'ఎవరు?'
జవాబు లేదు
కళ్ళుమూసిన చేతులని స్పర్శించి చూశాడు
చేతులు మృదువుగా లేవు
కాయకష్టం చేసిన శరీరమని స్పష్టంగా ఆ చేతులు స్పర్శ చెప్పింది.
దగ్గరగా మృదువుగా మట్టివాసనవేస్తోంది.
చేతులు మళ్ళీ తడిమిచూశాడు.
ముంజేతికి మట్టి గా......జు......లు.
ఓహ్!
ఎవరు?
చేతులు తొలగించాలని చూశాడు.
వీల్లేకపోయింది.
అతడి అవస్థ చూసి ఆమె నవ్విన శబ్దం అయింది.
'ఎవరో సెప్పుకో సూద్దాం?'
'.......'
'సెప్పుకో'
రెండు కంఠస్వరాలతో ప్రశ్నించినా కనుక్కున్నాడు.
'కో.....మ......ల'
'......'
'కో......మ.......ల......'
'అరే! ఎలా కనుక్కుండావయ్యా?'
చేతులు తీసి ఎదురుగావచ్చి నిలుచుంది.
నవ్వుతున్నాడు సారధి.
మళ్ళీ అంది.
ఏంది ఇలా కూసున్నావ్?'
'.....'
'సికారు వచ్చిండావా?'
మెల్లిగా తలూపాడు ఔనన్నట్టు
బిగుతైన శరీరం.
తలనిండా గడ్డి చేమంతిపూలు.
బిగదీసి రొంటిన చెక్కినకొంగు.
నడుములో ఓ వారన చెక్కినకొడవలి.
ప్రక్కన్నే గడ్డికొంగు.
ముఖంనిండా చిరుచెమటలు.
కొద్దిగా కరిగి ప్రక్కకు జారి వానాకాలంలో తుంగభద్రలా వున్న కుంకుమ బొట్టు.
అచ్చం ఓ చిత్రకారుడు గీసిన అందమైన అమ్మాయిబొమ్మలా వుంది.
అతను తనకేసి అలా సూస్తుంటే సిగ్గేసి అంది.
'ఏందయ్యా అట్టా సూస్తండావ్?'
'అహా! మీ మావ ఎంత అదృష్టవంతుడా అని'
'ఏందయ్యా అట్టా సూస్తండావ్?'
'అహా! మీ మావ ఎంత అదృష్టవంతుడా అని'
ప్రక్కకి ముఖం తిప్పుకుంటూ అంది.
'చాల్లేఅయ్యా! అట్టా మాట్టాడతావేంది?....మామావ అదురుష్టం ఏందిగానీ మా సరోజమ్మ అదురుష్టం మాటేందో...'
సారధి ఏమీ పలక్కుండా కూచున్నాడు.
గల్లుగల్లుమని కాళ్ళకడియాలు గొలుసులు చప్పుడు చేసుకుంటూ దగ్గరగావచ్చి నిలబడి అంది.
'నేపోతానయ్యా'
సారధికి ఆమెను కొంచెం ఏడ్పించాలనిపించింది.
'పో.....పో....నాతో చెప్పుతావేం? వచ్చేప్పుడు చెప్పి వచ్చావా? పోయేప్పుడు చెప్పటానికి?'
కోమలి మోపుని వదిలేసి సారధికి దగ్గరగా వచ్చి కూర్చుని అంది.
'అట్టా అంటే ఎట్టా అయ్యా....'
అతనిముఖంలోకి సూటిగా చూసి అంది.
'మాఅయ్య అర్సడూ!'
'ఊ'
'ఏందికబుర్లు సెప్తావా? లేకపోతే నన్ను కొడతావా?'
సారధి పలకలేదు.
'ఏం కావాలయ్యా..'
'.....'
'నీ మామూలు పాటేనా?'
తలవూపాడు.
'అట్టఅడగరాదాంట'
ఒక్కనిమిషం మౌనంగా వుండింది.
తర్వాత సూర్యుడికి ఎదురుగా కూర్చుని పాడటం మొదలెట్టింది.
'గట్టు మీదా మా అయ్యా....
గుట్టుగానూ కూసుంటే
గంతులేస్తూ అమ్మయ్యా
చెంతాకూ వస్తుంటే.....
ఓ బంగారుసామి.....'
రాగం తీస్తూ పాడుతోంది.
పాటపూర్తి కాకముందే గీతాంజలి వచ్చేసింది.
'ఏమే కోమలా! ఇక్కడ కూర్చుని మీ అయ్యగారికి కచ్చేరిచేస్తున్నావా? అక్కడ మీ అయ్య అరుస్తోంటే?
ఆమెమాట పూర్తికాకముందే చెంగున లేచి మెరుపులా మోపు నెత్తుకుని ఝల్లుఝల్లుమని గుండెలదిరేలా అడుగులు వేస్తూ గల్లుగల్లుమని గొలుసులు, కడియాలు చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది.
'సారధీ!'
ఉత్సాహపూరితమైన వదనంతో ఊరించే కళ్ళతో మనస్ఫూర్తిగా అభినందనల్ని తెలిపే కంఠస్వరంతో అంది గీతాంజలి.
'మీకారణాలకి ఊరంతా కుటుంబమేకదా'
ఆశ్చర్యంగా చూశాడతను.
'వసుదైక కుటుంబకమ్' అన్నది మీలాంటి వాళ్ళని చూసేనేమో? ఎందరుమామగార్లు, ఎందరు వదినగార్లు, ఎందరు అక్కగార్లు, ఎందరు మరదళ్ళు, ఎందరు చెల్లెళ్ళు ఎందరు అన్న తమ్ముళ్ళు.... బావమరదులెందరూ .....'
అడ్డొస్తూ అన్నాడు.
'అలా అనకు గీతా!, మా కరణాల్లో కూడా ఒంటికాకిలా వుండేవాళ్ళు లేకపోలేదు. అలా అనాల్సివస్తే వాళ్ళే ఎక్కువేమో ఊరంతా ఓ దారి ఉలిపి కట్టెది ఓ దారి అన్నదికూడా వాళ్ళని బట్టేవచ్చింది.....ఎందులోనైనా మంచి చెడూవుంది. అందుకే కవి చౌడప్పకరణాన్ని గురించి ఏ మన్నాడంటే.....'
'ఏమన్నా అనుకున్నా నేననుకున్నట్టు అనలేడులే'
సారధిమౌనం వహించాడు.