ఎర్ర కందిపప్పు ఇలా వాడితే.. మచ్చలేని చర్మం మీ సొంతం..!
మచ్చలేని చర్మం కావాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. ఇందుకోసం చాలా రకాల టోనర్లు, సీరమ్ లు, ఫేస్ ప్యాక్ లు, క్రీమ్ లు వాడుతుంటారు. అయితే అవన్నీ కాదు.. వంటింట్లో ఉండే ఎర్ర కందిపప్పును వాడితే ముఖం మీద మచ్చలు మాయమవుతాయట. మచ్చలేని చర్మం సొంతమవుతుందని అంటున్నారు. చర్మాన్ని నేచురల్ గా మెరిపించే పేస్ ప్యాక్ లను ఎర్ర కందిపప్పుతో తయారు చేసుకుని వాడవచ్చు. అవెలా చేయాలో తెలుసుకుంటే..
కందిపప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కందిపప్పులో ప్రోటీన్, ఫైబర్ తో పాటు చాలా పోషకాలు ఉంటాయి. అయితే ఎర్ర కందిపప్పును పేస్ ఫ్యాక్ గా ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించాలో తెలుుకుంటే..
ఎర్రకందిపప్పు.. పాలు..
పొడి చర్మంతో ఇబ్బంది పడేవారు ఎర్రకందిపప్పు, పాలతో పేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడవచ్చు. ఇది ముఖానికి తేమను అందిస్తుంది. చాలా సేపు చర్మం తేమను నిలిపి ఉంచుకుంటుంది. చర్మం మృదువుగా ఉండటంలో సహాయపడుతుంది.
కావసిన పదార్థాలు.. తయారీ విధానం..
ఎర్ర కందిపప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు పప్పును గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత 2 చెంచాల పాలు వేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది మరీ జారుడుగా ఉండకూడదు. కాస్త పేస్ట్ లా ఉండాలి.
మొదట ముఖాన్ని శుభ్రం చేసుకుని ముఖం మీద దుమ్ము, ధూళి మలినాలు లేకుండా చేసుకోవాలి. తరువాత ముఖాన్ని తుడుచుకుని శుభ్రం గా ఉన్న ముఖానికి ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 15 నుండి 20 నిమిషాలు ఈ పేస్ట్ ను అలాగే ఉంచి తరువాత నీటితో ముఖం కడుక్కోవాలి. ఎర్ర కందిపప్పు నానబెట్టుకోలేని పక్షంలో దీన్ని మెత్తని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి 15 నుండి 30 నిమిషాల ముందు కొద్దీగా పొడిని పాలలో నానబెట్టి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. మెరిసే చర్మం సొంతమవుతుంది.
ఎర్రకందిపప్పు, ముల్తానీ మట్టి, తేనె..
ముల్తానీ మట్టి ముఖానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. ఎర్ర కందిపప్పు లో ముల్తానీ మట్టిని కలపాలి. అందులో ఒక స్పూన్ తేనెను కలపాలి. దీన్ని పేస్ ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీన్ని వారానికి రెండు సార్లు వేసుకుంటే చర్మం మెరుస్తూ ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ లు రెండూ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.
*రూపశ్రీ.
