చలికాలంలో మీ జుట్టు పీచుగా మారుతోందా..అయితే ఈ చిట్కాలు మీ కోసం! అందమైన, పొడవాటి జుట్టు ప్రతి అమ్మాయి కోరిక. చలికాలంలో జుట్టు నిర్జీవంగా మారుతుంది. ముఖ్యంగా చల్లని గాలులు మీ వెంట్రుకల కుదుళ్లను  చికాకుపరుస్తాయి. చల్లదనం వల్ల ఈ సీజన్‌లో వేడి నీటితో తలస్నానం చేయడం సహజం, అంతేకాదు వివిధ రకాల షాంపూలు, కండీషనర్‌లను ఉపయోగిస్తారు. దీని కారణంగా జుట్టు రంగు కూడా తగ్గుతుంది. అందుకే ఈ చలికాలంలో  జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చలికాలంలో తక్కువగా తలస్నానం చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల తలపై మలాసెజియా అనే ఫంగస్ అనేక రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టును శుభ్రం చేసుకోకపోవడం వల్ల వేగంగా వ్యాపిస్తుంది. ఈ సీజన్‌లో, జుట్టును ఫంగస్ నుండి రక్షించడానికి, జుట్టును అందంగా మార్చడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. శీతాకాలంలో జుట్టును ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం. హెయిర్ మాస్క్ వేసుకోండి:  శీతాకాలంలో మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడానికి , మీ జుట్టుకు హెయిర్ మాస్క్ వేసుకుంటే మంచిది.  మీ వెంట్రుకలు మాయిశ్చర్ పోకుండా  తేమగా ఉండేందుకు జుట్టు మీద ముసుగు వేసుకోవాలి. అలోవెరా, షియా బటర్, నూనెతో కూడిన హెయిర్ మాస్క్‌ని జుట్టుకు అప్లై చేయండి. జుట్టుపై కండీషనర్‌ను తప్పకుండా అప్లై చేయండి:  చలికాలంలో తరచుగా మహిళలు విపరీతమైన చలి కారణంగా జుట్టుపై కండీషనర్‌ను ఉపయోగించరు. కండీషనర్ లేకుండా, జుట్టు పొడిగా మారుతుంది. చలికాలంలో జుట్టు సంరక్షణకు కండీషనర్ బాగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి:  శీతాకాలంలో, వేడి నీరు జుట్టు యొక్క మెరుపును తొలగిస్తుంది, అటువంటి పరిస్థితిలో, జుట్టును కడగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. నూనెతో జుట్టుకు మసాజ్ చేయండి:  చలికాలంలో మీ వెంట్రుకలకు ఆలివ్ నూనెతో మసాజ్ చేయడం మంచిది. ఆలివ్ జుట్టుకు పోషణను అందిస్తుంది. వెంట్రుకల పొడి తనాన్ని కూడా తొలగిస్తుంది. ఎక్కువ నీరు త్రాగాలి: చలికాలంలో తక్కువ నీరు త్రాగాలి, శరీరానికి నీరు పుష్కలంగా ఉండటం అవసరం. అందాన్ని పెంచడంలో నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల కూడా జుట్టు హైడ్రేటెడ్‌గా ఉంటుంది.  

చలికాలం మనకు వణుకు పుట్టించడమే కాకుండా చర్మ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మన చర్మంలో పగుళ్లు ఏర్పడతాయి. సబ్బుతో కడిగితే మరింత దెబ్బతింటుంది. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలు పగుళ్లు ఏర్పడతాయి. కాబట్టి చలికాలం ప్రారంభం నుంచే చర్మ సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే చర్మాన్ని మునుపటిలా కాపాడుకోవచ్చు. దాని కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. పగిలిన పెదవుల కోసం: శీతాకాలంలో మీ పెదాలు పగలడం సహజం, దీనికి కారణం మీ శరీరంలో నీటి శాతం తగ్గడమే. అలాంటి సమయంలో మీ పెదవుల చుట్టూ ఉన్న చర్మం పొడిగా మారి పగిలిపోతుంది. ఈ సమయంలో మీరు లిప్ స్క్రబ్‌ని ఉపయోగించాలి. తర్వాత కావాలంటే లిప్ స్టిక్ వేసుకోవచ్చు. మీరు స్క్రబ్ ఉపయోగించకుండా లిప్‌స్టిక్‌ను అప్లై చేస్తే, అది మీ పెదాలను దెబ్బతీస్తుంది.   మాయిశ్చరైజర్ ఉపయోగించండి: చలికాలంలో ముఖం కూడా బాగా డ్రైగా మారి ముఖంపై మృతకణాలు పెరుగుతాయి. ఈ కారణంగా, మాయిశ్చరైజర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం మర్చిపోవద్దు. మీ చర్మ రకాన్ని బట్టి  మాయిశ్చరైజర్‌ని ఉపయోగించడం వల్ల మీ చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. పొడిగా మారదు. వేడి స్నానం అంత మంచిది కాదు: చలికాలంలో వేడి నీటి స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారడమే కాకుండా చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చర్మ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మన చర్మం సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ కోల్పోతుంది. దీని వల్ల చర్మంలో తేమ స్థాయి మునుపటిలా ఉండదు. ఇది మీ చర్మాన్ని కఠినం చేస్తుందని చెప్పవచ్చు. హ్యాండ్ క్రీమ్‌ వాడాలి: చలికాలంలో మీ ముఖం, చేతులు మాత్రమే కాదు. మీ అరచేతులపై ఉన్న చర్మం కూడా పగిలి పోతుంది. ముఖ్యంగా కొంతమందికి అరచేతి చర్మం ముడతలు పడిపోతుంది. కాబట్టి మీ చర్మం మృదువుగా ఉండటానికి హ్యాండ్ క్రీమ్ అప్లై చేయడం మర్చిపోవద్దు. మాయిశ్చరైజర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి: చలికాలంలో మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మీకు మాయిశ్చరైజర్ అవసరం. కాబట్టి స్నానం చేసిన తర్వాత లేదా ఫేస్ వాష్ ఉపయోగించిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు.  

చలికాలంలో జుట్టు మెరవడానికి అదిరిపోయే అయిదు హెయిర్ ప్యాక్ లు!  జుట్టు అందంగా ఉంచుకోవడం అమ్మాయిలకు ఇష్టం. కానీ ఎంత ప్రయత్నం చేసినా చాలామంది జుట్టు అందంగా ఉండదు. మరీ ముఖ్యంగా చలికాలంలో జుట్టు సంబంధ సమస్యలు కూడా అధికం అవుతాయి. చలిగాలుల కారణంగా జుట్టులో తేమ కోల్పోయి పొడిబారుతుంది. జుట్టు జీవం కోల్పోయినట్టు టెంకాయ పీచులాగా కనిపిస్తుంది. కొందరికి చలికాలంలో చుండ్రు సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యలేవీ ఉండకూదన్నా, జుట్టు ఆరోగ్యంగా పట్టుకుచ్చులా మెరవాలన్నా కింది అయిదు హెయిర్ ప్యాకులు వాడితే సరి.. గ్రీన్ టీ హెయిర్ ప్యాక్.. ఒక గిన్నెలో గుడ్డులోని పచ్చసొన తీసుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల గ్రీన్ టీ వెయ్యాలి. దీన్ని బాగా మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుండి జుట్టు అంచుల వరకు మొత్తం పట్టించాలి. జుట్టు కుదుళ్లకు బాగా అంటేలా మసాజ్ చేయాలి. కేవలం ఇరవై నిమిషాలు దీన్ని జుట్టుమీద ఉంచుకుంటే సరిపోతుంది. తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. హెయిర్ ఫాల్ ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. జుట్టు మృదువుగా పట్టుకుచ్చులా మారుతుంది. మందారపూలు.. కప్పు మందార పూలతో జుట్టు మెరుస్తుందండోయ్. మందార పువ్వులను రెక్కలుగా విడదీసి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. మరుసటిరోజు దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. దీన్ని కూడా జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. గంట సేపు  అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చెయ్యాలి.  ఈ ప్యాక్ జుట్టును మెరిపిస్తుంది. పెరుగు.. ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండే పెరుగు జుట్టును పట్టుకుచ్చులా మారుస్తుంది. పెరుగులో ఒక చెంచా తేనె, చెంచా బాదం నూనె కలపాలి. దీన్ని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. ఇరవై నిమిషాలు అలాగే ఉంచి తరువాత  గాఢత లేని షాంపూతో తలస్నానం చెయ్యాలి. పాలు, తేనె.. పాలలో తేనె కలుపుని తాగితే అమృతంలా ఉంటుంది. కానీ ఈ రెండూ కలిపి మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. ఈ ప్యాక్ రిమూవ్ చేయడానికి గాఢత లేని షాంపూను మాత్రమే వాడాలి. లేదంటే మెరుపు కోల్పోతారు. ఇది జుట్టు పెరుగుదను కూడా ప్రోత్సహిస్తుంది. అరటిపండు.. అరటిపండు శరీర ఆరోగ్యానికే కాదు సౌందర్య సాధనంగా కూడా భలే ఉపయోగపడుతుంది. కాస్త పండిన అరటిపండు ముక్కలు, కొన్ని చుక్కల బాదం నూనె కలిపి మిక్సీ పట్టాలి. మెత్తగా అయిన ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుండి అంచుల వరకు అప్లై చెయ్యాలి.  ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో తల స్నానం చెయ్యాలి. ఇది తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. జుట్టును పట్టుకుచ్చులా మారుస్తుంది. డాండ్రఫ్ సమస్య తొలగిస్తుంది.                     (గమనిక: ఈ హెయిర్ ప్యాక్ లు  వివిధ వేదికలలో హెయిర్ కేర్ నిపుణులు సూచించినవి. సైనస్ సమస్యలు, జుట్టు సంబంధ సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)   *నిశ్శబ్ద.  

చర్మానికి విటమిన్-కె ఎందుకు అవసరమో తెలుసా! చర్మం  ఆరోగ్యంగా ఉండటానికి  ప్రోటీన్లు, విటమిన్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా విటమిన్-కె చర్మసంరక్షణలో చాలా అవసరం. అందరూ విటమిన్-ఇ గురించి మాట్లాడతారు కానీ విటమిన్-కె గురించి అస్సలు తెలియనే తెలియదు. అందుకే  ముఖ చర్మానికి విటమిన్-కె ఎందుకు అవసరమో తెలుసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చర్మానికి విటమిన్-కె చేసే మేలు.. విటమిన్-కె చర్మం మీద వాపులు, దురదలు తగ్గించడంలో సహాయపడుతుంది.  దీనికారణంగా ఇది తామర వంటి దారుణమైన సమస్యలను కూడా తగ్గించగలదు. చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే కొల్లాజెన్ చాలా అవసరం.  కొల్లాజెన్ చర్మానికి ఎలాస్టిక్ స్వభావాన్ని ఇస్తుంది. ఫలితంగా చర్మం మీద ముడతలు పడకుండా చేస్తుంది. అయితే విటమిన్-కె కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది. కళ్లకింద నల్లని వలయాల గురించి ఆందోళన చెందని వారు ఉండనే ఉండరు. కానీ విటమిన్-కె దీనికి చెక్ పెడుతుంది. కళ్ల కింద నల్లగా మారిన చర్మంలో రక్తనాళాలు బలహీనంగా ఉంటాయి. ఈ రక్తనాళాలను బలోపేతం చేయడం ద్వారా కళ్లకింద నల్లటి వలయాలు తగ్గించడంలో విటమిన్-కె సహాయపడుతుంది. చర్మం మీద చాలామందికి నరాలు ఉబ్బినట్టు కనిపిస్తుంటాయి. వీటిని స్పైడర్ సిరలు అని అంటారు. ఈ స్పైడర్ సిరల రూపాన్ని తగ్గించడంలో విటమిన్-కె సహాయపడుతుంది. చాలామందిలో పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోయిన డార్క్ స్పాట్స్, వయసు వల్ల వచ్చే ముడతలు, మచ్చలు మొదలైనవాటికి విటమిన్-కె భలే పరిష్కారం. హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో కూడా విటమినే-కె సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మానికి కలిగే మంటలు, ఆక్సీకరణ ఒత్తిడి, సూర్యుని హానికరమైన యువి కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో కూడా విటమిన్-కె సహాయపడుతుంది. విటమిన్-కె కొత్త చర్మకణాలు ఏర్పడటాన్ని, రక్తం గడ్డకట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇవి రెండూ గాయాలు తొందరగా నయం కావడానికి సహాయపడతాయి.                    *నిశ్శబ్ద.

ఇంట్లోనే అందుబాటులో ఉన్నవాటితో  బ్రాండ్ ను తలపించే బాడీ లోషన్!   చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు అధికం అవుతాయి. వీటిని తేలిగ్గా తీసుకుంటే ఆ తరువాత చాలా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే అమ్మాయిలు చాలా మంది మార్కెట్లో బోలెడు బాడీ లోషన్లు కొనుగోలు చేస్తారు. బ్యూటీ ఉత్పత్తి దారులు కూడా చలికాలం మొదలైందంటే బాడీ లోషన్, మాయిశ్చరైజర్లకు సంబంధించి యాడ్స్ తో సావగొడుతుంటారు. అయితే ఇవన్నీ రసాయలతో కూడినివి కావడంతో వీటిని కొనుగోలు చేయడంలో చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతో బ్రాండెడ్ బాడీ లోషన్ల లాగా  ఫలితాలు ఇచ్చే బాడీ లోషన్ ను తయారుచేయవచ్చు. దీనికి కావలసిన పదార్థాలేంటో.. పూర్తీగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. బాడీ లోషన్ తయారీకి కావసిన పదార్థాలు చాలా సింపుల్ గా ఇంట్లో లభ్యమయ్యేవే.. ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె నిమ్మకాయ అరచెక్క విటమిన్-ఇ క్యాప్సుల్స్ మూడు నుండి నాలుగు తయారుచేసుకునే విధానం.. ముందుగా  నిమ్మకాయ రసం తీయాలి. ఒక కప్పు కొబ్బరినూనెను ఒక గిన్నెలో వేసుకునే సన్నని మంట మీద కొద్దిగా వేడి చేయాలి. ఇందులో విటమిన్-ఇ క్యాప్సూల్, నిమ్మరసం వేయాలి. దీని ప్రభావం మరింత ధృడంగా ఉండటానికి దీనికి కొబ్బరి నూనెతో పాటు బాదం నూనెను సమంగా తీసుకుని ఉపయోగించవచ్చు. ఇవన్నీ కలిసి బాగా మిక్స్ చేసిన తరువాత దీన్ని ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని అప్లై చేస్తూంటే ఏ బ్రాండ్ బాడీ లోషన్ కూడా ఇవ్వని గొప్ప ఫలితాలు ఇస్తుంది.                                       *నిశ్శబ్ద.

ముఖ చర్మం పాడవుతోందా... మీరూ  ఈ తప్పులు  చేస్తున్నారేమో!     అమ్మాయిలలో ఎక్కువగా ఆకర్షించేది ముఖమే. ముఖం అందంగా ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ మరింత ఆకర్షణగా మారుతుంది.  చర్మం రంగు ఏదైనా సరే ముఖం చక్కగా, కాంతివంతంగా, మొటిమలు, మచ్చలు ఏవీ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. కానీ  అలాంటి ముఖం చాలా తక్కువ మందికి ఉంటుంది.  అయితే ముఖం మీద మచ్చలు, ముడతలు, మొటిమల తాలూకు గుర్తులు ఏవీ లేకుండా ఉండటం కోసం ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు వాడతారు. ఫేస్ క్రీములు, లోషన్లు, ఫేస్  వాష్ లు ఇలా చాలా ఉపయోగిస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ ఉత్పత్తులన్నీ మంచి వాసన వస్తాయి తప్ప చర్మాన్నిమాత్రం బాగు చెయ్యవు.  చర్మం చక్కబడాలంటే దానికి కావల్సింది  వాణిజ్య ఉత్పత్తులు ఉపయోగించడం కాదు, చర్మాన్ని శుభ్రం చేసే విధానం తెలుసుకోవడం. ఫేస్ వాష్ చేయడంలో  చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకుని వాటిని  సరిచేసుకోవడం అవసరం. క్లెన్సర్.. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సరైన క్లెన్సర్ ఎంచుకోవడం తప్పనిసరి. చాలామంది కొంటున్నారనో, మార్కెట్లో వైరల్ అవుతోందనో క్లెన్సర్ కొనుగోలు చేయకూడదు.  చర్మాన్ని బట్టి క్లెన్సర్ ఎంచుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి ఎటువంటి నష్టం కలగదు. ఆశించిన ఫలితాలు కూడా ఇస్తాయి. ఒకవేళ ఏదైనా క్లెన్సర్ ఉపయోగించగానే ముఖం మీద గుల్లలు, దద్దుర్లు, ముఖ చర్మం ఎర్రబడటం వంటివి జరిగితే అలాంటి క్లెన్సర్ కు దూరం ఉండాలి. వేడినీరు వద్దు.. ముఖం శుభ్రం చేసుకోవడానికి కొందరు వేడినీరు ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మం శుభ్రపడుతుందని అంటారు. కానీ వేడినీటితో ముఖం కడిగితే ముఖ చర్మంలో ఉన్న తేమ కోల్పోతారు. అదే చల్లని నీటితో కడితే ముఖ చర్మం తేమ కోల్పోదు. రుద్దకూడదు.. ముఖం కడిగేటప్పుడు   క్లెన్సర్ లేదా సోప్ వంటివి ఉపయోగించే ముందు ముఖాన్ని గట్టిగా రుద్దుతూ ఉంటారు. ఇలా చేస్తే చర్మం దెబ్బతింటుంది.  మృదుత్వం కోల్పోయి చర్మం రఫ్ గా మారిపోతుంది. అంతేకాదు చర్మ రంధ్రాలు కూడా సాగిపోవడానికి అస్కారం ఉంటుంది. ముందు జాగ్రత్త.. ముఖం కడుక్కోవడానికి ముందు చేతులు  శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. చేతులు శుభ్రం చేసుకోకుండా ముఖం కడుక్కుంటే  చేతులలో ఉన్న మురికి ముఖ చర్మానికి అంటుకుంటుంది. ఇది ముఖం మీద మొటిమలు, గుల్లలు, దద్దుర్లు, ముఖం రంగుమారడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.                                                    *నిశ్శబ్ద.

 ఈ నాలుగు  పదార్థాల ముందు  బ్యూటీ పార్లర్ లో ఖరీదైన ఫేషియల్స్ కూడా పనికిరావు.. అమ్మాయిలకు చర్మ సంరక్షణ మీద ఆసక్తి ఎక్కవ. చాలా మంది చర్మ సంరక్షణ పేరుతో  దృష్టి అంతా ముఖ కాంతిని పెంచడంపైనే ఉంచుతారు.   ముఖంలో  మెరుపు కనిపిస్తూ ఉంటే చాలు తాము యవ్వనంగా ఉన్నామని అనుకుంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్ లో వందలాది రూపాయలు ఖర్చు చేస్తారు.  పండుగలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్లు, పార్టీలు చాలా చిన్న వేడుకలలో కూడా అమ్మాయిలు తమ అందాన్ని మెరిపించడానికి ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. బ్యూటీ పార్లర్లలో కాస్త ఖరీదైన ఫేషియల్ క్రీములు ఉపయోగించి వేలాది రూపాయలు  తీసుకుంటారు. వీటిని వాడటం వల్ల చర్మం మెరుపు వచ్చినా అది తాత్కాలికమే. కానీ బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ ను తలదన్నే  పదార్దాలు చాలా సులువుగా, తక్కువ ధరకే  లభిస్తాయి. వీటిని ఉపయోగిస్తే ముఖం దగదగ మెరిసిపోతుంది. పచ్చిపసుపు.. పచ్చిపసుపు ముఖానికి మెరుపు ఇవ్వడంలోనూ, ముఖం మీద మచ్చలు, మొటిమలు, మొటిమల తాలుకూ గుర్తులను తగ్గించడంలోనూ బాగా సహాయపడుతుంది. రెండు చెంచాల పచ్చిపసుపును ఒక చెంచా శనగపిండితో కలపాలి. దీంట్లో తగినంత రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత చేతులను కొద్దిగా తడి చేసి ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేయాలి. దీన్ని రెండు లేదా మూడు రోజులకు ఒకసారి వాడాలి. కేవలం మూడు సార్లు వాడటంతోనే ముఖం లో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీన్ని లైప్ స్టైల్ లో భాగం చేసుకుంటే ముఖానికి ఏ క్రీములు అక్కర్లేదు. జాజికాయ.. చర్మంపై మచ్చలు మరియు మచ్చలను తొలగించడంలో జాజికాయ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జాజికాయను గ్రైండ్ చేసి, దాని పొడిని తయారు చేసుకోవాలి. ఈ పొడికి  తేనెను కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మొత్తం ముఖం మీద లేదా మచ్చలు, మొటిమలు ఉన్న ప్రాంతంలో అయినా   చేయవచ్చు. దీన్ని రాత్రి ముఖానికి రాసుకుని అలాగే వదిలేయవచ్చు.  తెల్లారేసరికల్లా ముఖం మెరిసిపోతుంది. దీన్ని పాలో అవుతుంటే అసలు ముఖానికి ఏ ఇతర ఉత్పత్తులు వాడక్కర్లేదు. చందనం.. చందనం చలువ చేస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు తగ్గిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. రెండు చెంచాల గంధపు పొడికి రోజ్ వాటర్ వేసి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.  దీన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తరువాత తడి చేత్తో సున్నితంగా స్ర్కబ్ చేస్తూ కడిగేసుకోవాలి. దీని వల్ల టానింగ్ సమస్య తొలగిపోయి గ్లో పెరుగుతుంది. దాల్చిన చెక్క.. వంటల్లోకే కాదు ముఖ సౌందర్యంలోనూ దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కను  మిక్సీలో వేసి  పొడి చేసుకోవాలి. అందులో పండిన అరటిపండు వేసి బాగా  కలపాలి. దీన్ని మెత్తని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలపాలి. దీన్ని ముఖానికి పట్టించాలి.  ఆరిన తరువాత శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇది చర్మం మెరుపును మెరుగుపరుస్తుంది. ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.                                                           *నిశ్శబ్ద.

ఫేషియల్ తరువాత ఈ తప్పులు అస్సలు చేయొద్దు! అమ్మాయిలు ఆరోగ్యం కంటే కూడా చర్మసంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అందం ఎప్పుడూ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వేసవి కాలంలో  ఆరోగ్యంతో పాటు చర్మంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు చాలా  వస్తాయి. మరీ ముఖ్యంగా ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. సూర్యరశ్మి కారణంగా చర్మం కమిలిపోవడం, రంగు మారడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, మహిళలు తమ ముఖానికి ఫేషియల్ చేయించుకుంటారు. ఫేషియల్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగి, ముఖచర్మం  శుభ్రపడుతుంది. చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. కానీ వందలాది రూపాయలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా, ఇంట్లో సొంతంగానే పేషియల్ చేసుకున్నా.. ఫేషియల్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న వయసులోనే ముసలితనం మొదలవుతుందని మీకు తెలుసా? చాలా మంది బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ కూడా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఫేషియల్ చేయించుకున్న తర్వాత కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి పాటించకపోతే.. ఫేషియల్స్  అందాన్ని ఇవ్వడానికి బదులుగా హాని కలిగిస్తాయి. ఫేషియల్ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. మేకప్‌కు దూరంగా ఉండాలి.. ఫేషియల్ చేసినప్పుడు ముఖ చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాంటి సమయంలో  వెంటనే మేకప్ చేస్తే, అది చర్మ సమస్యలను కలిగిస్తుంది.మేకప్ తాలూకూ రసాయనాలు చర్మరంధ్రాల్లోకి చొచ్చుకెళ్లి చర్మానికి నష్టం చేకూరుస్తుంది. సూర్యరశ్మికి గురికాకూడదు.. ఫేషియల్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. పార్లర్ నుంచి ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎండలో, దుమ్ములో బయటికి వెళితే దుమ్ము, ధూళి, గాలిలో ఉండే వాహనాల పొగ, సూర్యకిరణాల ప్రభావం అన్నీ కలిపి చర్మాన్ని తొందరగా పాడుచేస్తాయి. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకున్న తరువాత స్కూటీ ప్రయాణం మానుకోవాలి, ఆటోలో వెళ్లడం మంచిది. స్యూటీలో వెళ్ళాలి అంటే ముఖానికి స్కార్ఫ్  వాడటం మరచిపోకూడదు.  ఫేస్‌వాష్‌తో అస్సలు చేయొద్దు..  ఫేషియల్ చేయించుకున్న తరువాత  రోజు మొత్తం  ఫేస్‌వాష్‌ని ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. పొరపాటున ఫేస్ వాష్ ఉపయోగిస్తే ఫేషియల్ ద్వారా చర్మానికి అందిన మృదుత్వం పోతుంది. ఫలితంగా ఫేస్ వాష్ లో రసాయనాల వల్ల చర్మరంధ్రాలు దెబ్బతిని ఓపెన్ పోర్స్ సమస్యకు దారితీస్తుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. ఫేషియల్ తర్వాత చర్మ సంరక్షణ ఉత్పత్తులను  దూరంగా ఉంచాలి . ఫేషియల్  ముఖచర్మం లోపలివరకు ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో చర్మసంరక్షణ ఉత్పత్తులు వాడితే అందులో ఉన్న రసాయనాల వల్ల చర్మం మరింత సున్నితమైపోయి దారుణంగా దెబ్బతింటుంది. అందుకే ఫేషియల్  తర్వాత  స్క్రబ్ చేయడం, ఇతర ఉత్పత్తులు వాడటం చేయకూడదు.                                    ◆నిశ్శబ్ద.

అవిసె గింజలను  ఈ మూడు విధాలుగా వాడితే జుట్టు పెరుగుదల అద్బుతమే..   అమ్మాయిల అందంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందంగా ఉన్న కురులు అదనపు ఆకర్షణ తెస్తాయి. దుమ్ము,  పెరుగుతున్న కాలుష్యం  ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా చర్మం,  జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో సహజ మార్గాల్లో జుట్టును అందంగా, ఆరోగ్యంగా  మార్చడానికి అవిసె గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి.  అవిసె గింజలను మూడు మార్గాలలో ఉపయోగించడం వల్ల  జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. అవిసె గింజలతో ఫాలో కావాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. హెయిర్ జెల్..  అవిసె గింజలను హెయిర్ జెల్‌గా ఉపయోగించవచ్చు .  ఈ జెల్‌ను ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. అవిసె గింజలను ఉడికించి జెల్ తీసుకోవాలి.  అందులో  అలోవెరా జెల్ కలపాలి.  ఈ హెయిర్ జెల్‌ను కొద్ది మొత్తంలో తీసుకొని మీ జుట్టు మొత్తం పొడవునా అప్లై చేయాలి. తర్వాత తలంతా   మసాజ్ చేయాలి. దీన్ని  15 నిమిషాలు అలాగే ఉంచి ఆపై సాధారణ షాంపూతో కడగాలి. హెయిర్ మాస్క్.. అవిసె గింజలను  హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. కేవలం ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. వీటిని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని  జుట్టుకు పట్టించాలి. దీనితో  స్కాల్ప్‌కు మసాజ్ చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో కడిగేయాలి. హెయిర్ ఆయిల్..  జుట్టుకు నూనెగా అవిసె గింజలను ఉపయోగించవచ్చు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు జుట్టు కోసం అవిసె గింజల  ఆయిల్ ఉపయోగించాలి. దీనితో  స్కాల్ప్‌ని ఐదు నుండి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.  అలాగే జుట్టు మెరుపును తీసుకురావడానికి కూడా అవిసె గింజల నూనె  అప్లై చేయవచ్చు. అవిసె గింజల ప్రయోజాలు.. అవిసె గింజలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇది స్కాల్ప్ సెన్సిటివిటీ,  ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును హైడ్రేట్ చేస్తుంది. అవిసె గింజలు అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి  జుట్టుకు  సరైన పోషకాహారాన్ని అందిస్తాయి. అవిసె గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.  జుట్టు పెరుగుదలను పెంచడానికి మంచి మార్గం కోసం చూస్తున్నట్లయితే, అవిసె గింజలు సహాయపడతాయి. చుండ్రు సమస్యకు కూడా అవిసెగింజలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియాను నివారిస్తాయి, తద్వారా చుండ్రు నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.                                                           *నిశ్శబ్ద.

గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. ఇలా వాడితే  అందాన్ని  కూడా మెరిపిస్తుంది..   ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది  గ్రీన్ టీ తప్పకుండా తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తాగితే కొలెస్ట్రాల్ అదుపులో ఉండటం నుండి, బరువు తగ్గడం వరకు, ఇమ్యునిటీ పెరగడం నుండి రోజంతా ఉల్లాసంగా ఉండటం వరకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గ్రీన్ టీని కేవలం ఆరోయానికే కాదు, అందాన్ని మెరిపించడానికి కూడా ఉపయోగించవచ్చు. మారుతున్న జీవనశైలి, వాతావరణ ప్రభావం, ఆహారపు అలవాట్లలో మార్పు, దుమ్ము, ధూళి కారణంగా చర్మం దెబ్బతింటుంది. దీన్ని తిరిగి మెరిసేలా చేయడానికి బ్యూటీ పార్లర్లలో బోలెడు డబ్బు పోస్తుంటారు. కానీ అవన్నీ వద్దండోయ్.. కేవలం  గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ లు చర్మాన్ని మెరిపిస్తాయి. గ్రీన్ టీ తో తయూరుచేసి వాడాల్సిన ఫేస్ ప్యాక్ లు ఏంటో ఓ లుక్కేస్తే.. ముల్తాని మట్టి, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. జిడ్డు చర్మం ఉన్నవారికి ముల్తానిమట్టి చాలా  ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చెంచా ముల్తానీ మట్టికి 2 చెంచాల గ్రీన్ టీ వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మందంపాటి పొరగా ముఖం మీద అప్లై చేసి కనీసం 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది జిడ్డును తొలగించడమే కాదు మృదువుగా ఉంచుతుంది. ముఖ చర్మాన్ని మెరిపిస్తుంది. ఆరెంజ్ పీల్, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. ఆరెంజ్ తొక్కలను  ముఖానికి ఉపయోగించడం ద్వారా చర్మం మెరుస్తుంది. ఇక దీనికి గ్రీన్ టీ కూడా జోడిస్తే రెట్టింపు ఫలితాలు పొందుతారు.  . తాజా నారింజ తొక్కలను అయినా ఉపయోగించవచ్చు. లేదా నారింజ తొక్కల పొడిని అయినా ఉపయోగించవచ్చు.  ఒక చెంచా గ్రీన్ టీలో ఒక చెంచా నారింజ తొక్క పొడి,  అర చెంచా తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను  ముఖం,  మెడపై  అప్లై చేయాలి. దీన్ని 15నిమిషాల పాటు అలాగే ఉంచాలి.  ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. నిమ్మ, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఒక చెంచా గ్రీన్ టీ నీటిలో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడగాలి. అంతే కేవలం మూడే మూడు ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల పార్లర్ టైప్ మెరుపు సొంతమవుతుంది.                                                         *నిశ్శబ్ద.

పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే వారి చదువు ఎలా ఉండాలో తెలుసా?   చదువుకోరా గాడిదా అని చిన్నపిల్లలను  పెద్దలు ఒక్కసారి అయినా తిట్టే ఉంటారు, ఇప్పటి పెద్దలు కూడా తమ చిన్నతనంలో  తమ తల్లిదండ్రులతో తిట్టించుకునే ఉంటారు. చదువుకోవాల్సిన వయసులో దాని విలువ అర్థం కాలేదు, వయసైపోయిన తరువాత చదువు విలువ అర్థం అవుతుందని చాలామంది చెబుతారు. ఈ కారణంగానే  పెద్దలు తమ పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటుంటారు. కానీ పిల్లలు అందరూ ఒకేలా చదవరు, ఒక్కొక్కరు  ఒకోవిధంగా చదువుతుంటారు. చదువుతున్నప్పుడు పిల్లలు తరచూ ఒక అంశాన్ని పునరావృతం చేస్తూ  నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, దీనిని రోట్ లెర్నింగ్ అని తెలుగులో బట్టీ పట్టడం అని అంటారు. ఒకరి జ్ఞాపకశక్తి ఎంత మెరుగ్గా ఉంటే పరీక్షలో సమాధానాలు అంత బాగా వ్రాస్తారని, దాని ద్వారా వచ్చే  ఫలితం ఆధారంగా అతన్ని తెలివైన పిల్లవాడు అని పిలుస్తారు. అయితే లోతుగా ఆలోచిస్తే అలాంటి పిల్లలు నిజంగా తెలివైన వారా?  నిజంగా భవిష్యత్తులో  గొప్పగా మారుతార? అంటే ఖచ్చితమైన సమాధానం లేదు! పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే  పిల్లలు  ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవడంలో చాలా మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు.  కానీ  జీవితానికి సంబంధించిన నిజమైన జ్ఞానాన్ని కోల్పోతారని పరిశోధకులు కూడా చెబుతున్నారు.   వారు  తమ చదువును కూడా సరిగా వినియోగించుకోలేరు.  విద్య అంటే నేర్చుకోవడం.  జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి  పాఠశాల విద్య ఆధారమవుతుంది. అందువల్ల జీవితంలో సక్సెస్ కావడానికి ఏ విషయాన్ని అయినా లోతుగా అర్థం చేసుకోవడం కావాలి తప్ప విషయాన్ని గుర్తుంచుకోవడం కాదు కావాల్సింది. అంటే పిల్లలు ఏదైనా విషయాలను గుర్తుంచుకోవడం కంటే ఆ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోవడం వల్ల పిల్లల  జీవితం  అటు విద్యాపరంగానూ, ఇటు జీవితపరంగానూ  ఎదుగుతుంది. గుర్తుంచుకోవడం కంటే విషయాలను అర్థం చేసుకోవడం ఎందుకు మంచిదంటే.. బట్టీ పట్టడం ద్వారా పిల్లలు  శబ్ద జ్ఞానాన్ని పొందుతారు అప్పుడు వారికి  పదాలు మాత్రమే మనస్సులో నిలిచిపోతాయి. పిల్లవాడు ఇలా చదివితే అతను  కంఠస్థం చేసిన పదాల సంఖ్యకు అతని అభివృద్ది  పరిమితమవుతుంది.  అదే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే విషయ పరిజ్ఞానం పెరుగుతూ పోతుంది. బట్టీ పట్టే ప్రక్రియ కారణంగా పిల్లల మానసిక ఎదుగుదల  సరిగా ఉండదు. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం అనేది ఒకరి మేధో సామర్థ్యాన్ని పెంచే విషయాలపై మంచి అవగాహనకు దారి తీస్తుంది. బట్టీ పట్టడం వల్ల పిల్లలు అలసిపోతారు. పిల్లలు కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోకుండా విషయాలను కంఠస్థం చేసినప్పుడు  నీరసం వస్తుంది. మెదడు అలసిపోతుంది. బట్టీ పట్టి చదివే పిల్లలు నిజ జీవితంలో ఏ విషయాన్ని ఒక పద్దతి ప్రకారం ఆచరించలేరు.  విషయాన్ని అర్థం చేసుకోవడం,  రాయడం ద్వారా పిల్లలు మరింత సమర్థవంతంగా ఉంటారు.  జీవితంలోని కష్ట సమయాల్లో కూడా  ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల వారి ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. జ్ఞాపకం అనేది స్వల్పకాలిక ప్రక్రియ. ఇది కొద్దికాలం మాత్రమే  ప్రభావవంతంగా ఉంటుంది. కొన్నిరోజుల తరువాత విషయాన్ని మరచిపోతారు. అందుకే పదే పదే రివిజన్ చేయాల్సి ఉంటుంది. అదే  విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత  దాన్ని రాయడం అలవాటు చేసుకుంటే అది చాలాకాలం పాటు గుర్తిండిపోతుంది. అందుకే పెద్దలు పిల్లలకు విషయాన్ని అర్థం చేసుకుని చదివే దిశగా మార్గనిర్దేశం చేయాలి.  అవసరమైతే చిన్న చిన్న ఉదాహరణలు చెబుతుండాలి. ఎంతసేపు మార్కుల కోణంలో పిల్లలను సతాయించకుండా పిల్లల ఆలోచనా పరిధి ఏంటి అనే విషయాన్ని గుర్తించాలి.                                                                  *నిశ్శబ్ద. 

పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పాలి.. ప్రయోజనాలు ఏంటి.. ప్రతిఒక్కరికీ  క్రమశిక్షణ అనేది చాలా అవసరం. పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యం. దీని ద్వారా పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారు. శ్రమ ఎప్పటికీ వృధా కాదు. మీరు మీ పిల్లలకు క్రమశిక్షణను చిన్నతనంలోనే నేర్పించాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించాలి. ఇలా పెంచిన పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం. మీరు పిల్లలకి ఎక్కువ పనిని అప్పగించాల్సిన అవసరం లేదు.  బదులుగా మీరు వారి మానసిక, ప్రవర్తనా అలవాట్లను గమనించి వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధికి ఎలా సహకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు క్రమశిక్షణ నేర్పండి: పిల్లల భవిష్యత్తు అనేది వారి క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి సలహాలు ఇస్తూ క్రమశిక్షణతోపాటు ప్రేమను కూడా వ్యక్తపరుస్తుండాలి. క్రమశిక్షణ అనేది పిల్లలకే కాదు పెద్దలకు కూడా వర్తిస్తుంది. పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని ప్రోత్సహించినప్పుడు, వారు పట్టుదల, సంకల్పం వంటి లక్షణాలను నేర్చుకుంటారు. ఈ విషయాలు పిల్లల పాత్రచ పరస్పర చర్యలు, ఇతరులతో సంబంధాలను ఏర్పరుస్తాయి. కష్టపడి పనిచేసే పిల్లలు భవిష్యత్తులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. ఇదంతా తల్లిదండ్రుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. పని విషయంలో కఠినమైన నియమాలను రూపొందించండి: పిల్లలు బలమైన పని-సంబంధిత నీతిని అభివృద్ధి చేయడం ముఖ్యం. చిన్న చిన్న విషయాలు చెప్పి వారిలో ఆత్మవిశ్వాసం నింపండి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని పనులు చేయగలరని విశ్వాసం కలిగించాలి.దీని ద్వారా, పిల్లలు తాము చేసిన పనికి బాధ్యత వహించడం నేర్చుకుంటారు. వారి పనిని పూర్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇదొక ప్రత్యేక నైపుణ్యం: క్రమశిక్షణ ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇది పిల్లలు పాఠశాలలో, వృత్తిలో, వారి వ్యక్తిగత జీవితంలో ఈ నైపుణ్యాల నుండి ప్రయోజనం పొందేందుకు అనుమతిస్తుంది. మీ పిల్లలలో ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి సమయం పట్టవచ్చు. అలాగే, దీనికి తల్లిదండ్రుల నుండి చాలా ఓపిక అవసరం. పిల్లలను అనవసరమైన ఒత్తిడికి గురిచేయకూడదు. ఒత్తిడికి గురిచేయవద్దు: క్రమశిక్షణ పేరుతో మీ పిల్లలను ఒత్తిడికి గురిచేయకూడదు. పిల్లల వయస్సుకు తగిన అంచనాలు ఉండాలి. పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెడితే చిన్న వయసులోనే డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. పిల్లలకు ముందుగా సులభమైన పనులు ఇచ్చి, క్రమంగా వారి స్థాయిని పెంచుతుండాలి.  దీంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే పిల్లవాడు చాలా నేర్చుకోవచ్చు. మంచి దినచర్యలో ఇంటి పని కూడా ఉంటుంది. అది అబ్బాయి అయినా సరే... అమ్మాయి అయినా సరే. పిల్లలు ప్రశంసిస్తుండాలి: పొగడ్తలను ప్రేమించే పిల్లలను ప్రశంసించడం ద్వారా వారికి క్రమశిక్షణ నేర్పించవచ్చు. కల్మషం లేని హృదయానికి ప్రేమ, శ్రద్ధ అవసరం. ఇది మీ బిడ్డకు తల్లిదండ్రులుగా ఇవ్వవచ్చు. పిల్లలు ఏదైనా మంచి చేసినప్పుడు వారిని మెచ్చుకోండి. వారి ప్రయత్నాలను గుర్తించడం ద్వారా వారి విజయానికి బాసటగా మారుతుంది.

పిల్లలలో ఐక్యూ ఎంతుందో ఎలా తెలుసుకోవాలి..వారి ఐక్యూ ఎలా పెంచాలంటే..  తల్లిదండ్రులు తమ బిడ్డ తెలివిగా, చురుగ్గా ఉండాలని కోరుకుంటారు.  దీని కారణంగా పిల్లలు  విజయం సాధిస్తారు. పిల్లలు చురుగ్గా తయారుకావడానికి తల్లిదండ్రులు వారికి మంచి వాతావరణాన్ని అందించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఆహారం నుండి పానీయాల వరకు, మంచి అలవాట్ల నుండి  మంచి పాఠశాలను కనుగొనడం వరకు తల్లిదండ్రులు కృషి చేస్తారు. కానీ పిల్లవాడు తెలివిగా ఉండటానికి,  అతని IQ స్థాయి బాగా ఉండటానికి చాలా తేడా ఉంది. IQ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. ఇది పిల్లలను సాధారణ పిల్లల నుండి భిన్నంగా చేస్తుంది. చిన్నతనం నుంచి కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే పిల్లల ఐక్యూ స్థాయిని పెంచవచ్చని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా పిల్లల ఐక్యూ స్థాయి 90 నుంచి 110 మధ్య ఉంటుంది. పిల్లల IQ స్థాయి 125 నుండి 130 వరకు ఉంటే అతనిని మేధావిగా పరిగణిస్తారు. అయితే దీనికి ముందు  పిల్లల ఐక్యూ ఎంతో  తెలుసుకోవడం ముఖ్యం.  దీన్ని తెలుసుకోవడం కష్టమేమీ కాదు, పిల్లవాడిని కొంచెం గమనించాలి,   అతని ప్రవర్తనను అర్థం చేసుకోవాలి.  పిల్లలలో గమనించాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే..  మాట్లాడటం.. అన్నింటిలో మొదటిది పిల్లవాడు ఏ వయస్సులో మాట్లాడటం ప్రారంభించాడో గమనించాలి. పదాలను పట్టుకోవడంలో అతని సామర్థ్యం ఏమిటి? అతను ఏ పదాలు తక్కువ తప్పులతో మాట్లాడుతున్నాడు లేదా అతనికి పదే పదే చెప్పాల్సివస్తోందా? అతను పూర్తి వాక్యాలు చేయడం ఎప్పుడు నేర్చుకున్నాడు? ఇవి చిన్న విషయాలు, కానీ అవి పిల్లల భవిష్యత్తు జీవితం గురించి మీకు చాలా చెప్పగలవు. త్వరగా మాట్లాడటం, పదాలను గ్రహించడం,  వాక్యాలుగా మాట్లాడటం అధిక IQకి సంకేతాలుగా చెబుతారు. నేర్చుకోవాలనే ఆత్రుత.. నేర్చుకోవాలనే బలమైన కోరిక పిల్లల్లో మంచి IQకి సంకేతం. వారి మనస్సులో చాలా  గందరగోళం ఉంటుంది, దానిని శాంతపరచడానికి వారు ప్రశ్నలు అడగవచ్చు. ఆ ప్రశ్నలకు వీలైనంత వరకు సమాధానమివ్వడానికి ప్రయత్నించండి, తద్వారా పిల్లవాడు సంతృప్తి చెందుతాడు. పిల్లవాడు ఆ  చర్యలను పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తుంటే, అది అతనిలో ఉన్నత మానసిక స్థాయికి సంకేతం  కావచ్చు. సంక్లిష్టమైన విషయాలపై ఆసక్తి..  పిల్లలు గణితం,  సైన్స్ వంటి విషయాలపై ఆసక్తిని కనబరుస్తున్నట్లయితే అది చాలా సంతోషకరమైన విషయం. ఒకరి వయస్సు కంటే క్లిష్టమైన విషయాలపై ఆసక్తి చూపడం కూడా అధిక IQకి సూచికగా పరిగణించబడుతుంది. పరిశోధనాత్మక స్వభావం.. జిజ్ఞాస కలిగిన పిల్లలు తమ తల్లిదండ్రులను వింత ప్రశ్నలు వేస్తూంటారు. ఉదాహరణకు, కుళాయి నుండి నీరు ఎందుకు వస్తుంది?  కాఫీ ఎందుకు రాదు? పాల రంగు ఎందుకు తెల్లగా ఉంటుంది? నది ఎందుకు ప్రవహిస్తుంది? చాలా సార్లు తల్లులు, తండ్రులు ఆందోళన చెందుతారు. అయితే  కాస్త ఓపికగా  వారి ప్రశ్నలకు వీలైనంత సరైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఏకాగ్రత.. పిల్లవాడు ఒక పనిపై ఏకాగ్రతతో ఉంటే, అతను తన పనిని ఆనందిస్తున్నాడని రుజువు చేస్తుంది. చదరంగం ఆడటం లేదా డ్రాయింగ్ ఇలాంటి అధిక ఏకాగ్రత కలిగిన విషయాలు పిల్లలలో  అధిక IQకి సూచిక. సెన్స్ ఆఫ్ హ్యూమర్.. ఎవరైనా తమాషా చేసినా, అవతలి వ్యక్తి చెప్పేదానికి సరైన,  ఆసక్తికరమైన సమాధానం ఇచ్చినా కూడా  పిల్లవాడు చిరాకు పడకుంటే, అది కూడా అధిక IQని కలిగి ఉండడానికి సంకేతం. మంచి హాస్యం అనేది సంతోషకరమైన వ్యక్తి యొక్క గుర్తింపు. మంచి జ్ఞాపకశక్తి..  పిల్లలకు ఏదైనా నేర్పిస్తే వారు మరుసటి రోజు దానిని మరచిపోతారు. కానీ ఆ  విషయాలు గుర్తుంచుకుంటే అది మంచి విషయమే. కష్టమైన పదాలు, రైమ్స్, పండ్లు,  కూరగాయల పేర్లు గుర్తుంచుకోవడం,  ఇంటి చిరునామా,  తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను గుర్తుంచుకోవడం అధిక మానసిక సామర్థ్యానికి సంకేతాలు. పిల్లలలో iq ని ఎలా పెంచాలంటే.. పిల్లల ముందు దుర్భాషలాడకూడదు, వారని కొట్టకూడదు. పిల్లలను వీలైనంత ఎక్కువ సమయం ప్రకృతి మధ్య గడపనివ్వాలి. పిల్లవాడు ప్రశ్నలు అడగడం ప్రారంభించినప్పుడు, అతని ప్రశ్నలకు సాధ్యమైనంతవరకు సరైన,  శాస్త్రీయ సమాధానాలు ఇవ్వాలి. దెయ్యాలు, దెయ్యాలు, జంతువులు, మర్మమైన వ్యక్తులు లేదా ఇతర విషయాలతో పిల్లలను ఎప్పుడూ భయపెట్టవద్దు. ఎల్లప్పుడూ పిల్లల కళ్ళలోకి చూస్తూ వారితో మాట్లాడాలి.  వారు మీతో మాట్లాడేటప్పుడు వారు కూడా మీ కళ్ళలోకి చూసేందుకు ప్రయత్నించండి. ఏదైనా వాయిద్యం నేర్పండి..  పిల్లలకు గిటార్, హార్మోనియం వంటి ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయించడం నేర్పించవచ్చు. ఇది అతని IQ స్థాయిని పెంచడమే కాకుండా  గణిత నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేస్తుంది. బ్రెయిన్ గేమ్స్ సహాయపడతాయి.. పిల్లల ఉత్సాహం  IQ స్థాయిని పెంచడానికి ఉపకరిస్తాయి.  పిల్లలతో బ్రెయిన్ గేమ్స్   ఆడాలి.   మెదడు వ్యాయామ ఆటలను ఆడనివ్వాలి.  అతని మానసిక,  శారీరక అభివృద్ధికి కూడా ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే పిల్లలు ఆడేటప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు.   చెస్, క్యారమ్ లేదా బిజినెస్  ఆటలు ఆడటం నేర్పించవచ్చు. గణిత ప్రశ్నలు.. పిల్లల మానసిక వికాసానికి, గణిత ప్రశ్నలను పరిష్కరించేలా చేయాలి. వాటిని సరదా మార్గంలో పట్టికలు లేదా కూడిక,  తీసివేత సమస్యలను పరిష్కరించేలా చేయండి. ఇలా రోజూ 10 నుంచి 15 నిమిషాల పాటు చేస్తే వారి ఐక్యూ స్థాయి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేయడానికి లోతైన శ్వాస.. లోతైన శ్వాస మనస్సుకు మంచి ఆలోచనలను తెస్తుంది. ఇది పిల్లలకి ప్రతిదానిపై దృష్టి పెట్టే సామర్థ్యాన్ని పెంచుతుంది,  ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కాకుండా, మీరు  పిల్లలకు తేలికపాటి యోగా ఆసనాలను కూడా నేర్పించవచ్చు.                                      *నిశ్శబ్ద. 

ముప్పై ఏళ్ళకే  ముఖం మీద ముడతలా.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు! వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావం మొదట  ముఖంపైనే కనిపిస్తుంది. వృద్ధాప్యం అనేది ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి, కానీ  దాని కారణంగా ముఖం ముసలిగా కనిపిస్తుంది.  ముఖ్యంగా  30 ఏళ్లు దాటిన తర్వాత ముఖంపై  గీతలు,  ముడతలు క్రమంగా చోటు చేసుకోవడం గమనించవచ్చు. వీటిని చూసి చాలామంది అమ్మాయిలు చాలా నీరసపడతారు, అందం గురించి భయపడతారు. ముడతలు పోగొట్టుకోవడం కోసం మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు,  లోషన్ల కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు.   కానీ ఇవి ధీర్ఘకాలిక  ఫలితాలను ఇవ్వవు. అయితే ఆయుర్వేదంలో యాంటీ ఏజింగ్  రెమిడీస్ ఉన్నాయి. ఇవి  పురాతన వైద్య శాస్త్రంలో ప్రస్తావించిన ఔషదాలు. ఇవి  చర్మ సంరక్షణకు, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో అధ్బుతంగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఎంత వయసయినా యవ్వనంగా కనిపిస్తారు. తులసి.. ఇది యాంటీ ఏజింగ్ గుణాలు కలిగిన ఔషదం. ఇది ముడుతలతో పోరాడటానికి చక్కగా  సహాయపడుతుంది. ముఖంపై తులసిని పూయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది, ఎందుకంటే ఇది తేమను లాక్ చేస్తుంది.  ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనితో చర్మం  మీద ఉండే కరుకుదనం పూర్తిగా తొలగిపోయి చర్మం నునుపుగా మారుతుంది. అశ్వగంధ.. అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  చర్మం  రూపాన్ని చాలా వరకు  మార్చవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల  చర్మం యవ్వనంగా,  మునుపటిలా చిన్న వయసు వారిలా మెరిసిపోతుంది . అంతే కాదు ఇది ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మార్చేందుకు  సహాయపడుతుంది. ఉసిరి.. యాంటీ-ఆక్సిడెంట్లు,  విటమిన్ సి ఆమ్లా లేదా అమలాకిలో లేదా ఉసిరిలో  సమృద్ధిగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా  మెరుగుపరుస్తుంది, జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. జిన్సెంగ్.. జిన్సెంగ్ ఒక యాంటీ ఏజింగ్ హెర్బ్ . జపనీస్,  కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ హెర్బ్‌లో ఉండే ఫైటోకెమికల్స్ వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతాయి. ఇది   చర్మం సూర్యరశ్మి వల్ల కలిగే నష్టంతో పోరాడటానికి సహాయపడుతుంది. సరస్వతి.. సరస్వతి మరొక అత్యంత ముఖ్యమైన,  ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్  ఔషదం. ఇందులో ఫ్లేవనాయిడ్లు,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిస్తాయి,  వృద్ధాప్య సంకేతాలతో పోరాడటానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ మూలిక శరీరం  మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. పసుపు.. పసుపు ఒక అద్భుత మూలిక. పసుపులో ఉండే కర్కుమిన్ వయసును  తగ్గించడంలో  అద్బుతంగా సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా పోరాడుతుంది.  సూర్య కిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. పసుపు ఆహారంలో తీసుకోవడం, ముఖానికి  పూయడం రెండూ ముఖంలో మెరుపును తెసుకొస్తాయి.                                         *నిశ్శబ్ద. 

ఏళ్లు గడిచినా అందం చెక్కుచెదరకూడదంటే వీటిని తినాల్సిందే..    అందం వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంచారు. ఇందులో మహిళలదే పైచేయి. అందంగా కనిపించడం కోసం మహిళలు ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ వాడుతుంటారు.  కెమికల్స్‌తో నిండిన బ్యూటీ ప్రొడక్ట్స్   తాత్కాలిక అందాన్ని ఇస్తాయే కానీ దీర్ఘకాల అందాన్ని,  యవ్వనాన్ని ఎప్పటికీ అందించవు. పైపెచ్చు ఎక్కువ కాలం వాటిని వాడటం వల్ల చర్మం దెబ్బ తింటుంది. నిజానికి, బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం అందంగా కనిపించేలా చేస్తాయి  కానీ  చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా,  అందంగా ఉంచవు. కొల్లాజెన్ ఈ పని చేస్తుంది. కొల్లాజెన్ ఒక ప్రొటీన్. శరీరం  30 శాతం ప్రోటీన్ కొల్లాజెన్‌తో రూపొందించబడింది, ఇది  చర్మం, కండరాలు, ఎముకలకు సపోర్ట్ ను, బలాన్ని అందిస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ  శరీరంలోని కొల్లాజెన్ విచ్ఛిన్నమవుతుంది.  కొత్త కొల్లాజెన్‌ను తయారు చేసే ప్రక్రియ కూడా క్రమంగా తగ్గుతుంది. అందువల్ల  తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి,  చర్మం వృద్ధాప్యాన్ని నిరోధించడానికి కొన్ని శక్తివంతమైన ఆహారాలు ఉన్నాయి. ఇవి ఔషదాలుగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..  అశ్వగంధ.. తీసుకునే  ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవాలి. ఇది ఆయుర్వేద మూలిక, దీన్ని  ఉపయోగించడం వల్ల  వృద్ధాప్య లక్షణాలను క్రమంగా తగ్గించవచ్చు. ఉసిరి.. ఉసిరిలో  విటమిన్ సి చాలా ఉంటుంది. ఉసిరి శరీరంలోని కొల్లాజెన్ స్థాయిని సహజంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య సంకేతాలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు దెబ్బతిన్న చర్మాన్ని కూడా రిపేర్ చేస్తుంది.   తులసి.. తులసి గొప్ప ఔషద మూలిక. ఇందులో ఉండే  ఉర్సోలిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్,  యూజినాల్  చాలా శక్తివంతమైనవి. ఇవి  గొప్ప యాంటీఆక్సిడెంట్లు.  ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి తులసిలో చాలా  ఉంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే   చర్మంలో కొల్లాజెన్ పెరుగుతుంది. నెయ్యి.. నెయ్యిలో విటమిన్ ఎ, డి,  ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతో అవసరం. విటమిన్ ఎ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా మార్చే  ప్రోటీన్. నెయ్యిలో విటమిన్లు కూజా చాలా  ఉంటాయి.  ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది,  అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. బ్రహ్మి.. బ్రాహ్మిని సరస్వతి అని కూడా అంటారు. ఇది  ఆయుర్వేద మూలిక. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్,  యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కణాలను మెరుగుపరుస్తుంది,  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఫార్మాస్యూటికల్,  ఆయుర్వేద సూత్రీకరణలలో ప్రెగ్నెన్సీ తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్,  స్ట్రెచ్ మార్కులను తేలికగా చేయడానికి ఉపయోగిస్తారు.                                            *నిశ్శబ్ద.

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!   వయసు పెరిగే కొద్దీ మన స్కాల్ప్, హెయిర్, స్కిన్ అన్నీ తమ మెరుపును కోల్పోతాయి. మన చర్మం మెరిసిపోవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. అంతే కాకుండా మనం తిన్న తర్వాత మన శరీరంలో జరిగే ప్రక్రియలు కూడా కారణం. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని లోపలి నుండి కాపాడుకోవచ్చు. వయస్సు పెరుగుతున్నా... యవ్వనంగా కనిపించాలంటే వీటిని తినడం అలవాటు చేసుకోండి. బొప్పాయి పండు: బొప్పాయి పండులో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు..యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా లైకోపీన్ బొప్పాయి పండు ఎరుపు రంగులో ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మెరుస్తుంటుంది. దానిమ్మ పండు: దానిమ్మలో చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తిలో పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకున్నట్లయితే  చర్మ ఆరోగ్యం క్షీణించదు. అంతేకాదు  చర్మ సమస్యలు కూడా ఉండవు. పెరుగు: పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మనం తినే ఏ ఆహారం మన శరీరంలో బాగా జీర్ణమైతే అది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు తినడం వల్ల మన చర్మానికి అవసరమైన విటమిన్ బి12 ఎలిమెంట్స్ కూడా అందుతాయి. ఇది మన చర్మం యొక్క గ్లోను పెంచుతుంది. అంతేకాదు కణాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. ఆకు కూరలు: ఆకుకూరల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.  క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. టమోటా: టొమాటోలో లైకోపీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి రంగును ఇస్తుంది. టమోటా పండు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన చర్మం  తాజాగా మెరుస్తూ ఉంటుంది. నిత్యం వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  

 పొడవాటి కనురెప్పల కోసం అల్టిమేట్ ట్రిక్స్ ..!! అందమైన కళ్ళు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. కళ్ల అందం కోసం, వెంట్రుకలు నల్లగా, మందంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది తమ వెంట్రుకలు నల్లగా,  మందంగా చేయడానికి ఆర్టిఫిషయల్ ఐస్లాష్ వాడుతుంటారు. అయితే సహజసిద్ధంగా కూడా కనురెప్పలను అందంగా మార్చుకోవచ్చు. వెంట్రుకలను మందంగా, నల్లగా మార్చే సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం.  ఈ హోం రెమెడీస్ తో మీరు వెంట్రుకలను ఆకర్షణీయంగా, అందంగా మార్చుకోవచ్చు. పెట్రోలియం జెల్లీ: కనురెప్పలు నల్లగా, మందంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కనురెప్పలపై రాయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పొడవుగా, మందంగా, ఆకర్షణీయంగా, అందంగా తయారవుతాయి. గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కనురెప్పల వెంట్రుకలను పొడవుగా చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం,  కనురెప్పల మీద అప్లై చేయడం వల్ల కూడా కనురెప్పలు అందంగా తయారవుతాయి. విటమిన్ ఇ: విటమిన్ ఇ కనురెప్పల జుట్టు పెరుగుదలకు చాలా మేలు చేస్తుంది. మీరు మార్కెట్లో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీనితో మీరు వెంట్రుకలపై జుట్టు రాలడం సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు కనురెప్పల పెరుగుదలకు సహాయపడతాయి. దీన్ని కనురెప్పలపై అప్లై చేయడం వల్ల వెంట్రుకలు త్వరగా మందంగా, పొడవుగా మారుతాయి. కొబ్బరి నూనె: కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. కొబ్బరి నూనె కనురెప్పలకు కూడా మేలు చేస్తుంది.  

 ప్రతి రోజూ ఉదయాన్నే చేసే ఈ ఆరు తప్పుల వల్ల అమ్మాయిలు  ఎంత నష్టపోతున్నారో తెలుసా..   ఉదయం లేచింది మొదలు మనిషి రోజు మొదలవుతుంది. ఈకాలంలో చాలామంది ఎక్కువగా ఆరోగ్యోం మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఆరోగ్యం అనుకుంటూ ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు. మరికొందరు సాధారణం అనుకునే అలవాట్లు ఎన్నెన్నో  నష్టాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు డైటింగ్ విషయంలోనూ, అందాన్ని కాపాడుకోవడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వీటిలో చాలావరకు లాభం చేకూర్చకపోగా నష్టం చేకూర్చుతాయి. వీటిని తెలుసుకోకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, పూర్తీగా అందం ఆరోగ్యం నష్టపోయాక భాధపడాలి. అందరూ కామన్ అనుకుంటూ చేస్తున్న ఆ ఆరు తప్పులు ఏంటో తెలుసుకుంటే.. ఓట్స్.. అమ్మాయిలు ఉదయాన్నే ఎక్కవగా తీసుకునే అల్పాహారం ఓట్స్. ఓట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరగరని తద్వారా అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ప్రతి రోజూ ఓట్స్ తీసుకుంటే ఉదయాన్నే శరీరానికి అందాల్సిన పోషకాలు చాలావరకు లాస్ అవుతారు. ఓట్స్ లో పైబర్, బరువు తగ్గింటే కారకాలు ఉంటాయి తప్ప శరీరానికి ప్రోటీన్ ఏమీ అందించదు. పైపెచ్చు ఓట్స్ ను ప్రతిరోజూ తింటే చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది. చర్మం మీద చారలు చారలుగా గీతలు ఏర్పడటం జరుగుతుంది. స్నానం.. ఉదయాన్నే వేడినీటితో స్నానం చేస్తే కలిగే రిఫ్రెష్మెంట్ యే వేరు. కానీ ప్రతిరోజూ వేడి నీటి స్నానం ఆరోగ్యానికి మంచి చేకూర్చకపోగా చెడు చేస్తుందంటున్నారు. వేడినీటి స్నానం శరీరంలో తేమశాతాన్ని చాలా తొందరగా లాగేస్తుందట. ఇక ముఖం కడగడానికి వేడి నీటిని ఉపయోగించడం వల్ల ముఖ చర్మం చాలా తొందరగా  ముడతలు వస్తాయి. ముఖం ముసలిగా మారిపోతుంది. కాఫీ.. చాలామందికి కాఫీ అనేది ఒక ఎమోషన్.  ఉదయాన్నే ఒక కప్పు కాఫీ పడితే కానీ పనులు ముందుకు సాగవు. ఆ తరువాత కాఫీ టిఫిన్  కు ముందు, ఇక చాలామందికి టిఫిన్ తరువాత  వేడిగా, స్ట్రాంగ్ గా కాపీ పడాల్సిందే. కానీ ఈ అలవాటు చాలా చెడ్డది. సహజంగానే కాఫీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. శరీరంలో ఉన్న టాక్సిన్ లు బయటకు వెళ్లడంలో ఇబ్బంది కలిగిస్తుంది. సన్ స్క్రీన్.. అమ్మాయిలు సన్ స్క్రీన్ అప్లై చేయడం లైఫ్ స్టైల్ లో భాగం చేసుకున్నారు. ఇది  సుర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కానీ కొందరు అలవాటులో పొరపాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్నానం తరువాత సన్ స్క్రీన్ అప్లై చేస్తుంటారు. దీని కారణంగా చర్మం దారుణంగా దెబ్బతింటుంది. అందుకే అవసరమైన సందర్బాలలో మాత్రమే సన్ స్క్రీన్ ఉపయోగించాలి. బ్యూటీ ప్రోడక్ట్స్.. చర్మం  ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి అమ్మాయిలు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ చర్మం బాగుండాలంటే ఈ బ్యూటీ ఉత్పత్తులేవీ అక్కర్లేదు. కేవలం సీజన్ కు తగ్గట్టుగా చర్మ సంరక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది. అవేమీ పట్టించుకోకుండా సీజన్ తో సంబంధం లేకుండా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే  ముఖచర్మం చాలా తొందరగా వృద్దాప్యంగా మారుతుంది. ఫేస్ వాష్.. ఉదయం లేవగానే చాలామందికి ముఖమంతా చాలా జిడ్డుగా ఉంటుంది.  దీన్ని వదిలించుకోవడానికి చాలా గాఢత కలిగిన కెమికల్స్ తో కూడిన ఫేస్ వాష్ లు ఉపయోగిస్తుంటారు. మరికొందరికి పేస్ వాష్ ఉపయోగించడం అంటే అదొక ఫ్యాషన్. కానీ  ఫేష్ వాష్ లు ముఖ చర్మాన్ని సున్నితంగా మార్చేస్తాయి. అందుకే  ముఖం జిడ్డుగా ఉంటే తేలికపాటి క్లెన్సర్ ని ఉపయోగించి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి.                                               నిశ్శబ్ద.