జుట్టు పెరుగుదలను టార్గెట్ గా పెట్టుకున్నారా...అవిసె గింజలు ఇలా వాడండి!

 

అవిసె గింజలు.. ఆరోగ్యకరమైన విత్తనాలలో ఒకటి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్,  విటమిన్లు, ప్రోటీన్ అన్నీ ఉంటాయి.  ప్రతి రోజూ కొన్ని అవిసె గింజలను తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం ఎంతో బావుంటుందని అంటారు.  అయితే అవిసె గింజలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సంరక్షణలోనూ, కేశ సంరక్షణలోనూ చక్కగా సహాయపడుతుంది. ముఖ్యంగా అవిసె గింజలతో జెల్ తయారు చేసి దాన్ని జట్టుకు పట్టిస్తుంటే జుట్టుకు మ్యాజిక్ రిజల్ట్ పక్కాగా ఉంటాయట. ఇంతకీ అవిసె గింజల జెల్ ఎలా తయారు చేయాలి? ఈ జెల్ వాడటం వల్ల జుట్టుకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే..

అవిసె గింజల జెల్..

అవిసె గింజల జెల్ లో ప్రోటీన్లు,  విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు,  మెగ్నీషియం  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మానికి, జుట్టుకు అందాన్ని- ఆరోగ్యాన్ని ఇస్తుంది.  ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల అవిసె గింజలు వేసి స్టౌ పైన ఉంచి ఉడికించాలి. ఈ అవిసె గింజలు ఉడికి దానిమీద నురుగు వచ్చి అది కాస్త జిగటగా ఉడకడం గమనించినపుడు స్టౌ ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తరువాత దీన్ని వడగట్టి జెల్ ను సేకరించాలి.  ఈ అవిసెగింజల గింజల జెల్ ను జుట్టును పాయలుగా తీస్తూ కుదుళ్లకు పట్టేలా బాగా అప్లై చేయాలి.  తరువాత  జుట్టు పొడవు ఉన్నంత మేర పట్టించాలి. కనీసం అరగంట సేపు అయినా దీన్ని అలాగే ఉంచుకుని తరువాత సాధారణ నీటితో తల శుభ్రం చేసుకోవాలి.

ప్రయోజనాలు..

అవిసె గింజల జెల్ ను ఉపయోగించడం వల్ల  జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  ఈ జెల్ లో విటమిన్లు,  పోషకాలు,  ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి.

జుట్టు స్టైయిట్ అవుతుంది..

అవిసె గింజల జెల్ జుట్టును స్ట్రైయిట్ గా మారుస్తుంది.  చాలామంది రింగురింగుల జుట్టుతో ఇబ్బంది పడుతూ ఉంటారు.  జుట్టు ఎక్కువగా రింగులు ఉండటం వల్ల చిక్కులు పడుతుంది.  ఇలాంటి వారు అవిసె గింజల జెల్ ను జుట్టుకు రాసుకుంటే జుట్టు రింగులు తగ్గి స్ట్రైయిట్ గా మారుతుంది. జుట్టును తేమగా, మృదువుగా ఉంచుతుంది.  జుట్టుకు సహజంగా మెరుపును ఇస్తుంది.

జుట్టు రాలడం..

జుట్టు రాలే సమస్య ఉన్నవారు అవిసె గింజల జెల్ ను రాస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.  ఇది జుట్టుకు మాయిశ్చరైజ్ చేసుంది.  జుట్టు చిక్కులు పడకుండా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది.

డ్యామేజ్..

జుట్టు డ్యామేజ్ అయినప్పుడు  జుట్టును తిరిగి రిపేర్ చేయడంలో అవిసె గింజల జెల్ సహాయపడుతుంది.  అవిసె గింజలలో విటమిన్-ఇ సమృద్దిగా ఉంటుంది.  ఇది జుట్టు వ్యాల్యూమ్ పెంచడంలోనూ,  జుట్టును బలంగా మార్చడంలోనూ సహాయపడుతుంది. జుట్టుకు మెరుపు ఇస్తుంది.  జుట్టు కుదుళ్ల మంటలు తగ్గిస్తుంది.  


                                      *రూపశ్రీ.