ్డిదీపం మీద బడ్డది. ఆడుబోయి కత్తిపీట మీద బడిండు ఆ తోసుట్ల. ఇందిర సీర అంటుకోని మంటలొచ్చేసినయ్! లింగమయ్య మెడకి కత్తిపీటదాకి మెడ కోస్కబోయింది. రక్తపు మడుగులో పడున్నడు లింగమయ్య. మంటలల్ల మాడిపోయింది నా బిడ్డ. అంతె! బస్తంత ఒక్కటయ్యింది. నా మొగుణ్ణి నేనే జంపినా అని రాజిగాడు పోలీసులకి జెప్పిండు. నా సేతులకి బేడీలేసిండ్రు." కనకమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి. తూళిపోయింది. మంజూష ఆమె చెయ్యిపట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది. కనకమ్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. మంజూష మనసు వెన్నలా కరిగిపోతోంది.
సారా బుడ్డీకోసం కన్నబిడ్డనే అప్పగించడానికి యత్నించిన తండ్రి! అడ్డుకోబోయి పెనుగులాటలో బిడ్డనీ, భర్తనీ ఒక్కసారే పోగొట్టుకున్న అభాగిని కనకమ్మ - నీడలేని ఆడది.
సమాజం ఆమెని ఒంటరిగా బతకనివ్వదు!
'నిందలు! ఘోరాలు! రేపులు!' మంజూష ఊహలు ఎటో వెళ్ళిపోతున్నాయి.
ఆడదాని బతుకు ఎప్పుడూ ఇంతేనా?
బుడ్డీ, ఆలోచనా, ఓపికా, నేర్పూ అన్నీ పురుషుడితో సమానంగా వున్నా శారీరకంగా స్త్రీ పురుషుడికన్నా బలహీనురాలు కావడం దౌర్భాగ్యం!
మంజూష శరీరం ఆలోచనలతో వొణికిపోతోంది. "దిక్కులేని కనకమ్మ ఎక్కడికి పోతుంది?"
ఆలోచిస్తోంది మంజూష.
"తన ఇంటికి తీసుకుపోతే?
ఎందరినని తీసుకుపోతుంది ఇలా? దీనికి ఏదిమార్గం? మంజూషకి తల భారంగా అనిపించి కుర్చీలో కూలబడింది. కనకమ్మకేసి చూసింది. ఆమె తల వంచుకుని వుంది. కన్నీరు ఆమె గుండెని తడిపేసింది. కనకమ్మ అంతబాధలోనూ అందంగా కనిపించింది మంజూషకి. ఈ సమాజం ఆమెని బతనినివ్వదు. ఆడతనానికి అందం శాపమేమో! అదే ఆమెని బలహీనురాలిగా చేస్తుందేమో? ఆలోచనలతో సతమతమయిపోతూ 'ఏది ఏమైనా కనకమ్మని ఒంటరిగా వుండనివ్వకూడదు. నా దగ్గరే వుంచుకుంటాను. లేకపోతే ఆ దిక్కులేని మనిషిని కాకుల్లా పొడుస్తుంది సమాజం' అనుకుంటూ లేచి నుంచుంది.
"కనకమ్మా! పద, నా జీపు ఎక్కు" అంది.
కనకమ్మ అయోమయంగా చూసింది.
"పద" అంటూ తను ముందు నడిచింది.
కనకమ్మ ఆమె ననుసరించింది.
మంజూష జీపు దగ్గర నుంచునుంది. చైతన్య స్కూలు ప్రిన్సిపాలు సావిత్రమ్మ! " అమ్మా! మీరా?" ఆశ్చర్యంగా అడిగింది కనకమ్మ.
"అవును కనకమ్మా, నేనే! నీ కోసమే ఒచ్చాను."
"నాకోసం మీరింత దూరం వచ్చారా?" కృతజ్ఞతతో పాదాలమీద పడింది కనకమ్మ.
"కనకమ్మా! ఆనాడే నిన్నూ, ఇందిరనూ నా హాస్టల్లోనే వుంచుకుంటే ఈ ఘోరం జరిగేదికాదు. బడిలో చేర్చించి చదివిస్తున్నాననే అనుకున్నానుకానీ ఇతర విషయాలు ఊహించనందుకు సిగ్గుపడుతున్నాను రా, పోదాం. హాస్టల్లోనే వుందువుగాని పిల్లలకి వండిపెడుతూ. ఆ పిల్లల్లో నీ ఇందిరని చూసుకో! హాస్టల్లో నీ కోసం ఉద్యోగం రెడీగా వుంది, పద!" కనకమ్మ చెయ్యిపట్టుకుని నడిపించి తీసుకువెళుతూన్న సావిత్రమ్మ మంజూషకి దేవతలా కనిపించింది.
ఘోరం, నేరం అక్రమం, అన్యాయం - తెల్లారితే ఇవే చూసే మంజూషకి సావిత్రమ్మలోని మానవత్వం ముళ్ళమధ్య విచ్చుకున్న గులాబీలా అందంగా అగుపించింది.
ఆమె మమత, అనురాగం, ఆప్యాయతా శరీరంలో ప్రతి రక్తపు బొట్టూ కలిసి పులకరించి పొంగి అప్పుడే బురదలో పూచిన ఎర్రకలువలా అనిపించింది. అప్రయత్నంగానే రెండు చేతులూ జోడించి సావిత్రమ్మకి నమస్కరించింది మంజూష.
"మంచితనం పూర్తిగా చచ్చిపోలేదు.
మానవత్వం ఇంకా కొంచెం మిగిలి వుంది.
అందుకే ఈ ప్రపంచం ఇంకా నిలిచి వుంది."
మనసులోనే అనుకొంటూ, సావిత్రమ్మ వెనకాలే వెళ్తున్న కనకమ్మని చూసి తృప్తిగా నిట్టూర్చింది మంజూష.
"ఎటు పోవాలమ్మా?" అడిగాడు జీపు డ్రైవరు.
ఆలోచనల్లోంచి తేరుకుని ఆలోచించింది మంజూష కట్నం తేలేదని కిరోసిన్ పోసి తగులబెట్టిన అత్త, భర్తల రాక్షసత్వానికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సుహాసిని కేసు గుర్తుకొచ్చింది. "గాంధీ ఆసుపత్రికి పోనీ!" అంది జీపులో కూర్చుంటూ. జీపు గాలిలో దూసుకుపోతూన్నట్టు వేగంగా సాగిపోతోంది. మంజూష ఆలోచనలు మరీ స్పీడుగా పోతున్నయ్!
(ఈనాడు, ఆదివారం 6 -3 - 1994)