Next Page 
మనసు పొరల్లో పేజి 1

                                 

 

                                                 మనసు పొరల్లో     

                                                                                శారదా అశోక వర్ధన్

                 

 

    ఆ కొత్త వ్యక్తిని చూసి అందరూ మొహమొహాలు చూసుకున్నారు.! ఎవరి ప్రెండ్స్ తో వాళ్ళు చెవులు కొరుకున్నట్టుగా గుసగుసలు చెప్పుకున్నారు!
    మొగవాళ్ళు అతడి కేసి హేళనగా చూశారు. ఆడపిల్లలు కొంత బెరుకగా అదొక లాంటి భయంతో చూశారు అతడి ఆకారాన్ని.
    అతడు ఇవేవి పట్టించుకోకుండా వెళ్ళి ఖాళీగా వున్న సీట్లో కూర్చున్నాడు. చివర బెంచిలో! అతడు లెక్చరర్, స్టూడెంటో తెలియక తికమక పడ్డ కొందరు ఈతడేళ్ళీ స్టూడెంట్స్ వరుసలో కూర్చోవడం చూసి , ఓహో! ఇతడు స్టూడెంట్ లే! అనుకున్నారు.
    'హిస్సో......." అని అరిచాడు అందరిలోకి గడుగ్గాయి అనిపించుకున్న మహేశ్! "జాంబవంతా! నీవునూ మాతో చదువుకోనవలయునని వచ్చితివా?" అన్నాడు ఆకతాయి శాస్త్రి నాటక ఫక్కీలో అతడి వంకర మూటిని జులపాలనీ ఎత్తి చూపిస్తూ.
    అందరూ ఘొల్లున నవ్వారు.
    కానీ అతడు నవ్వలేదు. ఏదో మ్యాగజైన్ తీసి తిరగేస్తున్నాడు తనని కాదన్నట్లుగా.
    వీళ్ళింత గోల చేస్తున్నా అతనలా పట్టించుకోకుండా కూర్చోవటం అందరికీ ఆశ్చర్యం వేసింది. "వాట్ ఈజ్ యువర్ నేమ్?" అడిగాడు గోవింద్.
    పానకాలు." ముక్తసరిగా సమాధానం చెప్పి మేగజైన్ చదువుతూ కూర్చున్నాడు.
    ఆ పేరు వినగానే మళ్ళీ అందరూ ఘొల్లున నవ్వారు ఎగతాళిగా పానకాలూ వదపప్పూ అంటూ.
    కానీ అతడు వాళ్ళ కేసైనా చూడలేదు. పేజీలు  తిప్పుతూనే వున్నాడు. అంతలో లెక్చరర్ జనార్చ్ధాన్ వచ్చాడు.
    అటెండెన్స్ తీసుకున్నాడు. తరువాత క్లాసు మొదలెట్టాడు. అది ఇంగ్లీషు లిటరేచర్ క్లాసు. కీట్స్ పోయెట్రీ గురించి పాఠం జరుగుతోంది. అందరూ లెక్చరర్ చెప్పే జోకులకు పాఠం మధ్యలో నవ్వడం, లేదా సరదాగా మాట్లాడడం చేస్తున్నారు. కానీ పానకాలు మాత్రం పెదవి తిప్పకుండా, కనీసం నవ్వకుండా కూర్చోవడం అందరికీ అశ్చర్యం కలిగించింది. అతడు కూర్చున్న విధానం చూసి, ఏదో పరధ్యానంగా వున్నట్టనిపించేది. కానే ఏదైనా ప్రశ్న అడిగితే అందరికన్నా ముందే రైటో తప్పో పానకాలు సమాధానం చెప్పేతీరు, ఎంతో కాన్పిడెంట్ గా అందర్నీ మళ్ళీ ఆశ్చర్యంలో ముంచేది. పానకాలు అందరి వంకా నిర్లక్ష్యంగా చూసేవాడు.
    కారు నలుపు రంగు శరీరం, తెల్లటి పలువరుస, వంకర మూతి కళ్ళలో ఎర్ర జీర, బొద్దుగా చిన్న పొదలాగా పెరిగిన జులపాల జుట్టూ- చూడగానే తెలుగు సినిమాలలో విలన్ లాగా కనిపిస్తాడు పానకాలు. డానికి తోడు అతగాడి వేష భాషలు కూడా అలాగే వుండేవి. వోడులుగా వుండే ప్యాంటు, వెలిసిపోయి రంగు పోయిన షర్టూ- లేకపోతే చిరుగులు పడ్డ షర్టు, కనీసం బట్టలకి ఇస్త్రీ కూడా వుండేది కాదు. తైల సంస్కారం లేని ఆ జుట్టు గజిబిజిగా గాలు కేగురుతూ ఉండేది. కాళ్ళకి వేసుకున్న చెప్పులు అరిగిపోయి , ఎన్నో చోట్ల కుట్లు పడి , అసహ్యంగా కనిపించేవి. చాలామంది అతణ్ణి చూడగానే దూరంగా వెళ్ళిపోయేవారు. బీదవాడెమో పాపం అంటే అదీ కాదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ బంధువులనీ చెప్పేవాడు.
    "బాబోయ్! పగలు చూస్తే రాత్రి కల్లో కోస్తాడు" అనేది సుభద్ర.
    "ఒకవేళ రాత్రి చూస్తే గుండె ఆగిపోతుంది" అనేది నవ్వుతూ వినోదిని.
    "పాపం ఇతడ్ని పెళ్ళేవరు చేసుకుంటారో" అనేది జాలిపడుతూ వీణ.
    "ఎవరో చేసుకుంటారులే గంతకి తగ్గ బొంత!"
    ఎగతాళిగా అనేది భార్గవి.
    "పాపం, ఎందుకే అందరూ అతణ్ణి అలా అంటారు? రూపంలో ఏముంది? భగవంతుడిచ్చిన రూపంలో పుడతాం. తెలివైన వాడే. మొన్న చూడు , కీట్స్ పోయెట్రీ గురించి లెక్చరర్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికి ఎంత చక్కగా సమాధానం చెప్పాడో! బ్యూటీ........ఈజ్ నాట్ ఫిజికల్ వోన్లీ! ఇటీజ్ మెంటల్ అల్సొ!" అంది కౌసల్య.
    'ఆహా హాహా! ఏమి దయార్ద్ర హృదయము నీది? కొంపదీసి ఆ మెంటల్ బ్యూటీని ప్రేమించడం లేదు కదా?' అని నవ్వింది రాగిణి. "ఛీ! అనవసరంగా పిచ్చివాగుడు వాగకు" అంది కౌసల్య.
    "అరె! అడుగో నీ ఫ్రెండు! మాటల్లోనే కనిపించాడు.' అంది రాగిణి. కౌసల్య కేసి చూసి కొంటెగా అందరూ అటు చూశారు.

Next Page