ఇంట్లోనే ఈ లిప్ బామ్ తయారు చేసి వాడండి.. పగిలిన పెదవులు ఎంత అందంగా మారతాయంటే..!
పెదవులు.. కవుల కలాలకు అదనపు పనులు చెబుతాయి. అమ్మాయిల పెదవుల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. పెదవులు అందంగా ఉంటే అవి ముఖానికి బోలెడు అదనపు ఆకర్షణ అవుతాయి. కానీ అదే పెదవులు పగిలిపోయి, ఎండిపోయి, నల్లగా ఉండి కళావిహీనంగా ఉంటే మాత్రం ముఖారవిందం మొత్తం పాడయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా తొందరగా ప్రభావానికి గురయ్యేది పెదవులే.. పగిలిన పెదాలు ఆరోగ్యంగా మారాలన్నా, అవి మరింత అందంగా కనిపించాలన్నా లిప్ బామ్ వాడుతుంటారు. అయితే ఆరోగ్యకరమైన పద్దతిలో ఇంట్లోనే లిప్ బామ్ ను ఇలా తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే..
కావలసిన పదార్థాలు..
కొబ్బరి నూనె - 1 టీస్పూన్
వాసెలిన్ - 1 టీస్పూన్
బీట్‌రూట్ రసం - 6 స్పూన్లు
విటమిన్ ఇ-2 క్యాప్సూల్స్
తయారీ విధానం..
లిప్ బామ్ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కొబ్బరినూనె, వాసెలిన్ వేసి కరిగించుకోవాలి.
రెండూ కరిగిపోయాక గిన్నెలో బీట్‌రూట్ రసం వేసి కలపాలి.
ప్రతిదీ బాగా కలిపిన తర్వాత గిన్నెను గ్యాస్ నుండి వేరు చేసి ఈ ద్రవాన్ని ఒక గిన్నె లో వేయాలి.
చివరగా విటమిన్ ఇ ఆయిల్ వేసి లిప్ బామ్ తో మిక్స్ చేయాలి. ఇప్పుడు పగిలిన పెదాలను మృదువుగా మార్చే లిప్ బామ్ రెఢీ అయినట్టే.
పెదాలను పింక్‌గా మార్చడంలో సహాయపడే బీట్‌రూట్ ఇందులో ఉపయోగించారు కాబట్టి పెదవులు పింక్ గా కూడా మారతాయి. దీన్ని వాడితే లిప్ స్టిక్ వినియోగం తగ్గించుకోవచ్చు.
విటమిన్-ఇ ఎలా పనిచేస్తుందంటే..
విటమిన్ ఇ నూనెలో స్కిన్ ట్రీట్మెంట్ గుణాలు ఉంటాయి. ఇవి పెదాలను హైడ్రేట్ గా ఉంచుతాయి. రక్త ప్రసరణను పెంచుతాయి. తరచుగా పగుళ్లు రాకుండా చేస్తుంది. విటమిన్ ఇ ఆయిల్ పెదవుల చుట్టూ టానింగ్‌ను తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్‌ని పెదవులపై రాసుకున్నా ఫలితం ఉంటుంది.
*రూపశ్రీ.
