Read more!
 Previous Page Next Page 
మనస్విని పేజి 2


    
    ఐదుడుగులు పోయాక మెల్లిగా అంది.    

 

    'నేనంటేఒక్కోసారి ఇంత అభిమానంచూపుతావు.....ఒక్కోసారి చిరాకుతోనేనేడిచేదాకా ఏడిపిస్తావ్..... ఎందుకు బావా అలా చేస్తావ్? నేనంటే అసలు నీకు ఇష్టం లేదాలేకపోతే అది ఓ విధమైన ప్రే.....మ.....నా.....?' పరమ సుకుమారమైనమనస్సుతో అడుగుతున్నమరదలి అమాయకత్వానికి నవ్వుకున్నాడు.
    
    పొలంవైపు చూస్తూ అన్నాడు.    

 

    'సరూ! భౌతికమూ, అతిసామాన్యమూ అయినమానవుడి సౌందర్యంఎంత? దానిపై ప్రేమ ఎంత? అటు చూడు మరదలా! అలా పిల్లగాలికి సయ్యాటలాడుతూ ఉర్రూతలూగుతూ ఎంత మనోహరంగా నయనా నందకరంగా వున్నాయో చూడు ఆ వరి మొక్కలు......ఇంకొంచెం తలెత్తితే ఇప్పుడిప్పుడే కాంతిపుంజుకుంటున్న చందమామ.....అతని వెన్నంటే రోహిణీ.....దూర దూరంగా తారట్లాడేతారలు...అతన్ని కప్పేయాలని అనుకుని యత్నించేమేఘ మాలికలు..... ఓహ్! అటు చూడు......హరివిల్లు.....ఈరోజు వర్షం వచ్చెయ్యొచ్చు......'పౌర్ణమినాటి వెన్నలలు భామిని....' అదెందుకులే నీకు? త్వరగా నడు......'
    
    బావఏమి చెప్పాలనుకుని ఏమి చెప్పాడో ఎందుకు చెప్పాడో ఏమీ అర్ధం కాలేదు సరోజకి మౌనంగా ఊరిలోకి ప్రవేశించింది.
    
    'మధురం......'
    
    దూకుడుగా ప్రవేశించింది మీనాక్షి
    
    దిద్దుతున్న చివరి మెరుగులు పూర్తిచేసి తలతిప్పి చూశాడు మధురం.
    
    మీనాక్షి!
    
    అజంతా శిల్పంలా అతిమనోహరంగా అలంకరించుకున్న నిలుచున్న మీనాక్షిని చూసేసరికి చిత్రకారుడైన మధురానికే మతిపోయినట్లయింది.
    
    'ఒకనిమిషం ప్లీజ్!'
    
    చిరునవ్వునవ్వుతూ నిల్చుంది మీనాక్షి.
    
    కెమెరాసరిజేసుకుని అన్నాడు.
    
    'మీనా! చిన్న చిరునవ్వు. ఏదీ అలా అలా అలవోకగానిలుచో! చక్కని భంగిమరావాలి! కావాలి! రేపీ వేళకంతా నీ రంగులచిత్రం తయారు కావాలి'
    
    కెమెరాక్లిక్ మంది!
    
    తపతప అడుగులేస్తూ బుంగమూతితో దగ్గరకి వచ్చింది మీనాక్షి.
        
    'ఏమిటిది మధురం? కాలేజీటైమైందే ఇంకా ఈ రంగుల్లో మునిగిపోతే ఎప్పుడు తయారవటం? ఎప్పుడు రావటం.....?'
    
    'మీనా! క్షణకాలం ఓపిగ్గా కూర్చో! అరక్షణంలో తయారయివచ్చేస్తా! సరేనా?'
    
    ఆమెజవాబుకి ఎదురు చూడకుండా డ్రస్సు సరిచేసుకుని బుక్స్ తీసుకుని బయల్దేరి 'కమాన్' అన్నాడు.
    
    'ఇదేమిటి డ్రెస్ మార్చుకోవా?'
    
    మీనాక్షిని గది బయటికిలాగి తాళం వేస్తూ అన్నాడు.
        
    'నేనేంపెళ్ళికి వెళ్ళటంలేదుగా....కనీసం పెళ్ళిచూపులకైనావెళ్ళటం లేదు'
    
    ఆమెవేపు అదోలా చూశాడు.
    
    'మధూ? కొద్ది రోజులైనా ఈ చిత్రకళా వ్యాసంగంవదిలేసి ఆ బుక్స్ దుమ్ము దులపరాదా? లాంగేజ్ ఎగ్జామ్స్ దగ్గరగావస్తున్నాయి.....సరిగా రెండునెలలైనా లేవు నీ వెంత కళాకారుడివైనా లోకం నిన్ను గుర్తించదు..... కళాకారునిగా నిన్ను గుర్తించేసరికి నీలో కళ నశిస్తుంది. కారణం ఆర్ధికంగా సమాజంలో తగినస్థాయి ఉండదు. బ్రతకటానికి తగినస్తోమతవున్నాలేకున్నా ఆంగ్ల భాషావిశారదులైతేనే కానీ ఎవరికీ ఉద్యోగం అంటూదొరకదు.....కళాకారులకి ఇది కాలం కాదు మధూ......తినేందుకుతిండి లేక హృదయవిదారకంగా ఎంతో హీనంగా పరిస్థితి మారితే అప్పుడు బాధ పడేదానికన్నా ముందుగా లౌకిక జీవనానికి తగిన లౌకిక విద్యనేర్చుకోవటం అవసరం. అపూర్వమైన కళలకేఆదరణ, అభిమానం నశించిన ఈ రోజుల్లో ఏమి చేయటానికి తోచనికవులూ.....కళాకారులూ......వారిస్థితి......'
    
    తర్వాత ఏమి మాట్లాడలేకపోయింది.
    
    తనతో చదువుతూ చనువుతో స్నేహంతో తననర్ధం చేసుకుని తనకళ అభిమానించి ఆరాధించే మీనాక్షిలో ఇంతటి 'జాల' రగులుతోందని తెలుసుకున్న మధురం ఆశ్చర్యపోయాడు ఆమెకి తనపై, తన భవిష్యత్తుపైగల శ్రద్దకి అభిమానానికీ ఆదరణకీ అవ్యాజానురాగానికీ మనస్సులోనే సహస్రఅభినందనలు అర్పించుకున్నాడు.    

 

    'నిజంమీనా! నిజం, అందుకే ఆ మహాకవి అన్నాడు 'డిగ్రీలు లేని పాండిత్యమ్మువన్నె కెక్కనిపాడు కాలాన బుట్టి'అని ఎంతగా ఆయన హృదయంజలించిందో కదా! అయినా నేటి పరిస్థితులే అలా వున్నాయి. ఉన్నత ఉద్యోగంలో ముందు ఇరుక్కుని తర్వాత ఎంతటి కళా సేవ చేసినా చెల్లుతుందిగాని విద్య ముగియకముందే కళాసేవ అంటూ సేవచేయడం ఈనాడు చెల్లుబాటుకావటం లేదు.
    
    కానీకవిత్వం, చిత్రలేఖనం ఇవి ధారగా అలవోకగా రావలసినవేకానీ తీరిగ్గా కూర్చుని స్థాయి చిక్కకచేసేవి కావు.....చదువుముగించుకుని ఉద్యోగం చేయాలి అని దృఢనిశ్చయం వున్నవాళ్ళకి కళలకి కొంచెందూరమే ఎప్పుడూ..... అలా అని ప్రయోజనాన్ని ఆశించి ప్రయత్నాన్ని వదలటం ఎప్పుడూ తప్పే....కవులు......కళాకారులు.....జీవితంలో శాపగ్రస్తులైనవాళ్ళే అవుతారు.....అదృష్టంకొద్దీ అత్తా కోడలూవరిస్తే వారిదే ధన్యజీవితంకాని....కాని.... కాని నాడు గందరగోళమే అవుతుంది'
    
    సడన్ గా మధురం తనమాటల్ని ఆపవలసివచ్చింది.
    
    ఎదురుగా ఎవరో వ్యక్తి వచ్చి ఇద్దర్నీ ఆపాడు.
    
    'ఏమిటి బ్రదర్! ఈ వేషం? లాల్చీ! పంచ!! ఉత్తరీయం!! హ! కవివా? నాయనా! ఈనాడు కవితం ఎక్కడుంది? కవులెక్కడున్నారుబాబో-పయోరబేధఃఅన్నట్లైందికదా? అర్ధంకాలేదా కాదులే- అయినాకవిత్వం-'
    
    'రాజుల్ మత్తులువార సేవ నరకప్రాయంబు'
    
    అన్నకవికాలంతోనే చెల్లిపోయింది. ఆనాడు చెల్లాచెదురుగా కవులుండేవారు. ఈనాడు చిల్లర కవులు, అల్లరి కవులు బయలుదేరుతున్నారు-
    
    నేనూకవినే భాయీ!
    
    మీమీద పద్యం చెప్పనా?
    
    అలాచూస్తావేం? నేను ఆశు కవిని-
    
    కాచుకో-

 

    "లాల్చీనిధరియించి లాలసతముతోడ
    
    అంగనవెంటరా నడ్డదారి!"
    
    "ధారరావటం లేదుబ్రదర్! ఏదీ సిగరెట్!!'
    
    సిగరెట్ తీసుకుని కాల్చటం మొదలు పెట్టారు.
    
    మధురం కాలేజీకి ఆలస్యఅవుతుంది వెడదామని-
    
    'ఇకవస్తా బ్రదర్' అన్నాడు
    
    అతను వెర్రి ధోరణిలో మాట్లాడుతున్నా కంఠస్వరం మామూలుగే వుండటం వలనజనం గుంపు కూడలేదుపైగా రోడ్డు పల్చగా వుంది జనం లేక!
    
    'మళ్ళీ వస్తావా బ్రదర్. ఇప్పుడు వెళ్ళిన తర్వాతేనా లేక.....
    
    హ!హ్హ!నిన్నెవరడ్డుకొందురు బాబు
    
    పోయిరా కాలేజి పొద్దుపోయె'
    
    రేపు ఇదే వేళకి మీకు ఇచ్చవచ్చిన చోట దర్శన మిస్తా టా! టా!'
    
    ఎలావచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు.
    
    నిట్టూరుస్తూ అంది.
    
    'పాపం! ఎవరో పిచ్చివాడు!!'
    
    కనుకొలకులకన్నీరు తుడుచుకుంటూ అన్నాడు.
    
    'నిజంగా కళాకారులంతా పిచ్చివాళ్ళేనా! ఎవరో కవిత్వం పిచ్చిపట్టినవాడు. ఆ ధోరణిలోపడి అసలు ధ్యేయంమర్చిపోయి యూనివర్శిటీవాళ్ళకు శాశ్వత సభ్యుడై చివరికి ధర్మ దేవతశాపంతో బిచ్చగాడైనపిచ్చివాడు..... నాలుగురోజులు పోయాకనేనూ అంతే అవుతానేమో....."
    
    అతని కంఠం రుద్దమైంది.
    
    కాలేజిసందుకి మలుపు తిరుగుతున్నారు.
    
    ఆవేశంగా అతని చేయిపట్టుకుని అంది మీనాక్షి.
    
    'నీవు అలా కావటానికి వీల్లేదు మధూ......నిన్ను చదివిస్తాను.....నిజంగా నీవు ఒక్కసారి చదివేస్తేచాలు.
    
    మాకన్న ఎంతోబాగా వ్రాసేస్తావు- ఈ సంవత్సరం ఎలాగైనా నీవు పాసవుతావు. ఇక వచ్చేయేడు. దానికి నేను మంచిప్లాన్ వేసి వుంచాను-మళ్ళీ చెబుతాలే-అదిగో సెకండ్ బెల్ కొట్టేశారు- వేగం నడువు-'

 Previous Page Next Page